[box type=’note’ fontsize=’16’] ప్రపంచం ఎదుర్కుంటున ముఖ్య సమస్యలలో ఒకటైన త్రాగునీటి సమస్య గురించి వివరిస్తూ… మనవంతుగా మనమేం చేయాలో చెబుతున్నారు గూడూరు గోపాలకృష్ణమూర్తి “దాహం బాబయ్యా దాహం” కథలో. [/box]
ఎండలు… ఎండలు… ఎండలు. విపరీతమైన ఎండలు. భయంకరమైన ఎండలు. అగ్ని కురిపిస్తున్న ఎండలు. ఇంటి బయట వేడి సెగలు, వడగాడ్పులు. ఇంటి లోపల చిటపటలాడ్తూ చెమటలు కక్కుతున్న శరీరాలు. ఇదే వేసవి కాలం.
ఉదయం పది గంటలకే నిర్మానుష్యంగా తయారయిన రోడ్లు, పిట్ట సంచారం లేని పరిసరాలు. నిశ్శబ్ద వాతావరణం. పది గంటలేంటి ఉదయం ఆరు గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తూ ఉంటే. ప్రకృతి వికృతిగా మారింది. లేకపోతే ఈ విపరీత పరిణామేంటి వాతావరణంలో.
అంతెందుకు? వసంత ఋతువు రాకుండానే ఆహ్లాదాన్ని ఆస్వాదించవల్సిన ఈ మాఘ మాసపు తొలినాళ్ళలోనే ఏంటి ఈ విపరీతమైన మార్పు అని అనుకుంటాను.
ఒకప్పుడు ఈ వసంత ఋతువు ఎలా ఉండేది? క్రొత్త సంవత్సర ఆగమనం తెలుగు వాళ్ళ క్రొత్త పండగ. ఉగాదికి స్వాగతం పలుకుతూ నునువెచ్చని బాల భానుని నునులేత కిరణాల మాటున సిగ్గుల మధ్య తడిసి ముద్దవుతున్న నవవధువు మాదిరి వయ్యారపు నడకలతో ప్రకృతి సుందరి దర్శనం ఆహ్లాదకరంగా ఉండేది. మరి ఇప్పుడో? ప్రకృతిలో ఎంత మార్పు.
ఈ మార్పు ఒక్క ప్రకృతిలోనే కాదు. కాలంలో మార్పు. మనిషి మనుగడలో మార్పు. మనిషి మానసిక స్థితిలో మార్పు. ఇప్పుడు కొమ్మకొమ్మకు సుమధుర పరిమళాల, సువాసనల గుబాళింపుతో, గుబురు మామిడి చిగుళ్ళు భక్షిస్తూ వేకువ జామున వసంత కోకిల చేసిన గానం దాని కుహు కుహూలు వినిపించటం లేదు. వినిపించినా అతి తక్కువ.
అంతే కాదు వేపపూల పరిమళం, మామిడి పిందెల అందం. మధురాను భూతిని కలిగించే వసంత శోభలు, ఇవేవీ ఇప్పుడు కానరావటం లేదు. దానికి కారణం మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, చెట్లని నరికేస్తున్నాడు.
వాతావరణాన్ని చల్లబరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సమశీతోష్ణ స్థితిని ఇచ్చే చెట్లని నరికి వేయడం వల్ల వర్షాలు పడటం లేదు. అడవులు, తోటలు, వనాలలో వృక్షాలు నరికి వేయబడ్తూ అపార్టుమెంట్ల సంసృతి పెరుగుతున్న ఈ కాలంలో ఇలా మారిందంటే అది మనిషి తప్పిదమే అని అనుకుంటాను.
అంతేకాదు వాతావరణంలో సమతుల్యత దెబ్బతింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి జీవన మనుగడ సాగాలంటే గాలి, ఆహారం కావాలి. ఆహారం లేకపోయినా పరవాలేదు కాని, నీరు లేకపోతే మనిషి మనుగడే కష్టం.
కరువు వచ్చిపడింది నాటికి. ఎండలకి ఎండి పోతున్న బావులు, ఎడారిలా మారుతున్న జలాన్ని అందించే నదులు, జలాశయాలు. వాటి వల్ల నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. ఎండల తీవ్రత పెరగడం వలన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. బోరు బావులు ఎండిపోతున్నాయి.
జనాలు మంచి నీటి కోసం కటకట లాడ్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో నగర పాలక సంస్థ ద్వారా రెండు రోజులకో పర్యాయం నీటి సరఫరా జరుగుతోంది. ఇదీ చెప్పుకోదగ్గ విషయమే.
“దాహం బాబయ్యా దాహం! కాసింత దప్పిక తీర్చుకోడానికి నీల్లు ఇప్పించి పున్నెం కట్టుకోండయ్యా” ఒయట నుండి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో బిక్షగాడుయి ఉంటాడు అని అనుకున్నాను.
“వెళ్ళవయ్యా వెళ్ళు. మాకే నీళ్ళు త్రాగడానికి లేక చస్తున్నాం” ప్రక్కింటి మీనాక్షి ఆ బిక్షగాడ్ని గదమాయిస్తూ అంది. బయటకు వచ్చి చూశాను. ఆ బిక్షగాడి దీన స్థితి నన్ను కలిచివేసింది. ఏమాత్రం త్రాగడానికి నీళ్ళు ఈయకపోతే అక్కడే ప్రాణాలు విడిచి పెట్టే స్థితిలో ఉన్నాడు.
ఇంటిలోకి వెళ్ళి చెంబుడు నీళ్ళు తీసుకువచ్చి ఆ బిక్షగాడికి ఇచ్చాను. అతను మహా సంబర పడిపోయాడు. కృతజ్ఞతా పూర్వకంగా నా వేపు ఓ మారు చూశాడు. “బాబయ్యా! ఆ భగవంతుడు మిమ్మల్ని సల్లగా సూడాలి. నా పేనాలు కాపాడారు” అంటూ నన్ను తెగ పొగడ్డం ఆరంబించాడు. నేను త్రాగడానికి నీళ్ళు ఈయడం గొప్ప కాదు. అయితే ఆ సమయంలో ఆ గుక్కెడు నీళ్ళు అతనికి అమృతం త్రాగినంత సంతృప్తిని నిచ్చాయి. అయితే ఆ సమయంలో నాకు కావల్సింది ఆ పొగడ్తలు కావు. నీటి కొరత తీరడానికొక మార్గం.
నాలో అనేక ఆలోచనలు. ‘ఈ త్రాగు నీటి కొరతకి కారణం ఏంటి? ఈ త్రాగు నీరు దొరకకపోతే ప్రజల స్థితిగతులేంటి?’ అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే ప్రకృతిలో లభించే నీరు, ఇసుక వ్యాపార వస్తువులుగా మారిపోయాయి.
“ఆ బిక్షగాడు పొగిడితే పొంగిపోయారేమో కాని, త్రాగే నీటి కోసం ఎంత కష్టపడి పంపు దగ్గర నుండి తెస్తున్నానో మీకు తెలుసా? ఎంత హైరానా పడ్తున్నానో మీకు తెలుసా?” అని శ్రీమతి నిలదీస్తూ మాట్లాడుతూ ఉంటే ఏం జవాబు చెప్పలేక నీళ్ళు నముత్తున్నాను. ఎందుకంటే త్రాగే నీళ్ళ కేసం శ్రీమతి పడ్తున్న తాపత్రయం, హైరానా నాకు తెలుసు.
నేడు అందరికీ సరిపడా ఆహారం ఎలాగూ లబించడం లేదు. ‘కనీసం త్రాగడానికేనా నీరు దొరికినా చాలు’ అని ఆశతో ఎదురు చూస్తున్న మనుష్యులే కాదు వన్యప్రాణులు; నీళ్ళు ఎలాగూ లేవు తలదాచుకోడానికిక నీడ లేదు అని ఎదురు చూస్తున్న పశుపక్షాదులు; మోడుబారిన వృక్షాలు, గూడు లేక రోడ్డున పడ్డ కొంతమందిని చూస్తుంటే ఎంతో బాధకలుగుతుంది. మనస్తాపం కూడా కలుగుతుంది.
అలాంటి వాళ్లు ఒక వైపు, వడగాడ్పులు మరో వైపు. ఉక్కపోత, చెమటతో శరీరం చిటపట. దానికి తోడు మీద వేడి క్రిందన వేడి. పోనీ ఇలాంటి వాళ్ళు గొంతు తడుపుకొని ప్రాణాలు నిలబెట్టుకుందామంటే అదీ ఎండమావే.
బిందెడు నీళ్ళు కోసం ఆడవాళ్ళు ఎన్నోమైళ్ళు నడిచి వెళ్తేకాని నీళ్ళు లభించని పరిస్థితి గ్రామాల్లో. మరి పట్నాలలో ఆ గ్రామాలకన్నా అధ్వాన్నం. భూమ్మీద మనిషికి కావల్సిన సంపదలో నీరు కూడా ఒక సంపదే. దానికే సమస్య వచ్చిపడింది. ఈ సమస్య తీరాలంటే మనిషి కృషి కూడా అవసరమని అనుకుంటాను నేను.
ఎదురుగా ఓ దృశ్యం. ఓ కాకి బకెట్‌లో ఉన్న నీళ్ళను త్రాగుతోంది. కుళ్ళు కాలువలో ఉన్న నీటిని కుక్క కతుకుతోంది. ఒక్క మనిషికే కాదు జంతువులకి కూడా నీరంటే ఎంత ఆశ? నిజమే వాటిది కూడా ప్రాణమే కదా?
చెట్లని నరికి వేయడం ప్రకృతిని వికృతినిగా మార్చిన మనిషి పాశవిక చర్య వల్ల ప్రకృతి ఏనాడో విధ్వంసానికి గురైంది. దాని ఫలితమే ప్రకృతి వికృతిగా మారడం.
ఈ ఎండల్ని ఆపలేము. కరువు కాటకాల్ని ఆపలేకపోతున్నాం. ప్రకృతిలో జరిగిన మార్పుల్ని మనం ఆపలేము. అయితే ప్రకృతి మనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసే కంటే ప్రకృతి నియమాల కనుగుణంగా మనల్ని మనం మార్చలేము అని నా ఆలోచన.
నీటి ఎద్దడిని నివారించాలన్న ఈ సమస్య అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే అప్పటి కన్నా ఇప్పుడు ఎక్కువ. అప్పుడు కూడా త్రాగు నీటి కోసం పంపుల దగ్గర కొట్లాటలు జరిగేవి. బలమున్న వాడిదే రాజ్యం అన్న తంతులా ఉండేది. బలమున్నవాడు తమ ఇంటి అవసరాలకి చాలినంత నీరు సంపాదిస్తే కాని పక్కవాళ్ళకి నీరు అందనిచ్చేవారు కాదు. తమకి నీరు ఎంత అవసరమే, ఎదుటి వాళ్ళకి అంతే అవసరం అన్న విషయం విస్మరించేవారు. నుయ్యి ఉన్నా అన్ని అవసరాలకీ కుళాయి నీరే వాడేవారు ఉన్నారు. అందుకే కుళాయి దగ్గర అంత రభస, కొట్టుకోడాలు, తిట్టుకోడాలు.
మరి కొంత మంది కుళాయికి మోటారు బిగించి అక్రమ పద్దతిలో త్రాగే నీరు అమ్ముకుని అక్రమంగా సంపాదిస్తున్నారు. అందుకే త్రాగే నీటికి కొరత ఏర్పడి త్రాగడానికి నీటిని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అయితే నేను అనుకుంటూ ఉంటాను ‘ఈ నీటి సమస్య తీర్చడానికి మార్గం లేదా’ అని.
అయితే మార్గం ఉంటుంది. ఒక్కక్క ఇంటి మీద పడిన వర్షపు నీరు వృథాగా మురికి కాలువల్లోకి పోకుండా భూమిలోకి వెళ్ళేలా చూడాలి. అలా జరిగితే భూర్భజలాలు పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం ప్రతీ ఇంటిలో ఇంకుడు గోతులు ఉండాలని అంటుంది. అయితే ప్రతీ ఇంటి దగ్గరా ఈ రోజుల్లో మట్టినేల లేదు. సిమెంటు, కాంక్రీటు నేలలే అగుపడ్తాయి. అందుకే వర్షపు నీరు వృథాగా మురికి కాలువల్లోకి పోతుంది. భూగర్భజలాలు ఇంకిపోయి నీటి సమస్య ఏర్పడుతోంది అని నా భావన.
మరో విషయం మనలో కొంత మందికి వర్షపు నీరంటే చిన్న చూపు. మినరల్ వాటర్ పేరుతో బాటిళ్ళతో అమ్మే నీటికన్నా వర్షపు నీరు స్వచ్ఛమైనది. రుచికరమయినది. అలాంటి నీటిని మురికి కాలువల పాల్జేయడం చేస్తూ మనకి నీటి విలువ తెలియదు అని నాకనిపిస్తుంది.
వర్షపు నీటిని శుభ్రపరిచే యంత్రాలున్నాయని నేను విన్నాను. ఒక్క వర్షపు నీటినే కాదు వంటింటిలోని స్నానపు గదిలోని నీటిని కూడా ఇంకుడు గుంతల్లోకి వెళ్ళేలా ఏర్పాటు చేస్తే భూగర్భజలాలు పెరగడానికి అవకాశం ఉంటుందంటారు కొందరు.
విచిత్ర విషయం మేమంటే కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీటినే త్రాగడానికి వాడుకోడానికి ప్రయత్నించేవారు. కొందరయితే, గుక్కెడు నీళ్ళ కోసం మైళ్ళకి మైళ్ళు నడిచి వెళ్ళి తాగు నీరు తెచ్చుకునే గ్రామాలు మరి కొన్ని. దాని వల్ల గ్రామీణ ప్రజలకి శ్రమ ఎక్కువ, సమయం వృథా అని నేను అనుకుంటాను.
అంతకు పూర్వం అనేక వాటి కోసం పోరాటాలు జరిగాయి. కాని ఇప్పుడు జరుగుతున్న పోరాటం నీటి కోసం. ఇది రాష్ట్రాల వరకూ ప్రాకింది. ఈ నీటి కోసం ఒకర్ని మరొకరు అంతం చేసుకునే దురదృష్టకరమైన రోజు భవిష్యత్తులో రావచ్చు. ఇప్పటికే సరిహద్దు సమస్యలు, జల వివాదాలు రాష్ట్రాల మద్యా, దేశాల మద్యా ఉన్నాయి.
మనిషికి ఈ రోజుల్లో ఆదాయం పెరుగుతోంది. దానితో పాటే నీరు కొనుక్కునే స్తోమత పెరుగుతోంది. అందుకే ఉన్నత విద్యావంతుల ఇళ్ళలోనే నీటి వృథా అవుతోంది. ఈ నీటి కొరత వల్ల హస్పటళ్ళలో ఆపరేషన్లు ఆగిపోయి మనుష్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అని నేను విన్నాను. అదంతా ఎందుకు నీళ్ళ కోసం క్యూలో నిలబడి వడదెబ్బకి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆడవాళ్ళ గురించి కూడా నేను విన్నాను.
ఈ జల సంఘర్షణ వెనుక అభద్రతా భావాలూ అనిశ్చితే కాదు, అనేక మానసిక కోణాలు కూడా ఉన్నాయి. నీటి గురించి ఒత్తిడి కూడా దానిలో ఓ భాగం. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా నీళ్ళు ఉండవు. ఏ అర్ధరాత్రో లేక వేళ కాని వేళ వచ్చే కుళాయి నీళ్ల కారణంగా కంటి నిండా కునుకు కరవవుతోంది. నేటి ఆధునిక సమాజంలో నిద్ర లేమి, అనేక శారీరక, మానసిక సమస్యలకి మూలం అవుతోంది. డిప్రెషనుకి దారి తీస్తోంది.
నా ఉద్దేశంలో నీటికి మనిషి ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ నీటి కొరత పెరిగే కొలదీ అనారోగ్యాలు పెరుగుతాయి. కార్పరేటు శక్తులు ప్రకృతిలో పుష్కలంగా లభించే నీటిని అచ్చమైన అంగడి సరుకు చేస్తున్నాయి. బాటిల్సులో నింపి అమ్ముతున్నారు.
నీటి విషయం అలా ఉంచితే వాతావరణ విషయమో? ఉత్తర, పశ్చిమ భారతం నుంచి వచ్చే వేడిగాలులు వలన దట్టమైన మేఘాలు లేకపోవడం, సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకటం వలన భూమి త్వరగా వేడెక్కి గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. అందుకే ఎండలోకి వెళితే వేడి, ఇంటిలో ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. అంతే కాదు పచ్చదనం లేక పోవడం, కాలుష్యం వల్ల కూడా గాలి వేడెక్కి తేమ శాతం తక్కువుగా ఉంటోంది. అందుకే ఈ ఉక్కపోత.
ఎదురుగా పురపాలక శాఖ వాళ్ళు పంపించిన నీటి సరఫరా వాహనం దగ్గర గోల గోల. ఆ గోలకి అలోచనా ప్రపంచంలో విహరిస్తున్న నేను దాని నుండి బయటపడి ఎదురుగా అగుపిస్తున్న దృశ్యాన్ని చూశాను. నీళ్ళ కోసం ఆ వాహనం మీద జనాలు ఎగబడ్తున్నారు. క్యూ పద్ధతి పాటించడం లేదు. నీరు సరఫరా చేసే వాహన సిబ్బంది నానా హైరానా పడ్తున్నారు.