రంగుల హేల 27: “దయామయులు కురిపిస్తున్నహిమ సమూహాలు”

1
2

[box type=’note’ fontsize=’16’] “ఇంతటి ఉత్పాతంలోనూ బాధితుల పట్ల మానవత్వంతో పెక్కుమంది చూపిస్తున్న సేవాభావం వినే వారి హృదయాలకు ఆనందాన్నీ, ఊరటనీ ఇస్తున్నది” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]ఆ[/dropcap]శావాదం అంటే తెలుగింటి ఆడపడుచులు కరోనా కల్లోలంలో కూడా ఆవకాయ పచ్చళ్ళు, వడియాలు పెట్టు కోవడం, అపరాలు ఎండబోసుకుంటూ బిజీగా బిజీగా ఉండడం అంటూ కొందరు టిక్-టాక్ కుర్రాళ్ళు అందరినీ నవ్వించారు.

ఈ కరోనా విపత్తు ధనిక పేద దేశాల మధ్య దూరాన్ని చెరిపేసింది. అభివృద్ధి చెందిన, దశాబ్దాలుగా చెందుతూ ఉన్న, చెందని.. ఇలాంటి భేదభావాలు లేకుండా సర్వమానవ సమానత్వ భావనతో అందరినీ ఒకేలా కౌగలించుకుంది. రాజూ, పేద అనే వివక్ష కూడా పెట్టుకోలేదా కోవిడ్ 2019. డర్టీ ఇండియా అని మనసులో అనుకుంటూ అప్పుడప్పుడూ తప్పదన్నట్టు వచ్చి నీళ్ల సీసాలు మోసుకుంటూ, ఆచి, తూచి తింటూ, పిల్లల్ని పదిలంగా చూసుకుంటూ ఉండే అమెరికా భారతీయ సంతతి ఇప్పుడు అవాక్కయ్యింది. అమెరికా ఎంత హైజినిక్‌గా ఉంటుందో అన్నవాళ్ళను అపహాస్యం చేసేలా కరోనా అక్కడే ఎక్కువగా భయపెడుతోంది, సైంటిఫిక్ కారణాలు ఏమైనా కానీ. ఇంకా ఇటలీ, స్పెయిన్ లాంటి అనేక ఇతర దేశాలదీ ఇదే పరిస్థితి.

హఠాత్తుగా విరుచుకు పడ్డ ఈ మహమ్మారి దెబ్బకు మ్రాన్పడిపోయిన ప్రపంచ జనావళి యావత్తూ ఇంకా పూర్తిగా గుక్క తిప్పుకోలేదు. అసలీ ఆపద పూర్తిగా తొలగిపోతే కదా ఊపిరి పీల్చుకోవడానికి! అయినా మొండి ధైర్యం తెచ్చుకుని అన్యాయంగా తమవారిని పొట్టన పెట్టుకుంటున్న కోవిడ్ 2019 బారిన పడకుండా తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలీక సంబంధిత వైద్యులు, అధికారులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉంది భూలోక ప్రజ.

ఇంతటి ఉత్పాతంలోనూ బాధితుల పట్ల మానవత్వంతో పెక్కుమంది చూపిస్తున్న సేవాభావం వినే వారి హృదయాలకు ఆనందాన్నీ, ఊరటనీ ఇస్తున్నది. ఎప్పుడూ నిరుడు కురిసిన సమూహాలనే కాదు, ఆర్తులపై తోటి మానవులు నేడు కురిపిస్తున్న సేవా హిమ సమూహాలను గమనించి వారిని కొనియాడి తీరవలసినదే అనిపిస్తున్నది.

ముఖ్యంగా, దేవుడి రూపాలుగా పిలవబడే డాక్టర్లు గొప్ప సేవా గుణంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైరస్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు మరణించారు. ఇది అందరికీ ఎంతో మనస్తాపం కలిగించిన విషయం. వారి త్యాగానికి మనమంతా చేతులెత్తి మొక్కవలసిందే. సైక్రియాట్రిస్టులు తమ వంతు సేవగా ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. “దయచేసి ఎవరూ పానిక్ కావద్దు. ఇది ఏ ఒక్కరిదో, ఒక ఇంటి సమస్యో కాదు. ఎవరికీ ఈ స్థితి భరోసానివ్వట్లేదు. ప్రతివారికీ తమ ప్రాణాల పట్ల, ఆ పై భవిషత్తుపట్లా భయమే ఉంది. అయితే అందరం కలిసి పోరాడదాం. ఆందోళన పడి చేసేదేం లేదు. ఉమ్మడిగా ఈ శత్రువుని ఎదుర్కొందాం. భూమిని వదిలి పారిపోలేం కనుక కరోనాతో కలిసి జీవిస్తూనే మాస్క్‌లూ, శానిటైజర్‌లూ వాడుతూ మన వంతు జాగ్రత్త తీసుకుందాం” అని హిత బోధ చేస్తున్నారు.

మృత్యువు కోరలు సాచి కబళిస్తున్న కరోనా కష్ట కాలంలో తిండికే ఇబ్బంది పడుతున్న అసహాయులకు ప్రభుత్వంతో పాటు కొందరు మానవతా మూర్తులు ఆహారం, నీరూ అందజేస్తూ ఇంకా ఇతర సౌకర్యాలను కలుగజేసి ఆదుకుంటూ ఉన్నారు. ప్రపంచాన్ని వరదలా ముంచెత్తిన ఈ ఉపద్రవం నుంచి జనావళి బయట పడడానికి చేసే ప్రయత్నంలో ఎందరో దాతలు ఏదో ఒక రూపంలో ఇస్తున్న చేయూత మనపై మనకి నమ్మకాన్ని పెంచుతోంది.

సమూహం ఇచ్చే ధైర్యం, సమాజం ఇచ్చే ఆత్మ విశ్వాసం గొప్పవి. జీవుల్ని అనుసంధానిస్తుంది ఏకత్వం. అందరిలో ఉంటుంది కనబడని దైవతత్త్వం. పోలీసులు ఇల్లొదిలి, ప్రాణాపాయాన్ని గుర్తెరిగి కూడా సేవ చేస్తున్నారు. అది వారి ఉద్యోగమే కావచ్చు కానీ అధిక సమయాన్ని వెచ్చించి ఇంటి బయట డ్యూటీ చెయ్యడం, ఒకోసారి పోలీసు స్టేషన్ లోనే నిద్రించడం అంటే దేశ రక్షణకై సిపాయిలు చేసే పని చేస్తున్నారు. లక్షల్లో ఉన్న వలస కార్మికుల కోసం నడుపుతున్న ప్రత్యేక శ్రామిక రైళ్లలో ప్రాంతాలవారీగా ప్రయాణీకులకి రైల్ టిక్కెట్లు, సీట్‌ల కేటాయింపు కోసం రైల్వే ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు.

అధికంగానే ఉన్న అంతర్రాష్ట్ర ప్రయాణీకులకు ఆన్‌లైన్ పాస్‌లు జారీ చేస్తూ ప్రభుత్వోద్యోగులు అధిక శ్రమ కోర్చి తమ వంతు సర్వీస్ చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ప్రయాణికులు ప్రయాణం చేసే దారిలోపోలీస్ సిబ్బంది రేయింబవళ్లు చెక్ పోస్టుల వద్ద టెంట్‌లు వేసుకుని కూర్చుంటున్నారు. వాహనాలను ఆపి వారి పాస్‌లను ఆధార్ కార్డుతో సహా తనిఖీ చెయ్యడం.. వారిలో కరోనా లక్షణాలున్నాయేమో పరీక్షించి ఉన్నవారిని ప్రభుత్వ క్వారంటైన్‌కి తరలించడం లేదంటే ఆ ప్రయాణీకుల అడ్రస్, ఫోన్ నంబర్లతో లిస్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందచేయడం అనేది వారు చేస్తున్న పెద్ద పని. ఈ పని అన్ని రాష్ట్రాలూ విజయవంతంగా చేస్తున్నాయి.

ప్రభుత్వం తరఫు నుంచి ఆరోగ్యశాఖ వారు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వారి కోవిడ్ తనిఖీ శాఖతో పాటు పోలీసు డిపార్ట్మెంట్ లోని ఇంటిలెజెన్స్ శాఖ వారు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉంచబడిన వారి ఫోటో తీసుకుని వారి ఆరోగ్యంపై నిఘా పెట్టి వారు ఇతరులతో కలవకుండా వారి ఇంటి తలుపుపై ఈ క్వారంటైన్ వివరం రాసిన కాగితం అంటించి రెండు మూడు రోజుల కొకసారి వారిని వచ్చి చూడడం కానీ, లేదంటే ఫోన్లో ఆరోగ్య వివరాలు కనుక్కుని ఫోటో పంపమని తెప్పించుకుని పరిశీలించడం కానీ చేస్తున్నారు. ఒక వేళ కరోనా వస్తే వెంటనే వచ్చి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు పంపడం వారి డ్యూటీ. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌కు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఆన్‌లైన్ అనుమతితో వచ్చేవారు అధిక సంఖ్యలోనే ఉంటారు. మరి అంత మందిని పరిరక్షించడం చిన్న విషయం కాదు కాదు. ప్రయాసతో కూడుకున్న కర్తవ్యం.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకొన్ని చారిటబుల్ ట్రస్ట్‌లు అన్నదానాలు చేస్తే, కొన్ని బియ్యం పప్పు, బంగాళాదుంపలున్న కిట్లు పంచాయి. వలస కార్మికులున్న శిబిరాలకు, తమ ఊరి దారిలో ఉన్నవారికి కొందరు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారం సమకూర్చారు. ఎంతోమంది దాతలు డొనేషన్ లిచ్చారు. బడా పారిశ్రామిక వేత్తలు, కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి పారిశ్రామికాభివృద్ధి కోసం పని చేసే సంస్థలు మొదలుకొని అనేక సంస్థలు, ఉద్యోగులు, పెన్షనర్లు తమ శక్తి కొలదీ సాయం చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గత రెండున్నర నెలలుగా అన్నిటికన్నా ముఖ్యమైన కర్తవ్యం ఈ వ్యాధితో పోరాటమే అయ్యింది. అధిక బడ్జెట్ కేటాయింపుతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ పనికోసమే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పనిచేస్తోంది. ప్రముఖ స్టీల్ సంస్థ మొదలుకొని అనేక ఇతర సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు వందల కోట్ల రూపాయలు ప్రధాని సహాయనిధికి ధనం అందించాయి. అనేక ఫౌండేషన్లు, ఎంజీవోలు, సినీనటులు ఇంకా చాలా మంది ప్రముఖులు భూరి విరాళాలిచ్చారు. సామాన్య పౌరులు కూడా తమ వంతుగా సహాయం అందించారు. శానిటైజర్స్, పీ.పీ.ఈ. కిట్స్ కొనుగోలు కోసం కొన్ని ఎంజీవోలు తోడ్పడ్డాయి.

అదృశ్య రూపంలో వెంటాడుతున్న శత్రువు భయంతో అయోమయంగా చెప్పుల్లేని పాదాలతో పరిగెడుతున్న శ్రామిక సోదరులకు వారి బాటలో ఆహరం, నీరు రూపంలో దయాపూరిత పూలు పరిచిన వదాన్యులు ఎందరో ఉన్నారు. ఎన్నో దేశాల ప్రభుత్వాలు వందల కోట్ల ఖర్చుతో పరిశోధనలు జరుపుతున్నాయి. ఫార్మా కంపెనీలు కూడా ఆ పనిలో ఉన్నాయి. ఆ యా దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని సమూలంగా నాశనం చెయ్యడానికి మందు కోసం, టీకా కోసం ప్రయోగశాలల్లో నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే విపత్తు పెద్దది. అందరికీ ఒకే ప్రాణభయం.అయినప్పటికీ ప్రతి వారూ తమకు వీలయినంత మేర సేవాభావంతో పని చేయడం ఎంతో బావుంది.

వార్తా టీవీ చానెల్స్ జుట్టు విరబోసుకున్న యాంకర్లచేత కరోనా మరణ వార్తలు నిరంతర స్రవంతిగా వినిపిస్తున్నా అధైర్యపడకుండా గృహిణులు…భక్తి చానల్స్ వారి భగవద్గీతను గుర్తు చేసుకుంటూ కర్తవ్యోన్ముఖులయ్యారు. రోజులో అధిక భాగం వంటలు చేస్తూ కిచెన్ లోనే ఉంటూ.. ఇంటికే పూర్తిగా పరిమితమయ్యి ఆఫీసునే ఇంటికి తెస్తున్న భర్తలు తమ పని చెడగొట్టకుండా మెలకువతో ఉంటూ, పిల్లలు… టీవీలను, టాబ్, మొబైల్స్‌ని కబ్జా చేసి కార్టూన్ మూవీస్‌తో హోరెత్తిస్తున్నా భరించిన వారి సహన సేవను మరీ మరీ కొనియాడక తప్పదు. వారి విశ్రాంతి సమయం పోయినందున ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని వారెక్కడా ప్రస్తావించను కూడా లేదు. అదీ వారి సహకార సేవ.

కవులు వలస కూలీల దుస్థితికి సహానుభూతి చెంది తోటి వారిని తట్టి లేపుతూ ఎన్నో కవితల్ని సృజించి వాటిని చదివిన ఎందరినో తమ వంతు డొనేషన్ అందించేలా మేల్కొలిపారు. ఇంకా జీవితం అంటే రేపటి ప్రమాదానికి సిద్దము కావడమే అంటూ ప్రతి తెలుగు వాడినీ ధైర్యపరిచారు. భారతదేశం యొక్క లౌకిక తత్వాన్ని వివరిస్తూ కరోనా సంకట సమయంలో కుల, మత భేద భావాలతో అపోహలొద్దంటూ కథకులు కధల ద్వారా సందేశం ఇచ్చారు. ఈ ముప్పు పరిణామాల గురించి ఎందరో వ్యాసకర్తలూ, కాలమిస్టులూ వివరంగా రాసారు. రచయితలు పాటలు రాశారు. గాయకులు పాడారు. దర్శక నిర్మాతలు సినిమాలు కూడా తీశారు. అది వారందించిన సేవ.

వణికిస్తున్నకరోనా తుఫాను తాకిడికి నేలమట్టమైన ఆత్మస్థైర్యం నుంచి మానవ జాతి బయట పడి తిరిగి కొత్త జీవితం ప్రారంభించవలసి ఉంది. ఒక నూతన జీవిత సత్యం ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించింది. ఒక పెద్ద విప్లవం తర్వాత ఒక కొత్త భావ జాలం మనుషుల్లో ఆచరణకు రాబోతోంది. ఒక కొత్త జీవన విధానం, సరికొత్త ఆలోచనా ధోరణి మనిషికి పునర్వికాసం కల్పించేదిగా ఉండబోతోంది. సర్వమానవ సౌబ్రాతృత్వ దిశగా మానవాళి హృదయ పూర్వకంగా పయనించబోతోంది. భవిష్యత్తులో రాబోయే అనేక సంకటాలకిది శిక్షణా కాలం అనుకుందాం. గొప్ప ఆశావాద సౌధం లోకి ఆనందంగా, ఉత్సాహంగా అడుగిడదాం పదండి.

కష్టాల్లో మనుషుల మనసులు ద్రవీభవిస్తాయి. వ్యాకోచించి పక్కవారిని దగ్గరకు తీసుకుని తమలో కలుపుకుంటాయి. “ఎల్ల లోకము లొక్క యిల్లై వర్ణ భేదములెల్ల కల్లై” అని గురజాడ చెప్పినట్లు మనమంతా ఒక్క కుటుంబం వలె కలిసిమెలిసి ఉంటూ ప్రపంచ మానవులపై ప్రేమబంధం పెంచుకుందాం. సౌహార్దం పంచుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here