Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-13

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మ[/dropcap]హమ్మద్‌ బిన్‌ ఖాసిం నుంచి ఘజ్‌నీ వరకు కూడా దేశంలో సంపదను దోచుకోవడంపైనే దోపిడీదారులు దృష్టి పెట్టారు. కానీ ఆ తరువాత వచ్చిన వీళ్ల వారసులు నాలుగాకులు ఎక్కువే చదివారు. ఘజ్‌నీ 17 సార్లు ఈ దేశంమీద దాడిచేసి అందినంత దోచుకొని పోయాడు. కానీ.. ఈ దేశంలో సంపద అంతులేకుండా కనిపిస్తున్నది. ఇక్కడ తప్ప మరెక్కడా ఇంత సంపద లేదు. ఇతర ప్రపంచానికి ఈ సంపదను అంచనా వేయడం కూడా కష్టమైంది. ఇంత గొప్ప నిర్మాణాలు. వాటిలో అనంతమైన సంపత్తి.. వాళ్లకు అంతుపట్టడం లేదు. అటు అరేబియా నుంచి పర్షియా దాకా.. ఇటు మంగోలియా నుంచి ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దు వరకు తిండి గింజలకు కూడా గతిలేని బతుకులకు ఈ సంపదను చూసి పిచ్చెక్కిపోయింది. దీంతో మాటిమాటికి దాడులు చేయడం కంటే.. ఏకంగా ఇక్కడికే వచ్చి.. రెడీమెడ్‌గా ఉన్న సంపదను అనుభవిస్తే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చేశారు. ఎవడన్నా ఎదురు తిరిగితే చంపేద్దాం.. మన మాట వినాలంటే.. వాడు ముందుగా మన మతంలోకి రావాలి. అప్పుడు చచ్చినట్టు మన మాటే శాసనమవుతుంది. మనం ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది. ఇక్కడి నుంచి విషవృక్షం వటవృక్షంగా ఎదగసాగింది.

1186వ సంవత్సరంలో ఘజ్‌నీవాద్‌ రాజ్యానికి మహమ్మద్‌ ఘోరీ.. రాజయ్యాడు. ఇతని అసలు పేరు ముయిజల్‌దీన్‌.. కానీ షాహబుద్దీన్‌ మహమ్మద్‌ ఘోరీ పేరుతో ప్రముఖుడయ్యాడు. మొదట్లో ఇతను ముల్తాన్‌ తదితర సింధ్‌ ప్రాంతాలపై దాడులు చేశాడు. 1191 వ సంవత్సరంలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ రాజు పృథ్వీరాజ్‌3 పై యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో  పృథ్వీరాజ్‌ చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కానీ ఆ తరువాతి సంవత్సరంలోనే ఘోర్‌.. ప్రతీకార దాడికి పూనుకొన్నాడు. ఈసారి లక్షా ఇరవై వేల అశ్విక దళాన్ని వెంటేసుకొని అజ్మీర్‌పై యుద్ధానికి తెగబడ్డాడు. టరైన్‌ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్‌ను చంపేసి అజ్మీర్‌ను స్వాధీనం చేసుకొన్నాడు. వాయవ్య రాజస్థాన్‌.. గంగ యమున ఉత్తర పరీవాహక ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకొన్నాడు. ముల్తాన్‌తోపాటు ఇవన్నీ తన రాజ్యంలో కలిసిపోయాయి. అక్కడి నుంచి ఘోరీ సైన్యం ఉత్తర భారతవైపు దూసుకెళ్లాయి. 1200 సంవత్సరంలో లాహోర్‌ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును అణచివేయడానికి అక్కడికి వెళ్లిన ఘోరీ.. తిరుగుబాటును అణచివేసి తిరిగి వస్తుండగా సోహావా దగ్గర  దామిక్‌ దగ్గర విశ్రాంతి కోసం ఆగింది. (ప్రస్తుత పాకిస్థాన్‌లోని ఝీలం నదీతీరాన ఈ నగరం ఇప్పుడున్నది).. ఇక్కడ సాయంకాల ప్రార్థనలు చేస్తుండగా ఘోరీని ఇస్మాయిలీ తెగకు చెందిన శత్రువులు హతమార్చారు. (1206 మార్చి 15).

1206లోనే ఘోరీ వారసులు ఢిల్లీలో మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్‌ వంశ పరిపాలనను ప్రారంభించారు. 1211లో సంవత్సరం నాటికి మామ్లుక్‌ వంశం ఢిల్లీ రాజ్యాన్ని హస్తగతం చేసుకొన్నది. మామ్లుక్‌ అంటే బానిసలు అని అర్థం. టర్కిక్‌ బానిస సైనికులు ఢిల్లీ రాజులుగా మారిపోయారు. 13 శతాబ్దం మధ్యనాటికి ఢిల్లీలోని ముస్లిం పాలకులు తమ సామ్రాజ్యాన్ని విస్తృతంగా, వేగంగా విస్తరించుకొంటూ పోయారు. ఒకవైపు తూర్పున బెంగాల్‌ దాకా.. మరోవైపు మధ్య భారతం దాకా ఢిల్లీ సుల్తానుల వశమైపోయింది. తుర్కోఆఫ్గనిస్తాన్‌కు చెందిన ఎన్నో వంశాలు ఢిల్లీ గద్దెనెక్కి దేశాన్ని తమ హస్తగతం చేసుకొన్నాయి. మామ్లుక్‌ (1211-1290), ఖిల్జీ (1290-1320), తుగ్లక్‌ (1320-1414), సయ్యీద్‌ (1414-1451), లోధీ (1451-1526) వంటివి వరుసగా పరిపాలించాయి. వీరి తరువాత మొఘలులు సుదీర్ఘంగా ఈ దేశంపై తమ ప్రభావాన్ని బలంగా కనబరిచారు. దక్షిణ భారతదేశంపై పాగా వేయాలని ఢిల్లీ సుల్తానులు చేసిన ప్రయత్నాలను విజయనగర సామ్రాజ్యం విజయవంతంగా తిప్పి కొట్టింది. ముస్లిం రాజులు దక్షిణ భారతంవైపు కన్నెత్తి చూడకుండా అడ్డుగోడలా నిలిచింది. అందువల్లే.. ఢిల్లీని సుల్తానులు ఎంత ఏలినా.. అనేక రాజ్యాలు స్వతంత్రంగానే తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకొంటూ వచ్చాయి. పంజాబ్‌, రాజస్థాన్‌, దక్కన్‌లోని అనేక ప్రాంతాలు, గుజరాత్‌, మాళ్వ వంటి ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలుగానే కొనసాగాయి. ప్రస్తుత పాకిస్తాన్‌ భూభాగం మొత్తం ముస్లిం పాలకుల వశమైపోయింది. ఆ తరువాత కూడా దీన్నుంచి బయటపడలేకపోయింది. 1947 విభజనకు మూలం.. ఇక్కడ పడిన విత్తనమే.

వీళ్ల పరిపాలన అంతా కూడా ఒక భయానక వాతావరణం కల్పించి.. తమ మతం మారకపోతే.. తమ మాట వినకపోతే బతుకడమే కష్టమన్న పరిస్థితి తీసుకొని వచ్చి.. అత్యంత పైశాచికంగా ఆధిపత్యం చెలాయించారు తప్ప.. వాళ్లు ఎన్నడూ పరిపాలన చేయలేదు. ఉదాహరణకు భక్తియార్‌ ఖల్జీ చేసిన దుర్మార్గాన్ని తలచుకొంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఢిల్లీలో మామ్లుక్‌ వంశం రాజ్యానికి రావడానికి ముందే.. 1203-1206 సంవత్సరాల మధ్యన భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్‌ ప్రాంతంలో విశృంఖలంగా స్వైర విహారమే చేశాడు. బీహార్‌లో ప్రసిద్ధమైన నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేశాడు. విక్రమ   శిల విశ్వవిద్యాలయాన్ని కూడా విధ్వంసం చేశాడు. అత్యంత క్రూరంగా హిందూ, బౌద్ధ స్కాలర్లను ఊచకోత కోశాడు.  నలందపై ఇతడి దాడితో భారతదేశం నుంచి బౌద్ధం సంపూర్ణంగా అంతరిచింది. కానీ, ఈ పాపం హైందవానికి, బ్రాహ్మణులకు అంటగట్టారు చరిత్రకారులు.  తూర్పు    బెంగాల్‌ సంపూర్ణంగా ఖల్జీ స్వాధీనమైంది. ఖల్జీతో బెంగాల్‌లో ప్రారంభమైన ముస్లిం రాజుల పరిపాలన దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొనసాగింది. 1757లో ప్లాసీ యుద్ధంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ రావడంతో ఇక్కడ ముస్లిం రాజుల పరిపాలన అంతమైంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే.. ఈ తూర్పు బెంగాలే.. 1947లో పాకిస్తాన్‌తో పాటు తూర్పు పాకిస్తాన్‌గా విడిపోయిన భారతదేశపు ముక్క. 1971లో బంగ్లాదేశ్‌గా స్వతంత్రమైన భూభాగం.

ఒక దేశం రెండు ఆచారాలు, రెండు సంప్రదాయాలు అనే విధానం ఢిల్లీ సుల్తానుల కాలంలోనే మొదలయ్యాయి. దేశంలో ప్రజలందరూ ఖురాన్‌ను అనివార్యంగా అనుసరించాలి. షరియా చట్టాన్ని తుచ తప్పకుండా పాటించాలి. ఎవరైనా ఇస్లామేతర మత సంప్రదాయాలను, ఆచారాలను వదులుకోలేని పక్షంలో జిజియా పన్ను చెల్లిస్తే అందుకు అనుమతిస్తారు. ఆ మధ్య ఒక పాత్రికేయుడు చరిత్ర సరైనదే కానీ.. భారతీయ చరిత్రకారులు చెప్పే భాష్యంతోనే చిక్కు వచ్చిపడిందన్నారు. నిజమే. ఈ దేశ చరిత్రను అద్భుతంగా రాసిన సూపర్‌ హిస్టారియన్లు ఇదే చరిత్రకు చెప్పిన భాష్యం ఏమిటంటే.. ముస్లిం రాజులు అత్యంత ఉదారంగా.. మత సామరస్యాన్ని పాటించారు. అన్ని మతాలను సమానంగా చూశారు. భారతీయులే ఈ ఔదార్యాన్ని, సమరసతను చూసి ఇస్లాంలోకి మారిపోయారని. ఈ భాష్యంతోనే సమస్య వచ్చిపడింది. మీ వ్యక్తిగత వ్యవహారమైన మీ మతాన్ని పాటించాలంటే.. ఆచారాన్ని పాటించుకోవాలంటే.. పూజలు, పునస్కారాలు చేసుకోవాలంటే.. పన్ను కట్టాలనడం.. లేకుంటే మా మతంలోకి మారాలని చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో.. ఏ విధంగా వ్యాఖ్యానించాలో తెలియదు. ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది మరో రూపంలో! దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో వుంటాయి. వాటినుంచి అందే ఆదాయం దేశానిది. కానీ, ఇతర మతాల పవిత్ర స్థలాలపై హక్కు వారిదే. వారి ఆస్తులు ఆయా మతానుయులాలవే! ఇలాంటి ఒక రాజ్యం, రెండు ఆచారాలు, రెండు న్యాయాలు ఆనాటినుంచీ ఈనాటి వరకూ కొనసాగుతూ వస్తోంది. అందుకే, దేశంలొ అందరికీ ఒకే చట్టం , ఒకే న్యాయం అనగానే అన్యాయం అయిపోయినట్టు గోల చేస్తున్నారు. ఒక దేశం, ఒక ప్రజ, అంతా సమానమే అంటే ఆమోదించే వీలులేదు. ఇది ఆనాటి విషబీజం విషవృక్షం అయిందనటానికి నిదర్శనం.

13వ శతాబ్ది చివరినాటికి మధ్య ఆసియాపై మంగోలుల దండయాత్రలు పెద్ద ఎత్తున సాగాయి.  ఆఫ్ఘనిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌  ఛంగీజ్‌ఖాన్‌ వారసుల  వశమైపోయాయి. ఇక్కడి నుంచి క్రమంగా భారతదేశంలోకి విస్తరించడం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి భారత దేశంలో అన్నీ సంకరమైపోయాయి. మనుషులు మతం మారడంలో వేగం పెరిగింది. అన్నింటిలోనూ ఇండో ముస్లిం కలగలసిపోయిన ఒక సరికొత్త కల్చర్‌ పుట్టుకురావడం మొదలైంది. ఆర్కిటెక్చర్‌లో, సంగీతంలో, సాహిత్యంలో అన్నింటిలోనూ ఈ మార్పు స్పష్టంగా గోచరించింది. సమాధుల సంస్కృతి పెచ్చుమీరింది. నిర్మాణాల్లో ఇరాన్‌, పర్షియా, మంగోల్‌, అరబ్‌ శైలులు దిగుమతి అయ్యాయి. ఈ ముస్లిం చొరబాట్ల కారణంగా ముఖ్యంగా ఉర్దూ భాష కొత్తగా ఆవిర్భవించింది. సంస్కృతం, హిందీ, పర్షియన్‌, టర్కిష్‌, అరబిక్‌ భాషలన్నింటి సమ్మిళితంగా అపసవ్య లిపిలో ఉర్దూ భాష అవతరించింది. అదే ముస్లిం రాజుల ప్రధానభాషగా మారిపోయింది. ప్రధానంగా ఉత్తరభారతంలో ముస్లిం అరబిక్‌ శైలి ప్రస్ఫుటమైపోయింది.

1370-1507 సంవత్సరాల మధ్యన తైమూర్‌లంగ్‌ ముస్లిం రాజరిక వ్యవస్థలోని అత్యంత పైశాచికత్వాన్ని భారతదేశంపై ప్రదర్శించాడు. కలలో కూడా ఊహించని రక్తపాతాన్ని సృష్టించాడు. ముందుగా భట్నీర్‌పై దాడిచేసి అక్కడ దాదాపు పదివేలమంది రాజపుత్రులను ఊచకోత కోశాడు. ఆ తరువాత ఢిల్లీవైపు అడుగులు వేశాడు. 1398 సంవత్సరంలో తైమూర్‌ ఢిల్లీ సుల్తాన్‌పైకి దండెత్తాడు. అప్పుడు నసీరుద్దీన్‌ మహమ్మద్‌ తుగ్లక్‌ రాజుగా ఉన్నాడు. 1398 సెప్టెంబర్‌ 24 న అట్లాక్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నది) వద్ద సింధూ నది దాటి.. హర్యానాలోకి ప్రవేశించాడు. సెప్టెంబర్‌ 24న అతని ఊచకోత పర్వం మొదలైంది. ‘నేను హిందువులను వధించి, వారి ఆస్తిపాస్తులను హరించి అల్లాకు ప్రీతిపాత్రుడనయ్యాన’ని తైమూర్‌ తన అటోబయోగ్రఫీలో రాసుకొన్నాడు. హర్యానాలో కనిపించిన వారిని కనిపించినట్టుగా హతమారుస్తూ వెళ్లాడు. తన సైనికులను చిత్తం వచ్చినట్టు స్వైర విహారం చేయాలని ఆదేశించాడు. ఒక్కో సైనికుడు కనీసం వందమందిని దారుణంగా చంపేశారు. వాళ్ల ఆస్తులను లూటీ చేశారు. ఢిల్లీలోకి ప్రవేశించకుండా తైమూర్‌ను ఎవరూ ఆపలేకపోయారు. 1398 డిసెంబర్‌ 17న సుల్తాన్‌ ఓడిపోయాడు. ఇక ఢిల్లీలో తైమూర్‌ వీరవిహారానికి అడ్డూ అదుపూ  లేకుండా పోయింది. ఆ మర్నాడు అంటే 1398 డిసెంబర్‌ 18న దోచుకొన్న సంపదను సమీకరించుకోవడానికి, కాపాడుకోవడానికి (మాల్‌ ఎ అమానీ) క్షమాభిక్ష ప్రసాదించినట్టు ప్రకటించాడు. నాలుగు రోజులపాటు అతడి సైన్యం మొత్తం సంపదను కలెక్ట్‌ చేసి తరలించింది. నాలుగో రోజున ఢిల్లీలోని ప్రతి ఒక్కరినీ బానిసగా చేయాలని సైన్యాన్ని ఆదేశించాడు. సైన్యం అందరినీ బానిసలుగా మార్చేసింది. ఒకే ఒక్క రోజున లక్ష మంది హిందువులను బానిసలను చేసి ఒక చోటకు చేర్చి ఒకే సారి అత్యంత అమానవీయంగా, పాశవికంగా పిట్టలను చంపినట్టు చంపేశాడు. పిల్లలను, మహిళలను ఇస్లాంలోకి మార్చేశాడు. సయ్యదులు, ఉలేమాలు, ఇతర ముసల్మానులు నివసించే ప్రాంతాలను వదిలిపెట్టి మిగిలిన నగరాన్నంతా సర్వనాశనం చేశాడు. ఢిల్లీ నగర వీధులలో  రక్తం ఏరులై పారింది. ఇదంతా ‘తజ్క్‌ ఏ తైమూరీ (తైమూర్‌ జ్ఞాపకాలు)’ అని తాను రాసుకొన్న అటోబయోగ్రఫీలో పేర్కొన్న అంశాలే. వికీపీడియాల్లో, గూగుల్‌ అన్వేషణల్లో కూడా ఈ వివరాలు దొరుకుతాయి. పెద్ద రహస్యమేం కాదు. సూపర్‌ హిస్టారియన్లలో ఒకరైన ఇర్ఫాన్‌ హబీబ్‌ రాసిన ‘తైమూర్‌ ఇన్‌ ది పొలిటికల్‌ ట్రెడిషన్‌ అండ్‌ హిస్టారియోగ్రఫీ ఆఫ్‌ మొఘల్‌ ఇండియా’ అన్న పుస్తకంలో  14వ శతాబ్దంలో హిందూ అన్న శబ్దం ప్రయోగించబడిందని రాసుకొచ్చారు. ‘పీపుల్‌ ఆఫ్‌ అల్‌ హింద్‌, హింద్‌ బీయింగ్‌ ఇండియా’ అని నిర్వచించారు. అంటే అంతకు ముందువరకు హిందూ శబ్దం మనకు తెలియదని స్పష్టం. భారతవర్షమన్నదే మనకు తెలిసిన మాట. ఆర్యావర్తమన్నదే మనకు తెలిసిన సత్యం. జంబూద్వీపమన్నదే మనకు తెలిసిన మన ఉనికి.

1399 జనవరిలో ఉత్తర గంగ, యమున పరివాహక ప్రాంతంపై విరుచుకుపడ్డాడు. ఇక్కడ కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. మగవాళ్లను చంపడం, పిల్లలను, మహిళలను బానిసలను చేయడం, మతం మార్పించడం.. ఒకటే తంతు. 624 సంవత్సరం నుంచి.. మొఘలుల దాకా అందరూ ఈ ఒక్క సూత్రాన్నే అనుసరిస్తూ ముందుకు పోయారు. 1399లో తైమూర్‌ను ఢిల్లీ వదిలేశాడు. దాదాపు 90 ఏనుగులపై దోచుకొన్న సంపద అంతా పెట్టుకొని తన సొంత రాజధాని సమర్‌ఖండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ బీబీ ఖనిమ్‌ మసీదును ఈ దోచుకొన్న సంపదతో అత్యద్భుతంగా నిర్మించుకొన్నాడు.

ఢిల్లీ సుల్తానుల ప్రభావం దక్షిణాన ప్రధానంగా మరాఠా మీదుగా దక్కన్‌ ప్రాంతానికి విస్తరించింది. గోల్కొండ, బీజాపూర్‌, అహ్మద్‌నగర్‌, బీదర్‌, బేరార్‌ సుల్తానులు దక్షిణ భారతంలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పరుచుకొన్నారు. ద్రవిడ దేశం ముస్లిం పాలనలోకి వెళ్లలేదు.

ఈ చరిత్రనంతా సమగ్రంగా అధ్యయనం చేస్తుంటే.. మనకు ఈ దేశం విభజనకు మూలాలు ఎలా మొదలై.. ఏ విధంగా విస్తరించాయో అర్థమైపోతుంది. ఈ దేశంలోకి చొరబడి.. ఇక్కడి సంపదను దోచుకొని.. ఇక్కడి మనుషులు  మతమార్పిళ్లకు పాల్పడేలా చేసి.. చివరకు ఒక జాతిగా అస్తిత్వాన్ని తమకు తాముగా ఏర్పరుచుకొని.. దేశాన్ని మూడు ముక్కలు చేశారు. విభజన జరిగి ఏడున్నర దశాబ్దాలు అయిన తరువాత.. ఇవాళ్టికీ.. దాని ప్రతికూల పరిణామాలు మన దేశంలో అశాంతిని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ చితి ఆరేదెన్నడు..? ఈ దేశం నిజమైన భారతదేశంగా మనుగడ సాగించేదెన్నడు?

(సశేషం)

Exit mobile version