దేశ విభజన విషవృక్షం-22

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]ఈ[/dropcap] దేశంలోకి ఇస్లాం రాజులు చొరబడ్డప్పటినుంచి ఔరంగజేబు దాకా.. ఇంకా చెప్పాలంటే.. ఇవాల్టి ఛాందసవాదుల దాకా కూడా ఒకే తరహాలో పరిమిత నియంత్రిత వ్యవస్థలోనే ఉండిపోయారు. మిగతా వాళ్లను కూడా తమ ఆ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఈ దేశంలోకి వచ్చిన వారంతా కూడా ఒకే మూసలోని సైద్ధాంతిక ధారలో కొనసాగుతూ వచ్చారు. మన పట్ల కూడా వారు అదే ధారలో వ్యవహరిస్తూ వచ్చారు. భారత్‌పై అరబ్బులు నౌకాదాడులతో చొరబడటానికి ప్రయత్నించినప్పటికి కూడా.. మహమ్మద్‌ బిన్‌ ఖాసింతోనే మనం భారత్‌లో ఇస్లాం రాజ్య వ్యవస్థలు మొదలైనాయని చర్చించుకొంటుంటాం. ఇస్లాం రాజులు ముఖ్యంగా చెప్పాలంటే.. ఈ దేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన మొఘల్‌ రాజులు.. అలియాస్‌ మంగోలియన్లు.. ఇక్కడికి వచ్చిన తరువాత మన దేశంలోని సభ్యత, సంస్కారం, వేల సంవత్సరాల సంస్కృతికి ముగ్ధులై.. మనతో కలిసిపోయారని మన సూపర్‌ హిస్టారియన్లు చరిత్ర పాఠాలు చెప్పుకొంటూ వచ్చారు. మనం కూడా అవే పాఠాలను మెదళ్లలోకి ఎక్కించుకొని.. ఆహా అనుకొంటూ వస్తున్నాం. ఈ చరిత్ర ఎక్కడిదాకా వెళ్లిందంటే.. ఇస్లాం రాజులు ఇక్కడికి వచ్చి మనలో కలిసిపోయి.. మనలాగా మారిపోయారనేంతగా చరిత్రను రచించేశారు. మనం వాళ్లను విదేశాల నుంచి వచ్చిన వారిగా కాకుండా పూర్తిగా లోకల్‌ శాసకులుగా భావించేలా చేశారు. ఇదే విషయాన్ని మరికొంత విశ్లేషించి చూసినప్పుడు ఇంకొంత స్పష్టత వస్తుంది. మనం ఏదైతే స్వతంత్ర సంగ్రామం చేశామో.. ఆ సంగ్రామం అంతా 1400 ఏండ్లపాటు ఈ దేశాన్ని విధ్వంసం చేసిన ముస్లిం పాలకులపై కాకుండా కేవలం ఆంగ్లేయుల మీదనే చేశామన్నదానికే మన చరిత్ర పరిమితమైందన్నది స్పష్టం. ఆంగ్లేయుల మీద పోరాటం గురించి చర్చించినప్పుడు.. ఆంగ్లేయులతో మనల్ని మనం పోల్చుకొన్నప్పుడు మన చర్మం రంగు.. జాతుల మధ్య అంతరాన్ని స్పష్టంగా తెలియజేసింది. తెల్లవాళ్లు.. అని మనం చాలా క్లియర్‌గానే వారిని సంబోధించాం. మన చర్మ రంగు.. వారి చర్మరంగు నలుపు తెలుపుల తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. వాళ్లు మనవారు కారు.. విదేశీయులు.. వారు మనల్ని దోచుకోవడానికి వచ్చినవారేనని తేలిపోతుంది. కానీ, ఇస్లాం రాజుల విషయంలో అది మనకు గోచరించదు. ఇద్దరి చర్మ రంగులు ఒకే విధంగా ఉంటాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మొఘల్‌ రాజులు కూడా విదేశీయులే. వారి చర్మం రంగు కూడా తెలుపు వర్ణంలోనే ఉండేది. ఈ రంగు, రుచి, వాసనల గురించి ఇప్పుడెందుకు ప్రస్తావన అన్న మాట రావచ్చు. మనం చరిత్రలోకి ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే.. విదేశీ మతము, జాతుల వివక్ష మన మీద తీవ్రంగా ప్రభావం చూపించింది.

ఇక్కడ మనం ఒక విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పుకోవాలి. మతం, జాతి వివక్షల గురించి చర్చించుకొన్నప్పుడు.. ఈ దేశంలో వందలు, వేల జాతులు, మతాలు, దేవుళ్లు, గురువులు, సంప్రదాయాలు, ఆచారాలు లేవా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అంతే కాదు.. ఇదే రంగు గురించిన చర్చ కూడా మొదలవుతుంది. దక్షిణాది, ఉత్తరాది వారి రూపురేఖల మధ్య అంతరాలను ప్రశ్నిస్తారు. తూర్పు పడమర భారత్‌ల మధ్య మనుషుల ఎత్తుమీద ప్రశ్న పుట్టుకొస్తుంది. కశ్మీర్‌లో ప్రజలు తెల్లగా ఉంటారు. తమిళనాడులో ప్రజలు నలుపుగా ఉంటారు. తూర్పున అస్సాంలో ప్రజలు పొట్టిగా ఉంటే.. పడమటన పంజాబ్‌లో ప్రజలు వారికంటే పొడువుగా ఉంటారు. వీళ్లను చూస్తే వేర్వేరు మహాద్వీపకల్పాలకు చెందినవారుగా కనిపిస్తారు. ఒకే దేశానికి చెందిన వారుగా ఉండరు. ఈ వైవిధ్యం మరే దేశంలోనూ కనిపించదు. కానీ.. కశ్మీర్‌లో అమర్‌నాథుడు తమిళుడికి దేవుడు. తమిళనాడులో మదురై మీనాక్షి అమ్మవారు కశ్మీరీకి దేవత. వైష్ణోదేవి నుంచి కన్యాకుమారి అమ్మవారి దాకా ప్రతి భారతీయుడి సంస్కృతిలో భాగమే. ఉత్తరాన పరమహంస యోగానంద.. దక్షిణాన రమణ మహర్షి ఒకే తత్వ చింతన కలిగినవారు. ఆదిశంకరులు, రామానుజులు దక్షిణం నుంచి ఉత్తరం వరకు ప్రస్థానం చేసినవారే. అంతర్లీనంగా ఈ దేశాన్ని ఒకే తత్వ చింతన, సంస్కృతి, సంప్రదాయం, జనజీవన విధానం ముడివేస్తూ వచ్చింది. శివుడిని నమ్మేవారికి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మొదటిది పశ్చిమాన సోమనాథ్‌లో ఉంటే.. రెండోది దక్షిణాన శ్రీశైలంలో ఉంటుంది. మూడు నాలుగు మధ్య భారతంలో ఉజ్జయిని, ఖాండ్వాలో ఉంటే.. ఐదోది పశ్చిమాన జార్ఖండ్‌లో ఉన్నది. అమ్మవారిని నమ్మిన వారికి అష్టాదశ శక్తిపీఠాలు ప్రధానంగా ఉన్నాయి. మొదటిది లంకాయాం శాంకరీ దేవి అని శ్రీలంకలో మొదలు పెడితే, కశ్మీర్‌, అస్సాం, గుజరాత్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌.. ఇలా దేశమంతటా విస్తరించి మనకు కనిపిస్తాయి. విష్ణువును పూజించేవారికి 108 దివ్యదేశాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సూది దారం పెట్టి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా కుట్టినట్టు కనిపిస్తుంది. యావత్‌ దేశం ఒక్కటేనని చెప్పడానికి ఇంతకంటే గొప్ప వివరణ అక్కరలేనే లేదు. ఇది భారత వర్షం. మనది భారతజాతి. మనం భారతీయులం.   ఇక్కడ శరీర రంగు, ఆకారం, ఎత్తులో ఆహార అలవాట్లలో తేడాలు ఎన్నెన్నో ఉండవచ్చు. కానీ, వీటిలో ఏవీ కూడా ఈ దేశం వేర్వేరు జాతుల సమాహారం అని చెప్పలేదు. ఇన్ని విభిన్నతలను కూడా ఏకత్వమే ముడివేసింది. ఇవాళ మనం ఏదైతే కాస్మాలజీ అంటామో.. ప్రపంచ దృక్పథం అంటామో.. దర్శనం అంటామో.. అది కేవలం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. నువ్వు జీవించు.. ఇతరులను జీవించనివ్వు.. కానీ లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌.. ఏ మార్గం ఎంచుకొంటావో అది నీ ఇష్టం. ఏ మార్గంలో వెళ్తావో నీ ఇష్టం. నువ్వు ఏదైనా చెప్పదలచుకొంటే చెప్పు.. నేను ఏదైనా చెప్పాలనుకొంటే చెప్తాను. నీకు ఇష్టమైతే స్వీకరించు. నాకు ఇష్టమైతే నేను అనుసరిస్తాను. లేకపోయినా పర్వాలేదు. నువ్వు నీ విచారధారను అనుసరించి జీవించు. నేను నా విచార ధారను అనుసరించి జీవిస్తాను. ఇది ఈ దేశంలో ఉన్న ఓపెన్‌‌నెస్‌. ఒక స్వేచ్ఛాయుత వాతావరణం. స్వేచ్ఛాయుత జీవన విధానం. అందుకే.. ఈ దేశంలోకి ఎవడు పడితే వాడు రాగలిగాడు. ఏది పడితే దాన్ని తీసుకొనిరాగలిగాడు. ఎలా పడితే అలా రెచ్చిపోయాడు. ఇవాళ్టికీ ఎలా పడితే అలా మాట్లాడగలుగుతున్నాడు.

మన పూర్వికులు స్వతంత్ర సంగ్రామం చేసింది కేవలం ఆంగ్లేయుల మీదనే చేశామని చెప్పుకొంటున్నాం. కానీ అంతకుముందు దాదాపు వెయ్యేండ్లకు పైగా మనం ఈ విదేశీయుల నుంచి స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నాం. మన దేశంపైకి చాలామంది దండెత్తి వచ్చారు. వారిలో చాలామంది ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జనజీవన విధానంతో మమేకమైపోయారు. వారిని ఇవాళ ఈ దేశంతో వేరుచేసి చూడటం సాధ్యం కాదు. కానీ ముస్లింలు దండయాత్రలు మొదలుపెట్టిన తరువాత దేశ ముఖచిత్రమే పూర్తిగా మారిపోవటం మొదలైంది. మహమ్మద్‌ బిన్‌ ఖాసిం నుంచి ఔరంగజేబు దాకా కూడా వాళ్లు వచ్చింది ఇక్కడ కేవలం రాజ్యస్థాపన చేయడానికి మాత్రం కాదు. వారు ఇక్కడి వైభవాన్ని, సంపదను, సమృద్ధిని చూసి దాడి చేసి దోచుకోవడానికి మాత్రమే వచ్చారు. వీరికి మరో లక్ష్యమే లేదు. వీరు మనదేశానికి వచ్చేసరికి వారికి ఒక మతం అంటూ ఉన్నది. ఆ మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని ప్రవచించిన ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త కానీ, ఆ గ్రంథం కానీ.. వసుధైక కుటుంబకం అన్న సూత్రాన్ని అంగీకరించదు. ప్రతి దాన్నీ తమతో పోల్చుకొని వేర్వేరుగా చూడటాన్నే బోధిస్తుంది. తమ దేవుడు మాత్రమే నిజం అని చెప్తుంది. ఇతర మతాల దేవుళ్లు అబద్ధమని వక్కాణిస్తుంది. ఆ గ్రంథంలో చెప్పిన అంశాన్ని తుచ తప్పకుండా కచ్చితంగా పాటించాల్సిందేనని శాసిస్తుంది. తమ దేవుడిని నమ్మని వాళ్లందరినీ కాఫిర్లు అని సంబోధిస్తుంది. ఈ గ్రంథంలో చెప్పింది మాత్రమే నిజం. మీ పుస్తకాలు, మీ ఆచార్యుల మాటలు, మీ సిద్ధాంతాలు, మీ దేవుడు అన్నీ కూడా తప్పేనంటుంది. నువ్వు నన్ను అనుసరించాల్సిందే. కచ్చితంగా నన్ను పాటించాల్సిందే. లేకపోతే.. ఈ గ్రంథాన్ని పాటించేవారు, అనుసరించేవాళ్లు నిన్ను చంపేస్తారు. నా దేవుడిని, నా గ్రంథాన్ని నమ్మకపోతే నిన్ను చంపడం నా యొక్క పరమ ధర్మం అని ఆ గ్రంథాన్ని అనుసరించేవాళ్లు నమ్ముతారు. నువ్వు మారకపోతే.. మేము మారుస్తాం. లేకపోతే.. నువ్వు మాకోసం జిజియా పన్ను చెల్లించాలి. లేకపోతే.. నిన్ను నీ దేశం నుంచే తరిమి తరిమి కొడతాం. ఇస్లామీయుల గ్రంథమైనా, ఈసాయీల గ్రంథమైనా దాదాపుగా ఇవే మాటలు చెప్తాయి. కానీ చరిత్రకారులు ఇదంతా తిప్పి తిప్పి రాసుకొంటూ వచ్చారు. ఎవరినైనా మనం ఎప్పుడు సొంతం చేసుకొంటాం? ఒకరినొకరు సమానంగా భావించినప్పుడు, ఒకరి ధర్మాన్ని మరొకరు పరస్పరం గౌరవించుకొన్నప్పుడు. ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించినప్పుడు, ఒకరి ఆలోచనలను మరొకరు స్వీకరించినప్పుడు.. నీకు ఎలా జీవించే అధికారం ఉన్నదో.. నాకూ అలాగే జీవించే అధికారం ఉన్నదని తెలుసుకొన్నప్పుడు సమాజంలో విభిన్నతలు ఉన్నా ఏకత్వం కొనసాగుతుంది. కానీ ఈ దేశంలో ఇస్లాం.. ఈ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇస్లాం అనుయాయులు తమను తాము ప్రపంచంలో భాగంగా భావించలేదు. తామే ప్రపంచంగా కుంచించుకొనిపోయారు. మిగతా ప్రపంచాన్ని ఆ కుంచించుకొనిపోయిన దానిలోకి లాగాలని చూశారు.

మరో చిన్న ఉదాహరణ చెప్తాను.. మనకు రాజుల చరిత్రను గనుక చూస్తే.. ప్రధానంగా సూర్యవంశం, చంద్రవంశం అని రెండు పరంపరలు కనిపిస్తాయి. సూర్యచంద్రులు ఇద్దరూ కూడా మనకు ఆకాశంలో కనిపించే అస్తిత్వాలు. ఈ రెండూ లేకపోతే.. భూమిమీద జీవజాలపు ఉనికి లేనేలేదు. సూర్యుడు మనకు శక్తినిస్తాడు. సూర్య వంశానికి చెందిన రాజు అంటే.. సూర్యుడి మాదిరిగా తన ప్రజలకు కావలసినంత శక్తిని సమకూర్చడం. తద్వారా తాను, తన ప్రజలు, తన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇదీ ఈ దేశంలో సమాజంలో ఉండే భావన. ముస్లిం రాజుల వ్యవహారం అలా కాదు. వాళ్లు రాజ్యాన్ని కబ్జా పెడతారు. ఆక్రమిస్తారు. అది చిన్నరాజ్యమైనా సరే.. పెద్ద రాజ్యమైనా సరే.. సింహాసనంపైన కూర్చోగానే లూఠీ మొదలుపెడతారు. మత మార్పిళ్లకు పాల్పడతారు. మగవాళ్లను బానిసలను చేస్తారు. ఆడవాళ్లను వేశ్యలను చేస్తారు. వీటి గురించి ఇవాళ నీతులు చెప్పే ఎవ్వడూ మాట్లాడడు.

మొఘలుల విషయానికి వస్తే.. బాబర్‌ తరువాతి వారంతా ఇక్కడే పుట్టినప్పటికీ.. వాళ్లంతా తమను తాము తైమూర్‌లంగ్‌ వారసులమని.. తాము అక్కడి నుంచి వచ్చామనే చెప్పుకొన్నారు. ఇక ఇక్కడి సమాజంతో మమేకమయ్యే ప్రశ్న ఎక్కడిది? బాబర్‌కు, తైమూర్‌లంగ్‌కు మధ్యన నలుగురు ఉన్నారు. గత వ్యాసాల్లో చెప్పుకొన్నట్టే.. తైమూర్‌లంగ్‌ 1398లో ఈ దేశంపై దండెత్తి వచ్చినప్పుడు కేవలం హిందువులు అన్న కారణంగా లక్షల మందిని ఊచకోత కోశాడు. అందినకాడికి అందినంత దోచుకొని వెళ్లిపోయాడు. ఆ తరువాత నలుగురు కూడా దోపిడీకి ప్రయత్నించినప్పటికీ వాళ్లు పెద్దగా సక్సెస్‌ కాలేదు. బాబర్‌ నుంచి మొఘలుల రాజ్యం మొదలైంది. అందరూ కూడా తాము తైమూర్‌లంగ్‌ వంశజులమని గర్వంగా చెప్పుకొనేవారు. ఇది మనకు తొలి సంకేతం. మన చరిత్రకారులు ఇంతకాలం చెప్పినట్టు వాళ్లు మనలాగా మారడానికి.. మనలో కలిసిపోవడానికి ఏనాడూ సిద్ధపడలేదు. ఇష్టపడలేదు. తాము ఈ దేశాన్ని ఏలడానికి వచ్చినవాళ్లలాగానే బిహేవ్‌ చేశారు. కేవలం హిందువులు అన్న కారణంగా లక్షల మందిని హతమార్చారు. వాళ్లలో ఎలాంటి పరివర్తన రాలేదు.

బాబర్‌ తన ఆత్మకథలో స్వయంగా రాసుకొన్నాడు. హిందువులను ఎలా ఊచకోత కోసిందీ.. తమ దేవుడి కోసం ఎలా తర్పణం చేసిందీ సగర్వంగా రాసుకొంటూ వచ్చాడు. ఫిరిస్తా, బాబర్‌నామా, జహంగీర్‌నామా,అక్బర్‌నామా.. ఇలా ఏది చదివినా చాలు.. వాళ్లు ఏం చేసిందీ.. ఎలా చేసిందీ కతలు కతలుగా వాళ్లే చెప్పుకొన్నారు. మనం కాఫిర్లను చంపడానికి ఇక్కడికి వచ్చాం. మన దేవుడిని నమ్మని వాళ్లను ఎలిమినేట్‌ చేయడం కోసమే మనం ఉన్నాం. ఇది పవిత్రయుద్ధం. అని విస్పష్టంగా చెప్పుకొంటూ వచ్చారు. అది ప్రతి ముస్లిం రాజులోనూ పాతుకొని పోయింది.  ఈ దేశంలో మమేకమే కానప్పుడు.. ఇక్కడి ప్రజలతో, ఇక్కడి సామాజిక జనజీవనంతో సంబంధాన్ని తిరస్కరించినప్పుడు ఈ దేశం అఖండంగా ఉండటం ఎలా సాధ్యపడుతుంది? ఈ దేశంతో వాళ్లకు పొసగలేదు కాబట్టే.. రెండు ముక్కలు చేయించుకోగలిగారు. ఇంకా ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది విషవృక్షం. విభజన విషవృక్షం. దీన్ని కూకటివేళ్లతో పెకలించి వేయనంత వరకూ ఈ ట్యూమర్‌ ఈ దేశాన్ని విషపూరితం చేస్తూనే ఉంటుంది. దీన్ని బాగుచేయడానికి ఎలాంటి మందూమాకూ ఉండదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here