దంతవైద్య లహరి-21

4
2

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

అడ్డ చుట్ట – అంగుటి కాన్సర్!:

ప్ర: సార్ కొన్ని ప్రాంతాలలో చుట్ట కాల్చే అలవాటు వున్నవారిలో కొందరు, నిప్పు వున్న భాగాన్ని నోటిలో పెట్టుకుని పొగపీల్చడం నేను కళ్లారా చూసాను. మరి, అలంటి వారికి దంత సమస్యలు ఉండవా?

శ్రీమతి మాలతి, టీచర్, విశాఖపట్నం.

జ: మాలతిగారూ.. నలుగురికీ ఉపయోగపడే సందేహాన్ని వెలిబుచ్చిన మీరు అభినందనీయులు. సిగరెట్లు, చుట్ట, బీడీ వంటి నిరంతర ధూమపానప్రియులకు అందరికీ, దంతసమస్యలు, చిగురు సమస్యలే కాదు, ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక అడ్డ చుట్ట తాగేవారి విషయం చెప్పాల్సి వస్తే ఈ అలవాటు వల్ల కూడా అతి ప్రమాదకరమైన శరీర సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం వుంది.

నదీ పరివాహక ప్రాంతాలలోను, ఇతర చలి ప్రదేశాలలోనూ నివసించే వృత్తిపరమైన కార్మికులు శరీరంలో వేడి పుట్టడానికి, ఇలాంటి అలవాట్లకు బానిసలవుతారని చెబుతారు. శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు ఉదాహరించదగ్గ ప్రాంతాలలో కొన్ని మాత్రమే! ఈ అలవాటు కేవలం గ్రామీణులకో, కార్మిక – కర్షకులకో మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే!

టిప్-టాప్ వ్యక్తులలో సైతం ఈ అలవాటు (తక్కువశాతం) వుంది. లేదంటే కొందరికి అవసరం, మరికొందరికి ఫ్యాషన్. కొందరు తాగేది నాటు చుట్ట అయితే, బడాబాబులు తాగే చుట్ట, కంపెనీలలో తయారైవచ్చే ఆధునిక ఫ్యాషన్ చుట్ట.

అడ్డ చుట్ట అలవాటు వల్ల కమిలిన అంగుటి భాగం

సాధారణంగా చుట్ట అలవాటు వున్న వారి పళ్ళు రంగు మారిపోతుంటాయి. కొందరి పళ్లు, మచ్చలు మచ్చలుగా ఏర్పడితే మరికొందరికి పళ్ళు మొత్తం రంగు మారి అసహ్యంగా కనిపిస్తాయి. చుట్ట ద్వారా విడుదల అయ్యే నిరంతర వేడిమి, చిగుళ్ల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా చిగుళ్లు వ్యాధిగ్రస్థమై దౌడలలోని పళ్లల్లో కదలికలు ఏర్పడతాయి. తర్వాత ఊడిపోవడం కూడా జరుగుతుంది.

అడ్డ చుట్ట అలవాటు – అంగుటిపై ప్రభావం

ఇక, అడ్డ చుట్ట విషయానికి వస్తే, ఇది బహు ప్రమాదకరమైన అలవాటు. నిప్పు భాగం నోటిలో పెట్టుకుని పొగ పీల్చడం మూలాన, నిప్పు వేడిమికి సున్నితమైన నోటి భాగాలు – అంగుటి, నాలుక, లోపలి బుగ్గలు, నాలుక క్రింది భాగము, పెదవులు కమిలి, తర్వాత పండుగా మారతాయి, ఆ తర్వాత అది కాన్సరుగా రూపాంతరం చెందే అవకాశం వుంది. ఈ విధంగా తరచుగా అంగుటి కాన్సరు, నాలుక కాన్సరు, ఏర్పడుతుంటాయి. నోటి కాన్సరు రావడానికి గల అనేక కారణాలలో ‘అడ్డ చుట్ట’ ఒకటిగా, శ్రీకాకుళం ప్రపంచ కాన్సరు చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిందంటే, అక్కడ ఈ అలవాటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు!

అందుకే ఈ విషయం ప్రజలలో ఇంకా ఎక్కువ అవగాహన తీసుకురావలసిన అవసరం వుంది.

~

పొడుగు డౌడ:

ప్ర: మా అబ్బాయికి క్రింది దౌడ పెద్దగా, పొడవుగా, ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. నలుగురి మధ్య గడపడానికి, మాట్లాడడానికి సాహసం చేయడు. ఎప్పుడూ ఒకటే ఆలోచనలో ఉంటాడు. ఈ పరిస్థితిని సరిచేసే అవకాశం ఉందా, డాక్టర్ గారూ?

– పరిపూర్ణ. చింతా, మల్కాజగిరి.

జ: పరిపూర్ణ గారూ, మీ అబ్బాయి ఎదుర్కొంటున్న సమస్య తక్కువశాతం మందిలో కనిపిస్తుంది. దీనిని గురించిన సరైన అవగాహన లేక, దీనికి చికిత్స ఉండదని, వున్నా సామాన్యులకు ఈ చికిత్స అందుబాటులో ఉండదని అనుకుంటారు. సమస్యను అలానే భరిస్తారు తప్ప, దీనికి కూడా మంచి చికిత్స ఉందని తెలుసుకోరు. ఇలా దౌడ పొడవుగా ఉన్నవారిలో, కేవలం దౌడ సమస్య మాత్రమే కాదు, సహజంగా ఆనుకోవలసిన దంతాలు ఆనుకోవు. ఇలా అనుకోకపోవడాన్ని ‘మాల్ అక్లూషన్’ అంటారు. ఈ సమస్య వున్న వాళ్ళు ఆహార పదార్థాలను సరిగా నమలలేరు. అంత మాత్రమే కాదు, దౌడ కీలులో (టి.ఎం.జె) నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రెండు సమస్యలను అధిగమించడానికి ఇద్దరు దంతవైద్య నిపుణుల ద్వారా చికిత్స అవసరం అవుతుంది.

పొడుగు డౌడ

ఈ ఇద్దరిలో ఒకరు ‘మాగ్జిలో ఫేషియల్ సర్జన్’, రెండవవారు ‘ఆర్థోడాంటిస్ట్’. ఈ ఇద్దరి పర్యవేక్షణలో అందమైన ముఖం ఏర్పడడమే గాక, దంతాలు ఒకదానికి మరొకటి ఆనుకుని (నార్మల్ అక్లూసన్) ఆహార పదార్థాలను, సునాయాసంగా నమిలి తినే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ ఆధునిక దంతవైద్యరంగంలో, సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. సకాలంలో మేల్కొని, సరైన దంతవైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా ఫలితాలు సుగమమవుతాయి. ఈ చికిత్సలో, చికిత్స చేసే వారి పాత్ర ఎంత ముఖ్యమో, చికిత్స చేయించుకునే వారి పాత్ర కూడా అంతే ముఖ్యమన్న సంగతి మరువరాదు.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here