[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’డా. పుట్టపర్తి నాగపద్మిని.]
[చున్నీ గురించి ఇంకా ఏ వార్త అందదు. రసీదన్ శాహ్ అర్జా దర్గాకు వెళ్ళి ప్రార్థించి సమదూ ఫకీరుని కలుస్తుంది. పలకరింపులయ్యా, చాలా ఆందోళనగా ఉన్నావత్తా, ఏం జరిగింది అని అడుగుతాడు సమదూ. చున్నీ బబ్లూతో వెళ్ళిపోవడం, ఆ తరువాత జరిగిన సంఘటనలు వివరిస్తుంది రసీదన్. ఆమె ఏడుస్తుంటే సమదూ ఓదారుస్తాడు. చున్నీకి ఏమీకాదు, ఆమె భవిష్యత్తు బాగుంటుందని చెప్తాడు. చాయ్ తెప్పించి రసీదన్‍తో తాగిస్తాడు. మాటల సందర్భంలో రసీదన్ పెద్దన్న మసూద్ గతించినట్టు సమాచరం అందందని చెప్తాడు. మంచీ చెడూ ఏ వార్త అందుకునే అర్హత లేనిదాన్నయిపోయానని బాధపడుతుంది రసీదన్. సమదూను పీర్ ముహానీకి వచ్చేయమని కోరుతుంది. తప్పక వస్తానని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి, ఫజ్లూ, అమీనాల నెంబర్లు తీసుకుంటాడతను. రసీదన్ ఇంటికి చేరుతుంది. ఇంటికి వెళ్ళగానే, ఆమె కోసమే కనిపెట్టుకుని ఉన్న ఆమీనా – చున్నీ ఫోన్ చేసిందని చెబుతుంది. చున్నీ, బబ్లూ కలకత్తాలో బబ్లూ మేనత్త ఇంట్లో ఉన్నారనీ, పెళ్ళి చేసుకున్నారని చెప్పిందని చెబుతుంది. కాస్త ఊరట చెందిన రసీదన్‍కు ఉన్నట్టుంది కల్లూ మియ్యా మీద కోపం వస్తుంది. ఫజ్లూని పిలిచి కల్లూ మియాని కడిగేసి రమ్మంటుంది. చున్నీ సుఖంగా ఉంది కదా, ఇంక ఊరుకో అంటూ ఫజ్లూ వారిస్తాడు. కాసేపయ్యాకా దాతా పీర్ సమాధి దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుంది రసీదన్. లోపలికి వచ్చి సమదూ ఫోన్ నెంబరు అమీనాకి ఇచ్చి చున్నీ సమాచారం అతనికి తెలియజేమని చెప్తుంది. ఓ రోజు అమీనా సామాన్లు కొనుక్కుని వస్తుండగా రోడ్డు మీద ఆమెను అటకాయిస్తాడు సత్తార్ మియ్యా. కసురుకుంటుంది అమీనా. ఈలోపు అక్కడికి బబితా గోఫ్, మున్నాసింహ్ యాదవ్ అనుచరులు వస్తారు. బబిత వచ్చి సత్తార్ మియ్యాని గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. మున్నాసింహ్ మనుషులు మిగతా పని పూర్తి చేస్తారు. బాగా దెబ్బలు తిన్న సత్తార్ మియ్యా తన గదికి చేరుకుంటాడు. ఇక్కడ్నించి సబ్జీబాగ్‍కు మకాం మార్చాలని నిశ్చయించుకుంటాడు. అక్కడ్నించే రసీదన్ పని పట్టాలని అనుకుంటాడు. లాల్‌జీ టోలా స్థానికులకూ, కబ్రస్తాన్ కమిటీ వాళ్ళకి గొడవలు జరుగుతాయి. కబ్రస్తాన్ స్థలం ఆక్రమణలకు గురవుతుంది. కోర్టులో కేసు నడుస్తుంటుంది. రోజులు గడుస్తుంటాయి. – ఇక చదవండి.]
అధ్యాయం-12 – ఒకటవ భాగం
[dropcap]గు[/dropcap]ల్ హిజ్ నెలలో (హిజ్రీ కాలెండర్‌లో 10 వ నెల, బక్రీద్ యీ నెలలోనే వస్తుంది) 10వ రోజు బక్రీదొచ్చింది. ఈ సారి బక్రీద్ చాలా బాగా జరిగింది. రసీదన్ ఇంట్లో భిక్ష (దానం) ద్వారా మంచి ఆదాయమే వచ్చింది.
భాద్రపదం వెళ్ళిపోయింది. దాని తరువాత ఆరు నెలలు కూడా గడిచిపోయాయి. చైత్ర మాసం. తెల్లవారు ఝామున చలి గానే ఉంటుంది కానీ పొద్దెక్కే కొద్దీ వేడే! గాలి కూడా బాగానే వీస్తుంది. కొత్తగా కట్టిన గోరీలనుండీ దుమ్ము బాగా ఎగురుతుంది.
ఈ మధ్య చున్నీ, బబ్లూ వచ్చి వెళ్ళారు. కల్లూ మియ్యా మాట చెల్లనేలేదు. బబ్లూ మియ్యా వాళ్ళమ్మ, బబ్లూ వాళ్ళత్తతో కలిసి, కల్లూ మియ్యాకు కళ్ళెం వేసేసింది. తన ఇష్టం కొద్దీ చేసింది. బబ్లూ తన భార్య చున్నీతో పాటూ, కలకత్తా నుండీ తన ఇంటికే వెళ్ళాడు. చున్నీ కూడా పీర్ ముహానీకి వచ్చి రెండ్రోజులుండి వెళ్ళింది. బబ్లూ కూడా సిగ్గుపడుతూ వచ్చాడు, ప్రార్థనల తరువాత, లోహానీపూర్ వెళ్ళిపోయాడు. చున్నీ అందరికీ కొత్త బట్టలు తెచ్చింది. బబ్లూ ఇప్పుడు నాన్న మీద ఆధారపడకుండా తానే సొంతంగా ఒక వకీలును మాట్లాడుకున్నాడు. కోర్టులో హాజరై, బెయిల్ అదీ కాన్సిల్ కాకుండా, తన కొత్త చిరునామా వ్రాసిచ్చాడు. అతనున్నన్ని రోజులూ జునైద్ భర్య మండిపడుతూనే ఉంది. బబ్లూ ఆమెకు దూరంగానే ఉన్నాడు. ఇదంతా చూస్తూ, చున్నీ నవ్వుకుంది లోలోపల! చున్నీ ఇంకా కొన్ని రోజులిక్కడే ఉండాలని రసీదన్ కోరిక. కానీ ఇద్దరూ వెళ్ళిపోయారు.
రాధే నుంచీ అప్పు తీసుకుని రసీదన్ వాళ్ళిద్దరికీ కొత్త బట్టలు కొని ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలనుంచీ దాచిపెట్టి ఉంచిన బంగారపుటుంగరం కూతురి చేతికి తొడిగింది. బబితా ముక్కు పుడక ఇచ్చింది. అత్తా మామల సాయంతో, బబ్లూ తన వంశ పారంపర్యంగా వచ్చే వ్యాపారం మొదలు పెట్టాడు. చున్నీ, ఏదో మాల్‌లో క్లీనర్‌గా చేరింది. పొద్దున్న ఎనిమిది నుండీ మధ్యాహ్నం నాలుగ్గంటల వరకూ ఉండాలక్కడ! బబ్లూ కాస్త, చున్నీ బాగా బెంగాలీ కూడా నేర్చేసుకున్నారు. ఇద్దరూ సంతోషంగా వచ్చారు. సంతోషంగా వెళ్ళారు.
సత్తార్ మియ్యా, పీర్ ముహానీ నుండీ బిచాణా పూర్తిగా ఎత్తేసాడు. సబ్జీ బాగ్‌లో రచయితలు, పత్రికల వాళ్ళుండే ప్రాంతంలో తెల్లవాళ్ళ స్మశానం ఉండే చోట వెనుక వీధిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సబ్జీ బాగ్‌లో గోదాము కూడ మూసేశాడు. వ్యాపారమూ మార్చేశాడు. పీర్ ముహానీలో భూలోటాన్ చేసే వ్యాపారమే సత్తార్ మియ్యా వ్యాపారమిప్పుడు సబ్జీ బాగ్‌లో! మద్య నిషేధం సమయంలో మద్యం అమ్మటాన్ని మించిన వ్యాపారముంటుందా? దీనికి పెట్టుబడి అవసరం. అది వీళ్ళ దగ్గరుంది. ప్రమాదాలుంటాయి కానీ సత్తార్ మియ్యాకివన్నీ కొత్తవేమీ కాదు. సమయానికి సరిగ్గా పోలీసులకివ్వాల్సింది ఇచ్చేస్తూ ఉంటే, ఇంక తక్కినదంతా లాభమే!
‘ఇంక పిల్లలొద్దు..’ అని శపథం చేసిన తరువాత కూడా, చున్నీ వదినె బబిత మళ్ళీ ఆరోసారి గర్భవతైంది. చాయ్ దుకాణంలో, వీధిలోని స్త్రీలందరిముందూ, తన మరుదుల ముందూ, బబితా ఇందులో తన తప్పేమీ లేదనీ అంతా భర్త రాధే తప్పేననీ ప్రకటించి చేతులు దులిపేసుకుంది. రాధే అన్నాడు, ‘పుట్టుకలోనే లోనే అంతా గడబిడగా ఉంది. తాకితే చాలంతే! ఈ సారి పీర్ ముహానీ వాళ్ళందరినీ పిలిచి ఒట్టు వేసుకుంటాను. ఈ బబితా నీడలో కూడ నిలబడను బాబోయ్!’
మళ్ళీ మళ్ళీ వస్తానని మాటిచ్చి కూడా సాబిర్ అలీ బఖ్ష్, ఇన్ని నెలల్లోనూ ఎక్కువకెక్కువ రెండు సార్లొచ్చాడంతే! కుర్బానీ మాంసం తీసుకుని బక్రీద్ రోజు వచ్చి ఒక గంట మాత్రమే ఉన్నాడిక్కడ! అమీనా కోసం కొత్త బట్టలు తెచ్చాడు కానీ ఇంతవరకూ వాటిని అమీనా వాడనేలేదు. ఇప్పుడు మోటర్ సైకిల్ నడుపుతున్నాడు సాబిర్. చిన్న మామయ్య తనకే ఇచ్చేశాడట దాన్ని! ఇంట్లో పడుంది. ఆయనా వాడటం లేదు. రెండో సారి చున్నీనే ఫోన్ చేసి రమ్మంది. అసలు చున్నీ అంటేనే కోపంతో వణికిపోయే సాబిర్ తనతో చాలాసేపే మాట్లాడాడు. అమీనా అక్కడే ఉన్నా, ఆమె గంభీరంగా ఇంటి పనుల్లో లీనమైనట్టే దూరంగానే ఉంది. కారణం లేకుండానే ఏదో ఒక పని చేస్తూనే ఉంది అతను ఉన్నంత సేపూ! కాలం గడిచిపోతూ ఉంది. ఫజ్లూకు ఒంట్లో బాగాలేదప్పుడు! అతన్ని చూసి సాబిర్ ముఖం ఉదాసీనంగా మారింది, కానీ కాసేపే! రాధే తోనూ మాట్లాడాడు సాబిర్. ఎవరితోనైనా మాట్లాడలేక పోయాడూ అంటే అది అమీనా తోనే! లక్ష సార్లు ప్రయత్నించినా అమీనా అసలు మాట్లాడలేదు. నిజానికిలా ఉండటం, అమీనాకూ లోలోపల బాధాకరంగానే ఉంది. గొప్ప సంగీత విద్వాంసుడు నూర్ బఖ్ష్ గారి దౌహిత్రుడు సాబిర్ అలీ బఖ్ష్ అక్కడున్నంత సేపూ, కోపంతో అమీనా రక్తం కుతకుతలాడుతూనే ఉంది. మొన్నటి చలికాలం తరువాత, తన వాళ్ళంతా వెళ్ళిపోగా ఒంటరిగా ఇక్కడే మిగిలిన ఒక ప్రవాస పక్షిలాగా విలవిలలాడిపోతూనే ఉందామె మనసు. అది బతకలేక పోయింది. కొద్దికాలమే ఒంటరిగా ఉండాలది. కొన్ని రోజులు ఓపిక పడితే మళ్ళీ తనవాళ్ళతో కలిసేదే! కానీ తనవాళ్ళూ లేకుండా ఉండనే లేకపోయిందా పక్షి! ఇప్పుడు అమీనాకు కూడా తాను కూడా తప్పిపోయాననే అనిపిస్తూ ఉంది. ఏదో ఒక రోజు ఆ పక్షిలాగే తను కూడా..! కానీ తను బతకాలనుకుంటూంది. చున్నీ లాగే సందడి సందడిగా తను కూడ జీవించాలి అని కలలు కన్నది కూడా! కానీ మోసపోయి చనిపోయేటప్పటి బాధెలా ఉంటుందో తన స్నేహితురాలు సరోజ్ ముఖంలో అమీనా చూసిందెప్పుడో!
వెళ్ళిపోతున్న సాబిర్‌ను ఆపి, అమీనా విషయంలో అతని అభిప్రాయమేమిటో చెప్పమని అడుగుదామనుకుంది రసీదన్. ఆమెకు పగలూ రాత్రీ అమీనా చింతే ఇప్పుడు! అమీనా కూడా పురుగు పట్టిన ధాన్యం కంకిలాగా వంగి పోతూ ఉంది. ఒక నవ్వూ లేదు, ఒక ఏడుపూ లేదు. రాటకు కట్టిన ఎద్దులాగ, ఇంటి పనిలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది పాపం. ఇంకా ఎప్పటిదాకా ఇలా? కానీ రసీదన్ అడగలేక పోయింది.
***
ఉస్తాద్ ఫహీం బఖ్ష్ తన మేనల్లుడు సాబిర్ అలీ బఖ్ష్‌కు బృందావనీ సారంగ్ రాగంలో తమ తండ్రిగారు ఉస్తాద్ నూర్ బఖ్ష్ గారు వ్రాసిన ఒక పల్లవి నేర్పుతున్నారు. కాపీ జన్యమైన యీ రాగం ఔడవ జాతికి చెందినది. దీనితో ఒక పాత కథ ముడిపడి ఉందట! ఇదే రాగంలో వాళ్ళ తాతగారు, బిహారీ షరీఫ్ లోని హజ్రత్ మఖ్దూమే జహాన్ యహయా మనేరీ దర్గాలో మొదటసారి ఖవ్వాలీ వాయించారట! అది అమీర్ ఖుస్రో వ్రాసినది.
నీ రంగునే నాకూ ఇవ్వు దొరా!!
నా ప్రేమకు నువ్వే అధికారివి !
నీకిష్టమైన రంగే నాదీ,
నా యౌవనాన్ని కుదువకు ఉంచుకో దొరా!!
నా దుపట్టా, ప్రియుని తలపాగా,
రెండిటికీ బసంతీ రంగునివ్వు దొరా!!
నా సిగ్గూ, శరమూ, అన్నీ నీకే అర్పితం దొరా!!
వారి ప్రావీణ్యానికి ముగ్ధులై మఠాధిపతి ఆయనకు కానుకగా ఒక బంగారు మొహర్, ఐదు వెండి నాణాలూ ఇచ్చారట కూడా!! అప్పటినుంచే ఇంట్లోకి సంపద రావటం మొదలైందట! ఉస్తాద్ ఫహీం బక్ష్‌కు యీ బందిష్ అంటే చాలా ఇష్టం. షెహ్‌నాయీ మీద ఆయన దీన్ని వాయిస్తూ, పాట సాహిత్యాన్ని చెబుతూ ఉంటే వినేవాళ్ళంతా వాహ్ వాహ్ అంటూనే ఉంటారట! సాబిర్‌కు వాది, సంవాది రాగాల గురించి రి స్వరం వాది ఎలా అవుతుందో, ప సంవాదెలా అవుతుందో, ఆరోహణ, అవరోహణలలో ద వర్జితమెలా అవుతుందో, కోమల్, తీవ్ర్ రెండింటిలో ని స్వరం ఎలా పలుకుతారో వివరిస్తున్నారు.
సాబిర్ అలీ బఖ్ష్ ఇప్పుడు చక్కగా సంసిద్ధమై పోతున్నాడు. ఇంత తొందరగా, సంగీత ప్రపంచంలో చక చకా అడుగులు వేస్తూ, అతడు నడవగలడని ఉస్తాద్ ఫహీం బక్ష్ కలలోనైనా ఊహించలేదు. ఈ దారి చాలా పొడవైనది. రాగాల ఆరోహణలు, అవరోహణలే కాక ఎన్నెన్నో ఎత్తు పల్లాలుంటాయి. ఐనా సరే, సాబిర్ అడుగు ముందుకే వేశాడు. బట్టలూ, ప్రవర్తనా, భాషా అన్నీ మారిపోతున్నాయి. ఉర్దూ అక్షరాల ఉచ్చారణలో కొన్ని మెలకువలు కూడా గమనించి, పలకటం అలవాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు కొత్త అలవాటు మొదలైంది కూడా! సెంటు అలవాటు! హర్మందిర్ వీధిలో సెంటు సీసాలమ్మే కన్నౌజియా సేఠ్ దుకాణానికెళ్ళి, హినా సువాసన సెంటు కొనుక్కుని వస్తున్నాడు.
ఇటీవల సాబిర్ మనసులో ఒక కొత్త బాధ మొదలైంది, అమ్మా వాళ్ళ పూర్వీకుల ఇల్లూ వాకిలీ చూసొచ్చాడు కానీ నాన్నా వాళ్ళ పూర్వీకుల ఇల్లెక్కడుందో కూడా ఇంకా తెలియదు. నాన్నెక్కడివాడు? నాన్న పూర్వీకులు, ఇక్కడ పాట్నా స్థానికులే ఐతే, ఎక్కడో ఒక చోట మూలాలు దొరికేవి తప్పకుండా. ఎక్కడినుంచో వచ్చిన వాళ్ళైతే మరి ఆ వివరాలేంటి? ఒక రోజు సంగీతాభ్యాసం తరువాత, పెద మామయ్యను ఎంతో మొహమాట పడిపోతూ ఈ సంగతి అడిగాడు సాబిర్. ఉస్తాద్ ఫహీం బఖ్ష్ కాసేపు మాట్లాడకుండా ఉండి పోయారు , జ్ఞాపకాల జడిలో! తరువాత మెల్లిగా మొదలెట్టారు. ‘మీ నాన్న పేరు అలీ జాన్. మధుబనీ జిల్లాలో, బేనీపట్టీ దగ్గర బాగమతి నది ఒడ్డున వాళ్ళ ఊరు సీసో ఉండేది. మీ నాన్న రసన్ చౌకీ వాయిస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరమూ, బాగమతి వరదల్లో ఆ ప్రాంతమంతా మునిగి పోయేది. ఇప్పుడు కూడా! ఒక సారి వరదల్లో మీ నాన్న గారి నాన్నా, అమ్మతో పాటూ, కుటుంబమంతా వరదల పాలై పోయింది. మీ నాన్నొక్కరూ మిగిలిపోయారు. వ్యవసాయముండేది కాదు. ఎవరి భూమి మీదో గడ్డి గాదంతో తయారైన ఇల్లు మాత్రమే ఉండేది. మీ నాన్న పాట్నాకొచ్చాడు. ఎలాగో జీవితం గడుపుతూ ఉండేవాడు. మా నాన్న దృష్టి మీనాన్న మీద పడింది. తనతో తీసుకుని వచ్చారు. సంగీత శిక్షణనిచ్చారు. ముందు నుంచే రసన్ చౌకీ వాయించేవాడు కదా, అందుకే చూస్తూ చూస్తుండగానే మా ఇద్దరినీ కూడా దాటిపోయాడు వాయిద్యంలో! ఎంతో గొప్పగా బలంగా షెహ్‌నాయీలో గాలి నింపేవాడు. గట్టి శ్రుతి తనది! సూది మొనంత తేడా కూడా ఉండేదికాదా శ్రుతిలో! మా అన్నదమ్ములిద్దరికన్నా ఎక్కువగా గౌరవించేవారు మా నాన్న, మీ నాన్నను! ఆయన పేరు కూడా మార్చేశారు, తన కొడుకుగా పేరు మార్చి! అలీ జాన్ నుండీ అలీ బఖ్ష్ ఐపోయాడు మీ నాన్న! నాకు ముగ్గురు కొడుకులనే చెప్పేవారాయన అందరికీ! ఆయన దృష్టిలో, సంగీత ప్రపంచంలో తన అసలు సిసలు వారసుడు మీ నాన్నే, మేము కాదు. తక్కిన కథంతా నీకు తెలిసే ఉంటుంది’ – క్షణం సేపు ఆగారాయన. సాబిర్ వైపు చూశారు. ‘నీ రక్తంలోనే సంగీతముంది సాబిర్!’ అన్నారు.
సాబిర్ అలీ బఖ్ష్ మౌనంగా పెద మామయ్య మాటలు వింటూ ఉండిపోయాడు, ఉస్తాద్ నూర్ బఖ్ష్ సంగీత వారసుడు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ! తన తల్లిదండ్రులను గుర్తు చేసుకోకుండా ఇన్ని రోజులూ, జీవితంలో తానెంత కోల్పోయాడో తలచుకుని గుండె చెరువైపోయిందతనికి! అమ్మా, నాన్నా చనిపోయిన తరువాత, బిల్కీస్ బానో పిన్ని వెళ్ళిపోయిన తరువాత ఆ పశ్చాత్తాపంలో సంగీతం నేర్చుకోలేక పోయిన బాధను సహిస్తూ అతని గుండె మీద ఎన్నెన్నో స్వర లిపులు తెలిసీ తెలియకుండానే పూడుకుని పోయాయి. అవన్నీ ఇప్పుడు మళ్ళీ పిచ్చి గాలుల్లా వెంట పడుతున్నాయ్. వీటినుండీ తప్పించుకోవటానికే సాబిర్ ఎపుడూ సంగీతాభ్యాసం లోనే మునిగి ఉండేవాడు. అమీనా గుర్తుకు వస్తుంది. బాధా కలుగుతుంది. కానీ సాబిర్, ఆ జ్ఞాపకాలను స్వరాల మాటున నిద్ర పుచ్చేసేవాడు. పీర్ ముహానీ వెళ్ళాలని మనసు తొందర పెట్టేది. కానీ ఉస్తాద్ ఫహీం బఖ్ష్ సంగీత శిక్షణలో ప్రతి రోజూ అప్పజెప్పవలసిన పాఠాల అభ్యాస భారం మోయటంలోనే పగలు రాత్రులుగా, రాత్రులు పగళ్ళుగా మారిపోతూ ఉన్నాయి. రోజూ పన్నెండు గంటల అభ్యాసమంటే ఉత్తి మాటలు కాదు. ఉస్తాద్ ఫహీం బఖ్ష్ షహనాయీ, అచ్చంగా, వాళ్ళ నాన్న షహ్‌నాయీ లాగే కేవలం మ్రోగేది కాదు, తియ్యగా పాడేది. ఊపిరి బిగబట్టి షహ్‌నాయ్‌లో శ్రుతి, తాళాన్ని పలికించటంలోనే ఉంది ప్రతిభంతా! సాబిర్ ఊపిరిలో ఒకప్పుడు కొలువై ఉండే అమీనా, ఇప్పటి సాబిర్ అలీ బఖ్ష్ ఊపిరిలో లేదు. గమకాలూ, రాగాలాపనలూ, మెల్లిమెల్లిగా ఆ స్థానాన్ని ఆక్రమించేశాయి.
నాన్న కథ విన్న తరువాత, అమీనా వాళ్ళ నాన్న నాసిర్ మియ్యా గుర్తొచ్చాడతనికి! రసీదన్ అత్తెప్పుడూ చెబుతూనే ఉండేది, తన మామగారు, (నాసిర్ మియ్యా తండ్రి) గంగానది ఒడ్డునున్న ఏదో బస్తీ నుండీ ఇక్కడికి తరలి వచ్చేశారనీ, గంగ వరద వాళ్ళను పూర్తిగా దోచేసిందనీనీ! భార్యా, కొడుకును తీసుకుని, పాట్నా వచ్చేశారట ఆయన! ఎంత బాగా కలిశాయో ఇద్దరి నాన్నల కథలూ! ఎక్కడినుంచో రావటం, ఎక్కడా ఇమడలేక పోవటమూ గురించిన కథలు!
***
ఫర్హత్ బానో చనిపోయింది.
ఉస్తాద్ నూర్ బఖ్ష్ తన కుమార్తె పేరైతే ఫర్హత్ అని పెట్టుకున్నారు. కానీ ఆమె జీవితమంతా సంతోషంగా ఉండలేకనే పోయింది. నూర్ మంజిల్ లోకి సాబిర్ వచ్చాక, ఆమె దాదాపు తన గదిలోనే ఉండిపోయింది. అంతకు ముందప్పుడప్పుడూ, తన సోదరులతో కూర్చుని మాట్లాడుతూ ఉండేది. ఇంటి విషయాల్లో పాలు పంచుకుంటూ ఉండేది కూడా! ఇద్దరు వదినెలతో మాటలంతగా ఉండేవి కావు మొదటినుంచీ! ఒక రుక్న్ బీ తో మాట్లాడేది. అవసరమున్నా లేకున్నా ఆమె మీద విరుచుకు పడుతూ ఉండేది. ఆమె పుల్ల విరుపు మాటలు వింటూ రుక్న్ బీ కూడా ఊరికే ఉండలేకపోయేది. తిరుగు జవాబులు చెప్పేది. ‘చూడు మరి! పగలూ రాత్రీ సేవ చేస్తూనే ఉండాలి. పేర్లు పెడితే సహించి ఊరుకుండాలి. హాయల్లా! నేను తప్ప ఈమెకెవరు తిండీ తిప్పలు పెట్టగలరో చెప్పమనండి చూద్దాం! దీనికి తోడు ఎక్కడలేని టెక్కూ! ఇప్పుడింక నావల్ల కాదు బాబోయ్!’
సాబిర్ ఇక్కడికి రావటం ఫర్హత్‌కు అస్సలు నచ్చలేదు. సాబిర్ కూడా ఆమెనుంచీ దూరంగానే ఉండేవాడు. భయపడేవాడు కూడా! ఎదురుగా వస్తే, ఆమె సమాధానమిచ్చినా, ఇవ్వక పోయినా, తను మాత్రం వంగి గౌరవంగా సలాం చేసేవాడు. ఆమె ఒంట్లో ప్రపంచంలోని రోగాలన్నీ కొలువయ్యాయి. ఆమె మందులన్నీ ఎటువంటి ఆలస్యమూ లేకుండా తెప్పించే బాధ్యత, సాబిర్ పైనే వదిలిపెట్టారు మామయ్యలు. కానీ అవన్నీ అమె పక్క కిందే పడున్నాయి, తరువాత చూస్తే! అంటే ఆమె కొన్ని నెలలుగా వాటిని వేసుకోనేలేదన్నమాట!
ఫర్హత్ బానో ఇద్దరు మామయ్యల మధ్య సంతానం. చిన్న మామయ్య తరువాతా, ఆఖరుదీ సాబిర్ వాళ్ళమ్మ! అలీ జాన్ నుండీ అలీ బఖ్ష్ గా మారి, నూర్ మంజిల్‌లో అడుగు పెట్టి, సంగీతాభ్యాసం చేస్తున్న తొలినాళ్ళలో ఫర్హత్ బానో ఆయన పట్ల ఆకర్షితురాలైంది. ఆమె కళ్ళు అలీ బఖ్ష్‌నే వెంటాడుతూ ఉండేవి. కానీ అతనసలు అటుకేసి చూసేవాడే కాదు. ఇంట్లో ఫర్హత్ బానో మాటే నడిచేది. అలీ బఖ్ష్ కూడా తన చుట్టూ పిచ్చివాడిలా తిరగాలనీ, తాను మాత్రం అతన్ని దూరంగా పెడుతూ తన కనుసైగలతో అతన్ని ఆడించాలనీ కోరుకునేదామె. కానీ అంత ధైర్యం అలీ బఖ్ష్ లో ఉండేది కాదు. ఇంతలో చలాకీ మదీహా, పిల్ల గాలిలా అతన్ని తాకింది. నూర్ మహల్‌లో అతనున్నంత సేపూ, మదీహా అక్కడక్కడే ఉండేది. తండ్రి నూర్ బఖ్ష్‌కు ప్రాణమైన మదీహా, నిర్భయంగా ప్రేమ తగాదాలు నడిపేది. ఇది చూసి ఫర్హత్, నిప్పు కణికెలా మండిపోతుండేది. ఒక సాయంత్రం ఏకాంతం చిక్కగానే అలీ బఖ్ష్‌ను ఆపేసి, స్పష్టంగా చెప్పేసింది, ‘నాకు దక్కకపోతే మదీహాకు కూడ దక్కనివ్వను నిన్ను!’అని.
కానీ ఆమె ఏకాంతమనుకున్నదీ అబద్ధమైపోయింది. మదీహా దూరం నుంచీ ఆమె మాటలు వినేసింది. అంతే! అప్పటినుంచీ ఇద్దరక్కచెల్లెళ్ళ మధ్యా యుద్ధం మొదలైంది. నూర్ బఖ్ష్ ఉన్నంతవరకూ, తననెవరూ ఏమీ చేయలేరనే ధైర్యముండేది మదీహాకు! కానీ ఆయన మరణించిన తరువాత, అమెకు ఎవరిమీదా నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళమ్మా, ఇద్దరన్నల మీదా ఫర్హత్ బానోదే పెత్తనం. కనుక వాళ్ళూ తన మాట ఖాతరు చెయ్యరనిపించింది మదీహాకు! తండ్రి చనిపోయిన నలభై రోజుల తరువాత, అలీ బఖ్ష్‌తో నిక్కా చేసుకునేసిందామె! ఎవరు చెప్పినా వినలేదు. ఫర్హత్ బానో, ఇద్దరన్నదమ్ములతో కలిసి ఆమెను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వనేలేదు. పేదరికంలోకి తోసేసింది. తన ప్రేమను పొందేందుకు, మదీహా పేదరికాన్ని స్వీకరించింది. ఈ పేదరికమే ఆమెను పొట్టన పెట్టుకుంది. ఫర్హత్ బానో తన తప్పులకు శిక్షననుభవించింది. వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ, జీవితాంతం పెళ్ళాడకుండానే ఉండిపోయింది.
ఫర్హత్ బానో చనిపోయిన తరువాత నూర్ మంజిల్‌లో అంతవరకూ ఉన్న ఉదాసీనత, కర్పూరంలా కరిగిపోయింది. ఇద్దరన్నదమ్ములూ ఊపిరి పీల్చుకున్నారు హాయిగా! ఆమె చనిపోవటం బాధాకరమే ఐనా, ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ ఉండే అశాంతి నుండీ బయటపడ్డామన్న నిశ్చింతే గొప్పదిగా అనిపించింది. ఎన్నోసార్లు, మాటల అవసరం లేకుండా చూపులతోనే ఫర్హత్ బానో ఇంట్లో తుఫాన్లు తెప్పించేది. ఫహీం బఖ్ష్ భార్య, ఫర్హత్ బానో మాటలు విని కూడా మౌనంగానే ఉండేది కానీ, గులాం బఖ్ష్ భార్య తోనూ, రుక్న్ బీ తోనూ ఫర్హత్ గొడవెప్పుడూ ఉండేది.
ఫర్హత్ చనిపోయిన తరువాత నలభై రోజులైపోయాయి. నూర్ మంజిల్‌కు సున్నాలు వేయించారు. ఫర్హత్ బానో గదిలోని సామానంతా బైటికి తీశారు. ఆమె పెళ్ళికోసం వాళ్ళమ్మ ఆమెకు చేయించిన నగలన్నీ ఆమెకే ఇచ్చేశారప్పుడెప్పుడో! లక్షల విలువ చేసే యీ నగల పెట్టెను తన దగ్గరే దాచుకుని జీవితం గడిపింది. వాటిని వాడకుండానే వెళ్ళిపోయింది. వాటినలాగే బ్యాంక్ లాకర్‌లో పెట్టేశారు, సాబిర్ కాబోయే భార్యకు అవి పనికొస్తాయని!
ఫర్హత్ బానో చనిపోయిన తరువాత, నూర్ మంజిల్‌లో సాబిర్ పెళ్ళి ప్రస్తావనలకు శుభారంభమైంది.
***
నూర్ మంజిల్‌లో డబ్బుకెప్పుడూ కొదువుండేదే కాదు. ఖవ్వాల్ ఉస్తాద్ జహూర్ బఖ్ష్ పాట్నాలో నూర్ మహల్ ఎప్పుడైతే కట్టించారో, అప్పటినుంచీ ఇప్పటిదాకా కూడా అల్లా దయ అలాగే ఉంది. నూర్ సరాయ్ వంశానికి చెందిన ఆస్తితో పాటూ, సంగీత నిధిని కూడా అప్పగించి వెళ్ళారాయన. దాని వల్ల కూడ మరింత సంపద చేకూరింది. ఇటీవల గులాం బఖ్ష్, సాబిర్ ఇద్దరూ నూర్ సరాయ్‌కి తరచూ వెళ్ళి రావటం జరుగుతూనే ఉంది. మెల్లి మెల్లిగా భూమి అమ్మకం విషయం కూడా ఒక కొలిక్కి వస్తూంది. ఎక్కువ మంది కొనుగోలుదార్లు, సాబిర్ తోనే మాట్లాడుతున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం, ధర చెల్లించటంతో పాటూ, విడిగా వేరే డబ్బు కూడా కానుక రూపంలో ముట్టజెప్పుతున్నారు. ముందైతే సాబిర్‌కు ఇబ్బందిగానే అనిపించినా, తరువాత ‘అసలు ధరను తగ్గించకుండా, వేరేగా తనకు వాళ్ళే అడక్కుండా ఇస్తున్నప్పుడది అన్యాయపు సొమ్మెలా అవుతుంది?’ అని ఆలోచించి, తీసుకోవటం మొదలెట్టాడు. భూముల అమ్మకం విషయంలో తానూ కాస్త వెనకేసుకున్నాడు సాబిర్. కలలో కూడా ఇలా తాను చేయగలనని సాబిర్ అనుకోనే లేదు. తన ఖర్చులకోసం డబ్బు లేకపోవడమంటూ ఎప్పుడూ ఉండేది కాదు కానీ, ఒక పద్ధతిగా డబ్బు యీ వ్యవహరాల్లో దక్కుతూనే ఉందతనికి! ప్రతి కార్యక్రమం తరువాత అందరికీ నియమానుసారం ఇవ్వబడే విధంగా ఇక్కడా అదే పద్ధతి. మొత్తం లావాదేవీలు పూర్తైన తరువాత మిగిలే డబ్బును మామయ్యలూ, అత్తయ్యలకిచ్చేసేవాడు సాబిర్. డబ్బు పెద్ద మొత్తంది కాకపోతే మళ్ళీ వాళ్ళు ఆ డబ్బును సాబిర్‌కే తిరిగి ఇచ్చే సేవాళ్ళు. తిండీ, తిప్పలకు కొదువే ఉండేది కాదు. అతని ఖర్చంటూ ఏమైనా ఉందీ అంటే, అది హసీన్ మియ్యాకు మందు బాటిళ్ళకిచ్చే డబ్బూ, కనౌజియా సేఠ్‌కు సెంటు బాటిళ్ళకోసం ఇచ్చే డబ్బూ! ఇటీవల సాబిర్, పెద్ద మామయ్య లాగా, కివాం వేసిన మగహీ పాన్ వేసుకోవటం మొదలెట్టాడు. సుల్తాన్ గంజ్ లోని అన్నిటికంటే పెద్ద దుకాణం మగన్ చౌరసియా పాన్ దుకాణమే! అక్కడ కూడా ఉస్తాద్ నూర్ బఖ్ష్ మనుమడు సాబిర్ అలీ బఖ్ష్ కొక గుర్తింపు ఏర్పడింది.
ఒక రోజు సాబిర్, అలీ బఖ్ష్ మామయ్యతో కూర్చుని, మియా కీ మల్‌హార్ రాగ సాధన చేస్తున్న సమయంలో సాబిర్ పెద్దత్త వచ్చి కూచున్నారు. మామూలుగా సంగీత సాధన సమయంలో ఎవరూ రారు, ఒక్క గులాం బఖ్ష్ తప్ప! ఉస్తాద్ ఫహీం బఖ్ష్ భార్య వైపోసారి, ఏంటి సంగతి అన్నట్టు చూశారు. ఆమె ఏమీ జవాబివ్వకుండా కూర్చునే ఉన్నారు. తరువాతాయన, సాధన ఆపి, ‘చెప్పండి..’ అన్నారు, సంభాషణను ప్రారంభిస్తూ!
‘చాలాసేపయిందా ఏమిటి?’
‘సంగీతాభ్యాసానికి తొందరా, ఆలస్యం రెండూ ఉండవు. పెద్ద ఆలస్యం కాదుగానీ, మరో విషయంలో ఆలస్యమే అవుతూ ఉంది.’
‘ఏ విషయం లో?’
‘టిఫిన్ తయారయింది. తీసుకుందాం. తరువాత మాట్లాడదాం.’
‘చెప్పండి. టిఫిన్ రోజూ చేస్తూనే ఉంటాం కదా! ఈ రోజూ చేస్తాం.’ నవ్వుతూ అన్నారాయన.
‘ఈ ఇంటికో పెళ్ళికూతురు కావాలి.’
‘రెండో పెళ్ళి చేసుకుని అనుభవిస్తున్నాము. ఇప్పుడిక మూడో పెళ్ళి కూడా చేసుకుని, ఇబ్బంది కొని తెచ్చుకోవాలా? ఈ వయసులో అదే పొరపాటు మళ్ళీ చేయము మేము.’
‘హాయ్ అల్లా! మీరు కూడా..!’ ఉస్తాద్ ఫహీం బఖ్ష్ గారి భార్య నవ్వేసి, సాబిర్ వైపు చూస్తూ అన్నారు, ‘సాబిర్ మియ్యా పెళ్ళి సంగతి ఆలోచించమంటున్నామండీ! అన్నదమ్ములిద్దరూ కళ్ళు మూసుకుని కూర్చునున్నారు.’
‘ఈ బాధ్యత మీరూ, మున్నా మియ్యా చూసుకోండి. మేము యీ పని మీద బయలుదేరితే ఖాళీ చేతులతోనే వస్తాం. మీకు తెలుసు ఇలాంటి విషయాల్లో మా తెలివితేటలెలాంటివో!’
మియా కీ మల్‌హర్ చర్చ అక్కడే ఆగిపోయింది. రే మా రే సా మ రే ని ధ నిసా తో ఆరోహణైతే అయింది కానీ అవరోహణ సా ని ప మ ప గ మ రే సా బాకీ ఉండిపోయింది. టిఫిన్ మేజా మీద పరాఠా ముక్కలో గుడ్డు పచ్చ సొన చేర్చి, నోట్లో పెట్టుకుంటూంటే, అమీనా గుర్తుకొచ్చింది సాబిర్‌కు!
టిఫిన్ పూర్తి చేసి, సాబిర్ అలీ బఖ్ష్ మగన్ చౌరసియా దుకాణం దగ్గరికి వచ్చాడు. మగహీ పాన్ బీడాను నములుతూ, తెగిన గాలిపటంలా ఎగురుతూ రసీదన్ ముంగిట్లో వాలాడు.
***
చైత్ర మాసపు చివర్లో ఎండ! గాలిని కూడ బిగించేసి, తన తాపంతో ఇబ్బంది పెడుతూంది. ఇదివరకెప్పుడూ ఇంతటి వేడి చూడలేదంటున్నారందరూ! కబ్రిస్తాన్ దక్షిణపు గోడ పడిపోవటంతో, ఆవారాగా తిరిగే పశువులన్నీ కబ్రిస్తాన్ లోకి వచ్చేసి, చెట్ల కింద నీడలో హయిగా పడుకుంటున్నాయి. దీన్నాపటం ఎవరికీ సాధ్యం కావటం లేదు.
సాబిర్ అలీ బఖ్ష్ ముందు ఫజ్లూ గదిలోకెళ్ళాడు. గదిలో ఏదో వింత వాసన! ఫజ్లూ కాళ్ళు ముడుచుకుని, ఒక మూటలాగా పక్కమీద పడున్నాడు. చాలా బలహీనంగా ఉందతని శరీరం. అతన్ని చూసి, సాబిర్‌కు షాకయింది. గుండె గొంతులోకి వచ్చినట్టయింది. ఫజ్లూ, ఫజ్లూ.. అని పిలిచాడు.
బరువైన కళ్ళు తెరిచే ప్రయత్నం చేశాడు ఫజ్లూ. ఒక క్షణం కళ్ళు తెరిచాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాయి. అటుకేసి తిరుగుతూ, ఫజ్లూ, సాబిర్‌ను కూచోమని సైగ చేశాడు.
సాబిర్ కూచున్నాడు.
గదిలోని వాసన అతన్ని ఇబ్బంది పెడుతూంది. ఫజ్లూ ఏమీ మాట్లాడలేక పోతున్నాడు. సాబిర్ కూడా అంతే. కాసేపక్కడే కూచున్నాడు సాబిర్. ‘ఇప్పుడే వస్తాను అత్తను కలిసి..’ అని చెప్పి గదిలోనుంచీ బైటికొచ్చాడు.
ఇంటి దగ్గరికొచ్చాడు. పర్దా మారింది. ముందైతే ఫజ్లూ, ఏదో సినిమా పోస్టర్ తాలూకు ఫ్లెక్స్ తెప్పించి పరదాగా వేలాడదీసేవాడు. ఇప్పుడు పెద్ద పెద్ద పువ్వుల ప్రింటున్న పరదా. కాసేపు తదేకంగా ఆ పరదాను చూశాడు సాబిర్. తరువాత పరదా తొలగించి, లోపలికి అడుగు పెట్టాడు, కాస్త తటపటాయిస్తూ! అమీనా వంట చేస్తూంది. రసీదన్ వరండాలో కూర్చునుంది. ఒకప్పుడు సాబిర్‌కు ఒక అద్భుత ప్రపంచమా చోటు! ఇప్పుడక్కడ ఓ రకమైన నీరవత! గోరీల నుంచీ ఏడుపులూ, కేకలతో నిండిన గాలి, నీరవతనక్కడ నింపుతున్నది. ఇక్కడికొచ్చిన తరువాత మొట్టమొదటి సారి, సాబిర్ మనస్సు కంపించింది. ఇది భయమో, దుఃఖమో తెలియలేదతనికి. కబ్రిస్తాన్ లోని చెట్లనుంచీ ఒక బూడిద, నలుపు రంగు రెక్కల గద్ద, ఎగిరి వచ్చి, అక్కడి కుళాయి మీద ఒక క్షణం కూచుంది. అమీనా దానికేసి చూసింది. వెంటనే ముఖం తిప్పుకుని, పొయ్యి మీదున్న పాత్ర మూత తీసి, అందులోని సబ్జీని కలియ దిప్పింది. మసాలా దినుసుల వాసన గుప్పుమంటూ, సాబిర్ ముక్కుకు తాకింది. సాబిర్ రసీదన్ దగ్గరికి వెళ్ళి సలాం చేశాడు. రసీదన్, ‘రా, కూర్చో!’అంది.
రసీదన్ దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. ఒక లాంటి వాసన ఇక్కడ కూడా! ఫజ్లూ గదిలో పీల్చిన వాసన, ఇక్కడి మసాలాల వాసనకు కాస్త తేలిపోయింది. ఆ వాసన రసీదన్ పక్క మీద కూర్చోగానే మళ్ళీ ఒక్కసారి ఉవ్వెత్తున చుట్టుముట్టింది. సాబిర్‌ను ఇబ్బంది పెట్టింది.
‘చాలా రోజుల తరువాత గుర్తొచ్చామే?’ అతని వైపు చూడకుండానే అంది రసీదన్. సాబిర్ జవాబిచ్చేంతలోనే మళ్ళీ తానే.. ‘పోనీలే! అల్లా దయ వల్ల పూర్తిగా మర్చిపోలేదు.’ అనేసింది.
‘ఎలా ఉన్నావత్తా?’
‘అత్త యేదన్నా స్వర్గంలో ఉందా ఏంటి? అప్పుడెలా ఉన్నామో, ఇప్పుడూ అలాగే ఉన్నాం. నువ్వు చెప్పు. ఎలా ఉన్నావ్? ఏంటి విశేషాలు? సాబిర్ బాబుకు చాయ్ ఇవ్వు అమీనా!’ ఒక గాఢమైన నిట్టూర్పు వదిలి అంది రసీదన్.
‘పాలు లేవు..’ ఎదురుచూపు, దుఃఖమూ, నిరాదరణా కొరుక్కు తిన్న తరువాత, మిగిలిపోయిన సంస్కృతి తాలూకు అస్పష్ట లిపిలాగా రాయిలాంటి ముఖంతో అంది అమీనా! నల్లని ఆల్చిప్పల్లాంటి కళ్ళ ముత్యాల రంగు పాతపడింది. సాబిర్ వెళ్ళిపోయిన తరువాత, కన్నీళ్ళు కార్చినన్నాళ్ళూ ఆ కళ్ళల్లో తడి ఉండి మెరుస్తూ ఉండేవి. ఆ తడి పూర్తిగా ఆరిపోయాక వాటిలోని మెరుపు మాయమైంది. బూడిద రంగులోకి మారిపోయాయి.
‘పాలు లేకుండానే చెయ్యి, పోనీ రాధే దగరినుంచీ పట్టుకు రా!’
‘పొయ్యిలో నిప్పుల్లేవు. చాయ్ చెయ్యలేము.’ అంటూ, అమీనా అక్కడినుంచీ బైటికి వెళ్ళిపోయింది.
వెళ్తున్న అమీనాను పరీక్షగా చూశాడు సాబిర్. ముందుకంటే ఇప్పుడు చిక్కిపోయింది. నడుము కిందిదాకా వస్తూ ఉండిన జడ ఇప్పుడు నడుము పైదాకానే ఉండిపోయింది. భుజాలు కాస్త వంగాయి. పాదాల లయ కూడా తప్పినట్టుంది. సాబిర్ మియ్యా చూపులిప్పుడు అన్నింటిలో శ్రుతి, లయ, తాళాలను వెదుకుతున్నాయి. వెళ్ళిపోతున్న అమీనాను చూస్తూ ఆమె గురించి ఆలోచిస్తున్నంతలో, ఆమె, తిరిగి వచ్చింది, రెండు చాయ్ గ్లాసులతో! ఒకటి సాబిర్‌కూ, ఇంకోటి అమ్మకూ ఇచ్చింది.
‘నువ్వు తాగవా?’ అడిగాడు సాబిర్.
అమీనా మాట్లాడలేదు.
రసీదన్, సాబిర్ మౌనంగా చాయ్ తాగిన తరువాత సాబిర్ అన్నాడు, ‘ఫజ్లూను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారా అత్తా?’
‘ఆ.. ఎముకల ఆస్పత్రిలో! అక్కణ్ణించే మందులు తెస్తున్నాం.’
‘బుద్ధమూర్తి దగ్గరిదేనా?’
‘ఆ..”
‘ఎవరైనా డాక్టర్‌కు చూపించత్తా! ఎముకల మందులతో తగ్గేది కాదిది! ఫజ్లూ పరిస్థితేమీ బాగలేదు.’ దిగులుగా అన్నాడు సాబిర్.
రసీదన్ ఏమీ మాట్లాడలేదు. ఏమంటుందసలు? ఇంటి పరిస్థితేమీ బాగలేదు. అతనికి తెలియనిదా పోనీ?
‘ఏమీ అనుకోకపోతే ఒక మాటత్తా!’
‘చెప్పు బాబూ!’
‘నా దగ్గర కొంత డబ్బుంది. అది తీసుకుని ఎవరైనా వేరే డాక్టర్‌కు ఫజ్లూను చూపించు.’
సాబిర్ ఇలా అన్నాడో లేదో, అమీనా గర్జించింది, ‘దానం చేసేందుకొచ్చావా సాబిర్ మియ్యా? బిచ్చమెయ్యొద్దు మాకు! దానమడగటం మా వృత్తే కానీ బిచ్చగాళ్ళనుంచీ కాదు. నువ్వే వేరేవాళ్ళ ఇంటి మీద పడి బతుకుతున్నావ్! బాగా పొగరెక్కింది నీకు! ఇక్కణ్ణించీ వెళ్ళిపో! అక్కడికెళ్ళి ఎముకలు నాకు వాళ్ళవి! చచ్చిపోనీ ఫజ్లూనిలాగే! వాడు బతికున్నా చచ్చిపోయినా నువ్వేమీ బాధపడనక్ఖర లేదు. నీ బతుకేదో నువ్వు చూసుకో, మా బతుకులు మమ్మల్ని బతకనియ్యి! ప్రతిరోజూ చావుతోనే కలిసి బతుకుతాం మేము. చావంటే భయం లేదు మాకు! చావును చూపించి మమ్మల్ని భయపెట్టకు! మళ్ళీ రాకు మా ఇంటికి!’
ముంగిట్లో మధ్య నిల్చుని అరుస్తూంది అమీనా. వెక్కి వెక్కి ఏడుస్తూంది. శరీరమంతా వణికిపోతూంది. రసీదన్ లేచి, అమీనా దగ్గరికెళ్ళి, తనను కౌగిలించుకుంది. వీపు నిమురుతూ ఉండిపోయింది. తన కొంగుతో ఆమె ముఖం తుడిచింది. అమీనా లోని బాధాగ్ని ఎలాంటిదో రసీదన్‌కు తెలుసు. దాన్ని ఆర్పివేయటం ఎవరి తరమూ కాదు. అమీనా మాటల్లో, ఆమె గొంతుకూ పెదవుల కూ మధ్య ఆమె కలల శవాలున్నాయ్. ఆమె చుట్టూ ఒక ఖాండవ వనమే ఉందిప్పుడు, మండుతూ, జ్వాలలతో కబళిస్తూ, బూడిద చేస్తూ!
సూర్యుడు నడినెత్తినున్నాడు. తీక్షణమైన కిరణాలతో వేధిస్తున్నాడు. ఉన్నట్టుండి అమీనా కళ్ళల్లో నీలి నీడలు! కుమ్మరి చక్రం మీద మట్టి ముద్దలా నుదురు నాట్యమాడింది. దభీమని నేల మీద కూలిపోయింది అమీనా. రసీదన్ తనను సంబాళించే ప్రయత్నం చేస్తూంది. అమీనా కళ్ళు మూతపడి ఉన్నాయి. ఆమె కళ్ళకైతే ఎటు చూసినా చీకటే చీకటి! ఈ లోగా ఆమె చెవుల్లో ఏదో సన్నని పిలుపు! ‘తల్లీ! నా తల్లీ!’అని!
కలకండ తీపి నిండినదా పిలుపు.
ఆమె మూసిన కళ్ళముందో ఆకారం ప్రత్యక్షమైంది.
దాతా పీర్ మనిహారీ. మనిహారీ, అలంకరణ వస్తువులన్నీ ఉంచిన బుట్ట పట్టుకుని నిల్చుని ఉన్నారు.
రసీదన్ సైగ చేయగా సాబిర్ లేచాడు. నీళ్ళు తీసుకుని వచ్చాడు. మెల్లి మెల్లిగా అమీనా కళ్ళు తెరిచింది. రసీదన్ ఆమెను హత్తుకుంది.
అమ్మ గుండెలకు హత్తుకుని ఉన్న అమీనా ఏడుస్తూనే ఉంది. ఆమె వెక్కిళ్ళ వలయంలో చిక్కుకుని ఉన్న ఉస్తాద్ నూర్ బఖ్ష్ మనుమడు సాబిర్ అలీ బఖ్ష్ వరండాలో మౌనంగా ఆమెనే చూస్తూ నిలుచుని ఉన్నాడు.
(సశేషం)