[dropcap]ప్ర[/dropcap]సాదవర్మ కామఋషి జిల్లేళ్ళమూడి అమ్మ పై వ్రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. దీనిలో 15 వ్యాసాలు, 3 అనుబంధాలు ఉన్నాయి.
“అమ్మ వ్యక్తిత్వాన్ని, తాత్త్వికతను విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరిచే ప్రయత్నమే ఇది. అయితే ఇప్పటి తరానికి ఆకర్షణీయంగా ఆస్వాదయోగ్యంగా ఉండాలని ఈ వ్యాసాల్లో అమ్మ గురించి, కొంత విలక్షణంగా ప్రజెంట్ చెయ్యాలని ప్రయత్నం చేశాను” అన్నారు రచయిత తమ “ప్రస్తావన”లో.
***
“ఇందులోని వ్యాసాలలో ‘సూత్ర సాహిత్య బ్రహ్మ అమ్మ’ అనే తీరికలో- నేను ఎవడను? అని ప్రశ్నించుకొని జవాబు వెతుక్కోమన్నారు. రమణులు – ‘నేను నేనైన నేను’ అని జవాబు చెప్పి దారి చూపించింది అమ్మ – అనే వాక్యాలు ఈ గ్రంథానికే తలమానికాలని నా భావన. ‘తెలిసీ తెలియని స్థితి’ వ్యాసంలో ‘ఆమెలోని ప్రేమ విశ్వం కన్నా విశాలమైనది, యావత్ ప్రపంచమే ఆమె హృదయంలో రక్షణ పొందగలదు’ అనే అరవింద వాణిని అమ్మ పరంగా అన్వయించినప్పుడు మన కాలంలోని ఒక మహా తపస్వి ఆశ్రమ ధర్మాలను పక్కన పెట్టి అమ్మను గౌరవించిన విషయాన్ని నాతో ప్రస్తావిస్తూ ‘ఈ అమ్మే ఆ అమ్మ అనుకున్నాడేమో’ అన్న అమ్మ వాక్యం మదిలో మెదిలింది. ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం ఒక మణిపూస” అన్నారు ఎస్. మోహనకృష్ణ “సనాతనం స నూతనంగా” అనే ముందుమాటలో.
***
“వర్మగారు తమ గ్రంథాన్ని విలక్షణంగా వ్రాయాలనుకొన్నారు. తమ ప్రయత్నంలో ఆయన సఫలీకృతులైనారు. వర్మగారంటారు – “అసలీ పుస్తకాలు, పత్రికలు, సాహిత్యం అంతా పర’మతు’ల పరిమితుల మయం. అడుగడుక్కీ అడ్డుపడుతుంది తర్కం. సాహిత్యంతో రాహిత్యం రాదు: ఈ తర్మకర్కశ కంటకావృత వలయం దాటగలగాలి.” ఆయన యిలా దివ్యానుభవం పొంది వ్రాసిన వ్యాసాలు అనిపిస్తాయి. అమ్మను చూడలేదనే కొరత ఆయనకు లేదు. “భౌతిక రూపం అదృశ్యం కావచ్చునేమో గాని అమ్మ ఆత్మ చైతన్యమై, నీడలలో విహరిస్తూ, జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. మరణం అంటే పరిణామమని అమ్మే చెప్పింది కదా…..” అంటారాయన. ఈ దృక్పథం ఆయన రచనకు వైలక్ష్యణాన్ని కలిగించటంలో ఆశ్చర్యం లేదు.
వర్మగారి వ్యాసాలన్నిటిలో కవితాత్మక వాక్యాలు ఎన్నో. అవి వ్యాసాలను సాహిత్య పరిమళ భరితం గావించి చదివి అమ్మ మాటలు అమృత సందేశాలు అంటూ, ‘రమణీయ భాషలో స్మరణీయ సత్యాలు’ అని కవిత్వీకరిస్తారు” అని వ్యాఖ్యానించారు డా. పొత్తూరి వెంకటేశ్వరరావు గారు తమ ముందుమాట “విలక్షణ రచన”లో.
***
(జిల్లెళ్ళమూడి అమ్మ తత్త్వచింతనా లహరి)
ప్రసాదవర్మ కామఋషి
పుటలు: 126
వెల: ₹100/-
ప్రతులకు:
కె.వి. ప్రసాదవర్మ, డి.ఎస్. 22, దేవీనగర్, నేరేడ్‌మెట్, సికింద్రాబాద్ 500056. ఫోన్: 040-27228179
శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా 522113. ఫోన్: 08643-227324