దాతా పీర్-13

0
1

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[వాతావరణంలో చలి తగ్గి, వేడి ఎక్కువవుతుంది. చెట్ల మీద ఠికానా వేసిన ప్రవాస పక్షులన్నీ వెళ్ళిపోతాయి. రసీదన్ తన గదిలో పడుకుని ఆలోచిస్తూంటుంది. తాను చేసిన ఓ తప్పుకు సత్తార్ మియ్యా నీడ జీవితాంతం వెంటాడుతోందని అనుకుంటుంది. షాహ్ అర్జా దర్గా వెళ్ళి వచ్చాకా రసీదన్‌ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల గురించిన ఆందోళను బాగా తగ్గాయి. తాతయ్య దాతా పీర్‍ను తలచుకుంటుంది. ఆయన అభయమిస్తాడు, సత్తార్ నుంచి ఏ ప్రమాదమూ ఉండదని చెప్తాడు. ఉదయం రాధే కొట్టుకు వెళ్ళి టీ తాగుతుంది. గతంలోని గొడవని మర్చిపోయి, రాధేతో అభిమానంగా మాట్లాడుతుంది. సత్తార్ బెదిరింపుల గురించి, చెబితే అసలు పట్టించుకోవద్దంటాడు రాధే. కల్లూమియ్యా ఇంట్లో గొడవ గొడవగా ఉంటుంది. బబ్లూ ప్రవర్తనకి తండ్రి కల్లూమియ్యా ఆందోళన చెందుతుంటాడు. తండ్రి లేని సమయంలో, తమ్ముడి కళ్ళు కప్పి గల్లాపెట్టె నుంచి డబ్బు చేజిక్కించుకుని పారిపోతుంటాడు బబ్లూ. చున్నీ, బబ్లూ కలిసి తిరుగుతూ ఒకరి ఇంటి పరిస్థితులొకరు తెలుసుకుంటూ ఉంటారు. చున్నీ సత్తార్ మియ్యా బెదిరింపుల గురించి చెప్తే, చంపేద్దాం పీడా విరగడైపోతుంది అంటాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన నేరాలు చాలు, ఇంక మర్డర్ ఒకటే తక్కువైంది అని అంటుంది చున్నీ. కాసేపు మాట్లాడుకుని ఎవరిళ్ళకు వారు చేరుతారు. ఎవరిదో శవం వస్తున్న కారణంగా కబ్రిస్తాన్‍లో రసీదన్, ఫజ్లూ హడావిడిగా ఉంటారు. ఈమధ్య ఇలాంటి పనులలో సాయం చేసేందుకు ఓ కుర్రాడిని పెట్టుకుంటారు. వాళ్ళు ఆ పనుల్లో ఉంటే, సాబిర్, అమీనా మసీదు వెనుక కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సత్తార్ మియ్యాతో సంబంధం ముగిసినట్లే కదా అని అమీనా అంటే, అవును, ఇక నేను నా బిజినెస్ చేసుకుంటాను అంటాడు సాబిర్. ఈ లోపు సుల్తాన్ గంజ్‌లో తాతయ్య ఇంటికి వెళ్ళి మేనమామల్ని ఒకసారి చూసిరావాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. తప్పకుండా వెళ్ళు అంటుంది అమీనా. తాను చేయబోయే పళ్ళ వ్యాపారం గురించి చెప్తాడు సాబిర్. ఇంతలో శవం రావడంలో కబ్రిస్తాన్‍లో రద్దీ పెరుగుతుంది. సాబిర్ తన గదికి వచ్చేస్తాడు. పెట్టె లోంచి తండ్రి షెహనాయిని బయటకు తీసి, దాని ముద్దు పెట్టుకుని ఏడూస్తూ, నేల మీద వాలిపోతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-10 – మొదటి భాగం

[dropcap]సా[/dropcap]బిర్, సుల్తాన్ గంజ్ చేరుకున్నాడు. కొన్ని వందల సార్లు యీ వీధిలోకి వచ్చి ఉంటాడు. మేక చర్మాలు కొనటం కోసం పాట్నా వీధుల్లో చాలా సంవత్సరాల నుంచీ తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఒక్కసారన్నా అమ్మ వాళ్ళ పుట్టింటికో, తన స్నేహితులను కలుసుకోవటానికో వెళ్ళాలనిపించనేలేదు. వీటినన్నిటినీ వదిలేసి బతికాడు ఇన్ని రోజులూ! సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డాడు. దీనికి దగ్గరే ఉంది నోమాన్ వాళ్ళిల్లు. సాబిర్ పక్కనే ఒక సందుంది. లోపలెక్కడో ఉంది వాళ్ళిల్లు. అంతా మారిపోయింది. నోమాన్ వాళ్ళిల్లు గుర్తుపట్టటమెలా? కానీ సాబిర్ మనసులో కొన్ని జ్ఞాపకాలింకా ఉన్నాయి. వీధిలో ఒక్క పెంకుటిల్లైనా లేదసలు. సాబిర్ అనుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటిని వెదికీ లాభమేంటి? అద్దె ఇల్లు. అదే తనదైతే..! తనది కేవలం కల.

సాబిర్, నోమాన్ వాళ్ళ గురించి వాకబు చేస్తే, వాళ్ళు, ఇల్లమ్మి, అర్జానీ కాలనీలోకి మారిపోయారని తెలిసింది. వాళ్ళమ్మా నాన్నా ఇక్కడున్నప్పుడే చనిపోయారట! తరువాత, అన్నదమ్ములిద్దరూ ఇల్లమ్మి ఇక్కడినుంచీ వెళ్ళిపోయారు. పక్కింట్లో ఉన్న శర్మగారే వీళ్ళ ఇల్లు కొనేశారట! పెద్ద పెద్ద మీసాల శర్మ గారి విగ్రహం, లీలగా గుర్తుంది. ఆయన మీసాలు చూసి తాను చాలా భయపడేవాడు. అక్కడివాళ్ళన్నారు, నోమాన్ ఇప్పుడు చాలా ధనవంతుడై పోయాడట, అమెరికాలో ఉంటున్నాడట! చిన్ననాటి స్నేహితుడు చాలా పెద్దవాడైపోయాడని, ముందైతే సంతోషం వేసింది. కానీ వెంటనే అనుకున్నాడు,’ఇప్పుడు నోమాన్‌ను కలవలేడు తాను! ఎక్కడి అమెరికా, ఎక్కడి పీర్ ముహానీ లోని నాలుగో వీధి?’

నూర్ మంజిల్ ఎక్కడుందని విచారించాడు సాబిర్. దాని జ్ఞాపకాలేవీ గుర్తు లేవిప్పుడు. ఒకే ప్రాంతంలో ఉంటున్నా నూర్ మంజిల్ గురించి ఏమీ తెలీదతనికి! సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ దాటి కాస్త దూరం వెళ్ళిన తరువాత, కుడి వైపు ఒక వీధుంది. ఈ వీధి మొదల్లో, రెండు వైపులా, ముందూ కూడా అన్నీ హోటళ్ళే! రంజాన్ రోజుల్లో యిటువైపూనుంచీ వెళ్తూ చాలా సార్లు కీమా పరాఠాలు, కబాబ్ ప్యాక్ చేయించుకుని తీసుకెళ్ళేవాడు. ఈ వీధిలోనే నూర్ మంజిలుంది.

ఈ వీధి ముందుకెళ్ళి రెండు భాగాలౌతుంది. రెండు ఇరుకు సందులున్నాయి దీనిలోంచీ! ఒకటి కుడి వైపుకీ, రెండోది ఎడమ వైపుకీ! సరిగ్గా అదే చోట నూర్ మంజిల్ రెండస్తుల భవనం నిల్చుని ఉంది. పాత పద్ధతిలో ఉన్న భవనం. పెద్ద ప్రవేశ మార్గం. కింద పెద్ద వరండా. రెండు వైపులా గోళాకారంలో గదులు. పైన కూడా కప్పున్న బాల్కనీ.

గేట్ మూసి ఉంది. సాబిర్ అక్కడే నిలబడి ఎలా లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. ఎవరిని పిలవాలి? ఎవరినడగాలి? ఉన్నట్టుండి గేట్ పక్కన ఎలెక్ట్రిక్ స్విచ్ కనపడింది. హమ్మయ్య! పక్కనే అన్నీ ఉన్నా తనకు తట్టలేదెందుకని, ఎవరైనా బైటికొస్తారేమోనని ఎదురుచూస్తూ నిలుచుండిపోయానని తన్ను తాను మనసులో తిట్టుకున్నాడు సాబిర్. మొహమాటపడుతూ, స్విచ్ నొక్కాడు. లోపలేదో తెలియని భయం. కాళ్ళు వణుకుతున్నాయి. వెనక్కి వెళ్ళిపోదామనిపించింది. అలా అనుకుంటూ ఉండగానే గేట్ తెరుచుకుంది, ఒక మధ్య వయసావిడ తలుపు తెరిచింది. ఏంటి సంగతి? అనడిగింది.

‘షెహ్‌నాయీ వాయించే ఫహీం సాహబ్ ఇల్లిదేనా?’ సాబిర్ ప్రశ్న.

‘ఔను. కలవాలా?’

‘ఔను.’ సాబిర్ గొంతులో ఇంకా వణుకు.

‘పేరు?’

‘సాబిర్. పరిచయమైతే లేదు. పీర్ ముహానీ నుంచీ వచ్చా..’ గేట్ లోపలొకొచ్చాడు సాబిర్.

ఆవిడ కూర్చోమని సైగ చేసి లోపలికి వెళ్ళింది.

వరండాలో పాత వెదురు కుర్చీలున్నాయి. మధ్యలో గాజు పలక పరచి ఉన్న చిన్న వెదురు బల్ల. చాలా రోజుల వాడకం వల్ల దాన్నిండా గీతలు. రెండువైపుల గోళాకారంలో ఉన్న గదుల తలుపులన్నీ మూసున్నాయి. లోపలికి వెళ్ళటానికి వరండా లోనుంచీ పెద్ద తలుపుంది. తలుపుల మీద పైంటింగ్ కూడా బాగా వెలిసిపోయి ఉంది. గోడల రంగులు కూడా వెలిసి పోయి, అక్కడక్కడా పెచ్చులూడిపోయినట్టుంది. గేట్, ముంగిలి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో, ఏవేవో పిచ్చి మొక్కలు మొలిచున్నాయి. వరండా నుండీ ముఖ ద్వారం వైపుకు ఒక చిన్న కాలిబాటుంది. సాబిర్ తలెత్తి చెక్క దూలాలమీద నిలిచున్న పైకప్పుకేసి చూశాడు. అమ్మ మదీహా బానో యీ పరిసరాల్లోనే చిన్నప్పుడు ఆడుకుని ఉంటుందనుకున్నాడు మనసులో! ఈ వరండాలోనే ఆమె చేసిన బొమ్మల పెళ్ళి ఊరేగింపులవీ వచ్చేవేమో!

‘లోపలికి పిలుస్తున్నారు.’ వరండాలో వేలాడేసిన తెర తెరిచి ఇదివరకటి స్త్రీ, సాబిర్‌ను లోపలికి పిలుస్తూంది.

సాబిర్ లేచాడు. కాళ్ళిప్పటికీ తడబడుతూనే ఉన్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటూ వశం తప్పుతోంది. లోపలికి ప్రవేశించాడు సాబిర్. వరండా చాలా పెద్దది, చాలా మంది కూర్చునేందుకు వీలుగా! అతనిదివరకెప్పుడూ ఇలాంటి చోటికి రాలేదు. కూర్చుంటూ ఉంటే, వణుకు ఇప్పుడు కూడా! అక్కడ వెదురుతో చేసిన పెద్ద సోఫా ఉంది. ఇంకొన్ని కుర్చీలున్నాయి. సోఫా, కుర్చీల మీద రంగు రంగుల కుషన్ కవర్లున్నాయి. కింద పెద్ద తివాచీ. గదిలో నలువైపులా పాత పాత ఫోటోలున్నాయి.

వాటి దగ్గరికి వెళ్ళి చూడాలనీ, వాటిలో నాన్నను గుర్తు పట్టాలనీ అనుకున్నాడు సాబిర్. షెహ్‌నాయీ వాయించే వారిలో నాన్న తప్పకుండా ఉంటాడుగా మరి! సాబిర్ కలల్లోని చాలా అమూల్యమైన నిధి ఇది. వాటిలో తానూ ఉండాలన్న కోరిక మట్టిలో కలిసిపోయింది. ఒక ఫోటో మీద అతని చూపులాగిపోయాయి. దాన్ని గుర్తు పట్టే ప్రయత్నంలో ఉండగానే, లోపలినుంచీ ఎవరో వస్తున్న అలికిడైంది. తెల్ల కుర్తా, పైజామాలో భారీ కాయమున్న ఫహీం బఖ్ష్ గదిలోకొచ్చాడు. అతని ప్రవేశంతోనే అత్తరు పరిమళ పవనం గదంతా వ్యాపించింది. సాబిర్ వినయంగా నమస్కరించాడు. ఫహీం బక్ష్ ప్రతినమస్కారం చేసి, సోఫాలో కూర్చుంటూ, సాబిర్‌ను కూడా కూర్చోమని సైగ చేశాడు. ‘మీ పేరేంటి?’ అనడిగాడు.

‘సాబిర్, పీర్ ముహానీ నుంచీ వచ్చాను.’

‘కూర్చోండి. ఎలా వచ్చారు?’

‘మరి.. నేను మదీహా బానో కొడుకును.’ ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా సాబిర్ చెప్పేశాడు.

ఫహీం బక్ష్‌కు తన చెవులమీద తనకే నమ్మకం కలుగలేదు. చాలా సంవత్సరాల తరువాతీ పేరు వింటున్నా డతను! ఈ ఇల్లంతా పరిమళంలా మెత్తగా వ్యాపించి ఉండిన పేరు, చాలా సంవత్సరాల కిందే మాయమైపోయిన పేరు. హఠాత్తుగా యీ పేరు విని, ఆయన తన ఎదురుగా నిలుచుని ఉన్న యువకుణ్ణి చాలా సేపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో తెలియటం లేదాయనకు! ఆయన కళ్ళ ముందు, ఒకే రూపం, విధ విధాలుగా! చెవుల్లో, రకరకాల ధ్వనులు, ఈ గది గోడలను ఢీకొంటూ, వాటిలోకి ప్రవేశిస్తూ! రెప్పపాటులో ఆయన ఉనికినే కదిలించేశాయి. ఫహీం బఖ్ష్ చాలా చిన్నగా, దాదాపు వణికే గొంతుతో అన్నారు – ‘కూర్చో!’

అక్కడే కాస్త దూరానున్న కుర్చీలో కూర్చునేందుకు వెళ్తున్న సాబిర్ తో, ‘అక్కడ కాదు, ఇక్కడ.. నా దగ్గర కూర్చో!’ అన్నాడాయన.

ఆయన దగ్గరికెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సాబిర్.

‘ఎక్కడుంటున్నావ్?’

‘పీర్ ముహానీ లో.’

‘ఏమి చేస్తుంటావ్?’

‘పెద్ద పనేమీ కాదు. చర్మాలు..’ ఆగిపోయాడు సాబిర్.

‘ఏదో ఒకటి చేస్తూనే ఉంటావుగా?’

‘ఒకచోట పనిచేసేవాడిని. మేక చర్మాల వ్యాపారమది. కానీ, ఇప్పుడది వదిలేశాను. నేనే బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నాను. తొందరగానే మొదలుపెడతాను.’ మొహమాటం లేకుండా సూటిగా చెప్పేశాడు సాబిర్.

‘బిల్కీస్ ఎక్కడుంది?’

‘తెలీదు. కొన్ని సంవత్సరాల కిందట ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. మీకామె తెలుసా?’

‘ఈ ఇంట్లోనే పెరిగింది తను కూడా! మా మొహమ్మద్ జాన్ కూతురు.’

కాసేపు నిశ్శబ్దం. ఫహీం బఖ్ష్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆయన ముఖంలో ఏవేవో జ్ఞాపకాల రహస్యాలు! ఎన్నెన్నో భావాలు! సాబిర్ కేమీ అర్థం కావటం లేదు. అతనికిప్పుడు ఎలాంటి తత్తరపాటూ లేదు. తన గురించి అంతా చెప్పేశాడు కదా ! నమ్మకం కూడా హెచ్చింది. అమ్మ ఫోటో అడిగి తీసుకుని సెలవు తీసుకుందామనుకుంటూ ఉన్నాడు. అంతలోనే ఫహీం బఖ్ష్ గొంతెత్తి పిలిచాడు. ‘రుక్న్ బీ?’ అంటూ.

ఇదివరకు వచ్చిన స్త్రీ మళ్ళీ వచ్చి కళ్ళు చికిలిస్తూ ఇద్దరినీ చూసింది. ‘అయ్యా..’ అంది.

‘టిఫిన్, షర్బత్ తీసుకురా. ఇంతాలస్యమేంటి? ఇక్కడున్న అందరికీ!’ అలసిపోయినట్టుంది ఆయన గొంతు.

‘ఎవరెవరికి తేవాలి?’

‘చెప్పానుగా. అందరికీ అని! పాత బంధువొచ్చాడని చెప్పు.’

‘చిన్న తమ్ముడు కాదు కదా, ఆయనెక్కడికో వెళ్ళాడు.’

‘ఎవరున్నారో, వారికి తీసుకు రా.’ రుక్న్ బీ కి చెబుతూ ఆయన విసుక్కున్నారు.

ఆమె లోపలికెళ్ళింది. సాబిర్, ఫహీం బఖ్ష్ మౌనంగా కూర్చునున్నారు. టిఫిన్ వచ్చింది. సేవ్ దాల్ మోడ్, షాహీ ముక్కలతో షర్బత్ గ్లాసు. వెనకే ఫహీం బఖ్ష్ భార్య వచ్చి దగ్గర కూర్చుంది. ఆమె కూర్చోగానే మరో ఇద్దరు స్త్రీలు కూడా గదిలోకి వచ్చారు. వారిలో ఒకామె ఫహీం బఖ్ష్ తమ్ముడి భార్య. గది పరదా దగ్గర నుంచుని ఉందామె. రెండో స్త్రీ మదీహా బానో పెద్దక్కయ్య ఫర్హత్ బానో. పక్కనున్న సోఫాలో కూర్చుందామె. బాగా వృద్ధాప్యంలో ఉన్న ముఖమామెది. ఉదాసీనత, కలగలిసిన చాయలు. వాళ్ళు ముగ్గురికీ విడివిడిగా సలాములు చేశాడు సాబిర్. రుక్న్ బీ తో సహా, ఆ ముగ్గురు స్త్రీలూ, యీ అతిథి గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఫహీం బఖ్ష్ అన్నాడు, ‘ఇతను మదీహా బానో కొడుకు. నీ పేరేమన్నావ్ బాబూ?’

‘సాబిర్.’

ముగ్గురు ఆడవాళ్ళూ ఉలిక్కి పడ్డారు. మదీహా బానో వెళ్ళిపోయిన తరువాత రుక్న్ బీ ఇక్కడికొచ్చింది. కానీ ఆమెకు కూడా గడచిన కథంతా తెలుసు.

ఆమె ఇక్కడ పనిచేసే ఆవిడ కాబట్టి, ఇక్కడికెవరొచ్చినా, వెళ్ళిపోయినా తేడా ఏమీ ఉండదు. అసలైన గాభరా తక్కిన ముగ్గురికే! దాదాపు ఇంట్లో వాళ్ళందరూ మదీహా బానో ను మర్చిపోయారు. కానీ యీ సమయంలో సాబిర్ ఇలా ఉన్నట్టుండి ప్రత్యక్షమవటంతో ఆశ్చర్యం, ఆందోళనా రెండూ కలిగాయి వాళ్ళకు! ఫహీం బఖ్ష్ ఆ ముగ్గురినీ సాబిర్‌కు పరిచయం చేశాడు. తరువాత, తన భార్యనడిగాడు, ‘మున్నా ఎక్కడికెళ్ళాడు?’

వెనకున్న ఆయన తమ్ముడి భార్యన్నది, ‘ఇక్కడే ఎక్కడో ఉంటారు, పనేమీ లేదు కదా, ఏదో తిరిగేందుకు వెళ్ళుంటారు.’

ఆయన చిన్న తమ్ముడి పేరు గులాం బఖ్ష్, ఇంట్లో అందరూ మున్నా అనే పిలుస్తారు.

‘నువ్వేమీ తినలేదు. కాస్త తిను మరి.’ ఫహీం బఖ్ష్ అన్నాడు.

‘నేనింట్లోనే తినేసి వచ్చాను.’

‘ఐనా.. ఏదో కాస్తైనా..!’

మొహమాటంగా సాబిర్, ఘాఘ్నీ ఉన్న కటోరీ అందుకోబోబోతున్నాడు.

ఇంతలో పెద్దత్తయ్య అడిగింది, ‘ఉన్నట్టుండి.. ఇలా.. ఇన్ని సంవత్సరాల తరువాత, తాతయ్య ఇల్లెలా గుర్తుకు వచ్చింది నీకు? ఏదైనా ప్రత్యేకంగా..!’

‘ఏమీ లేదు. చాలా రోజులనుంచీ అనుకుంటూనే వున్నాను, ఒకసారి రావాలిక్కడికి, అందరినీ కలిసేందుకు అని! కానీ..’ సాబిర్ తడబడ్డాదు.

‘కానీ..?’ పెద్దత్తయ్య ప్రశ్న.

‘కానీ భయం వేసేది, ఎవరైనా గుర్తు పడతారో లేదో అని!’ మరో ఆలోచన లేకుండా సాబిర్ సమాధానాలిస్తూనే వున్నాడు కానీ ఆ ప్రశ్నల వెనక సవాలక్ష సందేహాలున్నాయని తెలీదతనికి! ఇప్పుడింక వెళ్ళిపోవాలనుకున్నాడు సాబిర్. అమ్మావాళ్ళింటిని చూశాడు. అత్తయ్యలనూ, మామయ్యనూ కలిశాడు. కానీ తనకు కావలసిన ఆ ఒక్క వస్తువూ అడగాలంటే సంకోచంగా ఉంది. కానీ ఆ వస్తువు కోసం మనసు ఒకటే ఆరాట పడుతోంది, ఉండబట్టలేక అడిగేశాడు, ‘ఒకటడగాలనొచ్చాను.’

మొహమాటంగా అడిగిన సాబిర్ ప్రశ్న, నూర్ మహల్ గోడలను ఢీకొని, ఏదో పెద్ద గంటలాగా మ్రోగింది. తేమ నిండిన గోడలు, హఠాత్తుగా కఠినంగా మారిపోయాయి. ఫహీం బఖ్ష్‌కు గట్టి దెబ్బ తగిలింది, కానీ ఆయన చలించలేదు. సాబిర్ ఇద్దరత్తలూ, పెద్దమ్మలను యీ గొంతు కదిలించివేసింది. వాళ్ళ మనసుల్లోని అనుమానపు పురుగు పడగెత్తి నిల్చుంది. పెద్దత్తయ్య అడిగింది. ‘ఏమడగాలని వచ్చావు?’

సాబిర్ సమాధానం చెప్పేలోగా అప్పటిదాకా మౌనంగా ఉన్న అతని పెద్దమ్మ అడిగేసింది, ‘ఆస్తిలో మీ అమ్మ భాగమా?’

‘కాదు.’ సాబిర్ ‘కాదూ’ లో గాయముంది.

‘మరేంకావాలి?’ ఈ సారి చిన్నత్త అడిగింది.

‘అమ్మ ఫోటో ఒకటి కావాలి. నేనామెను చూడనైనా లేదు.’ తన కోరిక చెప్పి, సాబిర్ నలువైపులా చూశాడు.

కాసేపటి కిందట ఆ గదిలో చెలరేగిన అగ్ని జ్వాల శిఖ వంగిపోయింది. సంశయాత్మల పదాలు తడబడ్డాయి. సాబిర్ పవిత్రమైన ఆకాంక్ష ప్రకాశం, మాజిక్ లాగా గదిలో ఆవరించింది. అతని నిర్భయమైన, నిస్సంకోచమైన స్వఛ్చమైన ఆత్మ తెల్లదనం తాలూకు రసాయనం, గదిలో ఉన్న అందరి ఆత్మలనూ తేజోమయం చేసింది. అందరి కంటే ముందు రుక్న్ బీ కళ్ళలో నీళ్ళు నిండాయి. వెక్కిళ్ళతో ఏడుపు కూడా! ముఖాన్ని కొంగుతో కప్పుకుని గదిలో నుంచీ బైటికి వెళ్ళిపోయిందామె. ఫరహత్ బానో మరింత కఠినంగా, వివర్ణంగా మారింది. ఆమె లేచి, ఏమీ మాట్లాడకుండా గదిలోనుంచీ వెళ్ళిపోయింది. తలుపు దగ్గర పరదానానుకుని నిల్చుని ఉన్న చిన్నత్త, దగ్గరికి వచ్చింది. మేజా పైనుంచిన టిఫిన్‌లో షాహీ ముక్కలున్న పాత్రను సాబిర్ వైపు జరుపుతూ అంది, ‘మొదటిసారి మామయ్యా వాళ్ళింటికొచ్చావ్. తీపి తినకుండా వెళ్ళకూడదు. ఇదిగో, తిను.’

సాబిర్ ఆ కప్పును తీసుకుని తినటం మొదలెట్టాడు. పెద్దత్త లేచి, చిన్నత్తను తనతో రమ్మని సైగ చేసింది. ఫహీం బఖ్ష్ ఊరికే కూర్చుని చూస్తున్నాడు. ఆయన కళ్ళ మందు మదీహా, అలీ బఖ్ష్ ముఖాల ఛాయలు వస్తున్నాయ్, మాయమైపోతున్నాయ్. సాబిర్ షాహీ ముక్క తినటం ముగించాడు. ఫతీం బఖ్ష్ లేచి అన్నాడు, ‘కూర్చో, ఫోటో తీసుకుని వస్తాను.’

గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్న సాబిర్, అక్కడున్న ఫోటోలను చూస్తున్నాడు. తానింటికి వెళ్ళి అమీనాకీ సంగతులన్నీ చెబితే, ఏమంటుందా అని ఆలోచిస్తున్నాడు. ఫజ్లూతో చెప్పీ లాభం లేదు. అతగాని జీవితమంతా శవాలను పాతిపెట్టటం, సమాధులూ, మందూ, చిలుమూ – వీటిలోనే చిక్కుకునుంది. రసీదన్ అత్తకైతే తానిక్కడికి వచ్చానని చెబితే సంతోషమే వేస్తుంది తప్పక! బిల్కీస్ పిన్నితో తరచూ అనేది, ‘సాబిర్ ను తీసుకుని అక్కడికి వెళ్ళిరా ఒకసారి!’ అని. కానీ ఆమెప్పుడూ తీసుకుని వెళ్ళనేలేదు. మామయ్యలూ, పెద్దమ్మలంటే ఆమెకు భయం.

ఫహీం బఖ్ష్ లోపలొకొచ్చాడు. అతని చేతిలో ఒక కవరుంది. ఆయన వెనక ఇద్దరు అత్తలున్నారు. సాబిర్‌కు కవరిస్తూ మామయ్యన్నాడు, ‘ఇందులో రెండు ఫోటోలున్నాయి. ఒకదానిలో మీ అమ్మా, రెండో దానిలో షెహ్నాయి వాయిస్తున్న మీ నాన్నా ఉన్నారు. కానీ ఫోటోలు ఇంటికి వెళ్ళిన తరువాతే చూడు.’

పెద్దత్త చేతిలో ఒక పాలిథీన్ బ్యాగుంది. సాబిర్కు దగ్గరగా వచ్చి అడిగిందామె, ‘నీకు పెళ్ళైందా?’ అని.

సాబిర్ యీ ప్రశ్నను ఊహించనేలేదసలు. తడబడిపోయి, చివరికన్నాడు, ‘ఇంకా లేదండీ!’

‘ఇది నీకో కానుక. నీకు పెళ్ళై ఉంటే ఆ అమ్మాయికీ ఇచ్చే వాళ్ళం. అందుకే అడిగాను.’ అత్త ముఖంలో ఒక చక్కని చిరునవ్వు. మొహమాటం వల్ల సాబిర్ చేతులు ముందుకు చాచలేదు దాన్ని తీసుకునేందుకు! అత్త మళ్ళీ అంది, ‘తీసుకో బాబూ, తాతయ్యా వాళ్ళింటినుండీ ఉత్తి చేతులతో వెళ్ళకూడదు.’

‘వస్తూ ఉండు.’ చిన్నత్తంది.

‘రావాలనిపించినప్పుడల్లా వచ్చెయ్. నీ మొబైల్ నంబరివ్వు.’ పెద్దత్త, చిన్నత్తకు సైగ చేసింది నంబర్ తీసుకొమ్మని.

నంబరిచ్చి, సాబిర్ అందరికీ వీడ్కోలు పలికి బైటికొచ్చాడు. పెదమామయ్య గేట్ దాకా వచ్చాడు, వీడ్కోలు చెప్పటానికి!

బైటికొచ్చి ఆటో ఎక్కాడు సాబిర్. అమ్మా నాన్నా ఫోటోలు గుండెకు హత్తుకుని కూర్చున్న తరువాత కూడా, తాను తాతయ్యా వాళ్ళింటికి వచ్చి వెళ్తున్నానంటే అతనికింకా నమ్మకం కలగటమే లేదు. తన దగ్గర అమ్మా నాన్నా ఫోటోలున్నాయంటే అదొక కలలా అనిపిస్తోంది. ఇప్పుడే ఆ ఫోటోలేమిటో చూడాలనిపించింది, కానీ మనసు చిక్కబట్టుకున్నాడు. మామయ్య ఎందుకొద్దన్నాడో తెలీదు కానీ, ఒంటరిగానే చూడాలనిపించింది ఫోటోలను! ఇంత హడావిడిగా చూస్తే ఆ సుఖం ఉండదేమో అని భయం అతనికి! ఇప్పటిదాకా ఐతే ఎటూ చూడలేదు. అమ్మా, నాన్నా, బిల్కీస్ పిన్నీ, షెహ్‌నాయ్ వాయించాలన్న కోరికా – అన్నీ పోయాయిప్పటికే! ఈ వయసులో యీ ఆనందం దొరికింది. ఒంటరిగా తనివితీరా చూసుకున్న తరువాత, అమీనాకు మాత్రమే చూపించాలనుకున్నాడు. తరువాతనుకున్నాడు, అమీనాతో కలిసి తానూ చూస్తే? అమీనా పరాయిది కాదుగా! ఆమె లేకుండా తనకు సుఖమేంటి?

***

సాబిర్ గాంధీ మైదాన్ ముందు ఆటో దిగాడు. దల్దలీ రోడ్డున పడ్డాడు. మసాలాల సువాసనను పట్టించుకోకుండా ఒక చేతిలో పాలిథీన్ బాగూ, రెండో చేతిలో ఫోటోల కవరూ గుండెలకు హత్తుకుని, కుందేలు లాగా ఉత్సాహంగా పరుగులు తీస్తున్నట్టే నడుస్తున్నాడు. వీధికటు వైపుకెళ్ళి, పీర్ ముహానీ సందులోకి ప్రవేశించాడు, భోజ్ సాహ్ మిఠాయీ వాలా దగ్గర చంద్రకళ స్వీట్ ప్యాక్ చేయించుకుని!

నేరుగా కబ్రిస్తాన్‌కే వెళ్ళాడు. అమీనాను పిలిచాడు. బైటికొచ్చిన అమీనాను తనతో రమ్మని సైగ చేశాడు. దాతా పీర్ మనిహారీ సమాధి దగ్గర మసీదు వెనక గోడకు వీపానించి కూర్చున్నాడు. అమీనా రాగానే కూర్చోమన్నాడు.

‘ఏంటి సంగతి? సుల్తాన్ గంజ్ వెళ్ళావా?’

‘నా దగ్గర కూర్చుంటే అన్నీ చెబుతాను.’ సాబిర్ ముఖంలో ఆనందం, ఒకేసారి అంతా చెప్పేయాలన్న ఉత్సాహం కనబడుతున్నాయి.

అమీనా దగ్గర కూర్చుంది.

సాబిర్ కవర్ విప్పాడు. రెండు ఫోటోలున్నాయి. ఒకటి వాళ్ళమ్మది, రెండోది నాన్నది. ఆయన టోపీ పెట్టుకుని షహనాయీ వాయిస్తున్నప్పటి ఫోటో అది. నాన్న లీలగా జ్ఞాపకం సాబిర్‌కు! జ్ఞాపకాలలో మసకబారుతున్న ముఖం, ఇప్పుడు ఎదురుగా!! అమ్మను మొట్టమొదటిసారి చూస్తున్నాడు. ఆ ఫోటో నుంచీ చూపులు తిప్పాలనిపించటం లేదు. తెలుపు, నలుపూ రంగుల్లోని ఆ ఫోటోలో తన చూపులతో రంగులు నింపుతున్నాడు సాబిర్. సల్వార్ సూట్‌లో ఉంది అమ్మ. రిబ్బన్‌తో కట్టిన రెండు జడలూ ముందుకు వేలాడుతున్నాయి. అమాయకమైన ముఖం. పెదవులమీద నవ్వు. కాటుక దిద్దుకున్న కళ్ళల్లో అంతులేని ప్రేమ. సాబిర్ గుండెలో ఒక తుఫాను చెలరేగింది. అది సుడిగాలిలా లోపల్లోపలే పొంగులు వారుతున్నది. కళ్ళలో నీళ్ళు నిండుకుని, వరదలా పొంగిపొర్లాయి. వెక్కిళ్ళు ఆగకుండా!! అతని భుజం వంగిపోయి అమీనా భుజాన్ని తాకింది. అమీనా మెల్లగా అతని భుజాన్ని కిందకు వంచి, తలను తన ఒడిలో పెట్టుకుంది. తన దుపట్టాతో అతని కళ్ళు తుడుస్తూ ఉండిపోయింది. అతని వెంట్రుకల్లో తన చేతి వేళ్ళు మెల్లగా తిప్పుతూ ఉంది. కాస్త వంగి, అమీనా తన పెదవులతో సాబిర్ నుదుటిమీద ముద్దు పెట్టింది. కబ్రిస్తాన్ నైఋతి మూలలో ఉన్న చెట్టుమీదనుంచీ కోయిలేదో పాడింది. ఈ సారి వసంత ఋతువులో మొట్టమొదటి కోయిల పాటది.

వసంతం ప్రవేశించి చాలా రోజులైంది.

వసంతం సాబిర్ గుమ్మంలో నుంచుని పిలుస్తోంది. అమీనా చిక్కని వెంట్రుకలు, వసంతాన్ని ఆహ్వానిస్తూ విప్పారి ఉన్నాయి. ఇద్దరి కళ్ళూ నిమీలితాలయ్యాయి. సాబిర్ వెక్కిళ్ళాగిపోయాయి. చూస్తూ చూస్తుండగానే కబ్రిస్తాన్ రూపం మారిపోయింది. అక్కడి సమాధులన్నీ పెద్ద పెద్ద వృక్షాలైపోయాయి. కబ్రిస్తాన్ ఒక పచ్చని అడవిగా మారిపోయింది. ఆ కోయిల ఆగకుండా కూస్తూనే ఉంది. దాని పాటలోనుంచీ పరాగం రాలుతోంది. కబ్రిస్తాన్‌లో అల్లుకున్న గడ్డి, ఇతర అడవి లతలమీద రంగురంగుల పూలు విచ్చుకుని ఉన్నాయి. ఆకాశం వైపు ముఖాలెత్తి ఊగుతున్నాయి.

సూర్యుడు నడినెత్తినున్నాడు. ఎండ విరగగాస్తూంది. దాతా పీర్ మనిహారీ దయ నీడలో, ఇప్పుడు నేల మీద గాలి, కాంతి, వసంతం, మేఘం, నీరు, అగ్ని, అన్నీ తమ యౌవన శిఖరాలమీదున్నాయి. అమీనా ఒడిలో చిన్న పిల్లాడిలా ముడుచుకుని పడుకుని ఉన్నాడు సాబిర్.

మసీదు మీనార్ మీదున్న లౌడ్ స్పీకర్ లోనుంచీ అజాన్ వినిపిస్తూంది, అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్, అశహదోల్లాహ్!’ మధ్యాహ్నపు నమాజ్ సమయం. అమీనా మెల్లిగా సాబిర్ ను తన ఒడిలోనుంచీ లేపింది. సాబిర్ అమీనాను చూస్తూ ఉండిపోయాడు. కాసేపలాగే చూస్తున్నాడు. ఇద్దరూ లేచారు. దాతాపీర్ మనిహారీ సమాధి వైపు చూసి ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుని అక్కణ్ణించీ బయలుదేరారు. అమీనా కళ్ళు పాలిథీన్ బ్యాగ్ మీద పడ్డాయి. ‘బ్యాగ్ లో ఏమి తెచ్చావ్? అడిగింది.

‘ఏమిటో తెలీదు అత్తయ్య ఇచ్చింది. చూడు, నీదగ్గరే ఉండనియ్యి.’

‘ఇందులో బట్టలున్నాయి, నీకోసం.’

‘చాలా మంచివాళ్ళు. జరిగినదంతా, మళ్ళీ ఒకసారెప్పుడైనా చెబుతాను. ఆ.. ఇది పట్టుకో, దీనిలో చంద్రకళుంది.’

‘హాయ్ అల్లా.. చాయ్ పెడదామని పొయ్యిమీద నీళ్ళు పెట్టాను..’ గబగబా ముంగిటివైపు పరుగులు పెట్టింది అమీనా.

ప్రవాస పక్షులు వెళ్ళిపోయిన తరువాత, స్థానిక పక్షులు తిరిగి రావటంతో, కబ్రిస్తాన్‌లో సందడి మళ్ళీ మొదలైంది. మధ్యాహ్నం నమాజ్ కోసం అందరూ రావటం మొదలెట్టారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here