‘దత్త కథాలహరి’ పుస్తకావిష్కరణ సభ నివేదిక

1
2

[dropcap]ది[/dropcap] 30 అక్టోబరు 2022 నాడు హైదరాబాదులోని రవీంద్రభారతిలో శ్రీ పాణ్యం దత్తశర్మ గారు రచించిన కథల సంపుటి ‘దత్త కథాలహరి’ ఆవిష్కరించబడింది. మొదటగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ముఖ్య అతిథులకు, వక్తలకు, సభికులకు ఆహ్వానం పలికారు. కార్యక్రమం గురించి టూకీగా ప్రస్తావించారు. అనంతరం సభాధ్యక్షత వహించవలసిందిగా డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారిని కోరి సభా నిర్వహణ బాధ్యత ఆయనకు అప్పగించారు.

డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారు మాట్లాడుతూ తాను హైదరాబాదులో అధ్యక్షత వహిస్తున్న మొదటి సాహిత్య సభ ఇదేనని అన్నారు. వరంగల్‍లో సహృదయ సంస్థకు అధ్యక్షుడిగా 13 సంవత్సరాలు వ్యవహరించి ఎన్నో కార్యక్రమాలు చేశానని గుర్తు చేసుకున్నారు. తనకీ రోజు ఈ అవకాశం ఇచ్చిన దత్తశర్మ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆపై పాణ్యం శంకర శర్మ గారు ప్రార్థనాగీతాలు ఆలపించారు.

‘దత్త కథాలహరి’ పుస్తకాన్ని ప్రముఖ రచయిత, విమర్శకులు శ్రీ విహారి గారు ఆవిష్కరించి ప్రతులను వేదికపైన ఉన్న పెద్దలకు అందజేశారు.

డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారు మాట్లాడుతూ సాహితీ లోకంలో తాను చూసిన వెలుగు విహారి గారని అన్నారు. తాను పరిచయం లేని రోజుల్లోనే విహారి గారు తన కథని సమీక్షించారని గుర్తుచేసుకుని వారికి నమస్సులు అర్పించారు.

విహారి గారు అతిథులకు, సభికులకు వందనాలు చేసి తమ ప్రసంగం ప్రారంభించారు. దత్తశర్మ గారు ప్రొలిఫిక్ రైటర్ అనీ, విస్తృతంగా రాస్తున్నారనీ అన్నారు. చాలా పోటీలలోనూ, అనేక పత్రికలలోనూ తరచూ కనబడుతున్న రచయిత అని అన్నారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకి గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇది ఒక ఆత్మీయమైన సంఘటన అని అన్నారు. ఓ కవో/రచయితో కవితా/కథా సంపుటి వేస్తే అది వారికి ఒక విజిటింగ్ కార్డ్ లాంటిదని శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు అనేవారని గుర్తు చేశారు. కొత్తగా రాస్తున్న వాళ్ళంటే తనకి గౌరవమని చెబుతూ కొత్త రచయితల మధ్య తనకు గురుస్థానం దక్కిందని అన్నారు. కొత్త రచయితల రచనలు ఎందుకు బావున్నాయో చెప్పేందుకు తాను వివిధ పత్రికలలో పలు శీర్షికలు నిర్వహించానని తెలిపారు.

సంవత్సరానికి 2200 కథలు వస్తాయని అంచనా అని చెప్తూ, మరి ఆ రచయితలకి గుర్తింపు ఏది అని ప్రశ్నించారు. సమకాలీన రచయితల రచనల్లో మణిపూసల వంటి వాటిని ఎంచి పాఠకులకు పరిచయం చేశానని అన్నారు. ఇందుకు ‘పరిచయాలు – పరామర్శలు’ శీర్షిక ఉదాహరణ అని అన్నారు. ‘తెలుగు కథలో తేజోరేఖలు’ అనే శీర్షిక ద్వారా రచయితల నేపథ్యాలు వివరించానని, చాలామంది రచయితలు తనకి వ్యక్తిగతంగా తెలియదని, పలు సభల్లో వారు తమని పరిచయం చేసుకున్నారని తెలిపారు. ఈ సభలో ఉన్న బాలా వెంకట్రావు, ఉప్పలూరి మధుపత్ర శైలజ వంటి రచయితలని ప్రస్తావించారు. సంచికలో వ్రాసిన ‘ఏరిన ముత్యాలు’ శీర్షికని ప్రస్తావించారు. శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి రచనా శైలిని అభినందించారు.

ప్రస్తుతం తెలుగులో చక్కగా రాస్తున్న రచయితలలో పాణ్యం దత్తశర్మ గారు ఉన్నత స్థానంలో ఉన్నారని అన్నారు. కథల గురించి ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్.సుశీలమ్మ, శ్రీ ఎన్.వి.హనుమంతరావు గార్లు విపులంగా చర్చించనున్నారు కాబట్టి తాను స్థాలీపులాక న్యాయంగా తన అభిప్రాయం చెప్తానని అంటూ – ఈ కథలలో సమాజ పరిశీలన ఉంది, వైవిధ్యం ఉంది, తనకు నచ్చే మరో గుణం క్లుప్తత కూడా ఉందని చెప్పారు.

కథలలోకి మొత్తం జీవితం తీసుకురాకూడదని, కథలో ఎంత చెప్పాలో దత్తశర్మగారికి బాగా తెలుసు అంటూ కొన్ని కథా లక్షణాలను ప్రస్తావించి, తన ప్రసంగాన్ని ముగించారు.

ఆత్మీయ అతిథిగా సభకు విచ్చేసిన శ్రీ వాణిశ్రీ (సిహెచ్. శివరామ ప్రసాద్) గారిని పరిచయం చేస్తూ వారు చాలా కాలం నుంచి రాస్తున్నారని, వెయ్యికి పైగా కథలు రచించారని డా. కె.ఎల్.వి. ప్రసాద్ తెలిపారు.

వాణిశ్రీ గారు ప్రసంగిస్తూ – దత్తశర్మ గారు తనకు నాలుగేళ్ళుగా పరిచయమని, తాము ప్రచురించే ‘మా కథలు’ సంకలనానికి కాంట్రిబ్యూట్ చేశారని అన్నారు. రచయితలకు ఇష్టమైన తమ కథలను సంకలనం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ‘మా కథలు’ సంకలనాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఒకప్పుడు రాసి, తరువాత మానివేసిన రచతయితలో తాను తిరిగి రాయించి, వారి కథలను సంకలనాలలో ప్రచురించానని తెలిపారు. ఇందుకు ఉదాహరణలుగా ఎ.జి. కృష్ణమూర్తి గారిని, శ్రీ మానస (వెంకట హరగోపాల్) గారిని ప్రస్తావించారు. దత్తశర్మ గారు తనతోనూ పోటీ పడి రాస్తున్నారనీ, చక్కని అనుభవం సాధించారని అన్నారు. ఆయన కథలలో క్లుప్తత బాగా కుదురుతుందని. ఏ అంశం మీదైనా రాయగలరని అని చెప్పి – ముగించారు.

అనంతరం దూరదర్శన్ విశ్రాంతి ఉద్యోగి శ్రీ ఎన్.వి.హనుమంతరావు గారు ఈ సంపుటి లోని కథలను సమీక్షించారు. తాను సుప్రసిద్ధ రచయితను కాదంటూ, పుస్తకాలు విపరీతంగా చదివే అలవాటుందని చెప్పారు. ఒక కథ గాని నాటకం కానీ నవల కానీ కవిత్వం కానీ చదివితే ఏం వస్తుంది? అవి చదవటం వల్ల మనిషికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుని సమాధానం వెతుక్కోవాల్సిందే అని అన్నారు. అందుకు శర్మగారి ముందుమాట ‘విన్నపాలు వినవలె’ సమాధానం ఇస్తుందని చెబుతూ – ఈ కథల పరమార్థం pleasure – ఆనందం అని చెప్పారు. ఒక కొత్త ప్రపంచం, మనకి అవతల ప్రపంచం ఈ కథలలో కనబడిందని చెబుతూ, తాను అన్ని కథలు చదివాననీ, పుస్తకం తనని నిరాశ పరచలేదని చెప్పారు. సమాజంలో సమస్యలున్నాయి, వ్యక్తులకూ సమస్యలుంటాయి. వ్యక్తిగత సమస్యలపై ఈ మధ్య కథలు వస్తున్నాయి అంటూ ఈ పుస్తకంలో ‘రససిద్ధి’ అనే కథను ప్రస్తావించారు. ఈ కథని ఎలా ముగిస్తారో అని అనిపించిదనీ, అయితే ఓ నాటకీయమైన ఆధ్యాత్మిక కోణంతో ముగించారని అన్నారు.

సామాజిక సమస్యలు, చట్టాలు, ఎన్నికల ప్రక్రియ, బీదరికం, తదితర అంశాలపై కథలున్నాయి ఈ పుస్తకంలో అని అన్నారు. సమకాలీన అంశాలపై తన అవగాహనను నిరూపిస్తూ ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..!’ అనే కథ అల్లారు రచయిత అని అన్నారు. హిందూ పద శీర్షికతో, ముస్లిం జీవనాన్ని ఈ కథలో చూపారని, అదే ఈ కథ గొప్పతనమని వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యవస్థ గురించి, నోటా గురించి, జాతీయ ప్రభుత్వం అవసరాన్ని ప్రస్తావించిన కథ ‘ఎవరూ వద్దు’ అనేదని చెబుతూ చివరి పంచ్ ‘కల’ అని వెల్లడించారు. ‘అమ్మా! ఆశ’ కథలో ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రిని గెలిచిన ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించుకోవడం – నిజంగా జరిగితే బావుండని అనిపిస్తుందని అన్నారు.

చాలా కథలలో కుటుంబ విలువలూ, ఆప్యాయతలూ అనురాగాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాదు నగర జీవితాన్ని అద్భుతంగా చూపించిన కథ ‘పరధర్మో  భయావహః’ అని చెప్పారు. కొన్ని కథలలో ప్రస్తావించిన వంటలు, వాటిని చేసే విధానం వల్ల రచయితకి వంట చేయడం బాగా వచ్చని అర్థమవుతుందని అంటారు. ‘వంటొచ్చిన మొగుడు’ కథ మరో ఉదాహరణ అని అన్నారు. ‘అష్టావధానం’ చక్కని కథ అన్నారు.

స్థలపురాణం, వంశవృక్షం అనేవి వ్యక్తి గొప్పవాడయ్యేందుకు కొంతమేరకు కారణమవుతాయని అంటూ, పండిత వంశంలో జన్మించిన దత్తశర్మ గారి మీద వాళ్ల నాన్నగారి ప్రభావం ఉందని, ఆయన యొక్క పాండితీ ప్రకర్ష వారసత్వంగా అందాయని భావించవచ్చని అన్నారు. ‘పెద్దక్కయ్య’ కథలో అక్కతో ఉన్న అనుబంధాన్ని, ‘మన్నించు నాన్నా’ కథలో తండ్రీ కొడుకులు ఆత్మీయతని అద్భుతంగా చిత్రించారని అన్నారు.

దత్తశర్మ గారిది సరళమైన భాష అనీ, పాత్రల పేర్లు పెట్టడంలో ఆయన అభిరుచిని ‘పరధర్మో  భయావహః’ కథ వెల్లడిస్తుందని తెలిపారు. ఆ కథలోని కొన్ని పేర్ల మీద రచయితకి ఉన్న మోజు బహిర్గతమైందని అన్నారు.

కవర్ పేజీ అద్భుతంగా కుదిరిందని, ముఖచిత్రంపై modernism, rural background చూపించారని అన్నారు. స్మార్ట్ చిల్డ్రన్, ఆత్మసఖుడు – చక్కని కథలని అన్నారు. ‘నీలవంశీ మోహనం’ చక్కని ప్రేమ కథ అనీ, ప్రబంధ సాహిత్యానికి తక్కువ కాదని అన్నారు.

‘భోక్తలు’ చాలా గొప్ప కథ అని, సామాజిక సేవ ఎంతో తృప్తి కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే, ‘ఈ బడి నాకొద్దు’ కూడా మంచి కథని తెలిపారు.

చాలా కథలతో పాఠకులు మమేకం అవుతారని, మెత్తగా, మృదువుగా ఉండే కథలివని అన్నారు. Pleasure with message ఉన్న కథలివి అంటూ ముగించారు హనుమంతరావు.

అనంతరం ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్ సుశీలమ్మ ఈ కథలని విశ్లేషించారు.

ఆత్మీయ సభకు నమస్కారం అంటూ మొదలుపెట్టి సభలో ఉన్నవారంతా సంచిక బంధువులని అన్నారు. తాను దత్తశర్మగారిని ‘సాఫల్యం’ శర్మ గారనీ, ‘పతంజలి’ అని పిలుస్తానని అన్నారు. పుస్తక సమీక్ష హనుమంతరావు గారు చక్కగా చేశారని అన్నారు. దత్తశర్మగారు ఇంగ్లీషు లెక్చరర్‍గా పనిచేశారని గుర్తు చేశారు. ఈ పుస్తకంలోని కథలను – వృత్తిపరమైన కథలు, ప్రవృత్తి పరమైన కథలు, పాండిత్య కథలుగా విభజించవచ్చని అన్నారు. ఇందులోని కథాంశాలు ఆకాశం నుండి ఊడిపడినవి కావని, మన ఇరుగు పొరుగు కథలేనని అన్నారు. ఈ పుస్తకంలో క్లిష్టత అంటూ ఏమీ లేదని, హాయిగా మంచి భాషలో ఉన్న కథలివని అన్నారు.

కథ చెప్పడం ఒక కళ అని, చిన్నప్పటి కథలకి ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని, వినటం, చదవటం ముఖ్యమని అన్నారు.

చదువు ప్రాధాన్యతని చెప్పిన కథ ‘విజ్ఞానజ్యోతి’ అని అన్నారు. ఈ పుస్తకంలో వైవిధ్యభరితమైన కథలు ఉన్నాయని అన్నారు. 1. వృద్ధాప్యం కథలు (పెద్దక్కయ్య, మన్నించు నాన్నా) 2. స్త్రీల గురించిన కథలు (అష్టావధానం, మాజీ ముఝే మాఫ్ కీజియే) 3. ఆత్మకథాత్మక కథలు అని తెలిపారు. స్త్రీవాదం గురించి గొప్పగా, సహ-అనుభూతితో దత్తశర్మ గారు రాశారని అన్నారు. ‘మాజీ ముఝే మాఫ్ కీజియే’ లాంటి కథలను స్త్రీవాదులు కూడా రాయలేరని అన్నారు. ట్రిపుల్ తలాక్ ఆధారంగా రాసిన ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..!’ గొప్ప కథని అంటూ – చివర్లో నువ్వు లేకుండా ఎలా బతకాలో నాకు తెలుసు అని భర్తతో ఫాతిమా అనగలడం ఆమె ధైర్యానికి నిదర్శనమని అన్నారు.

రాయలసీమలో పుట్టి పెరగడం వల్లా, ఉత్తరాంధ్రలో ఉద్యోగం చేయడం వల్లా రెండు మాండలికాలను కథలలో అద్భుతంగా ఉపయోగించుకున్నారు రచయిత అని అన్నారు. వారిది వ్యవసాయ కుటుంబం కావడం వల్ల పశువులను, పనివాళ్లను గౌరవించే సంస్కృతి కలిగిందని అన్నారు. మానవుల పశువుల మధ్య ఉండే ప్రేమని చాటిన ‘సహదేవుడు’ గొప్ప కథని అభిప్రాయపడ్డారు. ‘వంటొచ్చిన మొగుడు’ కథలోని భర్త భార్యని విసిగిస్తే, ‘ఆత్మసఖుడు’ కథలోని భర్త భార్యకి సేవలు చేస్తాడని అన్నారు. ఈ కథ చక్కని దాంపత్యానికి గొప్ప నిదర్శనమని అన్నారు.

ఈ కథలలో మానవ సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి, సామాజిక స్పృహ కూడా ఉంది అన్నారు. నోటాపై దత్తశర్మ గారు రాసిన కథని ప్రస్తావిస్తూ – దీన్ని చదువుతుంటే ముళ్లపూడి వారి ‘ఓటరు నవ్విన కారణం’ కథ గుర్తొచ్చిందని అన్నారు. ‘అమ్మా! ఆశ’ కథ ఇతర భాషలలోకి అనువాదమవ్వాల్సిన కథ అనీ, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల దృష్టికి వెళ్ళాల్సిన కథని వ్యాఖ్యానించారు. ‘పూర్వసువాసినీ దర్శనం’ కథ మరో మంచి కథ అని అన్నారు.

మానవతా విలువలతో ఒక గొప్ప స్థాయికి వచ్చిందీ పుస్తకం అంటూ, రచయితకి కొన్ని సూచనలు చేయదలచాను అన్నారు. ఈ పుస్తకంలోని రెండు శృంగార కథలు లేకపోయినా పుస్తకానికి ఏమీ లోటు ఉండేది కాదని అన్నారు. రచయిత తన పాండిత్యాన్ని కథలలో పాత్రల ద్వారా ప్రదర్శించడం అంతంగా అవసరం లేదేమోనని ఆలోచించాలన్నారు. కథల శీర్షికలకు సంస్కృతం పేర్లు, ఇంగ్లీషు పేర్లు తగ్గించి, తెలుగు పేర్లను పెట్టాలని సూచించారు. మొత్తం మీద ఇది మంచి పుస్తకం అంటూ ముగించారు.

అనంతరం సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ ప్రసంగిస్తూ – దత్తశర్మగారితో తమ అనుబంధాన్ని వివరించారు. రచయిత బ్రహ్మ కన్నా ఏ రకంగా గొప్పవాడో వివరించారు. సంచికలో దత్తశర్మగారి రాబోయే రచనలను ప్రస్తావించారు.

దత్తశర్మగారి కుమారుడు ప్రహ్లాద్ మాట్లాడుతూ – తనకి తెల్సినప్పటి నుంచి నాన్న రాస్తూనే ఉన్నారని అన్నారు. ఆయన వల్లే తనకి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఏర్పడిందని అన్నారు. ఏది చదివినా మనకి పనికొస్తుందా రాదా అని ఆలోచించకుండా చదవాలనీ – చదివినది జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఉపకరిస్తుందనేది తన స్వీయానుభవమని వివరించారు.

దత్తశర్మగారి తమ్ముడు పాణ్యం శంకర శర్మ మాట్లాడుతూ తమని అన్నయ్య – తండ్రిలా పెంచారని చెప్పారు. దత్తశర్మ గారి వ్యక్తిత్వం గురించి వివరించారు. ఒకప్పుడు నిజమైన వ్యవసాయం చేసిన అన్నయ్య ఇప్పుడు సాహితీ వ్యవసాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

దత్తశర్మ గారి మిత్రుడు, మాజీ కొలీగ్ అయిన నరసింహం గారు రచయితతో తమకున్న అనుభవాలని పంచుకున్నారు. కరోనా రాక మునుపు తామిద్దరం మెట్రో రైలులో ప్రయాణించేవారమని, ఆ సమయంలోనే ఈ కథలకి బీజం పడిందని, శ్రీ దత్తశర్మలాంటి రచయిత తన మిత్రుడని చెప్పుకోవడం తనకి గర్వకారణమని అన్నారు.

ప్రముఖ రచయిత శ్రీ నల్ల భూమయ్య మాట్లాడుతూ – రచయిత తనకి పుస్తకం పంపి, అభిప్రాయాలను తెలపమన్నారని చెబుతూ తన చిన్ననాటి విద్యా విషయాలను ప్రస్తావించారు. 1962లో తమకి చరిత్ర, భూగోళం చెప్పే మాస్టారు – పాఠంలోని ముఖ్యమైన అంశాలను పెన్సిల్‍లో అండర్‍లైన్ చేసుకోమని, తద్వారా పరీక్షల ముందు సులువుగా ఉంటుందని నేర్పారని చెప్పారు. ఆ అలవాటు తోనే ఈ కథలలోనూ ముఖ్యమైన వాటిని అండర్‍లైన్ చేసుకున్నాననీ, వాటితో ఆ కథల సారం తెలుస్తుందని అన్నారు. వ్యక్తిత్వ శిల్పి, ఒకే ఒక మాట, పూర్వసువాసినీ దర్శనం, అమ్మా! ఆశ, భోక్తలు, దోషైక దృక్కు – వంటి కథలను ప్రస్తావించారు. మంచి పుస్తకం అని అన్నారు.

శ్రీ నిరంజన్ దేశాయ్ మాట్లాడుతూ – తమదీ, రచయితదీ ఒకే ప్రాంతమని అన్నారు. తన బాల్యస్మృతులను ఎన్నో రచయిత ‘సాఫల్యం’ ద్వారా గుర్తు చేశారని అన్నారు. సమాజంలో రకరకాల సమస్యలో అణిగిపోతూ ఉన్న మన లాంటి రోగులకు అద్భుతమైన మందులిస్తున్న వైద్యులు రచయితలని అభిప్రాయపడ్డారు. మొబైల్ వచ్చాక చదవడం బాగా తగ్గిపోయిందని అన్నారు. తనకి తమ ఊరిపై ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. ‘సాఫల్యం’ ద్వారా తమ ప్రాంతపు అలవాట్లు, రుచులు, సంప్రదాయాలు అన్నీ ముందుకు వస్తున్నాయని అన్నారు.

అనంతరం రచయిత తన స్పందనని తెలియజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ సాదర ప్రణామాలు అర్పించారు. సభకు హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన రచన వ్యాసంగం గురించి, తను చేసిన ఉద్యోగాల గురించి వివరించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన విహారి గారికి, ఆత్మీయ భాషణం చేసిన వాణిశ్రీ గారికి, సభకి అధ్యక్షత వహించిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారికి, సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. కథలను సమీక్షించిన శ్రీ హనుమంతరావు గారికి, విశ్లేషించిన ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్.సుశీలమ్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘నల్ల కాలర్’ కథని ప్రస్తావించి, ఆ కథను నాటకంగా మలచడంలో శ్రీ వాణిశ్రీ అందిచిన తోడ్పాటును గుర్తు చేసుకున్నారు.

‘పూర్వానుభవం’ కథని గ్రాంథిక భాషలో రాయడానికి కారణం వివరించారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శైలిలో గ్రాంథికంలో ఒక కథ రాయమని తమ బావగారు కోరినందువల్ల, ఆ కథను అందించానని తెలిపారు. ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్.సుశీలమ్మ గారి సూచనలను స్వీకరిస్తానని చెబుతూ, కొన్ని కథలకి తెలుగు శీర్షికలు పెట్టాలని అనుకున్నా అవి అంత నప్పలేదని అన్నారు. ఉదాహరణగా ‘పూర్వసువాసినీ దర్శనం’ కథని ప్రస్తావించారు. తమ తండ్రిగారి ద్వారా, అధ్యయనం ద్వారా తనకు అబ్బిన పౌరాణిక విజ్ఞానాన్ని, నైతిక విలువలను ఆయా పాత్రల ద్వారా పాత్రోచితంగా, సందర్భోచితంగా రచనలలో ఇముడ్చుతానని, తద్వారా పాఠకులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దీనిని పాండిత్య ప్రదర్శనగా భావించరాదని అన్నారు.

చాలామంది ‘సాఫల్యం’ నవలని తన ఆత్మకథగా భావిస్తున్నారని, అది నిజం కాదని అన్నారు. కొంత మేర తన జీవితమూ, మిగతాది కల్పన అని చెప్పారు. తన లైఫ్‌ని బేస్ చేసుకుని రాసిన నవల అని చెప్పారు. “No writer can escape from his life” అని ఛార్లెస్ డికెన్స్ చెప్పిన వాక్యాన్ని ఉదహరించారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.

శ్రీ కస్తూరి మురళీకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here