[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
విరిగిన పన్ను:
ప్ర: డాక్టర్ గారికి నమస్కారములు. నాకు ఎడమదౌడ ముందుభాగములో ఉన్నటువంటి క్రింది దౌడ పన్ను పై భాగము విరిగినది. నొప్పి ఏమాత్రము లేదు. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నా వయసు 70 సంవత్సరాలు.
–ఎన్. భుజంగరావు, ఆఫీసర్ (రి), యూనియన్ బాంక్, హైదరాబాద్.
జ: భుజంగరావు గారూ, నమస్తే. ముందుగా, మీరు ప్రతివారం నా ‘దంతవైద్య లహరి’ శీర్షికలోని, వ్యాసాలను పరిశీలనాత్మకంగా చదివి, విశ్లేషణాత్మకంగా స్పందిస్తున్నందుకు, నా పక్షాన, ‘సంచిక అంతర్జాల వారపత్రిక’ పక్షాన, హృదయపూర్వక ధన్యవాదాలు/కృతజ్ఞతలు.
ఇక మీ సందేహం విషయానికి వస్తే, మీ వివరణ ప్రకారం ముందుపన్ను అంటే – ఇన్సిజార్స్ కానీ, కెనైన్, కానీ అయివుండొచ్చని నేను అనుకుంటున్నాను. ఆ పళ్ళు కనుక అయితే, విరిగినా, అరిగినా, మాట్లాడేటప్పుడు, నవ్వినప్పుడు తప్పక బయటికి కనిపిస్తాయి. అలాంటి సందర్భంలో అవి చూడడానికి బాగుండవు. దంత సౌందర్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించేవారు, ముఖ్యంగా ఆడపిల్లలు, మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు, చేయిగానీ, చేతిరుమాలు గానీ అడ్డుపెట్టుకోవడం, లేదా నోరు తెరవకుండా జాగ్రత్తపడడం మూలాన, నవ్వులోనూ, మాటలోనూ, కృత్రిమత్వం కనిపించి ఎబ్బెట్టుగా ఉంటుంది.
పన్ను విరిగినా, నొప్పి లేకపోవచ్చు. కారణం, అది నరాలు వుండే, పల్ప్ కుహరం వరకూ విరగలేదని అర్థం చేసుకోవాలి. పంటి, పల్ప్ కుహరం వరకూ, విరిగినా, అరిగినా, ఆ పన్ను లేదా పళ్ళు, జివ్వుమని గుంజడం, నొప్పి కలగడం జరుగుతుంది.
చల్లని గాలి తగిలినా భరించలేని పరిస్థితి, చల్లని పదార్ధాలను తినలేని పరిస్థితి, చల్లని పానీయాలు త్రాగలేని పరిస్థితి ఏర్పడుతుంది.
నొప్పి లేకపోయినా, సూదిగా గానీ, గరుకుగా గానీ ఉండడం వల్ల, పెదవులు, నాలుక, బుగ్గల లోపలిభాగం గాయమై, పుండ్లు (అల్సర్స్) గా మారే అవకాశం వుంది. రెండవదిగా, చూడ్డానికి వికారంగా ఉంటుంది. అందుచేత, చికిత్స ద్వారా పంటిని, సహజ స్థితికి తీసుకురావలసిన అవసరం ఉంటుంది.
విరిగిన/అరిగిన పంటిని, సహజంగా అందంగా తీర్చిదిద్దడానికి, చికిత్స రెండు భాగాలుగా ఉంటుంది. 1) మూల చికిత్స (రూట్‌కెనాల్ ట్రీట్మెంట్)-అవసరమైతేనే! 2) పంటి తొడుగు (కేప్/క్రౌన్) అమరిక.
విరగడం/అరగడం అనేది, పల్ప్ కుహరానికి చాలా దగ్గరగా ఉంటే, మూలచికిత్స తప్పనిసరి! లేకుంటే, సరాసరి, పంటి తొడుగులు చేసి, ఆ పంటిని సహజంగా, అందంగా తీర్చిదిద్దవచ్చు. ఏదైనా దంతవైద్యుల సూచన మేరకు మనం అంగీకారం తెలపాలి. లేదా నిర్ణయం తీసుకోవాలి. నొప్పి లేదని అలా విరిగిన లేదా అరిగిన పళ్ళను అలా.. వదిలేయడం, భవిష్యత్తులో ఇబ్బందులను కొనితెచ్చుకోవడమే అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఇక, పంటి తొడుగుల విషయానికి వస్తే, మూల చికిత్స అయిన వెంటనే, పంటి తొడుగులు వేయించుకోమని, దంతవైద్యులు సలహా లిస్తుంటారు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ, మూల చికిత్స అయిన తరువాత కొద్దీ రోజులు/వారాల వరకూ, కేప్స్ వేయించుకోకుండా ఉంటేనే మంచిది! ఈ సమయంలో మూలచికిత్స సరిగా జరిగినది, లేనిదీ తెలుస్తుంది. మూల చికిత్స ఫెయిల్ అయితే మధ్యలో నొప్పి వస్తుంది. ఈ విషయంలో అవసరాన్ని బట్టి తొందర పడకూడదు.
~
కట్టుడు పళ్ళు:
ప్ర: సార్.. కట్టుడు పళ్ళు అంటే ఏమిటీ? అందరికీ అవి అవసరం అంటారా? అవి పెట్టుకోకుంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
– శ్రీనివాసరావు. గరిమెళ్ళ, కాజీపేట, హన్మకొండ జిల్లా.
జ: బాగుంది, మీ ప్రశ్న. మీకు వచ్చిన సందేహం సహజమే! కొందరు అడగాలనుకుంటారు, కానీ అడగడానికి సందేహిస్తారు. మరికొంతమంది అడగకుండా ఉండలేరు. సందేహ నివృత్తి అయ్యేవరకు వాళ్ళ మనస్సులో ప్రశాంతత ఉండదు.
కట్టుడు పళ్ళు గురించి తెలుసుకునే ముందు, అసలు పళ్ళు లేదా సహజసిద్ధమైన పళ్ళ గురించి వాటి విధుల గురించి తెలుసుకోవాలి.
మానవ జీవితంలో పళ్లకు (దంతాలకు) సంబంధించి రెండు దశలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే! అవి, పాలపళ్ళ దశ, స్థిరదంతాల దశ. పాలపళ్ళు పై దౌడలో పది, క్రింది దౌడలో పది మొత్తం ఇరవై పళ్ళు ఉంటాయి. బాల్యంలో ఇవి మెత్తని పదార్థాలు నమలడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి ఊడిపోయిన తర్వాత వచ్చేవి స్థిరమైన పళ్ళు. అంటే ఇవి బ్రతికినంత కాలం ఉండేవి అన్నమాట! అయితే మనకు పళ్ళు/దంతాల అవసరం ఏమిటీ? తెలుసుకోవాలి.
1) నమలడం:
ఆహార పదార్థాలను నమలడాన్ని ‘మాస్టికేషన్’ అంటారు. ఎలాంటి పదార్ధమైనా చీల్చడం, కొరకడం, నమలడం ద్వారా ఆహారపదార్థాలు సజావుగా లోపల జీర్ణమై రక్తంగా మరి, మనిషి బ్రతకడానికి ఉపయోగపడతాయి. ఈ నమిలే ప్రక్రియ పళ్ళ ద్వారా లేదా దంతాల ద్వారానే జరుగుతుంది కదా!అలా దంతాలు జీర్ణక్రియకు ఉపయోగపడుతున్నాయి.
2) పద ఉచ్చారణ:
పదాలు లేదా మాటలు స్పష్టంగా (పద ఉచ్చారణ) పలకడాన్ని ‘ఫోనేషన్’ అంటారు. అసలు పళ్ళు లేకపోయినా, లేక మధ్యలో అక్కడక్కడా పళ్ళు కోల్పోయిన వాళ్ళ మాటలు స్పష్టంగా వుండవు. కొన్ని పదాలు దంతాల మూలంగానే స్పష్టంగా పలక గలుగుతారు. వీటిని ‘దంత్యాలు’ అంటారు. అందుచేత మనం స్పష్టంగా మాట్లాడడానికి పళ్ళు తప్పని సరి.
3) అందం (సౌందర్యం):
దీనినే.. ఈస్తటిక్స్ అంటారు. దీని గురించి చెప్పే శాస్త్రాన్ని ‘ఈస్తటిక్ డెంటిస్ట్రీ’ అంటారు. పళ్ళు లేనివాళ్లు, తొస్సిపళ్ళు ఉన్నవాళ్ళకి, పళ్ళన్నీ ఉన్నవాళ్ళకి మధ్య తేడాను మనం యిట్టే గ్రహించగలం. దంతసౌందర్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు గనుక! ముఖారవిందానికి మంచి పలువరుస అవసరం. ఇలాంటి ముఖ్య విధులు నిర్వహించే పళ్ళు కోల్పోయినప్పుడు అవసరమయ్యేవి కట్టుడు పళ్ళు.
కట్టుడు పళ్ళు అంటే..!
అసలు పళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే పళ్ళను ‘కట్టుడు పళ్ళు’ లేదా ‘కృత్రిమ దంతాలు’ అంటారు. సహజ దంతాలు నిర్వహించే విధులు నిర్వహించే ఉద్దేశ్యంతోనే, వీటిని అమర్చడం జరుగుతుంది. పూర్తిగా దంతాలు లేనివారు (ఈదెంచ్యులస్) కట్టుడు పళ్ళు (ఫుల్ డెంచర్స్) పెట్టుకొనకపోతే, ముఖంలో వృద్ధాప్యపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. మాటల్లో స్పష్టత ఉండదు. ఆహారం నమిలే అవకాశం శూన్యం.
పలువరుసలో ఒకటి రెండు పళ్ళను కోల్పోయినట్లయితే, కొద్ధి కాలానికి పక్కపళ్ళు జరగడం, ఎదురుగా వున్న పళ్ళు జారిపోవడం, తద్వారా నమిలే దంతాలు ఒకదానికొకటి కలుసుకోకపోవడం (మాల్ అక్లూసన్) మూలాన, ఆహార పదార్థాలను నమల లేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని బట్టి కట్టుడుపళ్లు లేదా కృత్రిమ దంతాలు అవసరమో లేదో తెలుసుకోవడం అంత కష్టం కాదనుకుంటాను!
నోటి క్యాన్సర్:
ప్ర: డాక్టర్ గారు! మీ జవాబులలో కొన్ని విషయాలు నోటిపుండ్లు క్యాన్సర్‌గా మారటం వంటి విషయాలు వింటుంటే భయం వేస్తుంది. మరి పూర్వకాలం పెద్దలకు ఇలాంటి దంత పరిజ్ఞానం లేకపోయినా పెద్ద పెద్ద జబ్బుల బారిన పడిన దాఖలాలు లేవు. అందుకు కారణం ఏమిటి? బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం ఒక్కటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా?
— గోనుగుంట మురళీకృష్ణ, తెనాలి.
జ: మురళీకృష్ణ గారు.. అప్పటివారు కష్టజీవులు. కష్టపడి పనిచేసేవారు. కల్తీ లేని ఆహారపదార్థాలు తిని ఆరోగ్యంగా ఉండేవారు. అయినా వారి జీవితకాలం ఇప్పుడున్నంత లేదు, అది వేరే విషయం! ఇప్పుడు ఆధునికత వచ్చింది. సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనబడుతున్నాయి. అప్పటి సమస్యలకు పరిష్కారం (చికిత్స) లేక బాధను తట్టుకోగలిగినంత కాలం భరించేవారు. తరువాత మరణశయ్య పరిష్కారంగా మిగిలేది. బలవర్ధకమైన ఆహారంతోపాటు, ‘ముందస్తు (దంత) వైద్య పరీక్షలు’ కనీసం సంవత్సరానికొకమారు చేయించుకుంటే రాబోయే ప్రమాదాల బారి నుండి తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రతి వారం మీరు ఈ శీర్షికను ఆదరిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదములు.
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.