దేముడితో పంతమా!!

2
2

[dropcap]జీ[/dropcap]వితంలో కొన్ని అనుభవాలు, సంఘటనలు ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలకు అతీతమైనవి. కథలో అనుభవం దేముడి మహిమ కాదంటే మరి ఏమిటి?

ఆ రోజు సాయంత్రం ఆరింటికి మా వారు ఆఫీస్ నుంచి వస్తూనే అన్నారు – “మణీ, నాకు రాత్రి ఫలహారం ప్యాక్ చేసి ఇచ్చేయ్. రాత్రి ఎనిమిది గంటలకు ట్రైన్ ఎక్కాలి. తిని వెళ్ళేంత సమయం లేదు” అని. ఇంతకు ముందు కూడా చాలా సార్లు కేంపుకి వెళ్లారు. నాకు ఇదేమి కొత్త కాదు. అందుకే యథాలాపంగా అడిగేను “ఏ ఊరు ఈసారి?” అని.

“తిరుపతి” అన్నారు. ఇంతకు మునుపు ఎప్పుడూ తిరుపతికి ఆఫీస్ కేంపు పడలేదు. అందుకే కొంచెం ఆశ్చర్యపోయి అడిగాను “అవునా! తిరుపతిలో కూడా మీ ఆఫీస్ బ్రాంచ్ ఉందా? మునుపు ఎప్పుడూ వెళ్లలేదే!!!” అని.

“కాదు లేవే. ఈసారి ఆఫీస్ క్యాంపు కాదు. ఇవాళ మధ్యాహ్నం మా ఆఫీస్‍లో ఒకతను నా దగ్గరకు వచ్చి, ‘సర్! నేను తిరుపతి పుష్కరిణిలో స్నానం చేద్దామనుకున్నాను. కానీ నాకు అక్కడ అంతా కొత్త. ఆ ప్రాంతమూ, భాష రెండూ నాకు కొత్త. మీరు నాకు తోడు వస్తే నాకు సాయం చేసిన వారవుతారు. నేను ట్రెయిన్‌లో రెండు టికెట్లు బుక్ చేసేను మన ఇద్దరికి. మీరు ఏం చేయనవసరం లేదు. ఇంట్లో చెప్పి రాత్రి ట్రెయిన్ వేళకి స్టేషన్‌కి రండి. నేను మిమ్మల్ని అక్కడే కలుస్తాను’ అన్నాడు. నాకు ఒక బ్యాగ్‌లో ఒక జత బట్టలు పెట్టేసి నా బ్యాండేజు మార్చేయ్. అక్కడ మళ్ళీ ఎవరి చేత కట్టించుకుంటాను?” అన్నారు. ‘సరే’ అని ఆయన చెప్పినట్లు గానే అన్నీ సిద్ధం చేస్తునే కొంచెం ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాను.

మా వివాహం అయి మూడు దశాబ్దాలు దాటాయి. కానీ ఒక్క నాడయినా ఆయన్ని దేముడికి శ్రద్ధగా దణ్ణం పెట్టుకోగా చూడలేదు. ఇంక గుడి-గోపురాలు తీర్థయాత్రల ప్రసక్తే లేదు. మరి ఇదే నాస్తికత్వం అయితే మావారు నాస్తికులనే చెప్పాలి. అయితే నేను చేసే పూజలకి మాత్రం మావారు ఎప్పుడూ అడ్డు పడలేదు. అంతకు మించి ఇంట్లో ఎటువంటి శుభకార్యం ఉంటేనే తప్ప నా పక్క పీటపై కూర్చుని ఏ పూజలు చేయలేదు.

మునుపు ఎన్నడూ తిరుపతి వెళ్లి ఎరుగరు. అటువంటిది ఎవరో వచ్చి ఈయన కోసం టికట్టు తీసుకుని తోడు రమ్మంటే వెంటనే ఒప్పుకుని బయల్దేరుతున్నారంటే నాకు విచిత్రంగానే అనిపించింది.

ఆయన చెప్పినట్లుగానే ఒక బ్యాగ్‍లో ఒక జత బట్టలూ, రాత్రికి ఫలహారం పెట్టి సిద్ధం చేశాను. కాలు మీద కొన్ని ఏళ్ళ బట్టి మానని పుండుకి బ్యాండేజు మార్చాను. ఆయన బయల్దేరి వెళ్లారు.

మా వివాహం అయిన పాతికేళ్ళకి మావారు డయాబెటిక్ అని తేలింది. అప్పటి నుంచి ఆయన తీసుకోవాల్సిన ఆహారంలో తగు జాగ్రత్త వహిస్తున్నాను. కానీ ఇంకో పదేళ్ళకి ఈయన కాలి బోటను వేలు మీద చిన్న పుండు లేచింది. ఆ చిన్న పుండు ఎండిపోయిన చర్మంపై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల పెరిగి రాక్షసి పుండుగా మారింది. దానికి సర్జరీ కూడా చేయించాము. తాత్కాలికంగా తగ్గి మళ్లీ అదే చోటు కొత్త పుండు మొదలయింది. దాని వల్ల ఆయనకి నొప్పి తెలీదు. ఆ భాగం ఆయనకి మొద్దుబారిపోయింది. పుండు నుంచి చీము నెత్తురు కారుతున్నా ఆయనకి తెలీదు. అందుకే రెండు పూటలా ఆ పుండుకి డాక్టర్లు చెప్పిన విధంగా నేనే గత పదిహేను ఏళ్ళుగా కట్టు కడుతున్నాను. ఆ భాగం పూర్తిగా సర్జరీ చేసి తీసివేయటమే ఒక్క వికల్పం అని డాక్టర్లు చెప్పారు. ఈ రకం పుండునే ‘గ్యంగారిన్’ అంటారు. సర్జరీకి ఆయన ఒప్పుకోలేదు. కుంటుకుంటూనే ఈయన కారు డ్రైవ్ చేసి ఆఫీసుకి వెళ్లి వస్తున్నారు. ఎవరు ఏ వైద్యం చెప్తే అది చేస్తున్నాము, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. హోమియోపతిలో, ఆయుర్వేదంలో కూడా ప్రయత్నించాము. కానీ గుణం కనిపించలేదు. తీర్థ స్థలం పుష్కరిణిలో స్నానం చేస్తే దీర్ఘ కాలం నుంచి చర్మానికి, ఒంటిని పీడిస్తున్న వ్యాధులు అన్నీ నయమవుతాయని మావాళ్లు చాలా సార్లు చెప్పి చూశారు. దానికి మాత్రం మావారు ససేమిరా ఒప్పుకోలేదు. “ఇన్ని రకాల వైద్యాలకి తగ్గనిది పుష్కరిణిలో స్నానం చేస్తే తగ్గిపోతుందా? నేను నమ్మను, నేను ఎక్కడికీ వెళ్లను” అని మొండికి వేశారు. “అందరూ అంతలా చెప్తుంటే కొంత అయినా సత్యం ఉంటుంది కదా. ఒక్కసారి ఆ ప్రయత్నం కూడా చేసి చూద్దాము” అని నచ్చ చెప్పటానికి చూశాను.

“నా కాలు మామూలు అయితేనే నేను తిరుపతికి వెళ్తాను” అంటూ పంతం పట్టారు. ఆయన స్వయంగా నమ్మకంతో శ్రద్ధగా చేయని పని బలవంతంగా చేయించినా ప్రయోజనం ఉండదని తెలిసి, ఆ తరవాత ఆయన మనస్తత్వం బాగా ఎరిగిన దాన్ని నేను మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు. ఆయనకి ఇష్టం లేనందు వల్ల నేను కూడా గుడికి వెళ్లి రావటం కానీ యాత్రలు కానీ అలవాటు చేసుకోలేదు. ఇంట్లోనే నాకు తోచిన విధంగా నేను నిత్య పూజ చేసుకుంటాను. రోజుకి రెండు పూటలా ఆయన కాలు కట్టు మార్చటం మాత్రం నా దినచర్యలో ఒక భాగం అయిపోయింది.

అంతలా మొండికి వేసిన మనిషి ఎవరో ముక్కూ మొహం తెలియని మనిషి వచ్చి తనకు తోడు రమ్మంటే తిరుపతికి బయల్దేరి వెళ్లారు. విచిత్రంగా అనిపించినా సంతోషం కలిగింది నాకు. కనీసం ఈ రకంగా అయినా దేముడి సన్నిధికి వెళుతున్నారని.

అనుకున్న ప్రకారమే మూడోనాటికి తెల్లవారుజామున మావారు క్షేమంగా తిరిగి వచ్చారు. “ప్రయాణం బాగా జరిగిందా? మీరు కూడా పుష్కరిణిలో స్నానం చేశారా? మిమ్మల్ని తోడు తీసుకు వెళ్ళిన మనిషి ఏడి?” అని అడిగాను కుతూహలం ఆపుకోలేక.

“తిరుగు ప్రయాణం అప్పుడు అతను రాత్రి పడుకునే ముందు – ‘నేను నాంపల్లిలో దిగిపోతాను. మీరు నిద్రలో ఉంటారు ఏమో అందుకే ఇప్పుడే చేపుతున్నాను. మళ్ళీ పొద్దున మనం కలవలేము సర్’ అన్నాడు. సరే అని నేను అప్పర్ బర్త్ ఎక్కి పడుకున్నాను. నేను కూడా నాంపల్లి లోనే దిగాను కానీ అతను నాకు కనిపించలేదు. ఎప్పుడు దిగి వెళ్ళిపోయాడో ఏమో!!”

“సరే మణి, నేను నా కట్టుతో పాటే స్నానం చేశాను కదా. బాగా తడిసి ముద్ద అయిపోయి ఉంటుంది. మార్చి కొత్త బ్యాండేజు కడతావా? తయారై ఆఫీసుకి వెళ్ళాలి” అన్నారు. సరే అని పాత కట్టు కత్తిరించి చూస్తే ఎప్పుడూ ఉండే చీమూ నెత్తురు లేదు. నీళ్లలో తడిసింది కదా. క్లీన్ అయిపోయిందేమో అనుకుంటూ కొత్త కట్టు కట్టి ఆయన్ని ఆఫీసుకి పంపించే ప్రయత్నంలో పడ్డాను.

ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక యథాప్రకారం మారుద్దామని కట్టు విప్పి ఆశ్చర్య పోయాను. ఇన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న పుండు ఎండిపోయి ఉంది. నెత్తురు చుక్క అయినా లేదు. పొద్దున కట్టిన కట్టు అలాగే ఉంది. ఆ మాటే పైకి అన్నాను. “అదెలా సాధ్యం? ఏది చూడని” అంటూ కాలు ఎత్తి పాదం చూసుకున్నారు. “ఇన్నేళ్లుగా బాధ పెట్టిన రాక్షసి పుండు పుష్కరిణిలో స్నానం చేశాక మాయమైంది. ఇప్పుడు ఏమంటారు?” అన్నాను.

“ఒక్కసారి ఆలోచించి చూడండి. మిమ్మల్ని తోడు రమ్మన్నఆ వ్యక్తి ఎవరో మీకు తెలీదు. అతను మీ ఆఫీసులో ఎక్కడ పని చేస్తున్నాడో కూడా మీకు తెలీదు. అయినా అతన్ని నమ్మి అతని వెంట మీరు వెళ్లారు. స్వయంగా వెంకటరమణమూర్తి ఆ రూపంలో వచ్చి మిమ్మల్ని వెంట తీసుకు వెళ్లారనటంలో ఇంకా సందేహమా?” అని అడిగాను.

ఆయన ఏం మాట్లాడలేదు. ఏది ఏమైనా మా ఆయన కాలికి కట్టు కట్టవల్సిన అవసరం మళ్లీ రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here