[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
పిప్పి పన్ను(నొప్పి) – పసరు మందు
ప్ర: చాలామంది పంటి నొప్పికి (పిప్పి పన్ను.. వగైరా) ఇప్పటికీ చెవిలో పసరుమందు పోయించుకోడం చూస్తున్నాం. నొప్పి పంటితో సంబంధం వున్నప్పుడు చెవిలో పసరు పోయించుకోవడంలో అర్థం ఏమిటీ? వివరించగలరు.
– సి. హెచ్. నాగరాజు, బలరాం నగర్, సికింద్రాబాద్.
జ: మీ ప్రశ్న పాతదైనా ఈ రకపు వైద్యం ఇప్పటికీ కొనసాగడం ఆశ్చర్యకరం, మన దురదృష్టము కూడా. దంతవైద్యరంగంలో ఆధునికత ఊహించని రీతిలో అన్ని రంగాల మాదిరిగానే ముందుకు దూసుకు వెళుతున్నప్పటికీ, ఈ మూఢ నమ్మకాలు ఇంకా సాధారణ ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి. చికిత్సా విధానాలలో సామాన్యులకు తగినంత అవగాహన లేకపోవడం మరొక అంశం. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో వేల సంఖ్యలో దంతవైద్యులు తయారవుతున్నప్పటికీ ఎక్కువ శాతం పట్టణాలకే పరిమితం కావడం మూలాన ఇప్పటికీ చాలా గ్రామప్రాంతాలు సరిపడిన స్థాయిలో దంతవైద్యం అందని అనాథలుగా మిగిలివున్నాయి. అందుచేత అలాంటి గ్రామీణ ప్రజలు ఆర్.ఎం.పి.ల మీద, నాటు వైద్యుల మీద ఆధారపడక తప్పడం లేదు. అలా దంత చికిత్సా విధానాల మీద సరైన అవగాహన లేని గ్రామీణ వైద్యులు, మూఢ నమ్మకాలను మరింత ప్రాచుర్యానికి తెస్తున్నారు.
ఆ.. ఆకుల పసరుకు నిజంగా నొప్పిని తగ్గించే గుణమే ఉంటే ఈ పసరు ప్రయోగం పంటి (దంతం) మీద జరగాలి గాని, అతి సున్నిత భాగమైన చెవిలో ఏల? చెవిలో పసరు పోయడమే కాదు, చెవిలోనుండి చిన్న చిన్న సూక్ష్మ జీవులను కూడా రప్పించి, పంటి వ్యాధికి చెందిన పురుగులు బయట పడ్డాయని నమ్మిస్తారు కూడా. వ్యాధిగ్రస్థమైన పంటిలో కేవలం సూక్ష్మదర్శినితో చూడగల బాక్టీరియాలు ఉంటాయి తప్ప పురుగులు వుండవు. ఇది గమనించాలి. అయితే దంత వైద్యం ఇప్పుడు ఎంతో ఆధునికతను మూటగట్టుకున్నప్పటికీ, ఈ మూఢనమ్మకం, నిరక్షరాస్యులు – అక్షరాస్యులు అన్న తేడా లేకుండా ఇప్పటికీ ప్రజల్లో ప్రచారంలో ఉండడం గమనించదగ్గ విషయం!
చెవిలో పసరు పోయడం మూలంగా పంటి నొప్పి సంగతి ఎలా వున్నా, చెవిలోని సున్నితమైన భాగాలు దెబ్బతినడం మూలంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం వుంది. అయినా పిప్పిపన్ను/పంటి నొప్పికి, అది చికిత్స కానే కాదు.
పంటి నొప్పి రావడానికి పిప్పి పన్ను వ్యాధితో పాటు, ఇంకా అనేక కారణాలు వున్నాయి. ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే, ఒక్కొక్క సమస్యకు ఒక్కో చికిత్సా విధానం ఉంటుంది.
పిప్పిపన్ను సమస్య వచ్చి నొప్పి మొదలయింది అంటే, పిప్పి పంటిలోని ఎనామిల్ పొరను దాటి, డెంటీన్ పొర, ఆ తర్వాత పల్ప్ కుహరంకు (పల్ప్ కేవిటీ) చేరిందని అర్థం. పిప్పి ఎనామిల్ స్థాయిలో వున్నప్పుడు నొప్పి ఉండదు గనుక ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పంటికి రంధ్రం ఏర్పడడం వల్ల గానీ, ఆ తర్వాత నొప్పి మొదలు కావడం వల్ల గాని, చికిత్స చేయదలచుకుంటే, పరిస్థితిని బట్టి పంటికి సిమెంటు (ఫిల్లింగ్) చేసే ప్రయత్నం చేస్తారు. పిప్పి మరీ పల్ప్ కుహరం వరకు చొచ్చుకుపోయి వున్నట్లైతే, మూల చికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్) చేసి కేప్ వేస్తారు. ఈ చికిత్సల వల్ల జీవితాంతం పన్ను ఆరోగ్యంగా, పటిష్టంగా వుండి ఆహరం చక్కగా నమలడానికి (మాస్టికేషన్) ఉపయోగపడుతుంది.
ఇక, పంటి నొప్పి రావడానికి, పిప్పిపన్ను వ్యాధితో పాటు, విరిగిన, అరిగిన, కరిగిన పళ్ళు, దెబ్బల వల్ల, ప్రమాదాల వల్ల చచ్చుపడ్డ పళ్ళు, వ్యాధిగ్రస్థమైన జ్ఞాన దంతాలు, నరాల సంబంధమైన (ట్రై జెమినల్ న్యూరాల్జియా) సమస్యలు కారణం అవుతాయి. అందుచేత, ఆయా సమస్యలకు సంబందించిన చికిత్సలు చేయించుకుని పంటి నొప్పి సమస్య నుండి ఉపశమనం పొందాలి. పిప్పిపన్ను వ్యాధికి లేదా పంటి నొప్పికి, ‘చెవిలో పసరు’ పోయించుకోవడం వైద్యం కాదని గుర్తుంచుకోవాలి.
~
టూత్ పేస్టులు:
ప్ర: పళ్ళుతోముకోవడానికి ఏ పేస్టు మంచిదంటారు?
జ: గతంలో దీని గురించి చర్చించాం. అయినా మరో సారి ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు కాల్గెట్, బినాకా వంటి కొన్ని పాపులర్ పేస్టులు మాత్రమే మనకు లభ్యమయ్యేవి. ఇప్పుడు రకరకాల కంపెనీలు, రకరకాల పేర్లతో/ఫార్ములాలతో, ఆకర్షణీయమైన పేకింగులతో తయారుచేసి, అందుబాటులో వుంచుతున్నాయి. ఇక్కడ ఆమోదింపబడ్డ ఫార్ములాతోనే పేస్టులన్నీ తయారుచేస్తారు కనుక, మనకు ఇష్టమైన పేస్టు వాడుకోవచ్చు. కొన్ని పేస్టులు మాత్రము, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే వాడుకోవాలి.
అవి ఏమిటంటే –
1) చిగుళ్ల నుండి రక్తం కారుతున్నప్పుడు:
స్టోలిన్ – ఆర్ టూత్ పేస్ట్ + గమ్ టోన్ పౌడర్*
2) పళ్ళు – ‘జివ్వు’ మని గుంజుతున్నప్పుడు :
కాల్గెట్ – సెన్సిటివ్ + గమ్ టోన్ పౌడర్
సెంక్వెల్ -ఎఫ్ టూత్ పేస్ట్ + గమ్ టోన్ పౌడర్
సెన్సోడైన్ టూత్ పేస్ట్ + గమ్ టోన్ పౌడర్
3) మెరిసే పళ్ళ కోసం:
షైన్ -ఎన్ -స్మైల్ టూత్ పేస్ట్.
ఇది వారం లో రెండు రోజులు మాత్రమే వాడాలి.
ఈ మధ్య కాలంలో ఇంకా ఎన్నో ఆధునిక పద్ధతుల్లో తయారు చేయబడ్డ టూత్ పేస్టులు విఫణిలో ప్రవేశించి ఉండవచ్చు. ఈ రచయిత దృష్టికి వచ్చిన టూత్ పేస్టుల గురించి మాత్రమే ఇక్కడ వివరించడం జరిగిందని గమనించగలరు.
* గమ్ టోన్ పౌడర్:
ఇది ఆయుర్వేదిక్ పొడి. ఇది పంటి చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచే విషయంలో తోడ్పడుతుంది. పంటి పటిష్టత చిగురు ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. అందుచేత ఏ పేస్టుతో పళ్ళు బ్రష్ చేసుకున్నా, వెంటనే కొద్ధి గమ్ టోన్ పొడి చేతిలో వేసుకుని, వేలితో చిగుళ్ల మీద గట్టిగా రుద్ది రెండు నిముషాల తర్వాత కడిగేసుకోవాలి.
ఇది పళ్ళ పొడి కాదని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. పంటి/చిగుళ్ల సమస్యలతో సంబంధం లేకుండా, పిల్లలు తప్ప అందరు ఈ పొడిని బ్రషింగ్ తర్వాత చిగుళ్లపై రుద్దుకోవడం దంత సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.