[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]
[ఆ రాత్రి రసీదన్‍కు నిద్ర పట్టదు. చలి, పిల్లల ఆలోచనలు ఆమెలో ఆలోచనలు కల్గిస్తాయి. అమీనా, చున్నీల ప్రవర్తనలోని తేడాలను తలచుకుంటుంది. చున్నీ ఎప్పుడూ అందరితో గొడవలు పడుతూ, ఇంటి మీదకి తగాదాలు తెస్తూంటుందని బాధపడుతుంది. దివ్యాంగుడూ, వ్యసనాలకు బానిసవుతున్న కొడుకు ఫజ్జూని తలచుకుని దుఃఖిస్తుంది. చివరికి ఎప్పటికో నిద్రపోతుంది. అమ్మ నిద్రలేమి గురించి తెలియని అమీనా, చున్నీలు వాళ్ళ పక్కల మీద పడుకుని ఆలోచనల్లో ఉంటారు. సత్తార్ మియ్యా నుంచి తప్పించుకుని, తను ప్రేమించే సాబిర్‍తో ఇక్కడ్నించి వెళ్ళిపోవాలని అనుకుంటుంది అమీనా. చున్నీ కూడా బబ్లూతో పారిపోయి, కొత్త ప్రదేశంలో గడపబోయే నూతన జీవితం గురించి ఊహల్లో ఉంటుంది. మర్నాడు ఉదయం లేచి, రాధే గోప్ చాయ్ దుకాణానికి వెళ్ళి చాయ్ తాగుతుంది రసీదన్. ఈలోపు అమీనా, చున్నీలిద్దరూ కొట్టుకుంటున్నారని ఫజ్లూ కేక వేసి చెప్తాడు. రసీదన్ ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కచెల్లెళ్ళ పోరాటం ముగుస్తుంది. వాళ్ళనేం అనలేక, ఓ మూలలో ఉన్న డబ్బాలోని కిరోసిన్‍ను మీద పోసుకుని అగ్గిపెట్టె కోసం వెతుకుతుంది రసీదన్. కూతుర్లిద్దరూ ఆమెను ఆపుతారు. అమీనా సబ్బుతో రుద్ది తల్లికి స్నానం చేయించి లోపలికి తీసుకెళ్తుంది. ఈలోపు బయటకు జారుకున్న చున్నీ రాధే గోప్ చాయ్ దుకాణానికి టీ తాగుతుంది. గోపు డబ్బుల గురించి అడిగితే, ఇస్తామంటుంది. అతనితో వాదన పెరిగి గొడవ పెట్టుకుంటుంది చున్నీ. ఆమె మీద కోపంతో దుకాణంలో సరిగా పనులు చేయలేకపోతాడు. సాయంత్రం ఫజ్లూ, సాబిర్ ఉండే చోటుకు వెళ్ళి వాళ్ళతో కలిసి గాంజా తాగుతాడు. తనకీ, చున్నీకి జరిగిన గొడవ గురించి ఫజ్లూకి చెప్పి, చున్నీని అదుపులో పెట్టమంటాడు రాధే. చున్నీ ఆటకట్టించాలంటే బబ్లూని రానివ్వకుండా చేయాలని చెప్తాడు. పైగా హిందూ ముస్లింల గొడవలు జరుగుతుననయని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు రాధే. – ఇక చదవండి.]
అధ్యాయం-5
[dropcap]సా[/dropcap]బిర్, ఫజ్లూ ఇద్దరూ దాదాపు సమ వయస్కులు. ఫజ్లూ మహా ఐతే ఒకటి రెండు సంవత్సరాలు చిన్నవాడేమో!! సాబిర్‌ను వాళ్ళ నాన్న, విధవరాలైన వాళ్ళ పిన్నీ పెంచి పెద్ద చేశారు. వాళ్ళమ్మ కానుపు సమయంలోనే ఆసుపత్రిలో చనిపోయింది. పాలు తాగటమటుంచి, తల్లి ఛాతీని కూడా స్పృశించలేదు సాబిర్. వాళ్ళ నాన్న అలీ బఖ్ష్, సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర సందులో ఉండేవాడు. పెళ్ళిళ్ళూ పేరంటాలప్పుడు షెహ్నాయీ వాయించేవాడు. పెళ్ళిళ్ళు లేని సమయంలో భార్యా భర్తలిద్దరూ బీడీలు చుట్టేవాళ్ళు. అలీ బఖ్ష్, ఉస్తాద్ నూర్ బఖ్ష్ శిష్యుడు.
అలీబఖ్ష్ గురువు గారు నూర్ బక్ష్ చాలా పేరున్నవాడు. దూర దూరాలవరకూ ఆయన పేరు వినిపించేది. రేడియో స్టేషన్‌లో షెహ్నాయి వాయించేందుకు ఒకసారి అతనికి అవకాశం వచ్చింది. అంతే!! ఆయన కీర్తికిక రెక్కలొచ్చేశాయి. ఆయన తండ్రిగారు కూడా ఖవ్వాలీలు పాడుతూ ఉండేవాడు. అలా సంగీతం వాళ్ళింటి విద్య. సంగీత కచేరీలలో తన షెహ్నాయితో మంత్రముగ్ధులను చేయటం కోసం సుదూర ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళేవాడు. అలీ బఖ్ష్ అప్పుడు కూడా తన గురువుగారితోనే ఉండేవాడు. గురువుగారు, తన జేబులోనుండీ ఎంత డబ్బు తీసిస్తే దానితోనే తృప్తి చెందేవాడతడు! నూర్ బఖ్ష్ జీవించి ఉన్నంత వరకూ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అతని జీవితం గడిచింది. ఆయన చనిపోయిన తరువాత, అతని జీవితాన్ని కష్టాల తుఫాను ముంచెత్తింది. సాబిర్ వాళ్ళమ్మ ఉస్తాద్ నూర్ బఖ్ష్ చిన్న కూతురే! గురువు గారు ఉస్తాద్ నూర్ బఖ్ష్ ఇంటికి వెళ్ళి వస్తూ వస్తూ ఉండగా, వాళ్ళ చిన్నమ్మాయి మదీహా బానో రింగుల జుట్టులో ఎప్పుడు మనస్సు తలుగుకొన్నదో గుర్తే లేదు అలీకి!! గురువు గారింట్లో, మదీహా బానోనే, అలీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేది. నౌకర్లు, చాకర్లు చాలామందే, కానీ ఒక్క రోజు కూడా వాళ్ళ అతనికి ద్వారా టిఫిన్లు కాఫీలు పంపేవారు కారు. మదీహా వాళ్ళమ్మే సొంతంగా తెచ్చేది, లేదా మదీహాతో పంపేది. అలీబఖ్ష్‌ను తన కొడుకులతో సమానంగా చూసుకునేదామె! అతని గురించి జాగ్రత్తలు తీసుకునేది. అలీ బఖ్ష్ గురువుగారి ఇంట్లో ఉన్నంత సేపూ, అతని కళ్ళు మదీహా కోసం వెదుకుతూ ఉండేవి. ఆమె కనబడనంత సేపూ తల్లడిల్లిపోయేవాడు. ఎన్నో సార్లు అతని శ్రుతి తప్పేది కూడా!!
గురువుగారి మందలింపును చూపులను ఎదుర్కోవలసి వచ్చేది. గురువుగారు, తియ్యగా మాట్లాడే వారెప్పుడూ!! కోప్పడటం, గట్టిగా అరవటం, ఆయన స్వభావంలో ఉండేవే కావు. ఎక్కువగా మౌనంగా ఉండేవారు. తప్పు చేసేవాళ్ళకేసి ఒక చిత్రమైన చూపు చూసేవారు. దానిలో కోపముండేది, ఉండేది కాదు కూడా!! మెల్లి మెల్లిగా యీ పద్ధతే కొనసాగింది అలీ బఖ్ష్ విషయంలో! అటు మదీహా బానో చిలిపి చేష్టలు ఎక్కువయ్యాయి కూడా!! పక్క నుంచీ వెళ్తున్నప్పుడు ఆమె పైట కొంగు అలీ బఖ్ష్ ముఖాన్ని అలవోకగా తాకుతూ వెళ్ళేది. చాయ్ కప్పు ఇచ్చేటప్పుడు, ముందైతే వేళ్ళు మాత్రమే తాకేవి, ఇప్పుడు వేళ్ళు నొక్కటమూ మొదలైంది. ఇప్పుడిక చేతులను కదిలించటం వరకూ వచ్చేసింది. గురువుగారి కోపాన్ని భరించే ధైర్యం అలీ బఖ్ష్‌లో లేదింక! లోపల్లోపల ఒకటే భయం! కానీ మదీహా, ఇంట్లో రెక్కలల్లారుస్తూ హయిగా తిరుగుతూనే ఉండేది. తల్లిదండ్రుల ముద్దుల బిడ్డగా మదీహాకు, తన అక్క, ఇద్దరు పెద్దన్నలంటే బొత్తిగా భయమే ఉండేది కాదు. ఇలా ఉన్న దానికి ఫలితం, వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత అనుభవించాల్సి వచ్చింది తనకు! తండ్రి మరణం, అంతిమ సంస్కారాల తరువాత, మసీహా ఎంతగా మొండి పట్టు పట్టిందంటే, ఉరుకులు పరుగుల మీద ఆమెను పెళ్ళి చేసుకోవలసి వచ్చింది అలీ బఖ్ష్‌కి!! తన అన్నలు, పెద్దక్క, అమ్మా – ఎవరికీ చెప్పా పెట్టకుండానే, అలీ బఖ్ష్‌ను వెంట పెట్టుకుని, మదీహా, పత్థర్ మసీదులో మౌల్వీ ఎదురుగా నిలబడింది. అలీ బఖ్ష్ నోట మాట రాక, ఊరికే చూస్తూ ఉండిపోయాడు. మదీహా ఆ మౌల్వీకి ఏమి చెప్పిందో కానీ ఆయన కాజీని పిలిచి, తన పర్యవేక్షణలో నికాహ్ జరిపించాడు. నికాహ్ అయిపోయింది. వెంటనే భూకంపం!! అంతే!! గురువు గారు నూర్ బఖ్ష్ ఇద్దరు కొడుకులూ, పెద్ద బిడ్డ, వాళ్ళ ప్రేమ పాలిటి పిడుగుపాటే అయ్యారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతగా చెప్పినా వాళ్ళెవరిమాటా వినలేదు. పెద్ద మౌల్వీతో దెబ్బలాడే ధైర్యం లేదు వాళ్ళకు! కాబట్టి మదీహా పైనే వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాళ్ళీద్దరినీ ఇంట్లోనుండీ వెళ్ళగొట్టేశారు. నూర్ బఖ్ష్ గారి తండ్రిగారు జహీర్ బఖ్ష్ గారు కొడుకుకిచ్చిన నూర్ మంజిల్ హవేలీ నుండీ, ఎటువంటి కట్నకానుకలూ లేకుండా, బైటికి పంపేశారు వాళ్ళంతా కొత్త దంపతులను! అలీ బఖ్ష్ దగ్గర మదీహా బానోను పెట్టేందుకొక ఇల్లూ లేదు, వాకిలీ లేదు. పోషించటానికి ఒక ఉద్యోగమూ లేదు. గురువుగారు నూర్ బఖ్ష్ గారు లేకుండా అతని షెహ్నాయ్‌ని ఎవరు వింటారు? మదీహాకు తండ్రిగారి ఇంటి సౌకర్యవంతమైన జీవితం తాలూకు అలవాట్లుండేవి. అలీ బఖ్ష్ దగ్గరేం ఉంది? పెళ్ళిల్లు, పేరంటాలప్పుడు షెహ్నాయ్ వాయించటం మొదలెట్టాడు. ఇబ్రార్ బ్యాండ్ వాళ్ళు, వాళ్ళ గురువుగారు నూర్ బఖ్ష్ గారి మీద గౌరవం కొద్దీ సహాయం చేశారతనికి! పెళ్ళి ముహూర్తాలప్పుడు అలీ బఖ్ష్ గుర్తొచ్చేవాడు అందరికీ. ఒక ఆఫీస్ గది పెట్టుకున్నాడు. పెళ్ళిళ్ళు ఉండనప్పుడు సంపాదన తగ్గిపోతుండేది. బీడీలు చుట్టే పనికి వచ్చే డబ్బులతో జీవితం దుర్భరంగా మారింది. కానీ మదీహా మాత్రం, కష్టమనే మాటే అనదు. ఆమెకు తాను చేసిన పని సరైనదే అనే గర్వముండేది. తన ప్రేమ ముందు పుట్టినిల్లు సిరిసంపదలసలు వద్దనుకుందామె!! ఐనా తన తల్లి కూడా యీ విషయంలో మౌనంగా ఉండటమొక్కటే ఆమెను బాధించేది. కానీ అమ్మ పాపం అమాయకురాలు, ఆమె మాట అన్నయ్యలూ, అక్కా పడనీయటం లేదనుకుని, ఇక ఆ వైపునుండీ మనసు మళ్ళించుకుంది. సాబిర్ పుట్టినప్పుడు, ఎక్కణ్ణించీ హఠాత్తుగా వచ్చిందో మృత్యువు ఏమో కానీ, సాబిర్ అమ్మ మదీహాను ఎగరేసుకుని పోయిందొక్కసారి! ఇక్కడ ఆమె కడుపులోంచీ వీడు బయట పడ్డాడో లేదో, అటు ఆమె విలవిల్లాడుతూ దేహం విడిచి వెళ్ళిపోయింది. పాపం అలీ బఖ్ష్ ప్రాణం చిక్కుల్లో పడింది. భార్య చనిపోయినందుకేడ్వాలో, పసిగుడ్డును చూసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ సమయంలో సాబిర్ పిన్ని, వితంతువు, బిల్కీస్ బానో వాళ్ళనాదుకుంది. రెండేళ్ళనుండీ ఆమె వైధవ్యం అనుభవిస్తూ ఉంది. పీర్ ముహానీ గోరీల గడ్డ దక్షిణం వైపున్న లాల్జీ టోలా వెనకున్న హంటర్ రోడ్ సందులో ఆమె సొంత ఇల్లుండేది. భర్త తిరుగుబోతు. అతగాని ముక్కలైపోయిన శవం, రైలు పట్టాలదగ్గర దొరికింది. వాళ్ళ ఇంటి వెనకే రైల్ సిగ్నల్ ఉండేది. యార్డ్‌కు పోయేముందు యీ సిగ్నల్ దగ్గరే గంటల తరబడి గూడ్సులు ఆగి ఉండేవి. బిల్కీస్ మొగుడు యీ గూడ్సులనుండీ సామాను దొంగిలించి అమ్ముకునేవాడు. ఇదే పని అతగాడికి! ఈ పనిలోనే ఏదో రోజు ఇలా ప్రమాదానికి గురయ్యాడు. అది నిజంగా ప్రమాదమేనా లేక గిట్టనివాళ్ళెవరో చంపి రైల్వే ట్రాక్ పై పడేశారో, అల్లాకే ఎరుక.
బిల్కీస్ బానో, సాబిర్ వాళ్ళమ్మకు సొంత అక్క కాదు. సాబిర్ వాళ్ళ మాతామహుడు తాలూకు మొహమ్మద్ జాన్ కూతురు. వాళ్ళమ్మ, మదీహా బానో స్నేహితురాలు. వాళ్ళిద్దరిమధ్యా అక్కా చెల్లెళ్ళ అనుబంధం ఉండేది. పెళ్ళి తరువాత బిల్కీస్, రైల్వే హంటర్ రోడ్లోని అత్తవారింట్లో ఉండేది. చెల్లెల్లాంటి తన స్నేహితురాలు కన్న కొడుకును సాకేందుకు తన ఒక గది ఇంటికి గొళ్ళెం పెట్టి బీగం వేసేసి, వెంటనే సుల్తాన్ గంజ్ వచ్చేసింది. సాబిర్ పెంపకం కోసం అలీ బఖ్ష్‌కు ఒక ఆసరా దొరికింది. దానికి తోడు, అతని షెహ్నాయ్కి బిల్కిస్ బానో యవ్వనం కొత్త ఊపిరి పోసింది కూడా!! అలీ బఖ్ష్ అచ్చమైన కళాకారుడు. కాస్త రసికుడు కూడా!! అందుకే భార్య పోయిన బాధను మరచిపోయి, బిల్కీస్ బానోను అల్లుకుపోయాడు. నికాహ్ లాంటివేవీ లేకుండానే ఆమెను ఇంట్లో ఉంచుకున్నాడు. ఆమె కూడా తన గదిలోని సామానంతా ఇక్కడికి తరలించింది, ఆ గది బాడుగకిచ్చేసి! ఏడెనిమిదేళ్ళైనా అయ్యాయో లేదో, ఒక పెళ్ళిలో షెహ్నాయి వాయిస్తూ అలీ బఖ్ష్ తూలి పడిపోయాడు. బిల్కీస్ బానో నుదుట వైధవ్యం రాసి ఉంది కాబట్టే అలీ కూడా దక్కలేదామెకు!! తన వారసుణ్ణి ఆమెకు అప్పగించి, సెలవు తీసుకున్నాడు. అలీ బఖ్ష్ బాడుగ గది ఖాళీ చేసి బిల్కీస్ బానో రైల్వే హంటర్ రోడ్డులోని తన సొంత ఇంటికి వెళ్ళేసరికి, అక్కడ అంతవరకూ బాడుగకున్న అతను దాన్ని ఆక్రమించేశాడు. గుండెలు బాదుకుంటూ ఉండిపోయింది బిల్కీస్ బానో! ఇంటిలోకి ప్రవేశిద్దామంటే అసలు ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది. పోలీసు స్టేషన్ వెళ్ళింది కానీ బీదవాళ్ళ గోడు వినేదెవరు? జులుం చేయటమో, కోర్టు ద్వారా దెబ్బలాడటమో చేసే స్తోమతెవరికుంది? పైగా అప్పటి పరిస్థితులూ ప్రతికూలంగానే ఉన్నాయి. లోపల్లోపల అగ్ని రాజుకుంటున్నట్టే ఉండేది. ఊరి ఇతర ప్రాంతాల్లోలా ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా పుకార్ల పొగ వ్యాపిస్తూనే వుంది. ఎవరూ బిల్కీస్ బానోకు సహయం చెసేందుకు ముందుకు రానేలేదు. అందరి ఇళ్ళ తలుపులూ తట్టిందామె, కానీ అందరూ మొహాలు తిప్పుకున్నారు.
అక్కడ బాడుగకున్నతను భూలోటన్ గోప్ బంధువే! లాల్ జీ టోలా లో అతనికి పెద్ద ఇల్లే ఉంది. అతను చాలా ఆలోచించే బిల్కీస్ బానో గది అద్దెకు తీసుకున్నాడు. కొన్ని నెలలు బాడుగ ఇచ్చాడు బాగానే!! తరువాత బాడుగ ఇవ్వటం మానేశాడు. కొన్ని రోజులు బిల్కీస్ పాల మీదే బతుకుతున్న నెలల పసిపిల్లాడి సంరక్షణలోనూ, అలీ బఖ్ష్ షెహ్నాయ్ రాగాలను వింటూ, కిరాయి విషయం పట్టించుకోలేదు. ఎప్పుడైనా డబ్బు అవసరం పడితే సుల్తాన్ గంజ్ వెళ్ళి బాడుగకున్న అతని దగ్గర డబ్బు తెచ్చుకునేది. అలీ బఖ్ష్ చనిపోయిన తరువాత, నిరాశ్రయంగా ఐపోయిన సమయానికి, ఆమె గది పశువుల కొట్టంగా మారిపోయింది.
భూలోటన్ బంధువైన ఇతగాడు, బిల్కీస్ బానోకు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బు వివరాలన్నీ ఒక చోట రాసి పెట్టుకున్నాడు. ఇందులో సూచించిన డబ్బంతా కలిపి, కోర్ట్ స్టాంప్ డ్యూటీ పేపర్లమీద ఎడమ చేతి వేలి ముద్ర కూడా వేసి పెట్టుకున్నాడు. బిల్కీస్ వేలిముద్ర అనే చెబుతున్నాడది. మునిసిపాలిటీ వాళ్ళతో కుమ్మక్కై, టాక్స్ కూడా కట్టనారంభించాడు దానికి! గత ఎన్నో సంవత్సరాలనుండీ కట్టినట్టు అక్నాలెడ్జ్ రసీదులు కూడా ఉన్నాయి అతని దగ్గర!!
బిల్కీస్ బానో యీ నాలుగో వీధిలో ఒక గది అద్దెకు తీసుకుంది. సబ్జీ బాగ్‌లో లంగర్ టోలీకి వెళ్ళేదారిలో ఉన్న శకూర్ మియ్యా బేకరీలో పనిచేయటం మొదలెట్టింది. రసీదన్ తానే పూనుకుని ఆమెకు యీ గది అద్దెకు ఇప్పించింది. నిరాశ్రయురాలు బిల్కీస్ బానోకు తానే పూచీకత్తుగా నిలిచింది.
ఇదిగో యీ సమయంలోనే సాబిర్, ఫజ్లూ మధ్య స్నేహం ఏర్పడింది. సాబిర్‌ను రసీదన్కు అప్పజెప్పి, తాను బేకరీలో పనిచేసేందుకు వెళ్ళిపోయేది బిల్కీస్. సాబిర్, ఫజ్లూ రోజంతా కలిసే ఉంటారు, అల్లరి చేస్తూ!! ముందు సాబిర్ పరుగులు పెడుతూ ఉంటే, వెనక ఫజ్లూ!! అప్పుడు ఫజ్లూ రెండు కాళ్ళూ బాగానే ఉండేవి. సాబిర్ కంటే కాస్త సన్నగా బలహీనంగా ఉన్నా, శక్తి బాగానే ఉండేది. బేకరీ నుంచీ వచ్చేటప్పుడు బిల్కీస్ ఇద్దరికీ, పావ్ రోటీ, బిస్కెట్, నాన్ ఇలా ఏదో ఒకటి తీసుకునే వచ్చేది. ఎప్పుడైనా ఆమె బేకరీ నుండీ రావటం ఆలస్యమైతే, సాబిర్, రసీదన్ దగ్గరే ఉండేవాడు. వాడికి అన్నం తినిపించి, తన దగ్గరే నిద్ర పుచ్చేది రసీదన్. ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ యవ్వనంలోకి అడుగు పెట్టేవేళకు, బిల్కీస్‌కు నెమ్మదిగా అతని గురించి చింత లేకుండా పోయింది. ఈలోగా ఫజ్లూ కాలు బలహీన పడింది. నెలల తరబడి మంచం మీదే ఉండేవాడు. మెల్లి మెల్లిగా ఒక కాలి మీద నిలబడగలిగాడు ఫజ్లూ. నడకా నేర్చాడు. తండ్రి నాసిర్ మియ్యాకు సమాధులు తవ్వటంలో సహాయపడేవాడు. అటు సాబిర్, సత్తార్ మియ్యాకు శిష్యరికం చేయటం మొదలెట్టాడు. కానీ బిల్కీస్‌కు దూరమవసాగాడు. పగలూ రాత్రీ బొంగరంలాగా సత్తార్ మియ్యా చుట్టూ తిరగటమే పని సాబిర్‌కు!
ఒక రోజు బిల్కీస్, సాబిర్ మధ్య మాటా మాటా పెరిగింది. దాని తరువాత కొన్ని రోజులు మాటలుండేవి కాదు, ఉట్టి తిట్లూ, శాపనార్థాలూ!! మెల్లిమెల్లిగా కొట్టుకోవటం వరకూ వచ్చింది. ఉన్నట్టుండి ఒకరోజు బిల్కీస్ బానో బేకరీ నుండి ఇంటికి తిరిగి రానేలేదు. భర్త, ఇల్లు, అలీ బఖ్ష్ ఇలా అన్నిటికీ దూరమైపోయింది ముందే! పోగొట్టుకోవటానికి ఇంకా ఏముంది ఆమె దగ్గర? అందుకేనేమో ఇప్పుడు తన్ను తాను పోగొట్టుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి! రసీదన్ ఆమె కోసం చాలా చోట్లే వెదికింది. దొరకనేలేదామె. ఈలోగా షకూర్ మియ్యా మాటల మధ్య ఒకసారన్నాడు, 35, 40 సంవత్సరాల మధ్య వయసున్న ఒక వ్యక్తి ఎవరో అప్పుడప్పుడు ఆమెను కలిసేందుకు వస్తూ ఉండేవాడట! షకూర్ మియ్యా కంట పడకుండా దొంగ దొంగగా అతన్ని కలుస్తూ మాట్లాడుతూ ఉండేదట! షకూర్ మియ్యా ఇంట్లో ఉన్నప్పుడూ, లేదా బాకీలు రాబట్టుకునేందుకు బైటికి వెళ్ళినప్పుడూ బిల్కీస్ ఆ మనిషితో మాటల్లో పడి, వ్యాపారానికి నష్టమూ తెచ్చేదట!! ఇదంతా చూస్తూ షకూర్ మియ్యాకు అసహనం ఏర్పడింది. బిల్కీస్, షకూర్ మియ్యా గురించి చెప్పే కథ వేరేగా ఉంది. షకూర్ మియ్యా పిల్లా పాపా ఉన్నవాడే కానీ మనసు మంచిది కాదట! ఆమె మీద అతనికి కన్ను పడిందట! ఎప్పుడూ ఏదో ఒక సాకు వెదకి పట్టుకుని మరీ తనను కోప్పడుతూ ఉండేవాడట! నిజానికి ముసలాడు అంత మంచివాడేం కాడు కానీ ఎవరో మగాడు బిల్కీస్‌తో ఉన్నాడని మాత్రం చెప్పింది మాత్రం నిజం. ఎప్పుడైనా ఏనాడైనా ఒక్కసారైనా తాను చూడని ఆ మనిషిని వెదికేందుకు ఎక్కడికని వెళ్తుంది రసీదన్? బిల్కీస్‌తో కలిసి పనిచేసేవాళ్ళకు కూడా ఆమె ఎక్కడికి వెళ్తూంది, ఎవరిని కలుస్తూ ఉంది, అన్న విషయాలేమీ కాస్తైనా తెలియవు. ఎక్కడైనా చెరువులో దూకి చచ్చిపోయిందో, లేక యీ రోజు రోజు గొడవల వల్ల విసుగొచ్చి, వాటినుండీ తప్పించుకుని ఆ మగాడితో లేచేపోయిందో ఆ అల్లాకే తెలియాలి.
బిల్కీస్ బానో వెళ్ళిపోయిన తరువాత, సాబిర్‌కు ఆమె విలువ తెలిసి వచ్చింది. ముందైతే అస్సలు యీ విషయం పట్టించుకోలేదు, ఎక్కడికిపోతుంది, ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందనే అనుకున్నాడు. నెలలు గడిచినా రాకపోయే సరికి, ఒక రోజు సాబిర్ ఒక్క ఉదుటున గుక్కపట్టి ఏడ్చాడు – ఆమె కోసం! కొన్ని రోజులు ముభావంగా ఉన్నాడు. తక్కువ మాట్లాడేవాడు. రాత్రుళ్ళు మేలుకునే వుండేవాడు. సత్తార్ మియ్యాతో, ఫజ్లూతో కలిసి మందు తాగేవాడు. చిలుం పీల్చేవాడు. ఇప్పుడైతే సాబిర్‌కు, వాళ్ళ నాన్న బాగా జ్ఞాపకానికి వస్తున్నాడు. ఆయన వాయించే షెహ్నాయ్ గుర్తుకు వస్తూంది. ఆ షెహ్నాయ్ అతని దగ్గరే వుంది. వాళ్ళ నాన్న వాడేటప్పుడెలా ఉందో అలాగే ఉంది. సుల్తాన్ గంజ్ నుంచీ గది ఖాళీ చేసి వచ్చేటప్పుడు బిల్కీస్ బానో దాన్ని వెంట తెచ్చుకుంది. రంగు వెలసిన మఖ్మల్ గుడ్డతో చుట్టిన పెట్టెలో మూగవోయిన షెహ్నాయి అలాగే పడి ఉంది.
***
బిల్కీస్ బానో వెళ్ళిపోయిన తరువాత సాబిర్‌లో ఒకటే ఉదాసీనత! తన చిన్నప్పటి జ్ఞాపకాలు కారుమేఘాల్లా అతన్ని చుట్టుముట్టేవి. లేదా ఆకాశం నుండీ చుక్కలన్నీ మండుతూ అతనిపై వచ్చి పడుతున్నాయా అనిపించేది. తండ్రి చేసే ముద్దు ముచ్చటా, లేదా పిన్ని చేసే గోము గుర్తుకు వచ్చేది. చిన్నప్పుడంతా వాళ్ళను తాను చాలా సతాయించేవాడు. ఓపక్క ఆకలౌతూ ఉన్నా, భీష్మించుకుని కూర్చునేవాడు, ఆకలవటం లేదని!! ఇంకేముంది, పిన్ని వెనక పడేది, బ్రతిమాలుతూ!! నాన్న, పిన్నీ ఇద్దరి మధ్యా ఎప్పుడూ ఏ గొడవా జరిగేదే కాదు. ఆమె ఎప్పుడైనా బడబడా వాగినా, నాన్న నవ్వేసేవాడు. ముందైతే అర్థమయ్యేది కాదు, అందరికీ అమ్మ ఉంది, మరి తనకు అమ్మ బదులు పిన్ని ఎందుకుందీ అని!! వయసు పెరిగే కొద్దీ, తానేమీ అడగకుండానే చుట్టూ ఉన్నవాళ్ళ వల్ల తెలిసింది, తనను కంటూనే అమ్మ మదీహా, చనిపోయిందనీ, అప్పటినుంచీ పిన్నే తనను పెంచి పెద్ద చేసిందనీనూ!! తెలిసీ తెలియని వయసు కదా, ఒక రోజు తాను పిన్నినడిగాడు, ‘మరి నువ్వెందుకు చచ్చిపోలేదు?’ అని!! ఆమె తనను కొట్టటానికి వెంటపడింది. తాను పరిగెత్తాడు దొరక్కుండా!! తరువాత పిన్నికి నవ్వొచ్చేసింది. తనను దగ్గరికి రమ్మని ఎంతగానో బ్రతిమాలింది. సాబిర్ వాళ్ళ నాన్న, పెళ్ళిలో షెహ్నాయి వాయించేందుకు వెళ్ళి, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, మిఠాయిలూ అవీ తెచ్చేవాడు. ఆయన్ని చూడగానే తాను పరిగెత్తి వెళ్ళేవాడు ఆయన దగ్గరికి! మిఠాయి పాకెట్ తీసుకునే ముందు, ఆయన భుజానికి వేలాడుతున్న షెహ్నాయీ ఉంచే ముఖ్మల్ సంచీని, కిందకు దించేందుకు ఎగబడేవాడు, నాన్న తలవంచేవాడు, తాను ఆ సంచీ అందుకుని దించేవాడు. తరువాత, నాన్న తన చేతికి మిఠాయి పాకెట్లు అందించి, షెహ్నాయి సంచీని భద్రపరచేవాడు.
సాబిర్‌కు అన్నీ జ్ఞాపకం లేవు కానీ, బాల్యం నాటి కొన్ని సంఘటనలూ, కొన్ని చిత్రాలూ కూడా, గుర్తుకొస్తున్నాయి పిన్ని వెళ్ళిపోయినప్పటి నుండీ!! అప్పుడైతే అదంతా అర్థం కాలేదు కానీ, కాస్త పెద్దయిన తరువాత బాగా అర్థమయింది. ఆ రోజు సుల్తాన్‌గంజ్‌లో మధ్యాహ్నం, దుకాణాలన్నీ ఉన్నట్టుండి మూసివేశారు. అక్కడున్న వాళ్ళంతా తమ తమ ఇళ్ళలోకి వెళ్ళి దాక్కున్నారు. రోడ్డు మధ్యలో పోలీసులు నిలబడీ, తమ బళ్ళలో వీధుల్లో తిరుగుతూ, అన్ని వైపులా జాగ్రత్తగా పరికించి చూస్తున్నారు. కర్ఫ్యూ ప్రకటించారు. గంగ ఒడ్డున ఇసుకలో పిట్టో ఆట ఆడుకుంటున్నాడు. పరుగు పరుగున పిన్ని అక్కడికి వచ్చింది. వెనకే పోలీసులు వచ్చి ఆమెను ఈడ్చుకుంటూ లాక్కెళ్ళి జైల్లో వేశారు. సాబిర్ వాళ్ళ నాన్న బైటికెక్కడికో వెళ్ళినవాడు, వెనక్కి వచ్చాడు. ఆయన కూడా బాగా భయపడుతున్నాడు. మాటిమాటికీ అంటున్నాడు, గొడవలు జరుగుతాయని!! అంతకుముందు సాబిర్ ఎప్పుడూ అల్లర్లు చూడలేదు. అల్లర్లు ఎలా ఉంటాయో చూస్తానని వాళ్ళ నాన్నను అడగటం మొదలెట్టాడు, మొండిగా!! మొట్ట మొదటిసారి వాళ్ళ నాన్న సాబిర్‌ను కోప్పడ్డాడు. ఆ తరువాత చాలా రోజులు అక్కడివాళ్ళంతా ఇళ్ళల్లో దాక్కునే వున్నారు. మూసి ఉన్న కిటికీ పరదాల చినుగుల్లోంచీ, వీధుల్లో ఏమి జరుగుతూ ఉందో చూస్తూ ఉండేవాడు సాబిర్. తమ ఇంటికి ఎదురుగా ఉన్న దుకాణం మూసిన తలుపుల దగ్గర ఆయాసపడుతున్న కుక్క మాత్రమే కనిపించేది. అది ఇటీవలే ఏడు పిల్లల్ని పెట్టింది. అప్పుడప్పుడు దాని పిల్లల కుయ్ కుయ్‌లు, అంతలోనే పోలీసు బూట్ల టకటకలు, ఇవే వినబడేవి. పోలీసులు వెళ్ళిపోయిన తరువాత, పిన్ని ఒళ్ళో ముఖం దాచుకుని పడుకున్నాడు తను అప్పుడు!! రెండ్రోజుల తరువాత, తినటానికి ఇంట్లో యేమీ లేకపోతే పిన్ని భయం భయంగా బైటికి వెళ్ళింది. చాలా కష్టమ్మీద సందు మొదట్లో నోమాన్ ఇంట్లోనుండీ రొట్టెలు తీసుకుని వచ్చింది. అంతవరకూ తను నాన్న ఒళ్ళో నీరసంగా పడుకునే ఉన్నాడారోజు!! పెద్దైన తరువాత తెలిసింది, చిన్నప్పటి ఆ గొడవలకు కారణం, ఏదో మసీదును కూలదోశారన్న వార్త. పిన్ని వెళ్ళీపోయిన తరువాత, అప్పటి ఆ విషయాలన్నీ సినిమా రీల్‌లా కళ్ళముందు తిరుగాడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా నాన్న ఒడి వెచ్చదనం, పిన్ని ఆ రోజు తెచ్చిన రొట్టెల రుచి గుర్తుకు వస్తాయి. నాన్న చనిపోయాడు. తన పెంకెతనంతో విసుగొచ్చి, పిన్ని ఇల్లు వదిలి వెళ్ళేపోయింది.
అప్పట్లో సాబిర్ అనుకునేవాడు, నాన్న చనిపోకపోయి ఉంటే, తన జీవితంలో ఫజ్లూ, సత్తార్ మియ్యా, అమీనా – ఎవరూ ఉండేవాళ్ళు కాదు. ఈ కబ్రిస్తాన్ కూడా ఉండేది కాదు. ఈ గంజాయి చిలుమూ, మందు పాకెట్లూ ఉండేవి కావు. నాన్న లాగా, తాను కూడా మంచి సువాసన వచ్చే పాన్ వేసుకునేవాడు. షెహ్నాయి వాయిస్తూ ఉండేవాడు. నాన్న తనకు షెహ్నాయి నేర్పించాలనుకునేవాడు. అప్పుడు నాన్న లాగా షెహ్నాయి ఉంచే ముఖ్మల్ గుడ్డ సంచీని ఛాతీకి దగ్గరగా వేసుకుని తిరిగేవాడు. నాన్న అస్సలు కోప్పడేవాడే కాదు. ఒద్దనేవాడు కూడా కాదు. చిన్నప్పుడు యీ వాయిద్యం అంటే తనకెంతో మక్కువ. ఆ ప్రేమంతా ఎక్కడికిపోయిందిప్పుడు? ఇంట్లోనే షెహ్నాయి ఉన్నా, తాను దాన్నసలు పట్టించుకోనేలేదు ఇన్ని రోజులు.
సాబిర్ పెద్ద మామయ్య ఉస్తాద్ ఫహీం బఖ్ష్, చిన్న మామయ్య గులాం బఖ్ష్ కూడ చాలా పేరున్నవాళ్ళు. వాళ్ళిద్దరూ ఇప్పుడున్నారు. ఇప్పుడు కూడా షెహ్నాయి వాయిస్తారు. తాతయ్య నానా బఖ్ష్ లాగే వీళ్ళిద్దరినీ కూడా ప్రజలెంతో గౌరవిస్తారు. సాబిర్ ఇంత వరకూ తన తాతయ్య వాళ్ళింటికి వెళ్ళనేలేదు. ఇవన్నీ బిల్కీస్ చెప్పిన సంగతులే!! అమ్మ బతికి ఉంటే వెళ్ళి ఉండేవాడు. అన్ని గాయాలనూ కాలమే మాన్పుతుంది. అమ్మ ఉండి ఉంటే, ఇప్పటికి పరిస్థితులంతా మారిపోయి ఉండేవి. తాతయ్యా వాళ్ళింటికి రాకపోకలూ ఉండేవి. మామయ్యల శిక్షణలో తాను షెహ్నాయి నేర్చుకుని ఉండేవాడు. అలా తన కలా నెరవేరి ఉండేది. తన యీ కల, చెదరిన కలగా మనసులో సలుపుతూ ఉండేది కాదీనాడు!! పిన్ని అంతా చెప్పింది, అమ్మా నాన్నా పెళ్ళి, పెళ్ళి తరువాత పుట్టింటితో బంధాలెలా తెగిపోయాయో, అమ్మ అక్కా, ఇద్దరు మామయ్యలూ, అమ్మను పుట్టింటినుంచీ ఎలా విడదీశారో, ఆస్తినంతా దోచుకుని అస్సలు రాకుండా చేశారో, అంతా చెప్పింది. ఎటువంటి రక్త సంబంధమూ లేకున్నా పాపం బిల్కీస్ పిన్ని తన ఆస్తంతా ఖర్చు పెట్టి మరీ, తనను పెంచి పెద్ద చేసింది. అమ్మ మదీహా బానో తాలూకు ఎటువంటి ఆస్తీ తనకు వద్దు. కేవలం ఆమె ఫోటో ఏదైనా ఉండే ఉంటుంది. ఇంతవరకూ అమ్మ ఫోటో కూడా చూడలేదు తను. ఆమె ఫోటో తనకిచ్చేందుకు వాళ్ళకు అభ్యంతరమేముంటుంది?
***
తాను అమీనాను ప్రేమిస్తూ ఉన్నాడో లేదో కూడా సాబిర్‌కు తెలియదు. కానీ అమీనా తనను ప్రేమిస్తూ ఉందనీ, పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా ఉందనీ కూడా తెలుసు. అమీనా ప్రేమను గౌరవిస్తాడు సాబిర్. అమీనా గురించి ఆలోచిస్తాడు సాబిర్. ప్రేమంటే ఏమిటో అతనికి తెలీదు. ఇదే ప్రేమ అంటే, అతనిలోనూ ప్రేమ ఉంది. అంతే!!!!
జుమా ప్రార్థన సమయంలో మోకాళ్ళమీద కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు, సాబిర్ కళ్ళలో అమీనా రూపమే కనిపిస్తుంది. నమాజ్ తరువాత తన యీ దైవ దూషణ కోసం తనలో తాను సిగ్గుపడుతూ ఉంటాడు సాబిర్. నమాజ్ చదివిన తరువాత పెద్ద మౌల్వీ హాఫిజ్ నూరుద్దీన్ తన సందేశంలో ‘అల్లా తాలా సర్వాంతర్యామి, అందుకే ఆయనకు అన్నీ తెలుసు. మనసులోపలి మాటలు కూడా!!’ అని అంటూ ఉంటారు. అసలీ సర్వాంతర్యామి అంటే ఏమిటో సాబిర్‌కు ఇప్పటిదాకా అర్థమే కాలేదు. ఎప్పుడైనా మౌల్వీ గారినే అడగాలి. మనసులోని మాటలన్నీ అల్లాహ్‌కు అర్థమై పోతూ ఉన్నప్పుడు, నమాజ్‌లో తనకు అమీనా ముఖం కనిపించటంలో తన తప్పేమీ లేదని తెలియాలి కూడా!!
అమీనాకు సత్తార్ మియ్యా కుళ్ళు కళ్ళస్సలిష్టం లేదు. అమీనా మనసులో సత్తార్ మియ్యా అంటే కొంచెమైనా ప్రేమ లేదు. ఇంటి పరిస్థితుల వల్ల పాపం ఊపిరి బిగబట్టుకుని ఉందంతే అలా!! సత్తార్ మియ్యా అమీనా అంటే పడి చస్తాడు. కానీ అమీనా అతన్ని కాస్త దూరంలోనే పెడుతుంది. ఐనా అతని వల్ల కొన్ని లాభాలు కూడా పొందుతుంది. చొంగ కారుస్తూ ఉంటాడామెను చూస్తూనే సత్తార్ మియ్యా!! అమీనా అసహ్యించుకుంటూనే ఉంటుంది. సాబిర్‌కు రోజూవారీగా వచ్చే డబ్బుల లావాదేవీలు సత్తార్ మియ్యా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి, సాబిర్ కూడా, అమీనాతో తనకున్న బంధం బైటపడనివ్వడు. పైకి తెలీనట్లున్నా, అమీనా ఇంటివాళ్ళకందరికీ యీ సంగతెటూ తెలుసు. ఇంకా కొన్ని రోజులు ఆగవలసిందే మరి!! ఈ మార్గం కోసం కూడా సాబిర్ వెదుకుతూనే ఉన్నాడు. బతుకు బండి నడుపుకునేందుకు ఏదైనా వ్యాపారం లాంటి మార్గం దొరికితే చాలు, సత్తార్ మియ్యాతో తెగతెంపులు చేసుకుని, అమీనాతో నికాహ్ చేసుకుంటాడు తాను!! కాస్త నిలదొక్కుకోవటమే ఆలస్యం!! ఫజ్లూ వాళ్ళమ్మతో సంబంధం పెట్టుకుని సత్తార్ మియ్యా తన కాళ్ళను తానే నరుక్కున్నాడు. వీళ్ళ ఇంట్లోనుంచీ కుక్కలాగా అతగాణ్ణీ వెళ్ళగొట్టినప్పటినుంచీ, వీధిలో కూడా అతన్ని గౌరవించేవాళ్ళే లేరు. సత్తార్ మియ్యా డబ్బులతో కొన్న మేక కర్రీ, సారా పౌచ్, గంజాయి దమ్ము మీద తాను ఉచ్చ పోసే రోజు తొందరలోనే వస్తుంది. సత్తార్ మియ్యాను ఎదుర్కునే ఆ మాత్రం బలం తన దేహంలో ఉండనే ఉంది మరి!!
సాబిర్‌కు అమీనా మీద నమ్మకముంది. సత్తార్ మియ్యా విసిరే బిస్కెట్లకోసం ఆశ పడే రకం కాదామె. చాలా సహనముంది అమీనాకు!! చున్నీ లాగా ఆమె కలలు పగ్గం లేనివి కావు. చున్నీ ఎవడి చాతీమీదైనా సరే పాదం మోపి గెంతి వెళ్ళిపోగలదు. కానీ అమీనా అలా చేయలేదు. గోరీల గడ్డను దాటుకుని వెళ్ళిపోవాలని చున్నీ కోరిక. అమీనాకు కూడా ఇక్కడినుంచీ వెళ్ళిపోవాలనే ఉంది కానీ గోడ దూకి కాదు, ఒక చక్కని ఒద్దికైన ఇల్లాలిగా గేటు దాటి గౌరవంగానే వెళ్ళాలని మాత్రమే!! తన కోసం అర్రులు చాచే సత్తార్ మియ్యా ప్రతి ఎత్తూ ఆమెకు బాగా తెలుసు. అతడు తనకోసం చేసే ప్రతి మంచి వెనుకా ఉన్న నిజం ఆమె పసిగట్టగలదు. ఎవరైనా గుడ్డివాడి మాదిరి తన డబ్బును ఖర్చుపెట్టేందుకు సిద్ధమైతే, దాన్ని అనుభవించేవాడిదేమి తప్పు? అమీనా ఆశపోతూ కాదు. మంచి నడవడిక లేనిదీ కాదు. ఈ విషయంలో సాబిర్‌ను ఎవరూ తప్పు పట్టలేరు. ఇప్పటివరకూ అమీనా ఏనాడూ, సాబిర్ ముందు డబ్బిమ్మని కానీ, ఫలానా వస్తువు తెచ్చి ఇమ్మనికానీ ఒక్క సారైనా చేయి చాచి అడిగిందే లేదు. సాబిర్ ఎప్పుడైనా ఏదైనా ఇద్దామనుకున్నా అమీనా వద్దనేసేది. ఒక వేళ ఎప్పుడైనా తీసుకున్నా, అది సాబిర్‌ను బాధపెట్టటం ఇష్టం లేక మాత్రమే!! కొన్ని రోజుల కిందట, సాబిర్ అమీనాకు ఆకు పచ్చ రంగు కుర్తీ తెచ్చి ఇచ్చాడు. ఎంతో బలవంతం చేస్తే తీసుకుందది అమీనా!! దాన్ని గురించి చున్నీ పెద్ద గొడవే చేసింది. తానైతే ఇరవైనాలుగ్గంటలూ ఇల్లు పట్టకుండా తిరుగుతూనే ఉంటుంది కానీ ఇతరులమీద కన్నేసి ఉంచుతుంది. గూఢచారితనంలో చున్నీ అఖండురాలు.
బిల్కీస్ బానో పిన్ని వెళ్ళిపోయిన రోజుల్లో అమీనా, అతనిలో ధైర్యం నింపి, మామూలు మనిషిని చేయటంలో చాలా సహకరించింది. ఆమే అతనికి చాలా ఆసరాగా నిలబడింది. వయసులో చిన్నదైనా, ఆమె మాటలు మాత్రం పెద్దవాళ్ళలాగే ఉంటాయి. ఇప్పటికీ అమీనా స్వభావమంటే, సాబిర్‌కు చాలా ఇష్టం. తరచూ మౌనంగా ఉండటం, అవసరం వచ్చినప్పుడు అర్థవంతంగా మాట్లాడటం – అమీనా ప్రత్యేకతలు. కారణం లేకుండా చున్నీలాగా గొడవ చెయ్యదు. చున్నీ ఇరవైనాలుగ్గంటలూ, పాములాగే బుసకొడుతూ ఉంటుంది. చున్నీ రెచ్చగొట్టకపోతే అస్సలు అమీనా గొంతే వినబడదెప్పుడూ!
తన సమయమెప్పుడొస్తుందా అని సాబిర్ కాచుకునున్నాడు. అదెప్పుడొచ్చినా, అమీనాను యీ కబ్రిస్తాన్ నుంచీ తీసుకుని బైటికి వెళ్ళిపోవాలంతే!! కానీ ఒక్కటే అతని బాధ, షెహ్నాయికి తన జీవితంలో చోటు లేదేమో? అని! కాలం నాన్నను తననుండీ దూరం చేసి ఉండకపోయి ఉంటే, తాను కూడా తన తండ్రి అలీ బఖ్ష్, తాత ఉస్తాద్ నూర్ బఖ్ష్ లాగే షెహ్ నాయ్ కళాకారుడిగా కీర్తి ప్రతిష్ఠలు పొంది ఉండేవాడు.
***
సాబిర్ వ్యాపారం, సత్తార్ మియ్యా వ్యాపారంతో ముడిపడి ఉంది. పెట్టుబడి సత్తార్ మియ్యాదైతే శ్రమ సాబిర్‌ది. ప్రతిరోజూ సాబిర్ చిక్ పట్టీ, ఇంకా చిల్లర మల్లర దుకాణాల చుట్టూ తిరిగి సైకిల్ మీద మేక తోళ్ళు వేసుకుని వస్తాడు. కబ్రిస్తాన్‌కు ఈశాన్య దిశలో సత్తార్ మియ్యా ఒక టిన్ షెడ్‌తో గోదాం వేసి ఉంచాడు. సాబిర్ కేవలం ఆ గోదాము వరకూ సరుకును చేర్చటమే!! రాత్రవగానే సత్తార్ మియ్యా ఒక పికప్ వ్యాన్‌లో సరుకును ఎక్కించుకుని దలారుల గోదాముల దగ్గరికి వెళ్ళిపోతాడు. బేరసారాలు అసలుండవనే చెప్పవచ్చు. సరుకు ఆకారాన్ని బట్టి ధర ఒకేలా ఉంటుంది, కొనటానికీ, అమ్మటానికీ కూడా!! నకదు వ్యాపారమే ఖచ్చితంగా!! కాకపోతే యీ దలారుల దగ్గరినుంచీ డబ్బు రాబట్టుకోవటమే పెద్ద చిక్కు. దలారులు డబ్బు మొత్తం చెల్లించటానికి ఇష్టపడరు. వాళ్ళ అభిప్రాయంలో, ముడిసరుకును మోసుకుంటూ ఎవరు తిరగ్గలరు? అప్పు మీద చచ్చినట్టు ఇస్తారు. ఐతే యీ విషయంలో సత్తార్ మియ్యాదే పైచేయి. ఆ మాటా యీ మాటా చెప్పి మధ్యవర్తులనుందీ డబ్బంతా రాబడతాడతను!! ఒకవేళ డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయినా, వ్యాపారం మొత్తం ఆగిపోయే ప్రమాదం అసలుండేదే కాదు. కారణం, సత్తార్ మియ్యా అంత డబ్బు లేని మనిషి కాడు. ఒకటి రెండు వారాల్లో వ్యాపారం మళ్ళీ పుంజుకునేది. తన గోదాములో ముడి సరుకును అలా ఆపి ఉంచుకునే వీలు కూడా లేదు కదా!! ఇప్పుడు హిందువులెక్కువగా ఉండే ప్రాంతమైంది యీ పీర్ ముహానీ!! ఎక్కువ రోజులు ఉంచుకుంటే వచ్చే చెడు వాసనకూ పెద్దగా నిరసనలు కూడా వస్తాయి. కబ్రిస్తాన్‌కు సంబంధించిన స్థలంలోనే ఉంది అతని గోదాము. కాబట్టి చింత లేదు. సత్తార్ మియ్యా తనకున్న తెలివి తేటలతో అటు బస్తీవాళ్ళనూ, ఇటు కబ్రిస్తాన్ కమిటీ వాళ్ళనూ మంచి చేసుకుని వ్యాపారం నడుపుకొస్తున్నాడు. నిజానికి యీ స్థలం మీద భూలోటన్ కన్ను కూడా పడింది. మద్య పాన నిషేధం అమల్లోకి రాక ముందు, యీ స్థలాన్ని అద్దెకు తీసుకుంటానని కమిటీవాళ్ళను అడిగాడు, వాళ్ళపై ఒత్తిడి తెచ్చాడు కూడా!! భూలోటన్ నుండీ తప్పించుకునేందుకే కమిటీవాళ్ళు సత్తార్ మియ్యాను భరిస్తున్నారిప్పుడు!! సాబిర్ తన వ్యాపారం సొంతంగా మొదలు పెట్టుకోవచ్చు. కానీ మేక చర్మాలు యీ ప్రాంతంలోనే పెట్టుకునే గోదాంను అద్దెకు తీసుకునేంత శక్తియుక్తులు లేవు. ఫజ్లూ స్నేహం, అమీనా – యీ రెండూ వదిలిపెట్టి యీ గోరీల గడ్డను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవటం, సాబిర్‌కు ఇష్టం లేదు. దానికితోడు, దళారుల చేతుల్లోనుండీ డబ్బు రాబట్టుకునే విద్య కూడా ఇంకా పూర్తిగా రాదు. సాబిర్‌కు ఫజ్లూ అంటే వల్లమాలిన ప్రేమ. ఒక కాలు బాగా లేకున్నా ఫజ్లూకు, ఎవరి మీదా ఆధారపడటం ఇష్టం లేదు. సాబిర్‌కు అతనిలో నచ్చే గుణమిదే!! ఫజ్లూ తన స్నేహితుడంటే ఎంతో గర్వంగా ఉంటుందతనికి! తన ఇబ్బందుల కారణంగా సత్తార్ మియ్యా ముందు ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. వాళ్ళ ప్రతిమాటనూ గుడ్డిగా ఒప్పుకోకున్నా వాళ్ళ మాటలను ఖండించనూలేడు తను! కానీ ఫజ్లూ, నిక్కచ్చిగా మాట్లాడుతాడెప్పుడూ!! సత్తార్ మియ్యా శిష్యుడు కాదు, స్నేహితుడనవచ్చు, ఫజ్లూను!!
పీర్ ముహానీ నుంచీ వెళ్ళిపోవాలని చాలాసార్లు అనుకున్నా, ఫజ్లూ స్నేహం, అమీనా ప్రేమా, వాళ్ళమ్మ రసీదన్ అమ్మతనం కూడా అతన్ని ఆపుతున్నాయి. ఈ రోజుల్లో, బైటివాళ్ళ పిల్లల కోసం ఇంతగా ఎవరైనా తాపత్రయపడతారా అసలు? బిల్కీస్ ఇక్కడికి వచ్చినప్పటినుంచీ, ఆమె మాయమైపోయిన తరువాత కూడా వాళ్ళమ్మే తనను చూసుకుంటూ ఉంది. యీ చోటు విడిచిపెట్టి వెళ్ళిపోవటం సులభమే! కానీ, వీళ్ళ ప్రేమలు, జ్ఞాపకాలూ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవటం సులభం కాదు. తన పాత జీవితానికి గోరీ కట్టేసి, ఎక్కడికో వెళ్ళిపోయేంత కృతఘ్నుడు కాలేడు సాబిర్. అప్పుడప్పుడు, తన జీవితం తలచుకుంటే నవ్వూ వస్తుందతనికి!! ఆ అల్లాహ్ మియ్యా ఎంత చిత్రమైన ఆటగాడు? ఎక్కడో పుట్టటం, ఎక్కడో పెరగటం! ఎక్కడి భాగ్యవంతుల భవనం! ఎక్కడి గోరీల గడ్డ! మఖ్మల్ సంచీలో షెహ్నాయి పెట్టుకుని తిరిగే ఉస్తాద్ నూర్ బఖ్ష్ శిష్యుడు అలీ బఖ్ష్, సైకిల్ ముందూ వెనుకా మేకల చర్మాలేసుకుని సత్తార్ మియ్యా నౌకరుగా తిరుగుతున్న ఆయన కొడుకు యీ సాబిర్? దీనికి మించిన అల్లా మియ్యా ఆట మరెక్కడైనా ఉంటుందా?
(సశేషం)