దారి

2
2

[dropcap]ఆ[/dropcap]నందరావుకి ఆనందంగా వుంది ఆ రోజు. అందుకు కారణం ఆ రోజే ఆఫీసర్ పిలిచి ఆ కాంట్రాక్ట్ తనకే వచ్చిందని తెలియజేశారు. అన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్. తను ఎంతో ఆశగా చూస్తున్నాడు. తనకే రావాలని ముక్కోటి దేవుళ్ళను మొక్కుకున్నాడు. అన్ని మొక్కుల ఫలితమో, ఆఫీసర్ గారి అభిమానమో, అవసరమయిన వాళ్ళందరికీ అవసరమయిన వాటిని అమర్చిన ఫలితమో ఏమో తనకీ కాంట్రాక్ట్ వచ్చేసింది. ఇప్పుడన్నీ ఆన్‌లైన్. మేం చేసేదేమీ లేదని తెగేసి చెప్పేస్తున్నారు ఆఫీసర్లూ, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరును. ప్రతీపనీ ఆన్‌లైన్ లోనే, దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడా బ్యాక్ డోర్ మెథడ్స్‌కి ఆస్కారం లేదు. అంతా సిస్టమ్ చూసుకుంటుంది. ఇంత పకడ్బందీలోనూ బిడ్ తనకే వచ్చింది. తన కొటేషన్ ఫైనల్ అయింది. మిగతా ఫార్మాల్టీస్ కూడా పూర్తిచేసి ఆనందంగా ఆనందరావు ఇల్లు చేరుకున్నాడు. ఇంటర్‍నేషనల్ వర్క్స్ కూడా చేసే పెద్ద పెద్ద కంపెనీలకీ రాని అవకాశం తనకి వచ్చింది. ఆ ‘ఫ్లై ఓవర్’ కాంట్రాక్ట్ తనకి రావడం వలన తను ఇప్పుడో పెద్ద నేషనల్ లెవెల్ కాంట్రాక్టర్. తను ఇప్పుడు చాలామంది సబ్ కాంట్రాక్టర్స్‌ని చూసుకోవాలి. వాళ్ళంతా చాలా సులభంగా దొరికిపోతారు. మిగతా పనులన్నీ చకచకా చేసేయ్యాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ మరోసారి చెక్ చేసుకొని, అవసరమయిన వాటిని మార్క్ చేసుకొని, సబ్ కాంట్రాక్టర్స్‌కి ఫోన్ చేసి రమ్మనమని సిబ్బందికి చెప్పి ఎవరెవరికి ఏయే పనులు కేటాయించాలో నిర్ణయించుకుని, పేపర్ మీద వ్రాసుకుని, మిగతా ఏర్పాట్లలో చాలా బిజీ అయిపోయాడు ఆనందరావు. ఈ ప్రాజెక్ట్‌తో తన దారే మారిపోబోతోంది. ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోతాడు తను. ‘యీ దారి కాంట్రాక్ట్’ తన జీవిత దారిని మార్చే గొప్ప మలుపు.

***

ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం దారి మార్కింగ్ చేసే సర్వేయర్లు, ఇంజనీర్లు వచ్చారు. రోడ్డు వెడల్పు కోసం కూడా మార్కింగ్ చేస్తున్నారు. ఇలాంటి స్థిరమైన నిర్మాణాలు చేసేటప్పుడు రాబోయే 30 సంవత్సరాల వరకు ఉండే పరిస్థితులను అంచనావేసి నిర్మాణం చేపడతారు. అంటే అప్పటి జనసాంద్రత, వాహనాల సాంద్రత, కొత్త కొత్త వాహనాలు ఎలాంటవి తయారు కావచ్చు, వాటి సామర్థ్యం ఎంత ఉంటుంది మొదలయిన అంశాలను ఊహించి అంచనాలు తయారుచేస్తారు. వాటి ప్రకారమే, నిర్మాణాలు కోసం, ఇంజనీర్లకు వివరిస్తారు. వాటన్నింటినీ క్రోడీకరించుకొని, ఇంజనీర్లు పటిష్టమయిన నిర్మాణాల కోసం, రూపకల్పన చేస్తారు. దీనిని అనుసరించి నిర్మాణాలకయ్యే వ్యయం అంచనాలు తయారు అవుతాయి. ఇదంతా బడ్జెట్ విడుదలకు ప్రతిపాదిస్తారు. ఆనందరావుకి ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన సొమ్ము ప్రభుత్వం గ్రాంటు చేసింది. ఆనందరావు సబ్ కాంట్రాక్ట్‌లో నిర్మాణం చురుగ్గా సాగిస్తూ, ఎప్పటికప్పుడు నివేదిస్తూ, నివేదికలు సమర్పిస్తూ, నిధులు వసూలు చేసుకుంటూ సబ్ కాంట్రాక్టర్స్‌కి నిధులు విడుదల చేస్తూ, పనులు పూర్తిచేస్తున్నాడు.

ఆ విధంగా ఆనందరావు దారే కాకుండా, సబ్ కాంట్రాక్టర్స్‌కి కూడా లాభసాటి పని కావడంతో వారి దారి కూడా మారింది. ఎంతో మందికి ఉపాది అవకాశాలు కలిగాయి.

***

రాఘవరావు ప్రభుత్వోద్యోగి. సర్వీసులో ఉండగానే తన జీవితానికో ప్లాన్ వేసుకొని, నగరానికి దూరంగా, తక్కువలో దొరికిందని మధురవాడలో రోడ్డు ప్రక్కన ఓ ఖాళీ స్థలం తక్కువ ధరలోనే కొనుక్కోగలిగాడు. తరువాత తను రిటైర్ అయ్యేసరికి మధురవాడ ఊహించనంత శర వేగాన్నందుకొని బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడ చూసినా షోరూమ్స్, అపార్ట్‌మెంట్స్‌తో కళకళలాడుతోంది. తన బడ్జెట్‌లో రిటైర్మెంట్ అయిన వెంటనే క్రింద షాపు రూములు పైన నివాసానికి ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంకా కొంత డబ్బు మిగిలితే, రిటైర్మెంట్ రువాత ఆదాయ వనరుగా వుంటుందని, ఓ వ్యాపకంగా వుంటుందని, రెడీమేడ్ గార్మెంట్ షాపు తనే స్వయంగా ప్రారంభించాడు రాఘవరావు. క్రింద షాపు, పైన ఇల్లు బాగా వుంది. ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయికి పెళ్ళి చేసేశాడు. రెండో అమ్మాయి చదువు పూర్తయింది. పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు. ఆ మధ్య విజయనగరం నుండి ఓ సంబంధం వచ్చింది. కబురు చేస్తామన్నారు. కానీ ఇంకా చెయ్యలేదు. అదిగో యీలోగా పిడుగులాంటి వార్త మధరువాడ మీదుగా ఫ్లైఓవర్ వేస్తారని. అందుకోసం రోడ్డు వెడల్పు చేసే పనలో మార్కింగ్ చేస్తున్నారు. చూస్తుండగానే తన ప్లాట్ 75శాతం వరకూ పోయింది. కింద షాపు, పైన ఇల్లు ఒకే సమయంలో పోవడంతో దిక్కుతోచలేదు రాఘవరావుకి. ఇప్పుడు ఏది దారి? నోట తడారి పోయింది రాఘవరావుకి.

***

చాలా రద్దీగా వుంటుండేది రోడ్డు. వచ్చిపోయే వాహనాలు అటు విశాఖ, ఇటు విజయనగరం మీదుగా ఒడిషా, శ్రీకాకుళం మీదగు ఒడిషా వెళ్ళే రహదారది. మధురవాడకి విశాఖకి శివారయినా, వచ్చిపోయే వాహనదారులు తీరిగ్గా తమతమ వాహనాలను పార్క్ చేసుకుని గమ్యం చేరుకోవడం చాలా సమయం పడుతుందని సమయానికి టిఫిన్లు, భోజనాల అయ్యే అవకాశం లేదని వాహనాలను నిలిపి కావలసినంత సేవు తీరిగ్గా ఉదయం పూట అయితే టిఫిన్లు, మధ్యాహ్నం పూట భోజనాలు, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాలు టిఫిన్స్‌తో హడావుడిగా వుండేదా రోడ్డు ప్రక్క హోటల్స్ అన్నీనూ. బ్రతుకు తెరువు కోసం చూస్తున్న రామలింగం అక్కడ హోటల్ వ్యాపారం బావుంటుందని భావించి, తన దగ్గరున్న సొమ్ముతో హోటల్ కోసం స్థలం తీసుకొని నిర్మాణం పూర్తిచేశాడు. అప్పటికే అంతా ఖర్చు అయిపోయింది. ఇంకా హోటల్‌లో కావలసిన పరికరాల కోసం మిత్రుల దగ్గర అప్పులు చేశాడు. హోటల్ వ్యాపరంలో మంచి లాభాలు వుంటాయని, తొందరలోనే అప్పులు తీర్చేయెచ్చాని అనుకున్నాడు రామలింగం. వైభవంగా హోటల్ ప్రారంభించాడు. బాగా నడుస్తోంది హోటల్. ఇంతలో రద్దీగా మారిన ఆ ప్రాతంలో రహదారి భద్రత కోసం ఫ్లైఓవర్ మంజూరు కావడంతో ఊరికి అందనంత ఎత్తు నుండి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాంతో వాహనాలన్నీ ఝుం ఝూం అని పైనుడి దూసుకుపోవడం మొదలెట్టాయి. అంతే ఎన్నో అప్పులు చేసి, నిర్మించుకున్న హోటల్ ఒక్కసారిగా నిర్మానుష్యం అయిపోయింది. తనే కాదు, ఆ దారినున్న అన్ని హోటల్స్, షాపుల పరిస్థితి అలానే తయారైంది. ఇప్పుడు వారంతా ఏ దారీ తెలీక అయోమయంలో వున్నారు.

***

ఆనందరావు దారి మారిపోయింది. మల్టీ లెవెల్ కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డాడు. ఫ్లైఓవర్ నుండి, పెద్ద పెద్ద బ్రిడ్జిలు, ఎయిర్‌పోర్టు నిర్మాణాలు, మెట్రో నిర్మాణాలు వరకు ఎదిగాడు.

సబ్ కాంట్రాక్టర్స్ అందరికీ దారీ, బ్రహ్మండంగా వుంది. నిరంతరంగా పనులు దొరుకుతున్నాయి. అటు ప్రభుత్వం స్థిరంగా వుండడంతో టెండర్లును తరుచూ పిలుస్తూ, పనులు చేయిస్తోంది. ఫ్లైఓవర్ ప్రక్కనున్న రాఘవరావు, రామలింగం లాంటి వాళ్ళ దారి మారిపోయింది. అనాథలైపోయారు. కుటుంబాలు చితికిపోయాయి. ప్రతి కుటుంబం దారీ తెన్నూ లేక, కటకటలాడిపోయారు. అభివృద్ధి అవసరమే కానీ, అదే సమయంలో ఆదుకోవడం కూడా అవసరమే. ఇచ్చే ప్రత్యామ్నాయాలు, పరిహారాలు మళ్ళీ ఆ జీవితాలను కుదుట పరచగలవా? ఆ కుటుంబాలలో మళ్ళీ ఆనందాలు తేగలవా? మళ్ళీ దారిలో పెట్టగలవా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here