[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘దీపావళి – అక్షర రమ్యత!!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
దీపావళి
దీపావళి!! ఎంత చక్కని పేరు!!ఎంత ఉజ్జ్వలమైన పదము! ఈ కాంతి మూర్తి పరివేషము ఇంతింతని చెప్పగలమా?!
యోగీశ్వరేశ్వరుడు, దురతిక్రమ విక్రముడు, కేవల మౌన దృక్కులతో జగతిని శాసించగల జగన్నేత, శ్రీకృష్ణుని స్థిరత, ధ్యాన నిమగ్న అంతర్ముఖీనత కన్పించవూ, ఈ వెలుగు తోరణపు తొలి దివ్వె ‘దీ’ అక్షరంలో!!
దీపావళి
నారి సారించి తాటంక దీధితులతో కలిసి దుష్ట నరకుని దునుమటానికి దూసుకుని వచ్చే, సత్యా ధనుర్ముక్త శర పరంపర సాక్షాత్కరించటల్లేదూ –
జ్యా ధ్వనితరంగ స్ఫోరకంగా నిల్చియున్న ఈ దీర్ఘాక్షరం ‘పా’ లో, పాపాంధ నాశని అయినట్టు!!
దీపావళి
ఇక ‘వ’ అంటే వరుసకూ, క్రమశిక్షణకు మారుపేరు కాదూ!
దీపాల వరుస, ఆశల అమరిక, వెలుగు పూల మాలికా- ఇది కనులకు కట్టించే మనోజ్ఞ దృశ్యం,ఇదీ!!
దీపావళి
చివరగా, ‘గుడి’ తో పాటు ‘ళి’!
అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందీ అన్నారుగా! నిజమే, చివరకు, ఎటు చూసినా కృష్ణమయమే, ఆ భావనలో లీనమైన మహానుభావులకు!!
కృష్ణమయమే జగమంతా, ఈ జనమంతా కూడా వారి దృష్టిలో!!
అదీ, ‘దీపావళి’, అక్షరార్థ పారమ్యతా, రమ్యతా!!
ఇంకే పేరుతో పిలిచినా, ఏదో ఒక రేక తగ్గినట్టు, ఒక కళ కొరతగా ఉన్నట్టూ అనిపించదూ, ఈ వెలుగుల రోజుకు, ఈ ఆశల పొద్దుకు!
కనుక, ఇది నిస్సందేహంగా ‘దీపావళి’ మాత్రమే!! దీనికి ఇదే, సరియైన సార్థక నామధేయం!!
గతాన్ని వెనక్కి తోసి, ప్రస్తుతాన్ని నిత్య జాగరూకతతో వాడుకునే వారి మది వెలిగిన, నూత్నకాంతుల అక్షర జ్యోతి!!
అందరికీ దీపావళి శుభాకాంక్షలతో!