Site icon Sanchika

దంతవైద్య లహరి-17

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

పిదపకాలపు దంతసమస్యలు:

ప్ర: డాక్టరుగారూ.. నమస్తే. దంతవైద్యలహరి శీర్షికలో మీరు అందిస్తున్న సమాచారం చాలా ఉపయోగకరంగా వుంది. పిదపకాలంలో వచ్చే దంత సమస్యల గురించి కూడా వివరించండి.

 – గంటా రామిరెడ్డి, సాహితీవేత్త, రిటైర్డ్ ఉపాధ్యాయులు, భీమారం, హన్మకొండ.

జ: గౌ. రామిరెడ్డి గారికి నమస్సులు. ముందుగా, ప్రతివారం ఈ శీర్షికను చదివి స్పందిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీరు అడిగినట్లు పిదపకాలపు దంతసమస్యలు, అంటే వృద్ధాప్యంలో వచ్చే దంత సమస్యలని నేను అనుకుంటున్నాను. ఈ కాలంలో వచ్చే దంత సమస్యలను ‘జేరియాట్రిక్ డెంటల్ ప్రోబ్లమ్స్’ అంటారు. వృద్ధాప్యం వచ్చేసరికి చాలామంది వారికీ వచ్చే దంత సమస్యలను పెద్దగా పట్టించుకోరు. కొందరి విషయంలో పిల్లలు సహకరించరు. ఎవరైనా నోరు తెరిచి అడిగితే, “ఈ వయస్సులో వాటికి చికిత్స అవసరమా?” అనే పిల్లలు కూడా వుంటారు. అలా చాలామందిలో వృద్ధాప్యంలో దంత సమస్యలు నిర్లక్ష్యం చేయబడతాయి.

వయసు మళ్ళిన తరువాత, మామూలుగా వచ్చే దంత సమస్యలే వారికి వచ్చినా, ఆ వయస్సులో కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా వస్తుంటాయి. చాలా మటుకు అవి పరిష్కరింపబడే దంత సమస్యలే అయి ఉంటాయి.

వృద్ధాప్యంలో వచ్చే ప్రత్యేక దంత సమస్యల్లో, దౌడ కీలు (టెంపోరో మాండిబ్యులార్ జాయింట్) సమస్య ప్రత్యేకమైనది. మోకాలు నొప్పి మాదిరిగా, ఈ దౌడ కీలులో కూడా నొప్పి వచ్చి దౌడను కదలనీయని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఆహరం నమలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఒక్కోసారి యుక్తవయస్సులో కూడా వచ్చే అవకాశం వుంది కానీ, తక్కువ శాతం మందిలో ఈ సమస్యను చూడవచ్చు. దీనికి చిట్కామందుల కోసం, చిట్కా వైద్యం కోసం ఎదురు చూడక, తక్షణం సంబంధిత దంతవైద్యులను సంప్రదించవలసి ఉంటుంది.

రెండవదిగా క్రింది దౌడ కీలు క్రిందికి జారిపోవడం (డిస్లోకేషన్). దీనినే ‘టెంపొరొ -మండిబ్యులార్ డిస్లోకేషన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఇది కూడా తక్కువ శాతం యవ్వనస్థుల్లో సైతం వస్తుంది. ఆవులింతలు వచ్చినప్పుడు, లేదా ఆహార పదార్థాలు తింటున్నప్పుడు, అకస్మాత్తుగా దౌడ కీలు క్రిందికి జారిపోయి, నోరు మూసుకోకుండా తెరుచుకుపోయి ఉంటుంది. నోటి కుహరం నుండి మన ప్రయత్నం లేకుండానే లాలాజలం ధారగా కారిపోతుంది. ఒక్కోసారి రెండువైపులా దౌడ కీలు క్రిందికి జారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు బలవంతంగా దౌడలను కలిపే ప్రయత్నం చేయకూడదు. అంటే బలవంతంగా నోరు మూసే ప్రయత్నం చేయకూడదు. తక్షణమే దంతవైద్యుని సంప్రదించాలి. అక్కడ సులభమార్గం లోనే దౌడను సరిచేస్తారు. ఒక్కోసారి ఈ ప్రయత్నంలో నొప్పి కలిగినప్పుడు, మత్తు ఇచ్చి సరిచేస్తారు. కొందరు స్వంతంగా సరిచేసుకునే అలవాటు చేసుకుంటారు. ఏదైనా, దంతవైద్యుల సలహా మేరకే జరగాలి.

వృద్ధాప్యంలో వచ్చే మరో సమస్య, నోరు ఎండిపోవడం. వయసు పెరిగేకొద్దీ లాలాజల గ్రంథుల నుండి, లాలాజలం స్రవించే శాతం పడిపోతుంది. దీని మూలంగా నోరు ఎండిపోయి పరిశుభ్రత లోపంతో పాటు, పిప్పిపన్ను సమస్య, నోటి దుర్వాసన సమస్య ఉత్పన్నం కావచ్చు. దంతవైద్యుల సూచనల ద్వారా వీటి నుండి కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది.

ఈ వయస్సులో, అరిగిపోయిన పళ్లు, విరిగిపోయిన పళ్ళు, వాటి మూలంగా నోటిలో పుండ్లు ఏర్పడే అవకాశం వుంది. వీటిని ఎట్టి పరిస్థితి లోనూ అశ్రద్ధ చేయకూడదు. వీటిని గమనించిన వెంటనే దంతవైద్యులను సంప్రదించడం ద్వారా తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుంది.

వృద్ధాప్యంలో ఆలోచించ దగ్గమరో అంశం కట్టుడు పళ్ళు. కొందరిలో పూర్తిగా పళ్ళు ఊడిపోవడం (ఈ డెంట్యూలస్) జరిగి బోసి నోటితో వుంటారు. కట్టుడుపళ్లు గురించి ఆలోచించరు. ఈ వయసులో అవి అవసరమా? అని తమను తామే ప్రశ్నించుకుంటారు. కానీ ఇది తప్పుడు ఆలోచన. బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహార పదార్ధాలు తినాలి. అవి సక్రమంగా నమలబడాలంటే పళ్లు కావాలి. అలాగే పళ్ళు కోల్పోయిన వారి ముఖంలో అసలు వయసు కంటే పదేళ్లు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పళ్ళు లేకపోవడం మూలంగా దౌడ కీళ్లలో నొప్పి వచ్చే అవకాశం వుంది. అలాగే పాక్షికంగా దంతాలు కోల్పోయినవాళ్లు, పాక్షిక దంతాలు అమర్చుకోవాలి.

పళ్ళులేని వారు మాట్లాడితే, మాట ముద్దగానూ, నత్తి గానూ వస్తుంది. దీని కోసం తప్పక పళ్ళు పెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో, బ్రతికినంతకాలం, తమ దంతాలను సంరక్షించుకున్నవారు అదృష్టవంతులని చెప్పాలి. అలాగే, వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు దంతవైద్య పరీక్షలు చేయించుకోవాలి.

~

నోటి పొక్కులు:

ప్ర: సార్, మా అమ్మాయి వయసు ఇరవై సంవత్సరాలు. అప్పుడప్పుడు నోటినిండా పొక్కులు వచ్చి విపరీతంగా బాధపడుతుంది. దీనికి పరిష్కార మార్గం తెలియజేయగలరు.

-కుమార స్వామి. ఎస్., హైదరాబాద్.

జ: స్వామి గారూ, మీ అమ్మాయి సమస్య చాలామంది యువతీ యువకుల్లో కనిపిస్తుంది.

అతికొద్ది మందిలో అవసరమైన విటమినుల లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఎక్కువమంది యువతీ యువకుల్లో ఇది రావడానికి కారణం – ఉద్రిక్తత, ఆందోళన సమయాలలో, ఈ సమస్య రావచ్చు. కారణం జరగకూడనివి జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు పరీక్షల సమయంలో, ఇంటర్వ్యూల సమయంలో, అనుకున్నవి కానప్పుడు, నోటిలో ఇలాంటి పుండ్లు వచ్చి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఆహారం తీసుకోలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దౌడ క్రింది లింపు గ్రంథులు కూడా వాచి నొప్పిని కలిగించడం, నోటి దుర్వాసన రావడం జరుగుతుంది. ఇలా వచ్చేపుండ్లను ‘ఆఫ్తస్ అల్సర్స్’ అంటారు. సకాలంలో దంతవైద్యులను సంప్రదించడం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

కట్టుడు పళ్ళు:

ప్ర: సార్, కట్టుడు పళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?

జ: కట్టుడుపళ్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. స్థిరమైనవి (ఫిక్స్ద్), తీసుకునే వీలున్నవి (రిమూవబుల్). స్థిరమైన కట్టుడుపళ్లు, సహజ దంతాలను తోముకున్నట్టే తోముకోవాలి. తీసుకునేవీలున్న కట్టుడు పళ్ళు రెండు రకాలుగా ఉంటాయి.

1) పూర్తి పళ్ళ జట్టు (ఫుల్ డెంచర్స్) 2) పాక్షిక దంతాలు (పార్షియల్ డెంచర్స్)

వీటి విషయంలో జాగ్రత్తలు అవసరం. పూర్తి పళ్ల సెట్టును ఎప్పడూ నోటిలో వుండేటట్టు చూసుకోవాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు, పళ్ళ సెట్టు నోటిలో నుండి బయటకు తీసి, బట్టల సబ్బుతో పూర్తిగా శుభ్రం చేసి (కొంతమంది టూత్ పేస్ట్ వాడతారు) వెంటనే నోట్లో పెట్టేసుకోవాలి. కొందరికి రాత్రిపూట తీసి బయటపెట్టే అలవాటు వుంది. ఇలా చేయడంవల్ల ఎప్పటికీ ఇవి అలవాటు కావు. తరువాత వీటిని వాడేవారు, ఏమి తిన్నా వెంటనే ఎక్కువసార్లు నోరు పుక్కిలించాలి. లేకుంటే, నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంది. అంటే మామూలు పళ్లకంటే వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. పాక్షిక దంతాలు ప్రతి రోజు తీయవలసిన అవసరంలేదు. అప్పుడప్పుడు తీసుకుని శుభ్రం చేసుకోవచ్చు.

వీటిని ప్రతిరోజూ తీస్తే త్వరగా వదులుగా అయిపోవడమేగాక ఇరుపక్కల పళ్ళు కదిలిపోయే అవకాశం వుంది. అతిముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలాంటి పదార్ధాలు తిన్నా, పానీయాలు త్రాగినా తక్షణం నోరు పుక్కిలించాలి. రాత్రి పడుకునే ముందు తప్పక ఉప్పునీటిలో నోరు పుక్కిలించడం అన్నివిధాలా మంచిది.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

Exit mobile version