[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]
పళ్ళ మధ్య ఖాళీలు
ప్రశ్న: డాక్టర్ గారూ, నాకు ఈ మధ్య పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే దాని వల్ల పంటినొప్పి ఏమీ లేదు. మరి నొప్పి లేదు కదా! దీనికి చికిత్స అవసరమా? తెలియజేయగలరు.
-శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, ఆర్మూర్ (గుడివాడ).
జ: నాగలక్ష్మి గారూ, నొప్పి ఉంటేనే చికిత్స లేకుంటే అవసరం లేదు, అన్న ఆలోచన కరెక్టు కాదు. నార్మల్‌గా వున్న పలువరుసలో ఎలాంటి మార్పులు వచ్చినా అవి ఆలోచించదగ్గవే! అందులో పళ్ళమధ్య ఖాళీలు ఉండడం/ఏర్పడడం ఒక మార్పుగా గుర్తించాలి. దంతాల నొప్పి ఉంటే ఎవరైనా తక్షణమే స్పందించి దంతవైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందే ప్రయత్నం చేస్తారు. దంతాల మధ్య ఖాళీలను కొందరు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే ప్రాథమిక దశల్లో నొప్పి ఉండదు కనుక! కానీ, దంతసౌందర్యం గురించి సీరియస్‌గా తీసుకునే వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు/బాలికలు, పళ్ళ మధ్య ఖాళీలు గమనించిన వెంటనే తప్పకుండా దంతవైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడమో లేక అవసరం అయినా చికిత్స చేయించుకోవడమో చేస్తారు. పళ్ళ మీద, పలువరుస మీద, దంత సౌందర్యం మీద పెద్దగా ఆసక్తి లేనివారు ఇవేమీ పట్టించుకోరు జరగాల్సిన నష్టం జరిగేవరకూ.
పళ్ళ మధ్య ఖాళీలు మూడు రకాలుగా మనం గమనించవచ్చు:
- సహజంగానే పళ్ళ మధ్య ఖాళీలు ఉండడం.
- పిల్లల్లో వుండే కొన్ని దురలవాట్ల మూలాన పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడతాయి.
- చిగురువ్యాధుల వల్ల, దవుడ ఎముక సమస్య వల్ల పళ్ళ మధ్య ఖాళీలు రావచ్చు.
మామూలుగా పాలపళ్ళల్లో (మిల్క్ టీత్/డెసిడ్యూ యస్ టీత్) ఖాళీలను సీరియస్‌గా పరిగణించరు. ఎందుచేతనంటే పాలపళ్ళు తాత్కాలికమైనవి, ఎక్కువకాలం దౌడలో వుండవు. అవి రాలిపోయి వాటి స్థానంలో వచ్చే స్థిరదంతాలు (పర్మనెంట్ టీత్) బ్రతికినంత కాలం (దంతసంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే) ఉంటాయి. అందుకే వీటికి వచ్చే ఎలాంటి సమస్యనైనా తక్షణమే పరిష్కరించుకోవాలి. ఈ నేపథ్యంలో, ఒకోసారి సహజంగానే పళ్ళ మధ్య ఖాళీలు ఉంటాయి. దీనికి కారణం దౌడ సహజంగానే వుండి పళ్ళు చిన్నగా ఉండడం, లేదా దౌడ మామూలుగానే వుండి వుండవలసినన్ని పళ్ళు ఉండక పోవడం. ఇవి రెండూ కూడా జన్యు ప్రధానమైన సమస్యలుగా పరిగణించవచ్చు. ఇలాంటి సమస్యను గమనించిన వెంటనే సంబంధిత దంతవైద్యులను (ఆర్థోడోంటిస్ట్స్ లేదా ఓరల్ సర్జన్స్) సంప్రదించడం ద్వారా సకాలంలో పలువరుసను సహజంగా కనిపించేలా చికిత్స పొందవచ్చు. ఇలా కాకుండా పలువరుస మధ్యలో ఒకటి రెండు పళ్ళు ఊడిపోయినప్పుడు,వాటి స్థానంలో కృత్రిమ దంతాలు అమర్చుకోనప్పుడు కూడా పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడవచ్చు. దీనికి కూడా సకాలంలో స్పందించగలిగితే చికిత్సద్వారా అందమైన పలువరుసను పొందవచ్చు.
కారణం ఏదైనా కొంతమంది పిల్లలకు బొటనవ్రేలు చీకే అలవాటు ఉంటుంది. సహజంగా గానీ, చికిత్సవల్ల గానీ కొద్దిరోజుల్లోనే ఈ అలవాటును మాన్పించవచ్చు.
కొందరు పెద్దవాళ్లయినా ఈ అలవాటును మానుకోలేరు. ఇలాంటివారిలో, పై దౌడ ముందు భాగం గూడుగా మారి ముందరి పళ్ళ (ఇన్సిజార్స్) ఖాళీలు ఏర్పడవచ్చు.
ఇలా ఏర్పడడాన్ని శాస్త్రీయంగా ‘డయాష్టిమా’ అంటారు. ఇది ముఖారవిందాన్ని చెడగొడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో సకాలంలో ఈ అలవాటును మాన్పించి చికిత్స చేయించాలి. ఆర్థోడాంటిక్ చికిత్సద్వారా ఇలాంటి పలువరుసను సరిచేయించుకోవచ్చు. వయసు ముదరక ముందే చికిత్స పూర్తికావాలి.
పైన చెప్పిన విషయాలకు భిన్నంగా, మధ్య వయసులో పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడితే అది ఖచ్చితంగా చిగురు వ్యాధి వల్ల గాని, పంటినీ దౌడతో కలిపివుంచే ‘పెరియో డాంటల్ పొర’ వ్యాధిగ్రస్థం కావడం వల్లగాని పళ్ళమధ్య ఖాళీలు వచ్చే అవకాశం వుంది. ప్రాథమిక దశల్లో దీనివల్ల నొప్పి రాకపోవచ్చు, చిగుళ్లు వాయకపోవచ్చు, అంత మాత్రమే కాకుండా, చిగుళ్ళనుండి రక్తం రాకపోవచ్చు, నోటి దుర్వాసన రాకపోవచ్చు. అలా అని అశ్రద్ధ చేస్తే క్రమంగా పళ్ళ మధ్య ఖాళీలు ఎక్కువై, చిగుళ్ళు వాచి చీము, నెత్తురు స్రవించడమే గాక నోటినుండి దుర్వాసన వచ్చే అవకాశం వుంది. అందుచేత ఇలాంటి సమస్య వున్నవారు తక్షణమే దంత వైద్యులను (పెరియో డాంటిస్టులు) సంప్రదించి తగిన చికిత్స చేయించుకుని, వారి సూచనలను తూ.చ. తప్పకుండా పాటించాలి. నొప్పిలేదని అశ్రద్ధ చేయడం సరైన పద్ధతి కాదు.
~
ప్ర: డాక్టరు గారు.. మా మనవడి వయసు ఏడు సంవత్సరాలు. ముందరి పాల పళ్ళు ఊడిపోయి, మళ్ళీ రావడం లేదు. కానీ చిగురు కింద పన్ను వున్నట్టుగా చిగురు కాస్త ఉబ్బి ఉంటుంది. సకాలంలో పళ్ళు రాకుంటే తర్వాత ఎగుడుదిగుడు పళ్ళు, వంకరటింకర పళ్ళు వస్తాయంటారు కదా! మరి, మా ఈ సమస్యకు పరిష్కార మార్గం చెబుతారా?
– శ్రీమతి సీతామహాలక్ష్మీ, సికింద్రాబాద్.
జ: మీ మనవడి పళ్ళ విషయంలో మీ ఆందోళనను అర్థం చేసుకున్నాను. కొంతమంది పిల్లల్లో ఇలా జరగడం సర్వసాధారణం. దీనికి కారణం ‘ఫలానా’ అని నిర్ణయించలేము. కానీ, కాల్షియం లోపం వల్లగాని, శరీరంలోని కొన్ని మార్పుల వల్ల చిగురు దళసరిగా మారడం వల్ల గాని పన్ను బయటికి రాకపోవచ్చు. ఆడపిల్లల విషయంలో ఇది మరీ ఆందోళన కలిగిస్తుంది.
నిజానికి పాలపళ్ళు రాకడ బిడ్డ ఆరవ నెలలో ప్రారంభమై, రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి పై దౌడలో పది, క్రింది దౌడలో పది, మొత్తం ఇరవై పళ్ళు వచ్చి ఆ పాలపళ్ళు, ఆరో సంవత్సరం వచ్చేవరకూ ఎలాంటి మార్పులకు లోనుకావు. ఎక్కువ శాతం పిల్లల్లో ఆరవ సంవత్సరంలో ముందరి కొరికే పాలపన్ను ఊడి దాని స్థానంలో పర్మనెంట్ పన్ను రావాలి. అది రానప్పుడు, ఆరు నెలల నుండి సంవత్సర కాలం దాని రాకడ కోసం ఎదురుచూడవచ్చు. అప్పటికీ రానప్పుడే చిన్నపిల్లల దంత వైద్యులను సంప్రదించాలి.
సాధారణంగా దంతవైద్యులు అందుబాటులోలేని పల్లెటూళ్లలో నాటు వైద్యులు వరిగింజతో చిగురును చీల్చి పన్నును బయటికి తీస్తారు. కానీ ఇది పిల్లల విషయంలో క్రూరమైన హింస! అపరిశుభ్ర ప్రక్రియ. దీనివల్ల ఇతర చిగురు సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
దంతవైద్యులు ముందు ఎక్స్-రే ఫిల్మ్ ద్వారా చిగురు క్రింద పన్ను ఉన్నట్టు నిర్ధారణ అయినప్పుడు, చిగురును తిమ్మిరి చేసి ఎలాంటి నొప్పి లేకుండా చిన్న శస్త్ర చికిత్స ద్వారా బయటికి తీస్తారు. ఇది శాస్త్రీయమైన పద్దతి. ఇది నాటువైద్యులు చేపట్టవలసిన వైద్యం కానే కాదు!
ఒక్కోసారి, తగు మోతాదులో కాల్షియం వాడడం వల్ల సహజంగా పళ్ళు బయటికి వచ్చిన సంఘటనలు కూడా వున్నాయి. ఏదైనా దంతవైద్యుల సలహామేరకు తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి రావాలి. ఇది కంగారు పడవలసిన విషయం కానేకాదు. ఇలా సకాలంలో పన్ను రాకపోవడాన్ని ‘డిలేడ్ ఈరఫ్స్‌న్’ అంటారు.
డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002
~
పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.