దీనిభావమేమి తిరుమలేశ

2
2

[box type=’note’ fontsize=’16’] ఆదివారం ఆటవిడుపుగా ఉంటుందని కొలీగ్ ఇంటికి భోజనానికి వెళితే, ఆయన స్వీయ కవితాగానం వినిపించి అక్షరాలను హత్తుకుంటమంటారు తన సహోద్యోగులని- సి. ఉమాదేవి కథ “దీనిభావమేమి తిరుమలేశ“లో. [/box]

[dropcap]“రే[/dropcap]పు ఆదివారం నేను నీకు సెలవు ప్రకటిస్తున్నాను”

శనివారం రాత్రి ఉపవాసమని పేరేకాని జీడిపప్పు వేసి చేసిన ఉప్మాను ఘనంగానే లాగిస్తూ చెప్తున్న సురేష్ వైపు ఆశ్చర్యంగా చూసింది వసంత.

“నమ్మకం లేదా? నిజంగానే చెప్తున్నా” తను చెప్పింది నూరు శాతం నిజం, ఒట్టు అన్నట్లు తలపై చేతిని పెట్టుకున్నాడు.

“సెలవా! నాకా! ఆదివారం వస్తే చాలు మీరు, మీ కొడుకు నోటికి రుచిగా కావాలని రకరకాలు కోరుతారే. ఇదేదో ఆశ్చర్యంగా ఉందే! ఇంతకీ ఏమిటి విశేషం?”

“విశేషమే మరి, మన చైతన్యమూర్తి లేడూ, అదే రిటైర్డ్ సోషల్ టీచర్”

“నాకెందుకు తెలియదు! క్లాస్ అయిపోయినా పాఠం ఆగదు మనకు శోషవచ్చి పడేదాకా అని స్టూడెంట్స్ ఏడ్చేవాళ్లుగా!”

గుర్తుకు తెచ్చుకుని నవ్వేసింది వసంత.

“రేపు ఆయన ఇంట్లో భోజనానికి రమ్మని మా అందరికి ఆహ్వానం అందిందిగా మరి.”

“మీ అందరికీనా?” ఆసక్తిగా అడిగింది.

“ఆహా… అంతే మరి. నీకు ఆటవిడుపే కదా .”

‘ఏమిటో విశేషం!’ మనసులోనే పిలుపులోని ఆంతర్యాన్ని అంచనా వేసుకుంటోంది వసంత.

చైతన్యమూర్తి అందరిని ఆప్యాయంగా పిలిచాడు. తనతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుడిని పిలిచాడు. దాదాపు పదిమంది స్నేహితులు. వయసు కాస్త అటు, ఇటుగా అందరు తలపండిన వాళ్లే! కొందరు చతుర్ముఖ పారాయణులు! కబుర్లు కలబోసుకుని నాలుగు ఆటలు ఆడితే భలే హుషారుగా ఉంటుంది అనుకుంటున్నాడు సురేష్. వసంతకు సెలవన్నాడు కాని అతనికే నిజమైన ఆటవిడుపు అన్నంత సంబరంగా ఉన్నాడు.

అనుకున్న సమయం రానే వచ్చింది. చిరునవ్వుల కలబోతలు, జ్ఞాపకాల తలపోతలు!

చాలా రోజుల తరువాత కలుసుకున్నామన్న ఆనందం అందరిలో. కూర్చోవడానికి చాపలు వేసారు. పరచుకునే పేకముక్కలు, విస్తళ్ల భోజనాలు అనుకుంటూ అందరు సంబరంగా కూర్చున్నారు.

ఇక ఆట మొదలవుతుందన్న ఉత్సాహంతో పేకముక్కలకోసం అందరి కళ్లు అటు ఇటు కలియచూస్తున్నాయి.

“మీరు ఏదో ఊహించుకుని వచ్చారు. కాని ప్రస్తుతం పేకాట మన విస్తరి లోనిది కాదు.”

అందరు వింతగా చూసారు.

“అయితే ఉత్తి ఆకులేనా?” గలగలా నవ్వాడు తెలుగు మేస్టారు.

“ఎందుకు తొందర?” కూర్చుంటూ తన చేతిలోనున్న కాగితాల కట్టను ఆసక్తిగా తిరగేయసాగాడు చైతన్యమూర్తి.

గొంతు సవరించుకుని నీళ్లసీసానందుకుని ఓ గుటకేసాడు.

అందరికి ఎంతో కొంత అర్థమవుతోంది. అవగాహన ఆకృతి దాల్చేలోపు ధారగా కురవసాగింది. వర్షపు ధారకాదు… కవితాధార!

అంతలో ఎవరిదో ఫోను మోగింది.

‘సెల్ ఫోనులో సొల్లు,

పెరుగు చూడు బిల్లు

చెప్పకు ల్యాండ్ ఫోనుకు చెల్లు

పాతబాటలో కూడా వెళ్లు’

“క్రికెట్ మొదలైపోతుంది భోజనాలైపోయే లోపు” పదేపదే చూపే వరల్డ్ కప్ హైలైట్స్ తప్పక చూడాలనే పి.టి సార్. మాట పూర్తవడం ఆలస్యం, మరోకవిత!

‘ఆనాటి ఆటగాడు ఆటపట్టు

అతడికి ఆటపై మంచిపట్టు

సెంచరీల సునీల్, సచిన్‌ల ఆటతీరు

పెంచింది మనలో క్రికెట్ ఫీవరు’

ఆదివారం అది కావాలి,ఇది కావాలి అనేపిల్లల గొడవలేదు, ఖాళీగా ఉన్నారు కదా అలా, ఇలా వెళ్లి పనులు చేసుకుని రమ్మనే ఇల్లాలి పోరు లేదు అనుకున్నారు. కాని అలా బాసింపట్టు వేసుకుని ఎంతసేపు చాపకే అతికిస్తాడోనని అందరిలోను కమ్ముకున్న దిగులు ముఖంలో తొంగిచూస్తోంది.

అయినా ఆగితే కదా ధార! ఒకటేమిటి దాదాపు యాభై కవితలను ధారగా కురిపిస్తున్నాడు.

కన్నతల్లిలాంటి పుట్టిన ఊరు

బదిలీపై వెళ్లనివ్వని తఖరారు

పగవాడికైనా వద్దు ఈ నరకం

అడ్డుకున్నవాడికే సిద్ధించు యమనగరం

ఎక్కడికో విసిరివేయబడ్డాను

మూలాలు తెలియని మారుమూలకు

అర్థమయేలోపు వ్యర్థమయే కాలం

తెలుసుకున్నాక తరుముకొచ్చే బదిలీల జాలం’

స్వంత ఊరికి తనను బదిలీ చేయకపోతే కవిత, తనకిష్టంలేని చోటుకు బలవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసినందుకు మరోకవిత.

కారమెక్కువేసిన కూరతో జిహ్వను మండించి, తనను కారానికి బలిచ్చిన భార్యపై మరో కవిత.

కారంతో నాలుకను మండించే బదులు, కారాగారానికి పంపినా బాగుండు అంబలి నాక్కుని కంబళి కప్పుకుని తొంగోవచ్చు. ఇదీ వరస!

“కవితలను వింటూ అక్షరాలను హత్తుకోవాలి” సంబరంగా చెప్పాడు చైతన్యమూర్తి.

“హత్తుకోవాలా? కడుపులో పేగులు మెత్తుకు పోయేటట్టున్నాయి” చిన్నగా చైతన్యమూర్తికి వినబడకుండా అన్నాడు సాక్షాత్తూ ప్రధానోపాధ్యులే. వినబడితే మరో కవిత ఉరుకుతుంది జలపాతమై అని ఝడుసుకున్నారు కొందరు.

రవి కాంచనిచోట కవి కాంచున్ ఇప్పుడు కవి వినున్ అని కూడా చేర్చుకోవాలేమో!

పని అబ్బాయి వచ్చి గ్లాసుల్లో నీళ్లు నింపుతున్నాడు. అందరు అటు చూసారు. గొంతు సవరించుకున్నాడు. బాబోయ్! ఒక్క ఉదుటున లేచారు. త్వరగా తింటే తాము త్రేన్చవచ్చని. ‘ఈ విందు ఎందుకో దీని వెనుకనున్న భావమేదో ఇప్పటికైనా అర్థమైందా!’ గోడపైనున్న చిత్రపటంలో తిరుమలేశుడు నవ్వుతూ అడుగుతున్నట్లుంది.

వారానికి సరిపడా కవితలను మూటకట్టిచ్చిన చైతన్యమూర్తి కవితలను శనివారం ఉదయాన్నే తీరికగా కూర్చుని, భార్యకు అరకొరగా గుర్తున్నవి లేనివి కూడా స్వంత పదాలతో కలగలిపి చెప్తుంటే, “సరే మరి మీరు కూడా కవితలు రాసెయ్యవచ్చు అన్నయ్యగారిలాగే!” అంటుండగా సెల్ ఫోను మ్రోగింది.

“ఏమండోయ్ చైతన్యమూర్తి అన్నయ్యగారు” ఫోను అందివ్వబోయింది.

‘ఈయనెక్కడా?’ తిరిగి చూచే లోపల లేడు.

‘భాగో స్నానాలగదిలోకి’ అంటూ లాంగ్ జంప్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here