[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]ఈ[/dropcap] మధ్య ఒకరోజు ఏ పనీ చేయబుధ్ధవక, ఏం చేయాలో తోచక తీరుబడిగా కూర్చుని టీవీలో ఒక తెలుగు సినిమా చూసాను. అది చూసాక నాకూ తెలుగు సినిమాకి కథ రాసెయ్యాలన్నంత ఆవేశం వచ్చేసి రాసి పడేసాను. ఎవరికైనా ఈ కథ నచ్చి సినిమా తియ్యాలనుంటే ఇదిగో నా ఫోన్ నంబర్. ఫోన్ చేసి రండి.
బేరసారాలన్నీ ముఖాముఖీనే సుమండీ!.
దశాబ్దాల ప్రేమ
ఐదేళ్ళ పాప ఈశూ.
ఏడేళ్ళ బాబు బాచీ..
ఇద్దరూ బిస్కట్ కోసం దెబ్బలాడుకుంటుంటారు. అది ఎంతవరకూ వెడుతుందంటే ఈశూ బాచీని చాచి లెంపకాయ కొడుతుంది. బాచీ ఊరుకుంటాడా.. దెబ్బకి కళ్ళమ్మట గిర్రున నీళ్ళు తిరుగుతున్నా సరే, ఈశూని వంగదీసి నడ్డిమీద రెండు దెబ్బ లేసి మరీ బిస్కట్ తీసుకుంటాడు. విజయగర్వంతో బిస్కట్ తినబోతుంటే ఈశూ సెంటిమెంట్ మీద కొడుతుంది.
ఈశూ– తిను.. తిను..అన్నీ నువ్వే తిను. మేం సిటీకి వెళ్ళిపోతున్నాంగా.. అన్నీ నువ్వే తిను..
బాచీ—అదేంటి?
ఈశూ– మా నాన్నకి ట్రాన్స్‌ఫర్ అయింది కదా..
బాచీ–మరి మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం..
ఈశూ(సీరియస్ గా)–సరిగ్గా పదేళ్ళ తర్వాత.. నాకు టెంత్, నీకు ఇంటర్ పరీక్షలు అయ్యాక ఇక్కడే, ఈ గుండ్రాయి దగ్గరే, ఇదే నెల, ఇదే సమయానికి కలుసుకుందాం…
బాచీ— మరి మనం ఒకరినొకరం ఎలా గుర్తుపట్టడం!
ఈశూ—దాందేముంది బాచీ. రాగానే ఇప్పట్లాగే నేను నిన్ను లెంపకాయ కొడతాను.
బాచీ—అప్పుడు నేను నీ వీపు మీద నాలుగేస్తాను..
ఈశూ—ఒ..కె..
బాచీ—ఒ..కె..
పదేళ్ళ తర్వాత————–
పదిహేనేళ్ళ ఈశూ, పదిహేడేళ్ళ బాచీ—అదే చోట– అదే సమయం…
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
ఈశూ—మరి వెళ్తాను బాచీ.. మళ్ళీ ఎప్పుడు?
బాచీ—మళ్ళీ ఇలాగే సరిగ్గా పదేళ్ళకి…..ఇక్కడే….ఈ టైమ్ కే..
ఈశూ—ఒ..కె..
బాచీ—ఒ.కె..
మరో పదేళ్ళ తర్వాత————-
ఇరవై అయిదేళ్ళ ఈశూ, ఇరవై యేడేళ్ళ బాచీ—అదే చోట–అదే సమయం…
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
ఈశూ—మరి వెళ్తాను బాచీ.. మళ్ళీ ఎప్పుడు?
బాచీ—-ఈసారి ఇరవై యేళ్ళకి కలుద్దాం….ఇక్కడే…ఈ టైమ్ కే…
ఇరవై యేళ్ళ తర్వాత————
నలభై అయిదేళ్ళ ఈశూ, నలభై యేడేళ్ళ బాచీ—అదే చోట–అదే సమయం…
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
ఈశూ—మరి వెళ్తాను బాచీ.. మళ్ళీ ఎప్పుడు?
బాచీ—-ఈసారి కూడా ఇరవై యేళ్ళకి కలుద్దాం….ఇక్కడే…ఈ టైమ్ కే…
మరోఇరవై యేళ్ళ తర్వాత————
అరవై అయిదేళ్ళ ఈశూ, అరవై యేడేళ్ళ బాచీ…అదే చోట…అదే సమయం..
ఇద్దరూ చెరోవైపునుంచీ వస్తారు. ఒకరినొకరు దీర్ఘంగా చూసుకుంటారు. చూసి చూసి ఈశూ బాచీని ఛెళ్ళుమంటూ చెంపదెబ్బ కొడుతుంది. సంతోషంగా బాచీ ఈశూ వీపు మీద నాలుగు దెబ్బలేస్తాడు. పకపకా నవ్వుకుంటారు.
బాచీ—ఇంక చాలు బాబూ. ఈ ఆట నేనాడలేను..
ఈశూ— ఎందుకాడలేవు? రోజూ నీతో కలిసే ఉంటున్నా ఇన్ని సంవత్సరాల కొక్కసారే నాకు నీ చెంపలు వాయించే అవకాశం వస్తోంది. మిగిలినప్పుడంతా నీ మాట దాటకుండానే నీతో సంసారం చేస్తున్నానుగా. ఈ సంతోషం కూడా నాకు దక్కనీవా?
బాచీ—అదికాదు ఈశూ, మరీ అరవై యేళ్ళు దాటాక నీ వీపు మీద దెబ్బలెయ్యడం నాకు కష్టం గానే ఉంది సుమీ…