దంతవైద్య లహరి-5

7
3

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

పళ్ళు జివ్వుమనటం

ప్రశ్న: డాక్టర్ గారూ, నమస్కారం. నా వయసు 70 సంవత్సరాలు. దంతాలకు సంబంధించి మొన్నటి వరకూ నాకు ఎలాంటి సమస్యలూ లేవు. కానీ ఈ మధ్య పళ్ళు జివ్వుమని గుంజుతున్నవి. చల్లటి పదార్థాలు తినలేకపోతున్నాను, చల్లటి పానీయాలు తాగలేకపోతున్నాను. చల్లటి గాలి భరించలేకపోతున్నాను. ఇప్పటివరకు దంతవైద్యులకు చూపించలేదు. ఈ పళ్ళు గుంజడం తగ్గడానికి తగిన సూచనలు చేయగలరు.

-శ్రీ సి. హెచ్. శ్రీనివాస మూర్తి, పరిమళ కాలనీ, హన్మకొండ.

జ: అయ్యా, మూర్తి గారూ, డెబ్భై ఏళ్ళు వచ్చేవరకూ మీకు ఎలాంటి దంతసమస్య లేదంటే, మీ దంత సంరక్షణ విషయంలో, నోటి పరిశుభ్రత విషయంలో మీరు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను దంతవైద్యుడిగా నేను అంచనా వేయగలను. ఈ విషయంలో మీకు అభినందనలు తెలియజేయకుండా ఉండలేను. కానీ, దంతసమస్యను పెట్టుకుని, దానికి తగిన పరిష్కార మార్గం కోసం ఆలోచించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా. దంత చికిత్సా విధానంలో ఇన్ని ఆధునిక సదుపాయాలూ వచ్చినప్పటికీ, వాటిని ఉపయోగించుకోకుండా, సమస్యను తీవ్రతరం చేసుకుంటూ బాధపడడం ఏమిటో అర్థం కాదు. ఈ విషయంలో, అక్షరాస్యులకి, నిరక్షరాస్యులకు తేడా లేకుండా పోయింది. ఇది బాధాకరం.

ఇక పొతే, మీ పళ్ళు ‘జివ్వు’మని గుంజడానికి, దంతధావన విధానంలోనూ మీ నోటి పరిశుభ్రతలోనూ మీ అశ్రద్ధ ఏ మాత్రం కాదు. పైగా ఇది వ్యాధి కాదు.

కొన్ని ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లతో పాటు, వృద్ధాప్యం కారణం అవుతాయి. అయితే వాటిపైన శ్రద్ధ చూపి సకాలంలో చికిత్స చేయించుకుంటే, సమస్య నుండి అతి త్వరగా బయటపడవచ్చు. నమలడం (మాస్టికేషన్) అనే నిరంతర ప్రక్రియ వల్ల, వయసు పెరిగేకొద్దీ పళ్ళు అరిగిపోవడం సర్వసాధారణం. అలాగే కొన్ని నరాల బలహీనతల వల్ల నిద్రలో పళ్ళు కొరికే (బ్రక్సిజం) అలవాటు వల్ల కూడా, వయసుతో నిమిత్తం లేకుండా పళ్ళు అరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే, అదే పనిగా హార్డ్ బ్రష్‌తో గంటల కొద్దీ బ్రష్ చేసేవాళ్ళల్లో కూడా ఈ పళ్ళు అరిగి పోవడం (అట్రిషన్) సర్వసాధారణం.

ఇరోసన్

అంత మాత్రమే కాదు, అదే పనిగా పచ్చి వక్క తినే అలవాటు ఉన్నవారిలో కూడా, వయసుతో సంబంధం లేకుండా ఆడ మగా తేడా లేకుండా పళ్ళు అరిగిపోతాయి. ఈ అరుగుదల అంతా పంటి నమిలే (అక్లూసల్) భాగాలకు పరిమితం.

అలా కాకుండా మనకు కనిపించే పంటి శరీరభాగం (ఫెషియల్) అధికంగా ఒక వైపే బ్రష్ చేయడం వల్ల కూడా నిలువుగా అరిగి పోతుంది. ఇలా అరిగిపోవడాన్ని‘అబ్రేషన్’ అంటారు. అలాకాకుండా, ‘ఎసిడిటీ’ సమస్యతో బాధ పడుతున్న వారిలో, చిగురు చివరి పంటి భాగం ఆమ్లాల వల్ల పన్ను కరిగి పోతుంది. ఆమ్లాలలో పంటి పింగాణీ పొర కరిగిపోయే గుణాన్ని కలిగి ఉండడమే దీనికి ముఖ్య కారణం!

అయితే, పన్ను అరిగిపోవడం/కరిగిపోవడానికీ, పళ్ళు జివ్వుమనడానికి సంబంధం ఏమిటి? పెద్ద సంబంధమే వుంది.

పళ్ళు అడ్డంగా అరిగినా, నిలువుగా అరిగినా, ఆమ్లాల వల్ల కరిగినా, పంటి పింగాణీ పొర స్థాయిలో నొప్పిగానీ, జివ్వుమని గుంజడం గాని ఉండదు. అరుగుదల పింగాణీ పొరను దాటినవెంటనే పళ్ళు జివ్వుమని గుంజడం మొదలు పెడతాయి. సమస్య ఇక్కడితో ప్రారంభం అవుతుంది. ఈ స్థాయిలో కూడా పట్టించుకోకుంటే దీనికి నొప్పి తోడై భరించలేని పరిస్థితికి చేరుకుంటుంది.

పళ్ళు గుంజడం మొదలు పెట్టగానే కొన్ని ఔషధపరమైన టూత్ పేస్టులు వల్ల సమస్య నుండి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ఉదా: కాల్గెట్ సెన్సిటివ్ టూత్ పేస్ట్, సెన్సో డైన్ టూత్ పేస్ట్. ఇంకా అనేక రకాల టూత్ పేస్టులు మందుల దుకాణాలలో లభ్యం అవుతున్నాయి.

పళ్లు నిలువుగా అరిగిపొవడం (ఎబ్రెసన్)

ఇలాంటి జివ్వుమనే పళ్లకు పర్మనెంట్ చికిత్స, పంటి పరిస్థితిని బట్టి, మూల చికిత్స (రూట్ కెనాల్ ట్రీట్మెంట్) ఆ తర్వాత దానిపై క్రౌన్/కేప్/లేదా పంటి తొడుగు. సాధారణంగా ఈ చికిత్స జరిగిన తర్వాత ఎప్పటికీ, పంటి నొప్పి గాని పళ్ళు జివ్వుమనడం గాని ఉండదు. ఒకవేళ తిరిగి పంటినొప్పి వచ్చినా, పళ్ళు జివ్వుమన్నా, మూల చికిత్స ఫెయిల్ అయినట్టుగా భావించాలి.

~

పాలపళ్ళు – స్థిరదంతాలు

ప్ర: సార్, దంతాల విషయంలో కొన్ని సందేహాలు వున్నాయి.

1) పిల్లల దంతాలకూ, పెద్దల దంతాలకు, ముఖ్యమైన తేడా ఏమిటి? 2) డెంటల్ ఫార్ములా అంటే ఏమిటి? దీని అవసరం ఏమిటి?

-శ్రీమతి స్వాతి. ఎమ్., సఫిల్ గూడ, సికింద్రాబాద్.

జ: మీ ప్రశ్నకు ఇచ్చే సమాధానం ఇంచుమించు అందరికీ అవసరమైనదే! అయితే పిల్లలను కని పెంచిన తల్లిదండ్రులకు,ఈ తేడాలు చాలా మట్టుకు తెలుస్తాయి.

ఎందుకంటే పిల్లల ఎదుగుదల కళ్లారా చూస్తారు కనుక ఇవి తెలియకుండా వుండవు. అయినా మీ సందేహాన్ని నివృత్తి చేయడం నా బాధ్యత.

చిన్నతనంలో శరీరం చిన్నగా ఉంటుంది కనుక దానికి తగ్గట్టుగానే పిల్లల దౌడలు (జాస్) కూడా చిన్నగా ఉంటాయి. పాలు తాగే వయసులో నమిలే అవసరం ఉండదు కనుక ఆరునెలల వయసు వచ్చేవరకూ పిల్లల దౌడల్లో పళ్ళు వుండవు.

ఆరునెలల వయసులో పిల్లలకు పళ్ళు రావడం మొదలుపెట్టి, రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి పై దౌడలో (మాక్సిలా) పది, క్రింది దౌడలో (మాండిబుల్)లో పది మొత్తం రెండు దౌడలలో కలిసి ఇరవై పళ్ళు ఉంటాయి. ఇవి తెల్లగా పరిమాణంలో చిన్నగా ఉంటాయి. వీటిని పాలపళ్ళు (మిల్క్ టీత్) లేదా ‘డెసిడ్యూఆస్ టీత్’ అంటారు. ఇవి మెత్తటి ఆహార పదార్ధాలు నమలడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వీటి మనుగడ తాత్కాలికం.

స్థిరదంతాలు పాలపళ్లకు భిన్నంగా పై దౌడలో పదహారు, క్రింది దౌడలో పదహారు మొత్తం ముప్పై రెండు పళ్ళు ఉంటాయి. వీటిల్లో పైన పద్నాలుగు, క్రింద దౌడలో పద్నాలుగు, మొత్తం రెండు దౌడలలో కలసి ఇరవై ఎనిమిది పళ్ళు, పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి రావడం పూర్తి అవుతుంది. జ్ఞాన దంతాలుగా చెప్పబడే ఆఖరి దంతాలు (పై దౌడలో కుడి ఎడమ, క్రింది దౌడలో కుడి, ఎడమ) మొత్తం నాలుగు దంతాలు సుమారుగా 17-21 సంవత్సరాల మధ్యకాలంలో వస్తాయి.

కానీ ఇవి ఆహార పదార్థాలు నమిలే విషయంలో ఉపయోగపడవు. మనిషి బ్రతికినంతకాలం, దంతాలు ఆహారపదార్థాలను నమలడానికి ఉపయోగపడతాయి. ఆహరం జీర్ణమయ్యే విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుచేత దంతసంరక్షణ కూడా ముఖ్యమైన అంశంగా భావించాలి.

పరిమాణంలో పాలపళ్ల కంటే స్థిరదంతాలు పెద్దగా ఉంటాయి. అందరి పళ్ళు తెల్లగా ఉండాలన్న నియమం లేదు. ఈ రకంగా పాలపళ్లకు, స్థిరదంతాలకు మధ్య తేడాను గమనించవచ్చు. పళ్ళ తెలుపుదనం పంటి ఆరోగ్యానికి సంకేతం కాదు! రంగుగా వున్న పళ్ళన్నీ వ్యాధిగ్రస్థం అయినట్టు కాదు!!

డెంటల్ ఫార్ములా:

దవుడలలో పంటి ఉనికిని, స్థానాన్ని తెలియజెప్పే విధానాన్ని డెంటల్ ఫార్ములా అంటారు. పళ్ళు పేర్లు రాయకుండా ఒకో పన్నుకు ఒకో నంబరు కేటాయించి సంఖ్యాపరంగా పళ్ళను గుర్తించడానికి, ఏ పన్ను వ్యాధిగ్రస్థం అయిందో తెలుసుకునే సులభ పద్దతి డెంటల్ ఫార్ములా ద్వారా సాధ్యం అవుతుంది. రోగి చికిత్సా నివేదికలో దీనిని దంతవైద్యులు తప్పక వాడతారు.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here