దయారణ్యం!!

0
2

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘దయారణ్యం!!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]గ[/dropcap]త నెల రోజులుగా వినిపిస్తూనే ఉన్నది తండాలోని, మగవారి మాటల్లో, నరభక్షకి (man-eater) ఒకటి తిరుగుతోందని, ఆపద తమకూ, తమ పిల్లలకూ, పొంచి ఉన్నదనీ!

ఆడవారి చెవుల కూడా పడ్డ విషయమే అయినా, “నీ కెందుకు, గమ్మున కూచో, మేం లేమా?” అనే గద్దింపే, తమకు వచ్చే స్పందన అని వారు వినీ విననట్టే, తెలిసీ తెలియనట్టే ఉంటున్నారు, గుండెల్లో గుబులు తోనే!

కొండ దేవరనీ, ఇప్పపూల మాలచ్చినీ, మొక్కని క్షణం లేదు, తమనూ, పిల్లలనూ క్షేమంగా చూడమని!

చలికాలం!

దట్టమైన అటవీ ప్రాంతం, అంత తేలిక కాదు గదా, గాయపడిన, కొత్త రుచికి అలవాటు పడిన, క్రూరమృగాన్ని పట్టుకోవడం!

అధికారుల యత్నాలు వారు చేస్తూనే ఉన్నారు, ఇవ్వతగ్గ సూచనలు, హెచ్చరికలు తండా ప్రజలకు చేరవేస్తూ!

***

నీల ఎనిమిదేళ్ళ పిల్ల!

నల్లగా ఉన్నా, కళ గల ముఖవర్చస్సు, గలగలమని మాట్లాడే పిడుగు!

ఏరు లాంటి ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉంటుంది, ఆ ప్రాంతంలో, ఉన్న అందరికీ ఎంతో ఇష్టురాలై!

అందరంటే-ఉన్న కొందరూ అనే!

పట్టుమని పాతిక గుడిసెల చిన్న తండా, అది.

ఈ పిల్లే, ప్రస్తుతం అక్కడే కాస్త దూరంలో ఆడుకుంటున్న తన ఏడాది చెల్లెలికి కూడా రక్షణ!!

***

గుండెల్లో పెట్టుకొని చూసే అయ్య కొమరం నాయక్, నిన్ననే పట్నం వెళ్ళాడు, ఏదో పని మీద, రెండు రోజుల్లో తిరిగి వస్తానని!

పిల్లలిద్దరినీ మాత్రమే వదిలి వెళ్ళటం సుతరామూ ఇష్టం లేకపోయినా, పుల్లలు, చింతచిగురు, పళ్ళు, ఇప్పపూలు లాంటివి త్వరగా తీసుకుని తిరిగి వచ్చేద్దామని అడవిలోకి వెళ్ళిన ఆ పిల్లల తల్లి!

దూర దూరంగా ఉండే గుడిసెలన్నీ దాదాపు నిర్మానుష్యాలే, ఆ సమయంలో!

అంతా నిశ్శబ్దం, అడపాదడపా వినిపించే పక్షి అరుపు తప్ప!

***

ఎర్రటి చల్లటి అగ్గి గోళం లాగా కనబడుతున్నాడు దిగబోతున్న సూరీడు, నీల కళ్ళకి! అది చూసి,అమ్మ వచ్చేసే వేళైందిలే అని కూడా అనుకుంది, సంతోషంగా!

కొన్ని గజాల దూరంలో మట్టిలో పారాడుతున్న ఏడాది చెల్లెలిని ఒక కంట కనిబెడుతూనే, తాళ్ళ ఊయలలో ఊగుతోంది నీల, కూని రాగం తీసుకుంటూ!

***

అంతలో, ఆ అమ్మాయి చేతులు బిగిసి పోయాయి, ఉయ్యాల తాళ్ళకు!

నిశ్చేష్టురాలైంది, కనుచూపు మేరలో మెల్లగా, కాస్త కుంటుతూ వస్తున్న పులిని చూసి!

చెల్లెలిని పరిగెత్తి తెచ్చేయమని మెదడు హెచ్చరిస్తూనే ఉన్నది, కానీ శరీరం కదలటం లేదు!

ఒళ్ళు కట్టె లాగా అయిపోయింది, ఉయ్యాలలో!

కళ్ళు మాత్రం చూస్తున్నాయి, ఏమీ తెలియక దిక్కులు చూస్తున్న చెల్లెలి వైపే!

మాట పెగలటం లేదు, నోరు ఎండిపోయి!

ఇంతలో, వెనక నుంచి ఎవరో తనను బలంగా లాగి, ఎత్తినట్లై వెనక్కి తిరిగి చూసింది!

నాల్గు రోజులు క్రితం వచ్చిన, రెండు గుడిసెల అవతలి, గుంజన్ తమ్ముడు, రంజన్ నాయక్!

22 ఏళ్ళ, మద్ది చెట్టులాంటి అవతారం!

పూలతీగె లాంటి నీలను బుజం మీద వేసుకొని పారిపోవటం మొదలెట్టాడు!

కళ్ళప్పగించి చెల్లెలి వైపే చూస్తూ అరుస్తున్న నీల అరుపులు, వినే వారెవ్వరూ ఉన్నట్టు లేరక్కడ!

***

దాదాపుగా చెల్లెలి దగ్గరకు వచ్చేసిన పులిని చూసి వణికిపోతున్న నీలకు, మరు నిమిషం అర్థమయ్యింది, అది ఇప్పుడు తమ వైపు దూసుకు వస్తోందని!

పులి, పసి పిల్ల దగ్గర ఆగకుండా, ఏమీ చేయకుండా, ఆ చోటును దాటి తమ వైపే వస్తోందని!

అప్పటి వరకూ, అడుగులో అడుగు వేస్తున్నది, అకస్మాత్తుగా వేగం పెంచి, పూర్తి వేగం పుంజుకుని, విసురుగా రావటం, నాయక్‌ని ఒక్క పంజా దెబ్బతో కిందకు పడ వేయటం, బరబర, పొదల్లోకి, ఆ పైన అడవి లోకీ లాక్కొని పోవటం జరిగిపోయింది, లిప్తపాటులో!

ఆశ్చర్యం!

నీలకు ధబ్బున కింద పడినందువల్ల చేతి మీద, కాలి మీద అయిన గాట్లు తప్ప, ఏమీ కాలేదు!

సాహస వీరుడిగా పేరున్న కొమరం నాయక్ కూతురు, నీల!

గుండె దిటవు గలది!

చెదరలేదు, బెదరలేదు!

వెను తిరిగి చూస్తే—

అప్పుడే కట్టెల కట్ట దింపుకొని, సంచీ పక్కన పెడుతూ, నొసటి చెమటను తుడుచుకుంటున్న అమ్మ దగ్గరికి, పడుతూ లేస్తూ వెళ్తున్న చెల్లెలు కనపడింది.

చావుకు దగ్గరై, బతికినట్టనిపించింది, నీలకు!

ఆ అమ్మాయి చెల్లెలిది, ఏదీ తెలియని వయస్సు, స్థితి!

***

చెల్లెలిని – అడవి పులి వదిలేసింది!

అక్కను – నర క్రౌర్యం నుంచి, అదే పులి కాపాడింది!

***

కూతురి ద్వారా అంతా విన్న, తల్లి,

“మా కొండదేవర చలువ, మా ఇప్ప కొమ్మ అమ్మోరు కంటి దయ” అనుకుని కోటి దండాలు పెట్టుకుంది మనసులో!

***

ఆ రాత్రి కునుకే లేదు తల్లికీ, నీలకూ!

తల్లి ఒడే కొండంత ధైర్యం, బలం అనుకొనే పసిపిల్ల మాత్రం ఆదమరిచి నిద్రపోయింది!

***

తెల్లారగానే, మొదటి బస్సుకి ముగ్గురూ అడవి వదిలి బయలుదేరారు, పట్నానికి!

బస్సు డబడబ చప్పుడుతో బయలుదేరిన కాస్సేపటికి దూరంగా, కనబడుతున్న కొండకూ, ఇప్పచెట్టుకూ తల్లి దణ్ణం పెట్టుకోవటం చూసి, కిటికీలోంచి తనూ చేతులు జోడించింది నీల, అమాయకంగా, ఆటగా!

బస్సు దిగగానే, భర్త కొమరం కలవటానికి వచ్చిన ఆసామికి సంబంధించిన కలప మిల్లుకు ఆమె నడక ఆరంభించింది!

తల్లి చంకన పసి పిల్ల, పక్కనే వేలు పట్టుకుని నడుస్తున్న నీల!

***

అరణ్యంలో అమ్మోరు దయ చూసింది!

ఈ జనారణ్యంలో కూడా ఆ తల్లి చల్లని చూపు వీరి మీద, బహుశా ప్రసరిస్తూనే ఉంటుంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here