Site icon Sanchika

దేశ విభజన విషవృక్షం-2

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]ఇ[/dropcap]వాళ మనం చాలా చెప్పుకొంటున్నాం. మన చరిత్ర ఇదీ.. మన చరిత్ర అదీ.. ఫలానా గొప్ప పని చేసిన ఆయన మనవాడు.. ఫలానా ఆవిష్కరణ చేసిన ఆయన మనవాడు అని పుస్తకాల్లో చెప్పుకోవచ్చు. కానీ.. వీళ్ల ఆనవాళ్లన్నీ ఎక్కడున్నాయి? ఏమైపోయాయి. అయా మీరు చెప్తున్న హిమశృంగమంత నాగరికత ఎక్కడున్నది? దాన్ని మేం చూడాలి అంటే ఏమని చూపిస్తాం? ఎక్కడని చూపిస్తాం. దేశ విభజన కారణంగా మనం కోల్పోయింది తెలుసుకొంటేనే చాలా చాలా దుఃఖమేస్తుంది. అక్షరాలా 8,81,918 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఇది కాకుండా అంతకుముందే దూరమైన ఆఫ్ఘనిస్తాన్‌.. భారతీయ సమున్నత నాగరికత మూలాలు నెలకొన్ని ఉన్న ప్రాంతం అంతా నేడు అన్యాక్రాంతమైపోయింది. 1947లో అత్యంత దారుణమైన మారణకాండ అనంతరం… ఈ మూలాలను కూడా సమూలంగా విధ్వంసం చేసే ప్రక్రియ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వచ్చింది. ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా దేశాన్ని విభజించడం పట్ల సగటు భారతీయుడు ఎందుకు బాధపడాల్సి వస్తున్నదో తప్పకుండా ఒక అవగాహన తెచ్చుకోవాలి. 1947లో జరిగిన మహా మానవ హననమే కాదు.. భారతీయ సాంస్కృతిక హననం జరిగింది. విభజన మూలాల్లోకి వెళ్లడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.

ఋగ్వేదంలో చెప్పిన భౌగోళిక వివరాలను కానీ.. నదీసూక్తాన్ని కానీ పరిశీలిస్తే.. మన దేశానికి సంబంధించిన భౌగోళిక స్వరూపం ఎంత విస్తారమైందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నదీసూక్తాన్నే ఉదాహరణగా తీసుకొంటే అందులోమనకు కనిపించే ఇరవై అయిదు నదుల్లో ఒకటిరెండు మినహాయిస్తే అధికభాగం సింధు లోయలో ఉన్నవే. ఇవాళ మహమ్మదీయులకు దానంగా ఇచ్చిన భూభాగం సప్తసింధువుగా పిలువబడిందంటే కారణం ముందు చెప్పుకొన్న ఏడు నదులు, సింధు, కాబూలు, సరస్వతి నదులు.. వాటి పరిసరాల్లో విలసిల్లిన నాగరికత అంతా పాకిస్తాన్‌లోనే ఉన్నది. ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన సులేమాన్‌ పర్వత శ్రేణివరకు విస్తరించిన సింధులోయ వైభవం మనకు ఋగ్వేదం నుంచే కనిపిస్తున్నది. క్రీస్తు పూర్వపు 7వ శతాబ్దానికి ముందే పాణిని మహర్షి తన వ్యాకరణంలో కొన్ని నగరాలను, నదులను ప్రస్తావించాడు. అవన్నీ పంజాబు, ఆఫ్గనిస్తాన్‌ ప్రాంతాలకు చెందినవే. బృహత్సంహితాకారుడు వరాహమిహిరుడు భారత భూభాగాన్ని తొమ్మిది మండలాలుగా పేర్ళొన్నాడు. ఏడో  మండలంలో హారహౌర స్త్రీ రాజ్యాలు ఉన్నాయని,  హైహయులు, మ్లేచ్చులు, శకవైశ్యాదులు జాతులుగా ఉన్నారని చెప్పాడు. ఎనిమిదో మండలంలో హూణులు, కైకేయులు, ఉదీచ్యులు మొదలైన జాతులు ఉంటే.. పుష్మలాంతము, తక్షశిల వంటి మహా నగరాలు, గాంధార, ఉత్తర కురుభూములు, ధనువ్మత్‌, హిమవత్‌ కైలాస పర్వతాలు ఉన్నట్టు పేర్మొన్నాడు. తొమ్మిదో మండలంలో కాశ్మీర్  కూడిన భూభాగాన్ని వివరించాడు. ఇవేవీ మనకు కాకుండా పోయాయి. ఇవాళ మనం దానమిచ్చిన భూభాగంలో చరిత్రకారులు చెప్తన్న లెక్కల ప్రకారమే దాదాపు 1300 దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. వీటిలో ఇప్పుడు ఉనికిలో ఉన్న దేవాలయాలు ఎన్నో తెలుసా… సుమారుగా 26. దేశ విభజన కారణంగా ఏం నష్టపోయామో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి?

ఒక విచిత్రమైన పరిస్థితి ఇవాళ మనకు నెలకొన్నది. ఎందుకంటే… చాణక్యుడు ఎక్కడ చదువుకొన్నాడు? పాకిస్తాన్‌లో. చాణక్యుడేమిటి.. మనం ఎంతో గొప్ప మేధావులమని భావించే మహానుభావుల్లో చాలామంది పాకిస్తాన్‌లో చదువుకొన్నారు. ఈ మాట మనసులో అనుకొంటేనే ఎలాగో ఉన్నది కదా… ఇప్పుడు ఇదే నిజం. ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ అయిన తక్షశిలలోనే చాణక్యుడు చదువుకొన్నాడు. అదే విశ్వవిద్యాలయానికి ఆచార్యుడు అయ్యాడు. పాకిస్తాన్‌.. పంజాబ్‌ ప్రావిన్స్‌ లోని రావల్పిండి జిల్లాలో ప్రస్తుతం ఈ తక్షశిల ఉన్నది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు 32 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నది. ఇది మహాభారత కాలంలో గాంధార సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తక్షశిల మహానగరం… మొదట్నుంచీ కూడా విద్యాస్థానంగా విలసిల్లింది. అంతకుముందు రామాయణ కాలంలో భరతుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ప్రఖ్యాత చరిత్రకారుడు కోశాంబి ప్రకారం ఇది నాగుల రాజ్యం. నాగుల రాజైన తక్షకుడి పేరుతో ఏర్పడిన రాజ్యమిది. ఇక మనకు తెలిసిన చరిత్రలో బౌద్ధుల ముఖ్య స్థావరంగా మారింది. అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఐన తక్షశిల విశ్వమే నివ్వెరపోయేలా గొప్ప గొప్ప స్కాలర్లను అందించింది. విశ్వ విద్యాలయం అన్న పేరు మొట్ట మొదట తక్షశిలకే ఉన్నది. విశ్వ విద్యాలయం అంటే యూనివర్సలైజేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌. విద్య ఒక ప్రాంతానికో.. దేశానికో కాకుండా సమస్త విశ్వానికి అందించాల్సిందని నమ్మిన సంస్కృతి మనది. అందుకు గురుకులాలు, విశ్వ విద్యాలయ సంస్కృతి తార్మాణం. దేశ విదేశాల నుంచి విద్యార్థులు తక్షశిలలో చదువుకున్నారు.

ఇప్పుడు మనకు పాకిస్తాన్‌లో కనిపిస్తున్న తక్షశిల ఆనవాళ్లు ఐదో శతాబ్దం (బీసీ) నాటివి. పరీక్షిత్తు తనయుడు జనమేజయుడు సర్పయాగం చేసింది ఈ తక్షశిలలోనే. కలి కాలంలో వైశంపాయనుడు మహాభారతాన్ని వ్రవచించింది ఈ తక్షశిలలోనే. జాతక కథల్లో తక్షశిల ప్రస్తావన ఉన్నది. క్రీస్తు శకం 405లో పాహియాన్‌ తక్షశిలను సందర్శించి… అక్కడి భారతీయ సంస్కృతి గురించి విశేషంగా ప్రస్తావించాడు. తక్షశిల అంటే.. ఏడు తలల సర్పం అని పేర్కొన్నాడు. 1875లో జాన్‌ ఆఫ్‌ హిల్టెషిమ్‌.. ఈ నగరాన్ని ఎగ్రిశిల అని పిలిచాడు.

తక్షశిల గురించి మరి కొన్ని అంశాలు చెప్పుకోవాల్సి ఉన్నది. ఒక విద్యార్థి 16వ ఏట విశ్వ విద్యాలయంలో ప్రవేశిస్తాడట. అతనికి వేదాలతో పాటు.. ప్రాచీన భారతీయ సారస్వతాన్ని అక్కడి ఆచార్యులు బోధిస్తారు. దీనితో పాటు 18 రకాల కళలలో అపార నైపుణ్యాన్ని వచ్చేలా శిక్షణ ఇస్తారు. ధనుర్విద్య (ఆర్చరీ), వేట, న్యాయం (లా), మెడిసిన్‌, మిలటరీ సైన్స్‌.. ఇలా అనేక విద్యల్లో ప్రావీణ్యం అందిస్తారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో ప్రతిభావంతులవుతారు. తక్షశిలకు సుదూర ప్రాంతాలైన మగధ, కోసల వంటి ప్రాంతాలనుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు.

మౌర్య చంద్రగుప్తుడి కాలం నుంచి తక్షశిలకు అపూర్వమైన వైభవం లభించింది. చంద్రగుప్తుడి గురువు, భారతీయ తత్వవేత్త, అర్థశాస్త్ర నిపుణుడు కౌటిల్యుడని పేరుతో పిలువబడిన చాణక్యుడు ఇక్కడ ఆచార్యుడిగా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. ఆ తరువాత చంద్రగుప్తుడి మనవడైన అశోకుడు తక్షశిల నుంచి పాటలీవుత్రం వరకు దాదాపు 1600 కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించి వ్యాపారాన్ని ప్రోత్సహించాడని చెప్తారు. మహారాజ రాజాధిరాజ దేవపుత్ర కుషాణుడు ఈ ప్రాంతాన్ని వరిపాలించాడని తక్షశిలలోనే శాసనం లఖించింది.

ముందే చెప్పుకొన్నట్టు అర్థశాస్త్ర కర్త చాణక్యుడు తక్షశిల ఆచార్యుడు. ఆయన అక్కడే చదువుకొని అక్కడే ఆచార్యుడిగా సేవలందించాడు. అంతేకాదు ఆయుర్వేద వైద్యవేత్త చరకుడు తక్షశిలలో చదువుకొని… అక్కడ ఆచార్యుడిగా విద్యార్థులకు బోధనలందించారు. చరక సంహిత.. ఇవాళ్టికీ ప్రపంచానికి దిక్సూచిగా నిలిచే అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రం. భాషా వ్యాకరణ శాస్త్రవేత్త పాణిని సైతం తక్షశిలలో చదువుకొని ఆచార్యత్వం నిర్వహించిన వాడే. ప్రాచీన సంస్కృత భాషకు వ్యాకరణాన్ని (అష్టాధ్యాయి) రచించిన మేధావి పాణిని. మగధ మహారాజు బింబిసారుడి రాజ్యంలో ఫిజిషియన్‌గా వ్యవహరించిన జీవకుడు తక్షశిల విద్యార్థి. మహాయాన బుద్ధిజం నాటి పాళీ గ్రంథాల్లో ఈ జీవకుడి ప్రస్తావన ఉన్నది. ఒకసారి బుద్ధుడికి ఈ జీవకుడే వైద్యం చేశాడట. కోసలరాజు ప్రసేనజిత్తుకు సైతం వైద్యం అందించిన వాడు ఈ జీవకుడు. ఈ పాళి గ్రంథాల్లో మనకు చాలామంది అద్భుతమైన మేధావులు కనిపిస్తారు. పంచతంత్ర కథలు మనకు అందించిన మహానుభావుడు విష్ణుశర్మ కూడా తక్షశిల విశ్వవిద్యాలయంలో చదువుకొన్నవాడే.

ఒక్క తక్షశిలలోనే ఇంత అద్భుత చరిత్ర మనకు కండ్ల ముందు కనిపిస్తున్నది. ఎందరో మేధావులు ఈ విశ్వానికి భారతీయ జ్ఞాన సంపత్తిని అందించింది ఇక్కడి నుంచి. ఇవాళ ఈ చరిత్ర మనది కాకుండా పోయింది. మనకే కాదు… ఎవరికీ కాకుండా పోయింది. ఇందుకు కారణం దేశ విభజనే. రాజకీయ కారణాల వల్ల అనివార్యమైన విభజన ఫలితంగా పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ఏర్చడింది. భారత్‌ ఏ మతానికీ చెందని దేశంగా మిగిలిపోయింది. దీంతో భారత మూలాలు ఉన్న తక్షశిల భారత్‌కు కాకుండా పోయింది. ఇస్లాం మతానికి సంబంధించిన దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌కు ఈ మహత్తరమైన చరిత్రను కాపాడాల్సిన అవసరమే లేకుండా పోయింది. పది పన్నెందేండ్ల క్రితం అనుకొంటా.. తక్షశిలపై ఒక రిపోర్టు వచ్చింది. ప్రపంచంలోని 12 అతి వైభవమైన వారసత్వ సంవదల్లో ఒకటైన తక్షశిల చరిత్ర సంస్కృతి సమూలంగా కనుమరుగైపోయే పరిస్థితి నెలకొన్నదని ఆ రిపోర్టు విస్పష్టంగా చెప్పింది. ఈ విధ్వంసం పునరుద్ధరించడానికి కానీ, పునర్జీవింపజేసేందుకు కానీ వీలు లేని విధంగా జరుగుతున్నదని పేర్కొన్నది. పాకిస్తాన్‌ ప్రభుత్వానికి శద్ధ లేకపోవడం.. పట్టించుకోకపోవడం వల్లనే ఇవాళ ఈ దుస్ధితి. అరబ్బులు, అతివాద ఇస్లామ్‌ వాదులు దాడులు చేసిన ఫలితమిది. అందుకే మన విభజన మూలాలు దాదాపు 13 వందల సంవత్సరాల లోతుల్లో ఉన్నాయనేది. వాటిని తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో అవసరం. ఎందుకంటే పురాణాలుగా మారిపోయిన మన చరిత్రను అచ్చమైన చరిత్రగా తిరిగి ఈ తరానికి అందించాలి. తద్వారా భావి తరాలకు జీవించే విధానం ఏమిటో తెలియజేయాలి.

(సశేషం)

Exit mobile version