(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]భా[/dropcap]రతదేశానికి ముస్లింల చేటు అరబ్బుల కంటే ఎక్కువగా మంగోలులు, ఘజ్‌నీవాద్‌లతోనే ఎక్కువగా జరిగింది. దేశంపై అరబ్బులు ముందుగా దాడులు కొనసాగించినప్పటికీ.. వారి యుద్ధాలు.. అరేబియా సముద్ర తీరం వెంబడి మాత్రమే ఎక్కువగా కొనసాగాయి. సింధ్ ప్రాంతం, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ర్ట ప్రాంతాలపై దాడులు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో వారికి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. అటువైపు కాబూల్ వైపు వెళ్లినప్పుడు కూడా వారికి ఎదురుదెబ్బ తప్పలేదు. కాబూల్‌లో జయపాలుడికి, ఘజ్‌నీవాద్‌లకు మధ్య జరిగిన యుద్ధం భారత్‌లోకి పూర్తిస్థాయిలో ఇస్లాం రాజరికం వేళ్లూనుకోవడానికి నాంది పలికింది. మహమ్మద్ ఘజ్‌నీ విజృంభణ భారత్ రాచరిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. భారత్ లోపలిదాకా చొచ్చుకువచ్చి.. ఇస్లాంను సుప్రతిష్ఠం చేశాడు. యావత్ దేశాన్ని పరిపాలించిన మొఘలులు ఆఫ్గనిస్తాన్ మీదుగా భారత్‌లోకి వచ్చినవారే.
క్రీస్తుశకం 997లో సబుక్తిజన్ చనిపోవడానికి ముందు తన వారసుడిగా చిన్న కొడుకు ఇస్మాయిల్‌ను ఘజ్‌నీవాద్ వంశానికి వారసుడిగా ప్రకటించాడు. మహమ్మద్ ఘజ్‌నీ పెద్ద కొడుకు అయినప్పటికీ.. అతడిని ఎందుకు వారసుడిగా ప్రకటించలేదో.. స్పష్టమైన సమాచారం రికార్డు లభించడంలేదు. కానీ.. ఇస్మాయిల్‌ను రాజును చేయడాన్ని ఘజ్‌నీ సహించలేకపోయాడు. ఏడాది తిరక్కుండానే ఇస్మాయిల్‌పై తిరుగుబాటు చేశాడు. తన సోదరుడు అబ్దుల్‌ముజఫర్ సహాయంతో ఇస్మాయిల్‌ను హతమార్చి ఘజ్‌నీవాద్ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే.. ముస్లింల రాజరికం ఇదే తరహాలో ఆ తరువాత మొఘలుల వరకూ కొనసాగింది. బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్.. ఇలా మొఘలుల రాజరికం అంతా కుటుంబంలో ఒకరిపై ఒకరు అధిపత్యం కోసం పోరాడి.. సాధించుకొన్నవాళ్లే..
998లో రాజ్యంలోకి వచ్చిన తరువాత మహమ్మద్ ఘజ్‌నీ సామ్రాజ్య విస్తరణపై దృష్టిపెట్టాడు. అబ్దుల్ హసన్ ఇఫ్రైనీని ప్రధానమంత్రిని చేసి అక్కడి నుంచి పశ్చిమ భారతం వైపు పయనించడం మొదలుపెట్టాడు. ముందుగా కాందహార్, బోస్టు(లష్కర్ ఘా) ప్రాంతాలను సైనిక స్థావరాలుగా మార్చుకొన్నాడు. అక్కడి నుంచి ఉత్తర భారత ప్రాంతాలపైన వరుస దాడులు కొనసాగిస్తూ వచ్చాడు. 1001లో ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంతోపాటు భారత్‌లోని మరి కొన్ని ప్రాంతాలపై దాడులు కొనసాగించాడు. కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొన్నాడు. 1001 నవంబర్ 28న హింద్‌షాహీ రాజు జయపాలుడిని ఓడించి బందీ చేసి కొద్ది రోజుల తరువాత విడిచిపెట్టాడు. జయపాలుడు ప్రస్తుత పెషావర్ ప్రాంతానికి వలస వచ్చి.. అక్కడే ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయన కుమారుడు ఆనందపాలుడు వారసత్వాన్ని కొనసాగించాడు. 1002లో సిస్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకొన్నాడు. అక్కడ ఖలాఫ్ బిన్ అహ్మద్‌ను ఓడించి అక్కడ సఫ్పారిద్ వంశాన్ని అంతమొందించాడు. ఇది అరబ్బుల రాజ్యం. 1005లో భాటియా (బహుశా భేరా అయి ఉండవచ్చు) ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. 1006లో అరబ్బుల చేతిలో ఉన్న ముల్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకొన్నాడు. అదే సమయంలో ఆనందపాలుడి సైన్యం మహ్మద్ ఘజ్‌నీపై దాడిచేసింది. 1007 సంవత్సరంలో భటిండా రాజు సుఖపాలుడిపై దాడి చేసి హతమార్చి ఆ ప్రాంతాన్ని తన చేతిలోకి తీసుకొన్నాడు. 1008-09 మధ్యన చాచ్ యుద్ధంలో హింద్ షాహీలను ఓడించాడు. ఆనందపాలుడు మహమ్మద్‌పై యుద్ధం చేశాడు. భీకరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆనందపాలుడి ఏనుగు ఒక్కసారిగా వెనక్కు తిరిగి సహకరించకపోవడంతో ఓటమిపాలయ్యాడు. ఒక అతి పెద్ద రాజ్య వ్యవస్థను అంతం చేయడంతో ఇప్పుడు మనకు కనిపించే పాకిస్తాన్ ప్రాంతం దాదాపుగా ఘజ్‌నీ నియంత్రణలోకి వచ్చింది. అతని కుమారుడు త్రిలోచనపాలుడు లాహోర్‌కు వలస వెళ్లాడు. చాచ్ యుద్దం తరువాత కూడా భారతీయులు ఘజ్‌నీని ఎదిరించడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఘజ్‌నీ ఆ తిరుగుబాట్లను పూర్తిగా అణచివేశాడు. ముఖ్యంగా పంజాబ్‌ను కేంద్రంగా చేసుకొని.. ఘజ్‌నీ తన దాడులు కొనసాగించాడు. ఈ దాడుల్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి వాయవ్య భారత ప్రాంతాలపై దాడులు చేయడం.. అక్కడ ఉన్న సంపదను పూర్తిగా దోచుకొని రావడం చేశాడు. 1013లో ఆనందపాలుడి కొడుకు త్రిలోచనపాలుడిపై యుద్ధం చేసి తూర్పు ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలను పూర్తిగా వశపరచుకొన్నాడు. 1014లో థనేసర్‌పైకి దాడి చేసి ఆక్రమించుకొన్న తరువాత.. 1015లో మహమ్మద్ ఘజ్‌నీ కశ్మీర్‌పైన యుద్ధానికి ప్రణాళిక వేసుకొన్నాడు. అక్కడ అధికారంలో ఉన్న సంగ్రామరాజు ఘజ్‌నీవాద్‌లకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన హింద్ షాహీలకు గొప్ప స్నేహితుడు. వారికి అవసరమైన సైనిక సహకారాన్ని పూర్తిగా అందించిన వాడు. అందుకే సంగ్రామరాజు ఘజ్‌నీకి పెద్ద శ్రతువుగా మారిపోయాడు. అందుకే కాశ్మీర్‌ను ఆక్రమించుకోవడానికి ఘజ్‌నీ ప్రయత్నం చేశాడు కానీ.. అది విఫలమైంది. 1015లో తోహీ నదీ లోయ వెంబడి మహమ్మద్ ఘజ్‌నీ కాశ్మీర్‌లోకి తొసామైదాన్ దారిలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అక్కడ లోహర్‌కోట్ దగ్గర గట్టి ప్రతిఘటన ఎదురైంది. లోహర్‌కోట్‌ను దాదాపు నెలరోజుల పాటు ఘజ్‌నీ చుట్టుముట్టాడు. ఇక్కడ భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఘజ్‌నీ తన సైన్యాన్ని చాలా వరకు కోల్పోయాడు. ఒక దశలో ఘజ్‌నీ ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమైంది. అదేజరిగి ఉంటే.. దేశంలో ఇస్లాం చొరబాట్లు మరెలా ఉండేవో తెలియదు. పరిస్థితి తనకు పూర్తి ప్రతికూలంగా మారడంతో అప్పటికి ఘజ్‌నీ వెనక్కు వెళ్లిపోయాడు. అప్పటికి వెనక్కి వెళ్లిపోయినప్పటికీ.. ఘజ్‌నీ ఇతర ప్రాంతాలపై దాడులు చేస్తూనే 1021లో మరోసారి కశ్మీర్‌పై యుద్ధానికి పూనుకొన్నాడు. అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అదే లోహర్‌కోట్ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేకపోయాడు. దీంతో అతను మళ్లీ కశ్మీర్‌వైపు కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో ఇతర ప్రాంతాలపై దాడులను కొనసాగిస్తూనే ఉన్నాడు.
1018లో మధురపైన యుద్ధంచేశాడు. మధుర పక్క పక్కనే ఉన్న రాజులందరూ ఏకమై కలిసికట్టుగా ఘజ్‌నీని తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఇక్కడ కూడా భీకరంగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మధుర రాజు చంద్రపాలుడిని.. ఘజ్‌నీ హతమార్చాడు.
పవిత్రమైన మధురా నగరాన్ని అత్యంత క్రూరంగా.. పాశవికంగా నాశనం చేశాడు. బీభత్సమైన మృత్యుహేళ తాండవమాడింది. ఎందరు చనిపోయారో.. ఎందరు బానిసలయ్యారో తెలియదు. మందిరాలను, భవనాలను నేలమట్టం చేశాడు. శ్రీకృష్ణుడి బృందావన లీలలకు కేంద్రస్థానమైన అతి పవిత్రమైన మధుర శ్రీకృష్ణ మందిరం మహమ్మద్ ఘజనీ క్రూరత్వానికి ధ్వంసమైపోయింది. ఘజ్‌నీ దాడి చేసిన రెండో శతాబ్దం నాటికి మధుర అత్యంత సంపన్నమైన నగరంగా ఉన్నది. ఈ నగరాన్నంతటినీ ఘజ్‌నీ లూటీ చేసేశాడు. దాదాపు ఇరవై రోజుల పాటు మధురలో ఇతడి విశృంఖల విహారం యథేచ్ఛగా, అడ్డూ ఆపూ లేకుండా కొనసాగింది. బంగారం, వెండి, ఇతర విలువైన సంపదను పెద్ద ఎత్తున దోచుకొనిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలను తారీఖ్ ఏ యామిని పుస్తకంలో అల్ ఉత్‌బీ రికార్డు చేశాడు. మహమ్మద్ ఘజ్‌నీ.. మధురలో అత్యద్భుతమైన గొప్ప దేవాలయాన్ని ధ్వంసం చేశాడని రాశాడు. ఫిరిస్తా రాసిన హిస్టరీ ఆఫ్ హిందుస్తాన్ గ్రంథం ప్రకారం మధుర.. దేశంలోనే అతి సంపన్న నగరంగా ఉండేదని.. మహమ్మద్ ఘజ్‌నీ ఇక్కడి సంపదనంతా దోచుకోవడమే కాకుండా అక్కడి దేవతామూర్తులన్నింటినీ దగ్ధం చేసి పైశాచికానందాన్ని పొందాడు. నగరం మొత్తాన్ని తగులబెట్టాడు. మహమ్మద్ ఘజ్‌నీ చేసిన విధ్వంసకాండతో మధురలోని అత్యంత అపురూపమైన కళాత్మక సౌందర్యం కనుమరుగైపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న మధుర, బృందావనం.. మొఘలుల చెర వీడి మరాఠాల చేతుల్లోకి వచ్చిన తరువాత పునర్నిర్మాణమైన నగరం. ఈ ఆలయ శిథిలాలతోనే ఔరంగజేబు ఇక్కడ మసీదును నిర్మించాడు.
ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది.. నాడు ముల్తాన్‌లో మహమ్మద్ బిన్ ఖాసిం చేసిన దురాగతం. అక్కడ ఆదిత్యుడి దేవాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేశాడో.. అదే ధ్వంస రచన ఆ తరువాతి కాలంలో విచ్చలవిడిగా కొనసాగుతూ వచ్చింది. సంపదను దోచుకోవడం.. మతాన్ని బలవంతంగా రుద్దడమనే ధోరణితోనే ముస్లింల దాడులు భారత్‌పై కొనసాగాయి. మహమ్మద్ ఘజ్‌నీ మరింత క్రూరంగా దోచుకొన్నాడు.
1021లో ఘజ్‌నీ సరికొత్త తంత్రాన్ని భారతీయ రాజులపై ప్రయోగించాడు. చండేల గండ అనే రాజుకు వ్యతిరేకంగా కన్నోజ్ రాజుకు మద్దతు ఇచ్చాడు. అదే సంవత్సరంలో రాహిబ్‌లో మిగిలి ఉన్న హింద్‌షాహీ త్రిలోచనపాలుడు చనిపోయాడు. అతని కొడుకు భీమపాలుడు లాహోర్‌లో అధికారంలోకి వచ్చినా.. అతనికి యుద్ధం చేసే ఓపిక లేకుండా పోయింది. ఘజ్‌నీకి లొంగిపోయాడు. 1023 వ సంవత్సరంలో గ్వాలియర్‌పై ఘజ్‌నీ యుద్ధానికి తెగబడ్డాడు. 1024 లో గుజరాత్‌లోని సోమ్‌నాథ్ దేవాలయంపై దాడి చేశాడు. రాజ్‌పుత్ రాజైన భోజుడు తనపెద్ద సైన్యంతో మహమ్మద్‌పై విరుచుకుపడటంతో సోమ్‌నాథ్‌పై దాడికి వేరే దారిని ఎంచుకొన్నాడు. సింధ్ ప్రాంతం మీదుగా థార్ ఎడారిలోకి ప్రవేశించి ఎడారి మార్గంలోనే దొంగచాటుగా సోమ్‌నాథ్‌పై దాడిచేశాడు. మార్గమధ్యంలో తన వందలాది సైనికులు, జంతువులు ఆకలిదప్పులు తాళలేక చనిపోయినా పట్టనంత క్రూరుడు. సోమ్‌నాథ్‌పై దాడిచేసి ఆలయాన్ని నేలమట్టంచేశాడు. లోపల పవిత్ర జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేయాలనుకొన్నప్పటికీ అది సాధ్యపడలేదు. సోమ్‌నాథ్‌పై ఘజ్‌నీ దాడికి సంబంధించిన ఘటనను అనేక పుస్తకాలు రికార్డుచేశాయి.
అబ్దల్ హై గర్ద్‌జీ రాసిన కితాబ్ జైనుల్ అక్బర్ (1048 సీఈ) నిజాముద్దీన్ అహమ్మద్ రాసిన తబాఖత్ ఈ అక్బరీ, ఫిరిస్తా రచనలు, క్రిస్టోఫర్ బామర్ వంటి పలువురి రచనల్లో ఈ అంశాలు రికార్డ్ అయ్యాయి. కేఎం మున్షీ, ఆర్సీ మజుందార్ తదితరుల భారతీయ చరిత్ర రచనల్లో ఘజ్‌నీ క్రూరత్వాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తావించారు.
1027లో ఘజ్‌నీ జాట్లపైన దాడులుచేయడం మొదలుపెట్టాడు. వారిని ఎక్కడికక్కడ హతమార్చసాగాడు. మహమ్మద్ సేన కంటే జాట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అతను దాదాపు రెండువేల బోట్లు.. అందులో మండే గుణం కలిగిన నాఫ్తా.. విలుకాళ్లను పట్టుకొని వెళ్లేవారు. వీటితో జాట్లపైకి మంటల బాణాలను వదిలి వారిని సజీవంగా దహనం చేశాడు. సింధ్ ప్రాంతంపై అరబ్బులు 624లో దాడులు మొదలు పెట్టినప్పటినుంచి కూడా బలవంతపు మత మార్పిళ్లను ఎదిరించి పోరాడిన వారు జాట్లు. దాదాపు 3 వందల ఏండ్లకు పైగా మతమార్పిళ్లను అడ్డుకొన్న జాట్లను దారుణంగా ఊచకోత కోశాడు. భారతదేశంలో మధ్య భారతం దాకా విజయవంతంగా చొచ్చుకొని వచ్చిన ముస్లిం మహమ్మద్ ఘజ్‌నీయేనని చెప్పవచ్చేమో. కానీ ఇతను దోచుకోవడమే తప్ప సామ్రాజ్యాన్ని స్థాపించే ఆలోచన చేయలేదు. కాకపోతే.. ఘజ్‌నీ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. ఘజ్‌నీ దోపిడీ కాండ భారతదేశంలో రాజులను పెద్ద ఎత్తున డిఫెన్స్‌లో పడేసింది. ఒకరకమైన భయానక వాతావరణాన్ని సృష్టించింది.
ఆ తరువాత సికిందర్, అల్లావుద్దీన్ ఖిల్జీ, తైమూర్‌లంగ్ ఇలా ఒకరితరువాత ఒకరు మహా మానవ హననానికి పాల్పడ్డారు. వీళ్లు హతమార్చిన భారతీయుల సంఖ్యను అంచనా వేస్తే ఏ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి సంఖ్యకు తీసిపోదేమో. ఖిల్జీలు.. తైమూర్‌లంగ్‌ల గురించి తరువాతి వ్యాసాల్లో మరికొంత ప్రస్తావించుకొందాం. కానీ.. భారత్‌లో ఇస్లాం మత విస్తరణకు మార్క్సిస్టు చరిత్రకారులు ఖరారు చేసినట్టు శాంతి సామరస్యాలు కానే కాదని ఇప్పటివరకు.. ఇకముందూ మనం చెప్పుకోబోయే అనేకానేక ఉదంతాలు చెప్పాయి.. చెప్పుతున్నాయి. మొదట్నుంచీ కూడా అత్యంత పైశాచికంగా తలలు నరికి.. సామూహికంగా మానవ హననం చేసి.. స్త్రీలను వేశ్యలుగా మార్చి.. బతికుండగానే మంటల్లో పడేసి.. ఒక బీభత్సమైన వాతావరణాన్ని క్రియేట్‌చేసి ఇస్లాంను విస్తరించుకొంటూ వచ్చారు. అరేబియా, పర్షియా, ఆఫ్గనిస్తాన్ తదితర ప్రాంతాల్లో చేసినమాదిరిగానే భారతీయ మూలాలు సాధ్యమైనన్ని చోట్ల కూకటివేళ్లతో పెకిలించుకొంటూ వచ్చారు. సంస్కృతిని మరిపించి.. లేని మతాన్ని సృష్టించి.. తమ మతాన్ని చొప్పించి.. తమకు తాము ఒక జాతిగా ప్రొజెక్ట్ చేసుకొంటూ వచ్చారు. ఒకదేశం రెండు శాసనాల అమలును ప్రారంభించారు. మహమ్మద్ ఘజ్‌నీ దేశ విభజన చరిత్రలో చెదపురుగులా పట్టుకొన్న సందర్భం. అది క్రమంగా మొత్తం దేశాన్ని తొలుచుకొంటూ వచ్చింది.
(సశేషం)