కోకిల కంఠుడు : కుకూ

0
2

[box type=’note’ fontsize=’16’] “ముఖ్య పాత్రధారులు అంధులు అన్న కొత్త అంశాన్ని పక్కన పెడితే తక్కినదంతా రొటీన్ ప్రేమ కథే” అంటున్నారు పరేష్ ఎన్. దోషికుకూ‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజు 2014 లో వచ్చిన తమిళ సినెమా “కుకూ” చూశాను. కథ ఇద్దరు అంధుల మధ్య ప్రేమ మీద. మనం ఇదివరకు సింగీతం శ్రీనివాసరావు తీసిన “అమావాస్య చంద్రుడు”, ఎం వి రఘు తీసిన “కళ్ళు” చూశాము. ఆ రెండూ మంచి చిత్రాలే. ఇప్పుడు ఈ చిత్రం రాజు మురుగన్ ప్రథమ ప్రయత్నం. ప్రథమ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

క్లుప్తంగా కథ ఇది: పెళ్ళిళ్ళలో, ఇతర సంబరాలలో వినోదాన్ని పంచే వో సమూహం. తమిళ ప్రఖ్యాత నటుల డూపులు. వాళ్ళ లాగే ఆడి పాడి వినోదాన్ని పంచుతుంటారు. వాళ్ళ మధ్య తమిళ్(దినేశ్ రవి) వొక గాయకుడు. మంచి స్వరం, ఇళయరాజా పాటలు పాడుతుంటాడు. ఇతరుల మధ్య ప్రత్యేకంగా నిలుస్తాడు. అతని గాత్రానికి ముగ్ధుడై ఒకతను అతనితో స్నేహం కూడా చేస్తాడు, చివర్లో ఆర్థిక సాయం కూడా చేస్తాడు. అలా వొక నాడు తమిళ్ సుధిందరాకుడి క్లుప్తంగా కుడి (మాళవికా నాయర్) అనే వొక అమ్మాయిని కలవడం జరుగుతుంది, తన స్నేహితురాలి ద్వారా. ఆ అమ్మాయి కూడా అంధురాలే. (ఇక్కడ అంధులు అన్న మాట వాడాను కాని ఇంగ్లీషులో visually impaired లాంటి పదం దొరక్క, మరో మార్గం లేక). ఇద్దరూ ఒకరి పేరును మరొకరు వెక్కిరించుకుంటారు. కాని ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే ప్రథమ ప్రతిపాదన తమిళే చేస్తాడు వొక సీడీలో రికార్డ్ చేసి. అప్పటికి ఆమె ఆలోచనలు వేరుగా వుంటాయి. తను వొక కళ్ళున్న మనిషినే చేసుకోవాలనుకుంటుంది. పదేళ్ళనుంచీ పరిచయమున్న, తనకు చేదోడువాదోడుగా వున్న వొక స్నేహితుడితో పెళ్ళి వూహించుకుంటుంది. కాని అతను వేరే అమ్మాయిని చేసుకోవడం, ఆ అమ్మాయి కూడా తను కొన్నాళ్ళే వాడి వదిలేసిన దుస్తులు కుడికి ఇవ్వజూడడం ఆమె కలను చెరిపేస్తుంది. వాళ్ళకు తనపట్ల జాలి తప్ప మరొకటి లేదని తెలుస్తుంది. సరే, నెమ్మదిగా ఈ లోకంలో వచ్చి తమిళ్ ప్రేమను స్వీకరిస్తుంది. ప్రేమ కథకు ఆటంకాలు లేకపోతే అదేం సినెమా? అందుకే ఆమెకు వో స్వార్థపరుడైన అన్నా, వదిన వుంటారు. ఆటో డ్రైవర్ అయిన తన స్నేహితుడికిచ్చి చేస్తే బదులుగా తనకు మూడు లక్షలు ముడతాయి అని బలవంతపు పెళ్ళి జరిపించే పని మీద వుంటాడు. ఇక కథ సినేమేటిక్ మలుపులు తిరిగి చివరికి ఇద్దరినీ ఏకం చేస్తుంది.

ఈ చిత్రంలో నచ్చిన విషయం నాయికా నాయకుల స్నేహ బృందం, వాళ్ళలో యెక్కువగా వున్నది అంధులే, నటన. అందరూ చాలా సహజంగా నటించారు. మాళవికా నాయర్ చాలా బాగా చేసింది. దినేశ్ రవి నటన కూడా బాగుంది కాని కాస్త overplay లా అనిపిస్తుంది. చివరి సన్నివేశాలు కాస్త చిరాకు కలిగిస్తాయి, అంత నాటకీయత ఈ రోజుల్లో చూడలేము. సంతోష్ నారాయణన్ సంగీతం బాగుంది. పాటల లిరిక్స్ (నేను చదివిన సబ్ టైటిల్స్ ఆధారంగా చెబుతున్నా) కూడా బాగున్నాయి. సినెమా నిడివి రెండున్నర గంటలు. చాలా యెక్కువ. కనీసం అరగంట కుదించినా కథ టైట్‌గా వుండేది. ముఖ్య పాత్రధారులు అంధులు అన్న కొత్త అంశాన్ని పక్కన పెడితే తక్కినదంతా రొటీన్ ప్రేమ కథే. ఇలా వూహించడం తగదు కాని బాలచందర్ దీన్ని తీస్తే మరో చరిత్ర స్థాయిలో వుండేది (అతనిదే కోకిలమ్మ ను గుర్తు తెచ్చుకోండి). ఇకపోతే తమిళంలో ఈ మధ్య గొప్ప చిత్రాలు చూసి వున్నానేమో నేను కొంత నిరాశ చెందాను.

మాళవిక కోసం ఈ చిత్రం చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here