దేశ విభజన విషవృక్షం-12

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మ[/dropcap]న దేశం ఎంత సంపన్నమైందో మహమ్మద్‌ ఘజ్‌నీ వచ్చి దోచుకొనే దాకా మిగతా ప్రపంచానికి  తెలియలేదు. మహమ్మద్‌ ఖాసిం ముల్తాన్‌ దాటి ముందుకు రాలేదు. ఘజ్‌నీ.. ఇంకాస్త ముందుకు చొచ్చుకొచ్చి సోమ్‌నాథ్‌ దాకా వెళ్లాడు. ఒక్కో దానిపై పదుల సార్లు దాడులు చేసి ఉన్నదంతా దోచుకొనిపోయాడు. విధ్వంసాన్ని సృష్టించాడు. నగరాలకు నగరాలను తగులబెట్టాడు. వేలకొద్దీ బంగారు వెండి విగ్రహాలు ఎత్తుకెళ్లాడు. నీలమణులు, కెంపులు, వజ్రాలు, పచ్చలు, పగడాలు.. ఒకటేమిటి.. రత్నాలు పొదిగిన అనేకానేక సంపదను దోపిడీ చేశాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. ఈ దేశం ఇవాళ ఇంత దారిద్య్రంతో ఎందుకు అవస్థ పడుతున్నది? అమెరికా, ఐరోపా దేశాలకు కనీసం ఉనికి కూడా లేకముందున్న సంపత్తి గురించే మనం మాట్లాడుకొంటున్నాం. ఇంత సంపద పోగుపడి కూడా మనం ఇంకా మూడో ప్రపంచ దేశంగానో.. అభివృద్ధి చెందుతున్న దేశంగానో ఉండాల్సిన ఖర్మ ఎందుకొచ్చింది? ఎందుకు మనం ఇవాళ హంగర్‌ ఇండెక్స్‌లో వెనుకబడిపోయామనో.. గోదాముల్లో గోధుమలు.. బియ్యం నిల్వలు లేవనో రాజకీయాలు చేసుకొంటున్నాం? ఈ సంపదనంతా అనేకమంది ఘజ్‌నీలు దోచుకొని వెళ్లిపోయారు. ఈ దేశాన్ని దరిద్ర నారాయణ దేశంగా మార్చివేశారు కాబట్టి. దోపిడీ చేసి వెళ్లిపోయినవాడు బలవంతంగా తన మతంలోకి మార్చిన కుటుంబాల వారసులు.. అరేబియా, పర్షియాల్లో మాదిరిగా తమ మూలాలను సైతం మరచిపోయారు..

వీళ్లు ఎంతగా దోచుకొన్నారంటే దానికి ఇవాళ్టి ఎన్ని ఆధునిక యంత్రాలు తెచ్చినా లెక్కలేనంత. మనందరికీ అత్యంత పవిత్రమైన కృష్ణ క్షేత్రం మధురనే ఉదాహరణగా తీసుకొంటే.. ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఈ నగరాన్ని దోచుకోవడానికే ఘజ్‌నీకి ఇరవై రోజులు పట్టింది. ఘజ్‌నీ మధురపై దాడిచేసే నాటికే అక్కడ ఉన్న దేవాలయాలు అప్పటికి నాలుగువేల సంవత్సరాలకు పూర్వం నిర్మించినవని ప్రఖ్యాత పర్షియన్‌ చరిత్రకారుడు ఫెరిస్త్తా రచనల ద్వారా తెలుస్తుంది. ఫెరిస్తా రచనలు దాదాపు 13 వరకు ఉన్నాయి. ఇందులో ‘కింగ్స్‌ ఆఫ్‌ ఘజ్‌నీ, లాహోర్‌’ అన్న గ్రంథంలో ప్రధానంగా హింద్‌షాహీలు, ఘజ్‌నీల చరిత్రను ఫెరిస్తా రికార్డు చేశాడు. మధురలో ఘజ్‌నీ చొరబడ్డాక అక్కడి సంపద చూసి అతడి కండ్లు బైర్లు కమ్మాయి. కనపడ్డది కనపడ్డట్టు సంచుల్లో కుక్కుకొని మరీ దోచుకొన్నాడు. ఏ రోజుకారోజు.. తన ఏనుగుల మీద పట్టినంత సంపదను పట్టించి.. తరలించేవాడు. మళ్లీ ఏనుగులను రప్పించి మళ్లీ దోచుకోవటం.. ఇలా రోజుల తరబడి ఈ దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఫెరిస్తా పేర్కొన్న ప్రకారమే మనం విశ్లేషించుకొంటే.. మధురలో శ్రీకృష్ణ జన్మస్థాన్‌ మందిరంలో లభించిన పూర్తి బంగారంతో చేసిన కృష్ణుడి విగ్రహాన్ని దోచుకొని కరిగించాడట ఘజ్‌నీ.. దీన్ని కరిగిస్తే 98,300 ఎల్‌బీల స్వచ్ఛమైన బంగారం లభించింది. అంటే 44,588.13 కిలోలు అన్నమాట. ఒక ఎల్‌బీ అంటే 453.592 గ్రాములు. ఇక మీరు అంచనా వేసుకోండి.. దీని విలువ ఏమాత్రమో. ఈ కృష్ణుడి విగ్రహం చేతికి నీలమణితో ఉన్న ఒక ఉంగరం ఉన్నదంట. ఈ ఉంగరం 400 ఎల్‌బీల బరువు ఉన్నదంట. అంటే 181.437 కిలోలు. ఇక్కడే మరో విగ్రహం లభించింది. ఈ విగ్రహానికి ఉన్న రెండు కండ్లుగా కెంపులు ఉన్నాయి. ఈ కెంపుల విలువ ఆనాటికి లేని అమెరికా డాలర్ల విలువలో చూస్తే 50 వేల డాలర్లు. ఇరవై రోజుల పాటు దోచుకొన్న తరువాత కూడా ఇంకా సంపద బయటపడుతుంటే.. ఘజ్‌నీకే చిరాకు కలిగింది. దీంతో మొత్తం సమస్త మధురానగరాన్ని సజీవంగా తగులబెట్టాడు.

ఈ సంపద చూసిన తరువాత ఘజ్‌నీకి నిద్రపట్టలేదు. ఒక్క నగరంలోనే.. ప్రతి ఇంట్లో ఇంత సంపద దొరికితే.. ఇక మిగతా నగరాల్లో ఎంత ఉంటుంది? ఈ ఆలోచనతో పిచ్చిపట్టినట్టయింది. చనిపోయేదాకా దోచుకొంటూనే ఉండిపోయాడు. దాన్ని ఎంతవరకు అనుభవించాడో మాత్రం తెలియదు. 1009 సంవత్సరంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో నాగర్‌కోట్‌పై ఘజ్‌నీ దాడిచేశాడు. ఇక్కడ కోటను పాండవులలో ఒకడైన భీముడు నిర్మించాడు మహాభారత కాలంలో. ఈ కోటలో లెక్కలేనంత ఖజానా పోగుపడి ఉన్నది. ఘజ్‌నీ ఈ భీమ్‌ కోట నుంచి 7 లక్షల బంగారు దీనార్లను, 700 మణుగుల బంగారం వెండి పాత్రలను, 200 మణుగుల బంగారు కడ్డీలను 2000 మణుగుల వెండి కడ్డీలను 20 మణుగుల ముత్యాలు, పగడాలు, వజ్రాలు, కెంపులను దోచుకొని వెళ్లాడు. ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఒక మణుగు అంటే..37.3242 కిలోగ్రాములు అని ముందే చెప్పుకొన్నాం. ఇవాళ మూడు క్యారెట్ల నీలమణి ఖరీదు లక్షా పదమూడు వేల రూపాయలు ఉన్నది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక మొత్తం ఘజ్‌నీ దోపిడీని అంచనా వేయడానికి ఏ చరిత్రకారుడైనా ఎంత విలువ కడతాడు?

కొన్ని రోజులు ఆగాడేమో కానీ.. ఘజ్‌నీకి ఈ దేశంలో దొరికిన బంగారం చూసి నిజంగానే పిచ్చెక్కిపోయింది. పంజాబ్‌ను సైనిక స్థావరంగా మార్చుకొన్న ఘజ్‌నీ.. పక్కనే ఉన్న కురుక్షేత్ర (ఇప్పటి హర్యానా) కు దగ్గరున్న థానేశ్వర్‌పై కన్ను పడింది. థానేశ్వర్‌లోని దేవాలయంపై హఠాత్తుగా దాడికి దిగాడు. హిందువులు ఎదుర్కోవడానికి కూడా టైమ్‌ దొరకనంత మెరుపుదాడి చేశాడు. దేవాలయంలోకి వెళ్లి అక్కడి విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ ఆలయంలోని ప్రధాన దేవతారూపం జక్సామా. ఈ జక్సామా ఆలయంపై ఘజ్‌నీ దాడి గురించి హాజీ మహమ్మద్‌ కాందహారీ అనే చరిత్రకారుడు   తన రచనల్లో ప్రస్తావించాడు. ఈయన కథనం ప్రకారం ఈ ఆలయంలో ఒక ఐదు పౌండ్ల రూబీ దొరికింది. ఒక పౌండ్‌ అంటే దాదాపు అరకిలోకు సమానం. అంటే.. రెండున్నర కిలోగ్రాముల బరువన్నమాట. దాదాపు 11,339 కారట్లతో సమానం. ఇవాళ్టి కాలంలో ఒక క్యారెట్‌ జెమ్‌స్టోన్‌ లక్షల్లో ధర పలుకుతుంది. అలాంటిది పదకొండు వేల కారట్లు అంటే ఎంత విలువ ఉంటుందో ఊహించుకొంటేనే అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడి ఆలయంలో దేవుడిని జక్సామా అని పిలిచారు. ఇది శివరూపం కానీ, విష్ణురూపం కానీ అయి ఉండవచ్చు. దీనికి సంబంధించి ఇతమిత్థంగా ఎలాంటి సమాచారం లేదు. యముడు, కుబేరుడు, చంద్రుడిని కూడా అదే పేరుతో పిలిచే ప్రాంతాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఎనిమిది నుంచి పదో శతాబ్దం వరకు ఉత్తర భారతదేశంలో అనేక పేర్లతో దేవాలయాలు ఉన్నప్పటికీ.. వారు ఇప్పుడు మనం కొలిచే శివ, విష్ణువుల్లో ఎవరో ఒకరై ఉన్నారు.

థానేశ్వర్‌లో యుద్ధం చేసిన తరువాత సుల్తాన్‌ మహమ్మద్‌ ఘజ్‌నీ అక్కడి నుంచి దాదాపు రెండు లక్షల మంది హిందువులను బందీలుగా పట్టుకొని ఘజ్‌నీవాద్‌ రాజ్యానికి తరలించుకొనిపోయాడు. ఘజ్‌నీ సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడు కూడా బాగా సంపన్నుడయ్యాడు. ఒక్కో సైనికుడు ఒక్కో ఘజ్‌నీలాగా మారిపోయాడు. ప్రతి ఒక్కడూ తన ఇంట్లో పదుల కొద్దీ బానిసలను పనివాళ్లుగా పెట్టుకొన్నాడు. కొందరిని వేశ్యలుగా మార్చి భయంకరంగా వేధింపులకు గురిచేశారు. ఇదంతా రాసింది ఫెరిస్తా. ఈయన పెర్షియన్‌ ముస్లిం. ఇతను అత్యుక్తులు, అతిశయోక్తులు రాసి ఉండే అవకాశం లేదని అత్యధిక చరిత్రకారులు విశ్వసిస్తారు.

ఘజ్‌నీ థానేశ్వర్‌ నుంచి బానిసలుగా పట్టుకొని పోయిన వాళ్లలో ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నారు. ఎందుకంటే.. మహమ్మద్‌ బిన్‌ ఖాసిం దగ్గరి నుంచి కూడా వీళ్లు మగవాళ్లను హతమార్చి, ఆడవాళ్లను బానిసలను చేసి పట్టుకొని పోవటం మొదట్నుంచీ ఉన్నది. ఇప్పుడు కూడా సమాజంలో మహిళలను మనుషులుగా కాక కేవలం మగవాళ్ల అవసరాలను తీర్చే ఉపకరణాలుగా భావించటం ఆధునిక సమాజంలో కూడా అనేక చోట్ల కొనసాగుతున్నది. షరియా ప్రకారం మగవాళ్లు నాలుగు పెండ్లిళ్లు చేసుకోవడానికి అనుమతించడం.. వారిని చదువు సంధ్యలకు దూరం చేయడం.. బుర్ఖా లేదా హిజాబ్‌ పరదాల చాటున దాచి ఉంచడం.. అవసరం లేకపోతే మూడుసార్లు తలాక్‌ చెప్పి వదిలించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంతెందుకు హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి మైనార్టీ తీరని అమ్మాయిలను అరబ్‌ షేక్‌లకు అమ్మిన ఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. భారత్‌లో హిజాబ్‌ ధరించడాన్ని సమర్థించిన మలాలా యూసఫ్‌జాయ్‌ తన మాతృదేశం ఆఫ్గనిస్తాన్‌లో అదే హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడి తాలిబన్ల తూటాలను ఎదుర్కొని నోబెల్‌ బహుమతి పొందిన సంగతి మనకు తెలిసిందే. 2022లో ఇరాన్‌లో మాసా అమీనీ అనే అమ్మాయిని హిజాబ్‌ వేసుకోలేదని కొట్టి చంపేశారు. ఆమెకు మద్దతుగా ఆందోళన జరిపిన పాపానికి మరో ఎనిమిది మందిని ఇరాన్‌ పోలీసులు కాల్చి చంపేశారు. భారత్‌లో హిజాబ్‌కు మద్దతునిచ్చే సంఘాలు.. అదే ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతుగా గొంతులు విప్పటం అద్భుతమైన విన్యాసం.   మహమ్మద్‌ ఘజ్‌నీ ఒక్క థానేశ్వర్‌ నుంచే లక్షల మందిని బానిసలుగా చేసుకొని వెళ్లాడంటే.. భారతదేశంపై మొత్తం 17 సార్లు దండెత్తిన ఘజ్‌నీ, ఇక ఎంతమందిని బానిసలుగా తీసుకొని వెళ్లాడో అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ గతవ్యాసంలో కొంతమేరకు వివరించిన సోమ్‌నాథ్‌పై దాడిని గురించి మరింత లోతుగా చర్చించాల్సి ఉన్నది. సోమ్‌నాథ్‌ గురించి తన అనుచరగణం ద్వారా అనేక వార్తలు విన్న ఘజ్‌నీ.. భారీ సైన్యాన్ని వెంటేసుకొని వెళ్లాడు. సోమ్‌నాథ్‌పై దాడి చేసినప్పుడు అక్కడి రాజు పారిపోయాడని మన చరిత్రకారులు చెప్పుకొంటూ వచ్చారు. గత వ్యాసంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ ఫెరిస్తా రాసిన కింగ్స్‌ ఆఫ్‌ ఘజ్‌నీ, లాహోర్‌ గ్రంథంలోని అంశాలను పరిశీలిస్తే గుజరాతీలు ఘజ్‌నీనీ గట్టిగా ప్రతిఘటించారు. ఆ ప్రాంత ప్రజలు.. అక్కడి సామంత రాజులు కలిసికట్టుగా యుద్ధం చేశారు. భారతీయ సైన్యం ఎదురుదాడిని తట్టుకోలేక ఒక దశలో ఘజ్‌నీ సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. తన సైన్యాన్ని నియంత్రించడానికి ఘజ్‌నీ చాలా కష్టపడాల్సి వచ్చింది. యుద్ధానికి కొంత విరామం ఇచ్చి.. వాళ్లను యుద్ధానికి సన్నద్ధం చేసి మళ్లీ తెగబడ్డాడు. ఈసారి పోరాటంలో దాదాపు ఐదు వేలమంది భారతీయ సైన్యాన్ని హతమార్చి సోమ్‌నాథ్‌ దేవాలయాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. సోమ్‌నాథ్‌ దేవాలయాన్ని ఫెరిస్తా అతి గొప్పగా వర్ణించాడు. ఆకాశాన్నంటే అతి గొప్ప రాతి నిర్మాణమని చెప్పుకొచ్చాడు. అత్యంత బరువైన 56 రాతి స్తంభాలతో నిలబెట్టిన పైకప్పుతో అపూర్వంగా ఉన్నదని పేర్కొన్నాడు. స్తంభాలు, కుడ్యాలు, తోరణాలు.. అన్నింటిపైన అత్యంత అద్భుతమైన శిల్పనిర్మాణ వైచిత్రి కనిపించిందని వర్ణించాడు. గుడి మధ్యలో 15 అడుగుల ఎత్తులో సోమ్‌నాథుడి జ్యోతిర్లింగం కొలువై ఉన్నదని వెల్లడించాడు. చిన్న దీపంతో మాత్రమే వెలుతురు ఏర్పాటు ఉన్నది. ఈ విగ్రహంపై ఏర్పాటుచేసిన ఆభరణాలు, గర్భగుడి గోడల్లో పొదిగిన అనేక నవరత్నాలు, బంగారు వెండిపై ఈ వెలుతురు ప్రతిఫలించి మొత్తం గర్భ గుడిని జాజ్వల్యమానంగా ప్రకాశింపజేసింది. గుడి మొత్తం వజ్రవైఢూర్యాలు, బంగారు, వెండి తాపడాలతోనే నిర్మాణమై ఉన్నదని ఫెరిస్తా అద్భుతంగా వర్ణించాడు. ఇంత గొప్ప సంపద కలిగిన సోమ్‌నాథ్‌ దేవాలయాన్ని ఘజ్‌నీ దారుణంగా దోచుకొన్నాడు. గర్భగుడికి ముందు వేలాడదీసిన అతి పెద్ద గంటకు ఆధారంగా ఉన్న బంగారు గొలుసు బరువు 200 మణుగులు ఉన్నదంట. వివిధ ప్రత్యేక పర్వదినాల్లో.. గ్రహణాల సమయంలో కనీసం 3 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకొనేవారు. రాజులు, భక్తులు పెద్ద ఎత్తున బహుమానాలు, కానుకలు, దక్షిణలు ఇచ్చేవారు. ఈ ఆలయ నిర్వహణకోసం రాజులు రెండు వేల గ్రామాలను ఆలయ అథారిటీకి దానంగా (ఇనాం) ఇచ్చారు. ఇది ఒక విద్యాసాంస్కృతిక కేంద్రంగా కూడా విలసిల్లింది. ఇక్కడ శివలింగాన్ని రోజుకు రెండుసార్లు గంగాజలంతో అభిషేకించేవారు. ఈ ఆలయానికి దాదాపు రెండువేల మంది బ్రాహ్మణులు పూజారులగా వ్యవహరించారు. తలనీలాలు సమర్పించుకొనేవారి కోసం 300 మంది నాయీబ్రాహ్మణులు ఉండేవారు. ఇంత సంపద ప్రపంచంలో మరెక్కడా ఉన్నట్టు ఏ చరిత్రకారుడూ చెప్పలేదు. రాయలేదు. వినలేదు. కనలేదు.

ఈ ఆలయంలో మహాదేవుడి జ్యోతిర్లింగాన్ని కాపాడటానికి అక్కడ పూజారులుగా వ్యవహరించిన బ్రాహ్మణులు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు ఘజ్‌నీ సైన్యానికి పెద్ద ఎత్తున బంగారం ఇస్తామని.. విగ్రహాన్ని మాత్రం ఏమీ చేయవద్దని ప్రాధేయపడ్డారు. ఘజ్‌నీ సైన్యం కూడా తమ రాజుకు చెప్పడానికి ప్రయత్నించినా.. అతను వినలేదు. విగ్రహాన్ని ముక్కలు చేశాడు. విగ్రహ విధ్వంసం తరువాత అందులోపల కూడా అతనికి అనంతమైన సంపద లభించింది. ఇందులో ఒక ముక్కను తన ఘజ్‌నీవాద్‌కు పంపించాడు. ఒక ముక్కను తన రాజగృహానికి తరలించాడు. మరో రెండు ముక్కలను మక్కాకు, మదీనాకు పంపించాడు. గోడలను తొలిచి తొలిచి అందులో పొదిగిన విలువైన రత్నాలను, బంగారు.. వెండి ఆభరణాలను దోచుకొన్నాడు.

ఘజ్‌నీ మహమ్మద్‌కు భారత్‌పై సంపదను దోచుకోవడం తప్ప మరో విషయం కనిపించలేదు. కానీ అతని తరువాత వచ్చిన వాళ్లకు భారతదేశం బంగారు బాతుగా కనిపించింది. అల్లావుద్దీన్‌ ఖీల్జీ, తైమూర్‌లంగ్‌.. అతని వారసులుగా వచ్చిన మొఘలులు.. ఘజ్‌నీ లాగా కేవలం దోచుకోవడంతో సరిపెట్టలేదు. ఏకంగా సొంతం చేసుకొన్నారు. సామ్రాజ్యం ఏర్పాటుచేశారు.  ఇక్కడి రాజులను, ప్రజలను మతం మార్పించారు. మూలాలను మరిపించారు. సంపూర్ణంగా ఒక జాతిని క్రియేట్‌ చేశారు. దేశంలో మూడుముక్కలాట ఆడారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here