[box type=’note’ fontsize=’16’] దీపావళి పండుగ విశిష్టతని సరళంగా, పిల్లలకి వివరిస్తున్నారు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి ఈ రచనలో. [/box]
[dropcap]బా[/dropcap]లలూ, మనం నవంబరులో దీపావళి పండుగ చేసుకుంటున్నాం కదా. అది పిల్లలకీ, పెద్దలకీ కూడా ఇష్టమైన పండుగ. ఈ పండుగకి కారణం అందరికీ తెలిసిందే. ‘నరకాసురుని వధ’ తరువాత వాని పీడ తొలగిపోయినందుకు ప్రజలు ఆనందంగా జరుపుకున్న పండుగ.
అంతేకాక, ఈ పండుగ ‘పర్యావరణ’ రక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అంటే నవంబరులో చలికాలంలో దోమలు ఎక్కువ కాబట్టి, మందుగుండు సామాను కాల్చడం వలన అవి కూడా చంపబడి, రోగాలు తగ్గుతాయి. ఈ కారణం కూడా తెలిసిందే.
అయితే ‘దీపావళి’ పండుగ జరుపుకోడానికి ‘నరకాసురుని వధ’ మాత్రమే కాక మరికొన్ని కారణాలు కూడా గ్రంథాలలో తెలుపబడ్డాయి. అందులో ముఖ్యమైనది ‘రావణ సంహారం’. రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు, సీతా సమేతుడై పట్టాభిషిక్తుడు అయిన రోజున ప్రజలు ఆనందంతో ‘దీపావళి’ జరుపుకున్నారు.
శ్రీరాముడు ఎంత గొప్పవాడో అందరికీ తెలిసిందే. పితృవాక్య పరిపాలకుడు. ప్రజలను ఆదర్శంగా పాలించి, దేశాన్ని సుభిక్షంగా చేశాడు. ఇప్పటికీ ఏ రాజ్యము, కాలము బాగున్నా ‘రామరాజ్యం’లా ఉంది అనటం జరుగుతుంది.
శ్రీరాముడు తన భార్య అయిన సీతను ఎత్తుకుపోయి, చెరబట్టి, తనని వివాహమాడమని బలవంతం చేసిన దుర్మార్గుడు, రాక్షసుడు అయిన రావణుని సంహరించి, సీతను కాపాడి, అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవుతాడు (ఆనాడు ప్రజలు ‘దీపావళి’ జరుపుకున్నారు).
అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ‘రావణుడు’ రాక్షసుడే అయినా, అతనిలో కొన్ని మంచి లక్షణాలు కూడా వున్నాయి. అతను గొప్ప శివభక్తుడు. అంతేకాక గొప్ప వీరుడు. అతనిలోని మంచి లక్షణాలు గుర్తెరిగినవాడు కాబట్టే రాముడు కూడా రావణుని మరణ సమయంలో అతని నుంచి సలహాలు తీసుకోమని, అవి విభీషణుడికి ఉపయోగకరం అని తెలిపి పంపుతాడు. విభీషణుడు రావణుని తమ్ముడు.
అప్పుడు రావణుడు, విభీషణునికి ఇలా తెలిపాడు:
“మంచి పనిని ఎప్పుడూ వాయిదా వేయకు, చెడ్డపనిని ఆలోచించి గాని చేయకు.”
అవి అవలంబించిక, వినకపోవడం వల్లనే తనకీ గతి అని తెలిపాడు.
అవేమిటంటే తన చుట్టూ ఉన్న (అంటే లంక చుట్టూ ఉన్న) ఉప్పు సముద్రాన్ని తన తప్పశ్శక్తితో పాల సముద్రంగా మార్చాలని తలుస్తాడు. అది తనకున్న తపశ్శక్తికి చిన్న పనే, కాని ‘నా చేతిలోని పనే కదా, చెయ్యచ్చు, చెయ్యచ్చు’ అనుకుంటూనే వాయిదా వేస్తాడు. మరణం సంభవించేసింది. అలా చేసి ఉంటే అంత నీరు వృథా కాకపోయేది (ఉప్పగా ఉండడం వలన), అంతేకాక తన కీర్తి కూడా ఆచంద్రతారార్కం నిలిచి ఉండేది (ఇది మంచి పని).
అలాగే సీతమ్మవారిని చెప్పుడు మాటలు విని ఆలోచించకుండా వెళ్ళి చెరబట్టి తెచ్చినప్పుడు, తిరిగి రాములవారి వద్దకు పంపేయమని ఎందరు చెప్పినా (విభీషణుడితో సహా), వినలేదు. రామునితో వైరము కూడదనిన వినలేదు, ఆలోచించలేదు. అందుకే లంకకు చేటు, తనకు అపకీర్తి, అపమృత్యువు సంభవించాయి. అందుకే చెడ్డపనులు చేసేడప్పుడు వాని వల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించాలి” అని తెలుపుతాడు.
విన్నారా బాలలూ! రావణుడి సందేశం!! చెడ్డవాడు, రాక్షసుడు అయిన రావణుడు ఈ విషయం గ్రహించాడు. అందువలన మీరు కూడా మంచి పనిని వాయిదా వేయకండి. ఉదాహరణ: ఎప్పటి పాఠాలు అప్పుడే చదివెయ్యండి. పరీక్షలు వచ్చినప్పుడు చదవచ్చులే అనుకుంటే, అప్పుడు కారణాంతరాల వల్ల చదవలేకపోతే, పరీక్షలో దెబ్బతినవచ్చు. విద్యాసంవత్సరం వృథా కావచ్చు.
అలాగే చెడ్డ పనుల్లాంటివైన దుష్ట సహవాసాలు, అలవాట్లు చేసుకోవడం, పెద్దలను, గురువులనూ ఎదిరించటం లాంటి చెడ్డపనులు చేసేడప్పుడు వాటి వలన వచ్చే నష్టాలు ఆలోచించి, మానెయ్యాలి. తెలిసిందా?