దాతా పీర్-15

0
1

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[సాబిర్ వచ్చి వెళ్ళిన వార్త విన్న చిన్న మావయ్య గులాం బఖ్ష్ మొదట కంగారు పడతాడు. ఇన్నేళ్ళ తరువాత చెల్లెలి కొడుకు ఎందుకు వచ్చాడా, ఏదైనా మోసం చేయబోతున్నాడా అని అనుకుంటాడు. తమ చెల్లెలిని అన్నదమ్ములిద్దరం నిరాదరించి, ఆమె బీదరికంలో బ్రతకడానికి కారణమయ్యామని తలుస్తాడు. కుటుంబంలో ఉన్న సమస్యలను ఆ తప్పుకి శిక్షగా భావిస్తాడు. ఇప్పుడు అల్లా ఒక అవాకాశం ఇచ్చాడని అనుకుంటాడు. అన్నావదినలతో మాట్లాడుతాడు. ఇద్దరన్నదమ్ములకూ, వాళ్ళ భార్యలకూ కూడా జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సరైన సమయమిదేననిపిస్తుంది. అన్నగారి సలహా మేరకు గులాం బఖ్ష్ పీర్ ముహానీకి వెళ్ళి సాబిర్ గురించి ఆరా తీస్తాడు. సాబిర్‍ని కలవడానికి కబ్రిస్తాన్‌కి వెళ్తాడు. సాబిర్ రాధే చాయ్ దుకాణం దగ్గర కూర్చుని చాయ్ తాగుతుండగా రసీదన్ ఫోన్ చేసి నీ కోసం ఎవరో వచ్చారని చెప్తుంది. సాబిర్ వెంటనే అక్కడికి వచ్చి, గులాం బఖ్ష్‌ని చూసి చిన్న మావయ్యగా పోల్చుకుని ఆయన్ని తన గదికి తీసుకువెళ్తాడు. అమీనాతో ప్రేమ వ్యవహారం తప్ప, మిగిలిన అన్ని విషయాలు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాక జరిగినవన్నీ మామయ్యకి చెప్తాడు సాబిర్. అవన్నీ విన్న గులాం బఖ్ష్ చాలా బాధపడతాడు. సాబిర్ పెట్టెలో నుంచీ, నాన్న షెహ్‌నాయీని తీసి మామయ్యకిస్తాడు. దాంతో ఒక్కసారిగా తన స్నేహితుడు, బావ అయిన అలీ బఖ్ష్ జ్ఞాపకాలు ఆయన మనసులో మెదులుతాయి. ఆ షహనాయీని ఆప్యాయంగా ముద్దాడుతాడు. దానిలో రాగాన్ని పలికిస్తాడు. సాబిర్‍కి షహనాయీ నేర్పుతామని ప్రతిపాదిస్తాడు. మళ్ళీ శుక్రవారం నాడు మధ్యాహ్నం తమ ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు.  మామయ్య వెళ్ళిపోయాకా, సాబిర్ రాధే కొట్టు వద్దకు వస్తాడు. రసీదన్ అక్కడే ఉంటుంది. జరిగినదంతా చెప్తాడు. వెళ్ళమని రాధే అంటే, కొద్దిగా నిరుత్సాహపరిచేలా మాట్లాడుతుంది రసీదన్. సాబిర్‍ని ఇంటికి భోజనానికి రమ్మని పిలిచి వెళ్ళిపోతుంది రసీదన్. భోం చేస్తూ మావయ్య వచ్చిన సంగతీ, షహనాయీ శిక్షణ సంగతి అమీనాతో పాటు అక్కడున్న అందరికీ చెప్తాడు. వ్యాపారం సంగతి ఏమిటని అడుగుతుంది అమీనా. హడావిడి పడకుండా, వ్యాపారం చేయలని అంటాడు సాబిర్. భోజనం అయ్యాకా, ఫజ్లూ గదిలోకెళ్ళి నిద్రపోతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-10 – మూడవ భాగం

[dropcap]సా[/dropcap]బిర్ వచ్చిన తరువాత, నూర్ మంజిల్ నిర్లిప్త ఉదయ, సాయంత్రాల వర్ణం మారింది. గులాం బఖ్ష్, పీర్ ముహానీకి వచ్చి వెళ్ళిన తరువాత నమ్మకపు రంగులిందులో నిండుకుంటున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా, తిరుగాడుతుండిన పశ్చాత్తాపపు నీడ, క్షీణించటం మొదలైంది. గులాం బఖ్ష్ ఇంటికొచ్చి, సాబిర్ జీవితాన్ని గురించిన అన్ని విషయాలూ పూస గుచ్చినట్టు చెప్పేసరికి, అందరి కళ్ళూ చెమర్చాయి. అందరూ మాట్లాడుకున్న తరువాత, సాబిర్‌ను పీర్ ముహానీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉండిపొమ్మని చెప్పాలని నిర్ణయమైంది. రెండవ అంతస్తులోని గదులూ, బాత్రూములూ అన్నీ శుభ్రం చేసి, రంగులవీ వేయాలి. ఇక్కడే అతనికి షహనాయీ శిక్షణ కూడా ఇవ్వాలి. నూర్ బఖ్ష్ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచటమే కాదు, వృద్ధాప్యంలో తామిద్దరి బాగోగులు చూసుకోవటం కూడా జరుగుతుంది. తక్కిన సంగీత కళాకారుల్లాగా సాబిర్ కూడా తన షహనాయ్‌తో వెనుక కూర్చోవాలి. ఇంత త్వరగా రాగాలాపన చేయలేకున్నా, శ్రుతి పట్టటం వచ్చేస్తుంది కదా! సంపాదనలో ఇతరుల కిచ్చేటట్టే అతనికీ భాగమివ్వాలి. అందరితో కలిసి బైటికి వెళ్తుంటే, మెల్లిమెల్లిగా ప్రపంచపు తీరు తెన్నులు కూడా తెలుస్తాయి. చదువుకోలేదు కానీ, తెలివైనవాడిలాగే ఉన్నాడు, అందువల్ల త్వరగానే నిలదొక్కుకుంటాడని అందరికీ నమ్మకముంది.

‘మున్నా! మధ్యాహ్నం కాదు, రాత్రి రమ్మని చెప్పు సాబిర్‌ను! లేదూ అతనికిష్టముంటే మధ్యాహ్నం వరకే వచ్చేయమను. సాయంత్రం కచ్చేరీ పెట్టుకుందాం. చాలా రోజులైంది అందరమూ కలిసి కూర్చుని! సాధన కూడా ఔతుంది!! జీవితంలో ఎలాంటి విషయాల నుంచీ దూరంగా ఉన్నాడో కూడా తెలుస్తుందతనికి! సంగీతమంటే ప్రేమ పుడుతుంది. ఆ.. వాళ్ళ నాన్న షహనాయ్ కూడా తీసుకుని రమ్మని చెప్పు. షహనాయ్ సరిగ్గానే ఉందా?’

‘ఆ.. దానిలోని భాగాలన్నీ మార్చాలి. పైన కూడా వార్నిష్ వేయాలి. ఇవన్నీ చేయకుండానే ఒకసారి వాయించాను నేను.’ గులాం బఖ్ష్, అలీ బఖ్ష్ వాడిన షహనాయ్ కథంతా చెప్పి అన్నాడు, ‘నాన్న మనతోనే కలకత్తా బ్రెగైంజా కంపెనీ నుంచీ తెప్పించి అలీ బఖ్ష్‌కు ఇప్పించారు. మార్క్విజ్ వీధిలో కొన్నాం.’

‘మనం తొందర పడుతున్నామా?’ పెద్ద కోడలన్నది.

‘చూడండి వదినా! అల్లా తాలా దారి తెరిస్తే ఇంక నిదానంగా నడవడమేంటీ? తొందరపాటేంటి? ఒక దారి కనపడింది. నడిచి చూస్తే తప్పేంటి? మనమెవరికీ చెడు చేయబోవటం లేదు. పోనీ దయ చూపటమూ లేదు. అతని హక్కు, అతనికిస్తున్నాం. అంతే!’

‘బీదరికంలో పెరిగాడు కానీ, మన వంశం వాడే కదా! నాకైతే మెత్తని మనసువాడనిపించింది. కబ్రిస్తాన్ నుంచీ సంగీత ప్రపంచంలోకి వస్తున్నాడు. తెలివైనవాడైతే, జీవితం మరిపోతుంది.’

ఫర్హత్ బానో ఇప్పటిదాకా మౌనంగా ఉంది. కానీ అందరూ ఒకే మాటంటూ ఉంటే ఆమె సహనం అదుపు తప్పింది. ‘నాకో గౌరవమూ లేదు, ఒక హక్కూ లేదీ ఇంట్లో! కానీ అందరూ చెవులు తెరుచుకుని వినండి. మీ నిర్ణయంలో నేను లేను. ఏ అమ్మాయి వల్ల వంశం భ్రష్టు పట్టిందో, మన అమ్మ చనిపోయిందో, ఆ అమ్మాయి కొడుకును ఇక్కడ ఇరవై నాలుగ్గంటలూ చూడటం నా వల్ల కాదు. నాన్న సమాధిమీద గడ్డి కూడా మొలవక ముందే ఇల్లు వదిలి లేచిపోయింది. చేతికి మెహెందీ పెట్టుకోవాలని ఎంత తొందరో పాపం!’

కాళ్ళు నేలకేసి కొడుతూ, విరిగిన గ్లాస్ పాత్రలా బొంగురు గొంతుతో అరుస్తూ, ఫర్హత్ బానో వెళ్ళిపోయింది. చేతిలో చాయ్ కప్పులతో గదిలోకి వస్తున్న రుక్న్ బీ ఆమెను ఢీకొనబోయి కాస్తలో తప్పించుకుంది. ‘హాయ్ అల్లా! ఇప్పుడీమెకేమయింది? ఏదైనా కందిరీగ కుట్టిందా ఏంటి?’

అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని అందరూ అనుకుంటూనే ఉన్నారు. చాయ్ కప్పులక్కడ పెట్టి రుక్న్ బీ వెళ్ళిపోతుంటే ఫతీం బఖ్ష్ అన్నాడు,’అమె చాయ్ ఆమెకు గదిలోనే ఇచ్చెయ్!’

‘బతికుండగానే తినేస్తుందయ్యా! నేను లేకపోతే పొద్దున టిఫినెవరు చేస్తారు మరి?’

బడబడమంటూ రుక్న్ బీ చాయ్ కప్పు తీసుకోకుండానే గదినుండీ బైటికెళ్ళింది. నలుగురూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

‘మరి?’ గులాం బఖ్ష్ ప్రశ్నార్థకంగా చూశాడందరినీ!

‘మరేంటి? ఇప్పుడేమౌతుందో చూడాలంతే! ఈమె కేమి చేయాలనిపిస్తే అలా చేయనీ! జీవితమంతా యీమెను చూసుకోవడంలోనే గడిచిపోయింది. ఐనా యీమెకు తృప్తే లేదు. అలీ బఖ్ష్ షహనాయ్ తొందరగా రిపేర్ చేయించు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా! ముందైతే, మురాద్ పుర్ వెళ్ళి దాస్ కంపెనీ నుండీ కొత్త షహనాయ్ తీసుకు రా! సాబిర్‌కు మనం శుక్రవారమే అతని చేతికి గండా (గురువు శిష్యుణ్ణి చదువు చెప్పేందుకు అంగీకరించినట్టుగా కట్టే తాయెత్తు వంటిది) కడదాము.’ అంటూ ఫతీం బఖ్ష్ లేచి నిలుచున్నాడు.

నూర్ మంజిల్‌లో సాబిర్‌కు స్వాగతం పలికే వేడుకలు మొదలయ్యాయి.

***

శుక్రవారం రోజు సాబిర్, నూర్ మంజిల్ చేరేసరికి, అక్కడి వాతావరణం మారిపోతూంది. లోపలున్న హాల్‌ను శుభ్రం చేయిస్తున్నారు. మధ్యనున్న బల్లలు తీసేసి, కూర్చునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ్. ఈ పనులన్నీ చేయించేందుకు రుక్న్ బీ కొడుకును పిలిపించారు. బైట వరండాలో కూడా మార్పులు చేయించారు. మైన్ గేట్, వరండా మధ్యనున్న బాటలో ఉన్న పిచ్చి మొక్కలన్నీ తీసివేసి, చక్కగా చేశారు. లోపల తోటలో రుక్న్ బీ హడావిడెక్కువగా ఉంది. వంటిల్లు ఆమె అధీనం. మధ్యాహ్న భోజనం తయారు చేసి, మళ్ళీ రాత్రి భోజనం తయారు చేయాలి కూడా!! కబాబ్ వండాలి. ఎన్నో రకాల మసాలాలు దంచుకోవాలి. తీపి వంటకాల్లో ఫిర్నీ, జర్దా పులావ్ కావాలన్నారు. రాత్రి భోజనానికి ఇంటి వాళ్ళతో పాటూ, సహ వాయిద్యకారులకూ వంట వండాలి. వీళ్ళే కాకుండా ఇద్దరన్నదమ్ముల ముఖ్యమైన స్నేహితులను కూడా ఆహ్వానించారు. ప్రతిరోజూ జరిగే సంగీత సాధన కాదిది. ఈ రోజు ఉస్తాద్ నూర్ బఖ్ష్ మనుమడు (దౌహిత్రుడు) సాబిర్ అలీ బఖ్ష్‌కు సంగీత బంధం వేయబోతున్నారు. గురువుగారూ, శిష్యుడూ ఇద్దరికీ ఇది చాలా ముఖ్యమైన రోజు. గులాం బఖ్ష్ సాబిర్‌ను తనతో పాటూ నాజ్ స్టోర్‌కు తీసుకుని వెళ్ళి అక్కడ చికెన్ పని ఉన్న తెల్లని లఖ్నవూ కుర్తా, పైజామా తీసుకుని వచ్చారు. సాబిర్ వద్దు వద్దంటున్నా వినలేదు.

శుక్రవారం నమాజ్ తరువాత ఇద్దరన్నదమ్ములూ, సాబిర్ తో పాటూ, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సాబిర్‌కు గుండె దడగా ఉంది. జీవితంలో మొట్టమొదటిసారి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఇంతవరకు డైనింగ్ టేబుల్ పేరే వినలేదు. ఇదేమిటో తెలియదు కూడా!! బ్రహ్మాండమైన భోజనం, ఆకలిగా కూడా ఉంది, కానీ తినలేకుండా ఉన్నాడు. అన్నీ దగ్గరుండి కూడా కడుపునిండా తినలేక పోయాడు.

సాయంత్రమైంది.

అందరికంటే ముందు తబలా కళాకారుడు రాం సింగార్ మహరాజ్ వచ్చారు. తరువాత డుగ్గీ వాయించే పుత్తన్ లాల్, అతనితో పాటూ, షహనాయీ కచేరీలో శ్రుతి పట్టే మౌజూద్ హుస్సేన్, సఫీర్ ఖాన్ వచ్చారు. ఇద్దరన్నదమ్ముల స్నేహితులొచ్చారు. తెల్ల కుర్తా పైజామాలో ఉన్న సాబిర్‌ను మధ్యలో కూర్చోబెట్టారు. ఒక దుపలియా టోపీ కూడ సాబిర్ తలమీదుంచారు. పండిత్ రాం సింగార్ మహారాజ్, ఒక పళ్ళెం తెప్పించి, అందులో రక్షా సూత్రం, అక్షతలు పెట్టారు. ఉస్తాద్ ఫహీం బఖ్ష్ చెప్పిన ప్రకారం, తమ ఇంటి నుంచే తీసుకుని వచ్చారాయన! ఉస్తాద్ మధ్యలోకి వచ్చారు. సాబిర్ చేతికి రక్షా సూత్రం కట్టారు. టీకా తిలకం పెట్టారు. ప్రార్థన చేసి, అక్షతలు సాబిర్ తల మీద వేశారు. ముందుంచిన సాబిర్ నాన్న షహనాయ్. చిరునవ్వు నవ్వుతూంది. సాబిర్ చేతిలో కొత్త షహనాయ్ పెట్టి ఉస్తాద్ ఫహీం బఖ్ష్ కళ్ళు మూసుకుని, రెండు చేతులూ పైకెత్తి మళ్ళీ ప్రార్థన చేశారు. ఉస్తాద్ గారి నాన్న ఉస్తాద్ నూర్ బఖ్ష్ గారిలాగే ఆయనకూ, గులాం బఖ్ష్‌కూ రక్షా సూత్రం కట్టే పద్ధతి పాటించారు. ఆ సంప్రదాయం పూర్తి కాగానే, ఉస్తాద్ అన్నారు, ‘గురువు కీర్తి శిష్యుని చేతిలో ఉంటుంది. ఇప్పుడు మా కీర్తి, నీ చేతిలో ఉంది. ఉస్తాద్ మాటలు, శిష్యునికి ఆజ్ఞ లాంటివి. దీన్ని పాటించని వాళ్ళూ, లేదా ఖాతరు చేయని వాళ్ళ నైపుణ్యం లోపిస్తుంది. సంగీతం స్వర్గం లోని నది వంటిది. దీనికన్నా తీయనైనది ప్రపంచంలో లేదు.’

తరువాత కచ్చేరీ మొదలైంది. ఉస్తాద్ ఫహీం బఖ్ష్ రాగ్ పూరియా మొదలుపెట్టారు. గులాం బఖ్ష్ సహ వాయిద్యాన్నందిస్తున్నారు. మార్వా సంప్రదాయానికి చెందిన యీ రాగ స్వరాల అవరోహణ, సా ని ధ ప మ గ రే సా తో పాటు, నూర్ మంజిల్‌లో సాయంత్రం ప్రవేశించింది. పూరియా తరువాత, ఉస్తాద్ ఫహీం బఖ్ష్ పూరియా ధనాశ్రీ లో టుమ్రీ మొదలుపెట్టారు. షహనాయీ మీద ఠుమ్రీ లోని పదాల ఉచ్చారణ పై వారి పట్టు గట్టిది. తన షహనాయీ తీసుకుని, అందరికంటే వెనుక కూర్చుని ఉన్న సాబిర్ ఆశ్చర్య చకితుడై, కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఏ ప్రపంచం నుండీ తానిక్కడికి వచ్చాడో అది అతన్ని వెనక్కి లాగుతోంది. ఇదంతా తాను చేయగలడో లేడో అతనికి తెలియటం లేదు. అతని జీవితం, ఇప్పుడు చూస్తున్నదాన్నంతా ఎప్పుడో కబళించి వేసింది. అసలు ఇప్పుడు తాను చూస్తున్న ప్రపంచం లోకి ప్రవేశానికి తనకు యోగ్యత ఉందా? అని ఆలోచిస్తున్నాడు. నీరసపడిపోతున్నాడు. సంగీతపు మంత్రజాలం ముందుంది, కొత్త జీవిత మార్గం నుంచీ వచ్చే వెలుగుంది. కానీ వెనక, సత్తార్ మియ్యా గోదాము తాలూకు మాంసపు వాసన, గోరీల గడ్డలో వెనక ఫజ్లూ గదిలో వ్యాపించిన గంజాయి పొగ తాలూకు మత్తు గొలిపే వాసనా! సాబిర్ మనసును చిలుం రుచి రెచ్చగొట్టింది. తన ఊపిరి ఆగిపోతుందేమోననిపించిందతనికి! అన్నీ విసిరికొట్టి అక్కణ్ణించీ పారిపోవాలనిపించింది. ఎక్కణ్ణించైనా చిలుం దొరికి, ఒక్కసారి పీల్చితే బాగుండు ననిపించింది. వచ్చేసారి, భోజ్ సాహ్ కొడుకులాగా సిగరెట్‌లో నింపుకుని తెచ్చుకుని, ఎవరి కంటా పడకుండా తాగాలనుకున్నాడు.

సాబిర్ ఇలా చిలుం గురించి ఆలోచిస్తూ ఉంటే, నూర్ మంజిల్‌లో షహనాయీ ప్రతిధ్వనిస్తోంది.

***

సాబిర్ పీర్ ముహానీకి తిరిగి వచ్చాడు. సుల్తాన్ గంజ్ నుండీ వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. రాధే కొట్టు మూసేశాడు. ఫజ్లూ గది తలుపు గట్టిగా తోసి లోపలికి దూరాడు సాబిర్. గదినిండా గంజాయి వాసన నిండి ఉంది. ఫజ్లూ గాఢ నిద్రలో ఉన్నాడు. కబ్రిస్తాన్ లోనూ ఎలాంటి అలికిడీ లేదు. అందరూ నిద్రపోతున్నారు. సాబిర్, ఫజ్లూ తల దిండు కింద చెయ్యి పెట్టి, గంజాయి డబ్బా బైటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఫజ్లూ నిద్ర చెడింది. గాఢ నిద్రలో గావు కేక పెట్టి లేచాడు ఫజ్లూ. ‘ఎప్పుడొచ్చావ్ నువ్వు?’ గట్టిగా అరిచాడు.

‘ఇదుగో, ఇప్పుడే! కాస్త సరుకిస్తావా? ప్రాణం పోతోంది నాకు! రాత్రయింది, ఇంతదాకా ఒక్కసారైనా వాసన చూడలేదు.’ చిలం పీల్చేందుకు తెగ ఆత్ర పడిపోతున్నాడు సాబిర్.

ఫజ్లూ డబ్బీ చేతికిస్తూ సాబిర్ ను పరీక్షగా చూశాడు. కొత్త కుర్తా పైజమా చూసి, ‘ఈ రోజు మళ్ళీ కొత్త కుర్తా, పైజమా దొరికాయా తాతగారింటినుంచీ? నీ లక్కే లక్కు! ఆ దేవుడు చూడు, నాకొక్క మామయ్యనైనా ఇవ్వలేదు. బంధువులున్నా ఎవ్వరికీ మేము తెలీదు, ఇచ్చేవాళ్ళూ లేరు. అమ్మకొక మామయ్యుండేవాడు. తన చెల్లెల్నిక్కడే పాతిపెట్టి ఆయనేమో సబ్జీ బాగ్ కెళ్ళిపోయాడు, తిరిగి చూడకుండా!’

‘ఆయనా ఇక్కడికే వచ్చాడుగా సమాధిలో ఉండేందుకు!’ చిలుంలో నింపేందుకు గంజాయిని నలుపుతూ సాబిర్ అన్నాడు.

‘ఆ.. గోరీలోకి వచ్చాడు, ఎలా ఉన్నారని అడిగేందుకు కాదు. మా నాన్నే ఆయన శవాన్ని పాతిపెట్టేందుకు గొయ్యి తవ్వాడు.’ ఫజ్లూ, పురికోన సాబిర్ చేతికిస్తూ అన్నాదు.

చిలుం వెలిగించి ఇద్దరూ తాగుతున్నారు. సాబిర్ గట్టిగా దమ్ము బిగించి ఊదాడు, చిలుం ఒక్కసారికే భగ్గున వెలిగింది. ఫజ్లూ అన్నాడు, ‘వాహ్! ఈ రోజు భలే ఖుషీగా ఉన్నావ్ సాబిర్!’

‘వెళ్ళినప్పటినుంచీ, అల్లాడిపోయాను భయ్యా! అక్కడ మరే దారీ కనిపించనేలేదు. రేపు పూర్తి తయారీతో వెళ్ళాలి.’

‘రేపు మళ్ళీ వెళ్ళాలా?’

‘ఆ..’ ఒక చిన్న నిట్టుర్పుతో అన్నాడు సాబిర్. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత సుల్తాన్ గంజ్ కథంతా వినిపించాడు.

ఫజ్లూ అంతా విని అన్నాదు, ‘మంచిది దోస్త్! నీ జీవితమే మారిపోతుంది!’

‘కానీ లోపలినుండీ నాకొకటే భయం, నేనక్కడ నిలబడగలనా అని! అందరూ మంచివాళ్ళే! కానీ నాకర్థం కానిదేమిటంటే, ఇంత మంచివాళ్ళూ, మా అమ్మనెందుకలా చేశారు అని!’ సాబిర్ గొంతులో వేదన.

‘ఇదిగో సాబిర్! ఇప్పుడీ పిచ్చి మాటలు వదిలెయ్! పిచ్చి పిచ్చి ఆలోచనలూ మానుకో! ఏదవుతూ ఉందో, దాని మీద మనసు పెట్టు. అందులో పాల్గొను! లేకుంటే నీ పని రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది. అరె, సత్తార్ మియ్యా …… నాకే బదులు షహనాయీ ని ఊదడం మంచిది కదా!’

‘అది నిజం.’ సాబిరన్నాడు.

ఇద్దరూ పడకమీద ఒరిగిపోయారు. సాబిర్ మళ్ళీ పొద్దున సుల్తాన్ గంజ్ వెళ్ళాలి.

రాత్రంతా సాబిర్‌కు నిద్ర కరువైంది. కళ్ళు మూతలు పడతాయ్. తూగొస్తుంది. కాసేపటికే నిద్ర తేలిపోతుంది. తెల్లవారి పోయిందనే అనిపిస్తుంది. బాగా పొద్దు పోయేవరకూ నిద్రపోయే సాబిర్, ఇప్పుడు నిద్ర సుఖాన్ని పోగొట్టుకున్నాడు.

తెల్లారింది.

వసంత ఋతు మలయ పవనం, జలజలా ప్రవహిస్తూంది. సాబిర్ లేచి, తన గదికి పరిగెత్తాడు. ముసలావిడ లేచే ఉంది. ప్రతిసారి లాగే ఇప్పుడూ సాబిర్‌ను తిడుతూ, గేట్ తలుపు తీసిందామె.

పళ్ళూ గిళ్ళూ తోముకుని, స్నానం చేసి, తయారయ్యాడు సాబిర్. రాధే కొట్టు తీసి ఉంది. పీర్ ముహానీ నుంచీ బైలు దేరి దగ్గరి ఇళ్ళల్లో పనికి వెళ్ళే ఆడవాళ్ళ గుంపు ఎక్కువగా ఉందక్కడ! ఒక పొయ్యి మీద పాలూ, మరో పొయ్యి మీద చాయ్ తెర్లుతున్నాయ్. అతని దుకాణంలో ఎక్కువ రద్దీ ఉండే సమయమిది. అందరికీ త్వరగా వెళ్ళిపోవాలనే హడావిడి. సాబిర్ కూడా కళ్ళతోనే చెప్పాడు రాధేకు, తానూ వెళ్ళాలని. తొందర తొందరగా చాయ్ తాగి బైలుదేరాడు. కబ్రిస్తాన్ గేట్ దగ్గరే అమీనా ఉంది. అక్కడికెళ్ళి అడిగాడు, ‘చాయ్ తెచ్చి పెట్టనా?’

‘ఎవరికోసం?’

‘ఇంకెవరికి, నీకే!’

‘నీవు తెచ్చే చాయ్ నాకొద్దు.’

‘పొద్దున పొద్దున గొడవొద్దు. తొందరగా నేనొకచోటికెళ్ళాలి. తిరిగొచ్చాక అంతా చెబుతాను.’

‘గొడవ నీతో నాకెందుకు? ఇప్పుడెక్కడికి వెళ్తున్నావనీ, నిన్నంతా ఎక్కడున్నావనీ అడగటం లేదు.’

‘మామయ్య దగ్గరికెళ్ళాను. తిరిగొచ్చేసరికి చాలా పొద్దుపోయింది. అక్కడికే వెళ్తున్నాను. మళ్ళీ వస్తాగా..!’

‘వస్తే రా లేకుంటే అక్కడే ఉండిపో. నీ ఇష్టం. ఇప్పుడు మామయ్యా, అత్తయ్యా దొరికారు. వేరే వాళ్ళ అవసరమేంటి?’

‘అర్థం చేసుకో! పిచ్చిదానిలాగ మాట్లాడొద్దు. మళ్ళీ వస్తాగా, అన్నీ చెబుతాగా!’

‘వెళ్ళు.’

‘వెళ్ళనా?’ చిన్న పిల్లవాడిలా అడిగాడు సాబిర్.

విరిసీ విరియని మందహాసం అమీనా పెదాలమీద, మెల్లిగా వసంతమొచ్చి కూర్చున్నట్టు! ‘ఊ. వెళ్ళు!’ సంధించిన బాణంలా వెళ్ళిపోయాడు సాబిర్. ఈ రోజునుంచీ అతని శిక్షణ మొదలౌతుందని మామయ్య చెప్పాడు. సుల్తాన్ గంజ్ దగ్గర కాదు. వెళ్ళటానికి టైం పడుతుంది. దల్దలీ గల్లీ, గాంధీ మైదాన్ దాటి వెళ్ళాలి. మొట్టమొదటి రోజే ఆలస్యంగా వెళ్ళేవాడిలా మామయ్య దృష్టిలో పడటం ఇష్టం లేదు సాబిర్‌కు! తొందరలో ఫజ్లూ దగ్గర సరుకు తీసుకోవటం మర్చిపోయాడు తను! సిగరెట్టైతే దొరుకుతుంది, కానీ సుల్తాన్ గంజ్‌లో గంజాయి ఎక్కడ దొరుకుతుంది? అలోచించాడు, దొరుకుతుందేమో, ప్రయత్నిస్తే! ప్రతి రోజూ రావాలి కదా! కనుక్కోవాలంతే!

***

సాబిర్ సుల్తాన్ గంజ్ నుండీ వెనక్కి వస్తున్నాడు.

పొద్దున నూర్ గంజ్ చేరుకున్నప్పుడు, అతని గురువుగారు, పెద్ద మామయ్య ఫహీం బఖ్ష్ అతని కోసమే ఎదురుచూస్తున్నారు. ముందుగా షహనాయీ ప్రతి భాగం పేరూ, దాని పనీ వివరించారు. తరువాత, దాన్నెలా పట్టుకోవాలో, నోటి దగ్గర పెట్టుకుని ఊపిరి ఊదే పద్ధతీ చెప్పారు. ఊపిరి ఊదేటప్పుడు, చాలా సార్లు సాబిర్ గొంతు గరగరలాడింది. దగ్గు వచ్చింది. ‘సిగరెట్ తాగుతావా?’ అడిగారాయన.

ఎలాంటి సంకోచమూ లేకుండా అబద్ధం చెప్పేశాడు సాబిర్, ‘లేదూ’ అని. గంజాయి చిలుం పీల్చనిదే తనకి తెల్లవారదు, రాత్రీ కాదని ఎలా చెప్పగలడు?

‘పొగ మత్తు నుంచీ ఎంత దూరముంటే అంత పెద్దగా గాలి ఇందులో పోయగలవు. ఊపిరితిత్తులతో పని. గుర్తుంచుకో!’ ఉస్తాద్ ఫహీం బఖ్ష్ తియ్యగా మాట్లాడుతారు.

సాబిర్ గుండె వణికింది. మొట్టమొదటి రోజే గురువుగారికి తనమీద అనుమానమొచ్చింది. సాబిర్‌కు శ్రుతిని గుర్తు పట్టే పద్ధతి చెబుతూనే ఉన్నారాయన! తన షహనాయీ మీద శ్రుతి పలికిస్తూ దాన్ని గురించి చెప్పారు. మధ్య మధ్య సాబిర్ నాన్న అలీ బఖ్ష్ గురించి కూడా మాట్లాడారు. తమ గురువుగారూ, నాన్నకు సంబంధించిన ఏదో ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. ఈ లోగా చిన మామయ్యొచ్చాడు. అత్తయ్యలొచ్చారు. రుక్న్ బీ టిఫిన్ తెచ్చింది. మామయ్య తీయని గొంతుతో అన్నారు, ‘సాబిర్ మియ్యా! నువ్వు షహనాయీ కళాకారుడు ఉస్తాద్ నూర్ బఖ్ష్ కూతురు కొడుకువి. అంటే మనవడివి. ఇప్పుడు యీ వాయిద్యం చేతిలోకి తీసుకున్నావ్. ఇక మీదట నువ్వు కబ్రిస్తాన్‌లో ఉండటం బాగుండదు. నూర్ మంజిల్ గదులు ఖాళీగా పడున్నాయి. తలుపులన్నీ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంత దూరం నుంచీ నీ సంగీత సాధన కోసం రోజూ రావటం కష్టం కదా! ఆ కబ్రిస్తాన్ ఆ ఆవిడకూ, బిల్కీస్‌కూ, ఎంత గొప్ప సంబంధముండేదో, మాకు తెలీదు. వాళ్ళను వదిలిపెట్టి ఇక్కడ మా దగ్గరే ఉండమనీ కోరలేము. కానీ నీకు దూరమైపోయినది నీకు తిరిగి లభించాలని మా కోరిక. నువ్విక్కడికి రావాలనీ, మాతో పాటే ఉండాలనీ మాకుంది. ఇక్కడ నీకే లోటూ ఉండదు. ప్రేమకూ, భోజనానికీ కూడా! జీవితానికొక కొనసాగింపు దొరుకుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేర్చుకోవటానికి! అన్నీ మర్చిపోయి దీనికే ఎక్కువ సమయ మివ్వాల్సి ఉంటుంది. పది పన్నెండు గంటలు రోజుకు! సంగీత ప్రపంచం, అభిరుచున్న ప్రేమను అన్వేషిస్తుంది. పైనుండే గది చూడు. బాత్రూం కూడా విడిగా ఉంది. నీ ఇష్టం ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేసుకో! ఒక వారం లోపలే అన్ని పనులూ ఐపోతాయి. ఇక్కడున్నావనుకో, మమ్మల్ని చూసుకున్నట్టూ ఉంటుంది. నీ అభ్యాసమూ జరుగుతుంది. ఇంక నీ సంపాదన గురించి. మా దగ్గరి దగ్గరున్న సహ వాయిద్య సంగీత కళాకారులకోసం నెలకింత, అని నిర్ణయించటమైంది. ఇది కాకుండా ప్రతి ప్రోగ్రాం తరువాత కూడా ప్రతి ఒక్కరికీ కొంత డబ్బునూ ఇస్తాం. ఇదంతా నీకూ ముడుతుంది. ఇవి కాకుండా ఇంకా నీకేమైనా కావలసి వస్తే, నువ్వెవరిముందూ నోరు తెరిచి అడగాల్సినవసరం లేదు. మీ పెద్దత్తే చూసుకుంటుంది. నా జేబులోనూ ఆమే డబ్బు పెడుతుందెప్పుడూ! ఇప్పుడీ ఇల్లు నీది కూడా! మేము మా మాట చెప్పేశాం. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. దీన్ని గురించి ఒక నిర్ణయం తీసుకోవటం, ఇక నీ పనే!’

సాబిర్ వింటూ ఉన్నాడు. కానీ మౌనంగా ఉన్నాడు. వెంటనే సరే అనికానీ, కుదరదు అని కానీ చెప్పే స్థితిలో లేడు. తరువాత చిన్న మామయ్య ఇల్లంతా చూపించి, పైకి తీసుకెళ్ళి గది కూడా చూపించాడు. చిన్నత్త కూడా ఉంది. మొట్టమొదటి సారి, హాల్ దాటి లోపలికి వచ్చాడు. ఒక ముంగిలి, మూడు గదులూ, వరండా కూడా ఉన్నాయి. కుడి వైపు పెద మామయ్య గది. దానినానుకుని మరో గది. దానిలో ఎన్నో రకాల సంగీత పరికరాలున్నాయి. ఒక పెద్ద స్నానాల గది కూడా ఉంది. దాని తరువాత ఫర్హత్ బానో గది. ఎడమ వైపు పైకెళ్ళేందుకు మెట్లున్నాయి. దీనికానుకుని రుక్న్ బీ కోసం చిన్న గది. దీనికానుకుని, వంట గది. ఎదురుగా నాలుగో వైపు పెద్ద గోడుంది. దీనికానుకుని ఒక కుళాయి. చిన మామయ్యన్నారు, ఇంతకు ముందిక్కడొక బావి ఉండేదట! మదీహా బానో చిన్నప్పుడు ఒకసారి దానిలో ప్రమాదవశాత్తూ పడబోయి తప్పించుకుందట! అందుకని, దాన్ని మూయించేశారట! పైన మొదటి అంతస్తులో చిన మామయ్య గది, స్నానాల గది, రెండో అంతస్తుకు వెళ్ళే మెట్లూ, పెద్ద టెర్రేస్, దాని మీద పూల తొట్లు! రెండవ అంతస్తులో సాబిర్ కోసం చెప్పిన గదుంది. అతని ఇష్ట ప్రకారం, మార్పులు చేసుకోవాలిక!! చక్కటి గాలీ, వెలుతురూ గది నిండా! ఒక పడక, మేజా కూడా! దగ్గరే స్నానాల గది!

తన జీవితంలో మారుతున్న రంగులను చూస్తూ సాబిర్ నివ్వెరపోతున్నాడు. ఆటో రిక్షాలో కూర్చుని సుల్తాన్ గంజ్ నుండీ తిరిగి వచ్చేస్తుంటే, నూర్ మంజిల్ లోని ముంగిలీ, గదులూ, మెట్లూ, పైకప్పూ, రెండవ అంతస్తులో పెద్ద గదీ – అన్నీ గిర్రున కళ్ళముందు తిరుగుతున్నాయి. వాటితో పాటూ, ముసలావిడ ఇంట్లో తన గదీ, ఫజ్లూ గదీ, రసీదన్ ఇంటి ముంగిలీ, కబ్రిస్తాన్‌లో ఉన్న చిన్న చిన్న సమాధుల మట్టీ – అన్నీ కలగలిసిపోయినట్టే కనిపిస్తున్నాయి.

***

పీర్ ముహానీకి చేరుకున్న వెంటనే ముందు తన గదికి వెళ్ళాడు సాబిర్. తన గది గోడలు పరిశీలిస్తూ కూర్చున్నాడు. బిల్కీస్ పిన్ని పెట్టెను చూస్తూ కూచున్నాడు. ముందున్న గోడ దగ్గరున్న ర్యాక్ మీద పెట్టిన అమ్మా నాన్నా ఫోటోలను చూస్తూ కూర్చున్నాడు. కళ్ళు జలపాతాలయ్యాయి. అప్పుడు గదిలోనుండీ బైట పడ్డాడు.

సాబిర్ మదిలో ఒక చిత్రమైన అశాంతి. ఇది ఆనందించవలసిన సమయమా లేక బాధపడాల్సిన సమయమా అర్థం కావటం లేదతనికి! ఇప్పుడు తనకందబోతున్నది సంపదా లేక కోల్పోబోతున్నది సంపదా? ఛాతీ కింద ఏదో, ఒకటే గుచ్చుకుంటోంది. రాధే దుకాణానికొచ్చాడు సాబిర్. చాయ్ తాగి ఫజ్లూ గదికి వెళ్ళాడు. ఫజ్లూ లేడు. కబ్రిస్తాన్ లోపల రసీదన్ ఇంటి ముంగిటిలోకి వెళ్ళాడు. అక్కడ ఫజ్లూ కూర్చుని భోజనం చేస్తున్నాడు. రసీదన్ అన్నది, ‘కూర్చో నువ్వు కూడా! వేడివేడి అన్నముంది!’

‘కడుపు నిండా ఉంది. ఆకలి లేదు.’

‘పొట్టలో ఖాళీ లేనంతగా పెద్దత్త ఏమి తినిపించిందో అక్కడ? ‘ రసీదన్ ఆటపట్టిస్తూ అంది.

సమాధానమేమీ ఇవ్వలేదు సాబిర్. ముంగిట్లో వేసి ఉన్న మంచం మీద కూర్చున్నాడు. ఫజ్లూ భోజన మెప్పుడౌతుందా అని కాచుకుని కూర్చున్నాడు.

ఫజ్లూ భోజనం చేసి వెళ్తూంటే, తన దగ్గర కూర్చోమని సైగ చేశాడు సాబిర్. తరువాత రసీదన్, అమీనాను కూడా పిలిచాడు. ఇద్దరూ వచ్చారు. ‘అత్తా! నీకొకటి చెప్పాలి.’ అన్నాడు.

‘చెప్పు.’ రసీదన్ పీట జరుపుకుని కూర్చుంది.

అమీనా దగ్గర నిలుచుంది. చున్నీ ఇంట్లో లేదు. ఎక్కడికో వెళ్ళింది. సాబిర్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మాటలు మొదలు పెట్టేందుకు ధైర్యం కూడగట్టుకుని, మొదలు పెట్టాడు. మొత్తం అక్కడ జరిగినదంతా వివరించాడు.

సాబిర్ ను ఎవరూ అడ్డుకోలేదు. మౌనంగా విన్నారు.

అంతా చెప్పిన తరువాత ముందుగా అమీనా వైపు చూశాదు సాబిర్. ఆమె ముఖం మీద నీలి నీడలు. ఫజ్లూ ముఖాన ఏ భావమూ లేదు. ఇదేదో ఉలిక్కిపడేలాంటి వార్త కాదతనికి! సాబిర్ సుల్తాన్ గంజ్‌కు వెళ్ళటం మొదలైనప్పుడే ఇలాంటిదేదో అవుతుందని ఊహించాడు ఫజ్లూ. సాబిర్ యీ నరకం నుండి వెళ్ళిపోవటమే మంచిదని అనుకున్నాడు కూడా! రసీదన్ సాబిర్ ముఖాన్నే తదేకంగా చూస్తూంది. అతని ముఖాన్ని చదివి, మనసులో ఏముందో తెలుసుకోవాలని ఆమె ప్రయత్నం. అతని మనసులోని తుఫాన్‌ను ఆమె అంచనా వేసింది.

రసీదన్ అంది, ‘అందరి జీవితాల్లోనూ ఇటువంటి రోజు రాదు. నీకో మంచి అవకాశం వచ్చింది. దీన్ని పోగొట్టుకోకు. నీకు మంచి జరగాలని మేమనుకుంటాం. ఇక్కడేముంది? నాన్నా లేడు. ఆ ప్రేమా లేదు. ఇంక మా మాటంటవా? వస్తూ పోతూ ఉండు. బంధం కాపాడుకోవటం మన చేతుల్లో పని. చిన్నప్పటినుంచీ కలిసున్నావ్. ముందు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. తరువాత కాలమే దారి చూపిస్తుంది. మనసు పెట్టి నేర్చుకో! ఒకటి రెండు సంవత్సరాల్లోనే చక్కగా వాయించగలవు. నాలుగు రాళ్ళు సంపాదించేవాడివౌతావు. ఒక్క మాట! మొట్ట మొదటిసారి నోరు తెరిచి అడుగుతున్నా, అమీనా గురించి ఏమనుకుంటున్నావో చెప్పు.’

రసీదన్ చివరి మాట పూర్తి వాతావరణాన్నే మార్చి వేసింది. ఇప్పటిదాకా అక్కడే నిల్చుని మాటలు వింటున్నదల్లా, ఒక్క ఉదుటున వరండాలోకి వెళ్ళి వర్షానికి తడిసిన మట్టిగోడలా, ధబ్బున కూలబడింది అమీనా. చాలా కష్టమ్మీద కన్నీళ్ళనాపుకుంటూ ఉంది. ఫజ్లూ కూడా లేచి తన చేతి కర్ర సాయంతో యీడ్చుకుంటూ ముంగిట్లోనుంచీ బైటికి అడుగులు వేశాడు. రసీదన్ మాత్రమే కూర్చుని ఉంది. సాబిర్ ‘నేను వెళ్ళను.’ అనేశాడు.

‘నీ మనసును సంబాళించుకుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకో సాబిర్! మనిషి మనసు మంచిదైతే, తప్పేమీ జరగదు. అన్నీ అలాగే చక్కగా ఉంటాయి.’ ఈ మాటలంటూ రసీదన్ కూడా బైటికి నడిచింది. సాబిర్ అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంతలో చున్నీ వచ్చింది. వరండాలో మంచం మీద కూర్చుని ఉన్న సాబిర్‌నూ, కింద కూర్చుని ఉన్న అమీనాను తదేకంగా చూసి, గదిలోకి వెళ్ళిపోయింది.

సాబిర్ లేచాడు. తనతో రమ్మని సైగ చేశాడు. అమీనా అతని వెంట భారంగా ఏదో బరువు లాగుతున్నట్టే నడిచింది, నడుము నుండీ, పిక్కలవరకూ ఏదో చిత్రమైన నరం పట్టేసినట్టు భరించలేని నొప్పి!

ఇద్దరూ గోరీలగడ్డలో దాతా పీర్ మనిహారీ సమాధి దగ్గర నిల్చున్నారు. సాబిర్ ముందు నిల్చుంటే, అమీనా అతని వెనుక! వాళ్ళిద్దరి చుట్టూతా, కోరికల నగ్న ప్రేతాలు నృత్యమాడుతున్నాయి. ఫాల్గుణ మాసంలో గాలి ఎక్కడో తన మత్తు డబ్బాను మరచి వచ్చినట్టుంది. జ్యేష్ట, వైశాఖ మాసాల గాలి ఈడ్చి కొడుతోంది. గోరీల మీద మొలిచిన గడ్డి మొలకలు వేడిని కక్కుతున్నాయి. సాబిర్ వెనక్కు తిరిగి తన వెనుకనే నిల్చుని ఉన్న అమీనాను కుడి చేత్తో దగ్గరికి తీసుకున్నాడు. మసీదు వెనుక గోడ, సమాధి మధ్యనున్న చోటికలాగే నడిపించుకుని వెళ్ళాడు. ఇద్దరూ గోడకు వీపులానించి కూర్చున్నారు.

గోరీల గడ్డలో కొత్త సమాధుల మట్టిని గాలి పైకి లేపేస్తున్నది. ధూళి నాట్యమాడుతోంది. పడమటి గోడ దగ్గరి చెట్లు వాటిమీద ప్రేతాల సభ జరుగుతున్నట్టు అటూ ఇటూ కదులుతున్నాయి. ఏదో చెట్టు నుంచీ వచ్చే గాలి చెంపలను కాలుస్తోంది. అమీనాను తన ఒడిలో పొదువుకున్నాడు సాబిర్.

సాబిర్ ఒడిలో ముఖం దాచుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నది అమీనా. గాలిలోని వేడంతా మాయమై చల్లబడి పోయేటంత కన్నీళ్ళు! నీళ్ళలో కరిగి మట్టిలో కలిసిపోయింది, ఎటు చూసినా నీళ్ళు! దాతా పీర్ మనిహరీ సమాధి మాత్రమే నిలిచుంది. సాబిర్ తన కౌగిలి పట్టు సడలించాడు. అమీనాను చూశాడు. ముఖాన్ని ఆవరించి ఉన్న వెంట్రుకలను సరి చేశాడు. ఏడ్చి ఏడ్చి, అమీనా కళ్ళు దానిమ్మ పూలలా కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళలో అనుమానం లేదు. కానీ కలల ఉదాసీనమైన, ఖండించబడిన నీడలు తారట్లాడుతున్నాయి. కిందికి వంగాడు సాబిర్. కిందికి, ఇంకా కిందికి! అమీనా వెంట్రుకలు పాములా ఉవ్వెత్తున లేచాయి. ఆమె ముఖాన్ని తాకి మళ్ళీ పైకి లేచాయి. అమీనా ముఖాన్ని స్పృశించింది సాబిర్ ముఖం! ఉచ్చ్వాస నిశ్వాసాల జాలంలో ఇద్దరి ముఖాలూ! ఆకాశం నుండీ భూమికి అమృతం జారింది. సాబిర్ పెదవులు అమీనా పెదవులను చుంబించాయి.

అమీనా వెంటనే తన ముఖాన్ని సాబిర్ ఒడిలో దాచేసుకుంది. కాసేపటి వరకూ ఆమె వెంట్రుకలను మృదువుగా సవరిస్తూ ఉండిపోయాడు సాబిర్. అమీనా అలాగే పడుకుని గాఢంగా నిశ్వసిస్తూ, సాబిర్ గుండె చప్పుడు వింటూ ఉంది! సాబిర్ అన్నాడు, ‘నేనెక్కడికీ వెళ్ళను.’

‘కాదు. నువ్వు వెళ్తున్నావ్. నా తలమీద చేయి వేసి ఒట్టు పెట్టు, వెళ్తాననీ, మీ నాన్నలాగా షహనాయ్ నేర్చుకుని పెద్ద పేరు తెచ్చుకుంటాననీ! అల్లా మీదొట్టు, నాకు నీమీద నమ్మకముంది.’ మసీదు దగ్గర పెరిగిన జటామాసి మొక్కల మీద పిచుకల గుంపు అన్నం మెతుకులు తింటున్నది. ప్రతిరోజూ అమీనా పిడికెడు అన్నం మెతుకులు వేస్తుంటుందక్కడ! ఒక పిచుక అమీనా కాలి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టింది.

ఇద్దరూ లేచారు. దాతాపీర్ మనిహరీ సమాధి దగ్గర ప్రార్థన చేశారు. పిచుకల గుంపు లేచి అటూ ఇటూ ఎగిరిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here