Site icon Sanchika

దాతా పీర్-9

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[రసీదన్ వచ్చి వెళ్ళాకా, సమదూ ఫకీర్‍కి తన గతమంతా గుర్తుకొస్తుంది. పాత గాయాల బాధ మళ్ళీ ముందుకొస్తుంది. దుఃఖం పొంగిపొర్లుతుంది. చాయ్ తెచ్చిన అబ్బాయి, ఖాళీ గ్లాసులు తీసుకుని డబ్బులు అడగడానికి వచ్చి – కన్నీటితో ఉన్న సమదూని చూసి మౌనంగా వెళ్ళిపోతాడు. ఆ రోజంతా సమదూ అన్నం తినడు. పాత జ్ఞాపకాలు వెల్లువలా ముంచేస్తుంటాయతన్ని. జూబీ గుర్తొస్తుంది. ఉర్దూ ఎం,ఎ. చదువుతున్నప్పుడు జూబీ పరిచయమవటం, ఇద్దరూ మీర్ కవిత్వాన్ని అభిమానించటం, క్రమంగా ప్రేమలో పడడం అన్నీ గుర్తొస్తాయి. ఇంతలో మసీదు లౌడ్ స్పీకర్ నుంచీ వినిపిస్తున్న అజాన్ శబ్దం విని సమదూ లేచి నమాజు చేసి వస్తాడు. మళ్ళీ తన ప్రేమ జ్ఞాపకాలు అతని మనసు నిండా వ్యాపిస్తాయి. తానూ, జూబీ తిరిగిన ప్రదేశాలు, చేసుకున్న బాసలూ అతన్ని వెంటాడుతాయి. మర్నాడు ఉదయం రహ్మత్ మియ్యా చాయ్ దుకాణం దగ్గర ఆగినప్పుడు – ఏమైంది, ఎందుకో ఏడ్చారట, పిల్లాడు చెప్పాడు – అని రహ్మత్ అడిగితే, ఏం లేదంటాడు సమదూ. దర్గాకి చేరాకా మళ్ళీ పాత విషయాలు మదిలో మెదులుతాయి. ఎం.ఎ. పూర్తవడం, జూబీని పెళ్ళి చేసుకోవాలనుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు గుర్తొస్తాయి. సమద్ గత జీవిత స్మృతులు ఒక్కొక్కటీ బైటపడతాయి. వాటిని విదిలించుకుంటూ రహమత్ చాయ్ దుకాణం వైపు నడుస్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-7- మూడవ భాగం

[dropcap]త[/dropcap]న మూడో కొడుకు సమద్ హసన్, ఏదైనా ప్రభుత్వోద్యోగంలో చేరాలి. లేదా తన పెద్దన్నయ్య మసూద్ హసన్‌తో పాటూ హోటల్ బిజినెస్ లోకి దిగాలని తండ్రి అబరార్ హసన్ కోరిక. కొన్ని రోజులు కలిసి పనిచేశాక, వ్యాపారంలో పద్ధతులు తెలిశాక సొంతంగా మొదలుపెట్టుకోవచ్చు. రెండో కొడుకు ఫారూక్ హసన్ చక్కగా జీవితంలో స్థిరపడటం చూస్తే ముచ్చట అతనికి. మాటిమాటికీ అతని గురించిన పొగడ్తలే ఎప్పుడూ!! ఫారూక్ పాట్నాలో బ్యాంక్ మేనేజర్‌గా ఉన్నాడిప్పుడు. అతనికోసం డబ్బూ దస్కం గలిగిన మంచి హోదాగల కుటుంబంలో పెళ్ళికూతురి కోసం వెదుకుతున్నారిప్పుడు.

సమద్, తన తండ్రి చెప్పిన రెండు మార్గాలూ నచ్చలేదనేశాడెప్పుడో! అమ్మ దిల్ జాన్‌కు స్పష్టంగా చెప్పేశాడు,’హోటల్ వ్యాపారంలో దిగటం కంటే, ఉరి వేసుకోవటమో లేదా నదిలో దూకి చావటమో మంచిది. ఇక ప్రభుత్వోద్యోగం సంగతి తన చేతుల్లో లేదు మరి. ఉర్దూ ఎం.ఏ. చదువుకూ చాలా కష్టం మీద యే క్లర్క్ ఉద్యోగమో తప్ప మరేదీ రాదు కాబట్టి, ఏ కాలేజీలోనో చదువు చెప్పటం బెటర్. లెక్చరర్‌షిప్ కైతే యూనివర్సిటీలో అవకాశాలే లేవు. ఎప్పుడైనా వస్తాయనే ఆస్కారమూ లేదు. లెక్చరర్‌షిప్ మార్గంలో మరో అడ్డంకి పీ.హెచ్.డీ. ప్రస్తుతం సమద్‌కు పీ.హెచ్.డీ.కి రిజిస్టర్ చేసుకుని, రిసర్చ్‌తో పాటూ కవిత్వం రాసుకుందామని ఉంది. అమ్మ ద్వారా నాన్నకూ యీ సంగతి తెలియజేశాడు సమద్. నాన్నతో అంత చనువు లేదు సమద్‌కు! ఫారూక్ నాన్నకు నచ్చజెప్పాడు, ‘ఉర్దూ చదివి, దేనికీ పనికిరాకుండా పోయాడు సమద్, ఆఖరికి చప్రాసీ ఉద్యోగం కూడా రాదీ చదువుకు! అందుకే, సబ్జీబాగ్‌లో పూల దుకాణం పెట్టుకోవడమొక్కటే మార్గం.’ అని!

సమద్ వాళ్ళ నాన్నకు మరొక ముఖ్యమైన విషయం మసాలా దట్టించి మరీ చెవిని వేయడమైంది, సమద్ ఉర్దూ చదువు, దానికి తోడు కవిత్వం పిచ్చీ!! కవిత్వమెలాంటి రోగమంటే, ఒక్కసారి అంటుకుంటే, ఇక పూర్తి ఇంటినంతా అగ్ని మాదిరి మాడ్చి మసి చేస్తుంది. ఆ తరువాత, అల్లా తాలా దయుంటేనే ఆ ఇల్లు బతికి బట్టకడుతుంది. పీర్ ముహానీ గోరీల గడ్డ నుంచీ దిల్ జాన్ బీ ప్రేమలో పడి, బైటపడిన అబ్రార్ హసన్, ఏదో కూడబలుక్కుని చేవ్రాలు మాత్రం చేయగలిగేంతవరకే చదువుకున్నాడు. ఫారూక్ హసన్ మాటలు ఇప్పుడిక తిరుగులేనివే!! యెనిమిదో తరగతి వరకూ చదువుకున్నాడతను. అప్పుడే హోటల్ వ్యాపారంలోకి దిగాడు. అలా స్థిరపడిపోయాడా వ్యాపారంలో!!

సమద్ నిరుద్యోగం, మసూద్ ఒక్కడి పైనే వ్యాపార భారం – యీ సమస్యలన్నిటివల్లా మాటి మాటికీ అబరార్ సహనం కోల్పోతున్నాడు. ఏదో ఒకనాడు, ఫారూక్‌కు తగిన సంబంధం వస్తుందని గట్టి నమ్మక మాయనకు. మసూద్ లోపల్లోపలే ఎంతగానో కుమిలిపోతున్నా హోటల్ వ్యాపారం వదిలిపెట్టి ఎక్కడికని వెళ్ళగలడు? సమద్ ఒక్కడి జీవితమే తీరూ తెన్నూ లేకుండా ఉందిప్పుడు. రోజు రోజంతా మాయమైపోతాడు సమద్. రహమానియాలో కూర్చుని ఉంటాడెప్పుడూ!! అది మూసిన తరువాతే ఇంటికి రావటం. అబరార్ హుస్సేన్‌కు అనుమానం వచ్చి ఆరా తీస్తే తెలిసిందేమిటంటే, గోరీలగడ్డలో పట్నాలోని పనికిరాని స్నేహితుల మధ్యే ఉంటాడట సమద్! ఇది చెప్పింది కూడా ఫారూకే!!

కబరిస్తానియా మైన్ రోడ్డు మీద పీర్ బహోర్ పోలీస్ స్టేషన్‌కు సరిగ్గా ఎదురుగా ఉన్న స్థలం, ఇంగ్లీషువాళ్ళ శ్మశానంగా పేరు పడింది. వాళ్ళు వెళ్ళిపోగానే ఆ శ్మశానం మూతపడిపోయింది. అలా నిరుపయోగంగా ఉండిపోయిన ఆ స్థలం మైన్ గేట్ దగ్గర కాలూ మియ్యా చాయ్ దుకాణముంది. అక్కడ చాయ్‌తో పాటూ, పావ్ రోటీ, బిస్కెట్ పాకెట్లూ, సమోసాలు కూడా దొరుకుతాయి. కాలూ మియ్యా కూర్చునే చోటు, మారియా అనే ఒక పెళ్ళికాని అమ్మాయి సమాధిమీదే ఉండేది. పొద్దున్న మొదటిసారి చాయ్ తయారుచేసి, ఒక కప్పు చాయ్ ని మారియా పేరు మీద, పక్కనే వదిలేసి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించేవాడు. అల్లా అంటే కూడా భయపడని కాలూ మియ్యా, మరియా ఆత్మకు మాత్రం ఎక్కడలేని గౌరవాన్నీ ఇచ్చేవాడు. ఇక్కడ రాత్రి పొద్దుపోయేవరకూ ఉర్దూ కవులూ, పత్రికా విలేఖరుల మీటింగులు జరుగుతూనే ఉండేవి. కబరిస్తానియాలో కూర్చునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ లేకున్నా వచ్చేవాళ్ళంతా ఆ సమాధులమీదున్న బండలమీదే కూర్చుని చాయ్ తాగుతూ, సిగరెట్ పొగలు పీలుస్తూ పిచ్చాపాటీలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. ఒకసారి కవిత్వానికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటాయి, మరోసారి రాజకీయాల గురించీ, ఇంకోసారి లోక వ్యవహారాల గురించీ, ఇలా రకరకాలు!! పరస్పర ద్వేషాలూ, రోషాల వల్ల వాతావరణం కూడా అప్పుడప్పుడూ వేడేక్కిపోతూ ఉంటుంది. కబ్రిస్తాన్‌లో సమద్ యువకుల బృందంలోనే ఉండేవాడు. పెద్దవాళ్ళను గౌరవించేవాడు, స్నేహితులను ప్రేమించేవాడు. ఆయన కవితల్లో వినిపించే వినూత్న చిత్రాలవల్ల ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. విలక్షణంగా విమర్శించేవాళ్ళ ప్రత్యేక దృష్టి అతనిమీద ఉండేదెప్పుడూ!! పొద్దున తన రిసర్చ్‌కు సంబంధించిన పనుల్లో, లేదా రహ్మనియా లోనో ఉండి, రహ్మనియా మూసేసిన తరువాత కబ్రిస్తాన్‌కి వస్తాడు సమద్. మందు అలవాటు కానీ సిగరెట్ పిచ్చి కానీ లేవతనికి. ఇంటికి వెళ్తే, అతని గదిలో భోజనం పెట్టబడి ఉంటుంది. భర్తా, ఇద్దరు కొడుకుల పిచ్చి వాగుడు వినే అలవాటైంది దిల్జాన్ బీకి! రోజూ వాళ్ళు చెప్పే మాటలు వింటూనే ఉంటుంది. కానీ ఏమీ మాట్లాడదు. సమద్ గదిలో భోజనం మాత్రం మర్చిపోకుండా పెడుతూనే ఉంటుంది.

అమ్మ తప్పించి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడేవాడే కాదు సమద్. మసూద్ హసన్ ఇద్దరు కొడుకులు కూడా సమద్‌కు దూరంగానే ఉండేవారు. వాళ్ళిద్దరూ బాగా చదువుకోవాలని సమద్ అనుకునేవాడు, కానీ యీ చిన్న వయసులోనే హోటల్ లో డబ్బు కౌంటర్‌లో కూర్చోవటమే వాళ్ళిద్దరికీ తెగ నచ్చేది. బలవంతం మీద స్కూల్‌కు వెళ్తారు. వెనక్కి రాగానే, పుస్తకాల సంచీ పడేసి, విద్యార్థుల వేషం వదిలేసి హోటల్ యజమానులుగా మారిపోతారిద్దరూ! చూస్తూ చూస్తుండగానే, వాళ్ళకు ఇల్లొక సత్రంగా మారిపోయింది.

ఈలోగా ఒక సంవత్సరం గడిచిపోయింది. పీ.హెచ్.డీ. ప్రవేశ పరీక్షలో పాసయ్యాడు సమద్. మీర్ కవిత్వంలో సూఫీవాదం అన్న విషయం మీద తనకిష్టమైన ప్రొఫెసర్ పర్యవేక్షణలో రిసర్చ్ కోసం రిజిస్టర్ చేశాడు. జూబీ ఎం.ఏ. పాసైంది. ఉద్యోగం గురించి ఒత్తిడి సమద్ మీద రోజురోజుకూ పెరుగుతోంది. ఎం.ఏ పాసవగానే పెళ్ళి చేసెయ్యాలని జూబీ ఇంటిలోనూ ఒత్తిడి మొదలైంది.

పరీక్షలు ఐపోయిన వెంటనే సమద్, జూబీల కలయికలు తగ్గిపోయాయి. యూనివర్సిటీ కాంపస్‌కి జూబీ వచ్చేందుకు వంకలు దొరకలేదప్పుడు!! పరీక్షా ఫలితాలు వచ్చిన తరువాత దర్భంగా హౌస్‌కి వచ్చే వంకలకు ప్రాణాలు వచ్చాయి మళ్ళీ!! జూబీకి కూడా రిసర్చ్ చేయాలనే కోరికుండేది, కానీ యీ సంవత్సరం ఆమె పెళ్ళి ఎలాగైనా చేసెయ్యాలని వాళ్ళ నాన్న పట్టుదల మీదున్నాడు. జూబీ అందరికంటే పెద్దది. కొడుకు పుడతాడన్న నమ్మకంతో మరో ఐదుమంది ఆడపిల్లలను కన్నది వాళ్ళమ్మ తలత్ బానో. ఆరో కాన్పు తరువాత గర్భసంచి చెడిపోయి దాన్ని తీసివేయవలసి వచ్చింది. ఆ తరువాత, ఇల్లంతా విషాద వాతావరణం నిండిపోయింది. తానిక పిల్లలను కనలేననే బాధతో తలత్ బానో మానసికంగా కుంగి పోయింది. జూబీ వాళ్ళ నాన్న ఆతిఫ్ ఖాన్, కణ కణ మండిపోయే నిప్పులా మారిపోయాడు. ముందునుంచే ఆయనకు కాస్త కోపం ఎక్కువే!! కుటుంబం మీద పడ్డ యీ పిడుగుపాటువల్ల ఆయన కోపం మరింత పెరిగింది. ఐనదానికీ, కానిదానికీ కోప్పడుతూనే ఉంటాడిప్పుడు!!

ఆతిఫ్ ఖాన్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా ఉండేవాడు. ఇప్పుడు రిటైర్ అవబోతున్నాడు. మధ్యలో రెండు సార్లు సస్పెండ్ అవటం వల్ల ప్రొమోషన్ ఆగిపోయింది. మొదటిసారి, ఫతుహా ఇండస్ట్రియల్ ఏరియాలో పరిశ్రమలకు, దొంగగా ఎలెక్ట్రిసిటీ సప్ప్లై చేసిన నేరం వల్లా, రెండోసారి విద్యుత్ విభాగం గోదాములో సామాను దొంగతనం నేరం వల్లా!! సస్పెన్షన్ తరువాత, తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడల్లా ఇదివరకటికంటే ఎక్కువ ధైర్యమొచ్చేదాయనకు!! ఆయనకు రెండే దాహాలు, ఒకటి కొడుకు పుట్టలేదనే దాహం, రెండోది, ఆస్తి సంపాదించటం. తానే దొపిడీ చేసినా తన అరడజను ఆడపిల్లల పెళ్ళి ఖర్చుల కోసమే నంటూ మరింత మొండిగా చేస్తూ ఉండేవాడు.

తలత్ బానో ద్వారా జూబీ ప్రేమ గురించి ఆతిఫ్ ఖాన్‌కి తెలియగానే ఇంట్లో భూకంపం వచ్చినంత పనయింది. జూబీ మౌనంగా ఉంది, కారణం ఇటువంటి భూకంపాలు ఇంట్లో మామూలే!! శతాబ్దాలనుంచీ ప్రేమ విషయంలో ఇలాగే ఇదే సంప్రదాయమే కొనసాగుతూ వస్తూంది. తానూ, సమద్ కలిసి యీ భూకంపాన్ని చక్కగా ఎదుర్కొని బైట పడగలమని నమ్మకముండేదామెకు!!

తలత్ బానో సలహా ప్రకారం, ఆతిఫ్ ఖాన్, సబ్జీ బాగ్ లోని తన స్నేహితుల ద్వారా సమద్ గురించి విచారించాడు. అన్ని వివరాలూ తెలిసిన తరువాత, తమ ఇంట్లో జూబీ తో పాటూ తక్కిన అందరి ముందూ గర్జించాడిలా – ‘చెవులు విప్పి వినండందరూ! ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల ఫలితాలెలా ఉంటాయో నాకు తెలుసు. వాళ్ళ కుటుంబం ఇదివరకు చనిపోయినవాళ్ళ కోసం గోతులు తవ్వి, గోరీలు కట్టేదట! అలాంటి ఇంటికి నా కూతురిని ఇవ్వను నేను. ఆ అబ్బాయి ఏదైన పని చేస్తూ ఉండి ఉంటేనైనా ఆలోచించేవాణ్ణి. పగలూ రాత్రీ ఆవారాగా తిరిగే వాడికి నా కూతురిని ఇవ్వనసలు! మా వంశం చాలా గొప్పది. ఎవరెవరినుంచీ తప్పించుకుంటూ తిరగ్గలను?’

జూబీ తప్ప ఇంట్లో వాళ్ళంతా భయాందోళనల మధ్యే ఉన్నారు. ఆమె మాత్రం మౌనంగా ఉంది. తన ఐదు మంది చెల్లెళ్ళనూ ప్రేమగా చూసింది జూబీ. వాళ్ళ తలలు ప్రేమగా నిమిరింది తన గదిలోకి వెళ్ళి మీర్ వ్రాసిన కవితల పుస్తకం తీసి చదవటం మొదలెట్టింది.

అణచివేత నుండే పుట్టింది ప్రేమ

ప్రేమే లేకపోతే అస్తిత్వమే లేదు.

జూబీ ముఖం మీద కాంతి పరచుకుంది. గదిలో లేత వెలుగు పరుచుకుంది. ఏదో బంగారు గుహలాగా మెరిసి పోతూ ఉంది. నలుదిక్కులా బంగారు వెలుగులు! మూసి ఉన్న తలుపులనుండీ, కిటికీలనుండీ, పైకప్పులో అమర్చిన వెంటిలేటర్లనుండీ వెలుగు అలలు దూసుకుని వచ్చేస్తున్నాయి. జూబీ ముఖం, తళతళా వెలిగిపోతోంది. కళ్ళు మూసుకుని సమద్‌ను గుర్తు చేసుకుందామె!! జలజల పారుతున్న గంగ అలల ఒడ్డున, నక్షత్రాల వర్షంలో తడుస్తున్న సమద్ ముఖం కనిపించింది. కాళీ మందిర్ ఘాట్ మెట్లమీద నిర్మించిన చిన్న గుడిలో గంట మోగింది. పైన కాళీ మందిరం నుండీ వినిపిస్తున్న శంఖ ధ్వని దిగంతాలవరకూ వ్యాపించింది.

***

జూబీ తన గదిలో ఉంది. తక్కిన ఐదుమంది చెల్లెళ్ళూ, భూకంపలో శిధిలమైపోయిన ఇంటి భాగాల్లాగ అక్కడక్కడ ఒక్కొక్కరుగా ఉన్నారు. క్షత గాత్రుల్లాగా, ఒకరినొకరు చూసుకుంటూ.. తామెందుకు పుట్టామా అని బాధపడుతూ, మౌనంగా!! వాళ్ళకు తమ పెద్దక్కయ్య మీద అంతులేని నమ్మకం. నాన్న కోపాగ్ని నుండీ అక్క తప్పించుకుందంటే, ఇక అందరినీ తప్పిస్తుందనే అనిపించేది వాళ్ళకు. కసాయి తాడుకు కట్టబడిన మేకల్లాగా తమ జీవితాల గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేశారందరూ!

ఆతిఫ్ ఖాన్‌కు తలత్ బానో నచ్చజెప్పింది, ‘ఆరారు మంది ఆడపిల్లలు, ఎవరెవరికి ఇలా కళ్ళేలు వేస్తూ కూర్చోగలం? వీళ్ళందరికీ పెళ్ళికొడుకు, మంచి వంశం వాళ్ళను వెదకడంలోనే సమయమంతా గడిచిపోతుంది, అందరూ కన్యల్లాగానే ఉండిపోతారు. వంశమూ గింశమూ – ఏదీ వద్దు. అబ్బాయి బాగుండాలి, రెండు రాళ్ళు సంపాదించగలగాలి, పెళ్ళైన తరువాత కూడ మనమీద వీళ్ళ బాధ్యత ఉండకూడదు. అంతే. ఇంత మాత్రం చూసి, పంపించేయండి.’

ఆతిఫ్ ఖాన్ ముందైతే భార్య మాటలు మౌనంగానే విన్నాడు. కానీ వంశం మాటెప్పుడైతే వచ్చిందో, ఒక్కసారి రెచ్చిపోయాడు, ‘ఇప్పుడిక మా వంశాన్ని ఆటపట్టించొద్దు. ముంతాజ్ మహల్ చెల్లెలు మలికా బానోను పెళ్ళాడిన నవాబ్ సైఫ్ ఖాన్ వంశస్థుడిని నేను! అర్థమైందా? నీ వంశాన్ని కాస్త గౌరవించు. వేటగాళ్ళ వంశం మీది. ఏడు తరాలనుంచీ మీ వంశమంతా మీర్ షికార్ గుంపులో ఉంటూ ఉండేవాళ్ళూ. ఇప్పుడు మీవాళ్ళు స్థలాలు అమ్ముకుని ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఇప్పుడు గొప్ప వంశమైపోయింది మీది.’

‘సరే, వేటగాళ్ళ వంశంలో పెళ్ళాడారు కదా, మరి మీ పిల్లలకు నవాబుల సంబంధాలెందుకు వెదుకుతున్నారిప్పుడు? మీ కూతుళ్ళ రక్తంలో వేటగాళ్ళ వంశం రక్తమే కదా ఉన్నది? నా పాలు తాగే పెరిగారుగా మీ పిల్లలు?’ తన సమాధానంతో ఆతిఫ్ ఖాన్ నీటికి తాళం వేసింది తలత్ బానో.

కాసేపు మాట్లాడలేదతను. మరికాసేపు తటపటాయించి, ‘ఐతే ఇప్పుడేం చేద్దామంటావు?’ అన్నాడు.

‘మీరే వెళ్ళి వాళ్ళ ఇల్లూ వాకిలీ ఎలా ఉన్నాయో చూసిరండి. వాళ్ళను కలవండి. అబ్బాయి నాన్నతో మాట్లాడండి. నచ్చకపోతే వదిలెయ్యండి. కానీ వేరేవాళ్ళ మాటలు నమ్మి సొంతంగా ఏమీ తెలుసుకోకుండా సంబంధం వదులుకోవద్దు. నా సలహా ఇదే. వింటారో వినరో ఇక మీ ఇష్టం.’ తలత్ బానో నెమ్మదిగా తన మనసులో మాట చెప్పేసింది. ఆతిఫ్ ఖాన్ ఏమీ మాట్లాడలేదు. తరువాత నిద్రపోవటానికి పైనున్న తన గదికి వెళ్ళిపోయాదు. ఆరవ కుమార్తె పుట్టటమూ, ఆపరేషన్ తరువాత, తలత్ బానో గదిలో పడుకొవటం మానేశాడతను.

చాలా రోజులవరకూ ఇంట్లో అశాంతి తాండవించింది. కూతుళ్ళతో ఆతిఫ్ ఖాన్ మాట్లాడటం లేదు. జూబీ చెల్లెళ్ళతో మాట్లాడుతూ ఉండేది. అందరికంటే చిన్న చెల్లెలింకా ఆ నాటి దెబ్బ నుంచీ కోలుకోలేదు. తను వచ్చి, జూబీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది, లేకపోతే కళ్ళు తిప్పకుండా జూబీ వైపే చూస్తూ ఉంటుంది. తక్కిన నలుగురూ, జూబీ దగ్గరుంటే మాట్లాడుకుంటారు. తలత్ బానో అందరితోనూ మాట్లాడుతూ ఉంది. ఇంటి పరిస్థితి మారితే బాగుంటుందని ఆమె కోరిక. కానీ అదంత సులభం కాదని ఆమెకూ తెలుసు.

ఆతిఫ్ ఖాన్ చాలా రోజులు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆయనలో కూడా ఆందోళన మొదలైంది. కానీ వారం రోజుల తరువాత, కాస్త సర్దుకుని సబ్జీబాగ్ కు చేరుకున్నాడతను.

సబ్జీ బాగ్ మైన్ రోడ్, రెండు చిన్న సందుల్లోనుంచీ బిర్లా మందిర్ వైపు వెళ్తుంది. ముందు మలుపు దగ్గరే కుడి వైపు జామున్ గల్లీ ఉంది. ఆతిఫ్ ఖాన్ యీ గల్లీలో ఒక ఇంటి గుమ్మం ముందు నిల్చున్నాడు. సందు చాలా ఇరుకుగానే ఉంది. కానీ ఇల్లైతే మూడంతస్తులది, అందంగా ఉంది. ఈ ఇంట్లోనే అబరార్ హసన్‌ను కలిశాడాయన. సమద్ వాళ్ళ పెద్దన్నయ్య మసూద్ హసన్ కూడా కలిశాడు. కానీ మర్యాద పూర్వకంగా పరిచయాలూ ఐన తరువాత, వెళ్ళిపోయాడు, సాయంత్రం హోటల్‌లో క్యాష్ కౌంటర్ సంగతి చూడవలసి ఉండటంతో!! సబ్జీ బాగ్ మూడు రోడ్ల కూడలి నుండీ లంగర్ టోలీకి వెళ్ళే రోడ్డులో అబరార్ మియ్యా హోటలుందని ఆతిఫ్ ఖాన్‌కు ముందే తెలుసు.

సమద్ పెళ్ళి సంబంధం గురించి విని, అబరార్ హసన్‌ మనసులో అగ్గి రాజుకుంది. కానీ నిగ్రహించుకున్నాడు. సాధ్యమైనంత మృదువుగా తన కొడుకు కవిత్వం పిచ్చి గురించీ, నిరుద్యోగం గురించీ వివరించాడు. ఆతిఫ్ ఖాన్‌కు స్పష్టంగా చెప్పేశాడు, మీ కుమార్తెకు నా కొడుకు సరైనవాడు కాదని. దీని తరువాత, తన అసలైన ఎత్తుగడను మొదలు పెట్టాడు. రెండవ కొడుకు ఫారూక్ విజయాలను చెప్పటం మొదలుపెట్టాడు. ఆతిఫ్ ఖాన్ సందిగ్ధంలో పడిపోయాడు. ఆశ పడ్డాడు కూడా!! అబరార్ హసన్ తన మాటలు ముగిస్తూ అన్నాడు ఖరాఖండిగా, ‘అల్లా నాకు చాలానే ఇచ్చాడు. నాకు కట్న కానుకలొద్దు. అమ్మాయి తెలివైనదైతే చాలు. మన సంప్రదాయమదీ తెలిసి ఉంటే మంచిది. ఇంట్లో అందరితో కలిసిపోవాలి. మీకు నచ్చితే మేమే సంబంధం మాట్లాడేందుకు వస్తాము.’

ఆతిఫ్ ఖాన్‌కు ఆశ చూపి జాగ్రత్తగా అతణ్ణే చూస్తున్నాడు ఆతిఫ్ ఖాన్. ఈ లోగా ఫారూక్ బ్యాంక్ నుంచీ వచ్చాడు. అబరార్ హుస్సేన్ అతణ్ణి పరిచయం చేశాడు. మర్యాద పూర్వకమైన పలకరింపులవీ ఐన తరువాత కాసేపు అవీ ఇవీ మాట్లాడుకుని ఇంటికి బయలుదేరాడు ఆతిఫ్ ఖాన్.

ఈ సమయంలో మామూలుగానే సమద్ ఇంట్లో ఉండడు కాబట్టి ఇప్పుడూ లేడు.

***

ఆతీఫ్ హుస్సైన్ ఇంటికి వచ్చి అక్కడ జరిగిన సమాచారమంతా బానో కి చప్పాడు. తలత్ బానో ముఖం కత్తివేటుకు చుక్క రక్తం లేనట్టయింది. బాగా భయపడిందామె. శరీరం వణికి పోయింది. ముందు భర్తను తదేకంగా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి నిగ్రహించుకుని నెమ్మదిగా అంది, ‘చిత్రమైన మనిషి మీరు! ఇలా కూడా చేస్తారా? అమ్మాయి ఎవరిని ప్రేమిస్తూ ఉందో, వాళ్ళింట్లోనే ఆ అబ్బాయి అన్నయ్యకిచ్చి పెళ్ళి చేస్తారా? అ ఇద్దరి పరిస్థితేంటక్కడ? అమ్మాయి, ప్రతి రోజూ చస్తూ బతుకుతూ బ్రతుకీడ్వాలంతే. లేదా మొగుడిని మోసం చేసి, తన ప్రేమికుడితో పడుకోవాలి, లేదా వ్యభిచారం చేయాలి. జీవితాంతమూ నరకంలో ఉండిపోతుందండీ. నాదైతే వేటగాళ్ళ వంశం, మరి మీది నవాబుల వంశం కదా, మీ ఇళ్ళలో ఇలాగే చేస్తారా మరి?’

తలత్ బానో ఈసడింపులను వింటూ లోపల్లోపలే కుతకుతలాడిపోతున్నాడు, ఆతిఫ్ ఖాన్. ఆమె తన మాటలాపిందో లేదో, పళ్ళు పటపట కొరుకుతూ లేచాడు, ‘దొంగ ము..! నీ గొంతు పిసికేయాలనిపిస్తూంది. కానీ నువ్వు ఆరారు కష్టాలను కనిపడేశావే, వాటినెవరు చూస్తారు? ఇది గుర్తొచ్చే నేనేమీ అనలేకుండా ఉన్నాను. ఇంక నా వంశాన్ని ఎగతాళి చేశావు నువ్వు!! నీ కడుపు చూసుకో ముందు!! మీ వంశమే చెడ్డది. నీ సలహా అడిగాను చూడూ, తప్పంతా నాదే!!’

ఆసిఫ్ ఖాన్ ఎవరినీ లెక్క పెట్టలేదింక!!

తన ఒక స్నేహితుణ్ణి వెంట పెట్టుకుని అబరార్ హసన్‌ ఇంటికి వెళ్ళి జూబీ పెళ్ళి నిర్ణయించుకుని వచ్చాడు.

తలత్ బానో జూబీకి యీ సంగతి చెప్పింది.

జూబీ వినింది. చేసుకుంటాననీ అనలేదు. చేసుకోననీ అనలేదు. మౌనంగా ఉందంతే!

దిల్జాన్ బీ నికాహ్ నిశ్చయించేందుకు పెద్ద కొడుకు మసూద్ హుస్సేన్, అతని కుటుంబంతో పాటూ వీళ్ళింటికి వచ్చింది.

నికాహ్ తేదీ నిర్ణయమైంది.

పగలు నికాహ్, రాత్రి వలీమా విందు.

ఆ చెవినీ యీ చెవినీ పడి సమద్‌కు ఇంట్లోనే యీ వార్త తెలిసింది. అటు జూబీని ఇంటిలోనుంచీ బైటికి రావద్దని కట్టడి చేశారు. మొబైల్ ఒక్కటే ఆధారం. అది కూడా జూబీ చాలావరకు స్విచ్ ఆఫ్ చేసే ఉంచుతుంది. ఎలాగో సమద్‌కు మొబైల్ ద్వారానే అన్ని సంగతులూ చెప్పి చివరికి జూబీ అంది, ‘నా మీద నమ్మకముంచండి. వాళ్ళేమేమి చేస్తారో అన్నీ ఇప్పటికైతే కానివ్వండి. సమయం వచ్చినప్పుడు అన్నీ మారిపోతాయి.’ జూబీ మాటలు విని ‘ఆహా!! అద్భుతం! నాకు నీపై నమ్మకముంది.’ అన్నాడు.

తన విషయంలో ఎందుకిలా జరుగుతోందో, సరైన సమయమేమిటో, మారిపోయేవేమిటో, ఈ నిర్ణయాలను, ఎవరు, ఎలా మారుస్తారో సమద్‌కు అర్థమే కాలేదు. పాట్నా లోని ప్రసిద్ధ కవి మర్హూం ఉస్తాద్ షాయర్ జీవితంలో చాలా వ్యాప్తిలోకి వచ్చిన ఒక ఘట్టం గుర్తుకు వచ్చింది. ఆయన ప్రియురాలి పెళ్ళి, ఆయన తమ్ముడితోనే జరిగింది. ఇక గుండెను పిండి చేసిన యీ సంఘటన తరువాత, జీవితమంతా నరకమనుభవించాడా కవి.

అన్నీ త్వరత్వరగా జరిగిపోతున్నాయి. సమద్‌కు శాంతి కరువైంది. మాటిమాటికీ ఫోన్ చేసి జూబీని ఇబ్బందిపెట్టటం ఇష్టం లేదు సమద్‌కు! జీవితంలోని యీ నాటకీయ వ్యవహారం అతనికంతా అయోమయంగా ఉంది. ఏ కవి జీవితం లోనూ ఏ కథలోనూ ఇటువంటి సందర్భం గురించి వర్ణన లేదు.

సమద్ గంగా తీరంలో దిక్కుతోచకుండా తిరుగుతున్నాడు. ఇంట్లో అన్నయ్య ఫారూక్ హసన్‌తో జూబీ నికాహ్ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గంగ అలలమీద జూబీ బొమ్మ ఏర్పడటం, చెదిరిపోవటం, చూస్తున్నాడు. పొద్దున్న మంచు తరకలమీద కూర్చుని గాలి సహయంతో ఆకాశంలోని నక్షత్రాల వరకూ వెళ్ళి అక్కడ జూబీ కోసం వెదుక్కుంటాడు సమద్. నీలాల తారకల్లా మెరుస్తున్న జూబీ కళ్ళు అతన్ని అనుసరిస్తుంటాయి.

ఈ క్రమం నడుస్తూ ఉంది. రహమనియా హోటల్ లో నడిచే కవి సంగమాలలో సమద్ కనిపించటం లేదు. అర్ధరాత్రెప్పుడో కబరిస్తానియాకు వెళ్ళినా చాయ్ గటగటా తాగేసి వెళ్ళిపోతున్నాడు. సమద్ మనసులోని బాధేమిటో వాళ్ళింట్లో ఎవరికీ అంతుపట్టటమే లేదు.

***

నికాహ్ సమయం. అంజుమన్ ఇస్లామియా హాల్‌లో పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. కాజీ అడిగినప్పుడు జూబీ ఒక్కసారి కూడా నికాహ్ తనకిష్టమేనని చెప్పనేలేదు. ప్రతిసారీ స్పష్టంగా ‘నాకిష్టం లేదు’ అనే చెప్పింది.

అందరూ నిశ్చేష్టంగా ఉండిపోయారు. కాజీ చాలా ప్రేమగా అడిగాడు, ‘తల్లీ! ఈ సంగతి ముందుగా మీ నాన్నకు ఎందుకు చెప్పలేదు?’

‘ఆయన నన్ను అడగనేలేదు. అసలు నికాహ్ ఎవరితోనో కూడా చెప్పలేదు.’

‘మీ అమ్మకన్నా చెప్పవలసింది కదా! అదీ చెయ్యలేదా?’ ప్రకటించేముందు ఒకసారి నిర్ధారించుకోవాలని అడిగాడాయన.

‘అమ్మతో చెప్పలేదు. ఇంట్లో ఇంకా ఐదుమంది కూతుళ్ళున్నారు. వాళ్ళ జీవితాలను కాపాడవలసిన బాధ్యత ఆమెమీదుంది. అసలామే కష్టం మీద బతుకుతూ ఉంది.’ జూబీ వాంగ్మూలం తరువాత కాజీ ప్రకటన చేశాడు, ‘పెళ్ళికూతురు నికాహ్‌కు ఒప్పుకోవటం లేదు.’ అని. బలవంతంగా నికాహ్ తాను చేయించలేనని చెప్పాడు కూడా!! నికాహ్ నామా మడిచి జేబులో పెట్టుకున్నాడు. జామా మసీదు మౌల్వీ దగ్గర కాజీ స్పష్టంగా చెప్పేశాడు, ‘ఈ అమ్మాయి రక్షణ బాధ్యత ఆమె తల్లిదండ్రులదే! తనకెటువంటి నష్టమూ కలుగకూడదు.’ అని!

అబరార్ హసన్ గొంతు చించుకుంటున్నాడు. తిడుతున్నాడు. ఆతిఫ్ ఖాన్‌ను కాల్చి చంపేస్తాననీ, గొయ్యిలో పూడ్చి పెడతాననీ బెదిరిస్తున్నాడు. పెళ్ళికొడుకు ఫారూక్ హసన్, జామా టోపీ పెట్టుకుని, మల్లె పూల మాల వేసుకుని స్నేహితుల మధ్య కూర్చుని ఉన్నప్పుడు యీ వార్త చేరింది. అతని ముఖంలో విషాదం అలముకుంది.

ఆతిఫ్ ఖాన్‌కు, నోటికి పక్షవాతం వచ్చినట్టు మాటలు రావటమే లేదు. ఇరువురి వైపు బంధువులకూ అసలేమి జరుగుతోందో, అమ్మాయి చివరి నిముషంలో ఇలా ఎందుకు చెప్పిందో అర్థం కావటం లేదు. ఆతిఫ్ ఖాన్ గురించి తెలిసినవాళ్ళకు మాత్రం అర్థమైంది, అమ్మాయి ఏ పరిస్థితిలో ఇలా చెప్పవలసి వచ్చి ఉంటుందో!!

ఆడవాళ్ళ గుంపులో సందడి మొదలైంది. తలత్ బానోకు మాటి మాటికీ స్పృహ తప్పుతోంది. ఆమె ముఖం మీద నీళ్ళు చిలకరించటం, ఆమె కళ్ళు తెరవటం, మళ్ళీ స్పృహ కోల్పోవటం – ఇదే తంతు జరుగుతోంది. జూబీ చెల్లెళ్ళందరూ బిక్కచచ్చిపోయి, తమ అక్కయ్య దగ్గర నిల్చుని ఉన్నారు. దగ్గరి బంధువులు అమ్మాయి గురించి గుసగుసలు పోతున్నారు.

పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అన్ని ఏర్పాట్లమీదా నీళ్ళు చిలకరించినట్టైంది. రాత్రి జరుగబోయే వలీమా విందు కోసం వంటలు వండుతున్న వాళ్ళకు వంట చెయ్యాలో అక్ఖర్లేదో అర్థం కావటం లేదు.

అంజుమన్ ఇస్లామియా దాటి, జామున్ గలీ, సబ్జీ బాగ్ దగ్గర అన్ని ఇళ్ళకూ దావానలంలా యీ వార్త చేరిపోయింది. సబ్జీ బాగ్ కూడలి దగ్గర యకూఫ్ మియ్యా గులాబీ చాయ్ కప్పులలోనూ యీ వార్త కలిసిపోయి, మూసి ఉన్న అబరార్ హసన్ హోటల్ తలుపులు తట్టి, షకూర్ మియ్యా బేకరీని దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది.

ఈ తమాషాలో సమద్ అస్సలు కనబడలేదు. వాళ్ళ ఇంటివాళ్ళకు అతని అవసరమే లేదు. కొంతమంది బంధువులు అతనికోసం వెదికారు, కానీ అతనక్కడ ఉంటే కదా కనిపించేందుకు? అతనెక్కడున్నాడో ఎవరికీ తెలీదసలు. ఇంట్లో వాళ్ళకు కూడా ఏమాత్రం తెలియదు.

అంజుమన్ ఇస్లామియా హాల్‌లో అతను ఉండకూడదు కాబట్టి ఉండలేదు.

***

అబరార్ హసన్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ఫారూక్ హసన్ చాలా రోజులు బ్యాంక్‌కు వెళ్ళనేలేదు. సెలవుపెట్టి ఇంట్లో ఉండిపోయాడు. ఏమీ తెలుసుకోకుండా హడావిడిగా పెళ్ళి నిర్ణయించి, ఇంటి పరువు తీశాడని, తండ్రిదే దీని బాధ్యత అని అనుకుంటున్నాడు. ఆయన ముఖం కూడా చూడటం లేదు. మసూద్ హసన్ ముందునుంచీ కూడా యీ విషయాల్లో తల దూర్చలేదు, కనుక ఇప్పుడాయనకు యెలాంటి బాధా లేదు.

సమయం గడుస్తూ ఉంది.

సమద్ రాత్రెప్పుడో ఇంటికి వస్తాడు, పొద్దున్నే వెళ్ళిపోతాడు. ఇలాగే ఇప్పుడూ!! ఇంట్లోవాళ్ళెవరినీ అతను అడుగ లేదు, ఎవరూ అతనికి చెప్పనూ లేదు. ఈ సమయంలో అతని ముఖం రాయిలా కఠినంగా మారింది. కళ్ళు ఇసుక తిన్నెల్లా ఉబ్బిపోయున్నాయి. జూబీని కలవాలని, మాట్లాడాలనీ ఉందతనికి. కానీ జూబీ ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేసే ఉంటోంది. జూబీ చేసిన పనిని అర్థం చేసుకోలేకుండా ఉన్నాడతను. మనసెటూ లగ్నం కావటం లేదు. రిసర్చ్ పని మరిచేపోయాడు. ఏదైనా పుస్తకం తెరిస్తే, దాని పుటల్లోని అక్షరాలు ఒకటికొకటి కలిసిపోతున్నాయి. పాకుతూ ఉండే పురుగుల్లా కనిపిస్తున్నాయి. ఈ కారణంతో లైబ్రరీకి వెళ్ళటమే మానేశాడు సమద్.

రోజులు గడవాలి కాబట్టి గడుస్తూనే ఉన్నాయి.

నెలలు కేవలం అలా దొర్లిపోతున్నాయి, నిరాసక్తంగా సమద్‌కు! నికాహ్ సంఘటన తరువాత ఇంటి సభ్యుల మాటల్లో వార్త అందింది, ఫారూక్‌తో నికాహ్‌ను కాదన్న జూబీ చనిపోయిందని! తరువాత, యూనివర్సిటీలో చదువుతున్న, జూబీ వాళ్ళ ప్రాంతంలోనే ఉంటున్న ఒకబ్బాయి ద్వారా తెలిసింది, జూబీ వాళ్ళ నాన్న ఆతిఫ్ ఖానే ఆమెను చంపేశాడని! పీర్ ముహానీ కబ్రిస్తాన్‌లో పాతిపెడుతూ, చివరి ప్రార్థన వినిపిస్తున్న సమయంలో పోలీసులొచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారట! పోస్ట్ మార్టం తరువాత, బంధువులు అంత్యక్రియలు చేశారట! పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం, జూబీ గొంతు నులిమి చంపిన గుర్తులున్నాయట కూడా!! ఆతిఫ్ ఖాన్ జైల్లో ఉన్నాడట! ఆయనకు బైలు కూడా రావటం లేదు. జామా మస్జిద్ అహలే హదీస్ మౌల్వీని కాజీనీ ఆయనకు వ్యతిరేక సాక్షులుగా కోర్ట్లో హాజరు పరచారట!

భయంకరమైన యీ నిజాన్ని విన్న తరువాత సమద్ జీవచ్ఛవమే అయ్యాడు. పగలూ, రాత్రీ తేడా లేకుండా తిరుగుతూ ఉండే సమద్ ఇప్పుడు తన గదిలోనే ఖైదీగా ఉండిపోయాడు. అతని గదెప్పుడూ గడియ పెట్టే ఉంటుంది. పగలు, పరదాలు వేసి ఉంటాయి. రాత్రి దీపాలు ఆర్పివేయబడే ఉంటాయి. వాళ్ళమ్మ దిల్ జాన్ బీ గదిలో టిఫిన్, భోజనం పెట్టి వెళ్తుంది. ఎప్పుడైనా తింటాడు. లేకపోతే అవలాగే పడుంటాయి. సమద్ తన చీకటి గదిలో పచార్లు చేస్తూ తనలో తాను గొణుక్కుంటూ ఉంటాడెప్పుడూ, ‘జూబీ!! నువ్వెందుకిలా చేశావ్? నికాహ్ నాటకమంతా ఎందుకు? ఎవరిని శిక్షించాలనుకున్నావ్ నువ్వు? నాకు ఉత్తుత్తి నమ్మకం కలిగిస్తూ, నువ్వు మాత్రం ఇలాంటి పని ఎందుకు చేశావ్? ఇన్ని అవమానాలను మోసుకెళ్ళే అవసరమేమిటి నీకు? నన్ను ఒంటరిగా ఇక్కడే వదిలి వెళ్ళిపోవలసినంత తొందరేమిటి? మీర్ కవిత్వాన్ని తలగడ కింద పెట్టుకుని పడుకునే నువ్వు ఆయననే మరచి పోయావెలా?’ మీర్ కవితనే పదే పదే గుర్తు చేసుకునే వాడు సమద్.

ప్రేమలో న్యాయాన్ని కోరటమే అందం,

కళ్ళు మూసుకుని చనిపోవటం, ఇదస్సలు కళే కాదు.

ఈలోగా గడ్డమూ పెరిగింది, పొడుగైన తల వెంట్రుకలు ఇంకా పొడవైపోయాయి.

***.

ఎండ విరగ్గాస్తూంది. మర్రి చెట్టు కింద చప్టా మీద కూర్చుని ఉన్న సమదూ ఫకీర్ దర్గా లోకి వచ్చి వెళ్తున్న వాళ్ళను చూస్తున్నాడు. రసీదన్ వచ్చి వారం రోజులైంది. ఈ వారంలో అతని గతం ఆయన్ని ఢీకొని ఢీకొని చాలా గాయపరుస్తూనే ఉంది. గతం, తన గోళ్ళతో పగలూ రాత్రీ పీల్చి పిప్పి చేస్తూనే ఉంది. అతనెవరితోనూ మాట్లాడలేదు. గాయపడిన పక్షిలా తన గతంతో పాటూ బాధపడుతూ ఉండిపోయాడు. చాలా కాలం తరువాత మీర్ గుర్తుకొచ్చాడు సమద్‌కు!

మిరీ నమూద్ నన్ను బూడిదగా మార్చేశాడు,

నా అన్వేషణలో నేనే అయ్యాను ఒక వినాశనంగా!

ఇంత క్రితమే సమదూ దర్గా యజమాని నుంచీ వచ్చాడు. ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు. చేతులు ముద్దిడుకున్నారంతే!! కుశలప్రశ్నలయ్యాయి. కురాన్ లోని ఒక ఆయత్ చదివి ప్రార్థన చేశారు. దర్గా అధిపతికి తన పరిస్థితి బాగాలేదని తెలిసే తనను పిలిపించారేమోననిపించింది సమదూకు! వారిని కలుసుకుని వచ్చిన తరువాత, సమదూ కళ్ళు చెమర్చాయి. దర్గా యజమాని, సమదూ బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటారు. యువకుడు, సమదూ కంటే దాదాపు 20 ఏళ్ళు చిన్నవారు కూడా!! షాహ్ షర్జా సన్నిధిలోకి సమదూ వచ్చినప్పుడు, వారి నాన్నగారు, దర్గా యజమానిగా ఉండేవారు. తమ తండ్రిగారు చనిపోయినప్పుడు వీరింకా మైనర్‌గా ఉండేవారు. బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు, మోసపూరిత వ్యవహారాలు తెలియనివాడూ ఐన సమద్‌ను, తమ నాన్నగారు ఎంతగానో గౌరవించటం చూసేవారు. అందుకే ఇతను కూడా సమద్‌ను గౌరవించే విషయంలో నాన్నగారినే అనుసరించాడు. అదే గౌరవం, అదే ప్రేమ! సమదూ బాగా చదువుకున్న వాడని అందరికీ తెలుసు. ఉర్దూ సాహిత్యంలో నిష్ణాతుడనీ తెలుసు. అందువల్ల దర్గా లోని వాళ్ళందరూ బాగా గౌరవించేవారు. అక్కడున్న గ్రంథాలయం లోని దుర్లభమైన పాండులిపులనూ (చేతివ్రాతలో ఉన్న గ్రంథాలనూ) తాకే హక్కు కేవలం సమదూకే దర్గా యజమాని ఇచ్చారు. సమదూ భోజనం, ఇతర అవసరాలన్నిటినీ చూసుకోవటం, దర్గా కమిటీ బాధ్యతే!

సమదూ, ఫకీర్‌గా మారిన తొలినాళ్ళలో భిక్షా పాత్ర చేతిలో పట్టుకుని భిక్ష అడుక్కునేవాడు. తక్కిన ఫాకీరుల్లాగా, ఒక్క పైసా కూడా రేపటికోసం దాచుకునేవాడే కాదు. బతికేందుకు ఎంత అవసరమో అంతే! ఊపిరి పీల్చుకోవటానికి ఎంత అవసరమో, అంతే! తన చిన్నతనంలో తన దాదా, రిక్షాలో కూర్చుని, భిక్ష అడిగేందుకు వెళ్ళటం చాలా సార్లు చూసేవాడు. నల్ల జుబ్బా, పెద్ద పెద్ద పూసల హరాలు వేసుకునేవారాయన. ఒక చేతిలో భిక్షా పాత్ర, రెండో చేతిలో వెండి పిడికిలి ఉన్న దండం పట్టుకునేవారు. సబ్జీబాగ్ లో కూడా అప్పుడప్పుడూ తిరుగుతూ ఉండేవారు కూడా!! నాన్న భయంతో తాతను ఎప్పుడూ కలవలేదు. కానీ వారిని కలవాలనీ, వారి భిక్షా పాత్రని ముట్టుకుని చూడాలనీ చాలా అనిపించేది. ఒక హారమడిగి తను వేసుకోవాలనీ, అయన వెండి పిడికిలి ఉన్న దండాన్ని తన స్నేహితులకు చూపించాలనీ మనసు తహతహలాడేది. కానీ తాను చేయలేకనేపోయాడు. నాన్న తన పెళ్ళి తరువాత ఆ ఇల్లే వదిలిపెట్టేశాడట! సబ్జీబాగ్లో తన అత్తగారింట్లోనే (అమ్మా వాళ్ళ పుట్టిల్లు) ఉండేవాడట! మామయ్యను హోటల్ వ్యాపారం నుంచీ నెమ్మదిగా తప్పించి తానే ఆక్రమించుకున్నాడట కూడా నాన్న!! ఆ తరువాత మామయ్య పిచ్చివాడైపోయాడు. కొన్ని రోజులటూ ఇటూ తిరిగేవాడు, తరువాత, కనిపించనేలేదు – ఇప్పటిదాకా!! నాన్నే మామయ్యని మాయం చేసేశాడని చుట్టుపక్కలవాళ్ళు అంటూ ఉంటారు. తాతయ్యకు అమ్మొక్కతే కూతురు, అందుకే ఇక్కడే ఇల్లరికంగా ఉండిపోయాడు నాన్న. నాన్నకు తన అమ్మా నాన్నలంటే అసహ్యం. తాతయ్య ఫకీర్‌గా తిరగటం చాలా నామోషీగా అనుకునేవాడు నాన్న. అందుకే ఆ ఇంటితో, తన తల్లిదండ్రులతో సంబంధమే వదులుకునేశారు.

ఆనాటి రాత్రి చాలా చిత్రమైనది. బూడిదలా ఆకాశం నుండీ రాలుతున్న చీకటి. పొయ్యిలోని నిప్పు కణికలూ, పొగతో నల్లబారిన బాణలిలా ఆకాశం, భూమి మీద వేలాడుతూ ఉంది. అంతా ఏదో నిస్తేజం. సమద్ తనను తాను ప్రశ్నించుకున్నాడు, ‘నువ్వెవరు సమద్?’

‘నేనా? నేనెవరినో నాకే తెలియదు.’ గొణిగాడు లోలోపల!

దూరం నుంచీ ఒక గొంతు. ‘నువ్వెవరో తెలియనప్పుడు బతకడమెందుకు? పగటి వేళ కూడా ఇంత చిక్కటి అంధకారమున్నప్పుడు, ఆ చోట ఇలా బతుకుతూనే ఉండటం పిచ్చితనం కాదూ? నీ నిద్ర కళ్ళతో ఏ జాగృత జగత్తు కోసం వెదుకుతున్నావు నువ్వు? ఇదిగో, ఆకాశం నుంచీ రాత్రిలా రాలుతున్న యీ బూడిద, ఆహుతైన నీ ప్రేమదే! బాణలిలా వేలాడుతున్న యీ ఆకాశం, నీ మరణం తరువాత ప్రపంచం గుర్తించే నీ ముఖమే! విన్నావా సమద్ హసన్? అర్థం చేసుకో! ఈ బూడిదను ఆకాశంలోకి ఎగరనీ! వ్యాపించనీ!’ తన గదిలోని కిటికీ, తలుపూ మాయమైపోయినట్టనిపించింది సమద్ కు! గదిలో ఎటు చూసినా తలుపులే తలుపులు! చిత్ర విచిత్రమైన ఆయుధాలు ధరించిన వాళ్ళు!! ఎటు తిరిగినా వాళ్ళే!! తప్పించుకునే దారే లేదు. కళ్ళు రెండూ మూసుకునేశాడు సమద్! వణుకుతున్న గొంతుతో క్షమించమని ప్రార్థించాడు – ‘అస్తగాఫిర్ ఉల్లాహ్!’

సమద్ లేచాడు. తన చీకటి గది గొళ్ళెం నెమ్మదిగా తీసి, బైటికొచ్చాడు. మెట్ల నుండీ శబ్దం చేయకుండా కిందికొచ్చాడు. గేటు తెరచి, దిల్జాన్ మంజిల్ నుండీ బైటికొచ్చి, జామున్ గల్లీ దాటి వెళ్ళిపోయాడు.

నడుస్తూనే ఉన్నాడు సమద్.

తన కాళ్ళమీద బొబ్బలెక్కినా నడుస్తూనే ఉన్నాడు. గుంతలు దాటుతున్నాడు. కంకర నిండిన కాలిబాటలు, కొండలలాగ పెరిగిన గుట్టలూ – అన్నీ! ఆయన చెవుల్లో వినిపిస్తున్న ఎగతాళి తాలూకు అట్టహాసం శబ్దం, దారిలో అగ్ని జ్వాలలతో మండుతున్న అడవులకన్నా, పొంగి పొరలుతున్న నదీజలాల హోరుకన్నా ఎక్కువ భయంకరంగా ఉంది.

ఆ రాత్రి జామున్ గల్లీ నుంచీ బైటికి వెళ్ళిన సమద్ తిరిగి అక్కడికి రానేలేదు. మఠాలూ, దర్గాలూ పట్టుకుని తిరుగుతూనే వున్నాడు. అన్నిటికన్నా ముందు పట్నా లోని మఖ్దూమేజహాన్ గారి తాతయ్య హజ్రత్ శహాబుద్దీన్ పీర్ జగ్ జోత్ సుహారావర్దీ మఠం చేరుకున్నాడు. అక్కడినుంచీ హజరత్ మఖ్దూమే జహాన్ శేఖ్ షర్ఫుద్దీన్ అహమద్ యాహయా మనేరీ కి చెందిన బిహార్ శరీఫ్ మఠం లో, తరువాత మనేర్ లో అబ్దుర్రహీం ఖాన్ ఖానా ఆధ్యాత్మిక గురువు హజరత్ మఖ్దూం శాహ్ దౌలత్ మనేహీ మఠంలో కొంతకాలమున్నాడు. తరువాత మనేర్ నుండీ కాకో చేరుకుని పీర్ జగజోత్ కుమార్తె బీబీ కమాల్ మఠంలో చాలా రోజులున్నాడు. అక్కడి ప్రకృతి సంపద కూడా సమద్‌కు శాంతినివ్వలేకపోయింది. మళ్ళీ తిరగటం! భాగల్పూర్, ముంగేర్, మనిహారీ ఘాట్, సీవన్ దగ్గర హసన్ పురాలో హజరత్ మఖ్దూం సైయ్యద్ హసన్ దానిశ్ మంద్ దర్గా, హాజీపూర్ దర్గా – ఇలా అన్ని చోట్లకూ తిరుగుతూ ఉంటే పాట్నా మాటిమాటికీ అతన్ని తనవైపు లాక్కుంటూ ఉంది. అక్కడి గంగా తీరాలు ఆయన్ను పిలుస్తున్నాయి. ఓసారి, గంగా, గండకీ సంగమ స్థలిలో సాయంత్రపు సూర్యుడి బంగారు రంగు, అతని కళ్ళల్లో నిండిపోతుంది. మరో సారి, గంగ ఒడ్డున ఉదయిస్తున్న సూర్యుడు కళ్ళు నులుముకుంటూ చేతులు చాచి తనవైపు వస్తున్నట్టు కనిపిస్తాడు. చివరికి పాట్నాకు చేరుకున్నాడు. ఈ లోగా దర్గాలు చుడుతూ, తనకోసం ఒక వినమ్రతను మాత్రం తీసుకుని వచ్చాడు. మరికాస్త వినయం, పళ్ళతో నిండిన వృక్షంలా జ్ఞానం నిండిన జోలెతో, భూమిని ముద్దాడుతూ, తన అర్ధ నిమీలిత నేత్రాల్లో అమ్మతనం, గుండెల్లో మమతలతో గంగా తీరంలో మీతన్ ఘాట్‌లో హజరత్ మఖ్దూం శాహ్ ముహమ్మద్ మునయింపాక్ దర్గా చేరుకున్నాడు. కొన్ని నెలలక్కడే ఉన్నాడు. తరువాత శాహ్ అర్జా దర్గాకు చేరుకుని ఖుదా ఆజ్ఞగా ఇక్కడే స్థిరపడిపోయాడు. ఈ క్రమంలో సమద్ మఠాలలో ఉన్న లెక్కలేనన్ని గ్రంధాలు చదివాడు. చాలా విన్నాడు, అర్థం చేసుకున్నాడు.

అలా ఏడు సంవత్సరాలు గడచిపోయాయి. చాల పెద్ద ప్రయాణమతనిది. ఈ ప్రయాణంలో కాళ్ళు తడబడి నప్పుడల్లా, తాత కాలే ఫకీర్ వచ్చి, తన దండంతో ఆసరా ఇచ్చేవాడు. చిన్నతనంలో చూశాడంతే, కానీ మాట్లాడింది లేదు, ఆయన స్వరూపం ముందుకెలా వచ్చి నిలబడేదో కానీ, సమద్ సర్దుకుని ముందుకు నడవ గలుగుతాడప్పుడు!! అమ్మ దిల్జాన్ బీ తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఆమెతో మాట్లాడాలనుకుంటాడు, కానీ గొంతు పూడుకుపోతుంది. మరి జూబీ? జూబీ ముఖం, చంద్రబింబంలో కలిసిపోయేది. మీర్ లాగే చంద్రుడు వెన్నెల కురిపించే రోజుల్లో గదిలోనే ఉండిపోతాడు సమద్. తరచూ, చందమామ ఆకాశం నుండీ దిగి తన దగ్గరికి వచ్చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మీర్, సెలవు తీసుకుని వెళ్ళిపోతున్న చంద్రుణ్ణి చూడలేకపోయేవాడు. సమద్ వస్తున్న చంద్రుణ్ణి చూడలేకపోయేవాడు. చంద్రుణ్ణి చూడటం, చిత్రహింసే సమద్‌కు!! మెల్ల మెల్లగా చంద్రుడున్న రాత్రుల్లోనూ జీవించటం నేర్చాడు సమద్. పరిస్థితులు మారాయి, శాంతీ లభించింది.

ఈ ఏడు సంవత్సరాల్లోనూ సమద్ జీవన శైలి మారిపోయింది. స్వరూపం మారింది. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. నెమ్మదిగా కదిలే యీ ప్రపంచం ఎలా మారిపోతుందో, అలాగే సమద్ కూడా మారిపోయి, సమద్ ఫకీర్ ఐపోయాడు.

(సశేషం)

Exit mobile version