దక్షిణాఫ్రికాలో వికసించిన నానీలు

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ రాపోలు సీతారామరాజు రచించిన ‘దక్షిణాఫ్రికా నానీలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. సి. భవానీదేవి. [/box]

[dropcap]దా[/dropcap]దాపు రెండున్నర దశాబ్దాలుగా తెలుగు కవితా రంగంలో తనదయిన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న ఆధునిక కవితా రూపం ‘నానీ’. 1997 సంవత్సరంలో ఆచార్య ఎన్. గోపీ గారు రూపొందించిన నానీరూపం ఇంతింతై వటుడింతై అన్నట్లు త్రివిక్రమ రూపం దాల్చి అనేకమంది నానీ కవులను కవితారంగ ప్రవేశం చేయించింది.

20-24 అక్షరాల వెసులుబాటుతో రెండు భావార్థాలుగా, పంచ్‍తో, ఆకర్షణీయమైన ధారగా సుభగత్వంతో అందరినీ కవిత్వం వైపు ఆకర్షిస్తున్న నానీల్లో ఉదహరించదగినవి చాలా కన్పిస్తాయి. రూపశిల్పి గోపీ గారి నానీ ఒకతి బహుళ ప్రచారం పొందింది ఇలా ఉంది:

దహనంలో
కుడి చేయి కాలలేదు
కారణం
కలం పట్టిన చేయి

నానీల చిన్నాన్నగా పేరుపొందిన సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు పల్లె గురించి, రైతు గురించి అనేక నానీలు రాశారు.

ఎండనకా వాననకా
బతికాడు
చచ్చాకనే కాసేపు
ఎ.సి. బాక్సులో..

ఇది జీవితమంత నిజం కదా! ఇలా అనేకులు జీవన సత్యాలను లఘువులో గురువుగా ఆవిష్కరించారు.

ఆఫ్రికాను ఒకప్పుడు చీకటి ఖండం అనేవారు. కానీ అది వెలుగు రవ్వలు వెలిగించిన మట్టి దీపం. తెలుగు భాష గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి కన్నా రాష్ట్రేతరులకు, విదేశీ తెలుగువారికే ఆదరాభిమానాలు ఎక్కువ. వస్తు వైవిధ్యం అపారంగా ఉండే నానీల్లో ప్రాంతీయ అస్తిత్వం పరివేదన స్పష్టంగా కనిపిస్తుంది. విదేశం నుంచి వీచిన ఈ నానీల గాలి చాలా కవితామృతాన్ని మోసుకొచ్చింది. కవిత్వం రుచి ఎక్కడున్నా ఒకటే! పుస్తకాలను నిప్పు కణికల్లా వెలిగించగల కవి సామాజిక రుగ్మతలపై కలం ఝుళిపించాడు.

‘ఎన్నాళ్ళు బతికావన్నది
నీ వయస్సు
ఎలా బతికావన్నదే
నీ యశస్సు’

విలువల్ని బోధించే ఆణిముత్యం ఈ నానీ.

రాపోలు అమ్మ నాన్నల గురించి మర్చిపోలేని ఒక నానీ రాశారు.

అమ్మ నీ కడుపు
తడముతుంది
మరి నాన్న
నీ వెన్ను తడుతాడు!

అమ్మంటే నాన్నంటే ఇంతకంటే ఉత్తమ నిర్వచనం దొరుకుతుందా! రాజకీయ చైతన్యం లేకుండా ఏ కవీ మనలేడు.

‘జండాలు వేరు
ఎజెండా లొకటే
ప్రజల ఓట్లను
కొల్లగొట్టే పనిలో’

రాజకీయ నాయకుల ఓట్ల దోపిడీ, స్వార్థ పాలనను నిరసించని నిఖార్సయిన వ్యక్తిత్వం లేనిదే కవి కాలేడు కదా!

భూగోళంలో
మూడొంతులు నీరే!
నిర్లక్ష్యం చేశామా
మిగిలింది కన్నీరే!

మనిషి దురాశ భూగోళ ఉపద్రవానికి దారితీస్తుందని కవి హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ పల్లెల గురించి, కాలుష్య గంగ గురించి, చేనేత వెతల గురించి, నల్ల వజ్రం మండేలా గురించి, మనిషి జీవితం పొడవునా అల్లుకుని ఉండే నిప్పు గురించి, మానవత్వం గురించి, చెట్టు గురించి, పుస్తకం గురించి, సొంపయిన తెలుగు భాష గురించి… ఇలా జీవితానికి సంబంధించిన అనేక అంశాల గురించి అంత్యప్రాసల అలరింపుతో దక్షిణాఫ్రికా నానీలు రాసిన ‘రాపోలు’ దక్షిణాఫ్రికాలో ఉంటున్న కవి అయినా, మన మధ్యలో మన ఇంట్లో మనతోనే ఉన్న ఆప్తునిగా అనిపిస్తారు. ఈ నానీలన్నీ చదువుతున్నప్పటి అనుభూతి అది.

ప్రపంచంలో ప్రతి మాట నవ్వు. నడకల్లో నటన కనిపిస్తుంటే నటించలేని నిర్మల మనస్కులకు ఇక్కడ మనటం కష్టమై పోతున్నది. చివరగా సీతారామరాజు గారి అలాంటి నానీ ఒకటి చూద్దాం!

‘తెరపై అతనో
మహానటుడు
జీవితంలో నటించలేక
ఓడిపోయాడు!’

ఎవరైనా జీవితంలో నటించగలటం వికృతియే!

రాపోలు గార్కి అభినందనలు.

***

దక్షిణాఫ్రికా నానీలు (2019)
రచన: రాపోలు సీతారామరాజు
పేజీలు: 80
వెల: ₹ 50/-
ప్రచురణ: అద్విక్ ప్రచురణలు
ప్రతులకు:
రాపోలు సీతారామరాజు – rsrraju@gmail.com
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here