Site icon Sanchika

దంతవైద్య లహరి-12

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

చిగురువాపు – రక్తస్రావం

ప్ర: గురువు గారూ.. నా శ్రీమతి వయసు 40 సంవత్సరాలు. ఆమె చిగుళ్లు వాచి ఆ చిగుళ్ళనుండి రక్తస్రావం జరుగుతున్నది. ఈ సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం వుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు.

-చిదిరాల సోమేశ్వర రావు, జనగాం జిల్లా.

జ: సాధారణంగా, చాలా మంది ఎదుర్కొనే దంత సమస్యల్లో, పిప్పిపన్ను వ్యాధి (ఇప్పుడు చాలా మట్టుకు తగ్గుముఖం పట్టింది) ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకుంటే, చిగురు వ్యాధులు తత్సంబంధిత వ్యాధులు ద్వితీయ స్థానంలో ఉంటాయి. ఇది చాలా మందికి అనుభవమే! కొందరు చెప్పుకుంటారు, మరికొందరు బయటపడకుండా సమస్యను దాచుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల సమస్య మరింతగా జటిలమై, దంతపరంగా అపారమైన నష్టం కలిగే అవకాశం వుంది.

చిగురు వాపు

దంతాలకు ఎలాంటి నష్టం సంభవించినా, అది మనకు నష్టం కలిగినట్టు భావించాలి. ఎందుచేతనంటే, చిగుళ్లు – దంతాలు, ఆరోగ్యంగా వున్నప్పుడే, మనం ఆహార పదార్థాలను చక్కగా నమలగలుగుతాం. ఆహార పదార్థాలు మంచిగా నమిలినప్పుడే, అవి క్షుణ్ణంగా జీర్ణమై, రక్తంగా మారే ప్రక్రియ జరుగుతుంది. అది సన్నగిల్లితే అనారోగ్యం బారిన పడక తప్పదు. అందుకే మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే, మన దంతాలు – చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలి. పన్ను, పంటి కుదురులో, పటిష్టంగా -గట్టిగా, ఆరోగ్యంగా ఉండాలంటే, అది చిగుళ్ల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే, చిగురువాపు వంటి చిగురు వ్యాధులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం.

చిగురు వాపు (జింజివైటిస్) వంటి చిగురు వ్యాధులు రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి 1) దంత పరమైనవి (స్థానిక) 2) శరీర సంబంధమైనవి.

దంత సంబంధంగా చిగురువాపు లేదా చిగురు సమస్యలు రావడానికి ప్రధాన కారణం నోటి అపరిశుభ్రత (బ్యాడ్ ఓరల్ హైజీన్) అని చెప్పవచ్చు. అంటే, పళ్ళు సరిగా తోముకొనక పోవడం, ఆహారపదార్థాలు తిన్న తరువాత, రకరకాల పానీయాలు తాగిన తర్వాత, నోరు సరిగా పుక్కిలించకపోవడం, తద్వారా మనం తినే ఆహారపదార్థాలకు సంబందించిన అణువులు పళ్ళ మీద, పంటి మధ్య ఇరుక్కునిపోయి నిల్వ వుండడం.

దంతధావనం (పళ్ళు తోముకోవడం) సరిగా లేకపోవడం మూలాన, లేదా శాస్త్రీయ పద్ధతిలో బ్రష్ చేసికొనక పోవడం వల్ల పంటిమీద కొన్ని భాగాలు శుభ్రతకు నోచుకోవు.

బ్లీడింగ్ గమ్స్ (చిగుళ్ల నుండి రక్తం)

అందువల్ల శుభ్రం కాని పంటిభాగం మీద పాచి (ప్లేక్) నిల్వ ఉండిపోయి, అది క్రమంగా గట్టిపడి ‘గార’ (కాలిక్యులస్) గా మారి, ఆ తర్వాత చిగురును వ్యాధిగ్రస్థం చేయడం ద్వారా చిగురు వాయడం (జింజివైటిస్), ఆ తర్వాత చిగుళ్ళ నుండి రక్తం కారడం (జిన్జివల్ బ్లీడింగ్) వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ స్థాయిలో దీనికి చికిత్స జరగనట్లైతే, వ్యాధి లోపలికి (పంటికుదురు లోనికి) చేరి, పంటిని దౌడ ఎముకతో అనుసంధానం చేసే ఒక పొరను (పెరియోడెంటల్ పొర) వ్యాధిగ్రస్ధం చేస్తుంది. దీనిని ‘పెరియో డాంటైటిస్’ అంటారు. ఈ వ్యాధి ఉధృతమైతే ఈ పెరియో డెంటల్ పొర కరిగిపోతుంది. దీనిని ‘పెరియో డాంటోసిస్’ అంటారు.

అంటే దౌడ ఎముక నుండి పంటికి పట్టు సడలిపోతుంది. తద్వారా పన్ను కదలడం మొదలు పెడుతుంది. అలా నోటి అపరిశుభ్రత వల్ల చిగురు వివిధ దశల్లో వ్యాధిగ్రస్థమై పళ్ళు కదిలి ఊడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి.

పాచి(ప్లేక్) గార (టర్టార్/కాల్కులస్) గా మారిన విధానం

ఇకపోతే, శరీర సంబంధమైన కొన్ని సమస్యల మూలంగా కూడా, చిగురు వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. మూర్ఛ వ్యాధి కోసం వాడే కొన్ని రకాల మందుల వల్ల చిగుళ్లు విపరీతంగా వాస్తాయి. ఒక్కోసారి మొత్తం పంటిని కప్పేసే విధంగా చిగుళ్ళు వాచి దవడ కదపలేని పరిస్థితి ఏర్పడుతుంది. నమిలేటప్పుడు చిగుళ్లకు గాయమై రక్తం కారడం జరుగుతుంది. ఇలాంటి వారికి ఎప్పటికప్పుడు, శస్త్ర చికిత్స ద్వారా పెరిగిన చిగురును తొలగించవలసి ఉంటుంది. ఆ మందులు వాడినంత కాలం ఇలాంటి చిగురు వాపు తగ్గదు.

తరువాత, ‘హీమోఫీలియా’  అనే రక్తసంబంధమైన వ్యాధి. ఇది ఒక విచిత్రమైన వ్యాధి! స్త్రీల ద్వారా (కేరియర్స్) ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధితో బాధపడేవారు మాత్రం పురుషులే! ఇది జన్యుపరమైన వ్యాధిగా చెబుతారు. ఈ వ్యాధి ఉన్నవారి రక్తం గడ్డకట్టే లక్షణాన్ని కలిగి ఉండదు. ఇలాంటివారికి వ్యాధి గురించి తెలుసుకోకుండా పన్ను తీసినా, పళ్ళు శుభ్రం చేసినా (స్కెలింగ్) రక్తస్రావం ఆపలేని పరిస్థితి ఏర్పడుతుంది. పరిస్థితి గమనించి వెంటనే రక్తం ఎక్కించ గలిగితే ప్రమాదం నుండి బయట పడినట్టు, లేకుంటే ప్రాణానికే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత, చిగురు వాపును, చిగుళ్ళనుండి రక్తం కారడాన్ని మామూలు విషయంగా తీసుకోకూడదు. వ్యాధి గురించి తెలిసినవారు ముందుగానే విషయాన్ని దంతవైద్యుల దృష్టికి తీసుకురావాలి.

మరొక భయంకర వ్యాధిలో కూడా చిగుళ్లు వాస్తాయి. ఇలాంటి వారు దీనిని మామూలు చిగురు వ్యాధి అనుకుని ముందుగా దంతవైద్యుల దగ్గరికి వస్తారు. ఎక్కువశాతం దంత వైద్యుల దగ్గరనే ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. దీని చికిత్స విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది.

గర్భిణులలో కూడా ఆ సమయంలో శరీరంలోని, వివిధరకాల హార్మోనులలో జరిగే మార్పుల వల్ల చిగుళ్లు వాయడం, చిగుళ్ళనుండి రక్తస్రావం జరుగుతుంది. తాత్కాలిక చికిత్సతో దీనికి ఉపశమనం పొందగలిగితే ప్రసవానంతరం, మామూలుగానే తగ్గిపోతుంది. అలాగే ఆడపిల్లలకు పీరియడ్స్ సమయంలో చిగుళ్లు వాయడం, చిగుళ్ళ నుండి రక్తం కారడం జరుగుతుంది. నోటి దుర్వాసన వచ్చే అవకాశం కూడావుంది. అయితే, ఇది కూడా తాత్కాలికమే! ఇంకా ఎయిడ్స్/హెచ్.ఐ.వి. మొదలైన అనేక వ్యాధిగ్రస్థులకు చిగురువాపు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం వుంది.

సందర్భం ఏదైనా నోటి పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉంటే, చాలా మట్టుకు ఈ చిగురు వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

~

దంతధావన విధానాలు:

ప్ర: డాక్టర్ గారూ.. దంతధావన విధానంలో పళ్ళు పైకి క్రిందికి తోమాలని చెబుతుంటారు కదా! దీనిలోని శాస్త్రీయత ఏమిటంటారు?

-మోహనరావు జానం, రేపల్లె..

జ: ప్రతివారం మీరు ‘దంతవైద్యలహరి’ శీర్షికను తప్పకుండా చదువుతున్నందుకు, మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. విషయానికి వస్తే పళ్ళు పైకి క్రిందికి తోముకోమని చెప్పడంలో శాస్త్రీయత/అర్థం వుంది. కానీ ఈ సూత్రం అన్ని పళ్లకు వర్తించదు. ముందరి పళ్ళు బ్రష్‌తో సున్నితంగా పైకి క్రిందికి బ్రష్ కుచ్చు (బ్రిజిల్స్) పంటి ఉపరితలం మీద పరుచుకునే విధంగా, చిగురుకు తగలకుండా లేదా చిగురుకు గాయం కాకుండా మెల్లగా తోముకోవాలి. ఇలా తోముకోవడం వల్ల పంటి మీది పాచి పదార్థం ఎక్కడా మిగలకుండా పూర్తిగా తొలగించబడుతుంది.

దీనివల్ల ‘గార’  ఏర్పడే అవకాశం ఉండదు. అలాగే వెనుక పళ్ళు (ప్రి -మోలార్స్, మోలార్స్) బ్రష్‌ను బుగ్గకు – పళ్లకు మధ్య ఉంచి సున్నితంగా, వర్తులాకారంలో తోముకోవాలి. క్రింది దౌడ లోపలి పళ్ళు క్రింది నుండి పైకి, పై దౌడ పంటి లోపలి భాగాలు పైనుండి క్రిందికి చిగురుకు గాయం కాకుండా తోముకోవాలి. ఇలా చేయడం వల్ల పంటి భాగం అంతా శుభ్రపడి, పంటి వ్యాధులు – చిగురు వ్యాధులు రాకుండా ఉంటాయి. పద్థతి ప్రకారం పళ్ళు తోముకోవడం, ఎప్పటికప్పుడు నోరు పుక్కిలించడం వంటి అలవాట్లు చాలా మట్టుకు దంతవ్యాధులు, చిగురువ్యాధులు, నోటి దుర్వాసన రాకుండా కాపాడతాయి.

‘నోటి దుర్వాసన వ్యాధి కాదు! వ్యాధి లక్షణం మాత్రమే!!’ అన్న విషయం మాత్రం మరచిపోకూడదు.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

Exit mobile version