దాతా పీర్-17

0
2

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[సాబిర్ సుల్తాన్‍ గంజ్‍లో స్థిరపడిపోతాడు. రోజులు గడిచిపోతాయి. సాబిర్ మియ్యా ఇప్పుడు సాబిర్ అలీ బఖ్ష్ అయిపోయాడు. రసీదన్ దగ్గరికి రావడం తగ్గిపోతుంది. మేనమామల ఇంట, తీరిక లేకుండా ఉండిపోతాడు. రోజుకు పది పన్నెండు గంటలు క్లిష్టమైన సంగీత సాధన, ఆ తరువాత పాట్నా బైట ఉస్తాద్ ఫహీం బఖ్ష్, ఉస్తాద్ గులాం బఖ్ష్, వారి శిష్యులతో యాత్రలూ! శహనాయీ నేర్చుకోవటంతో పాటూ, సాబిర్, బృంద నిర్వహణ బాధ్యతలూ స్వీకరిస్తాడు. సంవత్సరం దాటిపోతుంది. వర్షాకాలంలో ఓ రోజు పగలు రాత్రీ ఏకధాటిగా వర్షం కురిసి కబ్రిస్తాన్ అంతా నీళ్లతో నిండిపోతుంది. ఓ రోజు రసీదన్, అమీనా నిద్ర లేచేసరికి ఇంట్లో చున్నీ కనబడదు. రాధే టీ కొట్టుకు వెళ్ళుంటుంది అని అనుకుంటారు. ఎంత సేపయినా రాకపోయేసరికి అందరిలో కంగారు పెరుగుతుంది. చున్నీని బబ్లూ తీసుకెళ్ళిపోయింటాడని అనుకుంటుంది అమీనా. సాబిర్ మాత్రం పుట్టింటి వాళ్ళ ఆస్తి కోసం, షహనాయి వాయించడంలో నైపుణ్యం కోసం తన దారి తాను చూసుకున్నాడని అనుకుంటుంది. రాత్రి గడుస్తుంది. ఉదయాన్నే పోలీసులు జీపులో వస్తారు. నలుగురు పోలీసుల మధ్య బబ్లూ తండ్రి కల్లూ మియ్యా ఉంటాడు. ఓ పోలీసు వచ్చి రసీదన్ ఎవరు, ఎక్కడ ఉంటుందని రాధేని అడిగుతారు. కబ్రిస్తాన్‍‍లో ఉంటుందని చెప్తాడు. ఆ ఫోలీసు వెళ్ళి రసీదన్‍ని బైటకి పిల్చుకొస్తాడు. తల్లితో పాటు ఫజ్లూ కూడా వస్తాడు. చున్నీ నీ కూతురా అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. అవునంటుంది. తన కొడుకుని లేవదీసుకుని పోయిందని కల్లూమియ్యా మీ మీద కేసు పెట్టాడనీ, పోలీస్ స్టేషన్‍కి రమ్మంటాడు. సత్తార్ మియ్యా మధ్యలో దూరి రసీదన్ గురించి చెడ్డగా చెప్తాడు. తన కూతురు, బబ్లూ ప్రేమించుకున్నారనీ, వాళ్ళకి తాను పెళ్ళి చేస్తాననే చెప్పాననీ, ఈయనే ఏదో చేసుంటాడు, అందుకే ఈయన కొడుకు నా కూతురితో పారిపోయాడనీ అంటుంది. పోలీసులు రసీదన్‍ను, సత్తార్ మియ్యాను స్టేషన్‍కు తీసుకెళ్తారు. అమీనా సాబిర్‍కి ఫోన్ చేస్తుంది. కానీ అతను ఫోన్ తీయడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాధే భార్య బబితా గోప్ – రాధేని దులిపేసి, మున్నా సింహ్ యాదవ్‍తో పాటూ పోలీస్ స్టేషన్‍కి వెళ్ళి అసలు విషయంతా వివరిస్తుంది. చివరికి కల్లూ మియ్యా, సత్తార్ మియ్యాల వల్లే బబ్లూ, చున్నీ కనిపించకుండా పోయారన్న అర్జీ తయారు చేసి, దాని మీద రసీదన్ వేలి ముద్ర తీసుకుని ఆమెను పంపేస్తాడు ఆఫీసర్. ఆమె వెళ్ళాకా కల్లూ మియ్యా, సత్తార్ మియ్యాలను బాగా తిట్టిపోసి, పదివేలు తెచ్చివ్వమంటాడు. ఇంటికి వచ్చిన రసీదన్‍ను చుట్టుపక్కల ఆడవాళ్ళంతా వచ్చి పరామర్శిస్తారు. సాబిర్‍కి ఫోన్ చేశావా అని రాధే అడిగితే, చేశానంటుంది అమీనా. పనికిమాలినోడు రాలేదు అని అంటాడు రాధే. అమీనా గుండెల్లో తుఫాను ఎగసిపడుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-11 – రెండవ భాగం

[dropcap]అ[/dropcap]మీనా అమ్మను సముదాయించి, గదిలోకి తీసుకెళ్ళింది. పక్క మీద పడుకోబెట్టింది. ఆమె వెక్కిళ్ళు ఆగేందుకు వీపు నిమురుతూ కూర్చుంది.వెక్కిళ్ళు ఆగాయి. అప్పుడిక అమీనా బైటికొచ్చింది.

మధ్యాహ్నం వేళ.

మేఘాలు లేవు. ఆకాశం నిర్మలంగా ఉంది. భాద్రపద మాసం ఎండ వాలిపోతూ కూడా మండిస్తోంది. పొయ్యి వెలిగించిందామె. అన్నం కోసం పొయ్యి మీద ఎసరుకు పడేసింది. ఇంట్లో యే పప్పులూ కూరగాయలూ లేవు. నాలుగైదు ఆలూలున్నాయి. వాటిని కడిగి, పాత్రలో వేసింది. అన్నంతో పాటు ఉడికితే చోఖా???  చేసేస్తే సరిపోతుంది.

చాలా కష్టపడి అమ్మను అన్నం తినేందుకు ఒప్పించింది అమినా. తరువాత ఫజ్లూతో పాటూ కూర్చుంది భోజనానికి. గొంతులో అన్నం దిగటమే లేదు. నీళ్ళ సహాయంతో ఎలాగో అన్నం ముద్దలు మింగింది. ఫజ్లూ చాలా రోజుల తరువాత కడుపునిండా తిన్నాడు.

వరండాలో అన్యమనస్కంగా కూర్చుని ఉన్న అమీనా గడచిపోతున్న క్షణాల పాద ముద్రలు చూస్తూంది. ముంగిట పడుతున్న ఎండలో, ఎన్నెన్నో పగిలిన ముఖాలు కనిపిస్తున్నాయ్ తనకు. ఉదాసీనమైన గాలి తాలూకు గొంతు వినిపిస్తూంది. ఆమె మొబైల్ మోగింది. వరండాలోని పక్క మీదుంది ఫోన్. లేచి ఎవరినుండని చూసింది. సాబిర్ నంబర్ నుండీ కాల్ వచ్చింది. మొబైల్ అక్కడే ఉంచేసి వచ్చి కూర్చుంది అమీనా. ఫోన్ మోగుతూనే ఉంది. చాలా సేపు మోగింది, కానీ ఆమె మాట్లాడనే లేదు. వందల సార్లు చెప్పిన మాటలే అర్థం చేసుకోలేని వాడితో ఇప్పుడేమి మాట్లాడటం? ‘ఏమీ మాట్లాడకుండానే వాళ్ళ మనసులోని మాటల్ని ఎదుటివాళ్ళు అర్థం చేసుకుంటుంటే, ఇవతలి వాళ్ళెంత అదృష్టవంతులో కదా!’ అనుకుంటూంది అమీనా.

అమీనా లేచింది. ముంగిట్లోంచీ బైటికొచ్చింది. దాతా పీర్ మనిహారీ సమాధి వైపు వెళ్ళింది. కబ్రిస్తాన్ నుంచీ నీళ్ళు బైటికి వెళ్ళిపోయాయి. లోపల అక్కడక్కడ నేల ఎగుడు దిగుడున్న చోట నీళ్ళు నిలిచే ఉన్నాయి కాస్త. గోరీల మధ్య పిచ్చి మొక్కలు మొలిచాయి. నలువైపులా గడ్డి కుళ్ళిపోయిన వాసన. గత రెండు మూడు రోజులుగా మసీదు చుట్టూ ఊడవనే లేదు. ఇటీవల అమ్మ బదులు తనే యీ పనులన్నీ చేస్తూంది.

సమాధి దగ్గరికి వచ్చి పరీక్షగా చూసింది. దానిమీద ఆకులు పడున్నాయ్. దగ్గరే ఉన్న చెట్ల ఆకులవి. రెండ్రోజుల తుఫానుతో కూడిన వాన, గాలీ వల్ల ఘోరంగా ఉంది పరిస్థితి. ఆకుపచ్చ పై దుప్పటి లేచి పోయి, కిందికి వేలాడుతూంది. ధూపం వేసే మట్టి కుండలో నీళ్ళు నిండి ఉన్నాయి. అగరొత్తుల ప్యాకెట్లన్నీ తడిసిపోయున్నాయి. దాతా పీర్ మనిహరీ ఇవేవీ పట్టనట్టు, తన సమాధిలో ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు. అమీనా సమాధిని శుభ్రపరచింది. దుప్పటి సరిగ్గా పరచింది. ఇంట్లోకి వెళ్ళి అగరొత్తుల ప్యాకెట్, ధూపం, అగ్గిపెట్టే తీసుకుని వచ్చింది. రెండు చేతులూ చాచి ప్రార్థించింది, ‘దాతా పీర్! అమ్మ చెబుతూ ఉంటుంది, మీరు ప్రేమలో దెబ్బ తిని పీర్ అయ్యారని, వాళ్ళ తాతగారు చెప్పేవారట! నేనేం చెయ్యాలి దాతా పీర్? నాకేమి తెలియటం లేదు. ఇక్కడే, మీ దగ్గరే ఆరోజు సాయంత్రం కూచున్నాం మేమిద్దరూ! మీమీద చాలా నమ్మకముంది బాబా! ఇప్పుడింక సహించే ఓపిక లేదు. దారి చూపించండి బాబా!’

సూర్యుడు మెల్లి మెల్లిగా పడమటికి దిగుతున్నాడు. చెట్ల మీద చిక్కుకునున్నాడు. ప్రార్థనలు చేస్తూ, తన ప్రేమను కాపాడమని కాళ్ళా వేళ్ళా పడుతూ ఉన్న అమీనాను, చెట్ల కొమ్మల్లోంచే చూస్తున్నాడు. కాసేపే అలా! ఇతనటు వెళ్ళగానే చంద్రుడొస్తాడు. ఆకాశమెప్పుడూ ఖాళీగా ఉండదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలూ, మేఘాలూ – ఇవేవీ లేకపోతే ఎగిరే పక్షులూ! ఖాళీగా ఉండటం తన నుదుట మాత్రమే రాసిపెట్టుందేమో అనుకుంది అమీనా. ఖాళీగా ఉండేదిప్పుడు నిండిపోయింది. సాబిర్‌కు తన పుట్టిల్లు దొరికిపోయింది. అతని సంచీ ఖాళీ అయ్యింది.

సూర్యుడెళ్ళిపోయాడు. నల్లదనం కమ్ముకుంది. శుభ్రంగా ఉన్న ఆకాశంలో కత్తిరించిన వేలి గోరులా చవితి చందమామ కనిపిస్తున్నాడు.

అమీనా ఫోన్ వచ్చినప్పుడు సాబిర్, చిన్న మామయ్యతో నూర్ సరాయ్ వెళ్ళే హడావిడిలో ఉన్నాడు. అక్కడ వాళ్ళ వారసత్వంగా వచ్చిన ఆస్తుంది. సాబిర్ వాళ్ళ తాత ఉస్తాద్ నూర్ బఖ్ష్ గారి నాన్న, జహూర్ బఖ్ష్, ఖవ్వాల్ బిహార్ షరీఫ్ హజ్రత్ మఖ్దుమే జహా యహయా మనేరీ దర్గాలో ఖవ్వాలీలు పాడుతూ ఉండేవారు. దర్గాలో తీర్థయాత్రకు వచ్చిన వాళ్ళ సందడి ఎక్కువ. జహూర్ బఖ్ష్ పాట పాడి లేస్తే, వారి జోలె వెండి నాణాలతో నిండిపోయేది. దర్గా దగ్గరున్న గ్రామాల్లో దానాల కింద వచ్చిన తరి భూములుండేవి. జహూర్ బఖ్ష్ విద్యకు మెచ్చి, వారికి, దర్గాకు అప్పుడున్న అధికారులు నూర్ సరాయ్‌లో కూడా కానుకగా కాస్త భూమిచ్చారు. తరువాత వారు పాట్నాలో ఇల్లు కట్టుకుని, దానికి తన కొడుకు నూర్ పేరు, తమ ఊరు నూర్ సరాయ్ పేరూ కలిసొచ్చేలా పెట్టుకున్నారు. జహూర్ బఖ్ష్ పాట్నాలో తక్కువ సమయమే ఉండేవారు. వస్తూ వెళ్తూ ఉండేవారు. ఖవాస్ మొహమ్మద్ జాన్ వాళ్ళ నాన్న, పాట్నాలో నూర్ మంజిల్ సంరక్షకులు. నూర్ బఖ్ష్ పాట్నాలో స్థిరపడిపోయిన తరువాత, నూర్ సరాయ్ లోని ఆస్తంతా చూసేవాళ్ళు లేక పాడువడిపోయింది. కౌలుకు తీసుకున్న వాళ్ళు వచ్చి ఏదో తమకు తోచినంత ఇచ్చి వెళ్ళేవారు. అంతే! సాబిర్ వచ్చిన తరువాత గులాం బఖ్ష్ ఆస్తి కాగితాలన్నీ బైటికి తీసి అవి అమ్మేసే ఉద్దేశంతో నూర్ సరాయ్ వెళ్ళి రావటం మొదలెట్టారు.

వాళ్ళిద్దరూ బయలుదేరే సమయం లోనే సరిగ్గా సాబిర్ ఫోన్ మోగింది. పీర్ ముహానీ వార్త విని సాబిర్ కూడా ఆందోళన చెందాడు. ఇప్పుడేమి చెయ్యాలో తోచలేదు. పీర్ ముహానీ వెళ్ళాల్సిందే, కానీ మామయ్యతో ఏమని చెప్పాలి? కానీ అంతా చెప్పేశాడు, వివరంగా! సంగతి పెద్ద మామయ్యకు చేరింది. ఆయన సాబిర్‌ను పిలిచారు. ‘చెడు సమయంలో సాయపడటం ఎవరికైనా మంచిదే! కానీ ఇప్పుడు నువ్వు కబ్రిస్తాన్ వాడివి కాదు. ఈ మాట గుర్తు పెట్టుకో! పోలీస్ స్టేషన్ విషయంలో నువ్వక్కడికి వెళ్ళీ చేసేదేముంటుంది? ఈ గొడవలో తల దూరిస్తే, పోలీసులు నిన్ను కూడా ఇందులో ఇరికిస్తే ఎలా? సాబిర్, ఇప్పుడు నువ్వు మా గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో, నువ్విప్పుడు అక్కడికి వెళ్ళకు. నూర్ సరాయ్ నుంచీ వచ్చిన తరువాత వెళ్ళు.’

సాబిర్ ఎటూ చెప్పలేక పోయాడు. ఇప్పటికిప్పుడు ఇక్కడివన్నీ వదులుకుని, వెళ్ళిపోవాలనిపించింది. కానీ అదంత సులభమేమీ కాదు. ఏమీ మాట్లాడలేకపోయాడు. తల దించుకుని మామయ్య దగ్గరినుంచీ వచ్చేశాడు. గుండె చిక్కబట్టుకుని చిన్న మామయ్యతో నూర్ సరాయ్‌కి బైలుదేరాడు.

దారంతా అమీనా వణుకుతున్న గొంతే వినిపిస్తూంది. వార్త వినగానే, పరుగు పరుగున వచ్చి సాబిర్ అమ్మకు తోడుగా నిలబడతాడు అని అమీనా ఎదురు చూసి ఉంటుందనీ, ఆమె నమ్మకం వమ్ము కాగానే కన్నీరు వరదలై పారి ఉంటుందనీ అతనికి తెలుసు. నూర్ సరాయ్ వచ్చినప్పటినుంచీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ అమీనా ఫోన్ తీయనే లేదు. ఫజ్లూ ఫోన్ కట్టేసుంది. అక్కడిప్పుడేమౌతూ ఉందోనని సాబిర్ అశాంతిగా దిగులుగా ఉన్నాడు.

నూర్ సరాయ్‌లో పక్క మీద రాత్రంతా అటూ ఇటూ పొర్లుతూనే గడిపాడు సాబిర్. కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న పైకప్పూ, గోడలతో ఉన్న పాత శిథిల భవనం వరండాలో ఒక బల్ల పైన చిన మామయ్యా మరో బల్ల పైన తానూ పడుకున్నారు. మామయ్య పూర్వ శిష్యుడు, ఇప్పుడు కౌలుకు తీసుకున్న వాటాదారూ అయిన ఒకతను, వాళ్ళకు భోజనమూ, చాయ్ లాంటివి ఏర్పాటు చేస్తున్నాడు. పాత శిథిల భవనం లోనే ఉండటం. నూర్ మహల్‌ను మించిన కమ్మటి భోజనం. కానీ నిద్ర పోవాలంటే భయం, ఎప్పుడు పైకప్పు మీద పడిపోతుందోనని! స్థలాన్ని విభజించి అమ్మే పద్ధతిలో చాలా మందితో రోజంతా మాట్లాడటం, అమ్ముడు పోతుందన్న నమ్మకంతో నిశ్చింతగా గుర్రు పెడుతూ నిద్ర పోవటం – ఇదీ చిన్న మామయ్య పరిస్థితక్కడ!

రెండో రోజు నూర్ సరాయ్ నుండీ వచ్చేటప్పటికి చాలా పొద్దు పోయింది. ఈ లోగా సాబిర్‌కు క్షణమొక యుగంగా గడిచింది. పీర్ ముహానీలో ఏమయిందోనని ఒకటే ఆలోచనలో సాబిర్! కానీ మామయ్య ఉత్సాహంగానే ఉన్నారు. సుల్తాన్ గంజ్ చేరుకున్న వెంటనే ఆ రాత్రే పీర్ ముహానీకి వెళ్ళాలనుకున్నాడు, కానీ పెద్ద మామయ్య మాటలు గుర్తుకొచ్చి ఆగాడు బలవంతంగా! తెల్లవారగానే వెళ్ళిపోవాలనుకున్నాడు. దారిలో ఉండగానే చిన్న మామయ్య పుత్తన్ లాల్‌కు ఫోన్ చేశాడు, అతగాడు నూర్ మంజిల్ ఇంటి మలుపులోనే జేబులో రెండు మందు సీసాలు పట్టుకుని రెడీగా ఉన్నాడు. సాబిర్ తాగే మందుకూ, యీ మందుకూ చాలా తేడాలున్నాయి. సాబిర్‌ది పౌచ్‌ల వరకే! మామా అల్లుళ్ళిద్దరికీ ఎదుటివారి మందు అలవాట్ల గురించి తెలుసు కానీ, తెలియనట్టే ఉంటారు. సాబిర్, నూర్ మంజిల్ వరకూ వెళ్ళి, ‘ఇప్పుడే వస్తాను’ అంటూ వెంటనే తిరిగొచ్చాడు. తన, కోటా సందు మొదట్లో కాస్త దూరానున్న పాకీజా హేర్ కటింగ్ సెలూన్ దగ్గర ఉడికించిన గుడ్లమ్మే షాపు హసీన్ మియ్యా నుంచీ తీసుకుంటాడు. చిన్నతనం లోనే హసీన్ మియ్యాకూ మశూచి వచ్చి ఒక కన్ను పోయింది. అతని ముఖం మీద ఒకటే గుంటలు. ఆయనొక పాత పెట్టె మీద కూచుంటాడు. దాన్నిండా మందు పాకెట్లే ఉంటాయ్. నియమం ప్రకారం, పోలీసులకు డబ్బు చెల్లిస్తూ ఉంటాడు. ధైర్యంగా వ్యాపారం చేసుకుంటుంటాడు. సాబిర్‌ను చూడగానే హసీన్ మియ్యా పాకెట్లు తీసిచ్చాడు. రెండు గుడ్లు తీసి పగులగొట్టి మిరియాలపొడి వేసి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్‌లో వేసిచ్చాడు. సాబిర్ నూర్ మంజిల్ చేరుకున్నాడు. తన గదిలోకి వెళ్ళి మందు పాకెట్ విప్పి తాగాడు. ఫజ్లూకూ, అమీనాకూ ఫోన్ చేశాడు. ఫజ్లూ ఫోన్ కట్టేసుంది. అమీనా ఫోన్ మోగుతోంది కానీ ఆమె మాట్లాడలేదు.

***

పీర్ ముహానీ లోకీరోజు రెండు శవాలు వస్తున్నాయన్న వార్తతో పాటూ సంచలనం మొదలైంది. రసీదన్ భన్వర్ పోఖర్ అబ్బాయికి ఫోన్ చేసింది. ఫజ్లూ ఒంటరిగా యీ పనిచేయలేడిప్పుడు. మెల్లి మెల్లిగా అతని దేహం పట్టు సడలుతోంది. గంజాయి పొగ అతని ఊపిరితిత్తులను పురుగులా తినేస్తూంది. తడి మట్టిని తవ్వి గొయ్యి తీయటం కష్టం. కానీ పొట్ట కోసం చెయ్యాలి అన్నీ! ముగ్గురూ కలిసి రెండు గోతులు తవ్వారు. అంతా అయ్యేసరికి పొద్దు నడినెత్తికి చేరింది.

రసీదన్, ఫజ్లూ పనిలో ఉండగా, సాబిర్ వచ్చి నేరుగా ఇంటి ముంగిట్లోకెళ్ళాడు. అమీనా లేదు. గది తలుపు తీసుంది. అక్కడ కూడా లేదు తను. మొబైల్ వరండాలో బల్ల మీద పడుంది. శవ యాత్ర వస్తున్న సంగతి, గేట్ దగ్గరే తెలిసిపోయిందతనికి. ఫజ్లూ, రసీదన్ ఆ పనిలోనే ఉంటారనుకుంటూ వరండాలోనే కూర్చున్నాడు. అమీనా వచ్చింది. తర్నేజా సేఠ్ దుకాణానికి వెళ్ళింది. వాళ్ళను ఏమీ అనకుండా అప్పు ఇచ్చేవాడతనొక్కడే! రసీదన్ అంటే చాలా గౌరవమతనికి. అప్పుడప్పుడు డబ్బుల సాయం కూడా చేస్తుంటాడు. వాయిదాల మీద లేదా వడ్డీ మీద అప్పిచ్చి కూడా! అతని కొడుకు షాపులో ఉంటే అమీనా వెళ్ళదు. వాడొక పనికిమాలినవాడు. కింది పెదవి నొక్కి పెట్టి నవ్వుతాడు. అమీనా ఛాతీని గుటకలేస్తూ చూస్తాడు. వాడికి సరైన గురువు చున్నీనే! చాలాసార్లతనితో చున్నీ గొడవ పెట్టుకుంది. దుకాణంలో అందరిముందూ అతని పరువు తీసేసింది. చున్నీ అంటే భయం వాడికి! అమీనా బియ్యం, గోధుమ పిండి, నూనె, ఉల్లిగడ్డలూ అప్పు తీసుకు వచ్చింది.

వరండా లోకి రాగానే అమీనా సాబిర్‌ను చూసింది. కానీ చూడనట్టు, సామాను వరండాలో పెట్టి, పొయ్యి వెలిగించటం మొదలెట్టింది. మెల్లి మెల్లిగా బొగ్గుల పొగ వరండా అంతా వ్యాపించింది. పాత్రను కడిగి, నీళ్ళు పోసింది. ఆలూ, ఉర్లగడ్డలూ తరగటం మొదలెట్టింది. సాబిర్ మౌనంగా అమీనానే చూస్తూ కూర్చున్నాడు. మాటలెలా మొదలు పెట్టాలో తట్టటం లేదు సాబిర్‌కు. అతనక్కడుండటం అస్సలు పట్టించుకోకుండా అమీనా తన పనిలో తానుంది. అతని వైపు వీపు చేసి కూర్చుంది. అమీనా వీపులోంచీ కళ్ళు పొడుచుకు వచ్చి తనను చూస్తున్నాయేమో ననిపించింది సాబిర్‌కు.

పొయ్యిలో నిప్పులు తయారయ్యాయి. అమీనా లేచి, నీళ్ళున్న పాత్రను పొయ్యి మీద పెట్టింది.

‘చాయ్ పెట్టవా?’ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు సాబిర్.

సాబిర్ వైపసలు చూడకుండానే అమీనా వెళ్ళి చాయ్ తయారు చేసే పాత్రలో నీళ్ళు కొలిచి పోసి ఇప్పుడే పెట్టిన పాత్రను దించి చాయ్ పాత్రను పొయ్యి మీద పెట్టింది. గది లోపలికి వెళ్ళి చాయ్ పొడీ, చక్కెర డబ్బా తీసుకుని వచ్చింది. పాలు లేని చాయ్‌ని ఒక కప్పులో పోసి సాబిర్ చేతికందించి వెనక్కి తిరిగిందో లేదో, సాబిర్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగింది అమీనా. ఆమె కళ్ళు, వరద నదిలా నిండుగా, నీళ్ళు తొణుకుతూ! చెయ్యి లాక్కుని పొయ్యి దగ్గరికి వెళ్ళి ఇందాకటి పాత్రను పొయ్యి మీద పెట్టింది. తన చాయ్ కప్పును చేతిలోకి తీసుకుని గడ్డం మోకాళ్ళమీద ఆనించి కూర్చుంది. వీపు సాబిర్ వైపుకి ఉంది. పొయ్యి మీదున్న పాత్రలో నీళ్ళు తెర్లుతున్నాయి. ఆ ధ్వనిలో, ముందు రాబోతున్న సమయాన్ని సూచిస్తున్నట్టే ఉంది అమీనాకు!

***

‘నేను మామయ్యతో పాటూ నూర్ సరాయ్‌కి వెళ్ళాను. అక్కడున్నప్పుడే నీ ఫోన్‌లో చున్నీ సంగతి విని ఏం చెయ్యాలో చెప్పాలో తోచలేదు. ఇక్కడ లేనని చెప్పలేకపోయాను. రాత్రే వచ్చాను.’ అబద్ధం చెబుతుంటే, సాబిర్ గొంతు తడబడింది. ఫోన్ వచ్చినప్పుడింకా తానిక్కడే ఉన్నాననీ, నూర్ సరాయ్‌కి వెళ్ళబోతున్నాననీ, పెద్ద మామయ్య తనను ఆపేశాడనీ చెప్పలేకపోయాడు.

‘నేనేమీ అడగలేదే నిన్ను?’ అంటూ అమీనా కళ్ళెత్తి చుసింది సాబిర్‌ను! పాత్రలో అన్నం తిప్పుతూ అంది, ‘నీ కథంతా నాకు చెప్పకు. నీ ప్రపంచం మారిపోయింది. బలవంతంగా ఎవరూ ఎవరినీ పొందలేరు.’

‘నువ్వే నన్ను బలవంతంగా పంపించావు అమ్మ పుట్టింటికి! శహనాయీ నేర్చుకో, మంచి స్థాయున్న చోట ఉంటావూ, జీవితమే మారిపోతుందీ అంటూ! ఇప్పుడు జీవితం మారిపోయింది, నీకు నచ్చటం లేదు.’ అబద్ధమాడినా పట్టుపడక పోవటంతో, సాబిర్ కు ధైర్యమొచ్చింది, గొంతు పెరిగింది.

‘నిన్ను నువ్వే గుర్తించలేనంతగా జీవితం మారిపోతుందేమో చూసుకో! నా నుదుట కబ్రిస్తాన్ రాసుంటే, ఏడ్చి మొత్తుకున్నా ఎవడూ తప్పించలేడు. ఇక్కడే పుట్టాను. ఈ మట్టిలోనే కలిసిపోతాను.’ అమీనా గొంతులో అలసట నిండి ఉంది. సాబిర్‌ను చుట్టేసుకుని వెక్కి వెక్కి ఏడవాలనుంది అమీనాకు, కానీ..!

పరదా తొలిగింది. ఫజ్లూ వచ్చాడు, తడిసిపోయిన దేహంతో! మసీదు ముందున్న కుళాయి నీటితో స్నానం చేసి, తడిసిన టవల్‌తో వచ్చాడు. సాబిర్‌ను చూసి, ‘నువ్వెప్పుడొచ్చావ్?’ అనడిగాడు.

‘కాసేపయింది.’ సాబిర్ అన్నాడు.

‘సామాను తెచ్చావా?’ అమీనానడిగాడు ఫజ్లూ.

‘ఆ.. అన్నమైంది. ఆలూ, ఉల్లిగడ్డల కూర చేస్తాను. పనైందా? అమ్మెక్కడ?’ అడిగింది అమీనా.

‘ఆ.. పనైంది. అమ్మ వస్తూంది. తొందరగా చెయ్. ఆకలి మండిపోతూంది.’ మంచి ఆకలి మీదున్నాడు ఫజ్లూ. ముంగిటి లోనుంచీ బైటికొచ్చాడతను. వెనకే సాబిర్ కూడా!

‘తినేసి వెళ్ళు.’ అమీనా కూర తయారీలో పడింది.

బట్టలు వేసుకుని పక్క మీద పడిపోయాడు ఫజ్లూ. పనితో తుక్కు తుక్కయిందతని శరీరం. దగ్గర కూర్చునున్న సాబిర్‌తో అన్నాడు, ‘చిలుం చెయ్యి.’

సాబిర్, ‘నేనూ..’ ఆగిపోయాడు.

‘హు.. నువ్వు చెప్పావ్. నేనే మర్చిపోయా. నాకోసం చెయ్యిలే. లేకుంటే అసలు చెయ్యటమే మర్చిపోయావా ఏంటి? రాధే భయ్యా చెప్పేది కరెక్టే ఐతే!’

‘నా గురించా?’

‘హు.. చూస్తూండు, సాబిర్ వెనక తోక పుట్టుకొస్తుంది.. అంటుంటాడు.’ ఫజ్లూ నవ్వాడు. అలా అతడు నవ్వి చాలా కాలమైంది.

‘నువ్వూ వదిలిపెట్టు. నీ ఒళ్ళు చూడు, వేలాడిపోతూంది.’

‘మేము నీలాగ విదేశీ సరుకు తెచ్చుకోలేం. నీ బతుక్కూ, నా బతుక్కూ చాలా తేడా ఉంది సాబిర్ మియ్యా!’

‘ఏమీ లేదు. మీ బుర్రలు చెడిపోయాయి. అమీనా కూడా ఇదే అంటూంది. ఎక్కడుంటుంటే, అక్కడి పద్ధతుల ప్రకారముండాలని. ఉండకపోతే కూడా తప్పే. మీరే అనేవాళ్ళు కదా, ‘సాబిర్ దేనికీ పనికిరాడు అని.’ సాబిర్ లేచి చిలుం చేయటం మొదలెట్టాడు. ఫజ్లూ అతన్ని తదేకంగా చూస్తున్నాడు.

సాబిర్ చిలుం తయారు చేసి ఫజ్లూకిచ్చాడు. ఫజ్లూ దమ్ము కొడుతున్నాడు. పెద్దగా దగ్గొచ్చిందతనికి. ఊపిరాడటం లేదు. సాబిర్ అతని వీపు మీద రుద్దటం మొదలు పెట్టాడు. మెల్ల మెల్లగా దగ్గు తగ్గింది. సాబిర్ అతనికి నీళ్ళు తాగించాడు. బైటికొచ్చి, రాధే దగ్గరికి చేరాడు సాబిర్.

‘వచ్చావా?’ అడిగాడు రాధే.

‘రెండు చాయ్‌లు పంపించు భయ్యా ముందు.’ అన్నాడు.

‘చాలా తొందరలో ఉన్నట్టున్నావ్?’

‘ఫజ్లూకు దగ్గు ఎక్కువగా ఉంది. వాడికి చాయ్ తాగించి వస్తాను నీ దగ్గరికి.’

‘మా దగ్గర ఖజానా ఏదీ లేదులే నువ్వు మళ్ళీ రావటానికి! చాయ్ తీసుకెళ్ళు.’ రాధే రెండు గ్లాసుల చాయ్ ఇచ్చాడు.

సాబిర్ తల వంచుకుని వచ్చేశాడు. ఫజ్లూకు చాయ్ ఇచ్చాడు. ఇద్దరూ మాటల్లేకుండా చాయ్ తాగారు.

‘చున్నీ సంగతేమైనా తెలిసిందా?’

‘లేదు.’ ఫజ్లూ గాఢంగా నిట్టూర్చాడు.

కాసేపటికి అమీనా కూర తయారైందని చెప్పింది. ఇద్దరూ భోంచేశారు. తిరిగి గదిలోకొచ్చారు.

సమయం చాలా మౌనంగా నడుస్తూంది. పొద్దు వాలిపోతున్నది. రసీదన్ గోరీల గడ్డ నుంచీ ఇంటికొచ్చి, స్నానమదీ చేసి, భోజనం తరువాత తన గదిలో పడుకునుంది. ఆమె వీపు వణికిపోతూంది. తొడలనుండీ పిక్కల దాకా ఒకటే నొప్పి. నిద్రపోవాలనుకుంటున్నది రసీదన్. కనుగుడ్లు బరువుగా ఉన్నాయి, ఐనా నిద్రే రావటం లేదు. ఒక్క కునుకు తీసినా కాస్త బాగుంటుంది కానీ ఏదీ? రసీదన్ కళ్ళలో ఉదాసీనత. విఫలమూ, దరిద్రమూ ఐన జీవిత కథను వినిపిస్తూ కళ్ళు నిద్రించేందుకు సిద్ధంగానే లేవు. తన క్షీణీస్తున్న దేహాన్నెంతవరకూ లాగగలదు తను? ఎన్ని రోజులిలా శవాలను మట్టిలో పాతిపెడుతూ ఉంటుంది, ఆఖరికి తన శరీరానికింత మట్టి ఎప్పుడు దొరుకుతుంది?

రసీదన్‌కు సమద్ గుర్తొచ్చాడు.

సమద్. సమదూ ఫకీర్. రేపెళ్ళాలి సమదూను కలవటానికి. షాహ్ అర్జా దర్గాకు కూడా! దాతా పీర్ మనిహరీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఈ చున్నీ ఎంత గడబిడ సృష్టించింది? జీవితమే పట్టాలు తప్పిపోయింది. సమద్‌కు అంతా చెప్పాలి. ఏదైనా దారి దొరుకుతుందేమో!

రోజు గడిచిపోతోంది.

ఆమె లేచింది గేట్ దాకా వెళ్ళింది. ఫజ్లూ గదిలో సాబిర్ ఉన్నాడు. ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అనడిగింది. ఏదో చెప్పాలనుంది కానీ చెప్పలేక పోయింది. సాబిర్ కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగినదానికి సమాధాన మిచ్చాడంతే! రాధే దగ్గరినుంచీ చాయ్ తెచ్చిచ్చి వెళ్ళిపోయాడక్కడినుండీ!

అమీనాను మళ్ళీ కలవనైనా లేదు.

***

రాత్రయింది. కాస్త పెరిగాడు చంద్రుడు. బొట్టు బొట్టుగా వెన్నెల రాలుస్తున్నాడు. వరండాలో పక్క మీదున్న అమీనా చంద్రుణ్ణి చూస్తూంది. అర్ధరాత్రికి ముందే చంద్రుడు మునిగిపోయాడు. చున్నీ వెళ్ళిపోయిన తరువాత ఒంటరిగా వరండాలో పడుకోవటం బాగా అనిపించటం లేదామెకు! తనుంటే ఇక్కడంతా సందడి. ఇద్దరి మధ్యా ఎక్కువగా నిశ్శబ్దమే ఉంటుంది, ఐనా చున్నీ ఉనికి, యీ గోరీల గడ్డ నీరవమైన మట్టి రంగులతో నిండిపోతుంది.

వెళ్ళిపోతున్నప్పుడు కలవకుండానే వెళ్ళిపోయిన సాబిర్‌ను తలచుకుంటూంది అమీనా. ఎంత మారిపోయాడు సాబిర్? కాస్త ఒళ్ళు చేశాడు కూడా! ముఖం కూడా మృదువుగా, లేతగా మారింది. మెరుస్తూ ఉంది కూడా! కాస్త చిరాకుగా కనిపించినా ముఖాన ఆ మెరుపు నిలిచే ఉంది. అతని కళ్ళలోని మంత్రజాలమలాంటిది. అతని కళ్ళతో కళ్ళు కలపలేక పోయింది తనసలు! కాసేపలాగే చూసి ఉంటే తన కోపమంతా కర్పూరంలాగే కరిగి పోతుంది. అదే జరిగింది కూడా! ఎంత సేపుంటుంది తన కోపం? భోజనం చేసి వెళ్ళమని చెప్పింది కూడా. అనాలోచితంగా వచ్చేసిందలా అలవాటు మీద. వెళ్ళిపోయేటప్పుడు కలిసి వెళ్ళవలసింది సాబిర్‌కు. అక్కడి పరిస్థితులు తెలియకుండా బాధించిందతన్ని తను. పాపం సాబిర్ చేతిలో ఏముంది? ఎవరితో ఉన్నాడో వాళ్ళ మాట వినక పోయినా చెడ్డవాడనే అంటారు కదా! అతని సంగతది. ఇప్పుడిక తన సంగతి! తన దారి తానే వెదుక్కోవాలి. తండ్రి లేడు. అన్న తన అవిటితనం, అలవాట్ల వల్ల నిస్సహాయుడు. ఒంటరి అమ్మ తనకేమి చేయగలదు? తానే శవాల మధ్య కూర్చునుంది. ఒక్క దాతా పీర్ మనిహరీయే దిక్కు. ఆయన దగ్గరే కూర్చునుంటుంది. కానీ ఆయన కూడా సమాధిలో నిద్ర పోతున్నాడు. ఆయనెప్పుడు సమాధి నుండీ లేస్తాడో, ఎప్పుడు సాయం చేస్తాడో మరి! తీర్పు చెప్పే రోజున చనిపోయిన వాళ్ళందరూ గోరీల నుండీ లేచి వస్తారట! ఆ రోజున ప్రపంచమంతా మాయమై పోతుందట! ఇంకేంటి? తానూ, సాబిర్ కూడా అందులోనే మాయమైపోతారు. దాతా పీర్! నిద్ర పో! సమాధిలోనే ఉండిపో! అక్కడి నుంచే మాపై దయ కురిపించు. మాకోసం అల్లా తాలాను ప్రార్థించు.’

అమీనా పక్క మీద అటుకేసి తిరిగింది. బైట, గోరీల మీద, మసీదు టవర్ల మీదా నలుపు నిండుకుంది. అమీనా పెదవుల మీద సాబిర్ స్పర్శ మండుతున్న జ్వాలలా ఉంది. ఈ జ్వాల వేడికి ప్రపంచమంతా పొగచూరిపోతోంది. సాబిర్ గుండెల్లో ఒదిగినప్పుడు అమీనా గుండెల్లో నిండిన పరిమళం, ఇప్పటికీ ఆమె శ్వాస కోశాల్లో ఉండనే ఉంది. ఈ సుగంధం, ఆకాశం లోని అన్ని వాసనలనూ బంధించి వేసింది.

అమీనా పెదవులు వణుకుతున్నాయి. ఛాతీ కొలిమి తిత్తిలా ఎగసెగసి పడుతూంది. ఆమె మూసి ఉన్న కన్నుల్లో ఎన్నెన్నో చిత్రాల మేలా! ఒకసారి చీకటి రాత్రి చుక్కలతో నిండిన ఆకాశం కనబడితే, మరోసారి, వెండి వెన్నెల పరచుకున్న ఆకాశం! ఒకసారి షహనాయ్ వాయిస్తున్న సాబిర్ ముఖం కనిపిస్తే, మరోసారి చలి సాయంత్రపు టెండలో, సబ్జీ బాగ్ యకూఫ్ మియ్యా దుకాణం ముందు శీర్ చాయ్ తాగుతున్న సాబిర్ ముఖం కళ్ళ ముందుకు వస్తుంది.

ఈ రోజు సాబిర్‌ను తాకనైనా లేదు. అతన్ని అల్లుకుపోవాలనిపిస్తున్నదిప్పుడు! అతన్ని పెనవేసుకుని ఊయల లూగాలనిపిస్తున్నదిప్పుడు! ఆ రోజులా అతని ఛాతీలో ముఖం దాచుకోవాలనిపిస్తున్నదిప్పుడు!

ఆమె పెదవులు కదిలాయి.. ‘సాబిర్! నా సాబిర్! విను సాబిర్!’

అమీనా గొంతెండిపోతూంది. ఆమె లేచింది. వరండా చివర ఉన్న కుండలోనుంచీ నీళ్ళు తీసుకుని గుటకేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here