[డా. సారధి మోటమఱ్ఱి గారు రచించిన ‘దీపం చెప్పిన పాఠం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]చీ[/dropcap]కటిలో.. కమ్మిన చీకటిలో
దీవాళి అమాశి రాతిరి–
చీకటిని చీల్చే నా యత్నాన్ని చూచి-
ఓ దీపం! ఫక్కున నవ్వింది!
అంధకారంలో నీ మనస్సు మునిగివుంటే
సత్యాన్ని చూడ నీయకుంటే-
అస్థిర తిమిరాన్ని త్రోలే ఈ
వ్యర్థ ప్రయాస ఎందుకోనంటూ?
వెలిగి వెలిగి తరుగుతున్న వత్తిని
చిరుపుల్లతో పైకి ఎగత్రోసి-
వెలుగును నిలిపే నన్ను చూచి
ఓ దీపం! ఘోల్లున నవ్వింది!
తానెలుగుతూ మార్గాన్ని చూపాలనే
ఓ మనస్సు దిగజార్చ బడుతుంటే-
తోడుగా నడిచి.. చేయూత నివ్వక
నీవే పడుతున్నావు శిఖారాల నుంచంటూ!
చమురు నిండుకొంటుంటే
చమురందించి దీపాన్ని
కొండ దింపాలనే నన్ను చూచి
ఓ దీపం! బాధగా నవ్వింది!
న్యాయ ధర్మాల కోసం నిలిచి
నిశాచరుల హాలాహలానికి..
ఓ మనస్సు బుగ్గయి పోతుంటే-
స్ఫూర్తి ద్రుతు లివ్వలెదేనంటూ?