[dropcap]స[/dropcap]గమే తెరిచిన కళ్ళతో చుట్టూ చూస్తారు.
మసక కబుర్లతో ప్రపంచకంటికి నలుసువేస్తారు.
నమ్మబలికామని అపోహపడతారు.
చుట్టూ దివిటీలు పెట్టుకుని
చీకటిని తరిమామని సంబరపడతారు.
వెలుగుని చూసి మరి ఎందుకు తప్పుకుంటున్నారో.
ఏమీ పట్టనట్లుంటూనే
ఆకాశానికి వలవిసురుతారు అనుకుంటా.
తమకపు గాలికి చూపు చెదరిపోతోందని
నింద మరి ఎందుకూ.
వెన్నెలకి ఊసుల్ని చల్లబెట్టుకుని
నక్షత్రాల మరకల్ని చూపులకి తప్పించి
ఆకాశాన్ని నిద్రనుండీ వెలివేసేస్తారా..
అవును అనీ కాదు అనీ
భూమికడ్డంగా తలని మాత్రం ఊపరు.
ఎంత విచిత్రమైనవారూ ఈ కళాప్రేమికులూ.
కళతప్పిన ముఖాలతో వీళ్ళకిక్కడ ఏంపనని
ఇప్పుడు ఎవరు నవ్వుతారూ.