[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
దాశరథి కవితా వైభవం
నిఖిలాంధ్ర ప్రజల హృదయాల్లో స్థిరంగా నిలచిపోయిన మేటికవి దాశరథి. నిరంకుశ ప్రభుత్వాన్ని ధిక్కరించిన కవియోధుడు. ప్రజాభ్యుదయం కోసం గళమెత్తిన రసార్ద్ర హృదయుడు. నిరంతరం తిమిరంతో సమరం సల్పుతూ కాంతి కవాటాలు తెరచిన కవి సూర్యుడు.
‘నా తెలంగాణ – కోటి రతనాల వీణ’ అంటూ ప్రకటించి నిజాంపాలనలో తెలంగాణా దుస్థితినీ, ప్రజల ఇక్కట్లనూ గ్రహించి నాటి ప్రభుతకు వ్యతిరేకంగా ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అంటూ రుద్రవీణ మీటి సింహగర్జన చేసిన కవి దాశరథి. ‘తెలంగాణము రైతుదే – ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ అని తిరుగుబాటు జెండా ఎగరేసి జైలుగోడల మీద కూడా తెలంగాణ స్వాతంత్ర్య కాంక్షను నిర్భయంగా రాసినవాడు. ఆంధ్రప్రదేశ్‌కు ఆస్థాన కవిగా దాశరథి తరువాత మరొకరు నియామకం కానే లేదు. దాశరథి రచించిన అగ్నిధార, రుద్రవీణ, కవితాపుష్పకం, తిమిరంతో సమరం – కవితా సంపుటాలు, గాలిబ్ గీతాలకు చేసిన తెలుగు అనువాదం, ఆయన సాహితీమూర్తిమత్వానికి తిరుగులేని ప్రతీకలు. ఉర్దూ గజల్, రుబాయీ ప్రక్రియలను తెలుగుకు తెచ్చి కావ్య గౌరవాన్ని కలిగించినది మొదటగా దాశరథియే.
దాశరథి గారి కలం నుంచి రస సంభరితమైన పద్య కృతులు, గేయ ఖండికలు, వచన కవితా రచనలు జాలువారాయి. ఆయన వివిధ ప్రక్రియా రచనలనుండి కవితా మాణిక్యాలను ఏరి వ్యాఖ్యామృతంతో సాహితీ పిపాసువులకు అందిస్తున్న వారు యువభారతి పూర్వాధ్యక్షులు, డా. తిరుమల శ్రీనివాసాచార్యులు గారు. దాశరథి నాటిన రుబాయీ ప్రక్రియలో పయనిస్తూ తెలుగుతోటలో కవితా సుమ పరిమళాలను వెదజల్లుతున్న సుకవి డా.తిరుమల శ్రీనివాసాచార్యులు గారు, వానమామలై, దాశరథి, సినారె, వేముగంటి మున్నగు తెలంగాణ కవుల కవితా హృదయాలను వ్యాసరూపంలో ఆవిష్కరించిన విశిష్ట విమర్శకులు.
ఈ దాశరథి కవితా వైభవాన్ని ఆస్వాదించదలుచుకున్న వారు, క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.
https://archive.org/details/182-dasaradhi-kavita-vaibhavam-compressed/mode/2up
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.