[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]
[సాబిర్ విషయంలో నిజాలు నిర్ధారణ చేసుకునేందుకు చిన్న మావయ్య గులాం బఖ్ష్ వచ్చి వెళ్తాడు. ఆయన ఇంటికెళ్ళి సాబిర్ జీవితాన్ని గురించి అన్ని విషయాలు చెప్పగానే అందరి కళ్ళు చెమరుస్తాయి. సాబిర్‍ను పీర్ ముహాని నుంచి వచ్చేసి, తమ దగ్గరే నూర్ మంజిల్‍లో ఉండమని చెప్పాలనీ, షహనాయిలో శిక్షణ ఇప్పించాలనీ నిర్ణయిస్తారు సాబిర్ మావయ్యలిద్దరూ. అయితే సాబిర్ పెద్దమ్మ ఫర్హత్ బానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయినా ఆమె తమ్ముళ్ళిద్దరూ పట్టించుకోరు. సాబిర్‍ని పిలిపించాలనే నిశ్చయించుకుంటారు. ఇంటిని శుభ్రం చేయిస్తారు, సున్నాలేయిస్తారు. సాబిర్ గది సిద్ధం చేస్తారు. శుక్రవారం నాడు సాబిర్ అక్కడికి వెళ్ళేసరికి చాలా హడావిడిగా ఉంటుంది. ఆ రోజు ఉస్తాద్ నూర్ బఖ్ష్ దౌహిత్రుడు సాబిర్ అలీ బఖ్ష్‌కు సంగీత బంధం వేయబోతున్నారు. అందుకని చిన్న మావయ్య సాబిర్‍కు తెల్లని లఖ్నవూ కుర్తా పైజామా కొనిస్తాడు. ఇంట్లో ఏర్పాట్లు జరిగిపోతాయి. వాద్యకారులు, గురువు గారు, పండిత్ సింగార్ మహారాజ్ వస్తారు. పండిత్ ప్రార్థన చేసి అక్షతలు సాబిర్ మీద చల్లి ఆశీర్వదిస్తారు. గురువు గారు ప్రార్థన చేసి, సాబిర్‍కి రక్షా సూత్రం కట్టి, పాటించవలసిన నియమాలు చెప్తారు. తర్వాత శిక్షణ ప్రారంభమవుతుంది. సాబిర్ కంగారు పడతాడు. ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేందకు తనకు యోగ్యత ఉందా అని అనుకుంటాడు. ఫజ్లూ గదిలో గంజాయి పొగని గుర్తు చేసుకుంటాడు. బాగా పొద్దుపొయ్యాకా, సాబిర్ ఫజ్లూ గదికి వస్తాడు. అతని దగ్గర అడిగి తీసుకుని గంజాయి చిలుం పీలుస్తాడు. కొన్ని రోజుల పాటు రోజూ నూర్ మంజిల్‍కి వెళ్ళి సాధన చేసుకుని వస్తూంటాడు. అలా వద్దనీ, సాధనకి ఇబ్బంది అవుతుందనీ, ఇక ఇక్కడే ఉండిపొమ్మని ఒకరోజున చిన్న మావయ్య చెప్తాడు. మర్నాడు ఉదయం రసీదన్ ఇంటికి వెళ్ళి అందర్నీ కూర్చోబెట్టి జరిగినదంతా చెప్తాడు. అతనికి మేలు జరుగుతుందని నమ్మితే వెళ్ళమంటుంది రసీదన్. కానీ అమీనా సంగతి తేల్చమంటుంది. అయితే తానసలు సుల్తాన్ గంజ్ వెళ్ళనే వెళ్ళనంటాడు సాబిర్. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమంటుంది రసీదన్. కాసేపయ్యాకా, దాతా పీర్ సమాధి దగ్గరకి వెళ్ళి కూర్చుంటారు అమీనా, సాబిర్. తాను వెళ్ళనని సాబిర్ అంటే, వెళ్ళమని నచ్చజెప్తుంది అమీనా. ఇద్దరు అక్కడ ప్రార్థన చేస్తారు. – ఇక చదవండి.]
అధ్యాయం-11 – మొదటి భాగం
[dropcap]సా[/dropcap]బిర్ మియ్యా సుల్తాన్ గంజ్‌లో స్థిరపడ్డాడు. బిల్కీస్ బానో పెట్టెను రసీదన్ దగ్గరే ఉంచి, కొన్ని రోజుల తరువాత తీసుకెళ్తానని చెప్పి వెళ్ళాడు.
ఫాల్గుణం వెళ్ళింది. హోలీ పండుగా వెళ్ళిపోయింది. ఈద్, బక్రీద్ కూడా వచ్చాయీ, వెళ్ళిపోయాయి కూడా!
సాబిర్ మియ్యా ఇప్పుడు సాబిర్ అలీ బఖ్ష్ ఐపోయాడు. ముందు కొన్ని రోజులు సాబిర్, రసీదన్ దగ్గరికి బాగానే వచ్చి వెళ్తూ ఉండేవాడు. మెల్లి మెల్లిగా రాకపోకలు తగ్గిపోయాయి. ఇదిలా జరగాల్సిందే మరి! రోజుకు పది పన్నెండు గంటలు క్లిష్టమైన సంగీత సాధన, ఆ తరువాత పాట్నా బైట ఉస్తాద్ ఫహీం బఖ్ష్, ఉస్తాద్ గులాం బఖ్ష్, వారి శిష్యులతో యాత్రలూ! శహనాయీ నేర్చుకోవటంతో పాటూ, సాబిర్, బృంద నిర్వహణ బాధ్యతలూ స్వీకరించాడు. చిలుం నింపే అలవాటు తప్పిపోయింది. అప్పుడప్పుడు విదేశీ మద్యం సేవించటం మొదలైంది. చిన్న మామయ్య కూడా అప్పుడప్పుడూ సేవిస్తూ ఉంటారు. అలా నూర్ మంజిల్‌కు యీ విదేశీ మద్యం గాలి అలవాటే! మద్య నిషేధం సమయంలో డుగ్గీ వాద్య కళాకారుడు పుత్తన్ లాల్ సప్లయి చేసేవాడు. పీర్ ముహానీ సందు గొందులనుంచీ వచ్చిన సాబిర్‌కు, తన దారినేర్పరచుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. సుల్తాన్ గంజ్‌లో ఎప్పటినుంచో ఉంటున్నవాళ్ళు, షాపులవాళ్ళూ, సాబిర్‌ను ఉస్తాద్ నూర్ బఖ్ష్ మనవడిగా గుర్తు పడుతున్నారిప్పుడు. అలీ బఖ్ష్ కూడా కొందరికింకా జ్ఞాపకమున్నారు. ఆయన పేదరికం, ఆయన పేరును మింగేసింది దారుణంగా!!
సంవత్సరమే కాదు, ఇంకాస్త ఎక్కువ కాలమే గడిచిపోయింది.
వర్షాకాలం మొదలై, పగలూ రాత్రీ ఒకటే వర్షం. మేఘాలు ఆకాశం మీద పట్టు బిగించాయి. చంద్రుడూ రానూ వచ్చాడు, పోనూ పోయాడు, కానీ ఎవరూ చూళ్ళేదు. మేఘాలు విరుచుకుని మీద పడుతున్నాయ్. నగరమంతా నీళ్ళు నిండి నరకమైపోయింది. నల్లాలలోని నీళ్ళన్నీ పొంగి పొర్లి, ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయ్. కబ్రిస్తాన్ లోనూ నీళ్ళు నిండాయి. గాలి వీచినప్పుడంతా నీళ్ళలో మునిగి కుళ్ళిపోయిన గడ్డీ గాదం వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయ్. సూర్యుడు ముఖమెక్కడో దాచుకున్నాడులా ఉంది. పగలూ రాత్రీ తేడాల్లేవ్. రాత్రులు మరీ భయంకరంగా ఉన్నాయ్. ఫజ్లూ తన గదిలొనే ఉంటున్నాడు. సత్తార్ మియ్యా కూడా రావటం లేదు, రసీదన్ వైఖరి మారటంతో ఇటుకేసి చూసే ధైర్యమే చేయటం లేదు. ఇటీవల, రసీదన్ అల్లాను ఇలాగే ప్రార్థిస్తూంది, ‘చేతికి కాసిని డబ్బులు రాకున్నా ఫరవాలేదు, ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవకున్నా ఫరవాలేదు, కానీ ఎవరూ చనిపోకూడదు’. పరిస్థితి ఎలా ఉందంటే, శవ ఖననం కోసం గొయ్యి తవ్వి పూడ్చి పెడితే మనసు తేలిక పడుతుంది, ఆమె అలా ప్రార్థించినంత మాత్రాన చావు ఆగదు కదా!
నిన్న రాత్రి చాలా దురదృష్టకరమైనది. చాలా వరకు రాత్రుళ్ళు మేల్కునే ఉండే రసీదన్ ఎందుకంత నిద్ర ముంచుకుని వచ్చిందో తెలీదు. అసలేమి జరుగుతోందో తెలీనంత నిద్ర! తలుపు చప్పుడైతే చాలు, చటుక్కున లేచిపోయే రసీదన్, మొద్దు నిద్ర పోయింది. సాబిర్ వెళ్ళిపోయిన తరువాత, అమీనాకు కూడా నిద్ర బదులు దుఃఖ హిమ పర్వతాలు కళ్ళల్లోంచీ కరిగి కన్నీరవుతూనే ఉండేవి, కానీ నిన్నెందుకో కళ్ళు అలిసిఫోయి, నిద్ర జయించేసింది. పగలంతా కురిసి అలిసిపోయిన మేఘాలు, సాయంత్రం శాంతించాయి, రాత్రి విశ్రాంతి తీసుకుంటాయేమో అన్నట్టు! కానీ వీటికా ధ్యాస లేనట్టు రాత్రి మళ్ళీ ఉరుములూ, మెరుపులూ!
తెల్లవారింది, ఎప్పటిలాగే! చున్నీ ఇంట్లో లేదంతే! ఇదేమీ కొత్త కాదు. ఎవరింట్లోనో బాతాఖానీ కొడుతూనో, కబ్రిస్తాన్‌లో ఏదో మూల కూర్చుని బబ్లూతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూనో ఉంటుంది. అమీనా పొయ్యి వెలిగించేటప్పుడు మాత్రమే చున్నీ దర్శనమౌతుంది. ఇప్పుడు కూడా అలాగే అనిపించింది, ఎక్కడికో వెళ్ళిఉంటుందని! కానీ చాలా ఆలస్యమైంది కనబడక! రసీదన్ గుండె దడ హెచ్చింది. ఏదో తెలీని భయం మాటిమాటికీ మనసును కుదిపేస్తూంది. ఫజ్లూతో మాట్లాడింది రసీదన్. చున్నీ ఎక్కడికెళ్ళిందో అతనికీ తెలియటం లేదు. రాధే చాయ్ దుకాణం మూసి ఉంది. వాళ్ళింటికెళ్ళి రాధేనూ, బబితాను అడిగాడు. తరచూ చున్నీ వెళ్ళే ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళి విచారించి వచ్చింది రసీదన్. కానీ చున్నీ ఎటెళ్ళిందో ఏమాత్రం తెలియనే లేదు.
కబ్రిస్తాన్ గేట్ ముందు నీళ్ళు పారుతున్నాయి. పీర్ ముహానీ మెయిన్ రోడ్ ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం పల్లంలో ఉంది. అటు నుంచీ వచ్చే వర్షం నీళ్ళు, కబ్రిస్తాన్‌లో నుంచీ బైటికొచ్చే నీళ్ళతో కలిసి లోహానీపుర్ దారి పట్టుకుని, వేగంగా ప్రవహిస్తున్నాయి. రసీదన్ గేట్ దగ్గర మోకాళ్ళ లోతు నీళ్ళలో నిలబడి చున్నీ వస్తుందేమోనని ఎదురుచూస్తూంది. ఫజ్లూ ఒంటి కాలీడ్చుకుంటూ చున్నీ కోసం వెదుకుతూనే ఉన్నాడు.
పగలంతా మేఘాలు తమ దిశను మార్చుకున్నాయి. ముందవి రంగు మార్చుకున్నాయి. తెల్లగా ఉన్నవి కాస్తా, ఎర్రదనం పులుముకున్న పసుపు పచ్చగా మారాయి. తరువాత, గాలి తరగలతో హాస్యాలాడుకుంటూ వెళ్ళిపోయాయి. రాత్రి పొయ్యి వెలగనేలేదు. ఫజ్లూతో పాటూ అతని గదిలోనే కూర్చుని, రసీదన్ రాత్రంతా మేలుకునే ఉంది.
అమీనా వరండాలో పడుంది. ఇక్కడినుంచీ వెళ్ళిన రెండో నెలలోనే సాబిర్ తనకు మొబైల్ కొనిచ్చాడు. వెళ్ళిన కొత్తల్లో ప్రతిరోజూ ఫోన్ చేసేవాడు. నూర్ మంజిల్ గురించి చాలా సంగతులు చేప్పేవాడు. మెల్లిమెల్లిగా ఫోన్ రావటం తగ్గింది. ఫోన్ చేసినా ఏదో పనిమీద ఉన్నట్టు హడావిడిగా మాట్లాడి పెట్టేసేవాడు. ఇప్పుడిక అమీనాతో మాట్లాడి చెప్పేందుకేమీ మిగల్లేదు సాబిర్ దగ్గర! చున్నీ వెళ్ళిపోయి మంచి పనే చేసిందనుకుంది అమీనా. ఎవరెంతగా మొత్తుకున్నా, తనకేంటి? బబ్లూ కావాలనుకుంది, దక్కించుకుంది. ఇంత పెద్ద ప్రపంచంలో ఇద్దరికీ ఎక్కడో ఒక చోట నీడ దొరకనే దొరుకుతుంది తప్పకుండా! బబ్లూ ధైర్యవంతుడు, చున్నీని తీసుకుని వెళ్ళిపోయాడు. సాబిర్‌కు పుట్టింటి వాళ్ళ ఆస్తి కావాలి. శహనాయీ వాయించే నైపుణ్యం కావాలి. అందుకే అతడూ తన దారి తాను చూసుకున్నాడు. అమ్మకూ సత్తార్ మియ్యా కావలిసి వచ్చినప్పుడు, ఎవరినీ లెక్క చేయకుండా ఆయన్ను తన కొంగుకు కట్టేసుకుంది. ఫజ్లూ జీవితం, మందూ, చిలుం మీదే నడుస్తుంది. వాటి ఏర్పాటు బాగానే చేసుకుంటాడు. ఇక మిగిలింది తను! తనకు ప్రపంచమంతా శూన్యమే మిగిలింది. సాబిర్‌ను గుర్తు చేసుకుంటూ అర్రులు చాచటం మాత్రమే తన నుదుట రాసిపెట్టుంది. అదే జరుగుతోంది. రాత్రంతా ఇదే అనుకుంటూ తన పడక మీద అటూ ఇటూ పొర్లుతూ, చున్నీ అదృష్టం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అమీనా.
***
తెల్లవారింది.
రాధే చాయ్ దుకాణం రెండ్రోజుల తరువాత తెరిచాడు. అక్కడ చాయ్ తాగుతూ, గప్పాలు చెప్పుకోవటంలో మజాకు అలవాటు పడ్డవాళ్ళకు కాస్త ఊపిరాడింది. రెండు చెక్క బెంచీలు, నాలుగైదు ఫోల్డింగ్ కుర్చీలు తప్ప అక్కడ కూర్చునేందుకు వేరే ఏర్పాటు లేదు. నేలంతా తడిగా ఉంది కూడా! చాలా మంది నిలబడే ఉన్నారు. చున్నీ మాయమైపోయిందన్న సంగతి వీధి వీధంతా పాకిపోయింది. వాళ్ళందరి మాటల కేంద్రమిప్పుడు చున్నీయే! తలా ఒక మాట మాట్లాడుతున్నారు. అందరికీ వాళ్ళ వాళ్ళ అనుభవాలూ, విశ్లేషణలూ ఉన్నాయ్. ఈ మాటలకు సూత్రధారుడు, సత్తార్ మియ్యానే! ఇటీవల రాధే చాయ్ దుకాణానికి మియ్యా రావటం తగ్గిపోయింది కానీ యీ రోజు అదే పనిగా వచ్చి, చాలా సేపటినుంచీ కూర్చునే ఉన్నాడాయన. రాధే ఏమీ మాట్లాడటం లేదు. ఈ మాటల్లో పాలు పంచుకోకుండా, బాధపడుతున్న మనసుతో, చాయ్ తెర్లించి, అక్కడి వాళ్ళకివ్వటంలో మునిగి ఉన్నాడు రాధే. ఇంతలో, కదం కువా పోలీస్ స్టేషన్ నుంచీ పోలీసు జిప్సీ వచ్చి నిలిచింది.
ఆఫీసర్ ముందు సీట్లో కూర్చునున్నాడు. వెనక నలుగురు పోలీసుల మధ్య ఇరుక్కుని కూచునున్నాడు బబ్లూ మియ్యా తండ్రి, కల్లూ మియ్యా. రాధేను పిలిచాడు ఆఫీసర్. రసీదన్ గురించడిగాడు. కబ్రిస్తాన్ గేట్ వైపు చూపించాడు రాధే. ఆయన చెప్పగా, ఒక పోలీస్ అక్కడికి వెళ్ళాడు. ఫజ్లూ గదిలో కూర్చుని ఉన్న రసీదన్ అతనితో పాటూ జిప్సీ దగ్గరికి వచ్చింది. వెనకే ఫజ్లూ కూడా! చాయ్ దుకాణం ముందు గుంపెక్కువయింది. ఆఫీసర్ కోప్పడేసరికి కొందరు దూరంగా నిలుచున్నారు, కొందరు, ‘ఎందుకొచ్చిన గొడవ!’ అనుకుంటూ వెళ్ళిపోయారు. కుర్చీలో కూర్చునున్న సత్తార్ మియ్యా ఆఫీసర్ దగ్గరికొచ్చి నిల్చున్నాడు. ఆఫీసర్ రసీదన్‌ను చిత్రంగా చూశాడు, మేకను కొనే ముందు కళ్ళతోనే మేక శరీరంలోని మాంసాన్ని కొలిచే కసాయిలా!
‘చున్నీ మీ అమ్మాయా?’ అడిగాడు.
‘ఔనండీ!’
‘ఎక్కడికెళ్ళింది?’
‘తెలీదయ్యా!, నిన్న పొద్దున్నుండీ వెతుకుతూనే ఉన్నాం. మొన్న రాత్రే ఎక్కడికో వెళ్ళిపోయింది.’
‘ఎక్కడికైనా వెళ్ళిందా, లేక మీరే లేచిపొమ్మని చెప్పి పంపారా? ఎక్కడికెళ్ళింది? తన వెంటెవరున్నారు?’
‘మా అమ్మాయిని మేమే ఎందుకు పంపుతామయ్యా?’ కల్లూ మియ్యా వైపు సైగ చేసి చూపిస్తూ రసీదన్ అంది, ‘ఈ కల్లూ మియ్యా కొడుకుతో కలవటమదీ ఉండేది. పెళ్ళి చేసేస్తామన్నాను నేను. కానీ,’
‘కానీ?’ ప్రశ్నడిగి వెంటనే ఏదో రహస్యం చేదించినట్టు గుంపు వైపు చూస్తూ తనలో తానే అనుకుంటున్నట్టు, ఆఫీసరన్నాడు, ‘భలే మంచి కూతురు! కసాయి కొడుకును తీసుకుని లేచిపోయింది. ఇంతకు ముందు అబ్బాయి అమ్మాయిని లేపుకుని వెళ్ళేవాడు, ఇప్పుడు అమ్మాయే అబ్బాయిని లేపుకుని వెళ్తూంది. చాలింక, పద పోలీస్ స్టేషన్ కు!’
‘సార్, తల్లీ కూతుళ్ళిద్దరూ కిలాడీలే, ఈమె తక్కువదేం కాదు!’ సత్తార్ మియ్యా మధ్యలో మాట్లాడాడు.
‘నువ్వెవరు?’ ఆఫీసర్ కనుబొమ్మలు ముడివడ్డాయి.
‘నేను చెప్పానే, ఈయనే ఈమె రెండో మగాడు’ కల్లూ మియ్యా వివరించాడు.
‘వాడు కుక్క, నీచుడు, నా మొగుడు కాదు. మా బతుకంతా భ్రష్టు పట్టించాడు’, గట్టిగా అరిచింది రసీదన్.
ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు. రసీదన్‌ను ఇలా వీధివాళ్ళెప్పుడూ చూడలేదు. అందరూ షాక్‌లో ఉన్నారు.
సత్తార్ మియ్యాను దులిపేసిన తరువాత కల్లూ మియ్యా వైపు మళ్ళింది రసీదన్. ‘ఈ కసాయినే అడగండయ్యా అన్నీ తెలుసు ఇతనికి! తన కొడుకూ, నా కూతురూ ప్రేమించుకుంటున్నారని తెలుసునితనికి! పెళ్ళి చేసేస్తాననే అన్నాను నేను. ఆపటానికి మనమెవరం? ఇతని వల్లనే ఇతని కొడుకు, నా కూతురితో పారిపోయాడు. నాకు ఏమాత్రం తెలిసినా ఈ విధంగా జరిగేదే కాదు. నా బిడ్డా పోయింది, నేనే ఉరికంబమెక్కాలా?’
కేసు బిగుసుకుంది. వీధి మధ్యలో విచారణ వల్ల ఒరిగేదేమీ లేదు. ఆఫీసర్ ఒక పోలీసుతో అన్నాడు, ‘అందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకురా!’ సత్తార్ మియ్యా కేసి చూస్తూ, ‘తప్పించుకుపొయ్యేవు! నువ్వూ రా!’ అన్నాడు.
అతనలా జిప్సీలో కూర్చుని, తక్కిన పోలీసులతో కలిసి రాధే ఉచితంగా ఇచ్చిన చాయ్ తాగేసి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్‌లో కల్లూ మియ్యానే రిపోర్ట్ చేశాడు కాబట్టి, అతనొక్కడే మళ్ళీ వెళ్ళాడు పోలీస్ వాహనంలో!
రాధే దుకాణంలో మళ్ళీ జనం గుమిగూడారు. జరిగిన దాని మీద చర్చలు జోరుగా సాగుతున్నాయ్. రసీదన్, ఫజ్లూను ఒక రిక్షాలో కూర్చోబెట్టాడొక పోలీస్. రెండోదానిమీద సత్తార్ మియ్యాతో పాటూ తను కూర్చున్నాడు. రసీదన్ రిక్షాలో కూర్చోగానే రాధే దగ్గరికి వచ్చి, ‘నేను దుకాణం కట్టేసి వచ్చేస్తా అత్తా తొందరగా!’ అన్నాడు, భయపడొద్దు అన్నట్టు!
అమీనా కబ్రిస్తాన్ గేట్ దగ్గర నిలబడి అంతా చూస్తూంది. రాధే ఆమె దగ్గరికొచ్చి అన్నాడు, ‘నువ్వేమీ కంగారు పడొద్దు. నేనిప్పుడే పోలీస్టేషన్‌కి వెళ్తున్నాను. అత్తకేమీ కాదు. నువ్వు సాబిర్ కు ఫోన్ చెయ్యి.’
ఉన్నట్టుండి శ్రీమతి బబితా గోప్ దిగిందక్కడికి! వచ్చిన వెంటనే, రాధేను దులిపేసింది, ‘పెద్ద మగాడివి నువ్వు. నీ ముందే తప్పేమీ చేయని రసీదన్ అత్తను పోలీసులు పట్టుకుపోతుంటే, చూస్తూ కూచున్నావ్. మున్నా బాబూను పిలు. నేనే వెళ్తాను పోలీస్ స్టేషన్‌కు! నాకిప్పుడే తెలిసింది. ముందే వచ్చుంటే పోలీసుల పని పట్టేదాన్నే!’
చున్నీ వదినె బబిత, మున్నా సింహ్ యాదవ్‌ని పిలిపించింది. మొగుడూ, యాదవ్‌తో పాటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. అమీనా సాబిర్‌కు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పింది, ‘నువ్వు పోలీస్ స్టేషన్‌కు రా వెంటనే! వీలైతే నేరుగా సుల్తాన్ గంజ్ నుండి శాహ్ అర్జా దర్గా వెళ్ళు. అమ్మ మేనమామ కొడుకు సమదూ ఉంటారక్కడ! ఆయన ఫకీర్. ఆయన్ను వెంట పెట్టుకుని రా!’ అన్నది.
చున్నీ విషయమై, రసీదన్‌ను పోలీసులు తీసుకుని వెళ్ళారని సత్తార్ మియ్యా అందరి ముందూ ఆమె గురించి చెప్పాడనీ, పీర్ ముహానీ మొత్తానికి క్షణాల్లోనే తెలిసి పోయింది. రసీదన్ గురించి పీర్ ముహానీలో ఎవరికీ ఏ విధమైన ఫిర్యాదూ లేదు. అసంతృప్తీ లేదు. ఒక్కటి మాత్రం నిజం. భర్త నాసిర్ మియ్యా చనిపోగానే సత్తార్ మియ్యాను తలమీద కూర్చోబెట్టుకుందని మాత్రమే అభ్యంతరం. సత్తార్ మియ్యా పట్ల ఎవ్వరికీ మంచి అభిప్రాయమే లేదు. ఈ వార్త వినగానే భట్టీ పాన్ దుకాణం లోనూ చర్చలే చర్చలు!
***
కదం కువా పోలీస్ స్టేషన్‌లో చాలా రోజుల తరువాత ఒక మాంచి కేసొచ్చింది. అబ్బాయి తండ్రి ప్రకారం, అమ్మాయి, అబ్బాయిని లేపుకు పోయింది! సత్తార్ మియ్యా, వెళ్ళిపోయిన అమ్మాయికి తాను మారుటి తండ్రిననీ, తన భార్య నీతిమాలినదనీ, తనే ఇదంతా చేసిందనీ చెబుతూ యీ కేసులో మరో మెలిక పెట్టాడు. ఉన్నదున్నట్టు అంతా చెప్పి, ఆఫీసర్ ముందు చేతులు కట్టుకుని కూర్చుంది రసీదన్. ఫజ్లూ కళ్ళార్పుతూ ఆమె వెనకే కూర్చునున్నాడు. బబితా గోప్, రాకతో పోలీస్ స్టేషన్ వాతావరణమంతా మారిపోయింది. బబితా అన్నది, ‘సార్, ప్రేమించుకోవడం తప్పేమీ కాదు. ఇద్దరూ వయోజనులే, పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళే! అబ్బాయి తండ్రి, కొడుకు చేత చిన్న చిన్న దొంగతనాలూ అవీ చేయించేవాడు. ఈ అమ్మాయితో ప్రేమలో పడ్డాక, అబ్బాయి మనసు మారిపోయింది. అవన్నీ చేయటం వదిలిపెట్టాడు. అబ్బాయి మీద కేసుంది. బైలు మీదున్నాడు. తండ్రికి దొంగతనాల మీద వచ్చే ఆదాయం కావాలి. కొడుకుకు తన ప్రేమ కావాలి. ఈయన ఇంట్లో వాళ్ళందరినీ రోజూ బెదిరించేవాడు, యీ పెళ్ళి జరిగితే ఇద్దరినీ చంపేస్తానని! మీరే చెప్పండి అమ్మాయేం చేయగలదు? సత్తార్ మియ్యా ప్రవర్తనే మంచిది కాదు. ఇతనూ కలిసే ఉన్నాడిందులో! వీళ్ళిద్దరూ లోహానీ పుర్‌లో ఉండేటప్పుడు మంచి స్నేహితులు. ఈ దుర్మార్గుడి చూపంతా మా అత్త ఇద్దరు కూతుళ్ళమీదే ఎప్పుడూ! మీరు మా వాడలో ఎవరినైనా అడగండి సార్!’
పోలీసుకు పరిస్థితంతా అర్థమైంది. కానీ మొత్తం నమ్మేంతగా కాదు. రసీదన్‌ను అడిగాడు, ‘నువ్వు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వలేదెందుకని?’
‘నిన్న పొద్దున్నే తెలిసింది, అప్పటినుంచీ వెతుకుతూనే ఉన్నాం. మాకు కబ్రిస్తాన్‌లో పని తప్ప ఇంకోటి రాదయ్యా! ఇక్కడికొస్తే యీ బీదరాలి మాటెవరు వింటారయ్యా? ఇదిగో ఇప్పుడు మీముందున్నాను.’
ఎవరి కన్నీళ్ళనూ నమ్మకుండా, వాళ్ళ జేబుల్లోనుంచీ డబ్బులు రాబట్టే అలవాటున్నా, ఈ రోజెందుకో ఆఫీసర్‌కు ఊరికే టైం వృథా చేస్తున్నాననిపించింది. బబితాతో అన్నాడు, ‘తన కూతురు నిన్నటినుంచీ కనిపించటం లేదనీ, ఫలానా అబ్బాయి మీద అనుమానముందనీ, ఈవిడ వైపునుండీ ఒక అర్జీ పెట్టించండి.’
మున్నా సింహ్ యాదవ్, కల్లూ మియ్యా కొడుకుతో చున్నీ కలవటమదీ ఉండేదనీ, సత్తార్ మియ్యా, కల్లూ మియ్యా కలిసే యీ పని చేయించారని అనుమానంగా ఉందనీ రసీదన్ వైపునుండీ అర్జీ తయారు చేశాడు. చదవకుండానే రసీదన్ దానిమీద వేలిముద్ర వేసేసింది. ఆఫీసరన్నాడు, ‘ఇంక మీరంతా వెళ్ళండి. కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్‌కు రావాలి.’
రసీదన్, ఇంకా తక్కిన వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. చెడ్డ పేరు రాకుండా ప్రస్తుతానికి బైట పడ్డామని! శపథం చేసి మరీ పీర్ ముహానీ నుంచీ ఇక్కడికొచ్చిన బబితా గోప్ పరువు దక్కింది. సత్తార్ మియ్యా కూడా వెళ్ళిపోవటానికి లేస్తుంటే ఆఫీసర్ ఆపాడు, ‘నువ్వెక్కడికెళ్తావ్? కూచో!’ అని.
సత్తార్ మియ్యా నిస్సత్తువగా మళ్ళీ కూచున్నాడక్కడే!
‘ఐతే నువ్వు అమ్మాయి నాన్నవన్న మాట!’
‘మారుటి..’
‘మారుటేంటి? ఆయ్..! నాన్నంటే నాన్నే! ఏం నాన్నవి నువ్వు, నీ కూతురినే మాయం చేశావే?’
‘నేను వేరేగా ఉంటున్నాను.’ సత్తార్ మియ్యా తల తిరిగిపోతోందిప్పుడు. మెళ్ళో పాము చుట్టుకున్నట్టే ఉంది.
‘తెలివితేటలు చూపొద్దు. ముడ్డిమీద నాలుగేస్తే అంతా బైటికొస్తుంది. నీకేమీ సంబంధం లేకపోతే మధ్యలో ఎందుకొచ్చావ్ రా? చెప్పు.’
సత్తార్ మియ్యా నోరు మూతపడింది.
‘నీ పేరు కూడా రాసి వెళ్ళింది, పిల్ల మాయమవటంలో నువ్వు కూడా ఉన్నావని! కటకటాల వెనక్కి వెళ్ళకూడదనుకుంటే ఐదు వేలు తీ!’ రసీదన్ వ్రాసిన అర్జీ చేతిలో ఆడిస్తూ అన్నాడు ఆఫీసర్. తరువాత కల్లూ మియ్యాతో ‘నువ్వైతే లోపలికెళ్ళెందుకు రెడీ కా! తండ్రీ కొడుకులిద్దరూ కలిసి, మా ప్రాణం మీదికి తెచ్చారు. కొడుకు పిల్లదాన్ని తీసుకుని పారిపోతే తండ్రొచ్చి కంప్లైంటిస్తాడిక్కడ! నీ కొడుకు బైల్ మీదున్నాడు కదా! ఏదేదో మాట్లాడుతుంటావ్ ఎప్పుడూ. ఏదీ? ఈరోజు మాట్లాడు మరి?’
కల్లూ మియ్యా లబలబలాడాడు.
‘ఇప్పుడింక ఆటలొద్దు. పదివేలు రెడీ చేసుకో! గంట టైమిస్తున్నా! ఇంక.. మూడు రోజుల్లోపల నీ కొడుకూ, ఆ అమ్మాయీ దొరకాలి. ఆలస్యమైతే ఇంకంతే! పదండి.. ఇద్దరూ ఫటాఫట్ బైలుదేరండి. ఇలా వెళ్ళి, అలా వచ్చేయాలి.’ ఆజ్ఞాపించి ఆఫీసర్ లేచి నిలబడ్డాడు.
నీరసంగా ఇద్దరూ పోలీస్ స్టేషన్ నుంచీ బైటికొచ్చారు. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. సత్తార్ మియ్యా హుషారంతా నీరు గారిపోయింది. తన తెలివితక్కువ తనాన్ని తానే తిట్టుకుంటున్నాడు. కల్లూ మియ్యాకైతే తన మెడ మీదే కత్తి వేలాడుతూ ఉన్నట్టూ, పోలీసాఫీసర్ కత్తికి పదును పెడుతున్నట్టూ ఉంది.
ఇక్కడ రసీదన్ పీర్ ముహానీ చేరుకుంది. తన ఇంటి ముంగిట్లో కూర్చుని పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తూంది. బబితాతో పాటూ పీర్ ముహానీ ఆడవాళ్ళంతా ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. రాధే అమీనానడిగాడు, ‘సాబిర్ కు ఫోన్ చేశావా?’ అని.
‘ఆ..’ అంది అమీనా.
‘పనికిమాలినోడు.. అస్సలు రానేలేదు.’
అమీనా ఏమనగలదు? కళ్ళు దించుకుందంతే! ఆమె బాధ, గుండెల్లో తుఫానులా ఎగసి పడుతూంది. అమ్మను సముదయించాలో, లేక గుండెలోని యీ తుఫాన్‌ను అధిగమించాలో తెలియటం లేదామెకు. గుండెల్లోని యీ తుఫాన్ ఛాతీ మీద కొండలాగా నిలిచినట్టుగా ఉంది. వీపు మీద గూని మొలిచి, ఆ బరువుతో తానింకా కిందికి కుంగిపోతున్నట్టుగా ఉంది. ఈ బరువు నుంచీ విముక్తెప్పుడో తెలియటం లేదామెకు. ఇన్నిరోజులూ ఆమె మనసులో ఉన్న సాబిర్ ఇప్పుడు వీపుమీదికెక్కాడు.
(సశేషం)