[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘దీపాలు వెలుగవు ఇక్కడ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఇ[/dropcap]క్కడ దీపాలు వెలుగవు
ఇప్పుడు కాంతి ప్రవాహమే
ప్రకాశ ప్రమిద చెమట కొత్త కొత్త
ఏ వాకిలి చూసినా కాంతి పూలే
పరుగెత్తే వికాస విన్యాసంలో
మంచి కోసం
మనిషి లోపల వెలిగి
పూచి వీచే గుండె దీపావళి
మనిషి
మనిషిని మరువడం విలోమ చర్య
మనిషితో మాట్లాడకుండడం విపరీత ధోరణి
మనిషి నిర్జీవ గీతంలో లేని జీవ లయ
తిరిగి మరల పరిమళించేదాకా
దీపాలు వెలుగవు ఇక్కడ
ప్రసరించే వెలుగు ఓ ఉత్ప్రేరకం
అదే ఒకానొక దివ్య భవ్య నవ్య కావ్యం
మారిన మనిషి సామాజికం వైపున
కొత్త పేజీ తెరిచిన అంతరంగం
నచ్చినా నచ్చకున్నా కాలంలో
గెలుపు మంచితనానిదే, మానవతదే