దంతవైద్య లహరి-25

0
2

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

మిశ్రమ దంతాలు:

ప్ర: సర్, పిల్లల పళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తరచుగా మిశ్రమ దంతాలుఅనే పదం వినబడుతూ ఉంటుంది కదా! దాని గురించి విపులంగా వివరిస్తారా?

-నాగేందర్. సి.హెచ్., హన్మకొండ.

జ: నాగేందర్ గారూ, మీ సందేహం సహేతుకమైనదే! ఇది పంటి జబ్బులకు సంబందించిన అంశం కాదనుకుని, పెద్దగా ఎవరూ పట్టించుకోరు. విషయం మీద శ్రద్ధ వున్నవాళ్లు తప్పక ప్రతి విషయం తెలుసుకోవాలని తపన పడుతుంటారు. మీరు ఈ రెండవ కోవలోనికి వస్తారు. మంచి విషయం ప్రస్తావించినందుకు మీకు అభినందనలు.

మిశ్రమం అంటే రెండు గాని అంతకు మించిగాని వివిధ పదార్థాల కలయిక. పళ్లకు సంబంధించిన అంశం కాబట్టి, వివిధ రకాల (పాలపళ్ళు – స్థిర దంతాలు) దంతాలు కలసి దౌడలో ఉంటే వాటిని మిశ్రమ దంతాలు అంటారు. నిజానికి దౌడలో పాలపళ్లు గానీ, లేదా పూర్తిగా స్థిరమైన పళ్ళు (పర్మనెంట్ టీత్) ఉండాలి.

కానీ, ఒక వయసులో రెండు రకాల పళ్ళు వుండే అవకాశం వుంది. దీనికి ప్రధాన కారణం, ఊడిపోవలసిన పళ్లు ఊడిపోకముందే, అదే స్థానంలో రావలసిన స్థిర దంతాలు పైకి వచ్చేస్తే, ఈ పరిస్థితిని మిశ్రమ దంతాలు (మిక్సెడ్ డెంటిషన్) అంటారు. ఇలాంటి పరిస్థితిలో దౌడలోని పళ్ళు గుంపులుగా ఉంటాయి లేదా ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. సాధారణంగా పాలపళ్ళు పెదవుల వైపు, పర్మనెంట్ పళ్ళు నాలుక వైపు ఉంటాయి. ఇలా మిశ్రమ దంతాలు, గుంపులుగా ఉండడం గాని, రెండు వరుసలలోగాని ఉంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. అవి ఏమిటంటే –

నోటి దుర్వాసన:

పళ్ళు ఒక దాని మీద ఒకటి గానీ, ఒక దాని వెనుక ఒకటి ఉన్నా గానీ, మనం తినే పదార్థాలకు సంబందించిన ఆహారపు అణువులు, లేదా పీచు పదార్థాలు శుభ్రం చేసుకోవడానికి వీలు కాకపోయినా, సరిగా శుభ్రం చేసుకొనకపోయినా, ఆ పదార్ధాలు కుళ్ళి, ఆ పైన నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ పరిస్థితి పిల్లలకు హైస్కూల్ స్థాయిలోనూ, జూనియర్ కళాశాల స్థాయిలోను ఎదురయ్యే అవకాశం వుంది. దీని వల్ల ఇలాంటివారిని సహాధ్యాయులే కాకుండా, ఉపాధ్యాయ పెద్దలు కూడా అసహ్యించుకునే అవకాశం వుంది.

పిప్పిపన్ను వ్యాధి:

పళ్ళ మధ్య చిక్కుకున్న ఆహార పదార్థాలు,శుభ్రతకు నోచుకొనకపోవడం వల్ల ఆహారపదార్థాలు కుళ్ళి, నోటిలో సహజంగా వుండే కొన్ని వ్యాధిని కలుగజేసే బాక్టీరియాల రసాయనిక చర్యల మూలంగా, కొన్ని రకాల ఆమ్లాలు విడుదల అవుతాయి. ఈ ఆమ్లాలలో, పంటి పింగాణీ పొర కరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. తద్వారా పంటి రంధ్రాలు ఏర్పడడం, తర్వాత అవి పిప్పి పళ్ళుగా రూపాంతరం చెందడం జరుగుతుంటుంది. ఆ తర్వాత పంటి మూలం చివర పుండు ఏర్పడడం, తద్వారా చీము – నెత్తురు స్రవించడం జరుగుతుంటుంది.

దౌడ బయట పాలపళ్లు, దౌడ లోపల రాబోయే స్థిరమైన పళ్లు (పర్మనెంట్ టీత్)

చిగురు వ్యాధి:

మిశ్రమ దంతాల విషయంలో సరైన అవగాహన లేక పంటి పరిశుభ్రత విషయంలో, లోపం జరిగి, దానికి అశ్రద్ధ తోడై, పంటి గార (టార్టార్/కాలిక్యులస్) ఏర్పడి చిగురు వాపుకు కారణం అవుతుంది. అది మరింత అశ్రద్థకు లోనైతే వ్యాధి ముదిరి పన్ను కదిలే ప్రమాదం ఉంటుంది.

సమస్య మరింత జటిలం కాకుండా ఏమి చేయాలి?:

  1. దంతధావనం శాస్త్రీయ పద్ధతిలో జరగాలి.
  2. పళ్ళు తోముకున్నప్పుడు, వేలితో చిగుళ్ళను కూడా రుద్దుకోవాలి.
  3. ఎటువంటి ఆహార పదార్థాలు తిన్నా, పానీయాలు త్రాగినా, వెంటనే బాగా నోరు పుక్కిలించాలి.
  4. రోజుకు రెండు సార్లు, ఉప్పు నీటితో గానీ, ఔషధపరమైన పుక్కిలించే ద్రావణంతో పుక్కిలించాలి.
  5. ఊడిపోవలసిన పన్ను ఊడనప్పుడు, దంతవైద్యులను సంప్రదించి, అలాంటి పళ్ళు తీయించేయాలి.
  6. పళ్లకు ‘గార’ ఏర్పడినట్లు గమనిస్తే, వెంటనే శుభ్రం చేయించుకోవాలి.

~

నాలుక బద్దలు:

ప్ర: నాలుక గీసుకోవడానికి, నాలుక బద్ద (టంగ్ క్లినర్) తప్పనిసరి అంటారా?

జ: నాలుకను గీసుకోవడం వెనుక అర్థం ఏమిటి? నాలుక మీద ఏర్పడిన తెల్లని లేదా ఇతర రంగుల పాచిని, పూర్తిగా శుభ్రం కావడం కోసం నాలుక క్లిన్ చేసుకుంటారు. అది నాలుక బద్దతోనే సాధ్యం. బ్రష్ వాడని కొందరు తాటి ఆకుతో నాలుక గీసుకుంటారు. ఇలాంటి వారు జాగ్రత్త వహించకపోతే, నాలుకకు గాయమయ్యే ప్రమాదం వుంది. పదునుగా వుండేవాటితో నాలుక గీసుకోకూడదు. ఇది టంగ్ క్లీనర్లకు కూడా వర్తిస్తుంది.

కొంతమంది చేతివేళ్ళతో విన్యాసాలు చేస్తారు. ఇది పూర్తిగా అశాస్త్రీయం, మంచిది కాదు. దంతధావనం పూర్తి ఆయిన వెంటనే నాలుక క్లీన్ చేసుకోవాలి. నాలుకను అశ్రద్ధ చేయడం అసలు మంచిది కాదు!

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here