Site icon Sanchika

దంతవైద్య లహరి-2

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

క్రవున్స్

ప్రశ్న : డాక్టర్ గారు, పంటి సమస్యలు అనగానే, చాలామంది నోట వినిపించేది ‘క్రవున్స్’ అనే పదం. అసలు ఈ క్రవున్స్ అంటే ఏమిటీ? వీటిని ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారు?

శ్రీ మోహన్ రావు. జె, రేపల్లె, ఆం. ప్ర.

జ: మోహన్ రావు గారు, నిజమే ఈనాటి ఆధునిక దంతవైద్యంలో మీరు అన్నట్టు, క్రవున్స్ అనే పదం జనం నోళ్ళల్లో నానుతున్న మాట వాస్తవం. నిజానికి, క్రవున్ అంటే దంత చికిత్సా పరంగా,’పంటి తొడుగు’ లేదా మిశ్రమ భాషలో ‘పంటి కేప్’ అంటుంటారు. అయితే అతి సామాన్యులకు సైతం క్రవున్.. అనే ఆంగ్ల పదమే అర్థం తెలియకపోయినా, అతి సులభంగా వాడేస్తున్నారు. ఆ పదం అలా ప్రాచుర్యానికి వచ్చేసింది.

మరి ఈ పంటి తొడుగు లేదా క్రవున్ అంటే ఏమిటి? పంటిని కప్పిపుచ్చేది లేదా పంటిని/దంతాన్ని కాపాడేది అని అందరికీ అర్థమయ్యే పద్దతిలో చెప్పుకోవచ్చు. మరి దంతాలను కప్పవలసిన లేదా కాపాడవలసిన అవసరం ఏమిటీ? ఆరోగ్యమైన దంతాల/పంటి విషయంలో ఈ పంటి తొడుగుల అవసరం ఉండదు. కానీ వివిధ కారణాల వల్ల పన్ను లేదా దంతం ఆహరం నమిలే విషయంలో ఇబ్బంది పెట్టడం వల్ల, ఆహారం తీసుకోలేని పరిస్థితి, చల్లని పానీయాలు తీసుకోలేని పరిస్థితి, చల్లని గాలి తగిలితే తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటీ?

పంటిని మనం చూసినప్పుడు, పైభాగం తెల్లగా కనపడుతుంది. దీనిని పింగాణీ పొర లేదా ఎనామిల్ అంటారు. ఈ పింగాణీ పొరకు, నరాలు, రక్తనాళాలు పంపిణి లేకపోవడం మూలాన దీనికి స్పర్శ ఉండదు. అందుచేతనే, పిప్పిపన్ను ప్రాథమిక దశలో అంటే పింగాణీ పొర స్థాయిలో వున్నప్పుడు నొప్పి రాదు. పింగాణీ పొర తర్వాత అంతర్గతంగా ‘డెంటీన్ పొర’ ఉంటుంది. దీనిలోనికి పాక్షికంగా నరాలు, రక్త నాళాలు విస్తరించి ఉండడం వల్ల, ఇక్కడ స్పర్శ నొప్పి రూపంలో తెలుస్తుంది. పంటి లోపలి తర్వాతి భాగం ‘పల్ప్ కుహరం’. దీని నిండా నరాలు, రక్తనాళాలు చుట్టుకుని ఉంటాయి. ఇవి అతి సున్నితత్వాన్ని కలిగివుండడం మూలాన చిన్న తాకిడికే నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా.. నొప్పి వచ్చే పరిస్థితులు ఏమిటంటే, పన్ను ఎనామిల్ భాగాన్ని దాటి వివిధ కారణాల వల్ల విరిగి పోవడం వల్ల, అరిగిపోవడం వల్ల, కరిగిపోవడం (ఆమ్ల ప్రభావం) వల్ల భరించలేని నొప్పి వస్తుంది. కానీ పంటి మూలం (రూట్) మాత్రం ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో, పన్నుతీయకుండా, నొప్పిని తగ్గించే చికిత్సా విధానాన్ని ‘రూట్ కెనాల్ ట్రీట్మెంట్’ లేదా ‘మూల చికిత్స’ అంటారు.

అంటే, నొప్పికి కారణాలైన సంబంధిత నరాలను, రక్తనాళాలను పనిచేయకుండా నిర్వీర్యం చేస్తారు. అప్పుడు స్పర్శ అనేది లేకపోవడం మూలాన ఇక నొప్పి సమస్య ఉండదు. క్రమంగా రంగు మారి పన్ను/దంతం పెళుసుగా మారి ఆహార పదార్ధాలు ‘నమలడం’ (మాస్టికేషన్) అనే ప్రక్రియ వల్ల పన్ను విరిగి ముక్కలయ్యే అవకాశం ఉంది. ఇలా కాకుండా మూలచికిత్స జరిగిన పన్నుకు రక్షణ కవచం అవసరం. దానినే పంటి తొడుగు/కేప్/క్రవున్ అంటున్నాం, ఇది అవసరాన్ని బట్టి, ఒకే పన్నుకు కావచ్చు, లేదా అనేక పళ్లకు కావచ్చు. దవుడ పలువరుసలోని ఒకటి రెండు పళ్ళను తీసివేయవలసి వచ్చినప్పుడు, ఖాళీ ప్రదేశంలో కట్టుడు పళ్ళు బదులు, పక్కపళ్ళు సపోర్టుతో పంటి తొడుగులు (ఇక్కడ మూలచికిత్స అవసరం లేదు) చేయించుకోవచ్చు. దీనిని ‘బ్రిడ్జ్ వర్క్’ అంటారు.

ఇలా.. విపరీతంగా పళ్ళు రంగు మారినా విరిగిపోయినా, అరిగిపోయినా, కరిగిపోయినా, నష్టం – పల్ప్ కుహారానికి దగ్గరగా ఉంటే, ముందు మూల చికిత్స చేయించుకుని, (రంగు పళ్లకు అక్కరలేదు, పంటి మూలం ఆరోగ్యంగా వుంటే) కొంత విరామం తర్వాత పంటి తొడుగులు చేయించుకోవాలి. ఆరోగ్యంగా వున్న పంటికి ‘మూల చికిత్స’ (ఆర్. సి. టి) అవసరం లేదు. ఇలాంటి చికిత్స వల్ల జీవితాంతం గట్టి పదార్థాలను సైతం హాయిగా నమిలే పరిస్థితి ఏర్పడుతుంది.

~

కట్టుడుపళ్లు

ప్ర: డాక్టర్ గారూ నమస్కారం. నేను నెలక్రితం నా దవుడలోని పుచ్చిన పళ్ళను తీయించుకుని ముందువైపు పళ్ళు కట్టించుకున్నాను. అవి బాగానే వున్నాయి. అలగే వెనకపళ్ళు కూడా తీయవలసి వచ్చి కొత్తగా పళ్ళ సెట్ చేసి అమర్చారు. అవి రోజూ పొద్దున్నే పెట్టుకుంటున్నా. కానీ ఏదైనా తినేటప్పుడు పదార్ధాలు అంగిట్లో పళ్ళ ప్లాస్టిక్ సెట్ క్రిందికి వెళ్లి ఇబ్బంది వుంది. తిన్న ప్రతిసారీ తీసి క్లీన్ చేసి పెట్టుకోవలసిన పరిస్థితి. పైగా నాలుక దురద కూడా పెడుతున్నది. దానివల్ల పళ్ళ సెట్టు పెట్టుకోవడం మానేసాను. 1) ఈ కట్టుడు పళ్ళు వల్ల మంచిపళ్ళకు హానికలుగుతుందా? 2) నాలుక ఎందుకు దురద పెడుతున్నది? దయచేసి వివరించగలరు.

రవికుమార్ (కోసూరి జయసుధ) ఏలూరు.

జ ) రవికుమార్ గారు, మీ సమస్యలను అర్థం చేసుకున్నాను. అలాగే కట్టుడు పళ్ళ విషయంలో మీకు సరైన అవగాహన లేదని, మీ సమస్యలను మీ దంతవైద్యుడికి మీరు సరిగా వివరించలేదని అర్థం అవుతున్నది. అలా అని మిమ్ములను నేను తప్పు పట్టబోవడం లేదు. విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

ముందుగా మీరు గుర్తుపెట్టుకోవలసిన అంశం ఒకటుంది. అదేమిటంటే, కట్టుడు పళ్ళను, సహజదంతాలతో నూటికి నూరు శాతం సమానంగా పోలిక పెట్టుకోకూడదు. అంగుటికి డెంచర్ ప్లేట్‌కు మధ్య ఆహార పదార్ధాలు ఇరుక్కుంటున్నాయంటే, అది ఇంప్రెషన్ (కొలతలు) తీసుకోవడంలో లేదా తయారీలో లోపం కావచ్చు. ఈ సమస్యకు పరిష్కారం పళ్ల సెట్టు పెట్టుకోవడం మానేయడం కాదు, మీ దంత వైద్యునికి మీ సమస్యను వివరించి సరిచేసుకోవడం. అయినా ఈ ఆధునిక దంతవైద్య రంగంలో ఇంకా మంచి ఆధునిక పద్ధతులు వచ్చాయి కదా, ఒకసారి మీ డెంటిస్ట్‌ను అడిగి చూడండి.

పళ్ళు లేని చోట కట్టుడుపళ్లు పెట్టుకోకుంటే కొంతకాలానికి ఉన్న సహజదంతాలు పక్కకు లేదా క్రిందికి జరిగి తర్వాత వాటిలో కదలికలు ఏర్పడి ఊడిపోయే ప్రమాదం వుంది.

ఇకపోతే, నోటిలో నాలుక, పెదవుల లోపలిభాగం, బుగ్గల లోపలిభాగం సున్నితమైన భాగాలు. ఒకోసారి డెంచర్ రాపిడి వల్ల దురద, మంట వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ దంతవైద్యుల దృష్టికి తీసుకు వచ్చి పరిష్కార మార్గాలు పొందవచ్చు. పదేపదే కట్టుడుపళ్లను తీసి పెట్టుకోవడం మూలాన, త్వరగా దవడపై వాటి పట్టుకోల్పోయి కదలికలు కనిపించవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. మీకు మరింత సమాచారం కావాలంటే నాకు స్వయంగా ఫోన్ చేయండి.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురవారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

Exit mobile version