దాతా పీర్-7

0
1

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[రాత్రంతా మద్యం తాగి ఫజ్లూ గదిలో నిద్రపోయిన సాబిర్‍కు హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఓ కల వల్ల అతని నిద్ర చెడిపోతుంది. ఆ కలలో ఎవరో తన వద్ద నుంచి తన తండ్రి షెహ్నాయి ఉన్న ముఖ్మల్ సంచీ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు. నెమ్మదిగా తన గదికి వెళ్ళి తలుపు కొడతాడు. ముసలావిడ వచ్చి తలుపు తీస్తుంది. లోపలికి వచ్చిన సాబిర్ బిల్కీస్ ట్రంకు పెట్టె తెరచి, ఒక్కో వస్తువునూ బయట పడేస్తూ, పెట్టంతా వెతికి ముఖ్మల్ సంచీని వెలికితీస్తాడు. దాన్ని హత్తుకుని ఏడుస్తాడు.  అతని వెనుకే వచ్చిన ముసలావిడ సాబిర్‍ని ఓదారుస్తుంది. అక్కడే అలాగే నిద్రపోయిన సాబిర్‍ని వదిలి ఆవిడ వెళ్ళిపోతుంది. తెల్లవారాకా మెలకువ వచ్చిన సాబిర్, ముఖ్మల్ సంచీని, చిందరవందరగా పడి ఉన్న పెట్టెలోని సామాన్లనీ చూసి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటాడు. లేచి, స్నానం చేసి తయారై రసీదన్ ఇంటి వైపు వెళ్తాడు. దూరంగా అమీనా కనబడేసరికి బయటకు రమ్మని సైగ చేస్తాడు. ఆమె వచ్చాకా ఆమెతో కలిసి సబ్జీబాగ్ దాటి చిక్‍పట్టీ వైపు వెళ్తారు. దారిలో ఒక యకూఫ్ మియ్యా కొట్లో టీ తాగుతారు. తరువాత నాజ్ హోటల్లో శోర్బా మటన్, ఒక ప్లేట్ ఖమీరీ రోటీలను శోరబాలో ముంచుకుని తింటారు. వెళ్ళిపోయేటప్పుడు రెండు ప్లేట్ల మటన్, రెండు రోటీలు పార్శిల్ కట్టించి, ఇంటికి వెళ్ళి అన్నం మాత్రం వండుకో చాలు అని చెప్తాడు సాబిర్. ఇంటికి వచ్చాకా, ఎక్కడికిపోయావ్ అని రసీదన్ అడిగితే, జరిగినదంతా చేప్పి, అన్నం వండడానికి ఉపక్రమిస్తుంది అమీనా. నిన్న రాత్రి రాధే – ఫజ్లూ, సాబిర్‍ను కలిసేందుకు వచ్చాడనీ, వాళ్లు ముగ్గురూ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నారనీ చున్నీకి తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా బబ్లూకి హాని చెయ్యాలని చూస్తున్నారని గ్రహిస్తుంది. అందుకని రాధే భార్య బబితతో తన గోడు వెళ్ళబోసుకుంటుంది. ఒకప్పుడు బబితకి చున్నీ ఎంతో సహాయం చేసి ఉండడం వల్ల, బబిత ప్రత్యుపకారం చేయడానికి సిద్ధమవుతుంది. రాధే చాయ్ దుకాణంలో కొందరు చేరి బబ్లూ విషయంమై చర్చలు జరుపుతుంటే హఠాత్తుగా అక్కడికి బబిత వెళ్తుంది. వాళ్లందరి ముందే మొగుడిని గట్టిగా హెచ్చరిస్తుంది. పది రోజుల తర్వాత చున్నీని కలవడానికి వస్తాడు బబ్లూ. ఇద్దరూ ఓ సమాధి మీదున్న చలువరాయి చప్టా దగ్గర కూర్చుని సరసాలాడుకుంటారు. వాళ్ళ మాటలు రసీదన్‍కీ, అమీనాకీ వినబడుతున్నా, ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు. వాళ్ళిద్దరూ నిద్ర నటిస్తున్నారనీ చున్నీకి తెలుసు. – ఇక చదవండి.]

అధ్యాయం-7-మొదటి భాగం

[dropcap]చ[/dropcap]లి ఉదయం. పెద్దగా శబ్దిస్తూ వచ్చిన గాలి, చల్లదనపు కత్తులు దింపి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఎండ కూడా ఉంది. నిద్ర పోతున్నదానిలా తూగుకుంటూ, సత్తా లేని వెచ్చదనాన్నిస్తూంది. కబ్రిస్తాన్‌లో బూరుగు చెట్ల మీద తెల్ల రెక్కల ప్రవాస పక్షుల గుంపులు తెగ గొడవ చేస్తున్నాయి. ఒక దాని ముక్కు మీద మరొకటి రాస్తూ, అరుస్తున్నాయి. కొన్ని ఎగిరెగిరి, మసీదు మీనార్ మీదున్న లౌడ్ స్పీకర్ మీద కూర్చుంటున్నాయి. రెక్కలు పటపట కొట్టుకుంటూ, మళ్ళీ ఎగురుకుంటూ చెట్ల మీదకి చేరుకుంటున్నాయి.

పొద్దుటి పనులు ముగించుకుని రసీదన్, కబ్రిస్తాన్ గేట్ దాటి వచ్చింది బైటికి! రాధే దుకాణంలో చాయ్ తాగింది. రాధే ఏమీ మాట్లాడలేదు. ఎప్పటిలాగా అత్తా అత్తా అని గోముగా పిలవలేదు. తన పనిలో తానున్నాడు. రసీదన్ కూడా ఏమీ మాట్లాడలేదు. చాయ్ తాగి ఏమీ మాట్లాడకుండానే దుకాణం నుండీ బైట పడింది. కానీ కబ్రిస్తాన్ లోకి పోలేదు. సందు మలుపు దాటి దల్దలీ రోడ్డులో మీదుగా అబ్దుల్ బారీ రోడ్డులో గాంధీ మైదాన్ మలుపువైపు నడిచింది.

షాహ్ అర్జా దర్గాకు వెళ్దామని ఆమె ఉద్దేశం. కొన్ని నెలల తరువాత పీర్ ముహానీ నుంచీ బైటపడిందామె. ఫజ్లూ దగ్గరికి మొబైల్ వచ్చిన తరువాత, ఎవరైనా చనిపోయిన సమాచారం వెంటనే వచ్చేస్తుంది. ఇక తరువాతి కార్యక్రమాల కోసం ఇప్పుడెక్కడికీ వెళ్ళాల్సిన అవసరం ఉండటమే లేదు. ఫజ్లూ ఫోన్ మీదే ఆర్డరిస్తాడు. సామానంతా వచ్చేస్తుంది. ఫోన్ లేనప్పుడు సబ్జీ బాగ్ చుట్టు తిరగాల్సే వచ్చేది. ఇంతకు ముందెప్పుడూ షాహ్ అర్జా దర్గాకు వెళ్ళలేదామె.

టెంపో స్టాండ్‌లో ఒకటే సందడి. ఇక్కడినుండీ పాట్నా లోని ప్రతి ప్రాంతానికీ టెంపోలు దొరుకుతాయి. పాట్నా సీటీలోకి వెళ్ళే టెంపోలో ఎక్కి, ‘పథర్ మస్జిద్‌కు వెళ్ళాలి బాబూ!!’ అంది.

‘కూర్చో పిన్నీ’ అన్నాడా యువకుడు.

‘షాహ్ దర్గా కూడా అక్కడే కదా బాబూ?’ అడిగింది రసీదన్.

‘షాహ్ అర్జా దా?’

‘ఔను బాబూ.’

‘దగ్గరే అక్కడికి. కాస్త ముందుకెళ్ళి దక్షిణం వైపు తిరగాలంతే!’

టెంపో అబ్బాయి మాటలతో రసీదన్‌కు ప్రాణం లేచొచ్చింది. టెంపోలో సీట్లన్నీ నిండేందుకు కాచుకుని ఉన్నాడతను. రసీదన్ ఆలోచనల్లో మునిగి పోయింది. ‘తాను వెళ్ళటమైతే బాగుంది, కానీ తన సొంత అమ్మ తమ్ముడి కొడుకు పేరేమిటో కూడా గుర్తు లేదసలు. ఎవరిని ఏమని అడగాలో మరి? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, అతణ్ణి కలిసి! చాలా చిన్న వయసులో చూసిందంతే. ఇన్ని సంవత్సరాల తరువాత, ఇదిగో, ఇప్పుడు! దానికి తోడు అతని ఫకీరు వేషమూ!!’

టెంపో రిక్షా అబ్బాయి, రసీదన్‌ను పత్థర్ కీ మస్జిద్, షాహ్ అర్జా దర్గా సందు మధ్యలో దింపుతూ ‘పిన్నీ! ఆ సందు ముందుంది. నేరుగా లోపలికి వెళ్ళిపోయి, కుడి వైపుకి తిరుగు. అక్కడెవరినైనా అడుగు. ఒక శ్మశానముంది. దానికి దగ్గరే ఉంది దర్గా.’

రసీదన్ తన కొంగు చివర ముడి విప్పి డబ్బిచ్చి, ఏమీ మాట్లాడకుండా మమత నిండిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పిందతనికి. టెంపో అబ్బాయి ముందుకెళ్ళిపోయాడు.

రసీదన్ నలువైపులా చూసింది. చాలా సంవత్సరాల కిందట, తన తాత, కాలే ఫకీర్‌తో పాటూ, టంటంలో ఎక్కి, ఇక్కడికి వస్తుండేది. అప్పుడు తాను చాలా చిన్నది. ఇప్పుడీ ప్రాంతం గురించి అసలేమీ గుర్తు లేదు కూడా!

ఆమె నిలబడిన చోటుకు కుడి వైపు పత్థర్ కీ మస్జిద్ ఉంది. ఎడమ వైపు దర్గాకు వెళ్ళే దారుంది.

16వ శతాబ్దం పూర్వార్ధంలో జహంగీర్ కొడుకు రాకుమారుడు పర్వేజ్ షాహ్ బిహార్ పాలకుడయ్యాడు. తన వద్ద పని చేసే సిపహ్ సాలార్ మొహమ్మద్ నజర్ ఖాన్ పర్యవేక్షణలో యీ నగరాన్ని నిర్మించాడతను. షాహ్ అర్జా, జహంగీర్ సమకాలికుడు. అతడు కవి. హిందుస్తాన్‌కు వాయవ్యంలో ఉన్న పఖ్తునిస్తాన్ దేశం నుంచీ వచ్చాడు. పత్థర్ మస్జిద్‌కు ఈశాన్యం వైపున భవానీపుర్‌కు చెందిన వైష్ణవ మఠముండేది. సరిగ్గా దానికి ఆనుకుని దక్షిణంగా ఒక బౌద్ధ స్థూపం. ఇప్పుడు ఆ మఠమూ లేదు, బౌద్ధ స్థూపమూ లేదు. ఆ స్థూపం ఉన్న చోటే శవాలను పాతిపెట్టేవాళ్ళు. రాను రాను, ఇది కబ్రిస్తాన్‌గా మారిపోయింది. ఈ శ్మశానంలోనే షాహ్ అర్జా, మకాం వేశాడు. ముందెప్పుడో తాను వచ్చినపుడు, ముందుగా హజ్రత్ మఖ్దూం షర్ఫుద్దీన్ యహయా మనేరీ వంశానికి చెందిన హజ్రత్ షాహ్ దౌలత్ మనేరీకి, మనేర్‌లో తనకు ఉండాలని ఉందని సందేశం పంపించాడు. షాహ్ దౌలత్ జవాబిచ్చాడు. ‘దౌలత్ ఉన్నచోట అనుమతెందుకు?’ అని! ఆ తరువాత షాహ్ అర్జా ఇక్కడే ఉండిపోయాడు. ఇక్కడుండే చాలా గేయాలు రాశాడు. ఇక్కడే ఖాన్ కాహ్ దర్గాను నిర్మించాడు. ఇక్కడి మట్టిలోనే కలిసిపోయాడు. అయన సమాధి మీదున్న ఫలకం మీద యీ వివరాలన్నీ వ్రాసి ఉన్నాయి.

రసీదన్ వీధిలోకి తిరిగింది. ఎవరినీ అడగకుండా కాస్త దూరం నడిచింది. అలా నడుస్తూ ఉండగానే కబ్రిస్తాన్ కనిపించింది. లోపలే దర్గా ఉంది.

ఈ ప్రాంతం మొత్తంలో వేరే దర్గాలు కూడా ఉన్నాయి. చాలా పాత భవనాలు కూడా ఉన్నాయి. అప్పట్లో అవి చాలా బాగుండే ఉంటాయి, అందరి దృష్టినీ ఆకర్షిస్తూ!! ఇక్కడే చాలా పెద్ద ఈద్ గాహ్ ఉండేది. షియా ఇమాంబాడా కూడా ఉండేడి. ఒక మసీదు అప్పుడూ, ఇప్పుడు కూడా ఉంది. దాన్నిప్పుడు జామా మస్జిద్ అంటున్నారందరూ!! షాహ్ అర్జా మసీదు మీద పెద్ద గుంబజ్ ఉంది. దాన్ని వాళ్ళ ఉత్తరాధికార వంశస్థుడొకరు నిర్మించాడు. దర్గా గోడలు, బంగారు రంగులో ఉంటాయి. గుంబజ్ తెల్లరంగులో ఉంటుంది. దాని కింది భాగంలో ఎరుపు, బంగారం రంగులో పట్టీలున్నాయి. షాహ్ అర్జా అనుచరుణ్ణి అర్జా షాహీ అని పిలిచేవారు.

***

షాహ్ అర్జా దర్గాలో తల మీద ముసుగు కప్పుకుని మోకాళ్ళమీద కూర్చుంది రసీదన్. పైన పన్నెండు స్తంభాల పైకప్పుంది. ఆ స్తంభాల డిజైన్లతో కూడిన అరచేతంత వెడల్పు జాలీ ఉంది. సల్మా, నక్షత్రాలూ కుట్టిన ఆకుపచ్చ దుప్పటి కప్పుకుని తన సమాధిలో నిదురపోతున్నాడు కవి, ఫకీరు షాహ్ అర్జా. వెలిగి ఆరిపోయిన అగర్ బత్తీల మందమైన సువాసనా, ఒక పెద్ద పాత్రలో వెలుగుతూ ఉన్న గుగ్గిలం సాంబ్రాణి సుగంధ ద్రవ్యాల గంధమూ, నలుదిక్కులా వ్యాపించి ఉన్నాయి. అడవి గులాబీల్లాంటి చిన్న రెక్కల పూలు కొన్ని, ఆకుపచ్చ దుప్పటి మీద పరచి ఉన్నాయి. మసీదు దగ్గర యీ సమయంలో ఎవరూ లేరు. దర్గా దగ్గర ఒక ముసలి రోజ్ వుడ్ చెట్టు, ఇంకొక పెద్ద మర్రిచెట్టూ ఉన్నాయి. మర్రిచెట్టు నలువైపులా ఒక వేదిక అక్కడే మునిసిపాలిటీ కుళాయి ఉంది.

ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండే యీ చోటేందుకో ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంది. గాలీ, ఎండా, కాస్త చలీ మాత్రమే ఉన్నాయి. రాగి చెట్టు మొదట్లో తొర్రలోనుండీ పిట్ట పిల్ల ఉండుండి ఆశ్చర్యంగా చుట్టుపక్కల చూస్తూ ఉంది.

సమదూ ఫకీర్ వచ్చాడు. ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టున్నాడు. దర్గా బైట పాలరాయితో చేసిన చిన్న పీట ఉంది. దాదాపు ఒక అడుగు ఎత్తున్న యీ పీట మీద లతలూ పూలూ చెక్కి ఉన్నా, అవి వాడకం వల్ల ఇప్పుడు వెలిసిపోయి, రేఖామాత్రంగా ఉన్నాయి. దీని కాళ్ళు కూడా అలాగే అందంగా చెక్కబడి ఉన్నాయి. పీట దగ్గర పాత్రలో ఉన్న నీళ్ళతో ఫకీరు వజూ చేసి దర్గా లోకి ప్రవేశించాడు.

ముందుగా మసీదు దగ్గర కూర్చుని ఉన్న స్త్రీని చూసి ఆశ్చర్యపడి, తరువాత కళ్ళు మూసుకుని అస్పష్ట స్వరంలో ఏదో గొణుక్కుంటూ తన రెండు అరచేతులనూ ముఖం పైనుంచుకుని సమద్ ఫకీర్ అన్నాడు, ‘అల్హమ్దులిల్లాహ్!!’

రసీదన్ ఆయన్ను రెప్పవేయకుండా చూస్తూంది. తననే చూస్తున్న ఆమెను ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడాయన, ‘మీరెక్కడినుంచీ వచ్చారమ్మా?’ అని.

రసీదన్ సమాధానమేమీ ఇవ్వకుండా ఆయన్నే చూస్తూ ఆలోచిస్తూ ఉంది, ‘మేనమామ కొడుకుకు కూడా మేనమామ లాగా పొడవైన దేహం, గొంతూ, విశాలమైన ఛాతీ ఉన్నాయి. తాతయ్య నల్లటి జుబ్బా వేసుకునేవాడు. ఇతను తెల్ల జుబ్బా వేసుకున్నాడు. నల్లని రింగుల జుట్టూ, నుదుటిమీద వాలే వెంట్రుకలూ, నల్లటి దట్టమైన గడ్డమూ, మీసాలూ!! తెల్లని ముఖమ్మీద పాము పిల్లల్లా చెక్కబడిఉన్న కళ్ళలో దిద్దుకున్న సుర్మా! ఆశ్చర్యం!’

సమదూ ఫకీర్ ముందున్నదర్భలతో అల్లిన చాపమీద కూర్చుని అడిగాడు, ‘మీరు చెప్పనేలేదమ్మా ఇంకా!!’

‘పీర్ ముహానీ గోరీల గడ్డనుంచీ వచ్చానయ్యా!! నా పేరు రసీదన్. అబ్రార్ మామ కొడుకేనా నువ్వు?’ రసీదన్ గొంతు గద్గదంగా ఉంది. కళ్ళు వర్షిస్తున్నాయి.

సమదూ ఫకీర్ కళ్ళూ చెమర్చాయి. ‘అత్తయ్యా?’

‘నేను నీకు గుర్తున్నానా?’

‘అత్తయ్యా! మొత్తం ప్రపంచాన్ని గుర్తుంచుకునేవాడూ, తనను తాను మర్చిపోయేవాడే ఫకీరు. అన్నీ గుర్తున్నాయి. నేనెవరినో మాత్రం మర్చిపోయాను. లా ఆలం అయిపోయాను. నా గురించి ఆలోచన లేదు. అదిగో అతని పై విశ్వాసంతో ఉంటున్నాను. అల్హమ్దులిల్లాహ్!!’

సమదూ ఫకీర్ రెండు చేతులూ చాచి ప్రార్థించాడు.

హఠాత్తుగా మెరుపేదో మెరిసినట్టు స్మృతిలోకి వచ్చింది రసీదన్. వణుకుతున్న పెదవులతో ‘సమదూ’ అంది.

తన మేనమామ కొడుకు పేరు సమదూ అని గుర్తుకు వచ్చిందామెకు! మనసులో తనను తాను తిట్టుకుంది, ఎలా తయారైంది తను? తనవాళ్ళ పేర్లే మరిచిపోయింది. కానీ మామయ్య తననెప్పుడు దగ్గరికి తీసుకున్నాడని? బంధాలూ, అనుబంధాలూ అన్నీ తెంచేసుకున్నాడు. ఆ తరువాత అతని జీవితం కూడా చిందరవందరైపోయింది. దాన్ని సరిదిద్దుతూ సరిదిద్దుతూ ఉంటే, ఇంకా ఏదేదో ఐపోయింది.

‘రండి లోపలికి, బైటే ఉన్నారెందుకమ్మా?’ సమదూ ఫకీర్ దర్గా నుంచీ బైటికొచ్చాడు, వెనకే రసీదన్ కూడా!! మర్రిచెట్టు దగ్గరున్న చప్టా మీద కూర్చుంటూ, రసీదన్‌ను కూడా కూర్చోమని సైగ చేశాడు సమద్. ‘ఎలా వచ్చారత్తయ్యా? అంతా బాగున్నారు కదా?’ అడిగాడు.

‘అంతా బాగే అనుకో!! ఈ రోజుల్లో బతుకుల్లో కష్టాలెవరికి లేవు? కానీ, అలా నడిచిపోతూ ఉందంతే, అల్లా తాలా దయ వల్ల!! మీ మామయ్య చనిపోయి చాలాకాలమయింది. ఒక కొడుకున్నాడు. చిన్నప్పుడే పోలియో వల్ల ఒక కాలు పోయింది. ఐనా వాడి ఆసరా తోనే అన్నీ జరిగిపోతున్నాయి. అల్లా తాలా వాడికి చేతుల్లో బలమిచ్చాడు. ఒంటరిగానే రోజుకు రెండు మూడు ఖననాలు చేస్తుంటాడు. ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళ దిగులే నాకెప్పుడూ!! రోజూ ఎంత బ్రదుకుతున్నామో, అంతే చస్తున్నాం కూడా!! పెద్దదాని విషయం ఫరవాలేదు. ఇల్లు చూసుకుంటుంది. చెప్పింది వింటుంది. రెండు రొట్టెలు కాల్చి పెడుతుందీ, ఇవన్నీ చేసే ఓర్పుంది తనకు! కానీ చిన్నది.. నా మర్యాద మంట గొలిపేలా ఉంది. మాటా మంచిదికాదు. మెలిగే తీరూ మంచిది కాదు. పగలూ రాత్రీ దెబ్బలాడేందుకు రెడీగా ఉంటుంది. ఎంత పొగరంటే, నా సంగతి వదిలెయ్, వాడ మొత్తంతోనూ ఇలాగే పొగరుగా తిరుగుతుంది. ఇప్పుడైతే, ఒక కసాయి కొడుకుతో ప్రేమ నడుపుతూ ఉంది. వాడలోని అందరి ముందూ, వాడితో, ఇంకేమి చెప్పగలను నేను? మేమున్న ప్రాంతమంతా హిందువులది. అందరితో కలిసి మెలిసి ఉండాలి కదా!! కాలమెలా మారిపోయిందో అందరికీ తెలుసును. కానీ ఆ పిల్లకు ఏ విధమైన భయమూ లేదు. అల్లా ఆ పిల్ల నుదుట ఏమి రాసిపెట్టాడో ఏమో మరి!! సమద్!! నీ దగ్గరికొచ్చానిప్పుడు! మా కోసం ప్రార్థించు బాబూ!! ఏదైనా ఉపాయముందేమో చూడు కాస్త..!’ రసీదన్ తన దుఖాల మూట విప్పి సమదూ ముందు పరిచేసింది.

‘ప్రేమ చాలా చిత్రమైందత్తా! అందరి నుదుటా రాసిపెట్టి ఉండదు. అల్లా తాలా దయే ప్రేమ. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. తనను కోప్పడకు. నీవు నీ బతుకు బతుకుతున్నావు. దీనిలో ఆ అమ్మాయి తప్పేమిటి? నీ జీవితానికి ఎవరినో బాధ్యులను చేయకు. తనను తన పద్ధతిలో బ్రదుకనీ!! తనను పుట్టించినందుకు ఆ కష్టానికి వెల కట్టకు. తనకు తన ప్రేమ దొరకనివ్వు. జీవితంలో ఆ ప్రేమ బాగా పండనీ!! దీనికోసం ప్రార్థించు. నేను కూడా ప్రార్థిస్తాను. అత్తయ్యా! మనం కూర్చుని ఉన్న మసీదుందే, ఇది ఒక కవిది. ఆయన జీవితాంతమూ ప్రేమ గురించే వల్లిస్తూ ఉండేవాడు. ఈ దేశం వాడు కూడా కాదు. ప్రేమించాడు. గాయపడ్డాడు. దిక్కు తోచక తిరుగుతూ తిరుగుతూ, ఇక్కడికొచ్చి స్థిరపడిపోయాడు. ప్రేమంటే ఏమిటో నీకెలా చెప్పాలి? నువ్వు నీ పిల్లల ప్రేమలను గాయపరచకు. నీకర్థమౌతూందా అత్తయ్యా?’

‘ఇంత గొప్పమాటలు మాకేమి అర్థమౌతాయి సమదూ? నీవేమో ఫకీర్‌వి. అల్లా తాలాతో పరిచయమున్నవాడివి. సత్యమేమిటో అదే చెబుతావు నువ్వు.’

‘అల్లా తాలా గురించి ఎవరికి తెలుసు ఇంతవరకూ? ఎన్ని సంవత్సరాలనుంచీ.. పీర్లు, ఫకీరులూ ఎంతమందో!! ఆయన్ను చూడాలని కాదు, ఆయనపై విశ్వాసం, అంతే!!’ సమదూ ఫకీర్ మూసిన కన్నుల చివర్ల నుండీ కన్నీళ్ళు జారుతున్నాయి. బొట్టు బొట్టుగా ఆయన తెల్లని జుబ్బా మీదకి పడుతున్నాయి.

రసీదన్ చెవుల్లో సమదూ ఫకీర్ మాటలే గింగిరుమంటున్నాయి. అతని కన్నుల్లోంచీ జారిన ముత్యాలను తన చూపులతో ఏరుకొంటూ ఉందామె. సమదూ ఫకీర్ కళ్ళల్లోనుంచీ, కాంతి వర్షిస్తూ ఉంది. దాన్నామె మౌనంగా చూస్తూ ఉంది.

కొంతసేపు ఎదురెదురుగా ఇద్దరూ, మౌనంగా కూర్చునే ఉన్నారు. కాసేపటి తరువాత సమద్ ఫకీర్ కళ్ళు తెరిచాడు. లేచి, రాతితో చేసిన పీట దగ్గరికి వెళ్ళాడు. పాత్రలో నీళ్ళు నింపాడు. దాన్ని తీసుకుని పీట మీద కూర్చుని ముఖం మీద నీళ్ళు చిలుకరించుకున్నాడు. చేతి రుమాలుతో ముఖం తుడుచుకుంటూ అడిగాడు, ‘అత్తయ్యా? చాయ్ తాగుతావా? తెప్పించనా?’

‘వద్దు బాబూ, తాగే వచ్చాను.’

‘తాగమ్మా. ఫకీర్ అడిగితే కాదనకూడదు.’ సమదూ నవ్వాడు. లేచి దర్గా గేట్ దగ్గరికి వెళ్ళి, ఎవరికో చాయ్ తెమ్మని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు.

‘ఇంటికి వెళ్తావా ఎప్పుడైనా?’ అడిగింది రసీదన్.

‘ఇల్లా? ప్రపంచాన్నే వదిలిపెట్టి వచ్చిన వాడిని, మళ్ళీ వెళ్ళటమా? ఒకసారి ప్రపంచం జారిపోయింది, మళ్ళీ రెండోసారి దొరుకుతుందా? ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంక మళ్ళీ రావటం ఉండదు, అలాగే మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళాలని కోరుకోవటం లేదా ఆలోచించటం నా దృష్టిలో దైవదూషణే!!’

సమదూ స్వరం స్థిరంగా ఉంది. కాసేపటి కింద ఏ భావం తాలూకు తుఫానులో కొట్టుకుపోయాడో అదిప్పుడు శాంతించింది.

‘మా ఇంటికి వస్తావా?’ రసీదన్ గొంతులో ప్రార్థనుంది.

‘వస్తాం. తప్పకుండా వస్తామమ్మా! రాలేము అనేటంత, కఠినాత్ములం కాము. నువ్వింత దూరం నుంచీ వచ్చావు నడిచి! నీ ఆహ్వానాన్ని ఎలా కాదనగలనమ్మా?’ ఒక మెరుపులాంటి చిరునవ్వు సమద్ పెదాలమీద!!

ఈ లోగా ఒక కుర్రాడు, కెటిల్లో చాయ్, రెండు కప్పులూ తీసుకొచ్చాడు. ఇద్దరూ చాయ్ తాగారు.

‘వెళ్తాను మరి. ఇంట్లో ఎవరికీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పిరాలేదు! నీకోసం ఏమీ తీసుకుని రాలేదు కూడా!’ రెండు మోకాళ్ళమీదా చేతులానించింది, లేవటానికి!

‘ఆగమ్మా, ఏమీ తీసుకురాకపోతే ఏమైంది? తీసుకుని వెళ్ళంతే!’ సమదూ లేవనివ్వలేదు రసీదన్‌ను. అతను లేచి, దర్గా వెనకున్న గదిలోకి వెళ్ళాడు. అటువంటివి చాలా ఉన్నాయక్కడ! అతను వెళ్ళిన గది, పాత కాలపు పొడవాటి, వెడల్పైన ఇటుకలతో కట్టింది. చాలా చోట్ల పెచ్చులూడిపోయి ఉంది. సున్నంతో నింపిన ఇటుకలు తొంగిచూస్తున్నాయి.

రసీదన్ కూర్చునే ఉంది. సమదూ ఫకీర్ తిరిగొచ్చాడు. ఆయన చేతిలో కలకండ పలుకులు నిండిన ఒక సీసా ఉంది. రసీదన్ ను చీర కొంగు చాపమని సైగ చేశాడతను. రసీదన్ చీర కొంగు చాచింది. అందులో ఆ సీసా మొత్తాన్ని వేశాడతను.

‘అందరికీ పంచమ్మా!’

రసీదన్ సెలవు తీసుకుంది. ఆమెతో కలిసి నడుస్తూ, సమదూ ఫకీర్ మసీదు గేట్ దాకా వచ్చాడు. అడిగాడు, ‘హజ్రత్ దాతా పీర్ మనిహారీ మసీదు దగ్గర ఎవరు కూర్చుంటారు?’

‘ఎవరూ కూర్చోరు. అక్కడి శుచీ శుభ్రం సంగతి మేమే చూస్తుంటాం. ఆడవాళ్ళొస్తారు, గాజుల మొక్కు చెల్లించేందుకు! అప్పుడప్పుడూ ఏదో సంపాదన వస్తుంది కాస్త! ఒక మాట చెప్పనా సమద్?’

‘చెప్పమ్మా!’

‘పీర్ ముహానీకి వచ్చెయ్. అక్కడ దాతా పీర్ మనిహరీ మసీదు దగ్గర ఉండిపో. కాలే ఫకీర్ మనుమడివి కదా!! నీకు హక్కుంది, వంశానికి చెందినవాడివి కాబట్టి! మీ ఇంటివాళ్ళెవరూ లేకపోవడం వల్ల మేము చూసుకుంటున్నాం ఇప్పుడు! నువ్వక్కడికి వస్తే దాని ప్రభ పెరిగిపోతుంది. ఆదాయమూ పెరుగుతుంది. అక్కడ ఉండేందుకేమీ ఇబ్బంది లేదు. కబ్రిస్తాన్ కమిటీ వాళ్ళు నూరానీ మసీదు మీద ఎన్నెన్నో గదులు కట్టారు. అన్నీ ఖాళీగానే పడున్నాయి. వచ్చెయ్ బాబూ!!’ రసీదన్ గొంతులో ప్రార్థనుంది, నిజమైన ఆప్యాయతుంది. తనవాడన్న ప్రేముంది.

‘అత్తయ్యా! నిన్ను కలిసేందుకు వస్తాం. షాహ్ అర్జాను వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళటం ఇప్పుడింక అసాధ్యం. ఎన్నో సార్లు ఇక్కడినుంచీ కూడా వెళ్ళిపోయాం. తిరగని చోటు లేదు. కానీ ప్రతిసారీ, పిలిపించుకుంటాడాయన! ఆలస్యంగానైనా నువ్వొచ్చావ్. నా గురించి పట్టించుకునేవారు, నీలాంటి ఒక్కరైనా ఉన్నారు. ఇది తక్కువా చెప్పు?’ సమదూ ఫకీర్ కనుకొలనులనుంచీ కొన్ని కన్నీటి చుక్కలు నేలమీద పడ్డాయి.

‘సమద్!’ ప్రేమగా చూసిందామె.

‘ఇక్కడా నాకేమీ ఇబ్బందిలేదమ్మా! ఖాన్ కాహ్ లోని సజ్జాదానషీన్ నా సంగతి చూసుకుంటాడు. నువ్వు మళ్ళీ రామ్మా, మేమూ వస్తాం, కలిసేందుకు!’ సెలవు తీసుకుంటూ సమదూ ఫకీర్ గొంతు వణికింది. ఎంతగా ఆపుకుంటున్నా, భావాల ఉప్పెన అతన్ని కుదుపేస్తూంది. ఎన్నో సంవత్సరాల తరువాత, ఇంటి వాళ్ళో, బంధువులో కలిసేందుకొచ్చారు. రసీదన్ కళ్ళు కూడా వర్షిస్తూనే ఉన్నాయి. గొంతు రుద్ధమైంది. ఏమీ మాట్లాడకుండా గేట్ దాటి, రోడ్డెక్కింది.

సమదూ ఫకీర్ కళ్ళు ఆమెను అలా చూస్తుండిపోయాయి, రోడ్డెక్కేవరకూ! తిరిగి లోపలికొచ్చాక ఆయన దృష్టి, ముసలి రోజ్ వుడ్ చెట్టు మీదున్న గూడు మీద పడింది. పిల్ల పిట్ట నోటికి తల్లి పిట్ట దాణా తెచ్చి అందిస్తోంది. చిరునవ్వుతో ఫకీర్, తన రెండు అర చేతులూ పైకెత్తి ఆకాశంకేసి చూశాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here