Site icon Sanchika

దారి మళ్లింది

[dropcap]ఆ[/dropcap]టుపోట్ల అట్ట మీద
కష్టాల చిట్టా ఏకరువు పెట్టింది
కొన్ని జీవితాలు కార్చిచ్చుల దోసిలిలో కమిలిపోతున్నాయి

పుట్టిన మట్టిలో కూసంత పని కరువైంది
చేతులు జారవిడిచి కొన్ని ప్రాణులు పట్నమెంట నడిచాయి
జానెడు పొట్ట డబ్బాలో రెండు గింజలు కూడబెట్టాలని
ఇంకొన్ని ఉద్దెర బతుకులు ఉరితాడులో ఉయ్యాలలూగుతున్నాయి
పోపుల డబ్బా చప్పుడాగి పోయింది

నట్టింట్లో పొక్కిలి పొదుముకుంది
ఇనుప గజ్జెల తల్లి నాట్యానికి
పల్లె గుడిసెలు పల్చ బడి మునుగుతున్నాయి
పోటెత్తిన వలస వరదల దాటికి

ఒకే గూటి పక్షులు ఇపుడు వేరయ్యాయి
ముడుచుకున్న ఆశల రెక్కలు చాచుకొని పైకెగరాలని
సొంత గూటికి కొంతైనా చేర్చాలని
అప్పుల రెక్కలు తొడుక్కుని
కొన్ని పక్షులు సముద్రాలు దాట సాగాయి

ఆ గుడిసెలలో ఇంకా తెలవారలేదు
పల్లె సీమ పుల్లలు ఏరుకుంటూనే ఉంది
చీకటిని చితి చెయ్యాలని

 

Exit mobile version