దాంపత్యాలు

1
2

[నాలుగు తరాలుగా వైవాహిక సంబంధాలలో వస్తున్న మార్పులను సూచిస్తూ శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘దాంపత్యాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

పాతతరంలో:

[dropcap]అ[/dropcap]లవాటుగా ఆ సందులో ఉన్న ఆడవాళ్లందరూ బుగతగారి ఇంటి అరుగుల మీద కాలక్షేపానికి చేరేరు.

“ఏం సుందరీ మీ అమ్మకి ఎలా ఉందిటే? నువ్వు గానీ.. ప్రయాణమా‌ మీ ఊరు?” తాంబూలం నములుతూ అడిగిందో ఇల్లాలు.

“అయ్యో అంత భాగ్యమా? మా ఆయనా పంపరు.‌ మా అత్తగారు సరేసరి. ఎప్పడెప్పటి కోపాలు ఒలకపోస్తూనే ఉంటారు. నా రాత ఇంతే!” కన్నీళ్లు దాచుకోలేదు సుందరి.

ఒక్కసారి ఆడవాళ్లందరూ రెచ్చిపోయేరు. తమతమ మొగుళ్లతో ఉన్న బాధలు అందరూ వెళ్కగక్కేరు. ఒకళ్లని ఒకళ్లు ఓదార్చుకున్నారు. కొసకి అందరూ ఆడదాని బతుకు మొగుడితో‌ ముగియాల్సిందే అని తేల్చేసుకున్నారు.

ఇంకో తరం తరవాత:

చాలా ముచ్చటయిన కోలనీ.

ఫేక్టరీ సైరన్‌తో మగవాళ్లందరూ ఆఫీసులకి వెళ్ళిపోతారు. పిల్లలని స్కూళ్లకి పంపి మిగులు పనులు చేసుకుంటే ఆడవాళ్లకి కాస్త ఖాళీ. వడియాలు ఎండబెడుతూనో బట్టలు మడతలు వేస్తూనో స్త్రీలందరూ కబుర్లాడుకుంటూనే ఉంటారు.

సంభాషణలన్నీ భర్త, అత్తగారు, పిల్లలు, కొత్త సినిమాలు, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక్కోక్కళకీ ఒకో సమస్య.

రంగారావు భార్య వనజ చేతికి నయాపైసా ఇవ్వడు.  ఏ చిన్న ఖర్చుకైనా మొగుడిని అడగాల్సిందే! అతను ఇస్తే ఇచ్చినట్టు.‌ లేకపోతే లేదు. ఆమె దుఃఖ పడుతూనే ఉంటుంది.

సుబ్రహ్మణ్యం ఇంకో రకం. భార్య చేతిలో ఆపాటి డబ్బు ఉంటుంది. అయినా భార్య కట్టే చీర కూడా అతనిష్టమే!  ఆమెకి ఎంతో ఇష్టమైన లేత గులాబీరంగు చీర కొనకుండా ఇంకా ఖరీదైన ఎర్ర చీర కొన్నాడు. తనకి నచ్చని చీరలో భార్య కనిపిస్తే ఉగ్రుడయిపోతాడు.

ఇహ నరసింహారావు పేరుకి తగ్గవాడే! చాలా అసహనం‌ మనిషి. చిన్న తప్పునీ క్షమించక పోగా భార్య మీద తరచూ చెయ్యి చేసుకుంటూనే ఉంటాడు. పెళ్లాం అన్నది, మొగుడు కొట్టినా తిట్టినా పడి ఉండితీరాలన్నది అతని స్థిర అభిప్రాయం.

శివ నారాయణకి  ఇంకో ఆడపిల్లతో సంబంధం ఉందని భార్య లక్ష్మి కి తెలుసు. ఇల్లు మొగుడూ పెళ్లాల దెబ్బాటలతో రణరంగమే! ఇరుగూ పొరుగూ వినేలాగే అరుచుకుంటూ ఉంటారు.

ఆడవాళ్లందరూ ఉన్నప్పుడు అందరు వాళ్ల సమస్య లలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకరిద్దరు విరక్తిగా “ఈ బతుకు బతికే కన్నా ఈ మొగుడికి దూరంగా బతికే దారి ఉంటే బాగుండును” అని వాపోతూ ఉంటే, పెద్దతరం వాళ్లు సుతారం వినక “మొగుడంటే అలాగే ఉంటాడు. అంతపాటికి మొగుణ్ణి వదిలిస్తే నీకు దక్కే గౌరవం ఏమిటి?” అని నిగ్గదీసి వాళ్ల మనసుని మార్చలేకపోయినా తమ నీతిబోధ ఆపరు.

ఉద్యోగస్తుల తరంలో:

రాజేశ్వరీ, అరుణా, కమలా, లలితా, బేగం, మేరీ అందరు ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. లంచ్ అవర్‌లో‌ మగాళ్లు వినకుండా జోరుగా  విషయాలు చర్చించుకుంటూ ఉంటారు.

ఒకళ్లిద్దరికి తప్పితే అందరికీ భర్తలతో సమస్యే!  బేగం బ్యాంకు బుక్, చెక్ బుక్, భర్త దగ్గరే ఉంటాయి. జీతం పే స్లిప్‌తో సహా అతనే తీసుకుంటాడు. ఆమె ఖర్చులకి మాత్రం చేతికిస్తాడు. నలుగురు  ఆడపిల్లలు ఆమెకి. కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేదు.

రాజేశ్వరి భర్త ఆమెని, స్నేహితురాళ్లతో ఓ సినిమాకీ షికారుకీ ఎక్కడకీ పంపడు. తనతోనే రావాలి. అందరూ సరదాగా ఏ పిక్నిక్‌కో వేళుతూ ఉంటే ఆమె ఏడుస్తూ ఇంట్లోనే ఉంటుంది.

లలిత భర్తకి లలిత స్వతంత్ర భావాలు, ఆమె చదివే పుస్తకాలు ఏవీ నచ్చవు. తారాస్థాయీ తగువుల్లో ఆమె మొగుడిని వదిలేసి రెండు సార్లు పుట్టింటికి వెళిపోయింది. అందరూ ఫేమిలీ మీటింగ్ పెట్టి ఇద్దరికీ రాజీ కుదిర్చి సంసారంలో ఉంచేరు. లలిత తన స్వతంత్రానికి అడ్డుగా వస్తే భర్త నయినా కేర్ చేయనని అందరికీ వార్నింగులు ఇచ్చింది

కమల భర్తకి ఇంకో సంసారం ఉంది. అతను పబ్లిక్ గానే చెప్పేడు. కమల ఆ విరక్తితో కొన్నాళ్ళు పుట్టింటికి వెళిపోయింది. తమ్ముడి పెళ్లి అయి మరదలు రాగానే వేరే ఇల్లు తీసుకొని పిల్లలతో  కలిసి ఉంది. లోకం కొసం మగడు ఎప్పుడయినా వస్తె చూసీ చూడనట్లు ఊరుకుంటుంది. పిల్లలు ఆ జీవితంకి అలవాటు పడిపోయేరు.

ఆ తరం ఆడవాళ్లు ఒక కప్పు కింద ఉన్నా మనిపించుకుంటూ సంసారాలు సాగించేరు.

ఈతరంలో:

శ్రీజ, చరణ్ ల‌ పెళ్లి పెద్దలే చేసేరు. పెళ్లయిన రెండేళ్లకే ఇద్దరికీ తగువులు ఎక్కువయేయి. చరణ్‍౬కి చిన్న పని కూడా అలవాటు లేదు. శ్రీజ కూడా అపురూపంగా పెరగటం, చదువు కెరీర్‌కే ప్రాధాన్యత ఇవ్వడం చేత అంత పనిమంతురాలు కాదు. అత్తమామాలు ఇంకో ఊరులో ఉంటారు.

చేసుకోలేక చరణ్ మీద కోపంతో సంసారం అక్కరలేదని వెళ్లిపోయింది. పెద్దలందరూ ఏకమయి నచ్చచెప్ప బోయేరు. శ్రీజ పిచ్చి కోపంతో అందరి ముందూ తల్లి మీద ఎగిరింది. “అసలు ఉద్యోగం చేస్తూ నాన్నకి ఏ పనీ చెప్పకుండా నువ్వు పాడు చేసేవు. నీలాటి తల్లుల వల్లే ఈ కాలం మగపిల్లలకి ఏ పనీ రాకపోగా, అంత బాధ్యతా పెళ్లానిదే అనుకుంటున్నారు. కనీసం తమ్ముడికయినా పనీ పాటా నేర్పించు. లేకపొతే కోడలు వస్తుందన్న ఆశయినా వదులుకో..” అంది.

అత్తగారికి దడ వచ్చేసింది. ఏ మాటంటే కోడలు తనని ఏం ఏకి పారిస్తుందో అని ఊరుకుంది. వాళ్ల సమస్య కాలం పరిష్కరిస్తుందని పెద్దలందరూ సరి పెట్టుకున్నారు‌.

సుష్మ ఎంగేజ్‌మెంట్‌కి కాబొయే భర్త అనిల్ ఆఫీస్ పంపిస్తే ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఎంగెజ్మెంట్ అయిన దగ్గరనించీ సెల్ ఫోన్లో స్నేహితులతో మాటాడుతూనే ఉంది. ఆ స్నేహితులూ అబ్బాయిలే!

ఆ పకపక నవ్వులు ఆమె హావభావాలు చూసి కాబోయే ఆడపడచులు చికాకు వేసి, తమ తల్లితో వాదం వేసుకున్నారు.

ఆవిడ లబోదిబోమంది. ఒకాడపడచు కోపంతో కాబోయే మరదలుని తీవ్రంగా మందలించింది. సుష్మకి చాలా ఆవేశం వచ్వింది. ఘర్షణలు తీవ్రస్థాయులో అయేయి. సుష్మ చచ్చినా ఆ సంబంధం చేసుకోను అని పెళ్లి సంబంధం రద్దు చేసేసింది.

తల్లి‌ నచ్చచెప్పబోతే ఇంతెత్తున లేచింది. అయిదంకెల జీతం సంపాదిస్తు తనకి పడి ఉండాల్సిన ఖర్మ లేదనీ, ఈ బోడి సంబంధం కాకపొతే మరోడు వస్తాడని తేల్చేసింది.

తరవాత దశకంలో‌ విడాకులు అసలు పెళ్లే వద్దు అనడాలు, ఆడపిల్లల తల్లులు కూడా తమకి అనుకూలంగా ఉండే అల్లుడు రావాలని ఖరాఖండీగా చెప్పడాలూ ఎక్కువ అయిపోయేయి.

ఆడవాళ్ల సంపాదనలు వచ్చిన తొలి రోజుల్లో ఉన్న అణకువలు అనవసరం అన్న అభిప్రాయాలు ఆడవాళ్లకి వచ్చీడం మగవాళ్లకి రాకపోడం వలన వివాహ వ్యవస్త ఒడిదుడుకులకి లోనవుతోంది.

ఇద్దరి ఆలోచనలనీ ఒక వేవ్‍లెంత్ మీద ఉంచే కౌన్సిలింగ్ సెంటర్లు ఎక్కువ అయేయి. మంచి ఫలితం వచ్చిన చోట వచ్చింది. రాని చోట లేదు.

భార్యని గౌరవించీ ప్రేమించీ విలువ ఇవ్వాలని మగవాళ్లు, కోడలూ కూతురిలాటిదే అని అత్తలూ, కూతురి సంసారం తనే మానిటర్ చేయాలని అనుకోకూడదని  ఆడపిల్లల అమ్మలూ, పెళ్లి అయిన తరవాత భర్తతోనే కలిసి మెలిసి ఉండాలని ఆడపిల్లలూ తెలుసుకోనంత కాలం సంసారాలు సక్రమంగా సాగడం కష్టమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here