Site icon Sanchika

దాతా పీర్-1

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

అధ్యాయం-1

[dropcap]అం[/dropcap]తా మసక మసగ్గా వుంది.

ఓ గది.

గది బైట, చిన్న వరండా. వరండా ఎదురుగా వెదురు స్తంభాల ఆసరాతో గొర్రె వెంట్రుకలతో నేసిన కంబళ్ళతో కప్పబడి వున్న ఆవరణ (బయలు ప్రదేశం). నాలుగు వైపులా పొగ. ఆవరణ బైట చిందర వందరగా పెరిగిన పొదల్లోంచీ వున్న కాలిబాట పైనా, ముస్లిముల గోరీలగడ్డ లోపల, అంతా పొగమంచు నిండి వుంది. పొగ, పొగమంచు రెండూ చలితో కలిసి సూర్యుణ్ణి తొక్కి పెట్టేశాయి.

బొగ్గుల పొయ్యిమీద అన్నం వండే వరండాలో ఎక్కడ చూసినా మసే మసి!! పొయ్యిలో, పిడకల మీద వేసి బొగ్గులలో నిప్పు రాజేసింది ఛోటీ. నిప్పు రాజుకుంటూ పొగలు కక్కుతూ వుంది. లోపలా బైటా, ఒకే పొగ!! ఒకే బర్నర్ వున్న గాస్ పొయ్యి ఒకటి గత కొన్ని నెలలుగా పక్కన పడి వుంది. గాస్ సిలిండర్ రావాలంతే!! మోయిన్ తుక్కు సామాన్ల దుకాణం నుంచీ పొయ్యి కొని తెచ్చాడు ఫజ్లూ. దాని రిపేరుకు డబ్బు ఖర్చయింది బాగానే కానీ గాస్ సిలిండర్ లేకుంటే అది ఇంట్లో వుండీ లాభమేముంటుంది?

వరండాలో కూర్చుని వున్న సత్తార్ మియ్యా సిగరెట్ తాగుతున్నాడు. ఆయన కళ్ళు ప్రాంగణంలో తచ్చాడుతున్నాయి.

పెద్ద ముంగిలిలో, ఒక మూలలో సంప్ దగ్గర ఉన్న ఒక నలుచదరం బండ మీద కూర్చుని ఆమె స్నానం చేస్తూ వుంది, ప్లాస్టిక్ బకెట్ లోనుంచీ నీళ్ళు తీసుకుని, తన శరీరం పైన పోసుకుంటూ, చిన్నగా వణుకుతూ!! ఆమె లోపావడా మాత్రమే వేసుకుని వుంది. పైన ఒళ్ళంతా నగ్నంగా వుంది. ఆమె తెల్లని వీపు కనిపిస్తూ వుంది. మోకాళ్ళతో ఛాతీని అదుముకున్నప్పుడల్లా ఆమె భుజాల కింద తెల్లని మెత్తని స్తనాలు ఒత్తుకుపోతున్నాయి. లోపావడా నాడాలు కాస్త వదులు చేసిందో లేదో, ఆమె వీపు పైన నదిలా ఉబికి వున్న రేఖ, కిందికి జారి, పిరుదుల అంచుల్లోంచీ జారి మాయమైపోయింది. ఆమె వీపు మీద నీళ్ళు పోసుకుంటున్నంత వరకూ ఆమె వీపు నదిలో వరద!! బడ బడా నీళ్ళు కిందికి దూకి, బండకు ఢీకొని కిందికి జారి పోతున్నాయి. అంతటా, మసక మసగ్గా, స్పష్టంగా కనిపించకుండా!! ఐనా సత్తార్ మియ్యా అంతా స్పష్టంగా చూడగలుగుతున్నాడు, ఆలోచించ గలుగుతున్నాడు అచ్చంగా గాజు లోంచీ చూసినట్టే స్పష్టాతిస్పష్టంగా!!

సత్తార్ మియ్యాకు యీ పొగ తాలూకు క్రీడలన్నీ బాగా తెలుసు. ఇవన్నీ చిన్నమ్మాయి చున్నీ తుంటరి చేష్టలే!! పెద్దది స్నానం చేసేందుకు తయారై పోతూ వుండటం గమనించిన వెంటనే, ఇక్కడ చిన్నది పొయ్యిలో నిప్పు రాజేయటం మొదలెట్టింది, పొగ చుట్టు ముట్టటానికి!! పొగమంచు వుండనేవుంది.

దీనికి తోడు మార్గశీర్షం నెల తెల్లవారి వేళ కూడా!!

లోపల గదిలో నిద్రపోతున్న రసీదన్ కోరింత దగ్గు వచ్చినదానికి మల్లే ఖంగు ఖంగున దగ్గుతూనే వుంది. పొడి దగ్గు! శ్లేష్మం లేకుండా!! గదిలో అక్కడక్కడ పొగ వ్యాపించి, ఆమె ఊపిరి తిత్తులోకి వెళ్ళిందేమో, ఆగకుండా దగ్గు తుఫాను!! ఆమె చిన్నమ్మాయిని పిలవాలనుకుంటూ వుంది కానీ పిలవటానికే చాతకావటం లేదు. పిలుపు గొంతు లోపలే ఆగిపోతూ వుంది. బైట సత్తార్ మియ్యా కూర్చుని వున్నాడని రసీదన్‌కు తెలియదు. లోపల రసీదన్ వుందని సత్తార్ మియ్యాకు తెలుసు. ఆమె దగ్గుతున్నా పట్టించుకోకుండా కూర్చునే వున్నాడతను!! ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలూ తెలుసు కూడా!! కానీ సరైన సమయం కోసం కాచుకుని వున్నాడతను!! బాగా కాలిన తరువాతే మగాడన్నవాడు దెబ్బవేయాలని అతనికి తెలుసు. సత్తార్ మియా ఇక్కడికి వచ్చేటప్పుడే, నాలుగో వీధి మొదట్లోనే సాబిర్ కనబడ్డాడు, అటు వెళ్తూ!!

అన్నీ తెలుసు సత్తార్ మియ్యాకు!! ముందు నుంచే సాబిర్ పైన అనుమానంగా వుంది. ఇప్పుడది ఋజువవుతూ వుంది. సాబిర్, పెద్దమ్మాయి పైన వల విసురుతున్నాడని పక్కాగా తెలుస్తూ వుందిప్పుడు!! సత్తార్ మియ్యా పెదవులు కోపంతో వణుకుతున్నాయి. ‘ఈ పెద్దది కూడా తక్కువదేం కాదు. నంబర్ వన్ కిలాడీ. నేరం మోపటం ఒకరిమీద, ముచ్చట్లు తీర్చుకోవడం, వేరొకరి దగ్గర!! ఇంత పొద్దున్న, ఇక్కడ గజ గజా జనాలు వణుకుతూ వుంటే, దీనికిప్పుడు స్నానం కావలసివచ్చింది, ఏదో తీర్థయాత్రకు పోయేదానిలాగా!!’

పెద్దదాని స్నానమైపోయింది. పైనుంచీ పొడి లోపావడా వేసుకుంది. తడి పావడా కిందకు జారి పడింది. స్థనాలపైన నాడా బిగించుకుని ముంగిలి దాటి వెళ్ళింది. సత్తార్ మియ్యా కళ్ళు పెద్దవి చేసి ఆమెనే గుడ్లప్పగించి చూస్తున్నాడు. పెద్దపిల్ల సత్తార్ మియా వైపు చూడకుండా అస్సలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది.

పొయ్యిలో నిప్పు రాజుకుంది. పొయ్యి చుట్టూరా, వరండాలో, ఆ చుట్టుపక్కలా పొగ తగ్గిపోయింది. పొగమంచైతే వుంది. ఎర్రని నిప్పుల కాంతి మెరుస్తూ వుంది. సత్తార్ మియ్యా గొంతెత్తి పిలిచాడు, “చున్నీ!! ఓ చున్నీ..” అని!

చిన్నమ్మాయిని అందరూ చున్నీ అనే పిలుస్తుంటారు. అదే ఆ అమ్మాయి పేరు కూడా!! చున్నీ జవాబసలివ్వనేలేదు. పొయ్యి వెలిగించి, మాయమైపోయిందంతే!!

చున్నీ నుంచీ జవాబు రాకపోయేసరికి సత్తార్ మియ్యా అటూ ఇటూ చూశాడు. చున్నీ జాడ లేనే లేదు. దీనికి తల తిక్క వుంది కాస్త!! ఇప్పుడిక్కడ వుంటుంది, మరో క్షణంలో అక్కడ!! చున్నీ ఎగరేసుకుంటూ పుర్ పుర్ మని ఎగురి పోతూనే వుంటుంది. నోరైతే పచ్చి మిర్చిలాగా చాలా కారం. తన మాటలతోనే కాటువేసే రకం. నమిలి మింగేద్దామనిపిస్తుంది సత్తార్ మియ్యాకు, కానీ..!!

గదిలో నుండి పెద్దమ్మాయి బైటికి వచ్చింది.

పొయ్యిలో నిప్పు ఇప్పుడు బాగా రాజుకున్నట్టుంది. పొయ్యిని ఒకసారి పరికించి చూసి, పెద్దమ్మాయి వసారాలోని గోనెపట్ట దాకా వెళ్ళి, కాస్త పైకెగిరి, అటువైపుకు తొంగి చూసింది. తరువాత ఏదో గొణుక్కుంటూ వెనక్కి వచ్చి, పొయ్యి మీద నీళ్ళు నిండిన పాత్రను పెట్టింది. సత్తార్ మియా అక్కడే వున్నా పట్టించుకోకుండా, అక్కడ లేని చున్నీ కోసం గొణుగుతూనే వుంది.

“ఇంత పెద్ద పాత్రలో ఏమి వండుతున్నావ్?” అడిగాడు సత్తార్ మియ్యా.

“నా మాంసం వండుతున్నా!! తింటావా?” పెద్దమ్మాయి సత్తార్ మియ్యా కేసి చూసింది. పొయ్యినుండీ నిప్పు కణికలు పెద్దదాని కళ్ళలోకి వచ్చిపడ్డాయిలా వుంది.

ముందు కాస్త తడబడ్డాడు సత్తార్ మియా. తరువాత పొయ్యిలోలాగే ఆయన లోనూ నిప్పులు మండిపోవటం మొదలెట్టాయి. కాసేపటివరకూ, ఆయనలాగే తటపటాయిస్తూ వుండిపోయాడు. తరువాత, తనలో మండుతున్న నిప్పుకణికలమీద తానే నీళ్ళు చల్లి ఆర్పేసుకుని, అడిగాడు, “ఈ రోజుకి చాయ్ లేదా ఏంటి?”

“పాలు లేవు.” సత్తార్ మియా వైపు చూడకుండానే జవాబిచ్చి ఇత్తడి గిన్నెలో బియ్యం కడగసాగింది పెద్దమ్మాయి.

“నల్ల చాయే ఇవ్వు అమీనా!!” సత్తార్ మియ్యా తన పంతం వదలకుండా వున్నాడు.

పెద్దమ్మాయి పేరు అమీనా.

అమీనాను రసీదన్, ఫజ్లూ పెద్దది అనే పిలుస్తారు, ఎప్పుడూ! ఎప్పుడైనా కూతురి పైన ప్రేమ పొంగుకునివస్తే, అప్పుడు రసీదన్ ‘అమీనా!’ అని పిలుస్తుంది. సత్తార్ మియ్యా కూడా పెద్దది అనే పిలిచేవాడు. ఇప్పుడు చాలా రోజుల తరువాత అతని నోటివెంట తన పేరు విని ఉలిక్కిపడిందామె!! తరువాత కాస్త మెత్తబడింది. ఏమీ మాట్లాడకుండా, పెద్ద సత్తు గిన్నె పొయ్యి మీదనుంచీ దించింది. చాయ్ కాచే చెవులులేని చిన్న సత్తు గిన్నెలో నీళ్ళు కొలిచి పోసి పొయ్యి మీద పెట్టింది.

వేరే వేరే రంగులు, ఆకృతుల టీ కప్పుల్లో చాయ్ వడగట్టి అమీనా, ముందు సత్తార్ మియ్యాకు చాయ్ ఇచ్చింది. తరువాత గదిలోకి వెళ్ళి ఒక గ్లాస్ రసీదన్‌కు ఇచ్చివచ్చింది. తరువాత తన గ్లాస్ తీసుకుని పొయ్యి దగ్గర కూర్చుంది సత్తార్ మియ్యా వైపుకి వీపుచేసి!! చాయ్ కాస్త గుటకేసి, కప్పు కింద పెట్టి, సత్తు గిన్నె కింది వైపూ, పొయ్యీ మధ్య నుంచీ ముఖం వంచి, లేపుతూ వేడి కాచుకుంటూ వుంది.

సత్తార్ మియ్యా సిగరెట్ వెలిగించుకున్నాడు. చాయ్ గుటకలతో పాటు సిగరెట్ పొగలను ఆస్వాదిస్తూ, అమీనా వీపును పరికిస్తున్నాడు. ఆమె వీపు ను తన దుపట్టాతో కప్పుకుని ఉంది. కానీ సత్తార్ మియ్యా కళ్ళు దాన్ని చిందరవందర చేసేశాయి ఎప్పుడో!!

చేతిలో ఖాళీ కప్పుతో రసీదన్ గదినుండి బైటికి వచ్చింది. చాయ్, సిగరెట్ చేతిలో వుంచుకుని పెద్దదాన్ని ఏకాగ్రంగా చూస్తున్న సత్తార్ మియ్యాను చూసి, , గావుకేక పెట్టింది, “ఈ దరిద్రుడికి పొద్దున పొద్దునే చాయ్ తాగేందుకు మరెక్కడా చోటు దొరకదా, తెల్లవారేసరికి వచ్చి కూచుంటాడిక్కడ? ఇంక నువ్వు, యీ కుక్కను పొయ్యి దగ్గర కూచోబెట్టి మరీ చాయ్ తాగిస్తున్నావ్!”

సత్తార్ మియా, రసీదన్ వైపస్సలు చూడకుండానే చాయ్ గుటకలేస్తూ, సిగరెట్ పొగను పీలుస్తూ, అమీనా వీపు చూడటంలో నిమగ్నమై వున్నాడు. అమీనా తన తల్లికేసి చూసింది. ఒక్క ఉదుటున లేచింది. అమ్మ చేతుల్లోంచీ కప్పు తీసుకుని జలదారి దగ్గర పెట్టింది. బకెట్‌తో నీళ్ళు తీసి, చిన్న మగ్గులో నింపి, దాన్ని అమ్మ చేతికిచ్చింది. రసీదన్ వసారాలో నుండి, బయల్లోకి వచ్చి, చుట్టూరా చూపు సారించి, “చున్నీ ఎక్కడ?” అని అడిగింది పెద్దదాన్ని.

పెద్దది సమాధానం ఇవ్వలేదు. సత్తార్ మియ్యా అన్నాడు. “అది పొయ్యి రాజేసి వెళ్ళిందెప్పుడో, ఇప్పటిదాకా రానేలేదు..” అన్నాడు.

రసీదన్ వెనక్కి తిరిగింది. సత్తార్ మియ్యాను మండే కళ్ళతో చూస్తూ!! “నిన్నెవడడిగాడు? అనవసరంగా నోరెత్తకు. కుక్కను తరిమేలాగ తరిమినా, మా ఇంట్లోకి వచ్చి తోకూపటం మానుకో!!” అనేసింది.

మళ్ళీ ఏదో భూకంపం వచ్చినట్టు, నీళ్ళునిండిన ప్లాస్టిక్ బకెట్‌ను సత్తార్ మియ్యా మీదకు విసిరేసింది. బకెట్ నాట్యం చేస్తూ, సత్తార్ మియ్యా మోకాళ్ళను ఢీకొని కింద పడింది. అందులో నీళ్ళన్నీ నలువైపులా చిందాయి. సత్తార్ మియ్యా తడిసేపొయ్యాడు. కొన్ని నీళ్ళు పెద్దదానిమీదా, ఇంకొన్ని పొయ్యిమీదికెక్కించిన సత్తు గిన్నె మీదా కూడా పడ్డాయి. గిన్నె బైట పడ్డ నీళ్ళ నుంచీ చుయ్ చుయ్..అని శబ్దం వచ్చింది.

గిన్నెలోని ఎసరులో అమీనా బియ్యం వేసేసిందిగా ఇంతకుముందే!! సత్తార్ మియ్యా కుడి మోకాలు గీరుకుపోయింది. బకెట్ తగలగానే టక్ మంటూ శబ్దం వచ్చింది. సత్తార్ మియ్యా ఉఫ్ఫనికూడా అనలేదు. పంటి బిగువున నొప్పిని తట్టుకున్నాడు. తన లుంగీని కాస్త జరిపి చూసుకున్నాడు. మోకాలి దగ్గర రెండు ఇంచులదాకా గాయమైంది. రక్తం ఇంకా రావటం లేదు.

చలికాలంలో రక్తం బైటికి రావటానికి సమయం పడుతుంది కాస్త!!

రసీదన్ బయల్లో నిల్చునే వుంది.

అమీనా బకెట్ ఎత్తి, మళ్ళీ నీళ్ళు నింపి అమ్మ చేతిలో పెట్టింది. రసీదన్ పళ్ళు నూరుతూ, అంది “ఒరే ముండాకొడకా !! ఇక్కణ్ణించీ పోతావా లేకపోతే..?”

సత్తార్ మియ్యా లేచాడు. లేవగానే కుడి మోకాలి మీద ఒక పెద్ద బుడిపె వచ్చింది. మోకాలు గీరుకు పోవటమే కాదు, దెబ్బ బాగానే తగిలింది. సత్తార్ మియ్యా లేవటం చూసి, రసీదన్ ముఖం తప్పిస్తూ బైటికి వెళ్ళింది. అమీనాతో సత్తార్ మియ్యా “ఫజ్లూను పంపు. మేక మాంసం పంపిస్తాను వాడితో!! ఆలస్యం చేయొద్దు. లేకపోతే అడుగూ బడుగే వుంటుంది.” అన్నాడు.

అమీనా జవాబేమీ ఇవ్వలేదు. పొయ్యి మీదనుంచీ గిన్నె దింపి గంజి వార్చడంలో మునిగి పోయింది. కుంటుకుంటూ సత్తార్ మియ్యా ముంగిట్లోకి వచ్చాడు. బైటికి వెళ్ళేముందు బండలతో నిలబెట్టిన గోడ లోనుంచీ పురికోనతో కట్టిన పరదాను తొలగిస్తూ ఒక్క క్షణం ఆగాడు. సినిమా పోస్టర్ ఉన్న ఫ్లెక్సీనే పరదాగా వాడుతున్నారు. దాని పైన దీపికాను ముద్దు పెట్టుకుంటున్న షారూఖ్ ఖాన్ ఫోటోను చూస్తూ, ‘అదృష్టవంతుడివి రా బాబూ..’ అని గొణుక్కుంటూ బైటికి వెళ్ళిపోయాడు.

***

రసీదన్ వాళ్ళది ముస్లిముల కబ్రిస్తాన్‌లో కాటికాపరుల కుటుంబం. గోరీల నిర్మాణం, వాటిని చూసుకోవటమే వాళ్ళ వృత్తి. గోరీలగడ్డ లోని గోరీల వంశ వృక్షం వివరాలు తీసుకోవటం, చనిపోయిన వాళ్ళకోసం గుంతలు తవ్వటం, అంత్యక్రియలకోసం వచ్చిన వాళ్ళవసరాలు చూడటం, చనిపోయిన వారి అంతిమ యాత్ర కోసం ఏర్పాట్లు చేయటం – ఇవన్నీ!! ఇప్పుడు జనం, ఇదివరకటిలాగా అన్నీ తామే తెచ్చుకోవటం లేదు. సమాచారం పంపిస్తారంతే, రసీదన్ ఆ ఏర్పాట్లన్నీ చేస్తుంది. షబ్ ఎ బారాత్ వచ్చినప్పుడైతే రసీదన్ వాళ్ళ ఇంట్లో రాకపోకలు ఎక్కువైపోతాయి.

షాబాన్ నెల పధ్నాల్గవ రోజు, వారం ముందు నుంచే గోరీల గడ్డలో ఉన్న గోరీలను శుభ్రపరచటంలో కుటుంబమంతా నిమగ్నమైపోతారు. భిక్ష వల్ల వచ్చే సంపాదనతో ఇల్లు పచ్చ పచ్చగా మారిపోతుంది. కాస్త డబ్బులతో డజన్లకొద్దీ అగర్బత్తీ డబ్బాలు కొని పెడుతుంది. గోరీల గడ్డ గేట్ దగ్గర రెండింతల ధరకు అవన్నీ అమ్ముడుపోతాయి. షర్బత్ కూడా రెడీగా వుంచుతుంది. జనం తాగి, అడగకుండానే డబ్బు ఇచ్చి వెళ్తారు. ఇక రెండవ జీవనాధారం, హజరత్ దాతా పీర్ మనిహారీ.

కబ్రిస్తాన్ లోపల, మసీదు వెనుక వైపు హజరత్ దాతా పీర్ మనిహారీ సమాధి వుంది. మనిహారీ వంశం వాడే యీ దాతా పీర్ మనిహారీ. ఇంటింటికీ వెళ్ళీ ఆడవాళ్ళకు గాజులు, ఆడవాళ్ళ బొట్టూ కాటుకా వంటి సౌందర్య సాధనాలూ అమ్ముతూ వుండేవాడు.

దాతా పీర్ మనిహారీ అసలు పేరేమిటో ఇప్పుడెవరికీ తెలీదు. దేవుడాయనకు అద్భుతమైన కంఠం ఇచ్చాడు. ఆయన గొoతులోనుండీ పుట్టే స్వరంలో ఆయన ఆత్మ ధ్వనించేది. పాడుతూ వుంటే, తేనెవాకలు ఆకాశం నుండీ బొట్టు బొట్టుగా మెల్లిమెల్లిగా జారిపడుతూ వున్నాయనిపించేది. ఆయన తీయని గొంతు, పాటల గురించిన కథలు రసీదన్‌కు వాళ్ళ తాతయ్య (అమ్మావాళ్ళ నాన్న) వినిపిస్తూ వుండేవాడు. ఆయన కూడా యీ కథలను వాళ్ళ పెద్దవాళ్ళ నుండే విన్నాడు.

దాతా పీర్ మనిహారీకి సంబంధించిన ఒక కథ చాలా ప్రసిద్ధి చెందింది. ఒకానొక షియా ధనవంతుని కుమార్తె మీద మనసు పారేసుకున్నాడట ఆయన! ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ భవనంలో ఆడవాళ్ళుండే వైపు ప్రాంగణమంతా ఆడవాళ్ళు గుంపులుగా మూగేవారట!! తమ పనులన్నీ వదిలిపెట్టి ఒళ్ళు మరచిపోయి పరుగులుపెట్టి వచ్చేవాళ్ళట!! పెళ్ళైనవాళ్ళూ కానివాళ్ళూ అందరి పరిస్థితీ ఇంతే!! గాజులూ, బొట్టు సామానులూ కాదు, అతని గొంతునుండీ వినిపించే మధుర గీతాలంటే వాళ్ళకెంత పిచ్చి వుండేదంటే, ఒళ్ళోని పిల్లలనూ, పొయ్యిమీద పెట్టిన వంటలనూ కూడా మర్చిపోయేవాళ్ళట!! కేవలం పాటే, మరి ఏ వాయిద్యమూ వుండేది కాదు. గొంతు, పాట, అందులో ధ్వనించే ఆత్మ!! అంతే!!

ప్రవాస ప్రియా వచ్చేయవా!!
యీ వర్షాకాలంలో వచ్చేయవా!!
మనసు సరస్సు ఎండిపోయింది,
ఒకటి రెండు చినుకులు కురిసిపోవా!!
గద్దించినా మాట వినదీ యౌవనం
ప్రవాస ప్రియా వచ్చేయవా!!

ఆడవాళ్ళ హవేలీలో ఆనంద సమావేశం మొదలైపోతుంది. ఇంట్లో మగవాళ్ళకు అర్థమైపోతుంది, యీ గాజులమ్మే అతని దుకాణం ఒకసారి హవేలీలోకి వచ్చిందంటే చాలు, ఇక అతడు బైటికి వెళ్ళేవరకూ ఇంటి ఆడవాళ్ళు వాళ్ళ మగాళ్ళమాట విననే వినరు అని!! అదీగాక ఇతడు మరీ ప్రత్యేకం. ఆడవాళ్ళకు ఇష్టమైన పాటలు తీయగాపాడి వాళ్ళ మనసులను ఆకర్షిస్తాడు కూడా!!

దాతాపీర్ మనిహారీ మాంచి వయసులో వున్న రోజులు. మంచి రాగి వర్ణంలో పొడవైన శరీరం. తీర్చిదిద్దిన కన్నూ, ముక్కూ తీరు. రింగు రింగుల పెద్ద జుట్టు. కళ్ళకు సుర్మా. తన కళతో ఆడవాళ్ళ ఆకలి దప్పులను దోచేసుకునే ఈ మనిహారీ గొంతులో నుండీ, బన్నా, సహానా ప్రేమ గీతాలు వింటుంటే, చల్లని పిల్ల గాలులు తాళాలు వేస్తున్నట్టే వుండేది!! ఆడవాళ్ళ హవేలీనుంచీ ఆ గొంతు, మగవాళ్ళ దర్బార్ హాల్ వరకూ వినిపించేది.

నా చిన్నదాని చక్కదనం చెప్పలేను మాటల్లో
అందమంటే దానిదే, ప్రతి అడుగూ వెలుతురే
పైవాడెంత శ్రద్ధగా దీనిని చెక్కాడో
నా చిన్నదాని చక్కదనం చెప్పలేను మాటల్లో!!

మెల్లి మెల్లిగా అక్కడి ఒక చిన్నదాని ప్రేమలోకి కూరుకుపోయాడా మనిహారీ. గొంతులోని మత్తు ఎక్కడిదక్కడే ఉండిపోయింది. ఒకసారి శీతాకాలం నాటి మధ్యాహ్నం. సభ కొలువు తీరింది. ఆ అమ్మాయికి పెళ్ళి కుదిరిందని ఆ రోజు అతగానికి తెలిసింది. వచ్చే వారమే నిశ్చితార్థం. అమ్మాయి అతని ప్రేమను కాదన్నది. వీడుకోలు పాటలు పాడాడతను. తన తరఫునుంచీ ఆమెకు గాజులు బహూకరించాడు. జానపద గేయాల్లో ఒక శోభనం పాట పాడాడు.

ముత్యాలు చల్లరమ్మా పానుపు మీద
యీ వేళ అమ్మాయిని బాగ సింగారించరమ్మా
నాన్న అమ్మల ప్రాణమీ అమ్మాయికి
కన్నుల కాటుక పెట్టి దిష్టి తీయరమ్మా
నేడు పెళ్ళి కూతురిని సింగారించరమ్మా..

ఆ చిన్నవాడిపై ప్రేమ పరవశం ఎంతగా ఉందంటే అతగాడు పిచ్చివాడై పోయాడు. ఆ పిచ్చిలో చెట్టూ పుట్టా పట్టుకుని తిరిగాడు. ఎవరి గడపలోనైనా అమ్మాయిని చూశాడంటే, ఆగిపోయేవాడు. అమీర్ ఖుస్రో వ్రాసిన పెళ్ళిపాటలు పాడేవాడు.

పచ్చ పచ్చని వెదురు కట్టెలు తెండి
చక్కని పెళ్ళి మండపం వేయండి!!
మండపం మీద కలశం ఉంచండి,
గారాల అమ్మాయి కదండీ,
మరింత చక్కని కిరీటం తెండి!!

ఈ పిచ్చితనంలో తిరుగుతుంటే, కటిహార్ జిల్లా బార్సూయీ దగ్గర రహ్మాన్‌పుర్‌లో పీర్ హజరత్ షా హఫీజుద్దీన్ లతీఫీకి చెందిన దర్గాలో ఆశ్రయం దొరికింది. ఈ దర్గా లోనే పీర్ శిష్యుడు మౌలానా సమీరుద్దీన్‌ను కలవటం జరిగింది. ఆయనతో కటిహార్ లోని మనిహారీకి వెళ్ళిపోయాడు. మనిహారీలో ఆతను బాబా హజరత్ జీన్ షాహ్ రహ్మతుల్లా సమాధిని సందర్శించాడు. మౌలానా సమీర్ ఉద్దీన్ అతన్ని తన శిష్యుణ్ణి చేసుకున్నాడు. వారి శిక్షణలో చదవటం వ్రాయటం నేర్చుకున్నాడు. సూఫీ సాహిత్యమూ చదివాడు. పీర్ హజరత్ షాహ్ హఫీజుద్దీన్ లతీఫీ అరబీలో వ్రాసిన పుస్తకం చదివిన తరువాత, హజ్రత్ దాతా పీర్ మనిహారీ, తాను ప్రేమించిన అమ్మాయి ఉండే ప్రాంతం వదిలిపెట్టేశాడు. ఈ పుస్తకంలో వారి గురువు పీర్ వ్రాశాడు, ‘ఎవరైనా పరాయి స్త్రీ పట్ల ప్రేమ పుట్టి, దాన్నుంచీ బైటపడే ఉపాయం తట్టకపోతే, ఆ ప్రాంతాన్నే వదిలిపెట్టు.’ అందుకే అతడు ఆ చోటునుంచీ దూరం వెళ్ళిపోయాడు. తిరుగుతూ తిరుగుతూ, హజరత్ షేఖ్ షబాద్ ఉద్దీన్ పీర్ జగ్ జోత్ సమాధి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ పీర్ ముసీహ్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. పీర్ ముసీహ్ నిప్పులాంటి ఫకీరు. పీర్ ముసీహ్ వెంట తీర్థయాత్రలకు వెళ్ళాడు. చాలా చోట్ల అడుగడుగునా చాలా మసీదులు, దర్గాలు సందర్శించాడు. ఒక రోజు పీర్ ముసీహ్ యీ తుఛ్ఛమైన ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. మనిహరీకి ఇప్పుడు తాను అనాథనైపోయాననిపించింది. పీర్ ముసీహ్ చనిపోయిన తరువాత మళ్ళీ మునుపటిలాగ నెలలతరబడి పిచ్చివాడిలా తిరిగాడు. అలా దారి తెన్నూ లేక తిరుగుతూ తిరుగుతూ చివరికి ఇదిగో యీ గోరీలగడ్డకు చేరుకున్నాడు. ఇక్కడే స్థిరపడిపోయాడు. చాలా సంవత్సరాలు బ్రతికి ఇక్కడి మట్టిలోనే కలిసిపోయాడు.

హజరత్ దాతా పీర్ మనిహారీ సమాధి దగ్గర గాజులు సమర్పించే సంప్రదాయం ఉంది. డబ్బు రూపంగా వచ్చేది తక్కువైనా గాజులతో బుట్టలు నిండిపోతాయి.. రసీదన్ యీ గాజులను కదంకువా లోని గాజుల బజార్‌లో తక్కువ ధరకు దుకాణదారులకు అమ్మి వస్తుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు యీ దర్గా దగ్గరకు వచ్చినప్పుడు కాస్తైనా డబ్బు వస్తుంది తప్పకుండా!! ఉన్నట్టుండి ఎవరి కోరికలైనా తీరినప్పుడు అనుకోకుండా ఊహించని విధంగా డబ్బు వస్తుంది. షబ్ ఎ బారాత్ రోజు రాత్రి రసీదన్ కుటుంబానికి ఆనందాల రాత్రే!! కబ్రిస్తాన్ అంతా దేవదూతలతో నిండిపోతుంది. రాత్రంతా, జీవితం గురించిన ప్రార్థనలతో గడచిపోతుంది!!

భర్త నసీర్ మియ్యా చనిపోయిన తరువాత, ఇంటి నిర్వహణంతా మోయవలసి వచ్చింది రసీదన్‌కు!! అప్పుడు పిల్లలంతా చిన్నవాళ్ళు. చున్నీకి పదేళ్ళు. ఫజ్లూ చున్నీకంటే రెండు రెండున్నరేళ్ళు పెద్ద అంటే పన్నెండు, పదమూడు మధ్య వయసు. అమీనా అందరికంటే పెద్దది. ఏమి జరిగిందో కానీ ఉన్నట్టుండి ఫజ్లూ కాలొకటి బలహీనమైపోతూ వచ్చింది. మందులకు డబ్బులెక్కడినుంచీ తెస్తుంది? పిల్లల కడుపులు నింపుతుందా లేక డాక్టర్ కడుపు నింపుతుందా?? ఉచిత ఆసుపత్రి నుంచీ నూనె తెచ్చి కాళ్ళకు మర్దనా చేసేది. మందు వేసేది. అంతే!! ఫజ్లూ కుంటివాడుగా ఉండాలని నుదుట రాసి ఉంది. అదే జరిగింది. ఐతే, ఒక కాలును బలహీనపరచినా ఆ పైవాడు, ఫజ్లూ రెండు భుజాల్లోనూ బలం మాత్రం విపరీతంగా నింపి పంపాడు. ఒకే రోజు మూడు నాలుగు గోరీల కోసం తవ్వాల్సి వచ్చినా ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా తవ్వేస్తాడు. ఒకే ఒక్క చేతికర్రతో పాట్నా అంతా చుట్టి వచ్చేవాడు. పదిహేనేళ్ళ అమీనా ఒక్కతే పాపం రసీదన్ వెనకాలే ప్రతిపనిలోనూ బొంగరంలా తిరిగేది. ప్రతిపని లోనూ సాయపడేది. ఇప్పుడు కూడా తనే అంతా చూసుకుంటుంది. అన్నిటికీ సిద్ధంగా వుంటుంది. చున్నీ అప్పుడూ ఇప్పుడూ కూడా చున్నీనే, గాలి చిన్నపాటి తాకిడికే ఊగే కొమ్మలా అటూ ఇటూ తిరుగుతూ!!

రసీదన్ కబ్రిస్తాన్ లోని చిన్న కాలిబాటను దాటింది. చుట్టూతా దట్టంగా పొగమంచు నిండి వుంది. ఈ బాట కుడి వైపుకు తిరిగి గోరీల గడ్డ పడమర గోడదగ్గర దాకా మాత్రమే ఉంది. ఈ గోడ దగ్గర భూమంతా ఎత్తు పల్లాలు!! గడ్డీ, అడవి మొక్కలే ఎక్కడ చూసినా!! బూరుగు చెట్లు, ఇంకా ఏవేవో చెట్లూ ఉన్నాయి. మధ్యలో భూమి అక్కడక్కడ సమతలంగానూ ఉంటుంది. పగలంతా పిల్లలక్కడ పోలీసు దొంగ ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు తొక్కుడుబిళ్ళాటలు ఆడతారు. పెద్దపిల్లలు జూదం ఆడేందుకు వచ్చి చిన్నపిల్లలను దూరంగా తరిమేస్తారు. ఈ పడమర గోడదగ్గర గోనెపట్టల మాటున ఒక మరుగుదొడ్డి ఉంది.

గత ప్రభుత్వం, గోరీల గడ్డకు హద్దులు ఏర్పరచి, నాలుగువైపులా ప్రహరీగోడలు కట్టించింది. ఒక పెద్ద గేట్ కూడా ఏర్పడింది. లోపలున్న నూరానీ మసీదుకు రంగులు వేయించి, సున్నాలు కూడా కొట్టించారు. నమాజ్ చదివే ముందు చేతులూ, ముఖమూ కడుక్కునేందుకు, ఎప్పటినుంచో తవ్వి ఉంచిన చిన్న నీటి టాంక్ పక్కనే డజన్ల కొద్దీ కుళాయిలు వచ్చాయి. మసీదు వెనుక వైపు బోర్ తవ్వించారు. నీళ్ళ టాంకూ దానికి మిషిన్ కూడా వచ్చాయి!! గేట్ దగ్గర ఒక చిన్న గది ఏర్పడింది. అక్కడే ఫజ్లూ ఉంటున్నాడిప్పుడు!!

అన్నీ సమకూరాయి రసీదన్ ఇంట్లో ఒక పక్కా మరుగుదొడ్డి తప్ప!! ఈ పాత మరుగుదొడ్డికి ఒక్క తలుపు కూడ పెట్టించలేదు, కమిటీవాళ్ళు!! రసీదన్ కమిటీవాళ్ళకు విన్నవించుకుంటూనే ఉంది కానీ, ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. వర్షాకాలం, చలికాలాల్లో, అర్ధరాత్రి, అపరాత్రుల్లో అక్కడికి వెళ్ళి రావటంలో ఇబ్బందులను అర్థం ఎవరూ చేసుకోవటం లేదు.

రసీదన్ ముఖానికి పొగమంచుతోకూడిన చల్ల గాలి కొడుతూ ఉంది. కంప చెట్ల మధ్యనుంచీ నడుచుకుంటూ మోకాళ్ళ ఎత్తు తుప్పల్లోకి వెళ్ళింది. మరుగుదొడ్డి లోకి వెళ్ళేంతలో, అక్కడున్న చెట్టు మీదనుండీ తెల్ల రెక్కల పక్షి ఒకటి ఉన్నట్టుండి రసీదన్ తలమీదనుండీ నుండి ఎగిరి పోయింది. దాని పెద్ద పెద్ద రెక్కల శబ్దానికి ఒక్క క్షణం రసీదన్ ఉలిక్కి పడింది. ఈ పక్షులు సంవత్సరమంతా కనబడవు. చలికాలంలో ఉన్నట్టుండి ఎక్కడినుంచీ వస్తాయో మరి, ఇక్కడ యీ గోరీలగడ్డలో చెట్లమీద ఉండిపోతాయి. ఎండకాలం మొదలవగానే ఏదో ఒకరోజు మాయమైపోతాయి. రసీదన్ అనుకుంటూ ఉంటుంది, ‘మనకంటే అవే నయం, ఇల్లూ వాకిలీ గురించి కానీ, వంటావార్పూ గురించి కానీ చింతే ఉండదు మరి వాటికీ!’ అని!

***

అమీనా గుసగుసలాడుతూ ఫజ్లూకు చెప్పింది, సత్తార్ మియ్యా మేక మాంసం తీసుకునేందుకు ఫజ్లూను చిక్‌పట్టీకి పిలిచాడని!!

పీర్ ముహానీ నుండి కాస్త దూరంగా లోహానీపూర్‌లో తూర్పు భాగంలో చిక్‌పట్టీ ఉంది. రోడ్డును ఆనుకుని ఏడెనిమిది దుకాణాలు మాత్రమే వున్నాయక్కడ! చిక్‌పట్టీ ప్రాంతంలో అప్పట్లో ఉన్న అందరూ నగరంలో ఎక్కడెక్కడి వీధుల్లోనో స్థిరపడిపోయారు. అక్కడే దుకాణాలు పెట్టుకున్నారు. లోహానీపూర్ వెళ్ళి, ఫజ్లూ మాంసం మాత్రమే కాదు, మూడో వీధిలో భూలోటన్ అడ్డా నుంచీ సారాయి పాకెట్లు కూడా పట్టుకొచ్చాడు. మద్యనిషేధం తరువాత భూలోటన్ దశ తిరిగిపోయింది. రెండింతలు, మూడింతలు ధరలకు మద్యం అమ్ముతున్నాడు. సత్తార్ మియ్యా సహవాసమూ, శిష్యరికం వల్ల ఫజ్లూ చిన్న వయసులొనే పౌచ్ తాగటం, గాంజా పైపులో చిలుం నింపటం వంటి పనుల్లో ఆరితేరిపోయాడు.

అమీనా మేక మాంసం వండుతూ ఉంది.

పొగమంచు తగ్గిపోయింది. ఎండ మండిస్తూ ఉంది. కానీ యీ ఎండ మీద నమ్మకమే లేదు. ఎప్పుడైనా మాయమైపోవచ్చును.

గాలి బాగా వీస్తూ ఉంది – సూదులు గుచ్చినట్టు!! ఉడుకుతున్న మాంసం, మసాలా సువాసనలతో తడిసి, అమీనా ముడివేసుకోకుండా వదిలేసిన వెంట్రుకలతో ఆటలాడుకుని గాలి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఆమె వెంట్రుకలు కూడా పల్టీలు కొడుతూ మాటిమాటికీ ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాయి. అమీనా గిన్నె మూత తీసి లోపల కలియబెడుతున్నప్పుడల్లా ఆ వేడి ఆవిరి వల్ల ఆమె ముఖం ఎర్రబారుతూ ఉంది. మసాల పరిమళం చుట్టూతా అలుముకుంటుంది.

పొద్దుటి కొట్లాట తాలూకు గుర్తులేవీ ఇంట్లో లేవు. స్నానం చేసి, అమీనా తన పెద్ద పెద్ద కళ్ళకు కాటుక తీర్చింది. పొయ్యి దగ్గర కూర్చుని మాంసం వండుతూ ఉంది. ఆమె ఉత్సాహం, ఎండ, గాలి, ఉడుకుతున్న మాంసంలో మసాలాలు – ఇవన్నిటివల్లా నలువైపులా ఒక రకమైన సంతోషకర వాతావరణం అలుముకుంది.

చున్నీ ఇంటికి వచ్చింది.

చున్నీ రాగానే రసీదన్ ఇంట్లోనుంచీ బైటికి వెళ్ళిపోయింది. ముందేమో చున్నీని దూరం నుంచే మండుతున్న కళ్ళతో చూసింది కోపంగా! తరువాత చున్నీ ముందుకెళ్ళి నిలబడింది మరీ కోపంగా!! నిర్లక్ష్యంగా చున్నీ, రసీదన్‌ను దాటుకుని ఇంట్లోకి ప్రవేశించింది. రసీదన్ గుండె రెండు ముక్కలైపోయింది. కాళ్ళు తడబడ్డాయి. గుండెల్లో ఏదో గునపంతో పొడిచినట్టు బాధ, లోపల్లోపల మొదలై పొట్టలోంచీ బైటికి వచ్చినట్టు!! గట్టిగా అరవాలని ఉంది, కానీ గొంతులోనే ఆగిపోతూంది ఆ కేక!! రసీదన్ చున్నీ వైపోసారి చూసి, తల దించుకుని బైటికి వెళ్ళిపోయింది.

చున్నీ వసారాలో కూర్చుని తన చేతి గోళ్ళు కత్తిరించుకుంటూ ఉంది. వాటిమీద గులాబీ రంగు నైల్ పాలిష్ వేసుకుని, ఆరిపోవటానికి వాటిమీద ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉంది, ఉండుండి రాళ్ళ గోడలోనుంచీ గోనెపట్టతో వేసిన పరదా వైపు చూస్తూ!! గాలివల్ల పరదా అప్పుడప్పుడు పటపటమంటూ శబ్దం చేస్తూ ఉంది. దానిపైనున్న షారూఖ్, దీపికా ఇద్దరూ కదులుతున్నారు.

చున్నీ, అమ్మ రసీదన్ ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంది. మనసులో గట్టిగా నిర్ణయించేసుకుంది, అమ్మ యీ రోజు ఏమైనా అంటే, మాటకు మాటగా తిరిగి సమాధానం ఇచ్చే తీరాలని!! ఇదిగో, యీ పెద్దదాని లీలలన్నీ బైట పెట్టేస్తుంది తను! అంతే!! ఇదిగో ఇలా వసారాలో మాంసం వండుతూ, జుట్టు ఎగరేసుకుంటున్న పెద్దదాని ముఖం మీద మసి పూసే తీరుతుంది తానీరోజు!! ఊరుకునేదేలేదు!! ఏమీ తెలియని దానిలాగా చుప్పనాతి లాగా కూచుని వుంది కానీ, దీని ఆటలింక సాగవుగాక సాగవు. చేతి గోళ్ళమీద కన్నా షారూఖ్ దీపికాలు వున్న పరదా మీదా, పొయ్యి దగ్గర కూర్చుని ఉన్న అమీనా మీదే చున్నీ ధ్యాస ఎక్కువగా ఉంది.

ఈ ఏడే ఇరవైయ్యవ సంవత్సరంలోకి వచ్చింది చున్నీ.

కానీ ఇప్పటికే ఎన్నో ఘనకార్యాలు చేసింది. జులాయి వెధవల్లాగా రోజంతా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు లహానీపుర్, చిక్‌పట్టీలో కల్లూ మియ్య కొడుకు బబ్లూతో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది. కొన్ని రోజుల కిందట, ఇంట్లో నుంచీ వెళ్ళిపోవటానికి అన్ని రకల సదుపాయాలూ చేసుకుంది. రసీదన్ కాలిపట్టీలు, కొన్ని బట్టలూ జాగ్రత్తగా సేకరించి పెట్టుకుంది కూడా!! సరిగ్గా ఒక రోజు ముందు అర్ధరాత్రి బుద్ధమూర్తి చౌక్ దరిదాపుల్లో బబ్లూ మియ్యాను పోలీసులు పట్టుకున్నారు, దొంగతనానికి సంబంధించి పాత కేసులో అతని కోసం ఎప్పటినుంచో వెదుకుతూ ఉన్నారు మరి. తెల్లవారి యీ సంగతి తెలియగానే, దిక్కు తోచక కూర్చుండిపోయింది చున్నీ. ఒక్క రోజులో పరిస్థితంతా తారుమారైపోయింది. అప్పుడప్పుడు చున్నీ అనుకుంటుంది, ‘ఒక్క రోజు అల్లా దయదలచి ఉంటే తానీపాటికి బబ్లూతో కలకత్తాలో ఉండేది. మాంచి జల్సా జీవితం గడుపుతూ ఉండేది కదా!!’ అని!! మూడు నెలలు పట్టింది, బబ్లూ బైటికి వచ్చేందుకు! కేస్ నుంచీ బైట పడ్డాక వాళ్ళ నాన్న కల్లూ మియ్యా అతని మీద అనేక ఆంక్షలు పెట్టాడు. బబ్లూను దుకాణంలో ఒంటరిగా కూర్చోనివ్వటం లేదు. గల్లా పెట్టె మీదా ఒక కన్నేసి వుంచుతున్నారు. బబ్లూ సంపాదనా తగ్గిపోయింది. అతని పరిస్థితి ఎప్పుడు మారుతుందా అని చున్నీ ఎదురుచూస్తూ ఉందిప్పుడు!! కాస్త డబ్బు సమకూరిన వెంటనే, పరిస్థితులూ మారుతాయి, బబ్లూ తానూ ఉడాయిద్దామనే నమ్మకంతో ఉంది. ‘ఎలాగైనా యీ గోరీల గడ్డ నాలుగు గోడలనుంచీ ఒకసారి బైటికి ఎగిరివెళ్తే చాలు, యీ చున్నీ అంటే ఏమిటో తెలిసి వస్తుంది వీళ్ళకు!!’ అని గట్టి నమ్మకం చున్నీకి!.

(సశేషం)

Exit mobile version