దేముడి లడ్డూ

1
2

[dropcap]ఊ[/dropcap]రు జారుకుంది నిద్రలోకి!

గణపతి నవరాత్రి పందిరికి కాపలా కాసి కాసి పూజరిగారి ఒక్క కునుకు తీద్దామని జారుకున్నారు నిద్రలోకి. పన్నెండడుగుల ఎత్తు విగ్రహానికి రంగులు అద్దుతూ హఠాత్తుగా చేతులు నొప్పి పెట్టటం, పూజారిగారు కన్ను అలా మూయడం గమనించి శిల్పి రూపేందర్ సింగ్ కూడా విగ్రహం పాదాల చెంతనే పైగుడ్డ పరుచుకుని జారిపోయాడు నిద్రలోకి. పందిరంతా అక్కడక్కడా పనివాళ్ళు ప్రసాదం తిని నిద్రలోకి నెమ్మదిగా వెళ్ళిపోయారు. అక్కడ నిద్రపోవడమా, మానడమా అనే విచికత్స నుంచి బైటపడనిది ఇద్దరే ఇద్దరు.

ఒకరు సాక్షాత్తు ఆ దేముడు! ఉదయం పూజలందుకుని, మధ్యాహ్నం నుంచి రంగులద్దుకుని ఆ పందిరికీ ఆ ప్రాంతానికీ కొత్త కళ ఇస్తున్న గణపతి దేముడు!! ఆ రోజు వినాయక చవితి. గణపతి నవరాత్రుల ఐదో రోజునుంచి ఆ పందిరి పక్కన లలితకళలు వెల్లివిరుస్తాయి. భక్తజనం బారులు తీరుతారు. కొబ్బరినీళ్ళు, మంచిగంధం, కర్పూరం, అగరొత్తులు, అన్నీకలిసి పవిత్రతని ఆ ప్రాంతం అంతా వెదజల్లుతుండగా మత్తెక్కించే ఆ వాసనని తట్టుకొని కూడా ఆ రాత్రివేళ పూజారి నిద్రలోకి జారుకున్న పందిట్లో దేముడు పద్మాసనం మీద నిద్రపోకుండా ఎవరినో దీవిస్తూ ఉండిపోతాడు కూర్చున్న భంగిమలో, లారీ యజమానులు చందాలేసుకుని వేసిన ఆ పెద్ద పందిరికి కాపలాగా.

పందిరికి గుంజలు పాతి, తాళ్ళుకట్టి, తడికెలు బిగించి, ప్రసాదం కడుపు నిండా తిన్న గౌరి గాడికి కన్నుమూతపడటం లేదు. ఆ దేముడు లాగే వాడూ నిద్ర కాసుకున్నాడు. తిన్న ప్రసాదం ఏ మూలన పోయిందో తెలియదు. దాని రుచి తలపుకి వస్తోంది. కేవలం ఆ రుచి వాడి కడుపులో కరకరమని చప్పుడు చేస్తోంది. కంటిమీద కునుకుని తరిమేస్తోంది.

ఎవర్నో దీవిస్తున్న దేముడి మీద కాక ఆయన కుడిచేతిలో ఉన్న లడ్డుమీద ఆసక్తితో చూపు నిలిపి లేచి కూచున్నాడు గౌరి.

తను చేసిన కష్టాన్ని పూజారిగారు లడ్డూగా మార్చి దేముడి చేతిలో పెట్టాడు. ఆ దేముడు ఆ లడ్డూని మళ్ళీ తనకే పెడుతున్నాడు అనుకున్నాడు గౌరి.

“దా…. వచ్చి ఈ లడ్డూ తిను… ఆకలి పోతుంది. నిద్రపడుతుంది” అని ఆ దేముడు ఓ చేత్తో తనని దీవిస్తూ పిలుస్తున్నాడు.

గౌరి మెల్లగా వెళ్ళి దేముడి చేతులోంచి లడ్డూ తీసుకుని కొంత చిదిమి నోట్లో వేసుకున్నాడు. ఆ రుచిని కళ్ళు అరమోడ్పు అనుభవించి ఆబగా మరికొంత తిని కడుపు నిండాక ఆ మిగిలిన లడ్డూని చిదిమి ఉండచేసి దేముడి చేతిలో పెట్టేసి వచ్చాడు. ఇసుకగుట్ట మీద మేను వాలుస్తుంటే తెలియని భయం పట్టుకుంది. ఆ దేముడికి ఓ దణ్ణం పెట్టాడు. ఎందుకో భయం పోయింది. నిద్రలోకి జారుకున్నాడు.

అక్కడా పూజారిగారు నిద్రపోతున్నారు. శిల్పి నిద్రపోతున్నాడు. పనివాళ్ళు నిద్రపోతున్నారు. పందిరి నిద్రపోయింది.

దేముడు చిరునవ్వుతో కళ్ళు అరమోడ్చి ఎవర్నో దీవిస్తున్నట్టు ఉండిపోయాడు.

ఖచ్చితంగా దేముడు నిద్రకాసుకుని ఉండిపోయాడు.

***

చంద్రుడు ఆ రోజుకి డ్యూటి దిగిపోతున్నాడు. సూర్యుడు ఎర్రెర్రగా ముఖం పెట్టుకుని డ్యూటీ ఎక్కుతున్నాడు. పూజారిగారు ఆ ఇద్దరి కంటే ముందు రెడీ అయిపోయారు. నిద్రలేస్తూనే విగ్రహానికి దణ్ణం పెట్టుకుని మున్సిపల్ పంపుకింద స్నానం చేసి సంధ్యావందనం ముగించుకుని వచ్చారు.

అప్పటికీ పందిరి మెల్లమెల్లగా మేలుకుంటోంది. శిల్పి కూడా కుంచెలు శుభ్రం చేసుకుంటున్నాడు. గౌరిగాడు లేచి వేపరెబ్బ తెంపుకుని నోట్లో పెట్టుకుని తడబడగా గొంతుక్కూచుని పళ్ళు తోముకోవడం అనే పనికి ఉపక్రమించాడు నీటిపంపు దగ్గర. ఎలక్ట్రీషియన్ మోటారు ఆర్పేసి ఆ పూటకి ఆ పనయిపోయినట్టు ఆవులించాడు.

సరిగ్గా ఆ సమయంలో పూజారి గారి కళ్ళు దేముడి కుడిచేతిలో లడ్డూమీద పడ్డాయి. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. అనుమానంగా దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పరీక్షించి గావుకేక వేశారు.

“ఎవరు చేశారర్రా ఈ వెధవ పని?”

అయ్యవారి గావుకేకకి ఆ పందిరి మొత్తం హఠాత్తుగా కదిపినట్టయి నిద్ర మేల్కొంది.

“దేముడు మైలపడిపోయాడు

దేముడు ఎంగిలి పడిపోయాడు”

పూజారి గొంతులో బాధ జీరగా మారింది. ఆయన కళ్ళల్లో కోపం ఎరుపు నింపుకుంది. అందరినీ పిలిచి నెత్తీ, నోరూ మొత్తుకుంటూ దేముడి చేతిలో చిక్కి సగమైన లడ్డూని చూపించి బాధపడసాగారు పూజారిగారు. ఏమీ ఎరుగనట్టే అక్కడ నిలబడి అంత విన్న గౌరి ఏమీ భయపడలేదు.

అవసరం వస్తే పూజారిగారికి వీపు ఇచ్చేద్దాం అనుకున్నాడు. అయినా ఆ పని చేసింది తానేనని ఆ దేముడికొక్కడికే తెలుసు. ‘దేముడా! నా పేరు బైటపెట్టొద్దు’ అని మనసులో దణ్ణం పెట్టుకున్నాడు.

దేముడు తనకి హానిచెయ్యడని వాడికెందుకో నమ్మకం. పందిరి మధ్యలో చతికిలపడి పూజారిగారు పంజాయితీ మొదలెట్టారు. ఆ సరికి అక్కడికి ఎవరో, మోటారు సైకిలు మీద చేరుకున్న పందిరి నిర్వాహడొకరు జరిగింది విని వెర్రెత్తిపోయాడు.

“వాడెవరో కనిపెట్టి శిక్షించాలి. వ్రతభంగం జరిగిపోయింది. దేముడు మైలపడిపోయాడు పూజారిగారు” రుద్దకంఠంతో ఆ పెద్దమనిషి మొరపెట్టుకున్నాడు.

ఆ మేస్త్రీ తటకలోంచి వెదురుబద్ద తీసి అక్కడున్న పనివాళ్ళ వీపుమీద సవారీ ప్రారంభించాడు. “చెప్పండ్రా ఎదవ సన్నాసుల్లారా! ఎవడు చేశాడీ దరిద్రపుగొట్టుపని. దేముడి లడ్డు తిన్నదెవరు?” అంటూ ఈరంగం వేశాడు.

గౌరీ వీపుమీద కూడా రెండు దెబ్బలు పడ్డాయి. నీటిపొరలోంచి దేముణ్ణి చూస్తూ ఏడుపు దాచుకున్నాడు వాడు.

పూజారిగారు ప్రాయశ్చిత్త మంత్రం పఠించారు.

***

మళ్ళీ రాత్రయింది. పందిరి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. అక్కడ సువాసన పవిత్రతని నాలుగు చెరగులకి మోసుకుపోతోంది. దేముడు చిరునవ్వుతూ, ఎవరినో దీవిస్తూ పద్మాసనం మీద కూర్చుండిపోయాడు.

దేముడి లడ్డూ తినేసిందెవరో తేలనందుకు బాధగా ‘భగవాన్’ అని నిట్టూర్చి పూజారిగారు అదే ఆలోచనతో నిద్రలోకి జారుకున్నారు.

పూజారిగారికి ఓ రాత్రివేళ కలవచ్చింది. కలలో దేముడు ప్రత్యక్షమయ్యాడు. పూజారి ముఖంలోకి గుచ్చిగుచ్చి చూశాడు. “మూర్ఖుడా! నా చేతిలోని లడ్డూ తరిగిపోతే అది ఎవరు తిన్నారంటూ విచారణ సాగించేవు. ఒక్కసారి కూడా నేననేవాణ్ణి ఉన్నాననీ, నేను తినాలనే ఆ లడ్డూ నా చేతిలో పెట్టావనీ, నేనే తిని ఉండొచ్చనీ నీకు తలపుకు రాలేదు. దేముడని ఇతరుల చేత నమ్మిస్తావే గాని, నువ్వు నమ్మవన్నమాట. నీకిదే శాస్తి” అంటూ కలలో దేవుడు కాలితో తన్నాడు పూజారిని.

పూజారి ఇలలో మొర్రోమంటూ నిద్రలేచారు.

పందిట్లో దేముడు ఎవర్నో దీవిస్తూ చేతిలో లడ్డూతో ఎవర్నెవర్నో పిలుస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here