Site icon Sanchika

దయ చూపాలి

[dropcap]ఆ [/dropcap]రోజు శనివారం. సాయంకాలం పూట స్కూల్లో డ్రిల్లు క్లాసు జరుగుతుంది. డ్రిల్లు టీచరుగారు చేతిలో బెత్తం, నోట్లో విజిల్ పట్టుకుని వున్నారు. గ్రౌండ్‌లో డ్రిల్లు చేసే ఆడపిల్లల్ని విజిల్ వేసి, మధ్య మధ్యలో హెచ్చరిస్తున్నారు. కొన్ని ఎక్సర్‌సైజులు పూర్తయ్యియి. విశ్రామ్ చెప్పారు.

ఆడపిల్లలందరూ ప్లే గ్రౌండ్‌లో వున్న పచ్చి గడ్డిలోనే కూలబడ్డారు. పచ్చిగడ్డి పీకి కొంత మంది వాటి కాడలను నోట్లో పెట్టుకుని కోరుకుతున్నారు. మరి కొంత మంది ఒక చివరగా చేరారు. ప్లే గ్రౌండ్‌లో పచ్చిక ఒకచోట మరీ వత్తుగా వున్నది. దాని మీద రంగు రంగుల సీతాకోకచిలుకలు ఎగురుతూ వున్నాయి. అమ్మాయిలు పోటీ పడి వాటిని పట్టుకుంటున్నారు. పట్టుకోగానే వీళ్ల చేతులకు పుప్పొడి అంటుతున్నది. సీతాకోకచిలుకలేమో భయంతో రెక్కలు టపటపలాడిస్తున్నాయి.

“దీని శరీరం చాలా మెత్తగా తగులుతూ చక్కిలిగిలి పుడుతున్నది” అంటూ సీతాకోకచిలుకను పట్టుకున్న నీరజ గంతులేయసాగింది.

“ఏదీ చూద్దాం?” అంటూ లక్ష్మీ సీతాకోకచిలును తన చేతిలోకి తీసుకున్నది. ఎడం చేత్తో తన జామెంట్రీ బాక్సు తెరిచి మూలమట్టంతో దాన్ని పర్రున మధ్యకు కోసింది.

“ఏయ్! ఏమిటా పని” అని నీరజ మొత్తుకున్నది.

“దీని ఒంటి మీద ఇన్ని రంగులున్నాయి కదా?  శరీరం లోపల ఎలాగుంటుందో చూద్దాం” అన్నది లక్ష్మి.

క్రిందటి సారి డ్రిల్లు క్లాసప్పుడు లక్ష్మి చేసిన పని గుర్తుకొచ్చింది నీరజకు. వత్తుగా పెరిగిన పచ్చిక, తుంగ మొక్కలూ కలసి వున్నాయి. ఆ పచ్చికలో ఒక చిన్న పక్షి గూడు పెట్టుకున్నది. అదసలే చిన్న పక్షి. ఆ గూట్లో రెండు చిన్న పక్షి పిల్లలున్నాయి. వీళ్లు దగ్గర కెళ్లి కూర్చోగానే ఆ పక్షి పిల్లలు తమ ఎఱ్ఱని బుల్లి నోటిని తెరిచాయి. తల పైకెత్తి వీళ్ల వంక చూశాయి. నీరజకయితే అవి ఎంతో ముద్దు వచ్చాయి. వాటిని చేత్తో అటూ ఇటూ కదిపింది. భయంతో అవి కీచు కీచు మని అరిచాయి. ఆ అరుపులకు తల్లి పిట్ట ఎక్కడి నుండో పరుగెత్తుకొచ్చింది. వీళ్లను చూసి భయంతో కొంచెం దూరంలో ఆగిపోయింది. లక్ష్మి మాత్రం ఒక పక్షి పిల్లను చేతిలోకి తీసుకున్నది. అది కీచు కీచు మంటున్నా లెక్క చేయలేదు. దాని కింకా తోక కాని, రెక్కలు కాని ఏమీ రాలేదు. ఎఱ్ఱని లక్క చిట్టి లాంటి నోరు, మెరిసే చిన్న కళ్లూ మాత్రమే కనపడుతున్నాయి. ముడుచుకుని వున్న దాని కాళ్లను, లక్ష్మి అటూ, ఇటూ లాగసాగింది. “వద్దు లక్ష్మీ, దానికి నొప్పి పెడుతుంది” అని నీరజ వారించింది. “ఏదీ ఎగురు, ఎగురు” అంటూ మళ్లీ మళ్లీ దాని కాళ్లను గట్టి గట్టిగా లాగింది. అది బాధతో విలవిలలాడింది. నీరజకయితే దాని కాలు విరిగి వుంటుదనే భయమేసింది.

ఇప్పుడు ఆ సంగతి గుర్తుకురాగా, నీరజ డ్రిల్లు టీచరు గారి దగ్గరకెళ్లి లక్ష్మి చేసే పని గురించి చెప్పి వచ్చింది. ఆమెతో చెప్తుంటే నీరజకి ఏడుపు ఆగటం లేదు. ఆమె వెంటనే వచ్చారు. లక్ష్మి జామెంట్రీ బాక్స్ సర్దుకుంటున్నది. తన పక్కన తెగిపడ్డ సీతాకోక చిలుక రెక్కలు పడివున్నాయి. టీచరుగారిక్కూడా బాగా కోపం వచ్చింది. కాని తామాయించుకున్నారు.

కుర్చీ తెప్పించుకుని ఆమె అక్కడే కూర్చున్నారు “అమ్మాయిలూ! ఇలా చూడండి. మీకు రంగు రంగు సీతాకోకచిలకలంటే ఇష్టమేనా?” అనడిగారు.

“చాలా ఇష్టం” అని చెప్పారు పిల్లలు.

“మీ ఆడపిల్లలలాగానే అవీ చాలా అందంగా, సుకుమారంగా వుంటాయి. వీటి వలన పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది. సీతాకోకచిలుకల వలనే పరపరాగ సంపర్కం జరిగి, విత్తనాల అభివృద్ధి జరుగుతుందని మీరు సైన్స్ పాఠాల్లో చదువుకుంటున్నరు అవునా?” అన్నారు.

“అవును” అని సమాధాన మిచ్చారు పిల్లలు.

“సీతాకోకచిలుకల్లాగానే పక్షులు కూడా చాలా అందమైనవి. ఇవి కూడా పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి. క్రిమి కీటకాలను తినేస్తాయి. పక్షి బతికి లేకపోతే మానవ జాతికి చాలా ముప్పు వస్తుందని శాస్త్రవేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు. అవి ఎంత తెలివిగా వుంటాయి? కొన్ని పక్షులు వలసపోతాయి. మళ్లా కొన్నాళ్లకు తమ పాత చోట్లకే తిరిగి వస్తాయి. చూడమ్మా లక్ష్మీ! నువ్వు పక్షి పిల్లన్నీ, సీతాకోకచిలుకల్నీ బాధ పెట్టకూడదు. తల్లి తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో, ఇతర ప్రాణుల్ని కూడా అంతే దయగా చూస్తుంది. మనం ఏ ప్రాణినీ హింసించకూడదు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు సహజంగా తోటి ప్రాణుల పట్ల సానుభూతిగా, ప్రేమగా వుంటారు. అలాంటి ప్రేమను నువ్వు అలవాటు చేసుకో, సీతాకోకచిలుకను అడ్డంగా కోసినప్పుడు దాని ప్రాణం ఎంత విలవిలలాడిందో ఊహించుకో. అలాగే చిన్న పక్షి పిల్ల కాలు లాగినప్పుడు దానికి ఎంత నొప్పి పుట్టి వుంటుందో ఆలోచించు. మన కాలిక్కాస్త ఎదురు దెబ్బ తగిలితేనే మనం అల్లాడిపోతాం. ఏ పక్షి అయినా గాయపడితే దయగా చూడాలి. ఏ పశువుకైనా దెబ్బ తగిలితే దాన్ని ప్రేమగా సాకాలి. అంతే కాని మనమే హింసించకూడదు. తూనీగల్ని, సీతాకోకచిలుకల్ని పట్టుకోవటం, వాటిని నలిపెయ్యటం లాంటివి చేయకూడదు. ఇంకెప్పుడూ ఇలా చేయనని నాకు మాటివ్వు” అన్నారు.

ఇంత మంది తోటి పిల్లల మధ్య టీచరుగారు అలా అడిగే సరికి లక్ష్మికి నీరజ మీద చాలా కోపం వచ్చింది. రోషమూ వచ్చింది. కాని వెంటనే తన తప్పునూ తెలుసుకుంది.

“అలాగే టీచర్! ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చెయ్యను, తెలియక చేశాను, క్షమించండి” అన్నది. ఇంతలో బెల్ మోగింది.

Exit mobile version