దంతవైద్య లహరి-18

6
1

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

పళ్ళు – చల్లని/వేడి పదార్ధాలు:

ప్ర: సర్, మావారి వయసు 45 సంవత్సరాలు. ఆయనకు అతి చల్లని, అతివేడి పదార్ధాలు తినడం, పానీయాలు త్రాగడం అలవాటు. పళ్ళు బాధపెడుతున్నాయి, అంటూనే ఆయన ఈ అలవాటు మానడం లేదు. దీనివల్ల పళ్లకు ఏమైనా ప్రమాదం ఉందా? వివరించగలరు.

– శ్రీమతి ప్రసూన సాగర్, లాలాగూడ, సికింద్రాబాద్.

జ: మీరు అందించిన వివరాలను బట్టి మీ వారి పంటి ఎనామిల్ (పింగాణీ పోర) దెబ్బతిన్నట్టు అర్థం అవుతున్నది. అతి చల్లని/అతి వేడి పదార్థాల లేదా పానీయాల ప్రభావం పంటి మీద లేదా దంతాల మీద ఎలా వుందన్న కనీస అవగాహన చాలామందిలో లేకపోవడమే, ఇలాంటి అలవాట్లకు కారణం అవుతున్నది. పిల్లలకు చెప్పవలసిన పెద్దవాళ్ళే ఇలాంటి అలవాట్లకు బానిసలు అయితే, ఇక పిల్లల పరిస్థితి ఏమిటి? చల్లని/వేడి, ఆహార పదార్థాలు తిన్నా, అతి చల్లని లేదా అతి వేడి పానీయాలు త్రాగినా, లేదా వేడి పానీయాలు త్రాగిన వెంటనే అతి చల్లని పానీయాలు త్రాగినా, అలాగే అతి చల్లని పానీయాలు త్రాగిన వెంటనే అతి వేడి పదార్థాలు త్రాగినా, తరచుగా ‘సిట్రస్’ గ్రూపు పళ్లరసాలు (నిమ్మ, నారింజ, పంపర పనస, బత్తాయి వగైరా) త్రాగినా, పులుపు పదార్థాలు అదే పనిగా తిన్నా, వాటి ప్రభావం పళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. పళ్ళు బీటలు వారడం, పలుచబడడం, కరిగిపోవడం (పింగాణీ పొర) వంటి సమస్యలు ఎదురుకావడం, తద్వారా పంటి నొప్పి, పళ్ళు ‘జివ్వు’మని గుంజడం ప్రారంభం అవుతుంది.

అయినా నిర్లక్ష్యం చేస్తే పళ్ళ మీద చిన్న చిన్న గుంటలు ఏర్పడి అవి పంటి ‘డెంటీన్’ భాగం లోనికి ప్రవేశించడం వల్ల పంటి నొప్పి వచ్చే అవకాశం వుంది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే,పంటి రంధ్రం ‘పల్ప్ కుహరం’కు చేరి భరించలేని నొప్పి ప్రారంభం కావడమే గాక, పంటి చిగురు వాయడం, దౌడ వాయడం, పళ్లతో నమలలేని పరిస్థితి ఏర్పడడం, ఆ తర్వాత దౌడ మూసుకు పోవడం (ట్రిస్మస్) వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మరి, ఇలాంటప్పుడు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అన్నది తెలుసుకోవలసి వున్నది.

చేయకూడనివి:

  • అతి చల్లని/వేడి పదార్థాలు తినకూడదు.
  • అతి వేడి/చల్లని పానీయాలు త్రాగకూడదు.
  • వేడి పానీయాలు త్రాగిన వెంటనే చల్లని పానీయాలు, అలాగే చల్లని పానీయాలు త్రాగిన వెంటనే, వేడి పానీయాలు త్రాగకూడదు.
  • నిమ్మ, నారింజ రసాలు అతిగా త్రాగకూడదు. డైరెక్టుగా కాకుండా పళ్లకు తగలకుండా (స్ట్రా తో) త్రాగడం మంచిది.
  • ఐస్, పుల్ల ఐస్-క్రీమ్‌లు నమలకూడదు.
  • నిమ్మబద్దలు కొరకడం – చీకడం వంటి పనులు చేయకూడదు.

చేయవలసినవి:

పళ్లలో ఎలాంటి తేడా వచ్చినా, నొప్పి, పళ్ళు జివ్వుమనడం అనే లక్షణాలు కనిపిస్తే వెంటనే దంతవైద్యుని సంప్రదించాలి. అవసరాన్ని బట్టి పళ్లకు ఫిల్లింగులు కానీ, మూల చికిత్సగాని చేసే అవకాశం ఉంటుంది.

తాత్కాలిక ఉపశమనం కోసం బాధానివారణ బిళ్ళలు (కేటరాల్-డి టి, వంటివి) ఔషధపరమైన టూత్ పేస్టులు (కాల్గేట్ -సెన్సిటివ్, సెన్సోడయిన్, వగైరా) వాడుకోవచ్చు.

దంతపరమైన ఉపద్రవాలు తప్పించుకోవడానికి, ఆరు నెలలకు ఒకసారి సమస్యలకు అతీతంగా ముందస్తు దంతవైద్య పరీక్షలు చేయించుకోవడం, రికార్డు భద్రపరుచుకోవడం ఆరోగ్యకరం.

~

రంగు మారిన పన్ను:

ప్ర: ఆర్యా.. మా అమ్మాయి తొమ్మిదవ తరగతి చదువుతున్నది. బడిలో ఆటలు ఎక్కువగా ఆడుతుంది. ఈ మధ్య అమ్మాయి ముందరి పెద్ద పన్ను (కొరికే ఎడమ వైపు పన్ను) రంగు మారి, అది ఒక్కటీ బూడిదరంగుగా మారుతున్నది. చూడడానికి బాగోడం లేదు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. కానీ, ఈ రంగు మారిన పన్ను వల్ల నోరు తెరచి స్వేచ్ఛగా మాట్లాడడం, నవ్వడం చెయ్యడం లేదు. ఆడపిల్ల కదా! పరిష్కార మార్గం చెప్పగలరు.

జ: మీ అమ్మాయి క్రీడాకారిణి అంటున్నారు కదా! బహుశః, అమ్మాయి తన చిన్నవయసులో ఆడుకుంటున్నప్పుడు ముందు పన్నుకు దెబ్బతగిలి ఉంటుంది. ఇలా దెబ్బలు తగిలినప్పుడు ఒకటి –రెండు రోజులు పంటి నొప్పి వుండొచ్చుగాని, వెంటనే పంటిలో ఎలాంటి మార్పులు కనిపించవు. ఈ విషయం పిల్లలు కూడా మర్చిపోతారు. తర్వాత లోపల జరగవలసిందంతా జరిగి, పన్ను రంగు మారడం, ఆ పంటికి సంబంధించిన చిగురు వాయడం, ఆ తర్వాత వాచిన చిగురు నుండి చీము, రక్తం కారడం, నోటి దుర్వాసన రావడం వంటి లక్షణాలు బయట పడతాయి. ఈ విధంగా రంగు మారిన పన్నును, ‘సచ్చు పన్ను’  లేదా ‘నాన్-వైటల్ టూత్’ అంటారు. చిగురు వాచి, చీము కారడాన్ని ‘జింజయ్ వల్ ఆబ్సెన్’ లేదా ‘పెరి ఎపికల్ ఆబ్సెన్ ఆఫ్ ది రూట్’ అంటారు. దీని గురించి పెద్దగా భయపడవలసిన పనిలేదు.

పన్ను కదలకుండా గట్టిగా వున్నట్లైతే, దీనికి ‘మూల చికిత్స’ (రూట్ కెనాల్ ట్రీట్మెంట్) చేసి, ఆ తర్వాత సహజమైన రంగులో కేప్ అమరుస్తారు. దీనిని ‘జాకెట్ క్రవున్’ అంటారు. ఇది ప్రక్క పన్ను మాదిరిగానే సహజంగా ఉంటుంది. ఆడపిల్లల విషయంలో ఇలాంటి చికిత్సకు మొదటి ప్రాధాన్యత నివ్వాలి. ఈ చికిత్స తరువాత స్వేచ్ఛగా మాట్లాడడం, మనస్ఫూర్తిగా నవ్వడం వంటివి మామూలుగా చేసే అవకాశం ఉంటుంది.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here