[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]
[dropcap]“కూ[/dropcap]ర్చోవయ్యా గోకుల్. ఒకప్పుడు నీకు గురువునే. ఇంకా నువ్వు నా ముందు కూర్చోవటానికే వెనకాడతావు. మీ బాచ్ వాళ్లందరూ బాగానే పైకొచ్చారు. ఇప్పుడిద్దరు మన కాలేజీలోనే పని చేస్తున్నారు. నువ్వేమో సివిల్ ఇంజనీరింగ్ చదివి ఇలా కనస్ట్రక్షన్ వర్క్‌లో వున్నావు. ఎండనకా, వాననకా తిరుగుతున్నావు. చదువయిపోగానే నా దగ్గర కొచ్చి కనపడ్డావు.”
“అవును సర్. నేను మర్చిపోలేని వాళ్లలో మీరు ముందుంటారు. బి.టెక్ కాగానే మీ దగ్గరకొచ్చాను. వెంటనే ఏదైనా జాబ్ చూసుకో. ఎక్కుడైనా ఫాకల్టీగా చేరు. లేదా ప్రొడక్షన్ వైపు వెళ్లు. అదీ కాకపోతే ఫారిన్ వెళ్లి ప్రయత్నాలు చేసుకోమన్నారు. అమెరికా వెళ్లే ప్రయత్నాలు రెండు సార్లు చేశాను సర్. కలిసి రాలేదు. ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చయ్యాలనిపించలేదు. బి.టక్ చదివేటప్పుడు మీరంతా నేర్పిన చదువుతో నాకు గట్టి పునాదే పడింది. ఆ ధైరంతో ఈ కనస్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నాను. మరీ లాభాల కాశపడకుండా నేను కట్టినవి పదికాలాల పాటు గట్టిగా నిలబడాలన్న కోరికతో ముందుకెళ్తున్నాను సర్.”
“మంచి నమ్మకాన్నే కల్గించావయ్యా. ఆ నమ్మకంతోనే పెద్ద పెద్ద కాంట్రాక్టులు కూడా మీ కంపెనీకీ ఇస్తున్నారు. ఏదో నా మీద అభిమానంతో ఈ చిన్న ఇంజనీరింగ్ కాలేజి కట్టటానికి ముందు కొచ్చావు. నీవల్లనే ఇది ఇంత అందంగా పటిష్టంగా తయారయింది.”
“ఇది మాత్రం చిన్నదెలా అవుతుంది సర్. పదెకరాల్లో కాలేజీ కట్టాం. మరో పదెకరాలు సిద్ధంగా వున్నది. మీరు రిటైర్మంట్ తర్వాత వచ్చి ఇక్కడ కాలేజీ పెడతానని నాకు చెప్పగానే చాలా సంతషం కలిగింది. నాలాంటి ఇంకొంత మందికి ఉపయోగం జరుగుతుంది సర్. ఇప్పుడీ పార్కింగ్ షెడ్ పూర్తయితే ప్రస్తుతానికి మన వర్క్ అంతా కంప్లీటైనట్లే. కాలేజీ అంతా ఇంజనీరింగ్ స్టూడెంట్లతో, మొక్కలతో, చెట్లతో కళకళలాడుతున్నది సర్. తర్వాత ఇది యూనివర్శిటీ స్థాయికి ఎదగాలి సర్.”
ఆ మాటలకు సర్ నవ్వి వూరుకున్నారు.
“మరొక్క మాట సర్. కాలేజీ ఆవరణలో ఆవులు కూడా తిరిగితే బావుంటుంది. పెంచుదామన్నారట గదా? ఆ మాట పట్టుకుని మన ఇంజనీర్ డయిరీ ఫామ్ కెళ్లి చూసొచ్చాడు. అక్కడతనికి ఏం నచ్చలేదట. నేనిక్కడికి వచ్చేటప్పుడు ఇట్నుంచి పోతూ నాకు రెండు ఆవులు ఒక దూడా, వాటిని తోలుకుంటూ ఒక కుటుంబమూ కనుపించాయి. కారు ఆపుకుని అతనితో మాట్లాడాను. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడట. కరువు మూలంగా పశువులకూ, మనుషులకూ తిండి, నీళ్లు లేక అలమటిస్తూ ఇలా ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నామన్నాడు. అతన్ని లోపలికి పిలిచి మాట్లాడితే బాగుంటుందేమే సర్.”
“అలాగే గోకుల్. పిలిపిద్దాం” అంటూనే అటండెర్ని కేకేసి గేటు దగ్గరున్న ఆవుల్నీ, వాటి తాలుకు మనుషుల్నీ లోపలికి తీసుకురమ్మన్నారు.
ఆ కుటుంబం ఆవులూ లోపలికి పిలిపించబడ్డారు. మనుషులూ, ఆవులూ కూడా బక్క చిక్కి వున్నాయి. అతను చిన్నకారు రైతు అయివుంటాడు. కరువు మూలంగా ఊరినీ, భూమినీ, ఇల్లూ వాకిళ్లూ అన్నీ వదిలేసి ఇలా తిరుగుతున్నాడని చాలా బాధ అనిపించింది వాళిలిద్దరికీ
“నీ పేరేంటయ్యా?”
“పేరుదేముదిలేయ్యా. బక్కోడా అని పిలవండి” అన్నాడు నీరసంగా.
“సరే నీ విషయామేంటో చెప్తావా?”
“మాది ప్రకాశం జిల్లా అయ్యా. దొడ్డ కరువొచ్చిపడింది. పాణంగా పెంచుకున్న ఆవుల్ని చేతులాగా చంపుకోలేక ఇలా తోలుకొచ్చాను. దార్లో అన్నీ అమ్మేశాను. ఈ రెండూ, ఈ దూడా మిగిలాయి. ఎవరేనా కొనుక్కుంటే వీటినీ ఇచ్చేత్తాను. ఇది నా భార్య.”
“సరే. మేమే ఆవుల్నీ, దూడనూ కొంటాం. వాటిని మేపుతూ నువ్వూ ఇక్కడే వుండొచ్చు. నీకూ నీ భార్యకూ రోజూ కాలేజీలో ఏదో ఒక పని వుంటుంది. కూలీ ఇచ్చేస్తాం. మీరు ఉండటానికీ ఆవుల్ని కట్టేయడానికీ ఒక షెడ్డు ఇస్తాం. దాన్ని మధ్యకు పార్టీషన్ చేయిస్తాం. ఆవులకు సరిపోను వుంచి మిగతాది అంతా మీరే వాడుకోవచ్చు. ఇష్టమేనా?”
కాలేజీ బిల్డింగ్ల చుట్టూ అవతల ఖాళీ చోట్ల బోలుడంత పచ్చ మేతకనపడుతూ ఎడారిలో వున్న బక్కోనికీ కుంభ వృష్టిలో తడిచినట్లుగా కనుల పండువగా అన్పించింది. ఉండాటినికి ఇల్లు అన్న మాట అతని భార్యకు బతుకు మీద ఆశ కల్పించింది.
“ఆవులకూ, దూడకూ నన్ను డబ్బులు ఇవ్వనివ్వండి సర్” అంటూ గోకుల్ పదివేలు బక్కోని చేతికిచ్చాడు. అలా ఆవులూ, బక్కని కుటుంబమూ ఆ కాలేజీలో నివాసం ఏర్పరచుకున్నాయి.
బక్కోడూ, అతని భార్యా పగలంతా ఏదో ఒక పని చేస్తూ ఒళ్లు దాచుకోకుండా శ్రమ పడేవారు. వీళ్లుండే రేకుల షెడ్డు నానుకుని పక్కింటి వాళ్ల డాబా వుండేది. వాళ్లింటికీ కాలేజీకి మధ్య నున్న ప్రహారీ గోడ వాళ్లదే. కొన్ని సంవత్సరాల కిందట వాళ్లే ఒక మాదిరి ఎత్తు పెట్టి కట్టుకున్నారు. దాంతో అటు మనుష్యులు ఇటూ, ఇటు మనుష్యులు అటూ కన్పడతారు.
***
సాయంత్రం ఐదయింది. బయట ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో సుందర్రాజమ్మగారు తలుపు తీశారు.
ఇద్దరు భార్యాభర్తలు నిలబడి వున్నారు.
“ఏమ్మా! ఏంకావాలి?”
“టులెట్ బోర్డు చూసి వచ్చామండీ, ఇల్లు చూడచ్చా!”
“ముందు కూర్చోండి. మీరేం చేస్తారు?”
“మీ ఇంటి పక్కనున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగాలు చేస్తున్నాం. రోడ్డు మీదున్న పెట్రోలు బంక్‌లో కనుక్కంటే ఈ ఇంట్లో ఖాళీ వుందని చెప్పారు. చూద్దామని వచ్చాం.”
“ఆ పెట్రోలు బంకు మాదే. మా ఆయనే చూచుకుంటారు.”
“ఇక్కడ ఇల్లు అద్దకు తీసుకుంటే పని మనుషులు దొరుకుతారా? పాలకూ, ఇంట్లో నీళ్లకూ ఇబ్బంది వుండదుకదండీ? ఎల్లాగూ కూరగాయలు, వెచ్చాలు తెచ్చుకోవాలంటే టౌన్లోకి వెళ్లాల్సిందే. కాకపోతే కాలేజీకి బాగా దగ్గర్లో వున్నదని ఆలోచిస్తున్నాం.”
“పని మనుషులూ, పాల పాకట్లు వేసే వాళ్లు బాగానే వస్తున్నారు. మొదట్లో మేమీ బంకు కట్టుకుని, దాని వెనగ్గా ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు రెండు, మూడిళ్లు మాత్రమే వుండేవి. రెండేళ్ల కిందట ఈ కాలేజీ కట్టటం, క్లాసులు జరపటం చేశారు. వాళ్లు ఒక్కొక్క అంతస్తూ పెంచుకుంటూ పోతున్నారు. అది చూసి ఈ చుట్టు పక్కల చాలా ఇళ్లు కడుతున్నారు. ఈ కాలేజీలో చదువుకునే పిల్లలకూ, ఉద్యోగస్తులకూ అద్దెలకివ్వాలని చూస్తున్నారు. కాలేజీ హాస్టల్‍తో పాటు, బయట కూడా హాస్టళ్టు తయారయినయి. మేమూ ఈ మధ్యే డాబా మీద మూడు పోర్షన్లు వేశాం. రెండు పోర్షన్లలో వుంటున్నారు. ఒకటే ఖాళీగా వున్నది.”
“అదే చూస్తామండీ.”
“ఇంతకీ మీ వర్ణం ఏమిటన్నారు?”
“వర్ణమా?” అంటూ వచ్చినావిడ తెల్లబోయింది.
“మన కులం సంగతి అడుగుతున్నారు” అన్నాడుతను.
“అర్థమైందిలే” అని భర్తతో అని “కులందేముంది లెండి” అన్నది ఆమె.
“కాదులే అమ్మాయ్ నాకు బాగా పట్టింపు.”
ఆమె మాట వినగానే అతను లేచి నిలబడి “పద పోదాం” అన్నాడు.
కులమేమిటని అడిగితే అలా మాట్లాడకుండా పోతారేంటి? చెప్పకూడదు కాబోలు. తెలుసుకోకుండా ఎలా ఇస్తాం? ఇల్లు కావాలంటూ చాలామంది వస్తున్నారు. మా వాళ్లెవరో తెలుసుకుని ఇస్తాననుకుంటూ ఆమె లోపలకిపోయింది.
ఆ మర్నాడు కాస్త పెద్దామె ఇల్లు కావాలంటూ వచ్చింది. వచ్చీ రావటంతోనే మేం కూడా మీ వాళ్లమే. ఈ సంగతి బంకులో కుర్రాడు చెప్పాడులే. నేనూ, నా కొడుకూ ఇద్దరమే వుంటాం. మా వాడికిక్కడ ఉద్యోగం. ఇల్లు నన్నే చూసుకోమన్నాడు. చూపిస్తారా? నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేసిపోతాను” అన్నది.
“పైన మూడు పోర్షన్ల వాళ్లు, కింద మాతో కలిపి తలా మూణ్ణెళ్లు వాకిట్లో రోడ్చు చిమ్మ నీళ్లు చల్లి సున్నంతోనే ముగ్గు పెట్టాలి. మావారు బంక్ కెళ్లేలోపు వాకిట్లో ముగ్గు కర్రలుగీంచాలి. ఇక్కడున్న పూల మొక్కలకున్న పూలు ఎవరు పడితే వాళ్లు కొయ్యకూడదు. కోసిస్తేనే తీసుకోవాలి. గోడలకు మేకులు కొట్టడం, గీతలు గియ్యటం ఎలాంటివి చేయికూడదు. నీళ్ళు దుబారా చ్యయకూడదు. రాత్రి పదింటి కల్లా గేటు తాళం పడిపోవాలి.”
వీటన్నిటికీ ఒప్పుకుని అలా సరోజమ్మా ఆమె కొడుకూ ఆ ఇంట్లో చేరారు. మిగాతా రెండు పోర్షన్లు ఒకామెకు ఉద్యోగం. మరొకామెకు పిల్లల స్కూళ్లు. వాళ్ల పనులతోనే సరిపోతుంది. సరోజమ్మ మాత్రం పని కాగానే కిందకు దిగి వచ్చేది. సుందర్రాజమ్మగారి దగ్గర చేరి కబుర్లు చెప్పేది.
***
కాలేజీ వైపునున్న గోడ దగ్గర నిలబడ్డారు సుందర్రాజమ్మ గారు.
“ఏయ్ అబ్బాయ్! ఇలా రా ఓ సారి ఇటు ఇటు ఈ గోడ దగ్గరికి రా.”
“ఏంటమ్మా?”
“ఈ ఇంట్లో వుండేది మేమే. నీతో కాస్త పనుండి పిల్చాను. వచ్చిన కొత్తలో కాబోలు ఈ ఆవులూ, దూడా కలిసి అరున్నొక్కరాగం తీసేవి. బాధనిపించేది. మాకు నిద్ర వుండేది కాదు. అలాగే పేడ వాసన, రొచ్చు వాసనా వచ్చేది. ఇప్పుడు అలవాటు పడ్డాం.”
“పేడా, రొచ్చు అంతా ఎప్పటికప్పుడు తీసేస్తా వుండే. కొత్త చేసి మా ఆవులు మొదట్లో అలా అంబా అనేవి. ఇప్పుడదేం లేదు లెండమ్మా. కమ్మగా మేత మేసి పడుకుంటున్నాయి.”
“నీ పేరేంటి?”
“నన్నందరూ బక్కోడానే అంటారు.”
“నిజంగా అలాగే బక్కగా వున్నావు. మరేం లేదు. రెండు పల్లిక అవు పేడ తెచ్చి మా మొక్కలకు వేస్తావూ? డబ్బులిస్తానులే.”
“మాగిన పశువుల ఎరువే వుందమ్మా. కానీ, మా సార్‌కి ఒక్క మాట చెప్పి ఆయన సరే నంటే తెస్తా.”
“సార్ ఇయ్యమన్నారంటు” ఆ సాయంత్రం రెండు చిన్నగోతాలు ఒక దాని మీద ఒకటి నెత్తికెత్తుకుని తెచ్చాడు. చక చకా మొక్కలకు పాదులు చేసి తను తెచ్చిన ఎరువు వేశాడు. డబ్బులిస్తే తీసుకోవటానికి మఖమాటపడ్డాడు. ఫర్వాలేదంటూ ఆమె అతని దోసిట్లో డబ్బులు ఎత్తి వేసింది.
ఆ తర్వాత మిగలిపోయిన తోటకూరకాడలు, మాగిపోయిన అరటి పళ్లు గోడ మీదకుండా ఆవుల ముందు విసిరేసేది.
“ఏయ్ బక్కోడా మీ ఆవిడను పిలుస్తావా?”
“ఏంటమ్మా?” అంటూ వచ్చంది.
“చూడమ్మాయ్ ఈ రోజు మా పనిమనిషి రాలేదు. నాకేమో నడుం పట్టేసింది. వచ్చి కాస్త సాయం చేస్తావా?”
“వెళ్లి రాపోయె. చెట్లకి కలుపు నేను తీస్తా వుంటాను. వెళ్లి గమ్మునొచ్చేసేయ్” అంటూ బక్కోడు తన భార్యను పంపించాడు.
నడుచుకుంటూ చుట్టూ తిరిగి వచ్చిన ఆమె ఇక్కడికి రాగానే పంపు దగ్గర కాళ్లు చేతులూ కడుకున్నది.
“అంటు గిన్నలు వెనకవైపునున్నాయి” అని చెప్పగానే సుందర్రాజమ్మగారితో పాటు ఆమె కూడా హాల్లోకుండా లోపలకు రాబోయింది.
“ఆగాగు హాల్లో నుంచి రావద్దు. ఇటు పక్కన వాకలి వున్నది. అది తీసుకుని వెనక వైపుకు వచ్చేసెయ్” అంటూ ఇంటి గోడ పక్కగా గ్రిల్ పెట్టి అమర్చిన చిన్న ద్వారం చూపించింది.
“ఏంటీవిడ ఇట్టా మాట్టాడుద్ది” అనుకుంటూ లోపలికెళ్లింది. ఒక ప్లాస్టిక్ తట్టిగిన్ననిండా ఎంగిలి గిన్నలు పేర్చి తాను గడప లోపల నిలబడి “అందుకో అమ్మాయ్” అంటూ అందించింది.
“నడుం పట్టిందన్నారు నేనే తీసుకునే దాన్నికదండీ.”
“నువ్వు లోపలకి రానక్కర్లేదులే. కడిగి మళ్లీ ఇలాగే నాకందిచు. లోపల వీటి మీద నేనొకసారి నీళ్లు చల్లి తొలుపుకుని వాడుకుంటాను.”
గిన్నెలు కడిగి ఆవిడ చెప్పినట్లే అందించింది.
“ఇడ్లీ వుంది తిను” అంటూ ఒక పేపర్ ప్లేట్లో ఇడ్లీ వుంచి తెచ్చి నేల మీద వుంచింది.
అలా నేల మీద వుంచటం అస్సలు నచ్చలేదు. “వద్దమ్మా. నేను పొద్దున్నే తినేశాను. తీసుకెళ్లను కూడా తీసెయ్యండి” అంది.
“ఈ డబ్బులు తీసుకో” అంటూ చేతిలో ఎత్తి పడేసింది.
“నేనింకెప్పుడూ ఆయింటికిపోనయ్యా. ఆవిడ నన్ను మడిసల్లే సూడలేదు. దూరం దూరం పెట్టింది. లోపలికీ అడుగు పెట్టనివ్వలేదు. మన కాలేజీ సారుగాని, ఇక్కడింకెవరూగాని ఇలా సెయరు. ఈ యమ్మదే అంతా విపరీతం ఇడ్డూరం” అంటూ భర్త దగ్గర చిరాకు పడింది.
“పోన్లే పెద్దామె అడిగిందని పొమ్మన్నాను ఆవిడ పాపం ఆవిడదే.”
“ఓయ్! బక్కోడా! ఇలా గోడ దగ్గరకురా. మరేం లేదు. మా ఇంటాయనగారు ఆయిర్వేద మందు తింటున్నారు. దాని కనుపానంగా 40 రోజుల పాటు నాటు ఆవు పాలు తాగాలన్నారు. ఒక అరలీటరు పాలు రోజూ ఇస్తావా ఊరికేనే వద్దు డబ్బిస్తాను.”
“మాసారు గారినడగాలమ్మా . ఆవులు నాయి కాదుగా. అసలు మేం ఆవుల పాలు పిండం. దూడే తాగతుంది. నాకైతే పాలు పిండటం చేతకాదు. మా యాడది చెయ్యాల్సిందే. దాన్ని అడగాలి.”
“కాస్త పిండివ్వమని చెప్పు నాయినా. నాటు ఆవుపాలు బయట దొరకటం చాలా కష్టం. ఏదో సమయానికి మీ దగ్గరున్నది. కాస్త సాయం చేయిండి.”
“మన ఆవు పాలు పిండిపొయ్యాలా ఈమెగారికి? అవి అంటుకాదేంటి? ఒక్కోసారి పేడ వాసనంటది. ఒక్కసారి రొచ్చు వాసనంటది. ఈమె బయటకి పెట్రలు టాంకు వచ్చిన అది దింపుకునేట్టుపు ఎంత కంపు వచ్చుద్ది! తన కేదైనా పనొస్తే చాలు. నాలుగు మావిడాకులు నాయినా అంటుంది. పూజలొస్తే చాలు కాసిని పూలు కోసివ్వు. పులకంటు వుండదులే అని మాయమాటలు చెప్పుద్ది. ఆబిడ ఏదైనా అడగటం ఆలీసం సేసేద్దామంటావు. ఆబిడేమన్నా మనకు జీతమిచ్చి పోషిస్తుందా? నీకేందుకయ్యా ఆబిడ ఊసు.”
“పోనీలేవే. వయసులో పెద్దాబిడ. మనకు సేతనైంది సేద్దాం.” అంటూ పెళ్లానికే నచ్చిజెప్పి పాలు తీయించి ఇచ్చాడు. ఆ పాలు తీసేటప్పుడు అటు ఆవునూ ఇటు దూడనూ మచ్చిక చేసుకుంటూ వాటి గంగడోలు సవరిస్తూ వాటిని బుజ్జగించి మరీ పాలు తీయ్యాల్సి వచ్చింది. తన దూడకు పాలు లేవేమోనని ఆవు అదురదాపడుతుంది. దూడేమో క్టటు తెంచుకుని పోయి పాలు తాగాలని చూత్తంది అనుకున్నాడు.
***
ఆ రోజు రాత్రి 12 గంటల ప్రాంతం. ఆవులకు మరోసారి ఎండుగడ్డి వేద్దామని బక్కోడు గడ్డి తీసుకుని వచ్చాడు. అప్పటి దాకా నెమరేస్తూ పడుకున్న ఆవు లేచి నుంచుని అరవసాగింది. తన ముందు వేసిన గడ్డిని కూడా చూడకుండా ఆవు మళ్లీ అరిచింది. ‘ఏందిలా పొద్దుపోయినాక అరుపులు మొదలెట్టింది’ అనుకుంటూ పెద్ద లైటు వేసి చూశాడు. ఏమైనా పురుగూ, పుట్రా వచ్చాయా అని ఆవు దగ్గరున్న గడ్డినంతా విదిలించి చూశాడు. ఏం కన్పడలేదు. ఒక వేళ ఆవుగాని ఎదకొచ్చిందా అలా అయితే రేపు పశువుల ఆస్పత్రికి తోలుకెళ్లి డాట్టరుగారి చేత సూడిదవటానికి ఇంజీషను చేపిచ్చుకురావాలి అనుకుంటూ దాని తోకెత్తి చూసాడు. ఎదకొచ్చిన లక్షణాలు ఏం కన్పడలేదు. ఇంతలో పక్కింటి డాబా ఇంటిలో నుంచి కీచుమన్న శబ్దం వినపడింది. జాగ్రత్తగా ఆలకించాడు. ‘సరోజమ్మగారు’ అన్నకేక బలహీనంగా వినబడింది. ‘ప్రసాదూ’ అంటూ మరోసారి వినపడింది. ఆ తర్వాత ఏదో ఖాళీ డబ్బా గోడకేసి కొట్టి శబ్దం చేసినట్లు అర్ధమయింది. ఎవరో నెట్టుకుంటూన్న శబ్దం తలుపు గడియి లాగబోయిన శబ్దం, మరలా తలుపు గడియి వేసిన శబ్దము ఒకదాని తర్వాత ఒకటి వినపడ్డాయి. ఆ యింట్లో ఏదో జరుగుతుందనిపించింది. గోడ దూకి వెళ్లి చూస్తే లోపల ఏ అలజడి లేకపోతే తనే ఏ దొంగతనం చేయిటానికో గోడ దూకానంటారని ఆలోచించి పరుగెత్తుకుంటూ కాలేజీ గేటు రోడ్డు దాటి డాబా ఇంటికొచ్చాడు. వీధీ తలుపు తీసే వున్నది. వరండాలో కొచ్చి చూశాడు. లోపల ఏదో గలాబాగానే వున్నది. వదులు వదులు అన్న మాటలు కూడా బలహీనంగా వినపడుతుంది. అతను గబగబా మట్లేక్కి పై పోర్షన్ల తలుపు తట్టాడు. తన వాటా తలుపు తీసుకుని ప్రసాద్ అనే అతను తలుపుతీశాడు. సరోజనమ్మ వచ్చింది. ఉద్యగస్తుల కుటుంబం అసలు తలుపే తీయలేదు. అతను విషయమంతా వాళ్లకు చెప్పాడు.
“ఇది వరకిక్కడ కాలేజీ కట్టకముందు దొంగతనాలు జరిగేవంట. దొంగలు బంకులోకీ వీళ్లంట్లోకీ వచ్చారంట. మరలా ఇప్పుడు కూడా ఎవరన్నా దంగలొచ్చారేమో?” అన్నది సరోజనమ్మ.
“ఎంత మందొచ్చారో ఏంటో వాళ్లు కిందికి వచ్చి ఆ తర్వాత పైకీ వస్తారేమో నేను పోలీసులకు ఫోను చేస్తాను” అంటూ ప్రసాద్ లోపలికెళ్లి తలుపేసుకున్నాడు.
సరోజనమ్మ లోపలికెళ్లి తలుపేసుకున్నది. చేసేదేంలేక బక్కోడు పరుగు లాంటి నడకతో మెట్లు దిగి వచ్చి గోడ దగ్గర కొచ్చి పెళ్లాన్ని కేకేశాడు.
మగుడు ఇంకా ఆవుల దగ్గర నుంచి రాలేదేమిటని అతని పెళ్లాం అలంకుగా వుండి త్వరగానే గోడ దగ్గరికొచ్చింది.
“తొందరగా ఎల్లి హాస్టల్ మగపిల్లల్ని లేపుకురా అరిజంట్” అన్నాడు.
నలుగురైదుగురు మగ పిల్లలు గోడ దూకి వెంటనే వచ్చారు. అందరూ కలిసి తలుపు తట్టారు.
లోపలి నుంచి తలుపులు తెరుచుకున్నాయి. బక్కోడు బయిటే నిలబడిపోయాడు. పిల్లలు లోపలికెళ్లి చూశారు. ఇల్లంతా చిందర వందరగా వున్నది. ఇనుప బీరువా, ఇనప్పెట్టి పై తలుపు మాత్రం తీసున్నది. పెట్రోలు బంకు యజిమాని పొట్టలో నుంచి రక్తం కారుతున్నది. ఇటు చూస్తే సుందర్రాజమ్మగారి నుదుటిన నిమ్మకాయంత బొప్పి, పై పెదవి చిట్లి రక్తం కనపడుతున్నది. మనిషి గజ గజ వణుకుతూ, స్పృహ లేనట్టుగా అయిపోతున్నది. పిల్లలు ముందు కెళ్లి ఫాన్ స్పీడు పెంచి ఆమెను పడుకోబెట్టారు.
“ముందు హస్పిటల్కు తీసుకెడదాం. రక్తం ఎక్కువ పోతే ప్రమాదం” అన్నడొక అబ్బాయి. “ఎలా వెళ్దాం” అని మరొకతనుఅన్నడు.
“కారుందయ్యా, కాస్త మీరు తోడు రండి. నేనే డ్రైవ్ చేస్తాను” అనన్నాడు ఇంటి యజమాని.
“ఈ స్థితిలో గాయంతో మీరెలా డ్రైవ్ చేస్తారంకుల్? మా నైట్ వాచ్‌మన్‌కి డ్రైవింగ్ వచ్చు. బక్కా వెళ్లి పిల్చుకురా” అని కేకేశారు.
అతను పరుగు పరుగున వెళ్లాడు. “నువ్వొచ్చే దాకా కాపలా పని నేనే చేస్తాను, నువ్వా బాబుని తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్లు అంటూ వాచ్‌మన్‌ను పంపించాడు.
అందరూ కలిసి ఇద్దర్ని కారులో కూర్చబెట్టారు. హెల్ప్ హాస్పిటల్లో అయితే నైట్ కూడా డాక్టర్లుంటారని వాచ్‌మన్ చెప్పి అక్కడికే తీసుకెళ్లాడు.
పది రోజుల తర్వాత సుందర్రాజమ్మా, ఆమె భర్తా ఇంటికొచ్చారు. హాస్పిటల్లో చేరగానే కబురు తేలుసుకుని కొడుకూ, కూతురూ వచ్చారు. ఇంట్లో అద్దెకున్న వాళ్లు వచ్చి పరామర్శించి వెళ్లారు.
“పోలీసులొచ్చి ఇల్లంతా పరిశీలించి కేసు రాసుకెళ్లారు. సి.సి కెమేరాలు పెట్టించటం అవసరమని గెట్టిగా చెప్పి వెళ్లారు” అన్నడు ప్రసాద్ సుందర్రాజమ్మతో.
“అంతే కాదు కాలేజీ హాస్టల్ కెళ్లి పిల్లల్ని బక్కోడినీ కూడా ప్రశ్నలేశారంట” అంది సరోజనమ్మ.
“సాటి వాళ్లన్న మోజుతో ఇల్లిస్తే నాకు బాగా గడ్డి పెట్టారులే” అని మనసులో అనుకని పైకి మాత్రం
“ఇక్కడికీ వచ్చారు, మాతోనూ మాట్లాడారు. దొంగల్ని గుర్తుపట్టగలరా?” అని కూడా అన్నారు అని చెప్పారు సుందర్రాజమ్మగారు పొడి పొడిగా.
“ఎవరో తెలిసిన వాళ్ల పనే అయివుంటుందనుకుంటున్నాను. ఆ రాత్రి చాలా సమయం గడుస్తున్నా వాళ్లు ఎక్కడా తొందరపడకుండా నింపాదిగా వున్నారు” అన్నాడు ఆమె భర్త.
***
బక్కోడికి చెప్తే ఆ నాటి రాత్రి తమింటికి వచ్చిన హస్టల్ పిల్లల్నీ, వాచ్‌మన్‌నూ అందర్నీ డాబా ఇంటికి తీసుకొచ్చాడు.
“మీకు ఎలా తెలిసిందయ్యా? సమయానికి దేముడు పంపినట్లే వచ్చారు. మీరే మాపాలిట దేముళ్లయ్యారు. ఇంకాస్త ఆలస్యమైతే ఆ దొంగలు ఇంకే హింసించే వాళ్ళో.”
“మాకేం వినపడలేదు మామ్మగారూ! బక్కోని భార్య వచ్చి లేపితే లేచొచ్చాం. ఇదంతా బక్కోని వల్లే జరిగింది. వాడే ధైర్యం చేశాడు. డాబా పైకెళ్లి మీ ఇంట్లో అద్దెకున్న వాళ్లను రమ్మని పిలిస్తే వాళ్లు భయపడి రాలేదు. మాకు కబురు పంపటమే కాకుండా వాచ్‌మన్‌ను తీసుకొచ్చాడు” అన్నారు వాళ్లు.
“అతనే రాకపోతే మాకింకా చాలా అన్యాయం జరిగేది. వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడే బాగా అనుభవం కలిగినవాడు. వాడి దగ్గరే కత్తి వుంది. రెండో వాడు మమ్మల్ని కాపలా కాస్తుంటే వాడు తాళం చెవులు ఇనప్పెట్ట తెరవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఇనుబ్బీరువాయే కదా, తెరుద్దామని వాడు రకరకాల తాళపు చెవులు తెచ్చుకున్నాడు. కాని ఇక్కడ పాతకాలంనాటి ఇనప్పెట్ట తెరవాల్సి వచ్చేసరికి వాడికర్థం కాలేదు. ఏ మీటలు నొక్కితే తెరుచుకుంటుందో వాడి బుర్రకు తట్టక అటూ ఇటూ తిప్పి చూశాడు. నువ్వు తెరువు లేకపోతే ఇంకా పొడుస్తానని నన్ను బెదిరించాడు. అడ్డం వచ్చిన ఈమెను గట్టిగా తోసేశారు. భయంతో మీ అమ్మగారు పెద్దగా అరవలేకపోయింది గాని ఏదో స్టీలు డబ్బా తీసుకుని గోడక్కొట్టి పెద్దగా శబ్దం చేయాలని ప్రయత్నించింది.”
“అసలప్పుడు అమ్మగారు కీచుగా అరవటమే నాకు ఇనపడిందయ్యా” అన్నడు బక్కోడు.
“ఆ రాత్రి నేను పొద్దుపోయి ఇంటికొచ్చాను. గేటు తాళం వెయ్యలేదు. ఇంట్లో కెళ్లినవాణ్ణి మరలా బయటి పోర్టికోలోకొచ్చి వంగి స్కూటర్ బాక్సులోని మందులూ, ఫ్రూట్సూ తీస్తున్నాను. వీధి లైట్ వెలగలేదు. ఆ చీకట్ల వాళ్లెప్పుడు లోపలకొచ్చారో తీసి వున్న ఇంటి తలుపులు నుంచి వాళ్లు లోపలికెళ్లారో నేను గమనించకోలేదు. మీ అమ్మాగారేమో ఇంటి తలుపు తీసి మళ్లీ వెళ్లి పడుకున్నది. వీళ్లేమో నేను లోపలికి రాగానే తలుపుగడియ పెట్టేశారు. ఇదంతా నేనసలు ఊహించలేదు. అలికిడికి ఆమే లేచి వచ్చింది. ఇందంతా బక్కోడు గమనించటమూ, మీరంతా వచ్చిన చప్పుడుకు దొంగలు వెనక తలుపులు తీసుకుని పారిపోయారు. బక్కోని చలవతో మీ సాయంతో మా వాచ్‌మన్ కూడా తోడ్పడటంతో మేం ప్రాణాలతోనూ, మా సొమ్ము భద్రంగానూ మిగిలాం. మీ అందరకూ చాలా ఋణపడిపోయాం. మా పిల్లలూ అదే అన్నారు.
“ఫర్వాలేదంకుల్. మేం చేసినది ఏముంది? అంతా మా బక్కోని పుణ్యమే. వాచ్‌మనూ అదే మాటన్నాడు. పేరుకే మావాడు బక్కోడు గాని ధైర్యం చూపటంలో, సాయం చెయ్యటంలో చాలా బలిష్ఠుడు.”
బక్కోడు సిగ్గు పడి తల వంచుక్కూర్చున్నాడు. ఆ రాత్రి అందరూ అక్కడే భోజనాలు చేశారు. “ఆవు పాలు నువ్వే తచ్చావా? బక్కా! లోపలికిరా. ఇంకెప్పుడూ గడప బయిటే నిలబడకు. ఇప్పటికే నాకు చాలా చిన్నతనంగా వున్నది. అయిన వాళ్లు, సాటి కులపోళ్లు అయితేనే ఉద్ధరిస్తారు. మంచికైనా, చెడుకైనా మన వాళ్లే కావాలి గాని, మిగతా వాళ్లతో జోక్యం అనవసరం, అనుకుంటూ నా కులం, నా కులం అని పాకులాడుతూ కళ్లు మూసుకుపోయి బతికాను” అంటూ బక్కోని చేతిలోని పాలసీసాను తన చేతులోకి తీసుకుని “ఇలా కూర్చు టిఫిన్ తింటేకాని పోనివ్వను” అన్నది.
సుందర్రాజమ్మగారి ఇంటి ముందు కొత్త స్కూటర్ పెట్టి వున్నది. “ఎంతైంది రంగూ బండీ బాగుంది” అన్నది ఆమె.
“డెబ్భైవేలు. గోడ దగ్గరకెళ్లి వాళ్లిద్దర్నీ పిలువు” అన్నాడు ఆమె భర్త,
ఇద్దరూ వచ్చారు “బక్కోడని పిలవటం బాగుండలేదు. గోపయ్య అని పిలుస్తాను. మా నాన్న పేరు గోపాలరావు. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. పైగా నువు గోవుల్ని మేపే వాడివి అందుకని నిజంగా గోపయ్యేవే. ఈ స్కూటర్ నీదే. మా బంక్లో కుర్రాడు నీకు నేర్పిస్తాడు. నేర్చుకో. నువ్వెప్పుడు ఎంత పెట్రోలు కావాలంటే అంత పోయించుకో. ఇక ఎప్పటికీ అంతే. ఇంకా ఏ సాయంకావలన్నా అడుగు.”
“అయ్యగారి మాటలు విన్నావుగా. జాగ్రత్తగా బండి తోలుకో” అన్నారు సుందర్రాజమ్మగారు.
“ఏం అమ్మాయ్! నువు కాసేపు వుంటావా? వంటిట్లో పని వుంది నాకు సాయం చెయ్యాలి.”
“నేనా వంట ఇంట్లోనా?”
“ఆ నువ్వే పద” అంటూ చేయిపట్టుకుని లోపలికి తీసుకెళ్లింది.
ఆ తరువాత కాలంలో అద్దెకుదిగే వాళ్లను కాని, మరెవర్నీ కాని మీరే వర్ణం అని అనటం చేయిలేదు. ‘కులపోళ్లు, కులపోళ్లు అనుకుంటూ ఎంత నెత్తిన పెట్టుకున్నాను. తోటి వాళ్లు ఆపదలో వున్నారని తెలిసీ నక్కి చూడని వాళ్లు, నా వాళ్లే అనుకుంటే సిగ్గు చేటు అంటూ చంపలేసుకున్నది. రేపటి రోజుల్లో నా మనవడు కాని, నా మనవరాలు కాని ఎవర్ని చేసుకుంటానన్నా నా కిష్టమే అని చెప్తాన’నుకున్నది.