దానాలలోకన్నా గొప్పదానం (అవయవదాన కథానికలు)

0
2

[dropcap]మ[/dropcap]నిషి తన జీవితంలో లభించిన వనరులను తన అవసరానికి తగ్గట్టుగా ఉంచుకుని, వాటి లేమితో బాధపడుతున్నవారికి తన వంతు నిర్మలమైన మనసుతో సాయం చేసే ఒక అపూర్వ ఘట్టమే ‘దానం’.

దానాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. “ఇక చాలు, కడుపు నిండింది” అని ఆత్మ సంతృప్తితో అతిథి భోజనం విస్తరి ముందు నుంచి లేచినపుడు ‘అతని ఆకలి బాధ తీరచగలిగాను’ అనుకుని సంతృప్తితో ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవించిన అతిథి దీవెన దానం చేసిన వ్యక్తికి ఆజన్మాంతం చల్లని గొడుగై కాపాడే అన్నదానాన్ని మించిన దానం మరేది లేదు. మిగతా దానాలు ఎన్ని పొందినా సంతృప్తి పడని ‘స్వీకర్త’ అన్నదాన విషయంలో సంతృప్తి చెందుతాడు.

అయితే కాలానుగుణంగా సాంఘిక పరిస్థితులు మారి, సాంకేతికత రాజ్యం చేస్తున్న ఈ అధునాతన కాలంలో ‘బ్రెయిన్ డెడ్’ అయిన వ్యక్తి నుంచి అతని బంధువుల అనుమతితో కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయము, ప్రాంక్రియాజ్ వంటి అవయవాలను సేకరించి వాటి అవసరం ఉన్న వ్యక్తులకు అమర్చి వారికి ‘పునర్జన్మ’ ప్రసాదించే అద్భుత దానమే ‘అవయవ దానం’.

ఈ అంశాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, దానిని విశ్వవ్యాప్తం చేస్తూ 16 కథల సమాహారంగా మలచి ‘అవయవదాన కథానికలు’ పేరుతో వెలువరించిన అత్యుత్తమ సాహితీవేత్త, సాహితీ పోషకుడు, ‘కథానిక’యే శ్వాసగా భావించి సాహిత్య పునాదులతో దాని కూకటి వేళ్ళను కనుగొని, సాహితీ మూలస్తంభాలైన శ్రీపాద, గిడుగు, గురజాడ, మొక్కపాటి మొదలైన సాహితీ స్రష్టల రచనలని, వారి వారి జీవన నేపథ్యాలను పరిశీలించి, పరిశోధించి సాహితీ సర్వస్వాలుగా ‘శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్’ పేరిట ముద్రించి సాహితీ పునాదులను పటిష్టపరిచిన మహోన్నత రచయిత డా. వేదగిరి రాంబాబు.

సాహిత్యాభిలాష ఉన్న పాఠకుడు ఎవరైనా సరే సాహితీ రచన చేసిన, చేస్తున్న వ్యక్తుల రచనలు చదివి, తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తూ సూచనలను, సద్విమర్శలను సున్నితంగా, రచయితల మనసులు గాయపడకుండా చేయగలగాలి. ఆయా రచయిత రచనలలో తాను కొత్త అంశాలు ఏం నేర్చుకోగలిగాడో తెలుసుకునేవాడు అయి ఉండాలి. ఆయా రచయితల సాహిత్య కృషిని గుర్తించగలిగి, వీలైతే పదిమంది స్నేహితులకు పఠనాభిలాష కలిగేలా ప్రోత్సహించాలి. అటువంటి ఉత్తమ పాఠకులు ఎందరో డా. వేదరిగి రాంబాబు గారికి ఉన్నారు. అంతకంటే అటువంటి అత్యుత్తమ సాహిత్య కృషిని గుర్తించేలా వారి సాహితీ సేవ, రచనలను కొనసాగాయని చెప్పడమే సమంజసం.

అటువంటి వారిలో ఈ కథల సమాహారానికి ముందుమాటలో “మనిషి మనిషికీ చెప్పండీ ‘గాథ’ల్ని” అంటూ వ్రాసిన విహారికి గారి మాటలు ఒక్కసారి యథాతథంగా –

“రాంబాబు స్వయంగా కథానికా రచయిత. ప్రయోగశీలి. కథానికాభ్యుదయానికి తెలుగు సాహితీ క్షేత్రంలో ‘తనసాటి తానే’ అన్న రీతిలో పాటుబడుతూ, తనువును, మనసును, ధనాన్ని అంకితం చేసిన ఒక తపస్వి. ఆ కథానికా జీవి తపనకూ, పిచ్చి ఆరాధనకీ విస్తుపోతున్న మిత్రులు ఎందరో… వారిలో నేనూ ఒకడిని” అన్నారు. వారితో బాటు నేను కూడా.

తన ముందుమాటలో ‘అవయవ దానం’ అన్న పదాలకి శ్రీ విహారి గారు యిచ్చిన నిర్వచనం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే – ఏ ఉద్దేశం నెరవేరాలని రాంబాబు గారు ఈ కథలు రాశారో అర్థమవుతుంది.

“అవయవ దానం అనేది సాధారణ వ్యవహారంలో వినిపించే అంతటి సరళమైనదీ, సులువైనదీ కాదు. దాత, స్వీకర్త, హాస్పిటల్ సాంకేతిక నైపుణ్యం, శస్త్ర చికిత్స చేసే స్పెషలిస్ట్ ‘చేతి చలవ’, ‘హస్తవాసి’, ‘ఎథిక్స్’, అన్నింటికంతే ముఖ్యంగా రోగికి తన ఆరోగ్యం పట్ల ఉన్న, ఉండవలసిన శ్రద్ధ, ఇలాంటి అనేక సంక్లిష్టతలతో కూడిన ఒక ప్రత్యేక కార్యకలాపం” –

మామూలుగా ధన దానం చెయ్యాలంటే డబ్బు కావాలి. వస్త్ర దానానికి బట్టలు కావాలి. యిలా ప్రతీ దానానికి ఏదో ఒకటి కావాలి. కానీ అవయవ దానం చేయాలంటే మాత్రం పై నిర్వచనంలోని అంశాలన్నీ అత్యావశ్యకం.

మామూలు కథలు, మంచి కథలు, గొప్ప కథలు, కులం కథలు, దేశభక్తి కథలు, క్రీడా కథలు, దళిత కథలు, ఆయా ప్రాంత యాస కథలు… యిలా రకరకాలుగా వర్గీకరింపబడిన కథలలో శ్రీ రాంబాబు గారు రాసినవన్నీ ‘విలక్షణ’మైనవని నిర్ద్వందంగా చెప్పవచ్చు.

రచయిత అటువంటి కథలను రాయడానికి ఎంతగా మథనపడతాడో, అంతటి వ్యథని అనుభవిస్తూనే తాను రాసిన ఈ కథలు చదివిన తరువాత ‘అందరిలో అవయవ దానం పట్ల అవగాహన పెరగాలి’ అనుకున్న రాంబాబు గారి ఆశయం కొంతవరకు సిద్ధించిందని చెప్పవచ్చు.

యిక ఈ రకమైన కథా వస్తువును కథలో చొప్పించి పాఠకులకు బోర్ కొట్టకుండా చదివించగలిగేలా రాయగలిగే వ్యక్తి ఖచ్చితంగా కథాసవ్యసాచి అయి ఉండాలి. అందుకే రాంబాబు గారు కథానికా సవ్యసాచి అయ్యారు.

యిక కథల విషయానికి వస్తే – తాను చెప్పిన అంశం పాఠకునికి మరో కోణంలో అర్థం అయినందువలన జరిగే తీవ్ర పరిణామంతో రచయిత ఖంగు తినే సన్నివేశాలతో వ్రాయబడిన ‘అస్పష్ట ప్రతిబింబాలు’ అనేది మొదటి కథానిక. తన కథానిక చదవగానే వాళ్ళకి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ భావాలే వారికి కలిగేలా తన రచనా శిల్పాన్ని రూపొందించుకోవాలి. ఇక ముందు అస్పష్ట ప్రతిబింబాలను తన పాఠకులకు అందించనే నిర్ణయం తీసుకుంటాడు రచయిత.

ఏ రచయిత అయినా తప్పుడు సంకేతాలు పాఠకులకు వెళ్ళని విధంగా రచన చేయాలని చెప్పకనే చెపుతారు శ్రీ రాంబాబు.

అలాగే ‘కొత్త చూపు’ కథలో అవయవ దాన ప్రాధాన్యతని వివరిస్తూ ‘అవయవ దానం చేయాలంటే మొదట ఏ కారణంగా నైనా బ్రెయిన్ డెడ్ అవ్వాలనీ, ఎటువంటి ఇన్‌ఫెక్షన్ లేకుండా ఆ అవయవాలు ఆరోగ్యంగా ఉండాలని, అవయవ దానానికి కుటుంబ సభ్యులు అనుమతించాలని, సరిగ్గా అదే సమయంలో మన అవయవాలకి మ్యాచ్ అయి, మార్పిడి కోసం ఎదురుచుస్తున్న స్వీకర్త ఉండా’లని స్వచ్ఛంద సంస్థ వ్యక్తి చేత పాత్రోచితంగా చెప్పిస్తారాయన.

కథ మధ్యలో ‘జాండిస్’ జబ్బు కాదని, అది ‘లివర్’ అనారోగ్యం పాలవుతోందని తెలిపే ఒక రోగ లక్షణమని పాఠకునికి తెలియని కొత్త విషయాలను తెలియజేస్తారు. కథలో ఆఖరి వాక్యంలో మరణించిన కథానాయకుని బంధువర్గం (అప్పటి వరకు అవయవ దానాన్ని వ్యతిరేకించిన వారు) తమ పేర్లను ఆ బృహత్కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోవడంతో పాఠకుని ఆలోచనలో ఒక మార్పును తీసుకువస్తారు రచయిత.

‘ఈ ప్రశ్నకు సమాధానం’, ‘పరుగో పరుగు’ కథలలో సకాలంలో స్పందించనప్పుడు దాత దానం చేసే పరిస్థితిలో ఉంది, అధికారుల నిర్లక్ష్యం వల్ల యివ్వలేక, స్వీకర్తకు సకాలంలో దాత దొరకక యిద్దరూ మరణించడం పాఠకుని మనసు ఆర్ద్రమవుతుంది.

అమాయకపు మనుషులను నమ్మబలికి, వారిని తీసుకువెళ్ళి ‘కిడ్నీ’ తొలగించి, ప్రాణం పోయవలసిన డాక్టర్లే సొమ్ము చేసుకునే రాక్షస మనస్తత్వాలను ‘ప్రాణం ఖరీదు’లో చూస్తాం,

కుటుంబ యజమానికి యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ డెడ్ అయ్యాడని గమనించిన డాక్టర్లు, తమకు తమ హాస్పిటల్‌కు పేరు ప్రతిష్ఠలు యినుమడింపజేసే నెపంతో, విద్యావంతులు కాని భార్యా పిల్లలను అంగీకరింపజేసి ‘ఈ కార్యక్రమంలో డబ్బు పాత్రే ఉండ’దని చెప్పి ‘గుండె’ను స్వీకర్తకు అమరుస్తారు. ఉన్న చిన్నపాటి ఆధారం కోల్పోయి దుర్భర దారిద్ర్యాన్ని ఆ పేదలు అనుభవిస్తుంటే ‘సొమ్ము ఒకడిది సోకు ఒకడిది’ చందాన మిగతా అంతా బాగుంటారు అని ముగిస్తారు రచయిత ‘దానం కాదిది దీనం’ కథానికలో.

‘ఆమె నిర్ణయం’ – కథలో తొలి కాన్పులోనే భర్తను కోల్పోయిన స్త్రీ తన భర్త తనలో కలిగించిన అవయవదాన అవగాహనకు సరియైన నిర్ణయం తీసుకుని భర్త అవయవాలను ఎనిమిది మందికి దానం యిచ్చేందుకు పురిటి మంచం మీదే తన అంగీకారం తెలిపే గొప్ప కథ. అలాగే ‘తల్లి’ కథలో ప్రమాదంలో మరణించిన కొడుకు అవయవాలను దానం చేసిన తల్లి తాను తొమ్మిది మంది బిడ్దలకు తల్లిని అని ఆత్మ సంతృప్తితో ఆనంద బాష్పాలు రాలుస్తుంది.

అవయవ దానం దొరకకపోతే ఆర్థిక దానం దొరికీ లాభం లేదని చెప్పబడిన ఉత్తమ విలువల కథానిక ‘గొప్పదానం’. కొడుకు గుండె మార్పిడికి ధన సహాయం కోసం టీవీ ఛానెల్ ద్వారా దాతలను అర్థించిన పేద తండ్రి ప్రత్యక్ష ప్రసారం ఫలితంగా ధనం సమకూడుతుంది. అయితే ‘గుండె’ దొరకక కొడుకు మరణిస్తాడు. ఆ డబ్బును తిరిగి మీడియా వాళ్ళకే అందజేసి ఎవరిది వాళ్ళకి అందజేయమని చెప్పి పేదరికం వెనుక పొంచిన ఉన్న నిజాయితీని ప్రదర్శిస్తాడు ఆ పేద తండ్రి. యీ కథ చదివిన పాఠకుడికి కన్ను చమరించక మానదు.

శ్రీ రాంబాబు గారి ఈ కథల విశ్లేషణ అనంతరం మథించిన మనసుతో విహారి గారు రాసిన కొన్ని వాక్యాలు నూటికి నూరుపాళ్ళు స్వర్ణాక్షరాలు.

“అవయవ దానంతో దాత – స్వీకర్త తరపు సంబంధీకులు ఆస్తులు అంతస్తులు, కుల మతాలు, పేద ధనిక అహంకారాల వంటి పట్టింపులకు పోకుండా కేవలం మానవతా దృక్పథంతో తీసుకునే అవయవ దాన నిర్ణయం మనుషుల్లో సమాన భావాన్ని, సార్వజనీనిక తత్వాన్ని ప్రేరేపిస్తుంది. అవయవ దానం తరువాత యువతీ యువకులు యిద్దరూ అన్ని విధాలా వివాహానికి అర్హులే. అవయవ మార్పిడి తర్వాత స్వీకర్త తన ఆరోగ్యానికి తానే బాధ్యత వహించాలి.”

తాను చెప్పవలసిన విషయాన్ని హృద్యంగా కథగా మలచి, స్ఫుటంగా సన్నివేశాలను కూర్చి, అవసరమైన చోట చదువరులకు సరియైన సమాచారం అందిస్తూ సాంఘిక వాస్తవికత, సామాజిక దృక్పథం, సాహిత్యావసరం – ఈ మూడింటి సమ్మిశ్రమంగా ఈ కథానికా సంపుటిని రూపొందించి తన సాహితీ ప్రస్థానంలో మరో కీర్తి బావుటాని ఎగురవేసిన మహోన్నత రచయిత డా. వేదగిరి రాంబాబు. యీ కథలను చదివి స్ఫూర్తి పొందిన పాఠకులలో కొంతమంది అవయవ దాన దాతలుగా సంతకం చేసినప్పుడు అంతకు మించిన ధన్యత రచయితకు ఏముంటుంది?

***

దానాలలో కన్నా గొప్పదానం (అవయవదాన కథానికలు)
డా.వేదగిరి రాంబాబు
పేజీలు: 114, ధర: ₹ 60/-
ప్రతులకు:
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్,
బ్లాక్-6, ఫ్లాట్-10, హెచ్.ఐ.జి-1
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్- 500 044
ఫోన్: 9391343916

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here