Site icon Sanchika

కుటుంబ జీవితానికి ప్రాముఖ్యతనిచ్చిన కథలు – ‘దత్త కథాలహరి’

[dropcap]అ[/dropcap]సలు కథలు ఎందుకు చదవాలి?.. ఒక కథ గాని నాటకం కానీ నవల కానీ కవిత్వం కానీ చదివితే ఏం వస్తుంది? అవి చదవటం వల్ల మనిషికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుని సమాధానం వెతుక్కోవాల్సిందే. నా మటుకు నేను చాలా చిన్న వయసులోనే ఈ ప్రశ్న వేసుకున్నాను.

ఈ విశాల ప్రపంచంలో నేను ఒక పిపీలకం లాంటి వాడిని. కానీ నేను ఎక్కడ అడుగుపెడితే, ఎవరితో మాట్లాడినా, ఏ పని చేయటం మొదలు పెట్టినా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఉత్సుకత ఉంది అని నేను గుర్తించడం జరిగింది. నా చదువు నా జీవితం నా కుటుంబం నేను పుట్టి పెరిగిన ఊరు, ఇవి కాకుండా వీటికి అవతల వైపు చాలా ప్రపంచం ఉంది. నా చుట్టూ ఏం జరుగుతోంది? నాతో సహా నా చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి నేను జీవిస్తున్న ఈ సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వాటికి పరిష్కారాలు ఉన్నాయా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి నా ప్రయత్నం మొదలు పెడితే అవన్నీ నాకు సాహిత్యంలో కనపడ్డాయి. అందులోనూ కథలు చాలా గొప్పగా కనిపించాయి. ఈ సాహిత్య అంశాలకి అంటే భాష, శైలి, ఇత్యాది విషయాలకి అవతలి వైపున ఏముంటాయి? ఇదే నాకు కలిగిన సంశయం. సాహిత్య అంశాలు ఆవల ఉండే ఆర్థిక, సామాజిక, చరిత్రాత్మక ఇంకా అనేక విషయాలు తెలుసుకోవటానికి ఈ కథ అనేది ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం. అందుకే నేను కథలు చదవటం ప్రారంభించాను. రవి కాంచని చోట కవి గాంచును అంటారు గదా. ఒక సమస్యని లేదా ఒక అంశాన్ని కథా వస్తువుగా స్వీకరించిన రచయిత దాన్ని తన క్రియేటివిటీతో పాఠకులను చదివించడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటివి చదివిన మనం ఒక పాఠకుడిగా ఆయా వ్యక్తులతో లేదా సమస్యలతో ఐడెంటిఫై అవుతాం. తద్వారా మనకి ఒక ఆనందం కలుగుతుంది. ఈ ఆనందంతో పాటుగా నాకు ఆయావిషయాల గురించి తెలుసుకోవడం, ఒక అవగాహన ఏర్పరచుకోవడం అనే మరొక ఆనందం కలుగుతుంది. అందుకే చిన్న వయసు నుంచే ఈ కథలు, నవలలు ఇలాంటివన్నీ చదవటం అలవాటైంది.

శ్రీ పాణ్యం దత్తశర్మ గారు 2018 నుండి 2022 వరకు తను రాసిన 30 కథలను ‘దత్త కథాలహరి’ అనే పేరుతో ఓ సంపుటి తీసుకొచ్చారు. ఈ కథాలహరిలో pleasure aspect కు పెద్దపీట వేస్తూ మెసేజ్‌ను అంతర్లీనంగా స్వరింప చేస్తూ కథలు రాశాను, రాస్తున్నాను అన్నారు. కేవలం అలాంటి ఆనందం కలిగించడం మాత్రమే కాకుండా నేను కోరుకున్నట్లుగా తెలుసుకోగలిగిన ఎన్నో అంశాల గురించి ముఖ్యంగా కుటుంబంలోని వ్యక్తుల మధ్య అనుబంధాలను ఇందులో చర్చించడం జరిగింది.

సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఎంతో మంది ముందుకు వస్తారు. సంస్కరణవాదులు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ఎందరో. సామాజిక సమస్యలు అంటే ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం, మొదలైనవి.కానీ వ్యక్తిగత సమస్యలు వస్తే వాటికి పరిష్కారం ఎవరు చూపుతారు? సుప్రసిద్ధ మరాఠీ నాటక రచయిత మహేష్ ఎల్ కుంచ్‌వార్ ఇదే చెప్తారు. My concerned is towards individual problems అంటారాయన.

ఈ ఇండివిడ్యుల్ ప్రాబ్లమ్స్ ఒకే రకమైన సమస్య కనుక ఎక్కువైతే అది సామాజిక సమస్య అవుతుంది అది వేరే విషయం. అలాంటి ఓ వ్యక్తిగతమైన సమస్య గురించి శర్మ గారు ఒక అద్భుతమైన కథ రాశారు. నిజానికి ఈ పుస్తకం నా చేతికి రాగానే తిరగేస్తూ మొట్టమొదట నేను చదివిన కథ ‘రససిద్ధి’. ఈ టైటిల్ చూడగానే ఒక నాటకం గురించి నాట్యం గురించి కావ్యం గురించి అనుకున్నాను. చదువుతుంటే అర్థమైంది ఇది ఒక వ్యక్తి యొక్క సమస్య మాత్రమే కాదు చాలా మంది వ్యక్తులకు ఉన్నటువంటి సమస్య. కానీ ఒకరికొకరు సంప్రదించుకుని పరిష్కరించుకోలేని సమస్య.

వయసు నలభై దాటిన తర్వాత ప్రతి వ్యక్తి తన బాధ్యతల వల్ల ఉద్యోగము, పెళ్లి, పిల్లలు ఇలాంటి జీవన పోరాటంలో తన గురించి తాను మర్చిపోతారు. తన గురించి తాను మర్చిపోతాడు అంటే తన శరీరం గురించి మర్చిపోతాడు. తన శరీరంలో ఉండే స్పందనలు ఏమిటి, కోరికలు ఏమిటి అనే విషయం మరుగున పడిపోతాయి. ఒక్కసారి విశ్రాంత జీవితం ప్రారంభం కాగానే బయట ప్రపంచంతో మనకు ఉన్నటువంటి సంబంధబాంధవ్యాలు తగ్గిపోగానే మనం చాలా రిలాక్స్ అవుతాం. అప్పుడు మనలోని హార్మోన్స్ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు మళ్ళీ మొదలైన ఒంటరి జీవితానికి తోడుగా భార్య మాత్రమే ఉంటుంది. అలా ఇందులో హీరో (అహోబలరావు) బ్యాంకులో రిటైర్ అయిన తరువాత తీరిగ్గా కూర్చుని ధర్మపత్ని లోని అందాలను గమనిస్తాడు. ఉబుకుతున్న శృంగార వాంఛ మొదట్లో ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ భర్త ఇదే పనిగా ఉండటంతో భార్య కొంచెం విముఖత చూపిస్తుంది. ఆ తరువాత భార్య మీద అలిగిన భర్త చిక్కిశల్యం అయిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఈ సమస్యని శర్మగారు ఎలా పరిష్కరిస్తారు అనుకుంటే ఆయన ఒక గొప్ప నాటకీయ ఆధ్యాత్మిక కోణంలో దీన్ని పరిష్కరించారు. ఆ ఇల్లాలు పూజాపునస్కారాలలో మునిగిపోయి భర్తయొక్క కోరికలకు అడ్డుకట్ట వేసింది గదా. ఒకరోజు ఆమెకి కలలో ఆ జగన్మాత దర్శనం జరిగి ఆ జగన్మాత ఆ ఇల్లాలుకు జ్ఞానోపదేశం చేసి భర్తకి సహకరించమని ఇందులో సిగ్గు పడాల్సింది, తప్పు ఏమీ లేదంటూ ఉపదేశించగా ఈ లోపల ఇంటి నుండి వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చి తను చేసింది తప్పే క్షమించమని అడుగుతాడు. ఈ వయసులో ఇలా చేయకుండా ఉండాల్సింది అంటాడు. ఆ ఇల్లాలు భర్తను ఆదరంగా స్వీకరించి అతనికి సహకరిస్తుంది. పైకి చెప్పుకోవటానికి చాలామంది ముందుకు రారు కానీ ఈనాడు సమాజంలో ఇలాంటి సమస్య చాలామంది ఎదుర్కోవటం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక సామాజిక, రాజకీయ కోణంలో రాసిన అద్బుతమైన కథ ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..!’. ముస్లిం మహిళలను పట్టి పీడిస్తున్న సమస్య ట్రిపుల్ తలాక్. దీన్ని రద్దు చేస్తూ చట్టం కూడా వచ్చింది. ఇందులో ఖాదర్ ఆటో డ్రైవర్, భార్య ఫాతిమా, ఒక కూతురు. ఖాదర్ మరొక మహిళ మోజులో పడి భార్యకు తలాక్ చెప్పి ఆమెను వదిలేస్తాడు. ఆమె ఇది చెల్లదంటూ కోర్టుకు వెళ్ళి అతనికి శిక్ష వేయిస్తుంది. శిక్ష అనంతరం అతను కలిసుందామన్నా ఆమె తిరస్కరిస్తుంది. ఈ కానూన్ తెచ్చిన సర్కార్ సల్లగుండాల అంటుంది. కర్నూలు జిల్లా, అక్కడు భాష , అహారపు అలవాట్లు అతికినట్ట్లు ఇందులో చిత్రించారు రచయిత. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..!’ అనే హిందూ పేరుపెట్టి ముస్లిం సమాజపు సమస్య మీద కథ రాయటం దత్తశర్మ గారి గొప్పతనం అర్దమవుతోంది.

ఈ దేశంలో రాజకీయ మార్పును కోరుకుంటూ ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ‘ఎవరూ వద్దు’ అనే కథలో ఆవిష్కరించడం జరిగింది కానీ అది ఒక కలగా మారిపోయింది. అలాగే కేంద్రం, ఉభయ తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న అనేక పథకాల లోపాలను చర్చించి అవి ఎలా ఉండాలో విడమర్చి చెప్పిన కథ ‘అమ్మా! ఆశ!’. నిజానికి ఇది ఒక కథ అనేకంటే ఒక వ్యాసం లాగా ఉంది అని చెప్పొచ్చు.

అచ్చమైన హైదరాబాదు నగర జీవితాన్ని ప్రతిబింబించిన కథ ‘పరధర్మో భయావహః’. సమకాలీన సమాజంలో ఒక వృద్ధ దంపతుల జీవితాన్ని ఈ కథలో చూపించారు రచయిత. అచ్చమైన హైదరాబాద్ నగర జీవితం ఎందుకు అన్నానంటే వనస్థలిపురంలో ఇల్లు ఉంటుంది. గచ్చిబౌలిలో ఆఫీస్ ఉంటుంది. ఇందులో అమెజాన్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఉంది. కొడుకులు కోడళ్ళు అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటారు. వృద్ధులైన తల్లిదండ్రులు వారి పిల్లల్ని అంటే మనవల్ని చూసుకుంటూ కాలం గడుపుతారు. ఈ వృద్ధుడు ఒకసారి స్నేహితుని ఇంటికి వెళ్లి ఆయనకు ఉన్న అందమైన 3 బెడ్ రూమ్ ఫ్లాట్, చీకూ చింతా లేని వారి జీవితాన్ని చూసి అసూయ పడతాడు. అది గమనించిన మిత్రుడు అప్పుడు ఒక మాట చెబుతాడు. ఒక రకంగా నిస్సారమైన జీవితం గడుపుతున్న మా ఇద్దరినీ ప్రేమగా పలకరించే వాళ్ళు లేరనీ, తిండి మీద కూడా ఆసక్తి పోయింది అంటాడు. అలా స్నేహితుని దగ్గర గడిపిన ఆ తండ్రి ఇంటికి చేరే లోపలే కొడుకు, కూతురు తన గురించి ఫోన్ చేయటం, ఎల్బీనగర్ మెట్రో దిగండి అక్కడినుంచి పిక్ అప్ చేసుకుంటాను అని ఫోన్ చేయడంతో ఆ తండ్రి ముఖం సంతృప్తితో వెలిగిపోతుంది. కారణం తన గురించి ఆలోచించే పిల్లలు వుండటం.

రచయితకి ఒక్కోసారి కొన్ని ప్రదేశాల మీద కొన్ని పాత్రల మీద కొన్ని పేర్ల మీద ఉన్న మోజు ఈ కథలో బయటపడిందని నా ఉద్దేశం. ఉదాహరణకి ఇందులో పాత్రల పేర్లు చూడండి కృత్తివాస మూర్తి అతని భార్య మరుద్వతి. కొడుకు దత్త ప్రసాద్, కోడలు మంజీరా వాళ్ళ అమ్మాయి పేరు ప్రమద్వర. అలాగే కూతురు అఖిల, అల్లుడు విరించి వారి బాబు పేరు ప్రద్యుమ్న. ఇలా అందమైన పేర్లతో రచయిత సృష్టించిన అందమైన కథ ఇది. సహజంగా రచయిత తాను తనకు తెలిసిన అంశాలనే కథల్లో ఉపయోగిస్తారు, వర్ణిస్తారు. తెలియని అంశం గురించి వివరంగా అధ్యయనం చేసి వాటిని తమ కథల్లో పొందుపరుస్తారు.

ఈ కథలో చాలా వివరంగా స్పష్టంగా వంట చేయడం గురించి రాయడం మనం గమనించవచ్చు. మామిడికాయ పప్పు, మజ్జిగ చారు, గోరుచిక్కుడుకాయ కూర, అటుకుల కిచిడీ ఎలా చేయాలో సవివరంగా తెలియజేశారు రచయిత. బహుశా ఆయనకి ఈ రంగంలో అపారమైన అనుభవం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ‘వంటొచ్చిన మొగుడు’ అనే టైటిల్‌తో ఏకంగా మరొక కథ ఉంది.

ఉద్యోగం చేసే మహిళ ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ఆఫీసుకు వెళ్ళేదాకా ఒంటి చేత్తో ఎన్నో పనులు ఊపిరాడకుండా నిర్వహిస్తుంది ఆ వివరాలన్నీ ‘అష్టావధానం’ కథలో వివరిస్తూ రచయిత ఆమె చేసే పనులకు అష్టావధానం లోని పృఛ్ఛకులతో పోల్చటం, అలాంటి గృహిణులు అందరూ అష్టావధానులే సుమండీ అంటారు రచయిత దత్తశర్మ గారు. మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించిన కథలు ఈ రెండు.

ఏ వ్యక్తయినా ప్రేమికుడు కావటానికి లేదా సెలబ్రిటీ కావటానికి రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి స్థలపురాణం, వంశ చరిత్ర అంటారు. ఒక వ్యక్తి ఏ ఊరిలో పుట్టాడు ఏ ప్రాంతంలో పెరిగాడు ఆ ప్రాంతము ఆ ఊరి యొక్క విశిష్టత అతని మీద ప్రభావం చూపుతుంది. రెండోది వంశ చరిత్ర. మనం జన్మించిన వంశము యొక్క పేరు ప్రతిష్ఠలు కూడా మనం ఎదగటానికి సహాయపడతాయి. అలా పండిత వంశంలో జన్మించిన దత్తశర్మ గారి మీద వాళ్ల నాన్నగారి ప్రభావం, ఆయన యొక్క పాండితీ ప్రకర్ష వారసత్వంగా అందాయి అనుకోవచ్చు. నా మీద నా తండ్రిగారి ప్రభావం ఉంది అని చెప్పుకోవటం సహజమే. కానీ నా మీద మా అక్కయ్య ప్రభావం కూడా ఉంది అని శర్మ గారు చెప్పుకున్నారు. బహుశా దాని ఫలితమే అనుకుంటాను ఈ పుస్తకంలో మొదటి కథ ‘పెద్దక్కయ్య’. ఈ కథలో అక్కాతమ్ముళ్ల అనుబంధం, ఈ కథను చిత్రించిన పరిసరాలు అన్నీ చూస్తుంటే బహుశా శర్మ గారి నిజ జీవిత గాధ అనిపిస్తుంది . ‘పెద్దక్కయ్య’ లో అక్క తమ్ముడు అనుబంధం చూపిస్తే ‘మన్నించు నాన్న’ అనే కథలో తండ్రి కొడుకుల అనుబంధం చక్కగా వర్ణించారు.

మొత్తంగా దత్తశర్మ గారి కథల్లో కుటుంబ జీవితానికి ప్రాముఖ్యత కనపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు, మానవ సంబంధాలు మీద ఈ కథలన్నీ ఫోకస్ చేయబడ్డాయి. ఈ రచయిత చిన్నప్పుడే వ్యవసాయం లోకి ప్రవేశించి ఇంటర్మీడియట్ నుంచి ఎంఫిల్ దాకా ప్రైవేటుగా చదువుకున్నారుట. వ్యవసాయంలో విశేష అనుభవం గడించిన దత్తశర్మ గారు అనంతరకాలంలో సాహితీ వ్యవసాయం దిగ్విజయంగా చేస్తున్నారు అనిపిస్తుంది.

శర్మ గారి కథల్లో గమనించాల్సిన మరొక విషయం ఆయన కాలంతో పోటీపడుతూ ముందుకు వెళ్తారు. ఆయన పాత్రలు, ఆధునిక కాలానికి అనుగుణమైన ఉద్యోగాలు చేస్తారు. టెక్నాలజీ ఉపయోగమే కాకుండా అది ఎలాంటి కీడును తీసుకొస్తుంది అనేది కూడా వివరిస్తారు. అందుకు ఉదాహరణ ‘స్మార్ట్ చిల్డ్రన్’ అనే కథ. ఒక స్మార్ట్ ఫోన్ చిన్న పాప జీవితాన్ని ఎలా ఛిద్రం చేస్తుందో ఈ కథలో చెప్తూ స్మార్ట్ ఫోన్ లేకపోతేనే పిల్లలు స్మార్ట్ అవుతారు అని చివరికి ఒక సందేశం ఇస్తారు.

భార్యాభర్తల అనుబంధాన్ని అనేక కథల్లో రచయిత అద్భుతంగా వివరించారు. వాటన్నిటిలో హైలైట్‌గా నాకనిపించింది ‘ఆత్మ సఖుడు’. ఈ కథలో భార్య చేత అన్ని సేవలు చేయించుకునే భర్త భార్యకు క్యాన్సర్ రాగానే ఒక్కసారిగా మారిపోతాడు. ఆమెకు జుట్టు తీయడం వల్ల ఆమెతో సమానంగా ఉండాలి అనే అభిప్రాయంతో అతను కూడా జుట్టును తీయించుకుంటాడు. అహర్నిశలు ఆమెను ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు.

కుటుంబ జీవితం గురించి ఇన్ని కథలు రాసిన దత్తశర్మ గారు ప్రేమ కథలు రాయలేదు ఏమిటి అనుకున్నాను. కానీ ‘నీలవంశీ మోహనం’ ఆ లోటు తీర్చింది. నాయికా నాయకులు రైలు ఎక్కినప్పటినుండి దిగే వరకు రైలు ప్రయాణంలో ఆ సన్నివేశాలు, వ్యక్తుల గురించి చేసిన వర్ణన, ఉపయోగించిన పదప్రయోగం ప్రబంధ సాహిత్యాన్ని గుర్తు చేసింది. అలాగే చారిత్రక నేపథ్యంతో రాసిన ‘పూర్వానుభవం’ కూడా మరో ప్రేమ కథ. నిజానికి ఈ రెండు కథల్లో కూడా శర్మగారు ప్రవచించిన రససిద్ధి కలుగుతుంది.

చివరగా ఈ పుస్తకానికే హైలైట్‌గా నిలచినవి ఆఖరి రెండు కథలు అని నా ఉద్దేశం. ‘భోక్తలు’ అనే కథలో సాంప్రదాయాలుకంటే సామాజిక సేవ గొప్ప తృప్తినిస్తుంది అంటారు. ఆఖరు కథ ‘ఈ బడి నాకొద్దు’ కార్పొరేట్ స్కూల్స్ వెంటబడ్డ తల్లిదండ్రులకు గొప్ప కనువిప్పు. ఈ రెండు కథలను చాలా అద్బుతంగా ముగించారు రచయిత. ఇన్ని మంచి కథలున్న ఈ సంకలనంలో విషయసూచిక లేకపోవటం ఒక లోటుగా కనపడుతుంది.

మొత్తానికి ఈ సంకలనంలో మనుషుల్ని బలంగా కదిలించే ఎమోషన్స్ పెద్దగా లేవు. అంటే రౌద్రం, భీభత్సం, భయం, కోపం మొదలైనవి. అలాగే దేశాన్ని పట్టిపీడించే సమస్యలు ఆకలి, నిరుద్యోగం, పర్యావరణం, బీదరికం, ఆరోగ్యం, విద్య. ఇలాంటి వాటి మీద కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

కానీ ఇవన్నీ ‘ఎవ్వరూ వద్దు’, ‘అమ్మా! ఆశ!’ కథలలో తాను కోరుకున్న ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థ గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

చాలా కథలు మన ఇంట్లో జరుగుతున్నట్టుగా ఉన్నాయి. చదువుతున్నంత సేపు ఎక్కడో ఒక చోట మన కుటుంబ సభ్యులను కలుసుకున్నట్టు గా ఉంటుంది. రచయిత చెప్పినట్లుగా చాలావరకు కథలన్నీ Pleasure విత్ మెసేజ్‌గా ఉన్నాయి. మనం హాయిగా రిలాక్స్ గా కూర్చుని ఆనందంగా చదువుకోవచ్చు.

ఇంతటి ఆనందకరమైన కథలు రాసినందుకు రచయిత అభినందనీయులు. మీరు చదవండి. చదివించండి. ఆనందించండి.

***

దత్త కథాలహరి (కథాసంపుటి)
రచన: పాణ్యం దత్తశర్మ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పుటలు: 200
వెల: ₹ 125/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత 9550214912 నెంబరుకు ₹ 125/- Gpay చేస్తే, పుస్తకం రిజిస్టర్ పోస్టు ద్వారా పంపబడుతుంది.

 

Exit mobile version