దసరా

0
3

[dropcap]వూ[/dropcap]రోళ్ళతో ఎన్నడూ పూజలు నోస్కోని కేశులు (1) స్వామి గుళ్ళో అరవైమంది విద్యార్థులతో ప్రతిరోజు స్వామివారి కళ్యాణం జరుగుతున్నట్ల కళకళలాడుతూ వుంటాది మా ట్యూషన్. మన భారతీయ సంస్కృతిని సంప్రదాయాలను గౌరవించుకోవాలంటూ సందర్భం వొచ్చినప్పుడల్లా మన మతాలు, భాషలు, సంగీతం, నాట్యం, ఆచారవ్యవహారాలను చర్చకు తెచ్చి, దాన్ల గొప్పదనం గురించి, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గురించి బోధిస్తావుంటాడు మా ట్యూషన్ సారు. అందులో భాగంగానే ‘ఈ పండుగలో మీతో ఒక మంచి ’కార్యక్రమం’ సేపించబోతుండాను. అది మీకు సంతోషంతో పాటు మంచి ఉల్లాసాన్ని కూడా ఇస్తుంద’ని మాలో ఆశను రేకెత్తించి, తన మిత్రగణంతో చర్చలేవో జరుపుతా పథకము రూపొందిస్తుండాడు.

బడిలో- ఇంటికొచ్చే ముందరకాడ రేపట్నుంచి వరసగా పద్దినాలు ‘దసరా’ సెలవులనే సంగతి తెలిపినారు సారొళ్ళు. దాంతో ఒక్కసారిగా బిలబిలమంటూ కొత్త నీళ్ళకి ఎక్కొచ్చిన శ్యాప పిల్లల్లక్క తండ్లాడుకుంట అందరం తరగతి గదిలోనుంచి బయటికొచ్చి ఇంటి దావ పట్న్యాము. సంతోషం పట్ల్యాక కిలకిలమని నగువులు అందరి మొకాల్లో తాండవిస్తావుంటే బడి ప్రాంగణమంతా నడుస్తున్న పూల వనంలా కనపడుతుండాది. ఇంట్లో బంగారం మూటలేవో దాసి పెట్టి మర్సినోళ్ళలక్క ఒకర్నిమించొగరు పరుగులు పెడతావుండాము. అట్లా.. పరుగులు తీస్తూనే ‘ఈ సెలవుల్లో ట్యూషన్ సార్ మనతో సేపించబోయే కార్యక్రమం ఏమైవుంటాదప్పా! ఆట-పాటల పోటీలేమైనా పెట్టబోతున్నాడా! ల్యాక నాటకాలేమైనా ఆడించబోతుండాడా..! యట్ల’ని, తోటి జతాగాళ్ళతో ఆలోశన సేస్తా ఇంటికి సేరుకున్యాను. ట్యూషన్లోకి పొయ్యి ఎవరి తావరాల్లో వాళ్ళు కుసునుకున్నెంక, మమ్మల్ని ‘మహర్ణవమి’

పిల్లలుగా సెయ్యల్లని ఆలోశన సేస్తున్నట్ల సారు విషయం తెల్పినాడు. అప్పటి అయ్యవార్లు ప్రతి దసరా పండక్కి తమ వొద్ద సదువుకునే పిల్లోల్లందరికి విల్లంబులు ధరింపజేపిచ్చి పాంటికీలు పాడిస్తా ఇంటింటికి తిప్పి, ఊరు సిన్నదా.. పెద్దదా అనే దాన్ని బట్టి రొండు రోజులు, మూడు రోజులు గూడ సంబరాలు సేసేవాళ్ళంట. ఆ మరుగున పడిన సాంప్రదాయాన్ని బయటకి తీసి దాని గురించి ఇప్పటి జనాలకి తెలపల్లని మా సారు తాపాత్రం. మిగతా వాటి సంగతేమో గాని, ‘లవకుశ’ల్లక్క విల్లంబులు భుజానేసుకోని ఊర్లో తిరగాలనే మాట భలే బాగా నచ్చింది మా అందరికి. దానికనే సారు ఆమాట తెలిపిన ఎనకనే సంబరంతో సంకలెగరేసినాము.

సారు, పత్తికొండ నుంచి రకరకాల రంగుల కాగితాల కట్టలు, తెల్లకాగితాలు, ఒక అట్ట పెట్టె పిన్నులు, స్టాప్లేరు, కేజి మైదా తెప్పించ్చి, ముందు ‘పాంటికీలు’ తయారు సేతామండని, నాల్గు ఠావుల తెల్లకాగితాల్తో (21 సెం.మీ పొ. 12 సెం. మీ వె) మన పోస్ట్ కార్డంత నోటుబుక్కు తయార్జేసినాడు. పై అట్టకి ఇరువైపుల ‘సరి’ (2) తో ఆకుపచ్చ రంగు కాగితం కరిపిచ్చి అంచుల్కి బంగార్రంగు కాగితాన్ని, మధ్యలో వెండి రంగు కాగితం పూలు అతికించే తలకే, తల..తలా మెరుస్తా భో సింగారమొచ్చింది దానికి. సేతిలో పట్టుకోని సూస్తే ఏదో కొత్త అనుభూతి కలిగింది మనసుకి. ఈ రకంగ మొత్తం ఎంత మంది పిల్లలున్నారో లెక్కేసుకోని ‘సార్’తో పాటు పెద్ద తరగతోళ్ళం మేమందరం కలబడి ఆపొద్దు రేత్రంత పుస్తకాలు తయారు సేసినాము.

మర్సునాడు- మా ‘సారు’ అప్పటి పాత అయ్యవార్లని యందరెందరో కల్సి, సంపాదించుకొచ్చిన పాంటికీల ఒకటి, రొండు భాగాల పద్యాలన్ని, నిన్న తయారుజేసుకున్న పుస్తకాల్లోకి ఎక్కిచ్చుకోని, అందరం రొండు జట్లుగా యిడిపొయ్యి, సారు సెప్పిచ్చినట్ల పలుకుతా సాధన సెయ్యడం మొదల్పెట్టినాము.

ఒకటో బృందం – శ్రీ గణాధీశాయ శివ కుమారాయ, రొండో బృందం- నాగముఖ తుండాయ నాగభూషాయ – ఒకటో బృందం – లోక జనవంధ్యాయ లోలనేత్రాయ. రొండో బృందం- శ్రీ కంఠతనయాయ సృష్టికర్తాయ

ఈ విధంగ గుళ్లో పూజారి సెప్పే శ్లోకాల తీరున ముందు విఘ్నేశుని ప్రార్థన సేసి, అన్సకారి మిగతా దేవుళ్ళ ప్రార్థనలు, అష్టకాలు, కలిగినోళ్ళ మంచితనాన్ని, సేతి పనోళ్ళ గొప్పతనాన్ని తెలిపే పదాల్తో పాటు అట్లే, కడాన దీవెనల్ని.. ప్రతిరోజు సాధన సెయ్యడం మొదల్పెట్టినాము.

ఒక పక్కన సాధన సేసుకుంటూనే, మరో పక్కన మీ పెద్దాళ్ళతో విల్లంబులు సేపిచ్చుకోమన్నాడు సారు. నాను – మా నాయన్ని రొండు దినాల్నుంచి సెవులో జోరీగలక్క ఒకటే తీరంగ పోరితే, పత్తికొండకి పొయ్యి, ఒగ ఎదురు బొంగు కొనుకొచ్చినాడు. దాన్నట్లే మా నాయనతోనే నడీమద్దెల్లేకి కత్తితో సీలిపిచ్చుకోని, నాలుగు దినాలు నీళ్ళలో నానేస్తే దబ్బలు బాగ వొంగుతాయని అంటే, ఎవరు సూడకుండ ఎండపొద్దప్పుడు పొయ్యి సెరువులో మోకాళ్ళ లోతు నీళ్ళలో పెట్టి, తేలకుండ దానిమీద ఒక బండరాయిని పెట్టొచ్చినాను.

నాలుగు నాళ్ళు అయినంక ఆ దబ్బల్ని తెచ్చిస్తే, మా నాయన – దాంట్లో ఒక దబ్బని తీసుకోని అవసరమైనంత వొంచి, ఏలు మందంతో వుండే నులకతో ఆ కడ కొనకి ఈ కడ కొనకి బిర్రుగ బిగిచ్చినాడు. బలంగ గుంజినప్పుడు దబ్బ గూడ ఇరిగే అవకాశముండాదని.. మద్దెల్లోన, రొండుపక్కల కొనలకి, తుంట దబ్బలు జత సేసి సన్నాటి నారతో కాలి కట్టు మాదిరి కట్టి బాగ బందోబస్తు సేసినాడు. అంతేగాక దబ్బకి నడీ మద్దెల్లోన ఒగ బొక్క, దానికి అరడుగు సందు పెట్టి ఆ పక్కొగ బొక్క ఈ పక్కోగ బొక్క.. మొత్తం మూడు బొరకలేసి, ఒక్కోసారి మూడు బాణాలు ఇడ్సేతట్ల మేలగ సేసినాడు. ఇంగ, పోయినేడు ఇత్తనానికని తెచ్చి ఎండనీకని ఇంటిముందుర వారపాకు పై పారేసిన పొడుగాటి సొరకాయని సన్న నారతో సిత్రంగ అల్లికలపై అంబుల బుట్ట తయారుజేసినాడు. నాను – మా నాయన పనితనాన్ని మెచ్చుకోని ‘దీన్లగ్గాని రంగు కాయితాలు కరిపిచ్చి ముస్తాబు సేసినామంటే ధగధగ మెర్సిపోతాయేమో కదా నాయనా!’ అని సంబరపడుతున్నాను.

పాంటికీల సాధనలో ఎవురు ఎవురికి తగ్గడం లేదు. స్పష్టంగా, లయబద్దమైన రీతిలో పలుకుతూ ‘మీ జట్టు గొప్పా! మా జట్టు గొప్పా!’ అన్నట్లు పోటీలుపడి మరీ సాధన సేస్తావుండాము. కొందరు పిల్లోల్లైతే

మొత్తం పాంటికీని కంఠస్థం సేస్తే, పెద్ద తరగతోళ్ళం మేమైతే రొండు పాంటికీలను కూడా కంఠస్థం పట్టేసి జులపాలు ఎగరేస్తా మాకు మేమే సాటి అనే తట్ల వుండాము. మా సారుకి కావాల్సింది కూడా ఇదే! దానికే పోటీలుంటేనే పని మీద శ్రద్ధ చూపి చేపట్టిన కార్యంలో నెగ్గుతామని, ఏ ఏ పిల్లలు యట్లాంటి బుద్ధి కలిగినోళ్ళు! సదువుతో పాటు ఇంగా మిగతా విషయాల్లో గూడ ఎవురెవురు పోటీ పడతావుండారు? ఇవన్ని గమనంలోకి తీసుకోని బృందాన్ని ఏర్పాటు సేసినాడు. ఆ ఆలోశన ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తావుండాది.

పండగ రొండు దినాల ముందునుంచే వుషారుపడితే మంచిదని అందరం కలబడి రంగుకాగితాల్ని, పూలు, పూలతోరణాల రూపంలోన వివిధ రకాలుగా కత్తిరించుకోని, వాటిని ‘సరి’తో విల్లంబులకి అతికిచ్చుకుంటా భో సొగసుగ ముస్తాబు సేస్కుంట వుండాము. శిన్న తరగతి పిల్లోల్లకి సాయమైతుండాము. అట్లే.. శెన్నకేశవ స్వామి గుడిలో కూడ భలే సిత్రంగ అతికించి అలంకారము సేసినాము.

పండుగ నాడు తెల్లారుజామునే లేసి ‘నువ్వు ముందా..! నాను ముందా..!’ అన్నట్ల తయారైపోయి అందరం గుడికాటికి సేరుకున్యాము. నుదుటిన బొట్టు పెట్టుకోని సదువుల తల్లిని పూజించుకున్యాము. శుభ సూచకంగా విల్లంబులకి, పాంటికీలకి పసుపు-కుంకుమలు అద్దుకోని, విల్లంబులు భుజానేసుకోని పాంటికీలు సేతపట్టి ‘రామదండు’లక్క వూర్లేకి బయలెల్లినాము. వూర్లో జనం అట్లే అబ్బురకపొయ్యి నిలబడి సూస్తావుండారు మమ్మల్నందర్ని. ‘ఆహా! పిల్లోల్లందురు విల్లంబులు ధరించి భలే సక్కదనంగ వుండారు కదా! ఆగా.. ఆ మధ్యలో పొయ్యే పిల్లోల్లిద్దరు అచ్చం ‘లవకుశ’ల్లక్క వుండారు కదా! ఇగా.. ఈ పిల్లోన్ని సూడు వుంగరాల జుట్టు వున్నందుకు అచ్చం ‘బాల రామాయణం’లో సిన్న ఎన్.టి.ఆర్ అయ్యేడె! వాడు.. పల్నాటి బాలశంద్రునిలక్క, మరొకడు.. అభిమన్యునిలక్క, ఇట్లా.. వాళ్ల కంటికి నచ్చినోళ్ళని వాళ్ల మనసు మెచ్చినోళ్లతో జమకట్టి మెచ్చుకుంటా వుండారు. వాళ్ళట్ల మెచ్చుకుంటా వుంటే మేము లోలోపలే సంతోషపడతా వుండాము.

ముందరంగ ఊరి పెద్దయిన ఎంకటరెడ్డొళ్ళ ఇంటికాటికి పొయ్యి, ఎనిమిదో తరగతి సదివే అతని కొడుకు కొండారెడ్డిని ముందరుంచుకోని, వాకిలికి ఆపక్క పంచన ఒక బృందం, ఈ పక్క పంచనొక బృందం నిలబడి పదాలు అందుకున్యామిట్లా….

ఒకటో బృందం- శ్రీ గణాధీశాయ శివ కుమారాయ, రొండో బృందం- నాగముఖ తుండాయ నాగభూషాయ

ఒకటో బృందం- లోక జనవంధ్యాయ లోలనేత్రాయ – రొండో బృందం- శ్రీ కంఠతనయాయ సృష్టి కర్తాయ

ఒకటో బృందం- బాగుగా విద్యలకు ప్రౌఢిగా దేవ – రొండో బృందం- విశ్వసింతుము మిమ్ము విఘ్నేశ్వరాయ

ఒకటో బృందం – గజవక్రతుండాయ గణనాయకాయ – రొండో బృందం- గణుతించు నిన్నిపుడు గణదైవతాయ

ఇట్లా… విఘ్నేశుని ప్రార్థన పూర్తి సేసి, ఎనకనే దీవెనలు ఎత్తుకున్యాము…

శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు – ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు

కారుణ్యముగ మీకు కళ్యాణమస్తు – ఆశ్వయుజ శుద్ధ మహర్ణవమి రాగాను

శాశ్వతాశీర్వాద సత్య వాక్యములు – బాలకుల దీవెనలు బ్రహ్మ దేవెనలై

చాల సంతోషులై చెలగుచును మీరు – శ్రీమంతులై మహా శ్రేయస్సు గల్గి

భువిలోన వెలలేని భోగములు గల్గి – పుడమి వర్ధిల్లండి పుణ్యములు గల్గి

ఏడాదికొక పండుగని వచ్చినాము. ఈ సారి రమ్మనక తిరిగి రమ్మనక

అయ్యవారొచ్చిరని అనుమాన పడక – అందముగ అయ్యవార్లను పంపుడింటికిని

అల్లాండ్ల వలె గాదు అలిగి మిమ్మడుగ- చెల్లాండ్ల వలె గాదు చేరి మిమ్మడుగ

అయ్యవారికి చాలు ఐదు వరహాలు – పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు..

అంటూ కొనసాగించి, ‘సకల సామ్రాజ్య లక్ష్మీనివాస జయా విజయీభవా దిగ్విజయీభవా..!’ అని ఆశీర్వచనాలు పలుకుతుంటే కొండారెడ్డి విల్లంబుతో పొయ్యి బాణానికి కొన భాగాన రంగు కాయితాలతో అలంకారం సేసుకున్న పొట్లంలో బుక్కుపిండి (3) పోసుకోని, సరీగ వాళ్ళింటి దాలభందరం పై భాగానుండే లచ్చిందేవి బొమ్మకి తగిలేతట్ల కొట్టినాడు. పండగపూట అట్ల సేస్తే శుభమని పెద్దల నమ్మకం. అయినంక, మా సారు – ‘ఇట్లాంటివేమీ వొద్ద’ని వారిస్తున్యా.. ‘అది సాంప్రదాయమప్పా! కాదనుకూడ’దని ఎంకటరెడ్డి బలంత పెడితే, కొండారెడ్డి సేతిలోని దక్షిణ తాంబూలాన్ని అందుకోని ‘బాగ సదువుకోని పైకి ఎదగల్ల’ని ఆశీర్వదించినాడు. అన్సకారి మేము కమ్మొల శంద్రన్న ఇంటి ముందుకు పోయి,

శ్రీ పార్వతీ నాథ శ్రీ శంకరేశా, – గంగా జటాజూట గణ కుస్తవాసా

నంది వాహనరూఢ నగధర మహేశా – మందాకినీ ధరుడ మల్లికార్జునుడా

చంద్రశేఖర దేవ భక్త మందార – మహిలోన మము బ్రోవు మహిమ చారిత్రా..

ఇట్లా శంకరుని ప్రార్థన సేసి, దీవెనలు పలుకుతుంటే శంద్రన్న బిడ్డ ‘రమాదేవి’ విల్లంబు సేతపట్టి బుక్కుపిండిని దాలభందరానికి కొట్టింది. శంద్రన్న ఇచ్చిన ఆకువక్కని సారు గౌరవంగ అందుకోగా.. మా అడుగుల్ని ‘గంగార రామన్న’ తాత ఇంటి పక్కకి ఏసి..,

శరణు పల్లవ పాణి శరణు పూబోణి – శరణు ముద్దులగుమ్మ శరణు మాయమ్మ

మహి మీద నీ మహిమలు లెన్న తరమౌనా – సర్వలోకముకెల్ల అంబ జగదాంబ

చాల నమ్మితినిపుడు మా పార్వతీ మాత – నీ మహిమ లెన్నుటకు మాకు తరమౌనా

ధరణిలో నీవెంత ధన్య శుభవాణి – నిరతంబు నినుగొల్తు నిత్య శుభవాణి

అని, భక్తితో పార్వతీ దేవి ప్రార్థన పాడతావుండాము.

రామన్న తాత బయటికొచ్చి, మా ఇంటి దేవుడు ఆంజనేయస్వామి. ఆయన పదాలు పాడండి నాయనలారా! అని అడిగితే అప్పుడు రొండు జట్లోళ్ళం, ‘లవకుశ’ సినిమాలో లవకుశలు, వాళ్ళ సిన్నప్పోళ్ళ (4) మింద రోషంతో పోటాపోటీలు పడి పదాలు పాడినట్ల..

అంజనీ గర్భమున అమరుడుదయించి – రంజిల్ల కాకుత్స రాముని భజియించి

లంక లోపల జొచ్చి లంఖిని వధియించి – పొంకముగా వనమెల్ల పొడిపొడిగా ద్రుంచి

గట్టిగా లంకకును కార్చిచ్చు పెట్టి – రాక్షసేశ్వరుని గని రంభమనిగించి

ఆరూధి వెలసిన అమిత బలవంత – వీరత వెలసిన వీర హనుమంత

అనుపముద్దాముడవు అమిత ప్రతాప – ధరణి శ్రీ మండగిరి శాంతి హనుమంత

ఇట్లా.. పాడి ఆ తాత ముచ్చట తీర్సి, పక్కనుండే మా నారాయణ మామ ఇంటికాటికి పోతుంటే, అదేపనిగా పదాలినేకే బైట కట్టమింద కుసోని మాకోసం ఎదురు సూస్తున్నట్ల కానొచ్చినాడు మామ. అతనికి నాటకాల మింద భో పిచ్చి. యప్పుడదే ధ్యాసతోనే పదాలు, పద్యాలు పాడుకుంట పనిజేసుకుంట వుంటాడు. అట్లాంటి మామొళ్ళ ఇంటి ముందుకు పొయ్యి,

మెరుగు దేహులజేయుమా శారదాంబ – మమ్ము ధన్యులజేయుమా శారదాంబ

ఆణిముత్యముల బొమ్మ అమ్మ మాయమ్మ – ఆల శాస్త్రములు నీవె అర్థములు నీవె

యిందు సాష్టాంగంబు లిందు ముఖబింబు – పల్లవారుణ పాద పరమ కళ్యాణి

రాణించు పికవాణి రాజీవపాణి – సరస్వతీ మతి మాకు చాలంగనిమ్ము…

ఈ విధంగ సరస్వతీ దేవిని వేడుకున్నంక, ఆ మామ ‘ఎప్పన్నుంచో అష్టకాలు యినల్లని వుండాది. అవి వుంటేగీన ఒగ రొండు పాడండి పిల్లల్లారా! మీ అయ్యవారికిచ్చే ‘దక్షిణ’గాక, మీ పప్పులు బెల్లాలకి మరిన్ని దుడ్లు ఇస్తా’నని ఆశ పెడితే, అతనికి ‘అట్లేగాన్ల్యా పాడతామ’ని సెప్పి, ‘మరేమి? అష్టకాలు పాడేదాంట్లో మాతో పోటీకి సయ్యా!’ అన్నట్ల ఇరుజట్లోళ్ళం ఒకనొకరు కనుబొమలు ఎగరేసుకోని, మొదల్పెట్టినామిట్లా…

మొదలు మీదుగ కొనలు కిందుగ మొలచియున్నది వృక్షము- మోదమలరగ మింట మీదను మదగజము విహరించెరా

చిదిమి బట్టిన బంటుకైవడి చీమ ఏన్గును మ్రింగెరా – సదయుడగు మళ్లూరి రాఘవ సార్వభౌమ దయానిధే!

చింతబుట్టిన రాతి మీదను చింతమానొకటాయెరా  – అంత లోపల దాని పై చేమంతి పూవులు పూచెరా

పంతమాడుచు కప్పయొక్కటి పాములైదును మ్రింగెరా – వింతగాదిది నిజము మళ్లూరి రామ దయానిధే!

విర్రవీగుచు కేకవేయుచు ఈగ మంచము మ్రింగెరా – గొర్రె యొక్కటి ఐదు పులులను గొట్టి నెత్తురు త్రావెరా

చిఱ్ఱి చెట్టున జాజిపువ్వులు శ్రీకరంబుగ బూసెరా – మర్రి పై కదళీ ఫలంబులు మళ్లూరి రామ దయానిధే!

కొంచెమౌ నొకగృహములోపల కోటి సింహములుండెరా – అంచితంబుగ నన్నిటిని యొక సామజంబు వధియించెరా

పంచవన్నెల చిలుకలైదొక పర్వతమును భక్షించెరా – మంచి తత్వ జ్ఞానమిది మళ్లూరి రామ దయానిధే!

ఒంటిపాటుల రెండు కోతులు జంట పిల్లులనీనెరా – కంటినని యొక నక్క కడుపున కామధేనువు బుట్టెరా

వింటినని నొక మకరి నవ్వుచు వీధి బఱుగులు బారెరా – జంతలివి మళ్లూరి రాఘవ సార్వభౌమ దయానిధీ!

మానసంబున మనుజొక్కడు మాను నములుచునుండెరా – కాని కానిమ్మనుచు దోమలు కనకగిరి కదలించెరా

కనికరంబున బాలుడొక్కడు కనకగిరిపై నిలిచెరా – దీనజన మందార మళ్లూరి రామ దయానిధే!

కన్ను గానక చేప యొక్కటి కాననంబున నడిచెరా – మిన్ను నేలను యీనునటువలె మిత్తి కేకలు వేసెరా

పిన్నపాపడు సప్త వార్థుల పీల్చి యాకొని కూసెరా – సన్నుతము మళ్లూరి రాఘవ సార్వభౌమ దయానిధే!

ఉర్విమీద ఘనుడు విజయ కవి రాజేంద్రుడు – అరుదుగా రచియించే జగతిన అష్టకంబుల భావము

వరుసతో యర్థంబు జెప్పిన వారి యభీష్ట భావము – నిరుపమాంబుధి చంద్ర మళ్ళూరి వీర రాఘవ దయానిధే!

ఇట్లా… ‘మళ్లూరి అష్టకం’ పాడి, పక్క జట్టుకి అల్సికి ఆరిచ్చుకునేకి (5) కూడ సందు(అవకాశం) ఇయ్యకుండ ఎనకనే ‘జనార్దనాష్టము’ ఎత్తుకున్యాము…..

సిరులు మించిన పసిమిబంగరు జిలుగదుప్పటి జాఱగా – జరణపద్మముమీద దేహము చంద్రకాంతులు దేరగా

మురుపు జూపగ వచ్చినావో మోహనాకృతి మీఱగా – గరుడ వాహన దనుజమర్దన! కందుకూరి జనార్ధనా!

ఆనబెట్టిన రాకపోతివి అయెబో అటు మొన్ననూ – పూని పిలువగ వినకపోతివి పొంచి పోవుచు మొన్ననూ

నేను జూడగ గడిచి పోతివి నీటుచేసుకు నిన్ననూ – కానిలేరా దనుజమర్దన! కందుకూరి జనార్ధనా!

ఈ రకంగ ఒగటెనుకొకటి రొండు అష్టకాల్ని గుక్క తిప్పుకోకుండ పాడితే, తనివి తీర యిని, ‘యప్పుడో నాను నిక్కర్లు కట్టుకుంటున్నప్పుడు ఇనింటిమి. మరి ఇన్నాళ్ళకి మీ సారు దయవల్ల ఇనే భాగ్యం కలిగి అమృతం తాగినంత ఆనందమైంద’ని సెప్పి, ఇచ్చిన మాట పకారం మా ముడుపు మాకి చెల్లిస్తే.. సేతపట్టి, అట్లే నా జతాగాడు తలారి ‘రమేషు’ గాని ఇంటికి పోయి ఒంటిమిట్ట ‘కోదండ రాముని’ అష్టకం ఎత్తుకున్యాము…

మానవతి వినవమ్మ చంద్రుడు మంచి వెన్నెల కాయగా – సూన శరమున వింట మదనుడు సూటి తప్పక వేసెనే

భానుతేజుడు తెలిసి అంతట పంతమును నను డాసెనే – మేను గంధము బూసెనే ఒంటిమిట్ట శ్రీ రఘు రాములు

మాడలును ముదుపు చీరలు మాటిమాటికి నిచ్చునే – పాడి తప్పక నన్ను పువ్వుల పాన్పు మీదకి దెచ్చునే

జోడుబాయక యున్నయప్పుడు సురతుకేళికి మెచ్చునే – మేడమీదికి వొచ్చునే ఒంటిమిట్ట శ్రీ రఘురాములూ…

ఈ అష్టకాన్ని మొత్తం పూర్తి సేసి, దీవెనలు కూడ పాడి, ‘సకల సామ్రాజ్య లక్ష్మీనివాస జయా విజయీభవా దిగ్విజయీభవా!’ అని ఆశీర్వచనాలు పలుకుతుంటే, రమేషు వాళ్ళ దాలభందరానికి బుక్కుపిండి కొట్టేకి విల్లెక్కు పెట్నాడు. వాడట్ల విల్లు ఎక్కి పెట్నప్పుడు, ‘ద్రోణాచార్యులు పెట్టిన పరీక్షలో పక్షి కంటికి గురి పెట్టిన అర్జునుని’లా వుండాడు మా కొడుకని భావించుకున్నారో ఏమో! వాళ్ళమ్మనాయనల మొకాలు అమ్మవారి ఉత్సవాల్లో దివిటీల్లక్క ఎలిగిపోతుండాయి. అట్లనుకుంటే ఒక్క రమేషు అమ్మనాయనలే కాదుల్యా! ప్రతి ఒక్కరు అట్లే తమతమ పిల్లల్ని.. సిన్నప్పటి అర్జునునిగానో, ల్యాకపోతే శ్రీ రామశంద్రుని గానో ఊహించుకోని మురిసిపోతుండారు. ఆడపిల్లోల్లనైతే రుద్రమదేవిని, ఝాన్సీరాణిని పోల్సుకోని సంబరపడుతుండారు.

ఇంగిట్లే (6).. ఇంటింటికాడ ఒక దేవుని ప్రార్థన, దీవెనలు పాడుతా.. అములు పొద్దు(7) వరకు వూరంత తిరిగి, ఏమో పెద్ద ఘనకార్యాన్ని సాధించినోళ్ళల్లక్క జంబాలు(8) పడుకుంట ఇండ్లు సేరుకున్యాము.

‘విల్లంబులు భుజాన ఏస్కోనుంటే అచ్చం ‘మహరాజు’లక్కే వుండాడు మా నాయన! వూర్లో ఒగరు కండ్లు వున్నట్ల ఒగరి కండ్లు వుండెల్లేదు.. పిలవోనికి జిట్టి(9) తగిలింటాద’ని, మా ఇంటికి నాలుగిండ్ల అవతలుండే మా వుశేనమ్మక్కని క్యాకేసి పిల్సి, ఎర్రనీళ్ళతో మూడు మాట్లు(10) ముందుకి ఎనిక్కి తిప్పి దిగతీపిచ్చి ఇంట్లోకి పిల్సుకోని, ఒకటికి రొండుమాట్లు ముద్దులాడింది మాయమ్మ.

అమ్మ సేసిన భచ్చా(క్షా)లు నేతిలో అద్దుకోని కడుపార తిన్నంక – ‘ఈ యేటి దసరా భలే సరదాగ గడిసిపోయింది మా! ప్రతి సముచ్చరం ఇట్లే చేస్తే భలే బాగుంటాదని మా జతాగాళ్ళందరు అనుకుంటున్నామ’ని మాయమ్మతో సెప్పినాను.

‘అవున్నాయనా! వూరందరు కూడ అట్లే అనుకుంటా వుండారు. యా పండుగ సేసినా ఎవురిండ్లలో వాళ్ళుండి సేసుకునేది, కుత్తుకల వరకు తిని పండుకునేదంతే! అదేమన్న సంబరమా! సుడుగాడా(11)! ఈ యేడు మీరందరు యుద్ధానికెల్లే సైనికుల్లాగ విల్లంబులు ధరించొచ్చి సన్నని గొంతుల్తో కోయిల కూతల్లాంటి ఆ కమ్మని పదాలు పాడుతుంటే, జనాలంత ఇండ్లలో సేసే పన్లు ఇడ్సి పెట్టి వొచ్చి సూస్తావుంటే మన సుంకులమ్మ దేవర జరుతున్నట్ల గేరంత (12) ఎంత సంబరంగ వున్నా సూస్తివి కద! దాన్కనే ‘పండగ సంబరాలంటే ఇట్లుండుల్ల! పతి సముచ్చరం ఇట్లే జరిపిస్తే బాగుంటాద’ని అందరు అనుకుంట వుండిర’ని మాయమ్మ సెప్తావుంటే, ‘మా(లాంటి) పిల్లోల్లకి కావల్సింది అదే ల్యా’ అని సంతోషపన్యాను.

ఆపొద్దు మాపుసారి (13) ‘సార్’ తో కలిసి అందరం ‘శమీ పూజ’కి పొయ్యింటే, రామాయణ మహా భారతాలు సదివి లోక జ్ఞానం బాగా తెలిసినోడిగా మంచి పేరు తెచ్చుకున్న ‘మావన్న’ తాత కనపడి, పొద్దున దసరా పాటల కార్యక్రమం బాగున్నిందని మెచ్చి, మా ‘సార్’తో- ‘సంపాదన మీద మోజుతో వూరు.. వాడ ఎట్లన్న (పాడై)పోనీ నాను నాకుటుంబం మాత్రం బాగుంటే సాలని కోరుకునే స్థాయికి దిగజారని మనుషులున్న రోజుల్లో పుట్టిన గొప్ప ఆచారాలివి. అప్పట్లో బతకలేని బడిపంతులు పెట్టిన ఆచారమే ఐనా వూరందరి మేలుకోరి బతికేకి ప్రయత్నం సెయ్యడం ఎంత మంచి సాంప్రదాయం కదా!’

ఇయ్యాళ మనిషి బతుకుల్లో దినానికొగ మార్పు రావడాన్ని గమనిస్తావుండి ఇట్లాంటి సంప్రదాయాలింక కండ్ల చూడడం కల్లేనేమో అనుకునేవాణ్ణి. నీకు ఆ దేవుడే ఈ పని సేయమని బుద్ధి పుట్టించినాడో ఏమో కానీ, ఇన్నేండ్లకి తిరిగి ఆ పదాలు సెవిన పడడంతో జన్మ ధన్యమైందనిపించింది. ఈ రోజుల్లో ఇట్లాంటి పనికి పూనుకోవడం గొప్ప విశేషం. అందుకు నిన్ను కచ్చితంగ మెచ్చుకొని తీరల్సిందే! నేటి అయ్యవార్లు కూడ ‘ప్రభుత్వం ఇప్పుడు మాకు మంచిజీతాలు అందిస్తోంది’ కదా! ఇల్లిల్లు తిరుగుతూ ఇట్లాంటి పాత సంప్రదాయాల్ని అనుసరించాల్సిన అవసరం ఏముండాద’ని అనుకోకుండ, పిల్లల్లో ఐకమత్యాన్ని పెంపొందించు క్రమశిక్షణతో కూడిన ఇట్లాంటి కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తే, పిల్లల సరదాలు, సంతోషాలు తీర్చడంతో పాటు కనుమరుగైపోతున్న తెలుగుదనాన్ని కాపాడిన వారైతారు. అదే జరిగితే పల్లెలు తిరిగి మునుపటి ‘కళ’ను సంతరించుకుంటాయి కదా’ని అభిప్రాయపన్యాడు.

ఆ మాటకి మా సారు- ‘ఆ రోజులు తొందర్లోనే వచ్చే మార్గం కనపడుతుండాదిల్యా పెద్దమనిషి! సింత సెయ్యాల్సిన పన్లేదు. మేధావుల ఎచ్చరికలతో భాషాభిమానులంతా అప్రమత్తమై, గత కొన్నేండ్లుగా వివిధ రూపాల్లో పోరాటాలు సేస్తావుండటంతో తెలుగు ప్రజానీకం మేల్కొని మన సంస్కృతి సంప్రదాయాల వైపు మొగ్గు సూపడం మొదల్పెట్టినారు. “ఇప్పుడు వివిధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిల్లో తెలుగు వర్ధిల్లుతోందని, దేశంలో తెలుగు మాట్లాడేటోళ్ళు నాల్గో స్థానంలో వుండారని, భాష మరుగున పడబోదని, అంతేకాక అమెరికా లాంటి దేశాలలో కూడా తెలుగు మాట్లాడటానికి ఆసక్తి చూపేవారి సంఖ్య గణనీయంగా 86 శాతం పెరిగిందని, రాసేవాళ్ళు, సదివే వాళ్ళు కూడా వేలల్లో పెరుగుతున్నార”ని నిపుణులు సెప్తుండే మాటలే మనకు ఋజువని’ సెప్పి, ముసలి వయసులో కూడా మాతృభాష పై మమకారాన్ని సూపుతున్న ఆ తాత మనసుని నెమ్మదిపర్సి, అట్లే.. పీక్కోనున్న జమ్మి ఆకుల్ని సేతిలో పెట్టి కాళ్లకి నమస్కరించుకోని ఆ తాత ఆశీస్సులు పొందినాడు. మేము అట్లే.. మా ‘సార్’ని అనుసరించి, వూర్లో మిగతా పెద్దల ఆశీస్సుల కోసం జమ్మాకుతో నింపుకున్న జేబుల్ని తడుముకుంటా ముందుకి కదిల్నాము.

సమాప్తము

అర్థాలు:

1) చెన్న కేశవుడు 2) మైదా పిండితో చేసిన గంజి, జిగురు, బంక 3) గంధము 4) చిన్నాయన వాళ్ళు, పిన తండ్రులు 5) అలసట తీర్చుకోడానికి 6) ఈ విధంగానే 7) మధ్యాహ్నం, అంబలి తాగు వేళ 8) బడాయి 9) దిష్టి 10) మార్లు, సార్లు 11) శ్మశానం 12) వీధి అంతా 13) సాయంత్రం వేళ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here