కాజాల్లాంటి బాజాలు-89: దీపావళి శారీ..

2
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అం[/dropcap]దరూ దీపావళి పండుగ బాగా జరుపుకున్నారు కదా…ఇదేవిటీ.. పండగెళ్ళేక పాచన్నట్లు దీపావళి వెళ్ళిన నాల్రోజులకి ఇప్పుడు అడుగుతున్నానేవిటా అనుకుంటున్నారా… కారణముందండీ బాబూ.. చాలా పెద్ద కారణమే వుంది.. అదేంటంటే ఇప్పటికప్పుడే వారం రోజుల్నించి నేను ఎప్పుడే సమస్య వచ్చిమీద పడుతుందోనని భయంతో వణికిపోతున్నాను కనక. అసలు సంగతేంటంటే…..

ఎప్పట్లాగే మా వదిన ఈ దీపావళికి కొత్త ఆన్‌లైన్ వ్యాపారం మొదలెట్టింది. అందులో కొత్తేం లేదు. ఇదివరకూ చేసిందికదా.. కానీ మా వదిన ఒక సరికొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చింది జనాల మధ్యకి. ఆ ప్రోడక్ట్ వీడియో వాట్సప్‌లో నాకు పంపిస్తూ దానిని నా ఫ్రెండ్స్‌కి షేర్ చెయ్యమనీ, తన బిజినెస్‌ని ప్రోత్సహించమనీ అడిగింది. నాకు చాలా సంతోషమనిపించింది. తప్పకుండా మా ఫ్రెండ్స్‌కి చెపుతానన్నాను.

“అంతేకాదు.. మరి నువ్వు కూడా కొనాలి..” అంది.

వదిన సావాసంతో నాకూ కాస్త తెలివొచ్చినట్టుంది..

“ఆడపడుచుకి దీపావళికి గిఫ్ట్‌గా నువ్వే ఇవ్వచ్చుగా..” అన్నాను.

నా మాటకి ఏమనుకుందోకానీ వదిన ఆ వీడియోతోపాటు ఆన్‌లైన్‌లో నాకు ఆ ప్రోడక్ట్ కూడా పంపించింది. మా వదిన ఎంత మంచిదో అనుకుంటూ ఆమె పంపిన వీడియోని అలస్యం చెయ్యకుండా మళ్ళీ పండగ వచ్చేలోగా అందరూ కొనుక్కోవాలి అనుకుంటూ నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసేను.

కొరియర్‌లో వదిన పంపిన గిఫ్ట్ రావడానికి సమయం పడుతుంది కదా అనుకుంటూ ముందుగా స్థిమితంగా కూర్చుని మా వదిన పంపిన వీడియో మీద క్లిక్ చేసేను. ముందు కాకరపువ్వొత్తుల మెరుపుల్లోంచి ‘దీపావళి శారీ’ అనే అక్షరాలు కనిపించేయి.

ఓహో.. ఈ దీపావళికి వదిన ప్రత్యేకంగా శారీస్ తెప్పించిందేమోనని ఆనందపడిపోతూ మరింత ఉత్సాహంగా ఆ వీడియో చూడడం మొదలుపెట్టేను.

మధురమైన నేపథ్యసంగీతం. ఒక ఇంటి తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. పసుపుకుంకుమలతో నిండుగా వున్న గడపతో వున్న అందమైన ఆ గుమ్మానికి మామిడాకుల తోరణాలూ, బంతిపూల మాలలూ అందంగా అలంకరించబడివున్నాయి. గుమ్మం ముందు ‘దీపావళి శుభాకాంక్షలు’ అని రంగురంగుల రంగవల్లిలో ముత్యాల్లాంటి అక్షరాలతో రాసి వుంది. గుమ్మం లోపల్నించి ఒకమ్మాయి రెండు చేతులలో నిండుగా వెలుగుతున్న ప్రమిదలున్న పళ్ళాని పట్టుకుని వయ్యారంగా వస్తోంది.

అదేంటీ… ఆ అమ్మాయి వస్తుంటే అలా లైట్లు వెలుగుతున్నాయీ… అనుకుంటూ మరింత పరీక్షగా చూడడం మొదలెట్టేను. నిజమే.. ఆ అమ్మాయి వెలిగే లైట్లున్న చీర కట్టుకుంది. తెల్లటి ఆ చీర ఆమె నడుస్తుంటే మడత మడతకీ మధ్యలో లైట్లు వెలుగుతున్నాయి. ఆ అమ్మాయి వేసే అందమైన ఒక్కొక్క అడుగుకీ మనం స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్టు చీర మధ్య మధ్యలో లైట్లు వెలుగుతూ ఆరుతున్నాయి. నేను ఒక్కసారిగా అదిరిపడ్డాను. ఇదేంటీ.. అలా కరెంట్ వున్న చీర కట్టేసుకోవడమేంటీ.. అందులోనూ ఆ చీర మధ్యలో అలా బల్బులు వెలగడం ఆరడమేంటీ.. అలా కరెంట్ వున్న చీర కట్టుకుంటే అది షాక్ కొట్టదా… షాక్ కొడితే ఆ మనిషి సంగతేవిటీ…

కరెంట్ షాక్ అనే ఊహ రాగానే నాకు గాభరా మొదలైంది. కాస్త సంబాళించుకుని ఆ వీడియోని మరింత పరీక్షగా చూడడం మొదలెట్టేను. ఆ అమ్మాయి అలా వయ్యారంగా నడుస్తూ వచ్చి ఇంటి ముందు దీపాలు వరసగా పేరుస్తోంది. ఆమె ప్రతి కదలికలోనూ చీర మడతలు పడుతోంది. అలా పడిన మడతల మధ్యలోంచి లైట్లు వెలుగుతున్నాయి. మళ్ళీ కదలగానే ఈ లైట్లు ఆరిపోయి మరో మడతలో లైట్లు వెలుగుతున్నాయి. ఆ అమ్మాయి మటుకు ఒంటినిండా అన్ని బల్బులు వెలిగి ఆరుతున్నా ఏమీ ఖంగారు పడకుండా చిరునవ్వుతో ఆ దీపాలను అందంగా పేరుస్తోంది.

వెలిగి ఆరే కరెంట్ లైట్లు కొత్తేమీ కాదు. ఎక్కడ పెళ్ళిళ్ళూ, ఫంక్షన్లు జరిగినా దీపాల తోరణాలతో అలంకరించడం సాధారణంగా జరిగేదే. ఇంట్లో కూడా పండగలకీ పబ్బాలకీ తోరణాలుగా వుండే చిన్న చిన్న బల్బులు అలంకరించడం కూడా నాకు తెలుసు. కానీ మరీ ఇంతగా అలా వెలుగుతున్న లైట్లనే చీరలా కట్టేసుకోవడం మటుకు నేను ఇదే చూడడం.

ఆ మధ్య నెప్పుడో డిజైనర్ బ్లౌజులంటూ ఎల్.ఈ.డి లైట్లు వెలిగే బ్లౌజులు మార్లెట్లోకి వచ్చాయి. బ్లౌజుకున్న ఎంబ్రాయిడరీ మధ్యలో ఎల్.ఈ.డీ బల్బు లమర్చి దానిని డిజైన్ చేసారన్న మాట. అది చూసి ఇవి కొనుక్కునేవాళ్ళుంటారా అని హాశ్చర్యపడిపోయేను. కానీ ఇప్పుడు ఇలా బల్బులు వెలిగే చీరే నా కోసం దీపావళి బహుమతిగా వచ్చేస్తోందంటే ఏమనుకోవాలీ!

నా ఆలోచనలు పరిపరివిధాల నడిచేయి. ఆ చీర తయారుచేసినవాళ్ళు అన్ని జాగ్రత్తలూ తీసుకునే చేసి వుండొచ్చు. కట్టుకునేవాళ్ళు కూడా అంతకన్న ధీమాగా కట్టుకుని వుండొచ్చు. కానీ ప్రమాద మన్నదయితే పొంచి వున్నట్టే కదా! బాణసంచా కాల్చేటప్పుడు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం…కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి ఎన్ని ప్రమాదాలు జరిగినట్టు వినలేదూ! ఈ చీర కట్టుకున్నప్పుడు అలాంటి షార్ట్ సర్క్యూట్ అవదని గారంటీ ఏవీ లేదు కదా!

అయినా విడ్డూరం కాకపోతే దీపావళికి దీపాలు వెలిగే చీరే కట్టుకోవాలా! లేకపోతే అది దీపావళి పండగ కాదా! అసలీ అవిడియా ఎవరి కొచ్చిందో.. ఆ చీర సేల్స్ బాగా అవుతున్నాయనీ, మా ఫ్రెండ్స్ చాలామంది కొన్నారనీ వదిన మెసేజ్ పెట్టింది. అంటే గొర్రెలమంద లాగ ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు కొనేసుకుంటున్నారా! వాళ్ళెవరికీ ఈ చీర కట్టుకుందుకు భయం వెయ్యదా!

ఏమో బాబూ…నాకైతే భయంగానే వుంది.. ఉట్టిగా గిఫ్ట్‌గా వచ్చినా సరే నేనీ చీర కట్టుకోనుకాక కట్టుకోను.. అని నా ఆలోచనలను స్థిరపరుచుకుంటుండగానే ఇంకో ఆలోచన నా బుర్రలోకి వచ్చింది.

మా ఫ్రెండ్స్ చాలామంది ఈ చీర కొన్నారని వదిన మెసేజ్ పెట్టింది కదా! ఒకవేళ అలా ఈ చీర కొన్న నా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ చీర కట్టుకున్నారేమో…. ఒకవేళ వాళ్లకేదైనా జరక్కూడని ప్రమాదం జరిగిందేమో… ఒకవేళ అలా జరిగితే ముందు నాకే ఫోన్ చేసి అక్షింతలు వేస్తారు కదా.. అలా తలుచుకోగానే గుండె గుభేలుమంది. అదిగో అప్పట్నించీ ఫోన్ మోగితే భయం.. “ఇదిగో.. నువ్వు చెప్పేవని కొనుక్కున్నాం… చూడు.. ఎంత ప్రమాద మయ్యిందో..” అని ఎవరి దగ్గర్నించి ఏ కంప్లైంట్ వస్తుందోనని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని కూర్చున్నాను. దీపావళి వెళ్ళి నాల్రోజులైంది. ఇప్పటివరకూ ఎవరూ ఫోన్ చేసి నన్ను తిట్టలేదు. బతికిపోయేనురా దేవుడా అనుకుంటూ ఇప్పుడు ఇంత ధైర్యంగా మీకీ మాట చెపుతున్నాను.

చివరిగా అందరికీ ఒక సలహా.. ఫ్రెండ్స్ ఫార్వార్డ్ చేసేరు కదా అనీ, కొత్తరకంగా వుందనీ, పక్కవాళ్ళు కొనుక్కున్నారనీ మీరు కూడా అన్నీ కొనేసుకోకండి. మీకు ఏది అవసరమో అదే కొనుక్కోండి. హమ్మయ్య. మీతో ఈ మాట చెప్పేక నా మనసు చల్లబడింది. అసలైన దీపావళి పండగ నాకు ఈరోజే..

అందరికీ దీపావళి శుభాకాంక్షలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here